ఐదు దశబ్దాల జాగృతి చరిత్రపై తూములూరి వారితో ఇంటర్వ్యూ

(స్వర్ణోత్సవ జాగృతి – 1998 నుంచి యథాతథంగా..)

జాగృతి పత్రిక ప్రారంభం ఎలా జరిగిందో చెబుతారా?

నా ఉద్దేశంలో జాగృతి పత్రిక రూపంలో ఉన్న ఒక ఉద్యమం. సంఘ స్వయంసేవకుల ఆవేదనలో నుంచి పుట్టింది ఆ పత్రిక. 1948లో స్వయం సేవకులు గాంధీజీని హత్య చేశారని వచ్చిన అపవాదు నీచమైనదని చెప్పడానికి దేశంలో పత్రికలు లేని దిక్కుమాలిన స్థితిలో- నిజం చెప్పుకోవాలని స్వయంసేవకులు పడ్డ ఆవేదనలో నుంచి పుట్టింది జాగృతి. 1948 డిసెంబర్‌ 18‌న జాగృతి తొలి సంచిక వెలువడింది.

శ్రీ భండారు సదాశివరావు ఆ పని చూస్తుండే వారు. ప్రాంత ప్రచారక్‌ శ్రీ ‌బాపూరావ్‌ ‌మోఘే వారం వారం శ్రద్ధ పట్టి చూసేవారు. మేధావిగా సంపాదకులు శ్రీ బుద్ధవరపు వెంకటరత్నం. అలా ఏడాది, ఏణ్ణర్ధం నడచి, పత్రిక ఆగిపోయింది. తిరిగి ప్రారంభించాలనే ఆవేదన కొనసాగుతూనే ఉంది.

అప్పుడు నేను సంఘ ప్రచారక్‌గా పనిచేసేవాణ్ణి. వివిధ పత్రికలకు వ్రాసేవాణ్ణి. పత్రికా రంగంలో జరగవలసిన పని చాలా ఉంది అనే భావం నాలో ఉండేది. ఆ స్థితిలో సంఘ పెద్దలు శ్రీ బాపూరావ్‌ ‌మోఘే మనం పత్రిక పెట్టుకుందాం, నువ్వు బాధ్యత వహిస్తే ఆరంభం చేద్దాం, అంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. పత్రికా రచన రూపంలో జీవితాన్ని జాతీయ సేవలో గడుపుదాం అని నాకూ లోపల కోర్కె ఉంది. ఇదో వ్రతంలా అనుకుని దీనిలోకి దిగాను.

మొదటి సంచిక విజయనామ సంవత్సర విజయదశమినాడు వచ్చింది. అప్పటినుంచి 23 ఏళ్లు ఆ వ్రతం పాటించే అవకాశం కలిగింది, ఎమర్జెన్సీ దుమారం వచ్చేవరకు.

భండారు సదాశివరావు గారు సమర్ధత, భావుకత ఉన్నవారు. వయస్సులో కూడా పెద్ద. ఆ కొత్తలో ఆయన మంచి మార్గదర్శనం ఇచ్చారు. బాపూరావ్‌జీ మేధావి. ఏవేవి చదవాలో, ఎలా ఆలోచించుకోవాలో జటిలమైన విషయాలలో ఎవరి భావాలు దృష్టిలో పెట్టుకోవాలో మార్గదర్శనం చేసేవారు. గిరిధరరావు, వీరంరాజు వెంకటేశ్వర్లు, ఉగ్రశ్రీ వివిధ సమయాలలో బలమైన రచనలు ఇస్తూ పనికి సాయపడ్డారు.

మొదట్లో రెండు మూడేళ్లపాటు నిలకడైన సంపాదక సహాయం ఉండేది కాదు. ఆ తర్వాత కందర్ప రామచంద్రరావు ప్రచారక్‌ ‌బాధ్యత నుండి విరమణ చేస్తున్నప్పుడు ఆయనను జాగృతిలో సహాయానికి తీసుకోవడం జరిగింది. జర్నలిజం బొత్తిగా కొత్తే అయినా, తాత్త్విక అవగాహన, అధ్యయనంలో శ్రద్ధ వీటి వల్ల క్రమంగా నిలకడైన సహాయం అందించారు. అలా ఎమర్జెన్సీ దుమారం వచ్చేవరకు జాగృతిని సేవించుకుంటూ ఉండేవాళ్లం.

జాగృతి పత్రికా రూపంలో జాతీయోద్యమం అయినట్లే, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌పరంగా అది పత్రికా రూపంలో ఉన్న ఒక స్వయంసేవక్‌ అని అనుకుంటూ ఉండేవాణ్ణి.

అంటే ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పత్రిక అంటారా?

ఆ మాట అనడంలో మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. పత్రిక తనకై తాను సంఘ తత్త్వాన్ని స్వీకరించింది, స్వయంసేవకులాగా. కాని ఇది వ్రాసే ప్రతి మాటకీ, చేసే ప్రతి చేతకీ, దీని నిర్వహణ వ్యవహారానికి సంఘం బాధ్యత వహించజాలదు కూడా. పత్రిక నడిపేవారు విశాల సంఘతత్త్వ పరిధిలో తమ పత్రికా వ్యాసంగంలో యోగ్యంగా, ఆలోచిస్తూ పనిచేసేవారు. స్వయంసేవకులలోని ప్రముఖులతో, వివిధ రంగాలలో పనిచేస్తున్న మహనీయులతో నాకు చాలా సన్నిహిత పరిచయాలు ఉండేవి. దీనదయాళ్‌ ఉపాధ్యాయ, దత్తోపంత్‌ ‌ఠేంగ్డే, జగన్నాథరావ్‌ ‌జోషీ, బలరాజ్‌ ‌మధోక్‌, ‌కె.ఆర్‌. ‌మల్కానీ- ఇలా ఎందరెందరితోనో దేశం సంగతులు, సమాజం సంగతులు మాట్లాడే అవకాశం కలిగింది. అవన్నీ మా పనికి పుష్టి ఇచ్చేవి. మమ్మల్ని తాత్త్వికంగా దారి తప్పకుండా కాపాడుతుండేవి.

ఇంకా ఎవరెవరి ప్రభావం ఉండేది?

జాగృతికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఒక మహనీయుడు డాక్టర్‌ ‌రఘువీర. భాషాపరంగా ఆయన ఒక తపస్వి. క్షణక్షణం పెరిగిపోతున్న వైజ్ఞానిక, రాజకీయ, దౌత్య, సాంకేతిక పరిభాషలో భావాలు చెప్పుకోవలసిన అవసరం ఉన్న ఈరోజుల్లో పుష్టికరమైన, సంస్కృతి నిష్టమైన దేశీయ భాషలు కావాలని వక్కాణించేవారు. ఇవన్ని నిత్య వ్యవహార భాషలో రెండువేల మాటలలో ఎలా వ్యక్తం చేస్తారు అనేవారు. ఆ ప్రభావం పత్రిక మీద కొంచెం ఎక్కువ ఉండేది.

మీరు ఇంగ్లీషు వాడవద్దు. బజారు మాటలు వాడవద్దు, భాషను వికసింపజేసుకోవాలి అనేవారు బాబాసాహెబ్‌ ఆప్టే. మీరు నాగరిని, సంస్కృతాన్ని ఇక్కడ తీసుకురావాలి అనేవారు. ఈ ప్రభావం పత్రిక మీద ఉండేది.

గోవు అంటే కేవలం భక్తితో నమస్కరించడం అనుకునే జాతిలో గోవు అంటే జాతికి మహాలక్ష్మి సంపద, దానిని నాశనం చేసుకోవడం పాపమే కాకుండా జాతీయపరంగా ఆత్మవంచన అవుతుంది అనే అవగాహనను చాలా పెద్ద ఎత్తున కలిగించిన మహాశయుడు లాలాహరదేవ్‌ ‌సహాయ్‌. ఆయన అతి సన్నిహిత సహకారం మాకు లభించేది.

ప్రాంత సంఘచాలక్‌ ‌పిన్నమనేని లింగయ్య చౌదరి గారు పత్రికన• చాలా శ్రద్ధగా చదువుతూ, ప్రతి సందర్భంలో దాన్ని గురించి శ్రద్ధ పెట్టి చర్చిస్తూ ఉండడం ఎంతో ప్రోత్సాహంగా ఉండేది.

పరమపూజనీయ శ్రీ గురూజీ దేశమంతటికీ నిత్యనిరంతరంగా సందేశం ఇచ్చేవారు. ఆయన ఏమి చెప్పినా జాతి మొత్తానికి చెప్పేవారు. శ్రద్ధగా గ్రహించి ఎవరి ద్వారా వ్యాఖ్యానం పొందాలో పొందుతూ, సముచితంగా అన్వయం చేసుకోవడానికి ఒక విధంగా తపస్సులాగానే ప్రయత్నం చేసేవాళ్లం. దానిలో ప్రయోజనం చాలా ఉండేది. ఆత్మానందమూ చాలా ఉండేది.

జాగృతికి తత్త్వసంబంధమైన పరిధే కాని, ఒక సంస్థాగతమైన పరిధిగా అనిపించేది కాదు. ఎప్పు డైనా, ఏవైనా విషయాలు అడిగితే, అప్పట్లో సర్‌ ‌కార్యవాహగా ఉండే బాలాసాహెబ్‌ ‌దేవరస్‌గారు అనే వారు, మీకు తత్త్వం తెలుసు. స్వాభావిక రూపంలో దానిని అన్వయం చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్వయం చేసుకున్నా పెద్ద ఇబ్బంది ఏమీ అనుకో అక్కరలేదు. తత్త్వపరిధిలో ఉన్నంతవరకు.

విశ్వనాథ, ఇంద్రగంటి, పైడిపాటి జాతీయ ఉద్యమకారులూ, స్వయంసేవకులూ కారు కాని- జాతీయ భావాలకు సంబంధించినంత వరకు జాగృతికి ఆప్తులు. వారి ప్రశంస, విమర్శ ఎప్పటి కప్పుడు మాకు మార్గదర్శకాలుగా ఉంటుండేవి.

ఆనాటి ఉద్యమాలు సంస్థల విషయంలో జాగృతి ఎలాంటి పాత్ర వహించింది?

జాతి సేవలో బాధ్యత పెట్టుకున్న పత్రికగా ఓ రకంగా ఉద్యమకారుడులాగానే ప్రవర్తిస్తూ ఉండేది జాగృతి. మొదటి సంచికలోనే ‘‘గుండెమీద కుంపట్లు’’ అంటూ బుడతకీచులు, ఫ్రెంచివారు వదిలిపోవాలని అనే ఉద్యమం ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నెన్ని సంస్థలో ఉద్యమాలు నడుపుతూ వస్తే ఆ పనులన్నీ తనవిగా భావిస్తూ వాటికి పత్రికా వేదికగా ప్రవర్తించ డానికి ప్రయత్నించింది. గోహత్యా నిషేధం, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతం, జాతీయ భాషల పునరుత్థానం, వివేకానంద శతజయంతి ఉత్సవాలు మరెన్నెన్నో అలాంటివి.

అప్పట్లో సోషలిజం పేరుతో వెర్రివెర్రి ఆలోచనలు చేస్తుండేవారు. సమష్టి వ్యవసాయంలో ఆలోచనలు చేస్తుండేవారు. జాగృతి వాటిని తీవ్రంగా ఎదిరించింది. ఎన్‌.‌జి.రంగా ప్రభృతులు పత్రికను ప్రశంసిస్తూ ఉండేవారు.

జాగృతి జాతికి ఎదురవుతున్న ప్రమాదాల విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉండేది. ఈశాన్య భారతంలో విద్రోహం గురించి పొలికేకలు, క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, ప్రత్యేకంగా జాతీయత దృష్ట్యా కమ్యూనిజం వల్ల జరిగే ప్రమాదం – అన్నిట్లో బహుశా ఆ సమయంలో మరెవ్వరూ పలకని మేలుకొలుపు ఇది పలుకుతూ ఉండేది. ముస్లిం వర్గాల రాజకీయాలు కూడా  అప్పుడప్పుడు గుర్తింపబడుతూ వచ్చినా- దేశ విభజన జరిగిన తర్వాత 10-15 ఏళ్లలో ముస్లిం రాజకీయవర్గాలు కొంత అదుపులో ఉండేవి.

భారతీయత దృష్టిలో రోజురోజుకూ నిర్వీర్యం అవుతున్న జాతీయ జీవనంలో కొన్ని సిద్ధాంతాలను, కొన్ని సంస్థలను ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామి కావాలనే ప్రయత్నంలో ఎన్నెన్నో జాతీయ సాంస్కృతిక, ధార్మిక సంస్థలకు వేదికగా వ్యవహరిస్తూ ఉండేది జాగృతి. ఇప్పుడు బిజెపి చేపట్టిన ఏకాత్మ మానవతావాదం అప్పట్లో జనసంఘం ద్వారా ప్రతిపాదింపబడ్డప్పుడు జాగృతి దాన్ని ఒక పవిత్ర తాత్త్విక మహోద్యమంగా చేపట్టింది. అలాగే భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ఏర్పడ్డా, విశ్వహిందూ పరిషత్‌ ఏర్పడ్డా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఉద్యమాలు చేపట్టినా- భారతీయతకు ఆలంబనంగా ఉండే అలాంటి సంస్థలు అన్నింటినీ తనవిగా భావన చేసి వ్యవహరించింది.

పత్రికా రంగంలో జాతీయ సేవ అంటే ఏమిటో ముట్నూరివారి కృష్ణాపత్రిక ఒరవడి దిద్దింది. ఆ పద్ధతిలో నడవాలని జాగృతి ఉవ్విళ్లూరుతుండేది. దశాబ్ద్యుత్సవ సమయంలో అప్పటి అఖిల భారత జనసంఘ అధ్యక్షులు శ్రీ అవసరాల రామారావుగారు ‘‘జాగృతి అనీబీసెంట్‌ ‌నడిపిన ‘యంగ్‌ ఇం‌డియా’ పత్రికను జ్ఞాపకం చేస్తుంది’ అన్నప్పుడు ఆ పత్రిక ఏమిటో తెలియదు కాని, ఆనందం వేసింది.

జాగృతి చరిత్రలో ప్రత్యేకంగా పేర్కొనదగిన అంశాలు మరేమైనా చెబుతారా?

భాషాపరంగా చెప్పవలసి వస్తే- ఒక ప్రక్కన భాషా వివాదం కాల్పుల వరకు వెళుతున్న వాతావరణంలో, నిర్మాణాత్మకంగా దీని విషయంలో మనం ఏమి చేయగలం అని ఆలోచించింది. తెలుగు, హిందీ, సంస్కృతం మూడింటి సారూప్యతను నిరూపిస్తూ ఈ మూడింటినీ నేర్పే పాఠాలు ఈ సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారంగా భావించింది. సంవత్సరం పాటు ఆ పాఠాలు నడిపింది. డాక్టర్‌ ‌కర్ణ రాజశేషగిరిరావు గారు అందించిన ఆ పాఠాలతో ఉత్తరాదిన హిందీ తెలిసినవారు తెలుగు నేర్చుకొన డానికి ప్రయత్నించడం ఆనందం కలిగించింది. బాబాసాహెబ్‌ ఆప్టేగారు తెలుగు పద్యాలను నాగరి లిపిలో ఇవ్వమనేవారు. సంస్కృతనిష్టమైన తెలుగు పద్యాలను నాగరి లిపిలో ఇచ్చేవాళ్ళం. వాటి ద్వారా ఆ పద్యాలు తెలుసుకున్న ఔత్తరాహులు కనిపిస్తారు. వాటి ప్రభావ విస్తృతి సంగతి ఎట్లా ఉన్నా, ఆదర్శ సంబంధంగా అతి సున్నితమైన జిజ్ఞాసే నడుస్తూ ఉండేది.

రాజకీయ విషయాలలో ప్రజాస్వామ్యం, జాతీయత ఈ రెండు మాటలు ఆధారంగా జాగృతి నడవడం కనిపిస్తుంది. భారతీయ సిద్ధాంతం కారణంగా జనసంఘాన్ని సమర్థించడం జరిగినా, జాతీయత, ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతాలను పార్టీలకు అతీతంగా వక్కాణించడం జరిగింది. ఎన్నికల వ్యూహాల వంటి సమయాలు వస్తే వయం పంచధికం శతం. జాతికి మిత్రులైన రాజకీయ వర్గాల వారంతా కలసి జాతికి శత్రువులైన వర్గాల నుంచి జాతిని కాపాడండి అని ప్రసాదిస్తూ ఉండేది.

జాగృతి పత్రికలో విషయాలు జాతీయ ఉద్యమాలలో ప్రతిబింబాలుగా ఉండడమే కాకుండా అందులో పాత్రికేయ ప్రమాణాలక• కూడా సాధన జరిగేది. అందుకోసం జర్నలిజాన్ని అధ్యయనం చేయడం కూడా జరిగింది. 1970లో ప్రపంచ ప్రసిద్ధమైన థామ్సన్‌ ‌ఫౌండేషన్‌ ‌వారి ఎడ్వాన్స్‌డ్‌ ఎడిటోరియల్‌ ‌ట్రైనింగ్‌లో పాల్గొనడం కూడా ఆ దృష్టితోనే జరిగింది. అంతేకాదు పత్రికా రంగంలో ఒక పత్రికగా జాతీయ ప్రయోజనాల రక్షణకు కూడా ప్రయత్నించింది. ఆలిండియా న్యూస్‌పేపర్‌ ఎడిటర్స్ ‌కాన్ఫరెన్స్ (ఎఐఎన్‌ఈసీ)లో అతి శ్రద్ధాళువైన భాగస్వామిగా నిరంతరం పాల్గొంటూ ఉండేది. ఎమర్జెన్సీ సమయంలో పత్రికా రంగం అంతా అతి దీనమైన పరిస్థితిలో పడిపోయి ఏఐఎన్‌ఈసీ వంటి మహా సంస్థ కూడా ‘సెన్సార్‌’ అనే ఒక ఘాతుకం జరుగుతున్నదని రికార్డు చేయడానికి కూడా సాహసించని స్థితిలో పాట్నా సమావేశంలో పత్రికల కనీస స్వేచ్ఛా రక్షణకు, మితిమీరి ఉన్న సెన్సార్‌ ‌ప్రయత్నాలను నిరోధించడానికి భయంకర వాతావరణంలో జాగృతి పోరాడడం జరిగింది. అదే సమావేశంలో జాగృతి ఏఐఎన్‌ఈసీ స్టాండింగ్‌ ‌కమిటీకి పెద్ద సంఖ్య ఓట్లతో ఎన్నికైంది. ఒక పత్రికగా ఇలా జాగృతి పాత్రికేయ మూల్యాలు నిలపడానికి కూడా గణనీయమైన స్థాయిలో కృషిచేసింది.

జాగృతి చరిత్రలో 1975 నాటి ఎమర్జెన్సీ సమయం ప్రత్యేకంగా పేర్కొనదగి ఉంది. పత్రికలు నోరు మెదపడానికి వీలులేని స్థితిలో, ప్రభుత్వం పరమ రాక్షసంగా ప్రవర్తిస్తున్న స్థితిలో ఎట్టి పరిస్థితి లోనూ సిద్ధాంతాన్ని తప్పకుండా, జాగృతి కలిగిం చడం అనే తన ఆశయాన్ని తప్పకుండా చట్టాన్నీ సెన్సార్‌ ‌నిబంధనలనూ అతిక్రమించకుండా జాగృతిని నడిపే ప్రయత్నం జరిగింది. అది ఒక ఆనందప్రదమైన సాధన. ప్రతి దానిని అధికారులకు చూపవలసి వచ్చేది. ముందుగా యోగ్యులైన అధికారులు విజ్ఞతతోనే వ్యవహరించేవారు. అది ఒక విధంగా సంతృప్తికరమైన ఘట్టం. అయితే ప్రభుత్వ విధానంలో మూర్ఖత్వం తప్ప మరొకటి ఉండేది కాదు. చట్టం పరిమితుల్లోనే నీ మాట నీవు చెబుతున్నా దానికి సహనం ఉండేది కాదు. అందుచేత అరెస్టు చేస్తామనో, ప్రెస్‌ను సీలు వేస్తామనో దురుసుమాటలు మాట్లాడడమో, బెదిరించడమో చేసేది. ఈ మూర్ఖతకు తగిన స్థానిక సహాయ కలెక్టర్‌ ఒకరు ప్రభుత్వానికి దొరికారు. చట్టం ప్రకారం జాగృతిని ప్రభుత్వం ఏమీ అనలేదు. తాను చెప్పుకోదలచిన మంచిని జాగృతి చెప్పుకుంటే భరించే సహనం లేదు ప్రభుత్వానికి. ఇదీ ఆ పోరాట స్థితి. ఈ స్థితిలో కొంతకాలం పత్రికను నిలపడం మంచిదని ట్రస్టు భావించి నిలుపుదల చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌ ‌నుంచి నడపడమూ జరుగుతోంది.

జాగృతి ప్రత్యేక సంచికల విషయం ప్రస్తావిస్తారా?

ప్రత్యేక సంచికలు భారతీయతను వక్కాణించే వివిధ అంశాలను ప్రతిబింబిస్తాయి. సంచికలు అన్నింటినీ నేను అతి పదిలంగా భద్ర పరుచు కుంటున్నాను- అని జటావల్లభుల పురుషోత్తంగారు అన్నప్పుడు సంతృప్తి ఆనందం కలిగాయి.

ముఖ్యంగా రజతోత్సవ సంచికకు ఆధునిక భారతీయ జీవనరంగంలో భారతీయ తత్త్వ దర్శనానికి ఉపకరించే గ్రంథంగా ఒక ప్రత్యేకత ఉన్నది. భరతమాత ముఖచిత్రంతో వెలువడిన సంచిక, ‘‘వివేకానంద తత్త్వం ఈ నాటి అవసరం’’ ఆ భావనను అందించే సంచిక, అగస్త్య మహర్షి ముఖ చిత్రంతో, సర్వసమగ్ర సమాచారంతో దేశదేశాలలో భారతీయ సంస్కృతి విస్తృతిని వక్కాణించే సంచిక, శ్రీకృష్ణుని ముఖచిత్రంతో పరంపరాగతంగా వస్తున్న రాజనీతి శాస్త్రాన్ని వివరించిన సంచిక, విశ్వహిందూ పరిషత్‌ ఆవిర్భవించిన సందర్భంగా వివిధ సంప్రదాయాల మధ్య సమన్వయం ఉండవలసిన ఆవశ్యకతను ప్రతిపాదిస్తూ వటవృక్షం ముఖచిత్రంతో వెలువడిన సంచిక, గాంధీ శతజయంతి సందర్భంగా ఆయన సందేశంలోని మౌలిక విషయాలను అందించిన సంచిక, మరెన్నో.

జైసోమనాథ్‌, ‌మానదండ, ఉజ్జయినీ పతనం వంటి నవలలను ధారావాహికంగా ప్రచురించిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది.

జాగృతిని సమాజం ఎలా ఆదరించేది?

ఆదరణ అనే దాన్ని మీరు ఎలాంటి అర్థంలో వాడారోగాని సాధారణంగా విజ్ఞులైన సమాజికు లంతా మన్ననతోనే చూచేవారు. పెద్దస్థాయిలో పత్రికను ఆదరిస్తుండేవారా? అంటే- మనవాళ్లలో పత్రికలు చదివే అలవాటు కొంత తక్కువ. ఆ చదివేవాళ్లు కూడా కాలక్షేపానికో, తమ వినోదానికో చదవడం ఎక్కువ. అందువల్ల సిద్ధాంతపరమైన, ఆశయ నిష్టతో ఉండే పత్రికల పరిధి స్తిమితంగానే ఉంటుంది. దానికి తోడు జాగృతిలో గంభీర చింతన ఉన్నంతగా జనాకర్షక చిట్కాలు గెటప్‌, ‌టెక్నిక్‌లు వగైరా ఏమంతా ఉండేవి కాదు. మరో అంశం జాగృతి తన తత్త్వచింతనలో అఖండ భారత భావానికి, విశాల రాష్ట్రీయ చింతనకే ఎక్కువ శ్రద్ధ చూపేది. ప్రాంత, వర్ణ, వర్గ భావాలకు ప్రాధాన్యం ఇచ్చేది కాదు. అందుచేత ప్రాంతీయ విషయాలు గాని విభిన్న సామాజిక వర్గాల సమస్యలకు సంబంధించిన విషయాలు గాని ఏమంత ఉండేవి కాదు. జాగృతి పాఠకుల చింతన కూడా ఇలాగే ఉండేది. పాఠకులతో బాగా అనుసంధానం ఉన్న పత్రిక జాగృతి. వారి ప్రభావం పత్రిక మీద ఎక్కువగా ఉండేది. వారి అభిరుచులకే దగ్గరగా ఉండేది. ఈ అన్ని కారణాల వల్ల విశాల సమాజంలో విక్రయ పరంగా జాగృతి పరిధి స్తిమితంగానే ఉండేది. వివిధ విషయాల్లో ఇటీవలికాలంలో జనసామాన్యానికి మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు పెరగడం కనిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి ప్రస్తుత నిర్వాహకులు సమర్థులు.

వర్తమానంలో జాగృతిని గురించి మీరు ఎలా భావిస్తారు?

చెప్పాను కదా! జన సామాన్యానికి మరింత చేరువ అయ్యే ప్రయత్నం పాలు పెరిగిందనిపిస్తుంది. అసలు వార్తా పత్రికలనేవి వర్తమానంతో సంబంధం ఉండేవి. నాడు గానీ, నేడు గాని, ఏనాడు గాని జాగృతి ఆశయ ప్రధానమైన పత్రిక గనుక, భావ సామ్యత గల పరిస్థితి విస్తృతి ప్రభావం సహజంగా దీనిమీద ఉంటుంది. రాష్ట్ర నిష్ట, హిందుత్వ నిష్ట ఇత్యాదుల భావ సామ్యత, ఇప్పుడు ఈ సంస్థల విస్తృతి, కార్యకలాపాలు చాలా పెరిగాయి. ప్రాంత, వర్ణ, వర్గ సమస్యలన్నింటినీ గురించి ఈ సంస్థలన్నీ సకారాత్మకంగా చాలా ఆలోచిస్తున్నాయి, సేవలు అందిస్తున్నాయి. జాతీయ జీవనరంగాలన్నిటిలోను అవి ప్రవేశించి కృషి చేస్తున్నాయి. ఎక్కడో మారుమూల కొండల్లో ఉండే వనవాసుల మొదలు, నట్టనడి నగరాల్లోని ప్రజల వరకు దాని వ్యాప్తి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా అర్ధ శతాబ్దంగా జాతి మీద రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువయి పోయింది. ఆ రాజకీయాలు జాతీయతకు, పరంపరా గత సంస్కృతికి, శౌర్య సత్యధర్మాలకు పూర్తిగా దూరంగా ఉన్నాయి. పైగా వానిపై యుద్ధం చేసేవిగా కూడా తయారైనాయి. చివరకు స్వరాజ్య లక్ష్యమే భగ్నమై, జాతీయ సాంస్కృతిక జీవన వికాసమే కుంటుబడే స్థితి. అసలు ఈ జాతి ప్రాచీనమైనదే కాదని, 50 ఏళ్ల క్రితం పుట్టిన ఒకే చిన్న రాజకీయ జాతి అన్నట్లు వ్యవహరించే వరకు కథ సాగింది. అయితే ఇప్పుడు రాజకీయరంగంలో పరిణామాలు ఆరంభమై పరంపరాగత జాతీయ సంస్కృతికి మాన్యతనిచ్చే వర్గాలు కేంద్ర స్థానానికి వచ్చాయి, వస్తున్నాయి. జాతిని సంబాళించుకునే బాధ్యత వారి మీదకు వచ్చింది. వీటన్నిటి ప్రభావాలు జాగృతి మీద సహజంగా ఉంటాయి. జాగృతి కృషి విస్తృతి పెరగడం గమనిస్తాం. ఒకవిధంగా ఇది జాతీయ జీవనంలో చారిత్రక సంధి ఘట్టం అనాలి. అందువల్ల వర్త మానంలో జాగృతి పాత్ర ఈ సంధి ఘట్టానికి అనుగు ణంగానే భావిస్తాను. ఈ కృషిలో జాగృతికి విశాల సమాజం నుండి మంచి మద్దతును ఆశిస్తాను.

———————

సందేశం

– ‘‘ఔమాకాస్త’’

‘‘జాగృతి’’ పత్రికకు నా ఆశీర్వచనాలు, అభినందనాలు. కల్లోలిత విశ్వంలో నైతక పతనం ఆవహించి యున్న మానవ జీవితాన్ని ఉద్దరించాలంటే, ధర్మ ప్రదిపాదిత సిద్ధాంతాలు ఆచరణ రూపం దాల్చాలంటే శాంతి, ప్రేమ, అహింస మళ్లీ నవజీవనం పొందాలంటే కావలసింది జాగృతి. సాహిత్యంలో జాగృతి, ఆర్థిక జీవనంలో జాగృతి, రాజకీయ దృక్పథాల్లో జాగృతి, సర్వతోముఖ జీవనంలో జాగృతి. జాగృతికి అలసట శత్రువు. ఆకర్మణ్యత, అజ్ఞానం, అంధానుకరణం, దురభిమానం దాన్ని అణచివేస్తూ ఉంటవి. వీటనన్నింటినీ ఉద్గమించి ప్రవాహ వేగంలో అచల స్థాణవువలె నిలువగల సందేశాన్ని ‘జాగృతి’ పత్రిక మానవలోకానికి అందించుగాక.

(జాగృతి 18-12-48 సంచిక నుండి)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram