‌నవంబర్‌ 17 ‌మాన్‌గఢ్‌  ‌సంస్మరణ దినం

నవంబర్‌ 17, 1913 ‌మాన్‌గఢ్‌ ‌దురంతం.

ఏప్రిల్‌ 13, 1919 ‌జలియన్‌వాలా బాగ్‌ ‌రక్తకాండ.

ఈ రెండూ భారతదేశ సమీప గతంలోని దుర్ఘటనలు. ఆధునిక మారణాయుధాలతో నిరాయుధులను చుట్టుముట్టి ఊచకోత కోసిన ఉదంతాలు. వీటి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. కానీ జలియన్‌వాలా బాగ్‌ ‌చరిత్ర ప్రసిద్ధమైంది. ఈ రక్తపాతం గురించి ఇంగ్లండ్‌ ‌కూడా స్పందించింది. ప్రపంచం నివ్వెరబోయింది. రవీంద్ర కవీంద్రుడు, గాంధీజీ బిరుదులు త్యజించారు. భారతావని కన్నీరుమున్నీరైంది. బాగ్‌లో 379 మంది చనిపోయారని బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వం చెబితే, మరణాలు వేయికి పైనేనని ఆర్యసమాజ్‌ ‌నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు స్వామి శ్రద్ధానంద గాంధీజీకి తెలియచేశారు. కానీ మారుమూల భారతదేశంలో, ఆరావళీ పర్వతాలలో మాన్‌గఢ్‌లోను ఇలాంటి దుర్ఘటనే జరిగింది. సంప్రదాయక ఆయుధాలు మాత్రమే ధరించి పూజలు చేసుకుంటున్న భిల్లుల మీద చుట్టూ ఉన్న కొండల మీద నుంచి బ్రిటిష్‌ ‌బలగాలు, కొన్ని స్వదేశీ సంస్థానాల సేనలు కాల్పులు జరిపాయి. వేయి నుంచి పదిహేనువందల మంది ప్రాణాలు కోల్పోయారని ఆధారాలు చెబుతున్నాయి. ఇదేకాదు, మన కొండకోనలలో ‘మాన్‌గఢ్‌’‌లు చాలానే జరిగాయి. అవి అక్షరబద్ధం కాకపోవడం, అందుకు ప్రయత్నం జరగకపోవడం అతి పెద్ద మేధో నేరం.


పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్‌ ఉదం తంతో దాదాపు సమానమైన రక్తకాండ రాజస్తాన్‌- ‌గుజరాత్‌ ‌సరిహద్దులలో ఆరావళి పర్వతసానువులలో ఉన్న మాన్‌గఢ్‌ ‌కొండ మీద జరిగింది. ఆ దారుణ దురంతం జరిగిన రోజు- నవంబర్‌ 17, 1913. ‌దాదాపు పదిహేను వందల మంది ప్రాణాలు కోల్పోయారని మౌఖిక ఆధారాలే కాదు, చారిత్రక పత్రాలు కూడా చెబుతున్నాయి. ఆ మృతులంతా భిల్లు గిరిజనులే. పురుషులు, వారిలో వృద్ధులు, పసివారు, స్త్రీలు ఎవరినీ వదిలిపెట్టలేదు. అంటే పంజాబ్‌లో బయటపడిన జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం ఉంటే, గుజరాత్‌లో బయటపడని జలియన్‌వాలా బాగ్‌ ‌దుర్ఘటన ఉంది. వాటి మధ్యదూరం కేవలం ఆరేళ్లు. దేశంలో గిరిజన పోరాటాలన్నీ సాయుధ పోరాటాలే. అన్నీ బ్రిటిష్‌ అరాచకం మీద జరిగిరనవే. నిజానికి భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించడానికి చాలా ముందే ఆరంభమయ్యాయి.

భిల్లులు మహారాష్ట్ర, గుజరాత్‌, ‌రాజస్తాన్‌, ‌మధ్యప్రదేశ్‌లలో విస్తరించి ఉన్నారు. మహారాష్ట్రలోని ఖాందేష్‌ ‌ప్రాంతానికి ఒకప్పుడు వీరు పాలకులు కూడా. ఈస్టిండియా కంపెనీ, తరువాత బ్రిటిష్‌ ఇం‌డియా ఏలుబడిలో ఈ నేల మీద నరకయాతన పడని గిరిజన తెగ దాదాపు లేదు. ఆ త్యాగాలు, రక్తతర్పణలు చరిత్ర పుటలకు చేరలేదు. కానీ ప్రజలు పాడుకునే వీరగాథలుగా వారి నాల్కల మీద నిలిచే ఉన్నాయి. అందుకే ఏ పరిశోధకుడు, చరిత్రకారుడు అటు చూడకపోయినా ఇప్పటికీ ఈ గాథలు బతికి ఉన్నాయి. భిల్లులది అలాంటి విషాద చరిత్రే. అలాగే చరిత్రపుటలకు ఎక్కకుండా ఆగిపోయినదే. 19వ శతాబ్దంలో ఆరంభమైన వీరి మీద అణచివేత, 20 వ శతాబ్దం ఆరంభానికి తీవ్రరూపం దాల్చింది. వీరిలో ఎక్కువ మంది వెట్టి చాకిరిలో బందీలై ఉండేవారు. పైగా వ్యవసాయంలో ఉండేవారు. దీనికి తోడు 1899-1900 సంవత్సరంలో దక్కను, బొంబాయి ప్రెసిడెన్సీలలో ప్రబలిన దుర్భిక్షం భిల్లుల పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. ఆ ప్రెసిడెన్సీలో ఆరులక్షల మంది గిరిజనులు దుర్భిక్షం బారిన పడ్డారు. బన్స్వారా, సంత్‌రాంపూర్‌ ‌సంస్థానాలలో కూడా దుర్భిక్షం తీవ్ర ప్రభావం చూపించింది.

ఇలాంటి విషాద నేపథ్యం నుంచి భిల్లు సమాజంలో సంస్కరణోద్యమం అంకురించింది. దీనికి నాయకుడు గోవింద్‌ ‌గిరి (1858-1931). ఆయననే ప్రజలు సగౌరవంగా గోవింద్‌ ‌గురు అని పిలుచుకునేవారు. తాను ప్రారంభించిన భగత్‌ ఉద్యమ విస్తరణ కోసం ఆయన గ్రామస్థాయిలో సాంఫ్‌ ‌పేరుతో సంఘాలను నెలకొల్పారు. ఆయన రాజస్తాన్‌లోని దుంగర్‌పూర్‌లో ఒక సంచార జాతిలో జన్మించారు. సంత్‌రాంపూర్‌ ‌సంస్థానంలో వెట్టి చాకిరి చేసేవారు. దుర్భిక్షంతో ఇక్కట్లు పడుతున్న సమయంలోనే ఆయన భిల్లులతో చేతులు కలిపారు. అప్పటికి పలువురు భిల్లులు భుక్తి కోసం బందిపోట్లుగా మారిపోయారు. భిల్లులు ఇంత దారుణ స్థితికి దిగజారిపోవడానికి రాజకీయ, సామాజిక కారణాలతో పాటు, వారి తాగుడు వ్యసనం కూడా కారణమేనని గోవింద్‌ ‌గురు భావించారు. ఈ దుస్థితి నుంచి వారిని కాపాడేందుకు ప్రారంభించినదే ‘భగత్‌ ఉద్యమం’. ఇది 1890 ప్రాంతంలో మొదలై 1908 నాటికి బాగా బలపడింది. అది పూర్తిగా హిందూధర్మం పునాదిగా ఆరంభమైన పునరుజ్జీవనోద్యమం. సనాతన హిందూ ధర్మాన్ని మళ్లీ ఆచరించడం, శాకాహారం, వ్యసనాలకు దూరంగా ఉండడం ఈ ఉద్యమ సూత్రాలుగా ఆచరించేవారు. ఈ పంథాలో భిల్లులను ఏకం చేసిన గోవింద్‌ ‌గురు అసలు ఉద్దేశం ‘బెత్‌ ‌బెగార్‌’ (‌కట్టు బానిసత్వం)నుంచి వారికి విముక్తి కల్పించడమే. వారి హక్కులకు రక్షణ కల్పించడమే. 1910లో భిల్లు నాయకులు ప్రభుత్వానికి ఇచ్చిన 33 కోర్కెల జాబితాలో వెట్టి విముక్తి కూడా ఉంది. అధిక పన్నులు, భిల్లులపై వేధింపులు ఆపాలని కూడా వారు కోరారు. అయితే ఈ ఉద్యమం అంతా సంస్థానాలలో జరిగింది కాబట్టి, వారి ఆరోపణ అంతా సంస్థానాల పోలీసుల మీదనే. బన్స్వార్‌, ‌సంత్‌రాంపూర్‌ ‌సంస్థానాలతో పాటు దుంగార్‌పూర్‌ ‌సంస్థానంలో కూడా ఈ ఉద్యమం విస్తరించింది. ఇది భిల్లు తెగ జనజాగరణగా చెబుతారు. ఈ ఉద్యమం, దానితో వచ్చిన చైతన్యంతో భిల్లులు తమకు మెరుగైన వేతనం కోసం గళం ఎత్తారు. అదే చివరికి సాయుధ పోరుగా పరిణమించింది. వీరంతా పనులకు దూరం కావడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినే పరిస్థితి వచ్చింది. భిల్లుల ఉద్యమం సంస్థానాధీశుల అకృత్యాల మీద ఆరంభమైంది. నాటి సంస్థానాలలో అత్యధిక భాగం ఇంగ్లిష్‌ ‌ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేవి. సంస్థానాధీశులు వ్యక్తిత్వం లేనివారు, వ్యసనపరులు. భిల్లుల పోరాటాల అణచివేత సంస్థానాధీశుల సేనలు, బ్రిటిష్‌ ‌ప్రభుత్వ బలగాలు కలసిన ఫలితమే.

తన పోరాటంలో భాగంగానే గోవింద్‌ ‌గురు, ఆయన ముఖ్య అనుచరులు 1913 నవంబర్‌లో మాన్‌గఢ్‌ ‌వచ్చారు. ఇది బన్స్వారా, సంత్‌రాంపూర్‌ ‌సంస్థానాల మధ్యలో ఉంది. ఆ కార్తికమాసంలో పున్నమికి (నవంబర్‌ 13) అం‌తా కలసి పండుగ చేసుకుందామని భిల్లులను ఆయన ఆహ్వానించారు. ధుని పేరుతో వెలిగించిన పెద్ద మంట కేంద్రంగా ఈ ఉత్సవం జరుగుతుంది. అది అప్పటికి పదేళ్ల నుంచి అంటే 1903 నుంచి ఆయన నిర్వహిస్తు న్నారు. భిల్లులను ఏకం చేయడానికి గోవింద్‌ ‌గురు ప్రవేశపెట్టిన సామాజికోత్సవం అది. గిరిజన ఆచారాలు స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన ప్రబోధించేవారు. భిల్లులంతా తమ తమ నివాసాల దగ్గర కూడా ధుని రాజేసి, జెండా ఎగురవేయాలని ఆదేశించారు. గోవింద్‌ ‌గురు పిలుపునందుకుని 1913లో అడవి మధ్యలో ఉన్న మాన్‌గఢ్‌కు భిల్లులు వెల్లువెత్తారు. లక్షన్నర మంది చేరుకున్నారు. ఇంత పెద్ద భిల్లు సమూహం అక్కడికి చేరడానికి కారణం సంత్‌రాంపూర్‌, ‌బన్స్వారా సంస్థానాధీశులను కూల్చడం కోసమేనని ఎవరో వదంతి లేవదీశారు. దీనితో ఆ సంస్థానాధీశులు బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఆ ఇద్దరు సంస్థానాధీశులు కోరిందే తడవుగా బ్రిటిష్‌ ఉద్యోగి ఆర్‌యీ హ్యామిల్టన్‌ ‌చర్యలకు ఉపక్రమించాడు. ఇందుకోసం హ్యామిల్టన్‌ ఆదేశాల మేరకు దుంగాపూర్‌, ‌బన్స్వారా, సంత్‌రాంపూర్‌ ‌సైన్యాలతో పాటు, మేవార్‌ ‌సంస్థానంలోని భిల్లు దళం సహా వెళ్లి మాన్‌గఢ్‌ను చుట్టుముట్టారు. దీనికి బ్రిటిష్‌ ‌సైనికాధికారి కల్నల్‌ ‌షెర్టాన్‌ ‌నాయకత్వం వహించాడు. ఇతడికి మేజర్‌ ఎస్‌ ‌బెయిలీ, కెప్టెన్‌ ఇ. ‌స్టిలే సహకారం అందించారు. వీరి వెంట తుపాకులు, ట్యాంకులు కూడా తీసుకువెళ్లారు. భిల్లులంతా ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని నవంబర్‌ 15‌న ఆదేశాలు ఇచ్చారు. అక్కడ నుంచి ఖాళీ చేయడానికి కాని, లొంగిపోవడానికి కాని భిల్లులు అంగీకరించలేదు. అప్పుడు తమ తాతలు ఎలాంటి నినాదం ఇచ్చారో కూడా అక్కడి వారు ఇప్పటికీ చెబుతారు, ‘ఓ బురేతియా. నయీ మను రె, నయీ మను’ (ఓ బ్రిటిష్‌ ‌జాతీయుడా! మేం తలొంచం తలొంచం).

ఇలా సంస్థానాల సేనలు మాన్‌గఢ్‌ ‌చుట్టూ మోహరించి ఉండగానే కొన్ని సంఘటనలు జరిగాయి. సంత్‌రాంపూర్‌ ‌సంస్థానంలోని ఒక పోలీసు స్టేషన్‌ ‌మీద గోవింద్‌ ‌గురు కుడిభుజమని చెప్పదగిన నాయకుడు దాడి చేశాడు. ఆ దాడిలో ఇన్‌స్పెక్టర్‌ ‌గులాం మహమ్మద్‌ ‌చనిపోయాడు. ఇలాంటి దాడులే ఆ సంస్థానాలలో కొన్ని చోట్ల వెంటవెంటనే జరిగాయి. దీనితో అప్పటికే మాన్‌గఢ్‌ ‌కొండ చుట్టూ మోహరించిన తుపాకులు, ట్యాంకులు పేలడం మొదలయింది. ఆటోమేటిక్‌ ‌గన్నులు సైతం ఉపయోగించారు. ఎంత నిర్దాక్షిణ్యంగా హత్యాకాండ సాగిందో అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీరంతా ఆ దమనకాండను చూసిన వారికి, లేదా దాని నుంచి బయటపడినవారి మనుమలు, మనుమరాండ్రే. కాల్పులు మొదలు కాగానే కొందరు గుహలలో దూరి ప్రాణాలు దక్కించుకున్నారు. ఎందరో ఆ ఉత్సవం జరిగిన మాన్‌గఢ్‌ ‌కొండ మీద నుంచి తప్పించుకునే క్రమంలో లోయలోకి జారిపడి మరణించారు. ఇక తుపాకీ తూటాలకు బలై, అక్కడికక్కడే మరణించినవారు మరీ ఎక్కువ. కంచర గాడిదల మీద ట్యాంకులను మోసుకువచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డారని వారసుల కథనాల వల్ల తెలుస్తుంది. భిల్లులంతా ఆ కొండను విడిచిపెట్టి వెళ్లాలని చెబుతూ బ్రిటిష్‌ అధికారులు చర్చలు జరిపారు. అవి విఫలం కావడంతోనే కాల్పులు మొదలయినాయి. తల్లి చనిపోయిందని తెలియని ఒక చిన్నారి స్తన్యం గ్రోలడానికి ప్రయత్నించడం చూసిన ఒక బ్రిటిష్‌ అధికారి కాల్పులు ఆపమని ఆదేశించాడని కూడా వారు చెబుతారు. కాల్పులలో ఎందరో చనిపోయారు. ఎందరినో అరెస్టు చేశారు. తరువాత మళ్లీ అరెస్టయిన వారి జాడలేదని కూడా వారసులు చెబుతారు. వారంతా ఏమైనట్టు? సమాధానం కష్టమేమీ కాదు.

గుజరాత్‌ ‌రాష్ట్ర అటవీశాఖ ఇటీవల వెలుగులోకి తెచ్చిన పుస్తకం ‘ది చీఫ్‌ ఏక్టర్‌ ఆఫ్‌ ‌ది మాన్‌గఢ్‌ ‌రివల్యూషన్‌’. ఇం‌దులో గోవింద్‌ ‌గురు ఔన్నత్యాన్ని తెలియచేయడమే కాకుండా, మాన్‌గఢ్‌ ‌యుద్ధం ఎంత ఘోరమో కూడా నమోదు చేశారు. ‘మెషీన్‌ ‌గన్నులు, ట్యాంకులు కూడా భిల్లుల మీద జరిపిన ఆ దాడిలో ఉపయోగించారు. తూటాలు, మందుగుండు దట్టించిన తుపాకులు, ట్యాంకులను కంచరగాడిదలు, గాడిదల మీద అటు మాన్‌గఢ్‌ ‌కొండ మీదకి, ఇటు చుట్టుపక్కల కొండల పైకి తరలించారు. ఈ దాడి బ్రిటిష్‌ అధికారులు మేజర్‌ ఎస్‌ ‌బెయిలీ, కెప్టెన్‌ ‌స్టోయ్లి నాయకత్వంలో జరిగింది’ అని ఆ పుస్తకంలో రాశారు. ‘చాలామంది భిల్లులు చనిపోయారు. దాదాపు 900 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. మాన్‌గఢ్‌ ‌కొండను ఖాళీ చేయాలన్న తమ ఆదేశాలను భిల్లులు అంగీకరించనందుకే కాల్పులు జరిపారు’ అని అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు రిమా హూజా తన పుస్తకం ‘ఏ హిస్టరీ ఆఫ్‌ ‌రాజస్తాన్‌’‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 14,1914న ఆర్‌పి బరో అనే బ్రిటిష్‌ అధికారి ఇచ్చిన ప్రకటన ఆధారంగా హుజా ఈ విషయం వెల్లడించారు. గోవింద్‌ ‌గురు అనుయాయుడు పూంజా ధిరీజ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించి అండమాన్‌ ‌జైలుకు పంపారు. మాన్‌గఢ్‌ ‌దురంతానికి ‘ఆదివాసీ జలియన్‌వాలా బాగ్‌’ అన్న పేరు స్థిరపడింది. బ్రిటిష్‌ ‌బలగాలది అప్పటికి ఆధునిక ఆయుధ సామగ్రి. కానీ భిల్లులు సంప్రదాయక ఆయుధాల మీదనే ప్రధానంగా ఆధార పడ్డారు. విల్లంబులు, బరిసెలు, కత్తులు ఉపయోగించారు. ఇదే దృశ్యం మిగిలిన గిరిజన పోరాటాలలో కూడా కనిపిస్తుంది.

మాన్‌గఢ్‌ ‌కాల్పులు భిల్లులను ఎంతగా విచలితం చేశాయంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొన్ని దశాబ్దాల పాటు అక్కడికి పోవడానికి ఆ తెగవారు సాహసం చేయలేదు.

ఈ ఘోరకలి తరువాత గోవింద్‌ ‌గురు, మరికొందరిని ఫిబ్రవరి 11, 1914న అరెస్టు చేశారు. అదే ఆరోపణ- బన్స్వారా, సంత్‌రాంపూర్‌ ‌సంస్థానాల ప్రభుత్వాలను కూల్చడానికి కుట్ర పన్నినందుకే భిల్లుల మీద చర్య తీసుకున్నామనే.

యావజ్జీవ జైలు శిక్ష విధించినప్పటికి గోవింద్‌ ‌గురును 1919లో జైలు నుంచి విడుదల చేశారు. సత్ప్రవర్తన కారణంగా, గిరిజన తెగలలో ఆయనకు ఉన్న ఖ్యాతి వల్ల విడుదల చేయవలసి వచ్చింది. కానీ ఆయన అనుచరులు విశేషంగా ఉన్న అన్ని ప్రాంతాలలోను ఆయన అడుగుపెట్టకుండా బహిష్కరించారు. చివరికి గోవింద్‌ ‌గురు 1931లో గుజరాత్‌లోని లింబ్ది అనేచోట కన్నుమూశారు. 1952లో కొందరు భిల్లు తెగ గిరిజనులు మాన్‌గఢ్‌ ‌వెళ్లి తొలిసారి అక్కడ గోవింద్‌ ‌గురుకు, ఇతర వీరులకు నివాళి ఘటించి వచ్చారు.

నవంబర్‌ 1‌వ తేదీన జరిగిన మాన్‌గఢ్‌ ‌ధామ్‌ ఉత్సవంతో ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర రచనలో జరిగిన మరొక తప్పిదాన్ని సవరించే పక్రియకు శ్రీకారం చుట్టారు. మొదట ఆయన ముండా తెగ మహానేత బిర్సా ముండా ప్రతిమను పార్లమెంట్‌ ‌ప్రాంగణంలో ఆవిష్కరించారు. తరువాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విశాఖ మన్యం వీరుడు అల్లూరి శ్రీరామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ అన్ని కార్యక్రమాలకు ఆయన స్వయంగా హాజరయ్యారు. చరిత్ర పుటలలో మరుగున పడిన మహనీయుల చరిత్రను, మహా పోరాటాలను, గిరిజనుల త్యాగాలను ఆ విధంగా వెలుగులోకి తెచ్చే పనిని ఆయన చేశారు. ఇది గతంలో ఏ ప్రధాన మంత్రి చేయని గొప్ప కార్యక్రమం. మన స్వాతంత్య్రోద్యమ విస్తృతినీ, పరిధినీ ఇప్పటికైనా దేశ ప్రజల ముందుకు తెచ్చే మహా ప్రయత్నం కూడా. ఆ విధంగా మోదీ అభినందనీయులు. స్వతంత్ర భారతదేశ గమనంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మరొకసారి చెప్పారు. మాన్‌గఢ్‌లో జరిగిన సంస్మరణ కార్యక్ర మంలో రాజస్తాన్‌, ‌మధ్యప్రదేశ్‌ , ‌గుజరాత్‌ ‌ముఖ్య మంత్రులు కూడా పాల్గొని ప్రధానితో కలసి భిల్లు స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి ఘటించారు. ప్రధాని పదే పదే ప్రస్తావిస్తున్న ఆ పొరపాట్లలో కొన్ని ఉద్దేశ పూర్వకంగా జరిగినవీ ఉన్నాయని అంగీకరించాలి.

భారత జాతీయ కాంగ్రెస్‌ ‌చరిత్రనే ప్రధానంగా దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రగా చిత్రించడానికి కొందరు దేశాధినేతలు చేసిన తప్పిదం వాటిలో ఒకటి. దేశాధిపతుల ఆజ్ఞలకు తలొగ్గి చరిత్రకు అన్యాయం చేసిన చరిత్రకారుల తప్పిదం కూడా చెప్పదగినదే. వామపక్ష చరిత్ర కారులుగా చలామణి అయినవారు కూడా ఈ తప్పిదానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల, బడుగ బలహీన వర్గాల చరిత్ర నమోదు కానిదే చరిత్రకు పరిపూర్ణత రాదు అని చెప్పే వీరు వాస్తవికంగా అలాంటి ప్రయత్నానికి సుదూరంగా ఉండిపోయారని చరిత్రపుటలకు ఎక్కని అనేక గిరిజన పోరాటాల చరిత్రను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికైనా ఆ చరిత్ర వెలుగులోకి వస్తున్నది. మైదాన ప్రాంతాల వారే కాదు, గిరిజనులు, బడుగులు ఎవరు స్వాతంత్య్రోద్యమం కోసం త్యాగం చేసినా వారందరి చరిత్ర నమోదు చేయడం జాతి కర్తవ్యం. అందుకు ఎవరు ప్రయత్నించినా సహకరించడం ఇప్పుడు అందరి మీద ఉన్న బాధ్యత.

———————

మోదీ వచ్చాకే…

గోధ్రాలో 2015లో నెలకొల్పిన విశ్వవిద్యాలయానికి గోవింద్‌ ‌గురు పేరే పెట్టారు. గోవింద్‌ ‌గురు, ఆయన నడిపిన భగత్‌ ఉద్యమం ఇప్పటికీ భిల్లుల తలపులలో నిలిచే ఉంది. మాన్‌గఢ్‌ ‌రక్తపాతం కూడా వారిని పీడకలలా వెంటాడుతూనే ఉంది. అయినా నాలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న భిల్లుల ఈ వీరగాథ చరిత్ర పుటలలో చోటు సంపాదించలేదు. నరేంద్ర మోదీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ చరిత్రను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఆరంభించారు.  గోవింద్‌ ‌గురు మనుమడు మాన్‌సింగ్‌ను మోదీ ఒక సందర్భంలో సత్కరించారు. మాన్‌గఢ్‌ ‌మీద ఒక వృక్షశాస్త్ర సంబంధ వనాన్ని ఏర్పాటు చేసి దానికి గోవింద్‌ ‌గురు పేరు పెట్టారు. జూలై 31, 2013న జరిపిన గోవింద్‌ ‌గురు సంస్మరణోత్సవానికి 80,000 మంది భిల్లులు హాజరై ఆ మహనీయుడికి శ్రద్ధాంజలి ఘటించారు. అప్పటి నుంచి మాన్‌గఢ్‌ ‌దురంతం బయటి ప్రపంచం దృష్టికి వచ్చింది.

———————

విల్లు ఎత్తిన వాడే భిల్లు

భారత ధనుష్‌ ‌పురుషులు అని భిల్లులకు పేరు. వీరంతా విలుకాళ్లు. భిల్లు అన్న పదం విల్లు నుంచి వచ్చిందని చెబుతారు. విల్లును తయారు చేసే విద్యతో పాటు విలువిద్యలోనూ వీరిది అందె వేసిన చేయి. వీరికి మంచి వర్తక ప్రావీణ్యం కూడా ఉంది. ఏకలవ్యుడి తల్లిదండ్రులు భిల్లు తెగవారేనని అంటారు. ఆ విధంగా వీరు హిందూ జీవన స్రవంతిలోని వారేనని అర్ధం చేసుకోవాలి. నిజానికి ఏ గిరిజన తెగనైనా హిందూ జీవన స్రవంతికి బయట ఉంచాలనుకోవడం  అశాస్త్రీయమే కూడా. గుజరాత్‌, ఎం‌పీ, మహారాష్ట్ర, రాజస్తాన్‌లలోనే కాదు, చత్తీస్‌గఢ్‌, ‌త్రిపుర ప్రాంతాలలో కూడా భిల్లు తెగవారు ఉన్నారు. ఈ అన్ని ప్రాంతాలలో ఉన్న భిల్లులను కలిపితే, భారతీయ గిరిజనులలో వారే అత్యధిక సంఖ్యాకులు. ఘుమర్‌ ‌పేరుతో పిలిచే ఒక నృత్య సంప్రదాయం వీరిదే. తాము బాల్యం నుంచి యౌవనదశలోకి వచ్చామని సంకేతిస్తూ ఆ తెగ బాలికలు ప్రధానంగా ఈ నృత్యం చేస్తారు.

అడవిలో అడుగు పెట్టే అవకాశం, హక్కు కోల్పోయిన మరుక్షణం గిరిజనులు తిరుగుబాటు చేయడం చరిత్ర. నిజానికి గిరిపుత్రులు ప్రశాంతంగా జీవించడానికే ఇష్టపడతారు. కానీ ఈస్టిండియా కంపెనీ తెచ్చిన అటవీ చట్టాలు వారి ప్రశాంత జీవనాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. దానితో భారతదేశంలోని నలుమూలలా ఉన్న కొండకోనలు తిరుగుబాట్లతో ప్రతిధ్వనించాయి. భిల్లులు కూడా అదే చేశారు. ఈస్టిండియా కంపెనీ మీద 1818లోనే వీరు తిరుగుబాటు చేశారు. రాజపుటానాలో కంపెనీ అధికారుల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆయుధం ఎత్తారు. మొదట స్నేహహస్తం చాచిన కంపెనీ అధికారులు తరువాత అడవి మీద మీకు హక్కు లేదన్నారు. రాజస్తాన్‌ ‌మీద వాళ్లకి దఖలు పడిన అధికారాన్ని కొండకోనలకి కూడా వర్తింపచేశారు. ఆఖరికి సొంత వినియోగానికి ఒక కొమ్మ, ఒక పండు, ఒక కాయ ఏరుకోవడాన్ని కూడా నిషేధించారు. చుట్టుపక్కల గ్రామాలలో భిల్లులు వ్యాపారం చేయడం కూడా చట్టవిరుద్ధమన్నారు. సాధారణంగా గిరిజనులు  కొన్ని అటవీ ఉత్పత్తులతో  సొంతంగా ఇళ్లలోనే మద్యం తయారు చేసుకుంటారు. దానిని కూడా నిషేధించారు. అయితే ఇది గిరిజనుల మీద ప్రేమతో, ఆ వ్యవసనం నుంచి దూరం చేయడానికి కాదు. మద్యం అమ్మకాల మీద కాంట్రాక్టర్లకు గుత్తాధిపత్యం కట్టబెట్టారు. ఈ పరిణామాలన్నీ అడవులలోను వడ్డీ వ్యాపారుల ప్రాబల్యం పెంచారు. వీరికి కంపెనీ, బ్రిటిష్‌ ఇం‌డియా అధికారుల అండ ఉండేది. తీసుకున్న మొత్తం, లేదా వడ్డీ సకాలంలో చెల్లించకపోతే ఎంతో విలువైన వారి భూములు, పశుసంపద వడ్డీ వ్యాపారాలు హస్తగతం చేసుకునే వారు. ఇలాంటి వారిని భిల్లులు చంపిన సంఘటనలు ఉన్నాయి. ఆ పరిణామంతోనే అధికారులకీ, గిరిజనులకీ మధ్య వైరం పెరిగింది. మహారాష్ట్రలోని ఖాందేష్‌ ‌ప్రాంతంలో సేవారామ్‌ ‌నాయకత్వంలో భిల్లులు తిరుగుబాటు చేశారు. తమ సేద్యానికి అధికారుల నుంచి ఎదురైన అడ్డంకులకు నిరసనగానే వారు పోరాటానికి దిగారు. తరువాత 1825, 1831, 1846లలో కూడా భిల్లు జనాభా ఉన్న ప్రాంతాలలో తిరుగుబాట్లు జరిగాయి. దీనికి పరాకాష్ట గోవింద్‌ ‌గురు పోరాటం. గిరిజన ప్రాంతాలలో ఇంగ్లిష్‌ ‌క్రైస్తవ మిషనరీలు మత ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో హిందూ వ్యతిరేకత, విగ్రహారాధనను నిరసించడం కూడా జోడించేవారు. ఈ దుశ్చర్యను ఖాండేష్‌ ‌ప్రాంత భిల్లులు త్వరలోనే గ్రహించారు. ఇది కూడా బ్రిటిషర్ల మీద తిరుగుబాటుకు కారణం. వీరి ధోరణి ఇలా ఉంటే, బ్రిటిష్‌ ‌ప్రభుత్వం గిరిజన తెగలను దొంగలుగా భావించేది. ఆ ముద్రవేసి సామాజికంగా ఏకాకులను చేసేది.

నిజానికి ఖాందేష్‌, ‌మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలకు వారు అధిపతులని, కొందరు స్వార్ధపరులైన రాజపుత్రులు వారిని అక్కడ నుంచి తరిమివేశారని చెప్పడానికి కూడా ఆధారాలు ఉన్నాయని అంటారు. జబువా అనే ప్రాంతం 1550 వరకు కూడా వారి చేతులలోనే ఉందని చెబుతారు. దీనిని అక్బర్‌ ‌రాజపుత్రులకు ధారాదత్తం చేశాడు. ఇటువంటి పలు చారిత్రకాంశాలను సుభాశ్‌చంద్ర కుష్వాహ తన పుస్తకం ‘భిల్లుల తిరుగుబాటు: 125 ఏళ్ల పోరాటం’లో చిత్రించారు. 1800 నుంచి 1925 వరకు భిల్లులు చేసిన పోరాటమే అదంతా. కొన్ని భారతీయ వర్గాలు కూడా భిల్లులను ఇబ్బందుల పాల్జేసిన వాస్తవాలు చరిత్రలో కనిపిస్తాయి.

About Author

By editor

Twitter
YOUTUBE