– హరీష్‌

‌డిసెంబర్‌ 25 ‌వాజపేయి జయంతి

విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే నేత ఆయన. దేశానికి మూడు సార్లు ప్రధాన మంత్రిగా సేవలందించి.. నిస్వార్థ రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందారు. తన నాయకత్వ లక్షణాలతో భారత విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించి నవభారత నిర్మాణానికి బాటలు వేసిన నాయకుడూ ఆయనే. ఆయన మొదటిసారి లోక్‌సభకు ఎన్నికైనప్పుడే ఆ ప్రసంగ ధోరణిని గమనించిన అప్పటి లోక్‌సభ స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌ ‘‌హిందీ ప్రసంగాలకు అద్వితీయుడు’ అని వ్యాఖ్యానించారంటే ఆ వాగ్ధాటి ఏ పాటిదో అర్థంచేసుకోవచ్చు. అవును.. మనం మాట్లాడుకుంటున్నది భారత మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారి వాజపేయి గురించే..

దీనదయాళ్‌ ఉపాధ్యాయ, శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ అనుచరుడిగా రాజకీయ ప్రస్థానం కొనసాగించిన వాజపేయి.. బీజేపీకి మారు పేరుగా మారిపోయారు. ఆయన రాజకీయ రంగం నుంచి నిష్క్రమించే దాకా మేటి రాజకీయవేత్తగా చెరగని ముద్ర వేశారు. రాజకీయాల్లో ఆయనది విశిష్ట శైలి. తన రాజకీయ అభిప్రాయాలతో విభేదించే వారితోనూ సఖ్యతగా ఉండడం ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకత.

పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించి ఏ పని చేపట్టినా అందరి మన్ననలు పొందుతూ.. దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన వారిలో వాజపేయిని ఒకరిగా చెప్పు కోవచ్చు. 1996లో 13 రోజులు, 1998-99లో 13 నెలలు, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ల పాటు పూర్తికాలం ప్రధాన మంత్రిగా సేవలందించారు.

మొరార్జీ దేశాయ్‌ ‌నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా వాజపేయి పనిచేశారు. జనతా ప్రభుత్వం కూలిపోయినప్పుడు, భారతీయ జనసంఘ్‌లోని ఇతర సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు దేశమంతా పర్యటించి పార్టీ విస్తరణలో కీలక భూమిక పోషించారు వాజపేయి. తన రాజకీయ జీవితంలో 10 సార్లు లోక్‌సభ, 2 సార్లు రాజ్యసభకు అటల్‌ ఎన్నికయ్యారు. 1957లో బలరాంపూర్‌ ‌నియోజక వర్గం నుంచి తొలిసారిగా ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు.

విదేశాంగ విధానం మీద వాజపేయికి ముందు నుంచి అపారమైన ఆసక్తి ఉండేది. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆయనే విదేశాంగశాఖ మంత్రి. పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరచడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు లాహోర్‌ ‌బస్‌ ‌యాత్ర చేపడితే ఆయన సొంత పార్టీవారే వ్యతిరేకించినా వాజపేయి వెనుకాడలేదు. ‘పాకిస్తాన్‌ అస్తిత్వాన్నే అంగీకరించని భారత్‌తో చర్చించి ఏం లాభం’ అని నసిగేవారిని కూడా 1999 ఫిబ్రవరి 21న లాహోర్‌లోని మినార్‌-ఎ-‌పాకిస్తాన్‌ ‌వద్ద ప్రసంగించి నిరుత్తురలను చేశారు. పాకిస్తాన్‌ అస్తిత్వాన్ని అంగీకరించడంలోనే ఆయన రాజనీతిజ్ఞత ఇమిడి ఉంది. వాజపేయి ప్రసంగం తర్వాత జమాత్‌-ఎ-ఇస్లామి వారు ఆ మినార్‌ను గులాబీ నీళ్లతో శుద్ధి చేయడం ఓ వైపరీత్యం. లాహోర్‌ ‌బస్‌ ‌యాత్ర ద్వారా వాజపేయి సాధించిన ఫలితాన్ని కార్గిల్‌ ‌యుద్ధానికి తలపడడం ద్వారా పాకిస్తాన్‌ ‌వమ్ము చేసింది. అయినా వాజపేయి పాకిస్తాన్‌తో శాంతి కోసం కృషి చేసి జనరల్‌ ‌ముషరఫ్‌ను ఆగ్రా చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చలు కడకు బెడిసిపోయినా ఆ ప్రయత్నం అటల్జీ చిత్తశుద్ధికి నిదర్శనం.

వాజపేయి రాజకీయంగా ఎవర్నీ నిలదీయ డానికి జంకలేదు. నెహ్రూ వాజపేయిని అభిమానించే వారు. అటల్జీకి నెహ్రూ మీద గౌరవం ఉండేది. కాని నెహ్రుని నిలదీయాల్సి వచ్చినప్పుడు వాజపేయి తన ధర్మాన్ని నిర్మొహమాటంగా నిర్వహించారు. అంతే కాదు, ఇందిరా గాంధీ స్వర్ణ దేవాలయం మీద సైనిక చర్యకు పాల్పడడానికి ముందు వాజపేయిని సలహా అడిగారు. ఆయన ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇందిరాగాంధీ ఆ సలహాను చెవికెక్కించుకోలేదు. ఆ సైనిక చర్యే చివరకు ఇందిరాగాంధీ ప్రాణాలనే కబళించిందన్నది చరిత్ర. ఇందిర మరణం తర్వాత ఢిల్లీలో సిక్కుల మీద ఉధృతంగా దాడులు జరిగి నప్పుడు తన ఇంటి సమీపంలోని సిక్కుల మీద దాడి చేయడానికి వచ్చిన అల్లరి మూకను వాజపేయి స్వయంగా నివారించడమే కాదు, వారు నిష్క్రమించే దాకా అక్కడే నిలబడ్డారు కూడా.

ప్రత్యర్థులను కూడా గౌరవించడం వాజపేయి సంస్కారం. కాని ప్రతిపక్షాల వారు హద్దు మీరి మాట్లాడిన సందర్భంలో దీటుగానే సమాధానం చెప్పే వారు. ‘మీరు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఒత్తిడికి లొంగి వ్యవ హరిస్తున్నారు’ అని సోనియా గాంధీ పార్లమెంటులో ఆరోపించినప్పుడు వాజపేయి ఇచ్చిన సమాధానాన్ని కింగ్షుక్‌ ‌నాగ్‌ ‘అటల్‌ ‌బిహారి వాజపేయి: ఎ మ్యాన్‌ ‌ఫర్‌ ఆల్‌ ‌సీజన్స్’ ‌గ్రంథంలో కళ్లకు కట్టినట్టు వివరించారు. ‘నేను ఎవరి ఒత్తిడికీ లొంగి పని చేయను. ఒత్తిడికి లొంగి అణు పరీక్షలను వాయిదా వేసింది మీ పార్టీయే. అణుపరీక్షలకు తేదీలు ఖరారై సర్వం సిద్ధమైన తర్వాత విదేశీ ఒత్తిడికి లొంగి వాయిదా వేసింది మీరే. సంఘ్‌ ‌పరివార్‌ ‌గురించి నాకు చెప్పడానికి మీరెవరు? అది మా అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో జోక్యం చేసుకోకండి’ అని మందలించే స్థాయిలో మాట్లాడగలిగిన దిట్ట వాజపేయి.

వాజపేయి భావుకుడు, కవి, గొప్ప వక్త. ఈ లక్షణం ఆయనకు వారసత్వంగా అబ్బినట్టుంది. ఆయన తాత శ్యాంలాల్‌ ‌సంస్కృత పండితుడు. కవిత్వాభిమాని. ఆయన మాటల్లో సంస్కృత శ్లోకాలు అలవోకగా దొర్లేవి. తండ్రి కృష్ణ బిహారి ఖడీ బోలీలో కవితలు రాసేవారు. ఇక వాజపేయి ప్రసంగం ఒక ఉప్పెనలా సాగేది. ఆయన మాట్లాడుతూంటే నిఘంటువుల్లో దొరకని ఎన్నో కొత్త కొత్త పదాలు పుట్టుకొచ్చేవి. పిట్టకథలు, సామెతలతో రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్య బాణాలు సంధించడంలో అటల్జీ దిట్ట. ఆయన ఉపన్యాసాల్లో దొర్లే కవిత్వం సభికులను ఎంతగానో ఆకట్టుకునేది. ఈ వివరాలన్నీ నాగ్‌ ‌తన పుస్తకంలో పొందు పరిచారు.

ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ను పార్లమెంటులో ఒక సందర్భంలో వాజపేయి రాజ కీయంగా తీవ్రంగా విమర్శించారు. దీనికి మనస్తాపం చెందిన మన్మోహన్‌ ‌రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, అయితే అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు వాజపేయికి ఫోన్‌ ‌చేసి మన్మోహన్‌ను శాంతింప చేయాలని కోరితే ఏ మాత్రం భేషజం లేకుండా ఆయన తన ఔదార్యాన్ని ప్రదర్శించారని నాగ్‌ ‌వివరించారు.

వాజపేయికి భారతరత్న ఇవ్వాలని బీజేపీ మొట్టమొదటి సారి 2008లో కోరిందని, ఆ తర్వాత 2010లో మళ్లీ ఈ విషయం అడిగిందని, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ ‌సింగ్‌ అనుకూలంగానే ఉన్నా సోనియా గాంధీ వ్యతిరేకించారని నాగ్‌ ‌రాశారు. యూపీఏ అధికారంలో ఉన్నన్నాళ్లు వాజపేయికి భారతరత్న ఇవ్వలేదు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోనికి రాగానే 2015లో ఆయనను భారతరత్నతో గౌరవించింది.

పోఖ్రాన్‌ అణు పరీక్షలు

1974లో తొలిసారిగా ‘పోఖ్రాన్‌-×’ అణుపరీక్ష జరిపిన భారతదేశం.. మళ్లీ 24 సంవత్సరాల తరువాత అంటే, 1998, మేలో రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను ‘పోఖ్రాన్‌-××’‌గా వ్యవహరిస్తారు. వాజపేయి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోనే ఈ పరీక్షలు నిర్వహించడం గమనార్హం. రెండు వారాల అనంతరం పాకిస్తాన్‌ ‌తన సొంత అణుపరీక్షలతో స్పందించింది. మనం నిర్వహించిన అణుపరీక్షలను రష్యా, ఫ్రాన్స్ ‌మొదలైన కొన్ని దేశాలు సమర్థించాయి. యూఎస్‌ఏ, ‌కెనడా, జపాన్‌, ‌బ్రిటన్‌, ఐరోపా దేశాలు సమాచారం, వనరులు, సాంకే తికాంశాలలో మనదేశానికి సహాయంపై ఆంక్షలు విధించాయి. తమ అణు సామర్థ్యాన్ని, అణ్వా యుధంగా మలచే విషయమై భారత్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ ఆంక్షలు సమర్థవంతంగా నిరోధించలేకపోయాయనే చెప్పాలి. వాజపేయి ప్రభుత్వం ఈ చర్యలను ముందే ఊహించి, తదనుగుణంగా ప్రణాళిక ఏర్పరచుకోవడంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పవచ్చు.

లాహోర్‌ ‌సదస్సు

1988 చివరలో, 1999 మొదట్లో వాజపేయి.. పాకిస్తాన్‌తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్య చర్చలు ప్రారంభించారు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్‌ ‌బస్సు యాత్ర 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కశ్మీర్‌ ‌సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్తాన్‌తో నూతన శాంతి ఒప్పందం కోసం ఆ దేశాన్ని ఆహ్వానించారు. తత్ఫలితంగా కుదిరిన లాహోర్‌ ఒప్పందం.. ద్వైపాక్షిక చర్చలను కొనసాగిం చాలని, వర్తక సంబంధాలు విస్తరించాలని, సహృద్భావం పెంపొందించాలనీ ఉల్లేఖించింది. అణ్వాయుధ రహిత దక్షిణాసియా అనే దార్శనిక లక్ష్యాన్ని ఉద్బోధించింది. ఈ ఒప్పందం 1998 అణుపరీక్షల తర్వాత ఇరు దేశాలలోనే కాక, దక్షిణా సియాలోను, ఇతర ప్రపంచంలోనూ నెలకొన్న ఉద్రిక్తతలను ఉపశమింపజేసింది.

గొప్ప సంస్కర్త

వాజపేయి మూడవ దఫా పరిపాలనా కాలంలో అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టారు. ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించి పరిశోధనాభివృద్ధిని ప్రోత్స హించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీ కరించారు కూడా.

గత 32 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగానికి పైగా వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలనలో వేయించినవే అని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు సమక్షంలోనే చెప్పడం గమనార్హం. నేషనల్‌ ‌హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్ట్, ‌ప్రధానమంత్రి గ్రామ సడక్‌ ‌యోజన వంటి పథకాలను వాజపేయి సమర్థ వంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు.

రాజకీయాల్లో సంస్కారం అంతరిస్తున్న నేటి తరుణంలో వాజపేయి జీవితం.. ఆయన రాజ కీయాల పొడ గిట్టని వారికి కూడా ఆదర్శప్రాయమే అనడంలో సందేహం లేదు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram