– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌జానకీ అమ్మాళ్‌ 125‌వ జయంతి

ఎవరీ జానకీ అమ్మాళ్‌ అం‌టే… పేజీల కొద్దీ సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఈ మధ్యనే (నవంబర్‌ 4) ‌నూటపాతికో జయంతి ఉత్సవం అయిన ఆమె గురించి ఎంత చెప్పినా, ఎంతగా రాసినా, వర్ణించి వివరించినా ఇంకా ఎంతో ఉంటుది. ఆ బహుముఖ ప్రజ్ఞ ఇప్పటికీ, ఎప్పటికీ చరిత్రాత్మకమే. విద్య, శాస్త్రం, విజ్ఞానం, కళలు, పరిశోధనలు, ప్రయోగాలు, సేవారంగం- ఏ విధంగా చూసినా అగ్రస్థానం ఆమెదే. వయోధిక పరిజ్ఞానిగా, నిత్య నిరంతర చేతనత్వానికి ప్రతీకగా ముందు చెప్పి తీరాల్సింది ఆ పేరునే! మనకు ఎన్నెన్నో శాస్త్రాలు న్నాయి. వాటిల్లో అపూర్వ అపురూప అంశాలన్నో వృక్షజీవ శాస్త్రంలో ప్రత్యక్షమవుతుంటాయి.  అంతటి ప్రాచీన, ప్రత్యేక విజ్ఞాన పక్రియ అది. ఈ భూగోళాన్ని నీటి తర్వాత విస్తారంగా వ్యాపించిన చెట్ల పూర్వాపరాలను అధ్యయనం చేస్తుంటుంది. మానూ మాకూ అనుకోవడం కాదు. చెట్టు అనేది శిఖర సమానం. పచ్చదనాన్ని పెంచే, ఆరోగ్య భాగ్యాన్ని కలిగించే, మానవ మనుగడను నిర్దేశించే, ఔషధ రూపంగా సేవలందించే వృక్షాలే మన నేస్తాలు, మనకు సమస్తాలు. జీవవైవిధ్యాన్ని కాపాడినా, తోడూ నీడై అండదండగా నిలిచినా, పర్యావరణ పరిరక్షణను ప్రసాదించినా, సహజ సౌందర్యాన్ని కలకాలం నిలబెట్టినా అన్నీ అవే. ఆ సతత హరితాన్ని మాన వాళికి కానుకగా, శాశ్వత బహుమతిగా అందించే పరిశోధకుల్లో దేశంలోనే మొట్టమొదటి మహిళామణి మన ఈ జానకమ్మ. వయసును మనసుతో జయించిన రత్నదీపిక, చిరంజీవని.

అది 1897 నవంబర్‌ ‌నెల. అలనాటి మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ ప్రాంతంలో జన్మించిన జానకిది ఎనభై ఐదు వత్సరాలకుపైగా జీవనయానం. కేరళ సంప్రదాయాలను పుణికి పుచ్చుకున్న తల్లి దేవి, తండ్రి కృష్ణన్‌ ఆమెకి ఎన్నెన్నో నేర్పారు. మధ్య తరగతి కుటుంబం. సోదర సోదరీమణుల మధ్య గారాబంగా పెరిగి, ఉన్నత విద్యాభ్యాసమయ్యాక పరిశోధనలపైనే దృష్టి కేంద్రీకరణ. అందువల్లనే మిచిగాన్‌ ‌యూని వర్సిటీకి పయనం. అప్పటికామెకు సుమారు పాతికేళ్ల వయసు. అక్కడే వృక్షశాస్త్రంపై విస్తృత అధ్యయనం చేశారు. ప్రతిభా సామర్ధ్యాలకు నిదర్శనంగా ప్రత్యేక పారితోషికాలనూ అందుకున్నారు. అటు తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి, మద్రాసు కళాశాలలో ప్రొఫెసర్‌ ‌బాధ్యతలు నిర్వర్తించారు. 1931లో 34 ఏళ్ల ప్రాయంలో మళ్లీ మిచిగాన్‌కే! ఫెలోషిప్‌ ‌పురస్కారాలందుకుని, పరిశోధన పత్రాలను సాటిలేని రీతిలో సమర్పించి, మేటి ఘనతను సొంతం చేసుకున్నారు. తదుపరి పరిణామక్రమంలో కేరళకు చేరుకుని, ప్రయోగాలు కొనసాగించి, లండన్‌ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లారు. ఎడిన్‌బర్గ్‌లో ఏర్పాటైన అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యారు. అదంతా రెండో ప్రపంచయుద్ధ కాలం. ఆ కారణంగా కొన్నాళ్లు అక్కడే ఉండక తప్పలేదు. తదుపరి డార్లింగ్‌టన్‌ ‌సన్నిధానంలో విధుల నిర్వహణ. విదేశాల్లో ఆ శాస్త్రకారిణి సేవానిరతిని గమనించి గుర్తించి గౌరవించిన భారత ప్రభుత్వం బొటానికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా పునర్‌ ‌వ్యవస్థీకరణకు ఆహ్వానించింది. అలహాబాద్‌లోని సెంట్రల్‌ ‌బొటానికల్‌ ‌లాబొరేటరీకి పప్రథమ సంచాలకురాలిగానూ నియమించింది. జమ్మూలోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాలకీ స్పెషాలఫీసర్‌ అయ్యారు జానకమ్మ. ట్రాంబే ప్రాంతంలో ఉన్న బాబా అటామిక్‌ ‌రీసెర్చి సెంటర్‌ ‌విధులనూ కొంతకాలం నిర్వహించారు. 1970 ప్రాంతం నుంచీ మద్రాస్‌లోనే స్థిరపడ్డారు. ఆ నగర విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్‌ ‌ఫర్‌ అడ్వాన్డస్ ‌స్టడీలో శాస్త్రజ్ఞురాలుగా విశేష సేవా సహాయ సహకా రాలందించి, అపార కీర్తి ఆర్జించారు. మధుర వోయ ల్‌లో ఫీల్డ్ ‌ల్యాబ్‌ ఉన్నతికీ దోహదకారి అయ్యారు.

బోధన, శోధన, సాధన

జీవకణ నిర్మాణం, తీరుతెన్నులను ప్రత్యేకంగా పరిశీలించారు జానకీ అమ్మాళ్‌. ‌చెరకు, వంగ, తదితర వృక్ష సంబంధ అంశాలను ఎంతో క్షణ్ణంగా శోధించి తెలుసుకుని ప్రపంచానికి చాటి చెప్పారు. తన ప్రాంతమైన కేరళలో వర్షాధార వృక్షాల విస్తీర్ణం అధికం. అక్కడినుంచి ఔషధ మొక్కల సమీకరణ, మరెన్నో విలువైన వనసంపదల సేకరణలో ప్రధానపాత్ర వహించారు. వృక్షజన్యు శాస్త్రవేత్తగా ఎన్ని పరిశోధనలు చేయాలో అన్నీ చేసి, కణ శాస్త్రరంగంలో తనకు పోటీయే లేదని నిరూపించి, చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలుండేలా పరిశ్ర మించారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, జమ్మూ-ఏ ప్రాంతంలో పనిచేసినా, ఎన్ని హోదాలు నిర్వహించినా అదే నిబద్ధత. పద్మశ్రీ సహా అందుకున్న బిరుదులు, పొందిన సత్కారాలు, సందర్శించిన ప్రదేశాలు, శోధించిన శాస్త్ర అంశాలు, చేసిన ప్రయోగాల పరంపరలూ ఇన్నీ అన్నీ కావు. ఇండియన్‌ ‌నేషనల్‌ ‌సైన్స్ అకాడమీతో పాటు అమెరికా, బ్రిటన్‌, ‌తదితర దేశాల విఖ్యాత సంస్థలెన్నో ఆమెను ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. అవార్డులూ రివార్డులూ అసంఖ్యా కంగా జానకమ్మను వరించి వచ్చాయి. తాను రచించి వెలువరించిన ‘కల్టివేటెడ్‌ ‌ప్లాంట్‌’ ‌పుస్తకం దేశవిదేశాల విద్యార్థులెందరికో నిత్య పఠనీయం, శాస్త్ర కళాకారులకు నిరంతర మార్గదర్శనం. పలురకాల మొక్కల, చెట్ల ఔషధ విలువలను; ఆర్థికంగా అవి జాతికి కలిగించే ప్రయోజనాలను విడమరచి చెప్పడంలో తనది అందెవేసిన చెయ్యి. రాయల్‌ ‌హార్టికల్చర్‌ ‌సొసైటీ అభివర్ణించినట్లు- తానొక జాతి సంపద. మొక్కలను, పూలను ఎంతగానో అభిమానించిన ప్రేమాస్పదు రాలు. ఇన్ని కారణాల వల్లనే; తదనంతర కాలంలో చిన్ని, తెల్లని పూలలో కొన్నింటికి ‘జానకి’ అని నామకరణం! జపాన్‌, ‌చైనా దేశాల శాస్త్రవేత్తలు ఇవాళ్టికీ ఆమెనే తలచు కుంటుంటారు. ఆ సేవలనే గుర్తు చేసుకుంటున్నారు..

అవరోధాన్ని అధిగమించి

ఉద్యోగ విరమణ తరువాత కూడా జానకి పరిశోధన వ్యాసంగం ఎంత మాత్రమూ చెక్కు చెదరలేదు. ప్రత్యేకించి ఔషధ మొక్కల ఆనుపాను లెన్నింటినో వెలికితీసి ప్రజల ముందుంచారు. మద్రాస్‌ ‌విశ్వవిద్యాలయ క్షేత్ర ప్రయోగశాలకు ఆధ్వర్యం వహించినప్పుడు అక్కడే ఉండేవారు. విలక్షణ రీతి మొక్కల పెంపకం, తోట విస్తరణతో అందరికీ ఆదర్శనీయం అయ్యారు. అమెరికాలో వృక్షశాస్త్ర పరిశోధన చేసి పీహెచ్‌డీ సాధించారు. మిచిగాన్‌ ‌వర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మక డిగ్రీని స్వీకరించిన అతి కొద్దిమంది ఆసియా నారీమణుల్లో ముఖ్యురాలు. మరో ప్రధాన విశేషం ఏమిటంటే… కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ రెండు దశాబ్దాల క్రితం పరిశోధనాంశాలకు సంబంధించి ఆమె పేరుతో జాతీయస్థాయి పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ప్లాంట్‌; ‌యానిమల్‌ ‌టాక్సానమీకి సంబంధించినవి మరో రెండు పురస్కారాలు ఏర్పాటు చేసింది. ఆమె పేరుతోనే విదేశాల పీహెచ్‌డీ అభ్యర్ధుల్లో ప్రజ్ఞా వంతులకు ఉపకారవేతనాలు కూడా అందు తున్నాయి. ఎన్నెన్నో ప్రదేశాల్లో, నానా రకాల స్థితిగతుల మధ్యలో పనిచేసిన ఆ మేధావంతురాలు ఎదుర్కొన్న సమస్యలూ లెక్కలేనన్ని! వాటికి ఏ దశలోనూ తలవంచలేదు. లక్ష్య సాధనకు అవరోధాలుగా ఎదురైన వాటిని తనదైన శైలిలో తొలగించుకుంటూ ముందుకు సాగారు. అలసటను ఏమాత్రమూ దరిచేరనివ్వలేదు. విశ్రాంతి అనేదే లేకుండా, వ్యవధిని కనీసం కోరకుండా, ఒక తపస్సులా శాస్త్రశోధన జరిపారు. విభిన్న సంస్కృతుల నడుమ ఉంటూనే, భారతీయతకు పట్టం కడుతూ వచ్చారు. వేషభాషల్లో సహజసిద్ధత కనబరుస్తూ, ప్రతి ఒక్కరికీ నచ్చేలా అందరూ మెచ్చుకునేలా వ్యవహ రించిన వ్యక్తిత్వ సంపన్నురాలామె.

సమాలోచన, సదాచరణ

జానకమ్మ తన కుటుంబసభ్యులు, సహపరి శోధకులు, బంధుమిత్రులకు రాసిన లేఖల్లోని అంశాలు ఆమె వ్యక్తిత్వ గరిమను సూచిస్తాయి. అవి ఇవీ:

1.ఏ ప్రాజెక్ట్ ‌పనినైనా చేపడితే, అది ముగిసిందాకా విశ్రమించను. 2. ముందుగానే తోటివారితో చర్చిస్తాను. సూచనలూ, సలహాలూ తీసుకుంటాను. పక్రియ ఒకసారి మొదలయ్యాక, విజయవంతమయ్యే వరకూ ఊరుకోను. 3. భారతీయ వనితల శాస్త్ర పరిజ్ఞానం అంతర్జా తీయ స్థాయికి చేరి తీరాలి. అది ఒక ప్రాంతానికో, సంస్థకో, బృందానికో పరిమితం కాకూడదు. 4. ఆదాన ప్రదానాల మాదిరిగా, దేశాలమధ్య వనితా శాస్త్రవేత్తల పర్యటనలు విస్తృతం కావాలి. మనదేశ మహిళలు చైనా, జపాన్‌ ‌వంటి పెద్ద దేశాలకు వెళ్లి పరిశోధనలు చేపట్టాలి. ఆ దేశాల నుంచీ మన దేశానికి ప్రతిభావంతులు రావాలి. ఉభయత్రా ఇటువంటి సందర్శనలే శాస్త్ర విజ్ఞానాన్ని బలోపేతం చేస్తాయి. సార్వత్రిక పురోగతికి అవే మూల కారణాలుగా నిలుస్తాయి.

ఇవన్నీ స్వప్నాలు కారాదు; సాకారం కావాలంటే చిత్తుశుద్ధి అవసరం. అప్పుడే లక్ష్య సిద్ధి. జానకీ అమ్మాళ్‌ 125‌వ జయంతి మహోత్సవాల స్ఫూర్తి ఇంకా కొనసాగాలని కోరుకుందాం. ఆ మహనీయకు శాస్త్ర సమాచరణతో సుమాంజలి ఘటిద్దాం. ఆలోచనలు ఆచరణగా మారడం అంటే ఏమిటో, ఆమె జీవితమే మనకు బోధపరుస్తుంది. యద్భావం తద్భవతి.

About Author

By editor

Twitter
Instagram