ఏ పత్రిక అయినా సదాశయంతోనే ఆరంభమవుతుంది. కానీ అర్థవంతమైన పేరు, ఆదర్శనీయమైన ప్రయాణం రెండు కన్నులుగా సాగిన పత్రికల జాడ చరిత్రలో ఒకింత తక్కువే. పత్రిక ఏదైనా, దాని స్థాపన సాధారణంగా ఒక చారిత్రక సందర్భంలో జరుగుతూ ఉంటుంది. ఒక సామాజిక సంక్షోభంలో పత్రిక ఉద్భవిస్తూ ఉంటుంది. ప్రజాభిప్రాయంలో అవాంఛనీయ పోకడలు పొడసూపినపుడు పత్రిక అవసరం వస్తుంది. జాతిలో జాగరూకత అవసరమని చింతనాపరులు భావించినప్పుడు పత్రిక అంకురిస్తుంది. చిత్రంగా ఒక జాతి చరిత్ర, పరంపరగా వచ్చిన చింతన, ధర్మదృష్టి, ధార్మికపథం వక్రీకరణకు గురవుతున్న అత్యంత ప్రమాదకర పరిస్థితులలోనూ పత్రికలు ఆవిర్భవిస్తాయి. చివర చెప్పుకున్న లక్షణం సహా, పైన చెప్పుకున్న ఇంకొన్ని లక్షణాలను కలబోసుకున్న పరిస్థితుల నుంచి జనించినదే జాగృతి.

తెలుగు పత్రికల చరిత్ర నిస్సందేహంగా ఘనమైనది. సంఘ సంస్కరణ కోసం, స్వాతంత్య్ర సిద్ధి కోసం, సాహిత్య పోషణ కోసం పత్రికలు పాటు పడ్డాయి. 1958 వరకు దాదాపు 523 పత్రికలు తెలుగు భాషలో వచ్చినట్టు పొత్తూరి వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు’ గ్రంథంలో చెప్పారు. 1835 నాటికే ‘కొన్ని వార్తా పత్రికలు’ వెలువడ్డాయని చార్లెస్‌ ‌ఫిలిప్స్ ‌బ్రౌన్‌ ‌తన నిఘంటువుకు రాసిన ముందుమాటలోనే చెప్పారు. 1838లో వచ్చినట్టు చెప్పే ‘వృత్తాంతి’ని తొలి తెలుగు పత్రికగా పరిశోధకులు భావిస్తున్నారు. స్వల్ప కాలమే అయినా ఇది సంఘ సంస్కరణ ఉద్దేశంతో పనిచేసింది. పెళ్లిళ్లలో దుబారాని తూర్పార పట్టింది. తరువాత వచ్చిన ‘వర్తమాన తరంగిణి’ (1842) సాహిత్యం, సంస్కరణల కోసమే కాదు, హిందూ ముస్లిం ఐక్యతను కూడా దృష్టిలో ఉంచుకుంది. వృత్తాంతికి కడప ప్రాంతవాసులు మండిగల వేంకటరాయశాస్త్రి, వర్తమాన తరంగిణికి పువ్వాడ వెంకటరావు, సయ్యద్‌ ‌రహమతుల్లా సంపాదకులు. ఈ ఇద్దరి సంపాదకత్వంలోను వర్తమాన తరంగిణి ‘జాతీయ భావాలను వ్యాప్తం చేసింది. విద్యాభివృద్ధికి పాటు పడింది. ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది’ అంటారు పొత్తూరి తన గ్రంథంలో. ఈ పత్రిక 1842లో తాను ప్రచురించిన సంస్కృతాంధ్ర గ్రంథాల గురించి ఒక ప్రకటన కూడా ఇచ్చింది.

1871లో కొక్కొండ వేంకటరత్నం సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధ్రభాషా సంజీవని’ సాహిత్యం, భాషల కోసం పనిచేసింది. అలాగే కందుకూరి వీరేశలింగం ప్రారంభించిన సాంఘికోద్యమాన్ని ఎద్దేవా చేసింది. 1874 ప్రాంతంలో కందుకూరి వీరేశలింగం సంపాదకత్వంలో వెలువడిన వివేకవర్థిని మరొక బాటలో ప్రయాణించింది. ఇది పూర్తిగా సంస్కరణోద్యమానికి కట్టుబడిన పత్రిక. పూడ్ల రామకృష్ణయ్య నెలకొల్పిన ‘అముద్రిత గ్రంథ చింతామణి’ తాళపత్రాలలో బందీగా ఉన్న తెలుగు సారస్వతానికి అచ్చురూపం ఇచ్చింది. ఇది పుట్టింది (1885) అందుకే. 1885లోనే వచ్చిన ‘ఆంధ్ర ప్రకాశిక’ తొలి రాజకీయ పత్రిక. ఇక ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో చిరకాలం వెలువడిన కృష్ణాపత్రిక (1902) ఒక జాతీయవాద ప్రభంజనం. 1908లో ఆవిర్భవించిన ‘ఆంధ్రపత్రిక’ వారపత్రిక దానికి కొనసాగింపు. కానీ కృష్ణాపత్రిక వరకు వచ్చిన పత్రికలన్నీ పెద్ద పెట్టుబడులతో వచ్చినవి కావు. సాధారణ వ్యక్తులు, అద్భుత ఆశయాలతో స్థాపించినవి కావడం విశేషం. ఆంధ్రపత్రిక (దిన) 1914, ఆంధప్రభ (1938) వంటి పత్రికలు స్వాతంత్య్ర సమరంలో తమదైన పాత్రను నిర్వర్తించిన పత్రికలలో కనిపిస్తాయి. కానీ స్వాతంత్య్రంతో పాటు విభజను కూడా భారతావని చూడవలసి వచ్చింది. స్వాతంత్య్రోద్యమ ఆశయాలు కూడా స్వతంత్ర భారతదేశం తొలి అడుగలలోనే అడుగుంటిపోయే క్రమం ఒక వాస్తవం. స్వధర్మం ఏమైంది? స్వయంపాలన ఆశయం ఏమిటి? ఇవన్నీ ప్రశ్నార్థకాలయ్యాయి. స్వరాజ్య సమరయోధులు మనదైన చింతనతో, మనదైన ధార్మిక భావాలతో, నిజమైన చరిత్ర నేపథ్యంతో స్వతంత్ర భారతావతరణ జరగాలని ఆశించారు. సరిగ్గా అక్కడే జాతికి భంగపాటు ఎదురైంది. 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ప్రారంభించడంలో పరమ పూజనీయ డాక్టర్‌ ‌కేశవ బలిరామ్‌ ‌హెడ్గేవార్‌ ‌ప్రదర్శించిన దూరదృష్టిలోని గొప్పతనం తెలిసింది. స్వాతంత్య్రం కోసం పోరాడడం ఒక దశ. స్వతంత్ర భారతంలో మనవైన విలువలకు రక్షణ ఉండడం, ఆ విలువల పునరుత్థానం మరొక దశ. ఇవేవీ జరగలేదు. పైగా భంగపడినాయి. డాక్టర్జీ ఆశయానికి ప్రాణ ప్రతిష్ట చేయవలసిన అవసరాన్ని స్వయం సేవకులు, అలాంటి దృష్టి ఉన్నవారు తొందరలోనే గుర్తించారు. స్వతంత్ర భారతంలో స్వరాజ్యం ఉండాలన్న ఆలోచన అంకురించింది. డాక్టర్జీ వారసులు పరమ పూజనీయ మాధవరావ్‌ ‌సదాశివ గోళ్వాల్కర్‌ ‌మనవైన దేశీయ భావాలను ప్రతిష్టించడానికి 36 పత్రికలు స్థాపించాలని సంకల్పించారు. అలాంటి వాటిలో ఒకటి ‘జాగృతి’ వారపత్రిక.

ఆ విధంగా జాగృతి స్థాపన ఒక చారిత్రక సందర్భంలోనే జరిగింది. స్వతంత్ర భారతం స్వధర్మ భావనలతో నిర్మాణం కావాలి. దీనికే దారుణ ప్రతికూలత ఏర్పడడం అంటే స్వరాజ్య సమరయోధుల ఆశయాలకు తూట్లు పడినాయనే అర్ధం. గడచిన ఏడున్నర దశాబ్దాలుగా జాగృతి స్వరాజ్య సమరయోధుల పోరాట ఆశయాన్ని ఆవిష్కరించడానికే శ్రమిస్తున్నది. ఈ దేశంలో భారతీయతకు ప్రతికూలత ప్రబలింది. మెజారిటీ ప్రజలు హిందువుల మనోభావాలు నిరంతరం గాయపడుతున్నాయి. స్వాతంత్య్రోద్యమానికి ఆవేశాన్నిచ్చిన వందేమాతరం స్వతంత్ర భారతంలో అవమానాలకు గురౌతున్నది. ఈ వాతావరణాన్ని సంస్కరించే యజ్ఞాన్నే జాగృతి నిర్వహిస్తున్నది. జాగృతికి జాతీయ భావాలు కలిగిన వారే సంపాదక బాధ్యతలు స్వీకరించారు. బుద్ధవరపు వేంకటరత్నం (1949-56), తూములూరి లక్ష్మీనారాయణ (1953-76), పెరమా వేణుగోపాలరెడ్డి (1978-85; 2014-18), వడ్లమూడి రామమోహనరావు (1985-2007), డా. వడ్డి విజయసారథి (2007-14) సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రస్తుతం దేశంలో జాతీయ భావనలు బలపడడానికి వెనుక ఉన్న జాగృతి, అలాంటి ఆశయంతోనే పనిచేస్తున్న ఇంకా అనేక పత్రికల తపస్సు ఉంది. విలువలు కాపాడుకుంటూ, జాతీయతకు సుదూరంగా ఉండే ప్రభుత్వాల ఏలు బడిలో కత్తిసాము చేసిన ఘనత జాగృతిదీ, మిగిలిన పత్రికలదీ. జాగృతి శతవార్షి కోత్సవాలను కూడా జాతి దర్శించాలనీ, అప్పటికి కాలానుగుణంగా, సమధర్మ సమభావనతో స్వధర్మ, స్వయం పాలనలు పరిపూర్ణంగా వెల్లివిరియాలనీ ఆశిద్దాం. ఆ పరమ వైభవ స్థితి జాగృతిలో ప్రతిబింబించాలని కోరుకుందాం.


డాక్టర్జీ ఆవేదన.. గురూజీ సంవేదన

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం సిద్ధాంతాలతో 1948 డిసెంబర్‌ 18‌వ తేదీన విజయవాడలో ప్రారంభమైన వారపత్రిక జాగృతి. ఈ పత్రికకు మొదటి సంపాదకులు బుద్ధవరపు వెంకటరత్నం. మహాత్మాగాంధీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రభుత్వం నిషేధించింది. తరువాత తమకు పత్రిక అవసరమని ‘‘సంఘం’’ నాయకులు భావించి జాతీయ, రాష్ట్ర స్థాయిలలో పత్రికలను ప్రారంభించే ఏర్పాట్లు చేశారు. అలా తెలుగులో వచ్చిన పత్రిక జాగృతి. జాతీయతా భావాలను యువకులలో వ్యాపింపజేయడం తమ ప్రధాన లక్ష్యంగా సంపాదకులు రచనలను ప్రచురించేవారు.

సంపాదక స్థానాలలో నియమితులైన వారందరూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలుగా పనిచేసినవారే. సంఘ సిద్ధాంతాల పట్ల నిబద్ధత కలిగినవారే. కాని తమ పత్రిక ‘‘సంఘం’’ పత్రిక అని వారం వారం ప్రకటించారు. 2003 సంచికలలో పత్రిక ‘‘జనహిత సొసైటీ’’ పక్షాన ప్రచురిస్తున్నట్లు ప్రకటన ఉంది.

బుద్ధవరపు వెంకటరత్నం 1953 దాకా సంపాదకులుగా పనిచేశారు. ఆయన తరువాత తూములూరి లక్ష్మీనారాయణ సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు. 1976 వరకు ఆయనే సంపాదకులు. తరువాత పి.వేణుగోపాలరెడ్డి సంపాదకులైనారు. వేణుగోపాలరెడ్డి భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన బాధ్యతలను చేపట్టడానికి సంపాదకత్వాన్ని వదలుకొన్నప్పుడు వి. రామ మోహనరావు సంపాదకులైనారు. ఎవరు సంపాద కత్వంలో ఉన్నప్పటికీ పత్రిక సైద్ధాంతిక విధానంలో మార్పు ఉండదు.

జాగృతి సంస్థ చేసిన ఒక మంచి పని పత్రికా రచయితలకు శిక్షణ తరగతులను నిర్వహించడం. ఒకోసారి ముప్పది నలుబది మంది ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేవారు. పెద్ద పత్రికలలో పనిచేస్తున్న సంపాదకులను ఆహ్వానించి వారి చేత ప్రసంగాలను చేయించేవారు. ఈ శిక్షణ తరగతులలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సిద్ధాంతాల ప్రసక్తిని రానిచ్చేవారు కాదు.

ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికల వలె జాగృతి దీపావళి సంచికలను చాలా శ్రద్ధగా రూపొందిస్తు న్నారు. మరే పత్రిక చేయని మరో పని కూడా జాగృతి చేస్తున్నది. అది ప్రతి జూన్‌ ‌నెలలోనూ పరిశ్రమలకు సంబంధించిన ఒక విశేష సంచికను ప్రచురించడం. ఇప్పటికీ ఈ విధమైన ప్రత్యేక సంచికలు వస్తూనే ఉన్నాయి.

జాగృతి తన సిద్ధాంతాలకు అనుగుణమైన విధంగా సాహిత్య రంగంలో సైతం గణనీయమైన సేవ చేసింది. ఇతర భాషలలో వెలువడుతున్న ఉత్తమ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించడం జాగృతి కార్యక్రమాలలో ఒకటి. వీర సావర్కర్‌, ‌జై సోమనాథ్‌, అం‌డమాన్లో ఆజన్మాంతం, పుష్యమిత్ర ఈ పత్రిక ప్రచురించిన అలాంటి రచనలలో ప్రతి సంచికలోనూ ఉండే కొన్ని కాలమ్స్‌తో పాటు ‘‘సినీ జాగృతి’’ అని ఒక పేజీ నిండా సినిమా వార్తలను ప్రచురించడం ఈ పత్రిక అనుసరిస్తున్న విధానం.

జాగృతి 1999లో స్వర్ణోత్సవం జరుపుకొన్నది. 1998 జూలై నుంచి 1999 జూలై వరకు స్వర్ణోత్సవం జరుపుకొని జూలై 26వ తేదీన జాగృతి స్వర్ణ జయంతి స్మృతి మంజూషను ప్రచురించారు. తమ పత్రికను గురించి సంపాదకీయంలో రామమోహనరావు ఇలా రాశారు.

‘‘జాగృతి ఒక వ్యక్తిదీ కాదు…. ఒకే ఒక వ్యక్తి ఆలోచనల నుండి ఆవిర్భవించిందీ కాదు. ఈ దేశ స్వాతంత్య్రోద్యమం గతి తప్పి, అపమార్గం పట్టిన వేళ మహాద్రష్ట, స్రష్ట డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌హృదయాంత రాళాల నుండి ఈ జాతి ఆవేదనను అర్ధం చేసుకొని ఈ జాతి ‘హిందూత్వం’ ఆస్మితను జాగృతపరచి సంఘటిత పరచడానికి ఉద్యమించిన యువ కిశోరాలకు నాయకత్వం వహించిన శ్రీ గురూజీ పిలుపునందుకొన్న కొందరి కృషి ఫలితమే ఈ జాగృతి. 1948 డిసెంబరు 18వ తేదీన ప్రారంభమైన నాటి నుండి తన లక్ష్యాన్ని, పథాన్ని దాటిపోకుండా కృషి చేస్తూనే ఉంది జాగృతి. రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించినా ఈ జాతిని వీడని భావదాస్యంతో పోరు సల్పుతూనే ఉంది. అందుకనే గాలివాలు రాజకీయాలకు తెరచాపలనెత్తి ప్రయోజనాలను సాధించే విధానాలను జాగృతి అవలంబించలేదు. ఇంటాబయటా అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ తన కర్తవ్యం నిర్వహిస్తూనే ఉంది……’’

పొత్తూరి వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు’ నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram