‘నరేంద్రుడు సృష్టించిన చరిత్రను భూపేంద్రుడు (ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌) ‌బద్దలు చేస్తారు!’

గుజరాత్‌ ‌శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలివి. గుజరాత్‌ ‌ప్రజల నాడి, తాను పుట్టిన గడ్డ ఆత్మ నరేంద్ర మోదీకి ఎంత కరతలామలకమో చెప్పడానికి ఇది చాలు. భూపేంద్ర పటేల్‌ ‌డిసెంబర్‌ 12 ‌మధ్యాహ్నం గుజరాత్‌ 18‌వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతటి లోతైన వ్యాఖ్య చేసి, గుజరాతీల మనసును మరొకసారి దోచుకున్న నరేంద్ర మోదీ సమక్షంలోనే, కేంద్ర హోంమంత్రి మరొక గుజరాతీ బిడ్డ అమిత్‌ ‌షా సమక్షంలో పటేల్‌ ‌చేత గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ‌ప్రమాణం చేయించారు. ఇది అపురూప ఘట్టం. చరిత్రాత్మక సందర్భం.

 బీజేపీ నాయకత్వంలో ఎదిగిన మోదీకి చరిత్ర సృష్టించడం కొత్తకాదు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకపోయినా ఆయన గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. గుజరాత్‌ ‌నమూనా అనే ఒక సరికొత్త అభివృద్ధి మంత్రాన్ని జాతికి అందించారు. ఏనాడూ లోక్‌సభ గుమ్మం తొక్కకున్నా ప్రధాని అయ్యారు. ఇప్పుడు రెండోదఫా ఆ పదవిలో ఉన్నారు. ఈ దేశంలో ఏ ప్రధానికి ఎదురుకానంత ప్రతికూలత ఉన్నా, ఆయన దేశప్రజల ఆదర్శ నాయకుడయ్యారు. భరతమాత ముద్దుబిడ్డగా మన్ననలు అందుకుంటున్నారు. ఇక గుజరాత్‌లో ఏడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిదంటే దాని వెనుక మోదీ అకుంఠిత దీక్ష ఉంది. తిరుగులేని అభివృద్ధి ఉంది. రాష్ట్ర బీజేపీ చరిత్రలోనే కాదు, అసలు గుజరాత్‌ ఎన్నికల చరిత్రలోనే ఒకే పార్టీ ఏడుసార్లు వరసగా అధికారం చేపట్టడం, 156 స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ చరిత్రను రేపు ఎవరైనా తిరిగి రాయగలరని అనుకోలేం. ఇది జోస్యం కాదు. మోదీకి ఉన్న ఖ్యాతి. ఆయన చేసిన అభివృద్ధి.

జాతి ‘నమో’ మంత్రం జపిస్తున్నా ఆయన మీద బురద చల్లే ప్రయత్నం ఆపని కాంగ్రెస్‌ ‌రాజకీయంగా దాదాపు మరణించింది. గెలుపు మాదే, రాసి ఇస్తున్నాను అంటూ ఆప్‌ అధినేత రాసిన కాగితం ఇప్పుడు ఆయనకు పెద్ద వెక్కిరింత. నిజానికి అది ఆయన దురహంకారానికి తిరుగులేని రుజువు. కాంగ్రెస్‌ అసలు ఎన్నికల మీద దృష్టి పెట్టలేదు. భారత్‌ ‌జోడో యాత్రలో ఉన్న అధినేత కరుణా కటాక్షవీక్షణాల కోసం, సేవలు చేసే హడావిడిలో ఉండిపోయింది. దృష్టి పెడితే బీజేపీ శంకరగిరి మాన్యులు పట్టి పోయేదని అర్ధం కాదు. ఒక రాష్ట్ర ఎన్నికల కంటే, అధినేత సేవలే ముఖ్యమని వారు మనసా వాచా నమ్మడమే ఇక్కడ విషయం. కాంగ్రెస్‌కు 17 స్థానాలు, అసలు ప్రభుత్వమే తమదని ఢంకా బజాయించిన ఆప్‌కి 5 దక్కాయి.

27 సంవత్సరాలుగా గుజరాత్‌లో అప్రతిహతంగా విజయ పతాకం ఎగుర వేస్తున్న కమలదళం ఏడోసారీ ప్రభంజనం సృష్టించడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం. సమకాలీన రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఒకసారి అధికారం సాధించడం గొప్ప కాకపోవచ్చు. కానీ దానిని రెండోసారి నిలబెట్టుకోవడమే అన్నింటికన్నా గొప్ప. ఇలా నిలుపుకోవడం అన్ని పార్టీలకు, అందరు నాయకులకు సాధ్యపడదు. అయిదేళ్లకోసారి ఓటర్లు పాలకులను మారుస్తున్న రోజుల్లో ఏళ్లతరబడి ఒకే పార్టీని గెలిపించడం సాధారణ విషయం కాదు. ఒకపార్టీపై దశాబ్దాల పాటు విశ్వాసం కనబరచడం ఆషామాషీ విషయం కాదు. పరాజితులు ఓటమికి సాకులు వెతుక్కోకుండా అధికార పార్టీని ప్రజలు ఎందుకు అందలం ఎక్కిస్తున్నారో ఆలోచించు కోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా తాజాగా గుజరాత్‌లో కమలం విజయాన్ని తక్కువ చేసి చూస్తే నష్టపోయేది విపక్షాలేనని చెప్పకతప్పదు. తాజా వార్తల ప్రకారం గుజరాత్‌లో నెగ్గిన నలుగురు ఇండిపెండెంట్లలో ముగ్గురు బీజేపీకి మద్దతుగా నిలవడానికి ముందుకు వచ్చారు. ఐదుగురు ఆప్‌ ఎమ్మెల్యేలలో ఎవరు ఆ పార్టీలో మిగులుతారో తెలియడం లేదు. ఎవరూ మిగలకపోయినా ఆశ్చర్యం లేదు. ఆ ఎన్నికల ఫలితాల మీద విశ్లేషణ సమయంలో కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌విలువైన మాటే చెప్పారు. ఆప్‌కి పునాదులు ఏవి? అని ప్రశ్నించారాయన. కాంగ్రెస్‌ ‌పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు. ఒక కఠిన పరిశ్రమతో నిర్మాణమయ్యాయి. బీజేపీ కూడా అంతే. అటల్‌ ‌బిహారీ వాజపేయి, అడ్వాణి వంటివారితో సహా ఎందరో నేతలు, కార్యకర్తలు కఠోర శ్రమ చేసి పార్టీని నిర్మించారు. ఇలాంటి నిర్మాణం ఆప్‌కి ఏది అని అడిగారాయన. రాజకీయ పార్టీ, అది అధికారంలోకి రావడం అంటే తాయిలాల ఆట కాదని ఘాటుగానే స్పందించారు. అటు తాయిలాలు ఇచ్చి తమ మీద వేస్తున్న పన్నుల మోత గురించి ప్రజలు గమనించకపోలేదు. అసలు కేజ్రీవాల్‌ ‌హామీలు నెరవేర్చాలంటే ఖజానా గుల్ల అవుతుందని నిపుణులు ఆనాడే చెప్పారు. ఇప్పుడు అలాంటి ప్రమాదం హిమాచల్‌ ‌ముంగిట కాచుకుని ఉంది. అక్కడ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టు కోవాలంటే ఖజానా ఖాళీ కాదు, గుల్ల అయి పోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గాంధీ పుట్టిన గడ్డ గుజరాత్‌ ‌రాజకీయాలను కాంగ్రెస్‌కు ముందు తరవాత అనే కోణంలో విశ్లేషించాలి. 1995 నుంచి రాష్ట్ర రాజకీయాలను భారతీయ జనతా పార్టీ శాసిస్తున్నది. కచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలను నరేంద్ర మోదీ నిర్దేశిస్తున్నారని చెప్పడం కొంత అతిశయోక్తిగా అనిపించినప్పటికీ అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. తొలిరోజుల్లో కేశుభాయ్‌ ‌పటేల్‌, ‌శంకర్‌ ‌సింఘ్‌ ‌వాఘేలా వంటి నాయకులు కమలం పార్టీకి సారథ్యం వహించినప్పటికీ 2001 నుంచి రాష్ట్ర రాజకీయాలు నరేంద్ర మోదీ చుట్టూనే తిరుగు తున్నాయి. 2002, 2007, 2012 ఎన్నికల్లో ముఖ్య మంత్రిగా మోదీ ఒంటిచేత్తో పార్టీని విజయతీరాలకు చేర్చారు. 2014లో మోదీ ప్రధాని అయినప్పటికీ గుజరాత్‌ ‌రాజకీయాలు ఆయన కనుసన్నల్లోనే ముందుకు సాగాయి. 2017 ఎన్నికల్లో మోదీ సారథ్యంలో మళ్లీ అధికారాన్ని అందుకుంది. తాజా ఎన్నికలు కమలానికి బ్రహ్మరథం పట్టాయి. మొత్తం 182 సీట్లకుగాను 156 సీట్లతో తిరుగులేని విజయాన్ని పార్టీ నమోదు చేసింది. తద్వారా 1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌సాధించిన 149 సీట్ల రికార్డును సంపూర్ణంగా తిరగరాసింది.

 ఈ విజయాన్ని మోదీ విజయంగానే పరిగణిస్తు న్నప్పటికీ, దానిని నిరాకరించవలసిన అవసరం కనిపించదు. పార్టీ సిద్ధాంతం, మోదీ నాయకత్వ పటిమ ఇక్కడ చూడవచ్చు. మోదీ కూడా ఈ విజయాన్ని కార్యకర్తల విజయంగా, బీజేపీ అనుసరిస్తున్న ఆశయాల కారణంగానే సాధ్యమైందని ఢిల్లీలో జరిగిన విజయోత్సవ సభలో చెప్పారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య ఆయన చెప్పిన మాటలు ఇవి, ‘భారత్‌ ఎప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నా దేశ ప్రజలు బీజేపీ వైపు మొగ్గారు. ఈ విజయంతో దేశం పురోగమించాలన్న తృష్ణ సామాన్యుడిలో ఎంత గాఢంగా ఉన్నదో ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఈ ప్రజామద్దతుతో నవ భారత నిర్మాణం పట్ల దేశ ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. ఇక్కడి యువతరం ఆలోచన నవనవోన్మేషం. పేదలకు సాధికారత దక్కుతుందనే ఆశ, ఎలాంటి సౌకర్యాలకు నోచుకోని గిరిజనులు తమ స్థితిగతులు మారతాయని ఆశించడం ఈ విజయంలో ప్రతిబింబిస్తాయి. ఈ విజయం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకత్వంలో కార్యకర్తంతా పడిన కఠోర శ్రమకు ఫలితం’ అన్నారాయన.

ఇది పూర్తిగా సానుకూల ఫలితం. ఈ మాట ఒప్పుకోవడానికి ఇక్కడి ఉదారవాదులు, మేధావులకు అహం అడ్డురావచ్చు. ఇప్పుడు వారితో పని లేదు. ఇంతకు పూర్వంలాగా బీజేపీ గెలుపు మీద బురద చల్లడానికి ఇప్పుడు వారికి కారణాలేమీ లేవు. అయోధ్య లేదు. సీఏఏ లేదు. మత కల్లోలాలు లేవు. కానీ అంతర్జాతీయంగా పెరిగిన భారత ప్రతిష్ట ఉంది. హిందూత్వ గురించి ఇంతకాలం చేసినది వ్యర్థ ప్రచారమే. అసలు హిందూత్వ ఆ పార్టీ ఆత్మ. ఇక్కడ హిందూత్వ అంటే సంకుచిత దృష్టితో చూసేది కాదు. హిందూత్వ అంటే భారతీయతే. సాంస్కృతికంగా ఈ భావనకు ఉన్న అనుకూలతే బీజేపీ అనుకూలత. బీజేపీని, మోదీని ఈ దేశానికి రక్షణ కవచాలుగా ఇప్పుడు భారతీయులు విశ్వసిస్తున్నారు. ఇది నిజం.

 దశాబ్దాలుగా పార్టీ ప్రజా విశ్వాసాన్ని చూరగొన డానికి చాలా కారణాలే ఉన్నాయి. సత్పరిపాలన అందివ్వడం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడటం, అవినీతిని రూపుమాపడం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ముందుండటం, దార్శనిక నాయకత్వం ప్రధాన కారణాలు. తాత్కాలిక ప్రయోజనాలకు పట్టం కట్టే తాయిలాలకు బదులు ప్రజల మెరుగైన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పాలన సాగించడం మరొక కారణం. గతంలో బెంగాల్లో కూడా సీపీఎం మూడు దశబ్దాలకు పైగా పాలన సాగించింది. అప్పుడు తొలుత జ్యోతిబసు, తరవాత బుద్ధదేవ్‌ ‌భట్టాచార్య పార్టీకి సారథ్యం వహించారు. కానీ సీపీఎం నాయకత్వంలో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఎవరైనా చెప్పగలరా? గుజరాత్‌లో మాదిరిగా రక్తపాతం లేకుండా జరిగాయని అనగలరా? కానీ గుజరాత్‌ ‌పరిస్థితి వేరు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా పాలన సాగించడమే కమలం విజయ రహస్యం. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలోకి తీసుకువెళ్లడం కూడా కనిపిస్తుంది. ఎన్నికల బరిలోకి దిగిన ఆప్‌ ఎన్ని ఉచిత తాయిలాలు ప్రకటించినా ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక ప్రగతే ముఖ్యమని ప్రజలు భావించడమే ఇందుకు కారణం. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌ ‌ప్రయోగించిన పాచికలు ఇక్కడ పారలేదు. ఓపీఎస్‌ (ఓల్డ్ ‌పెన్షన్‌ ‌స్కీమ్‌)‌తో కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టినప్పటికీ వారు సంయమనం పాటించారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాలే ముఖ్యమని భావించారు. ఓపీఎస్‌ ‌పేరుతో ప్రజాధనాన్ని కొందరు ఉద్యోగులకు పంచిపెట్టడాన్ని ఎవరూ హర్షించలేరు. ఆఖరికి కాంభాలియా నియోజక వర్గంలో ఆప్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదిన్‌ ‌గద్వి పరాజయం పాలయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇతాలియా కూడా ఓడిపోయారు. ఆప్‌ అధినేత అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ఆయన కుడిభుజం మనీశ్‌ ‌శిశోదియా బీజేపీ మీద చేసిన ఆరోపణలు, మోదీ మీద బురద చల్లిన విధానం ప్రజానీకానికి జుగుప్స కలిగించిందే తప్ప కమలం విజయాన్ని కనీసంగా కూడా అడ్డుకోలేకపోయింది. అందుకే అడ్డతోవ రాజకీయ పార్టీలు మనకు అవసరమా అని ప్రధాని సరిగానే ప్రశ్నించారు. పంజాబ్‌లో ఆ పార్టీ విజయం సాధించింది. నిజమే, కానీ వెంటనే ఖలిస్తాన్‌ ‌వాదుల బలం పెరిగింది. ఇది గుజరాత్‌ ‌ప్రజలు సరిగానే గుర్తించారు. భారత కరెన్సీ మీద లక్ష్మీగణపతుల బొమ్మలు చిత్రించాలని అనేవరకు కేజ్రీవాల్‌ ‌పైత్యాన్ని ప్రదర్శించారు. ఆపద్ధర్మ హిందూత్వలో కాంగ్రెస్‌ను మించిపోయారు కేజ్రీవాల్‌. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌కంటే దేశంలో ప్రమాదకర ధోరణలు ప్రదర్శిస్తున్న పార్టీ ఆప్‌. ‌తాహిర్‌ ‌హుసేన్‌ ‌వంటి నాయకుడిని పోషించిన ఈ పార్టీకి ఈ దేశంలో స్థానం దొరకడమే విషాదం. ఆప్‌ ఎదగడానికి కాంగ్రెస్‌ అసమర్ధత దోహద పడుతోంది. ఈ పరిణామం అవాంఛనీయం. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలలో సాధించిన విజయం ఇప్పుడు ఆప్‌కి ఆనందం కలిగించదు. కానీ గద్గగ స్వరంతో తమకు జాతీయ హోదా లభించిందని ఆ పార్టీ నాయకులు చెప్పుకోవడం పిల్ల చేష్టలాగే ఉంది.

మోర్బీ వంతెన ప్రమాదం నేపథ్యంలో బీజేపీ అక్కడ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని విశ్లేషణల మీద విశ్లేషణలు వచ్చాయి. నిజానికి అవి ఒక వర్గం మీడియా దుష్ప్రచారమని తేలింది. పురాతన కట్టడం కూలడానికి, పాలనకు సంబంధం లేదని ప్రజలు భావించారు. అందువల్లే ఈ నియోజకవర్గంలో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

కాంగ్రెస్‌ ఓట్లను ఆప్‌ ‌చీల్చడం వల్లే కమలానికి అత్యధిక సీట్లు దక్కాయనే వాదన కుహానా మేధావుల నుంచి వినపడింది. కానీ వాస్తవాలను సహేతుకంగా విశ్లేషిస్తే దీనిలోని డొల్లతనం బయటపడుతుంది. బీజేపీకి 52.5 శాతం ఓట్లు, 156 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల కన్నా ఏకంగా 56 సీట్లు అదనంగా వచ్చాయి. కానీ కాంగ్రెస్‌, ఆప్‌ ‌రెండింటి ఓట్లు, సీట్లు కలిపి చూసినా బీజేపీ ముందు దిగదుడుపే. హస్తానికి 17 సీట్లు, 27.3 శాతం ఓట్లు లభించాయి. గతంలోకన్నా ఆ పార్టీకి ఏకంగా 60 సీట్లు తగ్గాయి. ఆప్‌ అయిదు సీట్లు, 12.9 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. అందువల్ల ఈ రెండు పార్టీల బలం బీజేపీ ముందు దిగదుడుపే. బీజేపీ అభ్యర్థుల ఆధిక్యం కూడా బీజేపీ సానుకూలతనే తెలియ చేస్తుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అహ్మదాబాద్‌ ‌నగరంలోని ఘట్లోడియా నియోజక వర్గం నుంచి 1.92 లక్షల ఓట్ల భారీ మెజార్టీ సాధించడం పార్టీ పట్ల ప్రజల అచంచల విశ్వాసానికి నిదర్శనం. అంతర్గత లోపాలను సరిదిద్దుకోవడం, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరుగులు పెట్టించడం, కలసికట్టుగా పనిచేయడం తదితర అంశాలు ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకులతో కూడిన జట్లు గడపగడపకూ తిరిగాయి. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు చేపట్టిన ప్రగతి కార్యక్రమాలను ప్రజలకు చేరవేశాయి. దాదాపు 150 మంది కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఎటువంటి హడావిడి లేకుండా తమకు అప్పగించిన పనులను పూర్తిచేశారు. పార్టీపరంగా లోటుపాట్లను సరిదిద్దుకుంది. కొవిడ్‌ ‌సమయంలో నాటి ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపాణీ పనితీరుపై పెదవి విరిచిన కేంద్ర నాయకత్వం ఆయనతో సహా మొత్తం కేబినెట్‌ ‌పై వేటు వేసింది. కొత్తనేతగా భూపేంద్ర పాటిల్‌ ‌ను తెరపైకి తీసుకువచ్చింది. పనితీరు బాగా లేని 42 మంది సిటింగ్‌ ‌శాసనసభ్యులకు నిర్మొహ మాటంగా టిక్కెట్లు నిరాకరించింది. ముఖ్యమంత్రుల మార్పు, ద్రవ్యోల్బణం, సరకుల ధరలు, గ్యాస్‌, ఇం‌ధన ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రభావం చూపిస్తాయని అంతా భావించినా, అలాంటిదేమీ కానరాలేదు. వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పడంలో పార్టీ విజయవంతమైంది. ఫలితంగా ప్రజా వ్యతిరేకత దూరమైంది. మోదీ ప్రచారం, ఆయన వ్యక్తిగత ఇమేజీ బాగా ఉపయోగ పడ్డాయి. ఆయన రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. మొత్తం 31 ర్యాలీలు, మూడు రోడ్డు షోలలో పాల్గొన్నారు. ప్రగతి మంత్రం జపిస్తూనే ప్రతిపక్షాలపై సూటిగా విమర్శలు సంధించారు. ఈ నరేంద్రుడి రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఈ భూపేంద్రుడికి ఇవ్వండి.. అని ఓటర్లను నేరుగా కోరారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును అత్యున్నత రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా ప్రధాని మోదీ తమకు మంచి గుర్తింపు ఇచ్చారన్న భావన వారిలో కనిపించింది. 2014లో ప్రధానిగా తన రాజకీయ కార్యక్షేత్రం గాంధీనగర్‌ ‌నుంచి ఢిల్లీకి మారినా ఆయన గుజరాత్‌ను విస్మరించలేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలను, ప్రగతి పథకాలను మంజూరు చేశారు. విపక్షాల డొల్లతనాన్ని ఎండ గట్టారు. రాహుల్‌ ‌గాంధీ జోడో యాత్రపై ధ్వజ మెత్తారు.

అసలు కాంగ్రెసే దేశాన్ని ముక్కలు చెక్కలు చేసిందని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో దేశాన్ని ముక్కలు చెక్కలు చేసి, ఇప్పుడు తగుదునమ్మా అంటూ యాత్ర చేయడంలోని ఉద్దేశాన్ని సూటిగా ప్రశ్నించారు. రాహుల్‌ ‌యాత్రే ప్రజల్లో చీలికకు కారణమవుతుందని ధ్వజమెత్తారు. మరో ఏడాది అనంతరం జరిగే సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్‌ ‌వంటి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రజల నాడిని కొంతవరకు తెలియజేస్తాయి. గుజరాత్‌ ‌విజయంలో ఇటు పార్టీ, అటు ప్రధాని పాత్ర చిరస్మరణీయమని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడే కాదు మరో అయిదేళ్ల అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం జెండా ఈ పశ్చిమ రాష్ట్రంలో ఎగరడం ఖాయం. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఇప్పుడే సంకేతించా యంటే అతిశయోక్తి కాబోదు. సర్‌ ‌తన్‌ ‌సే జుదా వ్యాఖ్యలు, హిందువుల పండుగల మీద దాడులు ఇలాగే కొనసాగితే ఆ మెజారిటీ ఇంకా పెరుగు తుంది. ఈ విషయాన్ని ఉదారవాదులు, మేధావులు గుర్తు పెట్టుకోవాలి.

గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ / ‌జాగృతి డెస్క్

———————————-

బిల్కిస్‌ ‌బానో అడ్డాలోనూ..

గిరిజనులు అధికంగా నివశించే దహోద్‌ ‌జిల్లాలో ఉంది లిమ్‌ఖెడా అసెంబ్లీ నియోజక వర్గం. ఈ నియోజక వర్గ పరిధిలోనే రంధిక్‌పూర్‌ ‌గ్రామంలోనే ఉంటారు 2002 నాటికి సామూహిక లైంగిక అత్యాచార బాధితురాలిగా పిలిచే బిల్కిస్‌ ‌బానో. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన వారిని సత్ప్రవర్తన అంశంతో ఇటీవల విడుదల చేయడం, దేశమంతా గగ్గోలు చెలరేగడం తెలిసిందే. తాను కనుక విజయం సాధిస్తే విడుదలైన ఆ 11 మంది ఖైదీలను తిరిగి జైలుకు పంపుతానని కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికలలో ప్రచారం చేశారు. నిజానికి ఈ నియోజక వర్గంలో జరిగిన ప్రచారంలో బిల్కిస్‌ ‌బానో అంశమే కీలకంగా మారింది. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి 8000 ఓట్లతో మూడో స్థానంలో ఉండిపోయారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి నరేష్‌ ‌బరియా మీద బీజేపీ అభ్యర్థి శైలేష్‌ ‌బభోర్‌ 4000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

————–

సమాజానికి సుదూరంగా ముస్లింలు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో 230 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే ఎన్నికయ్యారు. వీరంతా 73 స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే గుజరాత్‌ ‌శాసనసభలో ముస్లింల సంఖ్య తగ్గడం ఇవాళ్టి పరిణామం మాత్రం కాదు. 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 12 మంది ముస్లింలు చట్టసభకు వెళ్లారు. అప్పుడే కాంగ్రెస్‌ ‌పార్టీ ‘ఖామ్‌’ ‌పేరుతో ఒక సమీకరణను తెర మీదకు తెచ్చింది. అంటే క్షత్రియ, హరిజన్‌, ‌ముస్లిం, గిరిజన సమీకరణ. గడచిన ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థులు మహమ్మద్‌ ‌జావెద్‌ ‌ఫిర్జాదా, ఘియాజుద్దీన్‌ ‌షేక్‌, ఇ‌మ్రాన్‌ ‌ఖెడావాలా గెలిచారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఆరుగురు ముస్లింలను అభ్యర్థులుగా నిలిపింది. వీరిలో ఖెడావాలా మాత్రమే బీజేపీ, ఏఐఎంఐఎం సవాళ్లను ఎదుర్కొని సభలో ప్రవేశించబోతున్నారు. మిగిలిన ఇద్దరిలో ఘియాజుద్దీన్‌ ‌షేక్‌ ‌దరియాపూర్‌ ‌నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇక్కడ 46 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినా షేక్‌  ‌బీజేపీ అభ్యర్థి కౌశిక్‌ ‌జైన్‌ ‌చేతిలో ఓటమి చవిచూశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ముగ్గురు ముస్లింలను నిలిపింది. వారిలో ఎవరూ విజయం సాధించలేదు. అందరికంటే ఎక్కువగా బీఎస్‌పీ ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చింది. ఎవరూ గెలవలేదు.

———————————-

ప్రభావం చూపని మోర్బీ

135 మందిని పొట్టన పెట్టుకున్న మోర్బీ వంతెన కూలిన ఘటన బీజేపీ గెలుపు మీద ప్రభావం చూపుతుందని ఒక వర్గం మీడియా ప్రచారం చేసింది. అక్టోబర్‌ 30‌న ఆ దుర్ఘటన జరిగింది. అది నిస్సందేహంగా విషాదమే. ఆ జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మోర్బీ, టంకారా, వాంకనెర్‌.  ‌వీటిని 2017 ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌గెలిచింది. ఇప్పుడు వాటిని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే మచ్చు నదిలోకి దూకి కొందరిని ప్రాణాలు కాపాడిన కాంతిలాల్‌ అమృతియాను మోర్బీ నియోజకవర్గంలో బీజేపీ నిలిపింది. ఆయన 60,000 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి జయంతిలాల్‌ ‌పటేల్‌ ‌మీద గెలిచారు.

———————————-

దేశం దృష్టిని ఆకర్షించిన రాంపూర్‌

‌గుజరాత్‌లో బీజేపీ ఏడో పర్యాయం అధికారం చేపట్టడం ఒక రికార్డు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో రాంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడు దశాబ్దాల తరువాత ఒక హిందూ అభ్యర్థి గెలుపొందడం అసాధారణ విషయం. అక్కడ తాజాగా జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అఖండ విజయం సాధించడం కూడా దేశం దృష్టిని ఆకర్షించింది. ఇది పేరుకే రాంపూర్‌. ఏనాడూ హిందూ ప్రజా ప్రతినిధిని చూడలేదు. ఈ నియోజకవర్గంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ముస్లిం అభ్యర్థులే గెలుపొందుతూ ఉండడం విశేషం. ఇక్కడ 51 శాతం ముస్లింలే. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, సమాజ్‌వాదీ పార్టీ ‘ముస్లిం ఫేస్‌’ ఆం‌ఖాన్‌ ఏకంగా పదిసార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిజానికి ఇతడు సమాజ్‌వాదీ పార్టీకే కాదు, ఉత్తరప్రదేశ్‌లో నేర పూరిత రాజకీయాలకి కూడా ఫేస్‌ ‌వంటివాడే. దాదాపు 80 కేసులు ఎదుర్కొంటున్నాడు. అలాగే మతోన్మాదం జీర్ణించుకున్నవాడు కూడా. హిందువుల మీద ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కేసులో మూడేళ్లు జైలు శిక్ష కూడా పడింది. క్రిమినల్‌ ‌కేసులు, అరెస్టు తదితర కారణాలతో ఆజాంఖాన్‌ ‌పదవి రద్దయింది. దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు సమాజ్‌వాది పార్టీ తరఫున ఆజంఖాన్‌ ‌సన్నిహితుడు అసీమ్‌ ‌రజా బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా ఆకాశ్‌ ‌సక్సేనా నిలిచారు. ఆయన 33,000 భారీ ఆధిక్యంతో సమాజ్‌వాదీ అభ్యర్థిని ఓడించారు. సక్సేనా మీద ఎలాంటి కేసులు లేవు. ఇక్కడ నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఇలాంటి ప్రజా ప్రాతినిధ్యాలు ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నాయి. ఏడ దశాబ్దాలుగా అక్కడ ముస్లింలే అభ్యర్థులుగా గెలుస్తుంటే, హిందువుల పరిస్థితి ఏమిటి?

About Author

By editor

Twitter
Instagram