భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో రెండు అత్యంత ప్రధానమయిన ఘట్టాల్లో భారత కమ్యూనిస్టులు, ప్రపంచ కమ్యూనిజం, ప్రపంచ కమ్యూనిజం ప్రయోజనాల రక్షణకు దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారు. దేశద్రోహానికి వెనుకాడలేదు. ఒకటి 1942లో జరిగిన క్విట్‌ ఇం‌డియా పోరాటం; రెండవది నైజాంకు వ్యతిరేకంగా జరిగిన ‘భారత యూనియన్‌లో హైదరాబాద్‌ ‌చేరాలె’ అనే ఉద్యమం.

1928లో కమ్యూనిస్టు ఆరవ ఇంటర్నేషనల్‌ ‌వలస దేశాలలోని కమ్యూనిస్టు పార్టీలన్నిటికీ ఒక ఆదేశం జారీ చేసింది. దాని ప్రకారం మన దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు, జాతీయ స్వాతంత్య్రం కోసం పోరాడే బూర్జువా పార్టీలకు దూరంగా ఉండాలి అని. ఈ విధానాన్ని 1935లో మార్చుకున్నారు. ‘‘దత్తు బ్రార్లే థీసిస్‌’’ ‌పేరుతో ప్రఖ్యాతమయిన ఈ నూతన విధానాన్ని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ 1935‌లో ఆమోదించింది. దీని ప్రకారం వలస దేశాలలోని కమ్యూనిస్టులు జాతీయ స్వాతంత్య్రం కోసం పోరాడే బూర్జువా శక్తులతో కలిసిపోయి, వాటిల్లో చేరి వాటిని లోపల్నుంచి విచ్ఛిత్తి చేయాలి. ఆ రోజుల్లోనే భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీమీద నిషేధం విధించారు. భారత కమ్యూనిస్టులు మూకుమ్మడిగా కాంగ్రెసులో ప్రవేశించడం ప్రారంభించారు. అప్పటికే కాంగ్రెసు సంస్థలో ఒక ప్రగతివాద వర్గంగా రూపొందిన కాంగ్రెసు సోషలిస్టు పార్టీని తమ వేదికగా వీరు బాగా ఉపయోగించుకోగలిగారు. కమ్యూనిస్టుల ప్రవేశాన్ని కాంగ్రెసు సోషలిస్టుపార్టీ నాయకులు ఎం.ఆర్‌.‌మసానీ, డా।।రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా, అచ్యుతపట్వర్ధన్‌లు వ్యతిరేకించినప్పటికీ జయప్రకాశ్‌ ‌నారాయణ్‌, ఆచార్య నరేంద్రదేవ్‌లు బలపరచారు. చివరికి జయప్రకాశ్‌-‌పి.సి.జోషీల ఒప్పందం ప్రాతిపదిక మీద కమ్యూనిస్టులకు ప్రవేశం లభించడమే గాక, ఆంధ్ర, మద్రాసు, తిరువాన్కూరు – కొచ్చిన్‌ ‌మొదలైన రాష్ట్రాలలో కాంగ్రెసు సోషలిస్టు పార్టీల నాయకత్వాన్ని కూడా కమ్యూనిస్టులు చేజిక్కించు కున్నారు. అలా ప్రాధాన్యత సంపాదించు కున్నవారిలో పుచ్చలపల్లి సుందరయ్య (ఆంధ్ర) జీవానందం సి.రామ్మూర్తి (మద్రాసు), నంబుద్రిపాద్‌, ఏ.‌కె.గోపాలన్‌ (‌ట్రావెన్కూరు- కొచ్చిన్‌) ‌ప్రముఖులు.

1938లో ఎం.ఆర్‌. ‌మసానీ కమ్యూనిస్టుల రహస్య సర్క్యులర్‌ను ఒక దానిని పట్టుకోగలిగారు. కాంగ్రెసు సోషలిస్టు పార్టీలోను, తద్వారా కాంగ్రెసు లోను, కమ్యూనిస్టుల ప్రవేశం, దానిని విచ్ఛిన్నం చేయటానికి, అందులో నుండి కార్యకర్తలను పెద్ద ఎత్తున కమ్యూనిస్టులుగా మార్చడానికేనన్న విషయం ఆ రహస్య సర్క్యులర్‌లో బయటపడింది. వారిపై చర్య తీసికోవడానికి కాంగ్రెసు సోషలిస్టుపార్టీ మీనమేషాలు లెక్కపెట్టేసరికి సమయం దాటి పోయింది. 1946 మార్చిలో కాంగ్రెసు – సోషలిస్టు పార్టీ నుంచి కమ్యూనిస్టులను బహిష్కరించాలని తీర్మానం చేసే నాటికి కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెసు – సోషలిస్టు పార్టీ పూర్తిగా కమ్యూనిస్టుల వశమై పోయింది.

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు, కాంగ్రెసులోని మితవాదుల వాదాన్ని ప్రక్కకునెట్టి, మహాత్మాగాంధీ ‘క్విట్‌ ఇం‌డియా’ ఉద్యమానికి పిలుపు నిచ్చారు. దేశమంతటా విప్లవజ్వాలలు పెల్లుబికాయి. ఈ యుద్ధాన్ని ‘సామ్రాజ్యవాద కమ్యూనిస్టు పార్టీ, రష్యాపై జర్మనీ దాడిచేయగానే ప్లేటు ఫిరాయించి, దాన్ని ‘‘ప్రజా యుద్ధమని’’ ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. ఈ కొత్త నినాదాన్ని చేపట్టగానే వీరి నాయకులు చాలామంది విడుదలయ్యారు. ఆ పార్టీపైన ఉన్న నిషేధాన్ని బ్రిటిషు పాలకులు ఎత్తి వేసారు. ఒకవైపు కాంగ్రెసు నాయకత్వం, కాంగ్రెస్‌ ‌సోషలిస్ట్‌లూ, ‘కరో యా మరో’ (డూ ఆర్‌ ‌డై) అన్న మహాత్ముని నినాదంపై ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపచేయడానికి ఉద్యమాలు జరుపుతుంటే, కమ్యూనిస్టులు బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి ఏజంట్లుగా వ్యవహరించారు. చారిత్రాత్మకమయిన ఈ ‘క్విట్‌ ఇం‌డియా’ తీర్మానాన్ని, బొంబాయిలో జరిగిన ఎ.ఐ.సి.సి. మహాసభలలో ఆగస్టు 8, 1942 నాడు ఆమోదించిన తర్వాత, అక్కడ చేరిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశిస్తూ గాంధీజీ చేసిన ప్రసంగంలో ‘కరో యా మరో’ అన్న మాటను, ‘ఈసారి నేను ప్రజలను జైళ్లకు వెళ్లమని చెప్పను’ అన్న మాటలను సంకేతాలుగా స్వీకరించిన, కాంగ్రెసు పార్టీలోని అతివాద నాయకత్వం, ముఖ్యంగా సోషలిస్ట్‌లు 1942 ఉద్యమాన్ని ప్రజా విప్లవంగా కొనసాగించారు.

కమ్యూనిస్టులు మాత్రం వారి పత్రికల నిండా ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌నిర్మాత సుభాష్‌ ‌చంద్రబోస్‌ను, ఆగస్టు విప్లవనేత జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ను అతి నీచమయిన భాషలో దుమ్మెత్తి పోశారు. అనేకమంది దేశభక్తులను పోలీసులకు పట్టి ఇవ్వడంవరకూ వెళ్లింది వీరి రష్యా దేశభక్తి. గాంధీ మహాత్ముడు చేసిన క్విట్‌ ఇం‌డియా శంఖారావానికి సూర్యుడస్తమించని బ్రిటిష్‌ ‌సామ్రాజ్యమే దద్దరిల్లిపోయింది. ఈ మహోద్యమానికి కమ్యూనిస్టులు వెన్నుపోటు పొడిచారు. దేశద్రోహానికి పాల్పడ్డారు కాని వారు క్విట్‌ ఇం‌డియా ఉద్యమ మహా ప్రవాహానికి కొట్టుకుపోయారు. 1957లో ఆనాటి తమ విధానం తప్పని ఆత్మవిమర్శ చేసుకున్నారు.

సరిగ్గా ఇదే వైఖరిని హైదరాబాదు రాష్ట్రంలో స్టేట్‌ ‌కాంగ్రెసు లేవదీసిన ‘హైదరాబాదు ఇండియన యూనియన్‌లో చేరాలె’ అనే మహోద్యమంలో కూడా కమ్యూనిస్టు పార్టీ పునరావృతం చేసింది.

హైదరాబాదు రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి 1939లోనే బీజాలు పడినాయి. హైదరాబాదు నగరంలోని అబిడ్స్‌లో ఉన్న ఇండియా కాఫీ హౌస్‌లో అఖ్తర్‌ ‌హుసేను, మఖ్దూం మొహియుదీన్‌, ‌సయ్యద్‌ ఆలంఖుద్‌ ‌మీరి, రాజబహదూర్‌ ‌గౌడ్‌, ‌జవ్వాద్‌ ‌రజ్వీ, మొదలయిన యువకులు చేరి ఇష్టాగోష్టులు జరుపుకుంటూ ఉండేవారు.

1935 తర్వాత నుంచి 1942వరకు కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం వుండేది కనుక కమ్యూనిస్టు భావాలు గల అనేకమంది యువకులు అటు ఆంధ్రమహాసభలోను, ఇటు విద్యార్థి సంఘాలలోను, కార్మిక సంఘాలలోను చేరి తమ కార్యకలాపాలను ఉధృతం చెయ్యసాగారు.

నిజాం రాష్ట్రంలో భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా రైతు కూలీలను సంఘటితపరచి, పోరాటాలు జరపడంలో కమ్యూనిస్టులు ప్రముఖ పాత్ర వహించారు. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభను చీల్చి ఒక భాగాన్ని వశం చేసుకున్న తర్వాత గ్రామాలలో కౌలుదారుల పోరాటాలను కమ్యూనిస్టులు ఉధృతం చేశారు. నల్లగొండ, వరంగల్లు, కరీంనగరం జిల్లాలలో వీరి నాయకత్వాన గల ఆంధ్రమహాసభ శాఖలు గ్రామ గ్రామాన వెలిసినవి. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సర్వదేవభట్ల రామనాథం మొదలైనవారు అనేకమంది కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని చిత్తశుద్ధితో విశ్వసించారు.

హైదరాబాదు నగరంలో అనేక కార్మిక సంఘాలను రాజబహదూరు గౌడు నాయకత్వంలో కమ్యూనిస్టులు వశపరచుకున్నారు. జవ్వాదు రజ్వీ, మక్దూం మొహయుదీనులు అటు కార్మికరంగంలోను, ఇటు విద్యార్థి సంఘాలలోను ప్రాబల్యం సంపాదించ సాగారు. అయితే 1941 నుంచి వీరి ప్రాబల్యం తగ్గించటానికి సోషలిస్టు పార్టీ యువకులు ఎన్‌.ఆర్‌. అన్డుయాల్‌, ‌బసవరాజ్‌ ‌ప్రభృతులు పూనుకున్నారు. 1945 నాటికల్లా విద్యార్థి సంఘాలను సోషలిస్టు యువకులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్మిక రంగంలో మహదేవసింగు ప్రభృతులు కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడంలో కృతకృత్యులయ్యారు.

1948లో అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభ కలకత్తాలో జరిగింది. అప్పటికే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. పండిత జవహర్లాల్‌ ‌నెహ్రూ ప్రధానమంత్రిగా కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడింది.

స్వతంత్ర భారత ప్రభుత్వం అనగా నెహ్రూ ప్రభుత్వం భారతీయ పెట్టుబడిదారులు ప్రభుత్వమనీ, సంస్థానాలను అందులో చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ‌ప్రభుత్వానికి లేదని ఒక నూతన సిద్ధాంతాన్ని కలకత్తా మహాసభలో కమ్యూనిస్టు పార్టీవారు ప్రతిపాదించారు.

అప్పటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది. రజాకార్‌ ‌సైన్యాన్ని ప్రజాసైన్యంగా వర్ణించడం ప్రారంభించారు. మక్దూం మొహి యుదీన్‌, ‌మరో అయిదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది. కమ్యూనిస్టు పార్టీమీద ఉన్న నిషేధాన్ని గూడా తొలగించారు.

భారత కమ్యూనిస్టు పార్టీ, కలకత్తా మహాసభ ఇటువంటి తీర్మానం చేయడానికి కారణం దాని అంతర్జాతీయ విధానంలో భాగమేనన్న విషయాన్ని విస్మరించరాదు. సాయుధ విప్లవకారులు, కొత్తగా స్వతంత్రమైన ప్రతి దేశంలోను, అది స్థిరపడక పూర్వమే, సాయుధ తిరుగుబాటు ద్వారా ఆ దేశ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడానికి కృషి చేస్తారు. మతతత్వవాదులూ- కమ్యూనిస్టులూ, ప్రపంచంలోని ఈ వైఖరిని భారతదేశంవలెనే అనేక దేశాలలో అనుసరించారు.

ఇండోనేషియా స్వతంత్రమైన తొలి రోజుల్లో దారుల్‌ -ఇస్లాం అనే మతసంస్థ కమ్యూనిస్టులు కలిసి తొలి రోజుల్లో సాయుధ తిరుగుబాటు చేశాడు. భారతదేశంలో కూడా అదే విధానాన్ని అనుసరించటానికి పూనుకొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ హైదారాబాదు శాఖ తీర్మానాన్ని అనుసరించి ఆ రోజుల్లో హైదరాబాదు కమ్యూనిస్టు పార్టీవారు 8 పుటల కరపత్రాన్ని పంచి పెట్టారు. అందులో ‘నిజాం రాష్ట్రం భారత యూనియన్‌లో చేరకూడదు. నెహ్రూ ప్రభుత్వం ధనిక వర్గ ప్రభుత్వం. పెట్టుబడిదారీ దోపిడీని బలవంతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో సంస్థానాలను బలవంతంగా విలీనం చేసుకుంటున్నారు. హైదరా బాద్‌ ‌రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలి’ అని హితబోధ చేశారు. హైదరాబాదులోని హష్మతుగంజులో జరిగిన ఒక బహిరంగ సభలో అంతవరకు అజ్ఞాతంలో ఉన్న రాజబహదూరుగౌడు అకస్మాత్తుగా ప్రత్యక్షమై ప్రసంగించారు. హైదరాబాద్‌ ‌రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని స్పష్టం చేశారు. ఈ విధంగా 1942లో క్విట్‌ఇం‌డియా మహోద్యమంలో విదేశీ భక్తి తత్పరులయి స్వదేశ ద్రోహానికి పూనుకొన్నారు. కాని ఆ తర్వాత తమ విధానం తప్పు అని ఒప్పుకున్నారు.

అట్లే 1948లో భారతదేశపు తుదిపోరాటం హైదరాబాదు నేలమీద జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టులు, మధ్యయుగపు ఫ్యూడల్‌ ‌నిజాము, ఫాసిస్టు తత్వంతోబాటు మతోన్మాదులయిన రజాకార్లతో కుమ్మక్కయి ఆజాద్‌ ‌హైదరాబాదును బలపరచినారు. తద్వారా ప్రళయ భీకరంగా విజృంభించిన ప్రజా వెల్లువలో నిజాము రాచరికము కూకటివేళ్లతో కొట్టుకోపోయింది. నిజాము రాచరికంతోబాటు కమ్యూనిస్టులు కూడా నిలువ లేకుండాపోయినారు. ఈ విధంగా రెండుసార్లు గూడా ఆత్మ పరిశీలన చేసికొని తమ తప్పిదాన్ని అలవాటు ప్రకారం ఒప్పుకున్నారు. అయితే తప్పిదాన్ని ఒప్పుకొనే లోపల కాలప్రవాహం ఎంతో ముందుకు సాగిపోయింది.

(‘హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర’ నుంచి)

About Author

By editor

Twitter
Instagram