దేశ హితమే, భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ/ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న మరొక చరిత్రాత్మక నిర్ణయం పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ)‌పై వేటు. ఈ దేశాన్ని మత ప్రాతిపదికన మరొకసారి విభజించడం కాదు, అసలు భారత్‌నే ఇస్లామిక్‌ ‌దేశంగా మార్చివేయాలన్నంత పెద్ద కుట్ర పన్నిన ఒక మతోన్మాద రక్కసి మీద, రక్తపిపాసుల ముఠా మీద విధించిన నిషేధమిది. శరవేగంగా విస్తరిస్తున్న ఇస్లామిక్‌ ‌ఛాందస వాదమనే కేన్సర్‌ను శస్త్రచికిత్స చేసి తొలగించే చర్యనే ఈ నిషేధంలో చూడాలి. నిజమే, పీఎఫ్‌ఐ అనేది చాపకింద నీరులా కాదు, శరీరంలో కేన్సర్‌ ‌వలెనే విస్తరించింది. ప్రతి రాష్ట్రంలోనూ దాని ఉనికే. భారత సార్వభౌమాధికారానికి ఎదురవుతున్న ప్రతి సవాలు వెనుక దాని హస్తమే. అందుకే అఖిల భారత న్యాయవాదుల సంఘం పీఎఫ్‌ఐ ‌కార్యాలయాల మీద దాడులను మరొక సర్జికల్‌ ‌స్ట్రయిక్‌తో పోల్చి చెప్పింది. కాలచక్రాన్ని వెనక్కి తిప్పడమే ధ్యేయంగా జడలు విప్పి నర్తిస్తున్న ఈ దుష్టశక్తిని అధఃపాతాళానికి తొక్కివేయడమే మంచిదని దేశప్రజలు నిష్కర్షగా తేల్చి చెప్పారు. నిషేధాన్ని స్వాగతించారు. నీచత్వం కరడు గట్టిన కొందరు రాజకీయ నాయకులు, అధికారదాహంతో దేశ విచ్ఛిత్తికి అనుమతిస్తున్న స్వార్థశక్తులు, వాళ్ల చంకల్లో ఉండే ఉదారవాదులు, వాళ్ల పార్టీలు, విదేశాలు విసిరే కుక్క బిస్కెట్లకు కక్కుర్తి పడే సంస్థలు మాత్రమే నిషేధం మీద సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. విద్రోహచింతనే ఊపిరిగా మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు, పనికిమాలిన ప్రాంతీయ పార్టీలు పీఎఫ్‌ఐ ‌మీద రహస్యంగా జాలి చూపుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారత ప్రతిపక్షాలలో విషపు పోకడలు, జాతి వ్యతిరేకత పరాకాష్టకు చేరాయని పీఎఫ్‌ఐ ‌మీద నిషేధం తరువాత అవి ప్రదర్శించిన ద్వంద్వవైఖరితో రూఢి అయింది. భారతీయ సమాజం పట్ల ఈ పార్టీలకు ఉన్న నిబద్ధతను ఇక దేశవాసులంతా ముమ్మాటికీ శంకించ వలసిందే. సామూహికంగా ప్రశ్నించవలసినదే. ఓట్ల రాజకీయం, ముస్లింల బుజ్జగింపు విన్యాసాలు ఎన్నడూ లేనంత జుగుప్సాకరంగా తయారయ్యాయి. బీజేపీ అనే జాతీయవాద శక్తిని ఓడించడానికి వీళ్లు చేస్తున్న పెద్ద విన్యాసం కేవలం, విజాతీయతను ఆశ్రయించడమే. భారత్‌ను ఇస్లాం దేశంగా మారుస్తామన్న కుట్ర ఎంత ప్రమాదకరమైనదో, అది ఎంత రక్తపాతానికి దారి తీసే అవకాశం ఉందో, ఎంత విషాదాన్ని, ఎంత బీభత్సాన్ని సృష్టించగలదో కాస్త కూడా ఆలోచించని ప్రతిపక్షాలు ఇవాళ ఈ దేశంలో ఉండడం జాతి చేసుకున్న ప్రారబ్ధం.

అందరూ ఊహించిన విధంగానే, లేదా ఆశించినట్టుగానే పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ), ‌దాని 8 అనుబంధ సంస్థలను చట్ట వ్యతిరేక సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్‌ 22‌న పీఎఫ్‌ఐ ‌కార్యాలయాల మీద హఠాత్తుగా మొదలైన దాడులు, సెప్టెంబర్‌ 27‌న ఆ సంస్థ నిషేధంతో గొప్ప పరమార్థాన్ని సాధించాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఒక గజెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. పీఎఫ్‌ఐ ‌దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) మేరకు ‘చట్టవిరుద్ధమైన సంఘంగా’ ప్రకటించినట్టు కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ చర్య మొత్తం ఇటీవలి కాలపు మహా సాహసంగా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ దాని వెనుక దేశ రక్షణ ఉంది. సర్వ ధర్మ సమభావన, ప్రజాస్వామ్య రక్షణ సుస్పష్టం. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ ‌ద్వారా సంస్థపై నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ చట్టం కింద ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ ‌దీన్ని నిర్ధారించాలి. ఇందుకోసం కేంద్రం ఆ సంస్థకు వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాధారా లను నోటిఫికేషన్‌ ‌జారీచేసిన 30 రోజుల్లోగా ట్రిబ్యునల్‌కు సమర్పించడం తప్పనిసరి. అప్పుడు ట్రిబ్యునల్‌ ‌ప్రభుత్వ ఉత్తర్వులు సరైనవా? కాదా? అన్నది నిర్ణయిస్తుంది. హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జి ఈ ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వులపై ఆయన విచారణ జరిపి నిర్ణయాన్ని ఆరు నెలల్లోగా తెలియపరచాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్‌ ‌ప్రభుత్వ ఉత్తర్వులు సరైనవేనని నిర్ణయిస్తే ఈ నిషేధం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. మన రాజ్యాగం ఏ సంస్థనైనా ఐదేళ్లకు మించి నిషేధించడానికి అనుమతించదు. అందువల్లనే కేంద్రం ఐదేళ్ల నిషేధం విధించి, అప్పుడు మళ్లీ సంస్థ పనితీరును పరిశీలించి, నిషేధాన్ని పొడిగించడమో లేక ఎత్తివేయడమో చేయవచ్చు. ప్రస్తుతం చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించిన పీఎఫ్‌ఐ, ‌ట్రిబ్యునల్‌ ఆమోదం పొందినట్లయితే నిషేధించిన సంస్థల జాబితాలో చేరుతుంది. ఇప్పటి వరకు 42 సంస్థలను చట్టవిరుద్ధ మైనవిగా, 13 సంస్థలను ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రభుత్వం నిషేధించింది.

నిషేధానికి గురైన పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థలు

చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద నిషేధించిన సంస్థల్లో రిహాబ్‌ ఇం‌డియా ఫౌండేషన్‌ (ఆర్‌ఐఎఫ్‌), ‌క్యాంపస్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీఎఫ్‌ఐ), ఆల్‌ ఇం‌డియా ఇమామ్స్ ‌కౌన్సిల్‌ (ఏఐఐసీ), నేషనల్‌ ‌కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్ ఆర్గనైజేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఆర్‌ఓ), ‌నేషనల్‌ ఉమెన్స్ ‌ఫ్రంట్‌ (ఎన్‌యూఎఫ్‌), ‌జూనియర్‌ ‌ఫ్రంట్‌, ఎం‌పవర్‌ ఇం‌డియా ఫౌండేషన్‌, ‌కేరళకు చెందిన రిహాబ్‌ ‌ఫౌండేషన్‌ ఉన్నాయి.

సెప్టెంబర్‌ 27 ‌రాత్రి పొద్దుపోయిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ మేరకు నోటిఫి కేషన్‌లో పేర్కొన్న కారణాలు:

–        ఉగ్రవాద, విధ్వంసక కార్యకలాపాలతో భారత రాజ్యాంగ సంవిధానాన్ని దెబ్బతీయాలని చూడటం.

–       సమాజంలోని ఒక వర్గంలో ఉగ్రవాద భావాలు పెంచుతూ, దేశంపట్ల అసంతృప్తిని ప్రోది చేయడం. రెండు మతాల మధ్య చిచ్చే ప్రధాన లక్ష్యంగా సభ్యుల్ని ఉసికొల్పడం.

– స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (సిమీ) నాయకులు పీఎఫ్‌ఐకి నిధులు సమకూరు స్తుండటం.

–      స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియా, జమాత్‌ ఉల్‌ ‌ముజాహిదీన్‌, ‌బంగ్లా దేశ్‌ ‌సంస్థల నాయకులు దీని వ్యవస్థాపకులు కావడం.

– బంగ్లాదేశ్‌లోని జమాత్‌-ఉల్‌-‌ముజాహిదీన్‌తో, ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియాతో కూడా పీఎఫ్‌ఐకి సంబంధాలుండటం.

–       రాజ్యాంగాన్ని గౌరవించకపోవడమే కాకుండా, బయటి ప్రాంతాల నుంచి సైద్ధాంతికపరమైన మద్దతు లభిస్తున్నందువల్ల దేశ అంతర్గత భద్రతకు పెను ప్రమాదకరంగా మారడం.

–     సంస్థ సభ్యులపై వివిధ రాష్ట్రాల్లో 1400కు పైగా క్రిమినల్‌ ‌కేసులుండటం.

–      పలు ఉగ్రవాద కార్యకలాపాకు, పలువురి హత్యలకు పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు కారణం. 2017లో బిబిన్‌ (‌కేరళ), అదే ఏడాది నందు (కేరళ), 2018లో అభిమన్యు (కేరళ), 2021 నవంబర్‌లో సంజీత్‌ (‌కేరళ), 2016లో శశికుమారన్‌ (‌తమిళనాడు), 2019లో రామలింగం (తమిళనాడు), 2016లో ఆర్‌. ‌రుద్రేశ్‌ (‌కర్ణాటక), అదే ఏడాది ప్రవీణ్‌ ‌పుయారీ (కర్ణాటక), 2017లో శరత్‌ (‌కర్ణాటక), 2022లో ప్రవీణ్‌ ‌నెట్టారు (కర్ణాటక) వంటి వారి హత్యలకు పీఎఫ్‌ఐ ‌కారణమని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

–       కేరళలోని కొల్లం జిల్లాలోని అటవీ ప్రాంతంలో గత ఏడాది సోదాల్లో పేలుడు పదార్థాలు, జిహాదీ సాహిత్యం లభించడం. 2013లో కన్నూరు జిల్లాలో సాయుధ శిక్షణ కేంద్రంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు దొరికిన కేసులో 41 మంది పీఎఫ్‌ఐ ‌సభ్యులు దోషులుగా తేడం.

–         2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్‌ ‌రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టుగా చెప్పే పోస్టర్లు, బాంబుల తయారీకి సంబంధించిన వీడియోలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ‌నిర్వహించిన సోదాల్లో లభ్యం కావడం.

ఇవి కేంద్రం ఇస్తున్న కొన్ని రుజువులు మాత్రమే. పీఎఫ్‌ఐ అసలు స్వరూపం ఇంకా వికృతమైనదే.

కొవిడ్‌ అం‌డతో విస్తరణ

మహారాష్ట్రలో పీఎఫ్‌ఐ ‌కుట్ర మరీ లోతుగా ఉంది. 2014లో కేవలం నాందేడ్‌ ‌జిల్లాకు పరిమిత మైన పీఎఫ్‌ఐ ‌ప్రస్తుతం 22 నుంచి 34 వరకు జిల్లాలకు విస్తరించిందని రాష్ట్ర యాంటీ టెర్రర్‌ ‌స్క్వాడ్‌ అధిపతి వినీత్‌ అగర్వాల్‌ ‌చెప్పారు. అసలు సంగతి ఇది కాదు. సంస్థ విస్తరణకు కరోనా కష్టకాలాన్ని కార్యకర్తలు ఉపయోగించుకున్నారు. వ్యాధి భయంతో శవాల అంత్యక్రియలకు ఎవరూ రాకుంటే వీళ్లే ఆ పని చేసేవారు. దీనికే మరొక పార్శ్వం కూడా ఉంది. నేరాల ద్వారా, బెదిరింపుల ద్వారా 2047 కల్లా భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలన్న ఆలోచన తమకు ఉందని మహారాష్ట్రలో అరెస్టయిన పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు చెప్పారు. దాడుల కోసం ఇళ్ల పైన పదునైన ఆయుధాలు విసరడానికి రాళ్లు ఉంచుకోవాలని నాయకులు చెప్పిన సంగతిని కూడా వాళ్లు వెల్లడించారు. కొవిడ్‌ ‌కోణాన్ని ఇంకొంచెం లోతుగా చర్చించడం అవసరం.

కొవిడ్‌ ‌సమస్యతో ప్రపంచం తల్లడిల్లిపోతూ ఉంటే మన సరిహద్దులలో చైనా, దేశం లోపల పీఎఫ్‌ఐ ఆ ఉత్పాతాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. వ్యాక్సిన్‌ ‌కోసం, మెడికల్‌ ఆక్సిజన్‌ ‌కోసం, ఆసుపత్రులలో చేరడం కోసం జనం గుండెలు అవిసిపోయేలా దుఃఖిస్తుంటే ఈ పీఎఫ్‌ఐ ఆ ‌వాతావరణంలో విస్తరించాలని అనుకుంది. భారత ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకతను పెంచడానికి కుట్రలు చేసింది. ఆ సమయంలో ఈ సంస్థ ఒక సదస్సును నిర్వహించింది. ‘జాతీయ లాక్‌డౌన్‌ ‌ఫాసిజం: రహస్య అజెండా’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆన్‌లైన్‌ ‌సదస్సు మే 10, 2020న జరిగింది. సౌమ్య అవస్థి అనే పరిశోధక విద్యార్థి జూన్‌ 17, 2020‌న జేఎన్‌యూకు సమర్పించిన ఒక అధ్యయన పత్రంలో చాలా అంశాలు వెల్లడించారు. పీఎఫ్‌ఐ ‌ప్రచారం, అజెండాల గురించే ఈ అధ్యయనపత్రంలో విశ్లేషించారు. పీఎఫ్‌ఐ ఒక విష ప్రచారకేంద్రం.

ఆ ఆన్‌లైన్‌ ‌సదుస్సులో వేయి మంది వరకు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న ‘ఫాసిస్ట్ ‌ప్రభుత్వం మీద ప్రజలు సామూహికంగా తిరగబడాల’ని ఈ సదస్సు పిలుపునిచ్చింది. ఇందులో పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ నాయకులే కాదు, మాజీ ఐఏఎస్‌ అధికారి శశికాంత్‌ ‌సెంథిల్‌, ‌రాజ్‌రతన్‌ అం‌బేడ్కర్‌, ‌భారత బౌద్ధ సంఘం అధ్యక్షుడు, ఇస్లామిక్‌ ‌పండితుడు ఖలీలుర్‌ ‌రెహమాన్‌ ‌సజ్జాద్‌ ‌నొమాని కూడా పాల్గొన్నారు. వక్తలంతా రెచ్చగొట్టే ప్రసంగాలే చేశారు. ఈ పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు. మైనారిటీలను ఏరివేసేందుకే కేంద్రం లాక్‌డౌన్‌ను విధించిందన్నది ఈ సదస్సు చేసిన ఆరోపణ. ఈ సదస్సులో ఎంత నీచమైన ఆరోపణలు చేశారో హద్దు లేదు. భారత ప్రభుత్వాన్ని రోమ్‌, ‌నాజీ నియంతలు పాలిస్తున్నారట. ఇజ్రాయెల్‌ అక్కడి ముస్లింలను మసీదులకు వెళ్లకుండా అడ్డుకున్నట్టే భారత ప్రభుత్వం కూడా ఇక్కడ అడ్డగిస్తున్నదని అనీస్‌ అహ్మద్‌ (‌పీఎఫ్‌ఐ ‌కార్యదర్శి) వ్యాఖ్యానించాడు. సామాజిక దూరం నిబంధన కూడా ఇందుకేనని సెలవిచ్చాడు. బాబ్రీ మసీదు స్థలాన్ని అసలు వారసుల నుంచి లాగేసు కున్నారని కూడా ఆరోపించారు. దేశంలో జర్నలిస్టులు రిలయన్స్ ‌సంస్థకు అమ్ముడు పోయారని కూడా చెప్పారు. అలాగే అమెరికాలో అధిక కరోనా మరణాలు సంభవిస్తున్నాయని, అవన్నీ నల్ల జాతి ముస్లింల మరణాలేనని కూడా తేల్చారు. ఈ ముస్లింలకు వైద్య సదుపాయం కూడా లేదని చెప్పారు. ఇంకా మహిళలు, బడుగువర్గాలు, ఎస్‌సీలు, ముస్లింలు, లింగాయత్‌లు, రైతులు, గిరిజనుల హక్కుల రక్షణకు ఉదారవాదులు, పీఎఫ్‌ఐతో పాటు వామపక్షాలు కూడా కలసి రావాలని కోరడం విశేషం. భారతదేశంలో ముస్లిం లపై జరిగిపోతున్న సామూహిక హత్యాకాండకు వ్యతిరేకంగా పీఎఫ్‌ఐ ‌సానుభూతిపరులంతా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయాలని బౌద్ధసంఘాల నుంచి వచ్చిన ఒక ప్రతినిధి పిలుపునిచ్చారు. ఆ సదస్సు కుమ్మరించిన విషం ఎంతో చెప్పడానికి కొన్ని గ్రంథాలే కావాలి.

అంతర్జాతీయ ఉగ్రవాదంతో చెట్టాపట్టాలు

మన పీటీఐ (ప్రెస్‌ ‌ట్రస్ట్ ఆఫ్‌ ఇం‌డియా) వార్తా సంస్థ ఇచ్చిన ఒక వార్త ప్రకారం (2010) పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు ఐఎస్‌ఐఎస్‌తో తమ బంధాన్ని దాచు కోవడం లేదు. ఈ సంస్థకు వారంతా సానుభూతి పరులే. ఫేస్‌బుక్‌ ‌ఖాతాలలో ఆ సంస్థ పట్ల వాళ్లకి ఉన్న మక్కువను వెల్లడిస్తున్నారు. ఇంకా హర్కత్‌ ఉల్‌ ‌జిహాద్‌ అల్‌ ఇస్లామి, హిజిబుల్‌ ‌ముజాహిదీన్‌, ‌లష్కర్‌ ఏ ‌తాయిబా, అల్‌ ‌కాయిదాలతో తమకు ఉన్న సంబంధాలను, అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. పీఎఫ్‌ఐ ‌సభ్యులు కేరళ నుంచి కార్యకర్తలను తయారు చేసి అఫ్ఘానిస్తాన్‌, ‌సిరియా, టర్కీలలో ఐఎస్‌ఐఎస్‌ ‌తరఫున పనిచేయడానికి యువకులను పంపు తున్నారని నిఘా వర్గాలు ఎప్పుడో తేల్చి చెప్పాయి. దీనికి గట్టి రుజువులే ఉన్నాయి. కాబూల్‌లోని రాయ్‌ ‌సాహిబ్‌ ‌గురుద్వారా వద్ద మార్చి 25, 2020న ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకుని చనిపోయాడు. ఆ బాంబు దాడిలో 25 మంది చనిపోయారు. 80 మంది గాయపడ్డారు. ఆ ఆత్మాహుతి దళ సభ్యుడిని మహమ్మద్‌ ‌ముషిన్‌గా (అబూ ఖాలిద్‌ అల్‌ ‌హింది) గుర్తించారు. ఇతడు కేరళ వాసి. పీఎఫ్‌ఐ ‌కార్యకర్త. దీనికి సంబంధించిన సమాచారం కేరళ నుంచి వెలువడే అల్‌ ‌నబా అనే పత్రికలో వచ్చింది. అందులో భారతదేశంలో ముస్లింల మీద జరుగుతున్న అత్యాచారాలకు ప్రతిగానే ఈ దాడి జరిగిందని చెప్పడం విశేషం.

నిషేధం డిమాండ్‌ ‌పాతదే!

ఒక పాపాల పుట్ట వంటి పీఎఫ్‌ఐపై నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్‌, ‌కర్ణాటక, గుజరాత్‌ ‌రాష్ట్రాలు ఇప్పటికే సిఫారసు చేశాయని కూడా కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్‌ 22 ‌నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ ‌కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై ఎన్‌ఐఏ, ఈడీలు సంయుక్తంగా దాడులు జరిపాయి. ఈ సందర్భంగా 350కి పైగా అనుమానితులను అరెస్ట్ ‌చేశారు. సెప్టెంబర్‌ 22‌న అరెస్ట్ ‌చేసిన 106 మంది ఇచ్చిన సమాచారంతో 27వ తేదీన రెండోవిడత దాడులు జరిపి 247 మందిని అరెస్ట్ ‌చేశారు. ఆ రోజే పీఎఫ్‌ఐపై నిషేధం విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ ‌విడుదల చేయడం విశేషం. పీఎఫ్‌ఐ ‌ముష్కరులు ఎంత విధ్వంసం సృష్టించినా, బెదిరింపులకు పాల్పడినా కాస్త కూడా వెరవని కేంద్ర ప్రభుత్వం మూడుసార్లు దాడులు చేసి, తన సత్తా ఏమిటో చూపింది. పీఎఫ్‌ఐ అనుబంధ రాజకీయ సంస్థ ఎస్‌డీపీఐ మినహా మిగిలిన అన్ని అనుబంధ సంస్థలను కేంద్రం, ఈ రాష్ట్రాలు నిషేధించినట్టయింది. కేరళకు చెందిన ఐదుగురు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది.

పకడ్బందీగా వ్యవహరించిన కేంద్రం

ఈ నిషేధం విధించే ముందు కేంద్రం చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా అడుగులు వేసిందనే చెప్పాలి. మైనారిటీలు ఏం చేసినా, ఎంతటి దేశద్రోహానికి పాల్పుడుతున్నా అది వాళ్ల హక్కే అన్నట్టు ఉండే కుహనా సెక్యులరిస్టులు గగ్గోలు పెట్టడానికి వీల్లేకుండా వ్యవహరించింది. ఇందు కోసం పీఎఫ్‌ఐ ‌కార్యకలాపాలను, సాధారణ ముస్లింలను వేర్వేరుగా చూపడంలో కేంద్రం సఫలమైంది. పీఎఫ్‌ఐ ‌కార్యకలాపాలు దేశ సామాజిక, శాంతి భద్రతలకు ప్రమాదకరంగా మారాయన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చూపగలిగింది. ఇందుకు సాక్ష్యాధారాలను సేకరించడంతో దేశంలో కుహనా సెక్యులరిస్టు శక్తులు ముస్లింలపై దాడి అంటూ రెచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆవిధంగా దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల నుంచి ఏకాభిప్రాయం సాధించడంలో కేంద్రం సఫలీకృత మైంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నోటిఫికేషన్‌ ‌విడుదల కాగానే తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, ‌జార్ఖండ్‌ ‌రాష్ట్రాలు పీఎఫ్‌ఐని చట్టవిరుద్ధ కార్యకలాపాల సంస్థగా ప్రకటిస్తూ నోటిఫికేషన్లు జారీచేశాయి. భారత్‌లో పీఎఫ్‌ఐ ‌ట్విట్టర్‌ ‌ఖాతాను నిలిపివేశారు. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ‌ఫేస్‌బుక్‌, ‌ట్విట్టర్‌ ‌వంటి సోషల్‌ ‌మీడియా వేదికల్లో పీఎఫ్‌ఐ అకౌంట్‌ను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ట్విటర్‌ ఈ ‌చర్య తీసుకుంది. ఇదిలా ఉండగా కేరళ-పీఎఫ్‌ఐ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ‌సత్తార్‌ ఒక ప్రకటన చేస్తూ పాపుర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక రెండో అంశం అంతర్జాతీయంగా వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇందుకోసం పీఎఫ్‌ఐకి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేసింది. ముఖ్యంగా ఐసిస్‌లో పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు ఏ విధంగా చేరుతున్నదీ వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని జమాత్‌-ఉల్‌- ‌ముజాహిదీన్‌తో, ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియాతో కూడా పీఎఫ్‌ఐకి సంబంధాలను బయటపెట్టడం వల్ల అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలుగా చెలామణి అవుతున్న సంస్థల నుంచి ఏవిధమైన వ్యతిరేకత రాలేదు. అదీకాకుండా ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న విషయం స్పష్టమైనప్పుడు మరే ఇతర దేశం, లేదా సంస్థ నోరు మెదపడానికి వీలుండదు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మద్దతు కూడా లభిస్తుంది. పీఎఫ్‌ఐ ‌విషయంలో జరిగిందిదే. ఇది కేంద్రం సాధించిన రెండో ప్రధాన విజయం.

కకావికలు, కోర్టుల్లో చుక్కెదురు

దేనికైనా పాపం పండాలి అని హిందువులు నమ్ముతారు. ఇప్పుడు పీఎఫ్‌ఐ ‌పాపం పండింది. కేంద్రం నిర్వహించిన దాడులు, తరువాత విధించిన నిషేధం కేరళలో పీఎఫ్‌ఐని కకావికలు చేసింది. ఈ విధ్వంసక సంస్థ పుట్టింది అక్కడే. కొందరిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఇంకొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పీఎఫ్‌ఐకి కేంద్రంగా చెప్పే ‘యునిటీ హౌస్‌’ (‌కొజికోడ్‌)‌కు సెప్టెంబర్‌ 30‌న అధికారులు తాళం వేశారు. పీఎఫ్‌ఐ ‌నీడలో ఉండే ప్రభుత్వేతర సంస్థల వ్యవహారాలు చూసే పెరియార్‌ ‌వ్యాలీ ట్రస్ట్ ‌కార్యాలయానికి కూడా అంతకు ముందే అధికారులు తాళాలు బిగించారు. ఇది ఉలియన్నూర్‌ అనే చోట ఉంది. ఇవన్నీ జరిగినా పీఎఫ్‌ఐ ‌సానుభూతిపరుల నుంచి ఎలాంటి ప్రతిఘటన రాలేదు. దీనితో పీఎఫ్‌ఐ ‌ప్రస్తుతం వెనక్కి తగ్గిందనే అంతా భావిస్తున్నారు. దీనితో పాటు కేరళ హైకోర్టు తీసుకున్న వైఖరి కూడా ఆ సంస్థ నేతలకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. నిషేధం ప్రకటించగానే కేరళ మొత్తం మీద పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు వీరావేశంతో చేసిన విధ్వంసం ఇప్పుడు ఆ సంస్థ పాలిట శాపమైంది. ఆ సందర్భంగా రూ. 5.2 కోట్లు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నష్టాన్ని అరెస్టయిన పీఎఫ్‌ఐ ‌కార్యకర్తల నుంచి వసూలు చేయాలని హైకోర్టు కలెక్టర్లను ఆదేశించింది. పీఎఫ్‌ఐ ‌రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్‌ ‌సత్తార్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్‌ ‌పెట్టుకోవడం కూడా శాపమైందనే అనాలి. కోర్టు ఈ బెయిల్‌ను నిరాకరించడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు సంభవించిన ఆ రూ.5.2 కోట్ల నష్టాన్ని చెల్లించ వలసిందని ఆదేశించింది. ఎవరూ చెల్లించడానికి ముందుకు రాకపోతే రెవిన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించైనా ఆ డబ్బు వసూలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హర్తాళ్‌ ‌సందర్భంగా విధ్వంసానికి దిగిన 300 మంది మీద కేసులు నమోదు చేశారు. మొత్తానికి 3000 మందిని అరెస్టు చేశారు. కాంగ్రెస్‌, ‌సీపీఎంల ప్రాపకంగా ఎదిగిన పీఎఫ్‌ఐని అణచి వేయడానికి హైకోర్టు వేసిన జరిమానాతో పోలీసులకు మంచి అవకాశం వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని రాష్ట్ర మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం విశేషం.

 నిషేధం ప్రభావం

నిషేధం విధింపుతో ఈ సంస్థ ఇక ముందు నిధులు వసూలు చేయడం, సభ్యులను చేర్చుకోవడం సహా మరే ఇతర కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుండదు. సదస్సులు, నిరసనలు, ప్రచురణలు, వీటికి సంబంధించిన మరే ఇతర కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదు. పీఎఫ్‌ఐ ‌బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, కార్యాలయాలను ప్రభుత్వం జప్తు చేయవచ్చు. సంస్థకు చెందిన ఆఫీస్‌ ‌బేరర్లు పరిమితు లకు లోబడి మాత్రమే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పీఎఫ్‌ఐ ‌ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 23 రాష్ట్రాల్లో దీని శాఖలున్నప్పటికీ కేరళ, తమిళనాడు, అస్సాం, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. పీఎఫ్‌ఐ ఒక వర్గ రహిత సంస్థగా, అందరికీ సమన్యాయం అందుబాటులో ఉండే సమాజ ఏర్పాటుకు పాటు పడే సామాజిక సంస్థగా దేశ రాజధాని ఢిల్లీలో సొసైటీస్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌యాక్ట్ ‌కింద రిజిస్టరయింది. దీని రాజకీయ విభాగం సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా (ఎస్‌డీపీఐ, దీనిని నిషేధించలేదు. దీనిని నిషేధించే అధికారం ఎన్నికల కమిషన్‌దే)కు 2019-21 మధ్యకాలంలో రూ.11 కోట్లకు పైగా విరాళాలు అందాయని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ విరాళాల్లో అత్యధిక మొత్తం తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచే అందడం గమనార్హం. ఎస్‌డీపీఐ 2009 జూన్‌లో ఏర్పాటైంది. 2010లో ఢిల్లీలో గుర్తింపులేని రాజకీయ పార్టీగా రిజిస్టరైంది.

—————————————————————

ఆర్‌ఎస్‌ఎస్‌లోనూ చొరబడాలని..

పీఎఫ్‌ఐ ‌తన ప్రధాన శత్రువుగా చూస్తున్న సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. ఆ ‌సంస్థలోను తన సభ్యులను జొప్పించడానికి పీఎఫ్‌ఐ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. లక్నోలోని బక్షి కా తలాబ్‌ ‌దగ్గర అరెస్టు చేసిన ముగ్గురు పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు- మహమ్మద్‌ ‌ఫైజన్‌, ‌మహమ్మద్‌ ‌సూఫియాన్‌, ‌రెహాన్‌ల ద్వారా ఉత్తరప్రదేశ్‌ ‌ప్రత్యేక టాస్క్ ‌ఫోర్స్ ఈ ‌విషయం సేకరించింది. సంఘ్‌ ‌కార్యక్రమం, ఇతర వివరాలు రహస్యంగా సేకరించడం వీరి పని. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఉండదు. ఎందుకు హాస్యాస్పదమో సంఘ్‌కు ఒక్కసారి హాజరైనా అది అర్ధమవుతుంది. కానీ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పెద్దల కదలికల గురించి సమాచారం ఆ ముగ్గురి దగ్గర దొరికిన ల్యాప్‌ ‌టాప్‌లలో, పత్రాలలో దొరికింది. అలాగే ప్రతి ప్రాంతంలోను తమ సభ్యులను ఆర్‌ఎస్‌ఎస్‌లోకి పంపాలని పీఎఫ్‌ఐ ‌పెద్ద కుట్రే పన్నింది. చిత్రం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్‌లోని ఈ బక్షి కా తలాబ్‌ ‌దగ్గరి ఒక గ్రామానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి పీఎఫ్‌ఐ ‌సభ్యుడే.

————————————————————————–

కంటితుడుపు నిషేధం కాదు

ప్రభుత్వం నిషేధాన్ని కంటితుడుపు చర్యగా ప్రకటించలేదు. గతంలో స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఇం‌డియా (సిమీ)తో జరిగిన అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాల నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా నిషేధాన్ని అమలు చేసింది. నిజానికి 2001 సెప్టెంబర్‌ 11‌న యుఎస్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో మొదటిసారి 2001 సెప్టెంబర్‌ 26‌న సిమీ నిషేధానికి గురైంది. తర్వాత కేంద్రం 2003 సెప్టెంబర్‌ 27‌న రెండోసారి, 2006, ఫిబ్రవరిలో మూడోసారి సిమీపై నిషేధాన్ని పొడిగించింది. ఈ నిషేధం తర్వాత ఆ సంస్థ తనను తాను రద్దు చేసుకుంది. ఫలితంగా ఎటువంటి కార్యకలాపాలు లేకుండా పోయాయి. కార్యకర్తలంతా పీఎఫ్‌ఐలో చేరారు. కాబట్టి నిషేధం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఈ అనుభవం దృష్ట్యా గత ఐదారేళ్లుగా పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థలపై కేంద్రం నిఘా పెట్టింది. సంస్థను చట్ట విరుద్ధమని ప్రకటించ డానికి ముందే, దాని ఆర్థిక నెట్‌వర్క్‌ను కుప్పకూల్చడం ఇక్కడ కేంద్రం తీసుకున్న గొప్ప చర్య. అంటే ఆర్ధిక కార్యకలాపాలను స్తంభింపజేసింది. ముందుగా పీఎఫ్‌ఐ ఆర్థిక మార్గాలను స్తంభింప జేయడంతో సంస్థ వెన్ను విరిచినట్లయింది. ముందుగా పీఎఫ్‌ఐ ‌నాయకులను అరెస్ట్ ‌చేయడం వల్ల, దాని మొత్తం వ్యవస్థనే కూకటివేళ్లతో పెకలించి నట్లయింది. అదీకాకుండా సిమీ విషయంలో మాదిరిగా పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు మరో కొత్త సంస్థలో చేరి కొత్త పేర్లతో వ్యవహరించకుండా కేంద్రం గట్టి వ్యూహంతో వ్యవహరించింది. సంస్థను నిర్వీర్యం చేసి నిషేధించడం అనే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు జరపడం వల్ల కొత్తపేర్లతో మళ్లీ పుట్టుకొచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు మరో రూపంలో మరో సంస్థలో చేరినట్లయితే వారిని ప్రభుత్వం అరెస్ట్ ‌చేయవచ్చు. ఇందుకు చట్టబద్ధమైన అధికారం ప్రభుత్వానికి ఉంది. కేంద్రం ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లనే దేశంలో ఎక్కడా ఏ విధమైన అల్లర్లు, గొడవలు లేకుండా పీఎఫ్‌ఐని సమర్థవంతంగా దెబ్బతీయడం సాధ్యమైంది.

వివిధ రాజకీయ పార్టీల స్పందన

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు ప్రధానంగా నిషేధాన్ని స్వాగతించారు. విపక్షాల వైఖరి విద్రోహానికి ఏమీ తీసిపోదు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై తదితర బీజేపీ నాయకులు కేంద్రం చర్యను సమర్థించారు. ఈ నిషేధాన్ని ఎస్‌డీపీఐ అధ్యక్షుడు ఎం.కె. ఫైజీ ఖండించడం సహజమే. పీఎఫ్‌ఐ ‌వంటి సంస్థలపై కేవలం నిషేధం చాలదని, రాజకీయంగా ఏకాకిని చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడగా, కేరళ కమ్యూనిస్టు పార్టీ సెప్టెంబర్‌ 28 ‌వరకు మౌనం వహించడం గమనార్హం. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం పీఎఫ్‌ఐపై కఠిన చర్యలు ప్రారంభించింది. కేరళలో కాంగ్రెస్‌, ‌దాని సంకీర్ణ భాగస్వామి ఇండియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లిం లీగ్‌ ‌నాయకులు తప్పని పరిస్థితుల్లో కేంద్ర చర్యను సమర్థిస్తూనే, ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించాలని వెర్రి ఆశను ప్రకటించారు. సమాజాన్ని విడగొట్టడానికి మతాన్ని వాడుకునే సిద్ధాంతాలను కాంగ్రెస్‌ ‌వ్యతిరేకిస్తున్నదని ఆ పార్టీ నేత జైరామ్‌ ‌రమేశ్‌ ‌పేర్కొన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ‌నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య శాంతి భద్రతలకు విఘాతం సృష్టిస్తున్న ఏ సంస్థనైనా నిషేధించడంలో తప్పులేదంటూనే ఆర్‌ఎస్‌ఎస్‌నూ నిషేధించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ‌కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని కోరడంలో పెద్ద విశేషం లేకపోయినప్పటికీ, పీఎఫ్‌ఐని నిషేధించడాన్ని సమర్థించక పోవడం గమనార్హం. ఈ నిషేధాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తనదైన కోణంలో చూస్తూ, తిక్క భాష్యం చెప్పారు. సంస్థ కార్యకలాపాలు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను కేంద్రం బట్టబయలు చేసిన నేపథ్యంలో ఎవరో కొందరు నేరానికి పాల్పడితే మొత్తం సంస్థనే నిషేధించడం తగదని పేర్కొనడంలో అర్థంలేదు. పీఎఫ్‌ఐ అనుసరిస్తున్న విధానాలను తాను వ్యతిరేకిస్తాననడం, మరోపక్క ప్రజాస్వామ్య విధానాలకే తన మద్దతు అని చెప్పడం అసదుద్దీన్‌ ‌రెండు నాల్కల వైఖరి. కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పీఎఫ్‌ఐ ‌విద్యార్థి విభాగం ప్రకటించింది.

ఒక్కటి నిజం. ఇంతగా జడలు విప్పి ఆడుతున్న ముస్లిం మతోన్మాద భూతాన్ని ఒక్క తూటా కూడా ప్రయోగించకుండా, కేవలం చట్టబద్ధంగానే మోదీ ప్రభుత్వం శిరచ్ఛేదం చేసింది. ఇది అపూర్వం. పీఎఫ్‌ఐ ఒక పీడకల. గతం. మళ్లీ వేరే పేరుతో వస్తే ఇంతకు మించిన మూల్యం చెల్లించాలి. సిమీ తరువాత పీఎఫ్‌ఐ. ఆ ‌రెండింటికీ ఎలాంటి గతి పట్టిందో జాతి చూసింది. రేపూ అంతే.

భారత్‌ను ముస్లిం రాజ్యం చేయాలన్న కుట్ర ఊహించడానికే వికృతంగా ఉంది. పీఎఫ్‌ఐ, ఎంఐఎం, ‌ముస్లింలీగ్‌ ‌వంటి మిగిలిన మత సంస్థలు ఆ ప్రయత్నం చేయడంలో అసలు అర్ధం ఉందా? 21వ శతాబ్దం నుంచి ప్రపంచాన్ని వెనక్కి తిప్పాలన్న ఆలోచన చేయగలిగేది మెదడు పుచ్చినవాళ్లు మాత్రమే. అలాగే 80 శాతం ప్రజలను 20 శాతం ప్రజలు పాలిస్తారా? పీఎఫ్‌ఐ ఆలోచన ఇదే. పొరుగున ఉన్న పాకిస్తాన్‌ ‌వీళ్లకి ఆదర్శం. అఫ్ఘానిస్తాన్‌ ‌మత సూత్రాల మార్గదర్శి. ఇంతకీ ఆ మతరాజ్యాలలో ఏం జరుగుతోంది? దారిద్య్రం, మహిళల మీద దాడులు, వెనకబాటుతనం, తుపాకీ సంస్కృతి, వేర్పాటువాదం.. ఇవి తప్ప ఇంకేం ఉన్నాయి? ఈ సంగతి ఆ దేశాలే చెప్పుకుంటున్నాయి. మాది అడుక్కుతినే దేశమని సాక్షాత్తు పాకిస్తాన్‌ ‌ప్రధాని నిస్సిగ్గుగా ప్రకటించినా ఇక్కడి మతోన్మాదులకు బుద్ధిరాదేమి? పీఎఫ్‌ఐ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్న ఛాందసవాదాన్ని ఇరాన్‌, ‌టర్కీ వంటి ముస్లిం పాలక దేశాల స్త్రీలే బాహాటంగా వ్యతిరేకిస్తు న్నారు. దేశం ఇస్లామిక్‌ అయితేనేం, మరేమైపోతేనేం? ఈ లోపున తాము ఒక్కసారి పాలిస్తే చాలునన్న నీచ ప్రవృత్తిలో చాలా భారతీయ ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ముస్లిం మతోన్మాదాన్ని ఎంతగా వ్యతిరేకించాలో, దానిని పరోక్షంగా అంటకాగుతున్న విపక్షాలను కూడా అంతే తీవ్రంగా నిరాకరించ వలసిన సమయం వచ్చింది. మైనారిటీలకు ఇలాగే ఊడిగం చేస్తారా? దేశ విచ్ఛిత్తికి సహకరిస్తారా? లేదంటే హిందువుల సంగతి కాస్త పట్టించుకుంటారా లేదా? దేశ ఐక్యత, భారతీయ సంస్కృతి పట్ల మీకు గౌరవం ఉందా లేదా అని అడిగి మరీ ఓటు వేయవలసిన అవసరం ఇప్పుడు ఉంది. భారతదేశ సంక్షేమమే హిందువుల సంక్షేమం కాబట్టి ఈ దేశానికీ, హిందువులకీ ఎలాంటి మేలు చేస్తారో చెప్పమని పార్టీలను, నేతలను నిలదీయాలి.

– ‌జమలాపురపు విఠల్‌రావు/ జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram