– సి.హెచ్‌. ‌శివరామప్రసాద్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతికి ఎంపికైనది

ఆరోజు నందం గారు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయన పేరు రామశాస్త్రి అయినా అంతా ఇంటి పేరునే పాపులర్‌ ‌చేశారు. అంతా నందం గారనే అంటారు. సీతారాంపురంలో రామాలయం పూజారి. చుట్టు ప్రక్కల నాలుగు ఊళ్లకు పౌరోహిత్యం గూడా ఆయనదే.

నందం గారు ఆరోజు పురుషోత్తమరావు. గారి మనవరాలి పెళ్లి చేశారు. అప్పగింతలు అయిన తర్వాత ఆయన కొడుకు సంజీవరావు నందం గారిని అడిగాడు.

‘‘పంతులు గారూ! ఎంతివ్వమంటారు?’’

‘‘మీ ఇష్టం’’

‘‘వెయ్యి నూట పదహార్లు ఇవ్వనా…?’’

నందంగారు తలూపారు. అక్కడే ఉన్న పురుషోత్తమరావు. కొడుకు మీద మండిపడ్డాడు.

‘‘ఏంట్రా సంజీవా? నందం గారితో బేరం ఆడుతున్నావు? పెళ్లికి లక్షలు ఖర్చు పెడతారు. పురోహితుడికి ఇవ్వడానికి బేరం ఆడతారు. ఏ మనుషులో…!’’

‘‘అది కాదు నాన్నా…’’ అని సంజీవ రావు తండ్రికి ఏదో చెప్పబోయాడు.

‘‘ఆయన్ని అడిగేదేంటి? పదివేలు ఇవ్వు…’’ సీరియస్‌గా అన్నాడు పురుషోత్తమరావు.

సంజీవరావు తాంబూలంలో పదివేలు పెట్టి ఇచ్చాడు. ఆరోజు అనుకోని ఆదాయం రావడంతో నందంగారికి చాలా ఆనందంగా ఉంది.

ఇంటికి వచ్చేసరికి భార్య సీతాలక్ష్మి ఎదురొచ్చి ఏడవడం సాగించింది.

నందం గారికి కంగారు పుట్టింది.

‘‘ఏమైంది…?’’ అని ప్రశ్నించాడు

ఏడుస్తున్న సీతాలక్ష్మి నోట మాటలు రావడం లేదు.

‘ఏమైందంటే…?’

సీతాపురం ఎస్టేట్‌ ‌చివరి రాజా నరసింహారావు. చివరి రాజా అని ఎందుకంటే, ఆయన హయాంలోనే ఇండియాకి స్వతంత్రం వచ్చింది. 1949లో ప్రభుత్వ ఎస్టేట్‌ ఎబాలిష్‌ ‌చట్టం తెచ్చింది. చివరి రాజా గారికి భరణం ఇచ్చి అధికారాలకి కళ్లెం వేసింది.

పూలమ్మిన చోట కట్టెలమ్మినట్టుగా ఉంటుందని ఆయన మకాం మద్రాస్‌కి మార్చాడు. అక్కడే వ్యాపారాలు మొదలుపెట్టి సెటిలైపోయాడు. ఆయన కుటుంబం అక్కడే ఆస్తులు సంపాదించి బంగళాలు కట్టుకుని నగర ప్రముఖులైపోయి హైసొసైటీలో చేరిపోయారు.

సీతారాంపురంలో అప్పటి దివాన్‌ ‌వెంకట సుబ్బారాయుడు జమీందార్‌ ‌గారి కోట భవనాలు పరిరక్షిస్తూ, భూములు రైతులకు కౌలుకిస్తూ అజమాయిషీ చేస్తున్నాడు. సీతారాంపురం జమీ వారసులు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగకి వచ్చి మూడురోజులు గడిపి పోతారు. వెంకట సుబ్బారాయుడి వారసులు, వారు వచ్చినప్పుడు కౌలు తాలుకు లెక్కలు చెప్పి డబ్బు అందచేస్తాడు. వారికి ఈ డబ్బు ఒక లెక్కలోనిది కాదు. పప్పుల బెల్లాల కింద లెక్క.

జమీందారు కుటుంబ వారసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి చాలామంది అమెరికా, లండన్‌ ‌వంటి విదేశాలలో స్థిరపడ్డారు. అయినా కొందరైనా సంక్రాంతికి ఇండియా వస్తారు. మద్రాసు విమానంలో వచ్చి అక్కడి నుంచి కార్లలో గ్రామానికి చేరుకుంటారు.

ఈసారి కృష్ణారావు తన వియ్యంకుడు విలియమ్స్ ‌కుటుంబంతో సీతారాంపురం వచ్చాడు. కృష్ణారావు అమెరికాలో క్రిష్‌ ‌బొమ్మదేవరగా పాపులర్‌. ఆయన కూతరు ప్రీతి, విలియమ్స్ ‌కొడుకు రెనాల్డ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండియా చూడాలని విలియమ్స్ ‌వియ్యంకుడు క్రిష్‌తో అనగానే ప్రయాణం ఖరారు చేశాడు.

సీతారాంపురం కోటకి తీసుకొచ్చి తమ పూర్వీకుల వైభవాన్ని వియ్యంకుడి కుటుంబానికి చూపించాడు. అప్పటి తివాచీలు పరిచిన గదులు, షాండిలియర్లు, పెయింటింగ్స్, ‌గుర్రాలశాలలు, పొలాలు, తోపులు అన్నీ చూపించాడు. విలియమ్స్ ‌కుటుంబం సంతోషంగా తిరిగింది.

విలియమ్స్‌తో పాటు తమ వంట చెయ్యడానికి చెఫ్‌ని వెంట తెచ్చుకున్నారు. ఆయనకి ఇండియా ఫుడ్‌ ‌పడదు. చెఫ్‌ ‌చెప్పిన పదార్థాలను క్రిష్‌ ‌తెప్పించే వాడు. చెఫ్‌ ‌ప్రత్యేకంగా విలియమ్స్ ‌కుటుంబానికి పదార్థాలు వండి వడ్డించేవాడు. ఎప్పుడన్నా ఇడ్లీ అల్లం పచ్చడి, దోసె కొబ్బరి చట్నీ టేస్ట్ ‌చేసి ఎగిరి పడేవాడు. మంట… మంట… అని చాక్లెట్లు చప్పరించి ఉపశమనం పొందేవాడు.

చెన్నైలో ఏ ప్రాబ్లమ్‌ ‌లేదు. అన్నీ దొరికేవి. ఇప్పుడు సీతారాంపురంలో ప్రాబ్లమ్‌ ‌వచ్చింది. విలియమ్స్ ఇష్టంగా ఆరగించేవి బీఫ్‌. ‌రేపటికి బీఫ్‌ ‌తెప్పించమని చెఫ్‌ ‌క్రిష్‌కి ఆర్డర్‌ ‌వేశాడు.

క్రిష్‌ ‌తమ సీతారాంపురం ఏజెంట్‌ ‌రాఘవకి చెప్పాడు. అతను అప్పటి దివాను వారసుడు.

‘‘మనకి ఒక ఆవు కావాలి. ముసలీముతక కాదు. హెల్తీగా యంగ్‌గా ఉండాలి’’.

‘‘ఒకే సార్‌…! అన్నాడు రాఘవ.

 రాఘవ ఒకే అన్నాడు కానీ ఆవు దొరకడం అంత ఈజీగా లేదు.

ఊళ్లో అందరూ గేదెలను పెంచుతున్నారు. పాలు తీసి మిల్క్ ‌సొసైటీకి అమ్ముతున్నారు. ఎద్దులు కూడా కనిపించడం లేదు. పొలాలు ట్రాక్టర్లతో దున్ను తున్నారు. రాఘవ పంపిన మనుషులు ఊరంతా తిరిగి చేతులెత్తేశారు.

రాఘవ తాత ముత్తాతలు జమీందారు దగ్గర దివాన్లుగా సేవలు అందించారు. దాంతో పాటు వారి డాబు, దర్పం, అధికారమదం, పెత్తందారీ మనస్తత్వం వంట బట్టించుకున్నారు. అదంతా మెయింటైన్‌ ‌చేస్తూ ఊళ్లో తిరుగు లేకుండా చక్రం తిప్పుతున్నారు. రాఘవ ఇప్పుడు సీతారాం పురం సర్పంచ్‌.

‘‘అదేంట్రా! ఊళ్లో ఒక్క ఆవు కూడా లేదా? సరిగ్గా తిరిగారా? లేదా?’’ అని మండిపడ్డాడు.

‘‘బోడి ఒక ఆవుని సప్లయ్‌ ‌చెయ్యలేకపోతే రాజా వారి దగ్గర పరువు పోతుంది. ఆయన వియ్యంకుడు బీఫ్‌ ‌లేకపోతే ముద్ద మింగడు. నాకు అదేం తెలీదు. మన ఊళ్లో లేకపోతే చుట్టుప్రక్కల ఊళ్లకెళ్లండి. సాయంత్రం లోపల ఆవు కోటలో ఉండాలి. ఎంత డబ్బయినా ఫర్వాలేదు. వాళ్ల మొఖాన కొట్టి ఆవుని తోలుకు రండి.’’ అని రాఘవ తన మనుషులకు హుకుం జారీ చేశాడు.

వాళ్లకి చుట్టుప్రక్కల ఊళ్లలో తిరగాల్సిన శ్రమ లేకుండా సీతారాంపురంలోనే నవనవలాడుతూ ఆరోగ్యంతో మెరిసిపోతున్న ఆవు దొరికింది. అగ్ర హారం వీధిలో నందం గారింట్లో ఆవు కనిపించింది.

ఆవు కావాలని చెప్పగానే సీతామహాలక్ష్మి ససేమిరా వీలుకాదు అంది. ‘మహాలక్ష్మి అని పేరు పెట్టి అపురూపంగా పెంచుకుంటున్నాం. ఇవ్వడానికి లేదు’ అన్నది. నందంగారు లేరని, లోపలకు రావొద్దని అన్నారు.

రాఘవ మనుషులు ఆమెతో ఘర్షణ పడ్డారు. ఆమె ఎంత మొత్తుకున్నా చెవికెక్కించుకోలేదు. మూర్ఖంగా వాదించారు.

‘మీరు ఇంకో ఆవు కొనుక్కోండి. ఇదుగో ఈ డబ్బు తీసుకోండి. సర్పచ్‌ ‌గారివ్వమన్నారు’ అంటూ పదివేలున్న కరెన్సీ కట్ట అక్కడ పడేసి, ఆవును బలవంతంగా తోలుకుపోయారు….

అదీ జరిగింది. అందుకే సీతాలక్ష్మి ఏడుస్తోంది. అంతా విని నందంగారు దీర్ఘంగా నిట్టూర్చారు. తన బలహీనుడు. ఊళ్లో పెత్తందార్లను ఎదిరించి ఏం చేయగలడు?

‘‘ఏమండీ! మీరెళ్లి ఆ సర్పంచిని నిలదీయండి. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు మనుషుల్ని పంపించి ఆవుని దౌర్జన్యంగా తోలుకెళ్లడం ఏం న్యాయం? మరీ ఇంత దుర్మార్గమా?’’ అన్నది సీతాలక్ష్మి.

రాజాగారి అమ్మాయి అమెరికాలో తెల్లోడిని పెళ్లి చేసుకుందనీ, ఆ తెల్లోళ్లకు కటుంబం కోటకి వచ్చిందనీ ఊళ్లో జనం చెప్పుకుంటున్నారు. అది నందంగారి వరకు వచ్చింది. ఆవును ఎందుకు తోలుకెళ్లారో ఆయనకి అర్థమైంది.

‘‘సర్పంచిని కాదులే. ఆ రాజా గారినే అడుగు తాను. అంతా ఆ భగవంతుడి ఇచ్ఛ. నువ్వేం బాధ పడకు సీతా. జరిగేదాన్ని మనం ఆపలేం’’ అన్నాడు.

* * * * * *

సీతారాంపురం కోటలో సందడిగా ఉంది. సంవత్సరం పొడుగునా గేటు మూసే ఉంటుంది. సంక్రాంతికి రాజాగారి కటుంబం ఫలానా రోజున వస్తున్నదని తెలిసిన తర్వాత సర్పంచ్‌ ‌రాఘవ బిల్డింగ్‌ ఊడ్పించి, కడిగించి, గదులలో ఏసీలు సర్వీసింగ్‌ ‌చేయించి, డ్రైక్లీనింగ్‌ ‌చేయించిన బెడ్‌షీట్లు, కర్టెన్లు వేయించి సిద్ధం చేస్తాడు. కొన్ని రోజులు రాజాగారి కుటుంబ సభ్యులతో కోట కళకళలాడుతుంది. వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ బిల్డింగ్‌కి తాళం పడుతుంది. గేటు మూసుకుంటుంది.

ఆరోజు సాయంకాలం నుంచే కోటలో సందడి మొదలైంది. కోట సింహ ద్వారానికి లోపల బిల్డింగ్‌కి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో షామియానాలు వేశారు. ఆహుతులు కూర్చోవడానికి కుర్చీలు వేయించారు. ఒక మూల స్టేజి తయారైంది. టేకు బల్లలతో, ఊళ్లో పెద్దమనుషులతో పాటుగా ఆ నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే బుజ్జిబాబుని కూడా ప్రత్యే కంగా ఆహ్వానించాడు సర్పంచ్‌ ‌రాఘవ. నిజానికి రాజా కృష్ణారావుకి ఆ ఎమ్మెల్యేతో పరిచయం లేదు. కాని రాఘవ తన పలుకుబడి పెంచుకోవడానికి రాజాగారి పేరు చెప్పి ఆహ్వానించాడు. ఎమ్మెల్యేగారు మూడు కార్లలో కుటుంబం సహా అట్టహాసంగా వచ్చారు. రాజా కృష్ణారావు, తన వియ్యంకుడు విలియమ్స్, ‌భార్య, కూతురు, అల్లుడితో సహా ఎదురేగి ఆహ్వానించాడు.

ఇంతకీ విశేషమేమిటంటే… తన అమెరికా వియ్యంకుడి కుటుంబానికి వినోదం కలిగించడం కోసం సురభివారి ‘మాయాబజార్‌’ ‌నాటకం ఏర్పాటు చేశాడు రాజా కృష్ణారావు. వారికి భాష అర్థం కాకపోయినా, తళతళ మెరిసే దుస్తులు, ఆభరణాలు, కిరీటాలు, కత్తులు, గదల అట్టహాసంతో నటించే వారి హావభావాలు చూసి ఆనందిస్తారని ఆ నాటకం ఏర్పాటుచేశారు.

ఇంకా నాటకం మొదలుకాలేదు. ముందు వరసలో ప్రత్యేకంగా వేయించిన సోఫాలలో రాజాగారి కుటుంబం, ఏమ్మెల్యే గారి కుటుంబం కూర్చుని ఉన్నారు.

యూనిఫాంలో ఉన్న కాటరింగ్‌ ‌కుర్రాళ్లు అందరికీ ప్లాస్టిక్‌ ‌ప్లేట్లలో స్వీట్స్, ‌కారాలు అందజేస్తున్నారు.

ఆ ప్రాంగణమంతా విద్యుత్‌ ‌దీపాలు దేదీప్య మానంగా వెలుగుతున్నాయి. మైక్‌లలో ఘంటసాల. సుశీల పాటలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి.

అక్కడ ఏర్పాట్లన్నీ సర్పంచ్‌ ‌రాఘవ పర్యవేక్షి స్తున్నాడు. నందంగారు రావడం గమనించి ఎదురు వెళ్లాడు.

‘‘నందంగారూ…! రండి… రండి…’’ అంటూ ఆహ్వానించాడు.

‘‘రాజా కృష్ణారావు గారు పరిచయమే గదా…!’’ అని రాఘవ అడిగాడు.

‘‘లేదు… వీరి నాన్నగారు రాజగోపాలరావు గారు బాగా తెలుసు. వీరిని చూసే ఉంటాను…’’ అన్నాడు నందంగారు.

నందం గారిని ముందు వరసలో కూర్చున్న రాజాక్రిష్‌, ఎమ్మెల్యే బుజ్జిబాబు దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశాడు రాఘవ.

‘‘నందం గారు తెలియకపోవడం ఏమిటి? గత సంవత్సరం వచ్చినప్పుడు మా అమ్మగారు ఇక్కడే కదా• చనిపోయారు. అప్పుడు మాతో కర్మలు చేయించింది వీరే…’’ అన్నాడు రాజా క్రిష్‌ ‌గుర్తుపట్టి.

నమస్కారం చేసి చేతులు కలిపి ‘‘రండి… రండి… కూర్చోండి…’’ అంటూ ఒక సోఫాలో చోటు చూపించాడు.

‘‘అయ్యా! రాజా వారూ! నేను నాటకం చూడ్డానికి రాలేదు. తమరితో ఒక విషయం మనవి చేసు కుందామని వచ్చాను’’ అన్నాడు నందం గారు.

సర్పంచ్‌ ‌రాఘవ అయోమయంగా చూస్తున్నాడు. రాజాగారితో ఏ విషయాన్నయినా తన ద్వారా వెళ్లేటట్టుగా జాగ్రత్త పడ్డాడు. నేరుగా ఎవరూ వెళ్లరు. మరి ఈ నందం గారు ఏమి చెప్పబోతున్నారు? ఒకవేళ ఆయన తల్లిగారి సంవత్సరీకం వగైరా గురించా?

‘‘చెప్పండి నందం గారూ…?’’ అని అడిగాడు రాజా క్రిష్‌.

‘‘అయ్యా! గత సంవత్సరం అమ్మగారి కర్మల సందర్భంగా నాకు ఒక ఆవుని దానం చేశారు తమరు’’.

‘‘ఔను. గోదానం చేశాం. గుర్తుంది.’’

‘‘ఈరోజు తమ మనుషులు వచ్చి తమరికి ఆవు అర్జెంటుగా కావాల్సి వచ్చిందని తోలుకెళ్లారు. అందుకు పదివేల రూపాయలు ఇచ్చారట. అప్పుడు నేను ఇంట్లో లేను. నా భార్య తెలివి తక్కువది. ఆ డబ్బు తీసుకుంది. మీరు గోదానం చేసిన ఆవుని తిరిగి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? డబ్బు తీసుకోవడం తప్పు కదా! మన్నించాలి తమరు…’’ అంటూ నందం గారు పదివేల రూపాయల కరెన్సీ కట్ట రాజావారి చేతిలో ఉంచాడు.

రాజా క్రిష్‌ ‌నెత్తిన ఎవరో సుత్తితో బాదినట్టు ఫీలయ్యాడు. మెదడు మొద్దు బారినట్లయింది. నందం గారు చెప్పింది అర్థ్ధమయినట్టు, కానట్టూ ఉంది.

ఎమ్మెల్యే బుజ్జిబాబు అయోమయంగా చూస్తు న్నాడు వారిద్దర్నీ. రాఘవ ముఖంలో నల్లమబ్బులు కమ్ముకున్నాయి.

‘‘రాఘవా…! వాటీజ్‌ ‌దిస్‌…?’’ ఎ‌ర్రబడిన ముఖంతో తీవ్రంగా అడిగాడు క్రిష్‌.

‌రాఘవ నోట్లో తడి ఆరిపోయింది. గొంతులో నుంచి మాటలు పెగలడం లేదు.

‘‘సారీ… నందం గారూ…’’ అని క్రిష్‌ ఏదో అనబోతుంది నందం గారు అడ్డుపడి చెప్పాడు.

‘‘అయ్యా! ఆవు ఇటీవల కోడె దూడెను పెట్టింది. మీవాళ్లు ఆవుని తోలుకెళ్లారు గాని దూడను వదిలి వెళ్లారు. అది తల్లికోసం అంబా అంబా అని ఏడుస్తోంది. తల్లీబిడ్డను వేరు చేయడం ధర్మం కాదు. అందుకని దూడను తోలుకుని వచ్చాను. గేటు పక్కన గుంజకు కట్టివేశాను. సెలవు.’’

నందం గారు చకచక నడుచుకుంటూ వెళ్లి పోయాడు. అక్కడ్నుంచి రామాలయానికి వెళ్లాడు. ఆయన్ని చూసి శిష్యుడు అడిగాడు.

‘‘ఈ పూట రానన్నారుగా? వచ్చారేం?’’

‘‘వెళ్లిన పని పూర్తయింది. అందుకే వచ్చాను. రాముడిని చూడకుండా ఒక పూట గూడా వుండలేను నేను….’’ అంటూ చిరునవ్వు నవ్వాడు.

గుడిలో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లాడు. సీతాలక్ష్మి ఎదురొచ్చింది భర్తకు.

ఆమె ముఖం పౌర్ణమినాటి చందమామలా వెలుగుతోంది.

‘‘ఏమండీ! మహాలక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేసింది. దూడ కూడా…!’’ అన్నది ఆనందంతో పరవశురాలవుతూ.

నందంగారి పెదవుల మీద చిరు దరహాసం మెరిసింది.

About Author

By editor

Twitter
Instagram