– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

అక్టోబర్‌ 11 ‌పైడితల్లి అమ్మవారి జాతర

‘విజయ’నగరం, ‘వీర’బొబ్బిలి సంస్థానాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో ఆత్మార్పణ చేసుకున్న సర్వజనహితైషి పైడిమాంబ. విజయనగరం సంస్థానాధీశుల ముద్దులపట్టి. చిన్నతనం నుంచి భక్తిభావం ఎక్కువ. దేవీ ఉపాసకురాలు. అన్న విజయరామరాజ గజపతిరాజు అంటే ప్రాణం. సంస్థానంలోని ప్రజల సుఖసంతోషాలను, అన్న క్షేమాన్ని కోరుకునే ఆమె, ఆయన హతుడు కావడాన్ని తట్టుకోలేక బలిదానం చేసుకుని గ్రామదేవతగా అవతరించింది. కళింగాంధ్రతో పాటు సరిహద్దు రాష్ట్రాల భక్తులతో పూజలందుకుంటున్న బంగారు (‘పైడి’)తల్లి. ఆమెకు ఏటా నిర్వహించే ‘సిరిమాను’ ఉత్సవం సందర్భంగా విద్యల నగరం భక్తజన సంద్రమవుతుంది. వృత్తి, ఉపాధి కోసం దూరప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ఈ ఉత్సవానికి తరలి వస్తారు కులమతవర్ణ వర్గాలకు అతీతంగా సర్వులూ ఆమెను కొలుస్తారు.

కళింగాంధ్రలో పేరెన్నిక గన్న విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు సమ ఉజ్జీలుగా ఎదిగి చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నా సన్నిహితంగా మెలిగేవి. విదేశీయుల ‘విభజించు పాలించు’ రాజకీయాలు వీటినీ ప్రభావితం చేశాయి. ఆ నేపథ్యంలో నాటి విజయనగరం సంస్థానాధీశుడు విజయరామరాజు గజపతి రాజమహేంద్రవరం సందర్శించిన ఫ్రెంచి నాయకుడు మార్క్విస్‌ ‌డి బుస్సీ కాస్టెల్‌నౌ రాజకీయ ఎత్తుగడలో పావుగా మారారని చరిత్రకారులు అంటారు.

బుస్సీ హైదరాబాద్‌ ‌సమీపంలో బస చేసినప్పుడు మసూచి సోకి ఆయన సైనికులలోని చాలా మంది చనిపోయారని, ఆర్థిక సంక్షోభంలో పడిన ఆయనను విజయరామరాజు గజపతి ఆదుకున్నారని చరిత్ర చెబుతోంది. అప్పటికే బొబ్బిలి సంస్థానం శక్తి మంతంగా ఉండడంతో పాటు ఫ్రెంచి పాలకులకు కప్పం చెల్లించేందుకు నిరాకరించడం బుస్సీకి కంటగింపైంది. దాంతో వారిపై పగ సాధింపునకు విజయ రామరాజును ఆయుధంగా వాడుకునేందుకు బుస్సీ వ్యూహం పన్నాడు. అలా రెండు సంస్థానాల మధ్య వైరం పెంచాడు. విజయరామరాజును బొబ్బిలి పైకి ఉసికొల్పాడు. బుస్సీ కుట్రలకు లొంగి తన అన్న బొబ్బిలిపై కదనానికి దిగడంతో కలత చెందిన సోదరి పైడిమాంబ ఆయనకు అనేక విధాలుగా నచ్చ చెప్ప చూసింది. అయినా ఆయన పంతం వీడలేదు. పోరుకు దిగి విజయం సాధించినా, తాండ్రపాపా రాయుడి ప్రతీకారానికి బలైపోయాడు. అన్నకు ప్రమాదం పొంచి ఉందని దీక్షాబలంతో గ్రహించిన ఆమె తమ రాజవంశానికి సన్నిహితుడు పతివాడ అప్పలనాయుడు సహాయంతో గుర్రపుబగ్గీపై బొబ్బిలి బయలుదేరింది. విజయనగరం కోట దాటి పెద్దచెరు వును సమీపించే సరికి అన్న మరణ సమాచారం (జనవరి 26, 1757) చెవిన పడింది. దానిని తట్టుకో లేక ఆమె చెరువులో దూకి ఆత్మార్పణం చేసుకుంది.

ఆ తర్వాత ఆమె పతివాడకు కలలో కనిపించి, తాను చెరువులో విగ్రహ రూపంలో ఉన్నట్లు చెప్పడంతో విజయదశమి తరువాత వచ్చిన మంగళ వారం నాడు విగ్రహాన్ని వెలికితీయించారు. పూసపాటి వంశీయులు ఆమెకు అక్కడే గుడి కట్టించారు. అలా, పైడిమాంబ దైవత్వం పొంది అమ్మవారుగా వెలిశారని స్థానికులు ఆరాధిస్తారు. అప్పటిలో చిట్టడివిలా ఉన్న ఆ ప్రదేశంలలో గుడి కట్టడం వల్ల దానిని ‘వనం గుడి’ అనేవారు. పతివాడ అప్పలనాయుడే ఆలయ తొలి పూజారిగా నియమితులయ్యారు. (ఆయన వంశీయులే పూజారులుగా కొనసాగు తున్నారు). ఆనంద గజపతిరాజు రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి (ఆ మరుసటి సంవత్సరం) ఏటా విజయదశమి తరువాత వచ్చే మంగళవారం నాడు ‘సిరిమానోత్సం’ నిర్వహించ సాగారు. నాటి నుంచి 167ఏళ్ల పాటు అమ్మవారు అక్కడే పూజలందుకున్నారు. అయితే వనం గుడి ఊరికి దూరంగా ఉందన్న భావనతో కోటకు సమీపంలోని ప్రస్తుత మూడు లాంతర్ల కూడలిలో 1924లో ఆలయం నిర్మించి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు. దీనిని ‘చదురుగుడి’ అంటారు. 1980లో ఆలయ గోపురం నిర్మితమైంది. హిందూ ఆలయాలలో ధ్వజస్తంభాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. అయితే పైడితల్లికి సంబంధించిన ఈ రెండు ఆలయాలలోనూ అవి కనిపించవు. సిరిమానునే ధ్వజస్తంభంగా భక్త జనం ముందుకు తీసుకువెళతారని చెబుతారు.

తోలేళ్ల ఉత్సవం

సిరిమాను ఉత్సవానికి ముందు రోజు ‘తోలేళ్ల’ ఉత్సవం నిర్వహిస్తారు. తొలకరి ముందు భూమిని దున్నిన రోజును ‘తొలి ఏరు’ అంటారని, అదే ‘తోలేళ్లు’గా మారిందని చెబుతారు. సాధారణంగా తొలికరిలో పొలం పనులు మొదలు పెడితే ఇక్కడ అమ్మవారి పండుగనే తోలేళ్ల ఉత్సవంగా జరుపు కుంటారు. ‘ఏరు’ అంటే నాగలి. దానితో తొలిసారిగా పనులు చేపట్టడం అన్నమాట. ఆ రోజున రైతులకు పంపిణీ చేసే విత్తనాలను నాటితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయ ధర్మకర్తలు, పూసపాటి వంశీయులు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. ఘటాలను ఊరేగింపుగా కోట దగ్గరకు తెచ్చి, కోటశక్తికి పూజలు చేసిన తర్వాత వాటిని గుడికి చేరుస్తారు. ఆలయ పూజారి అమ్మవారి జన్మ వృత్తాంతాన్ని వివరిస్తారు. ఆ రాత్రంతా భామాకలాపం ఆడతారు. నాగినీ నృత్యాలతో పాటు పులివేషాలు, ఎలుగుబంటి, రాక్షస, పిట్టలదొర వేషాలతో పాటు కర్ర, కత్తిసాము, కోలాటం, సాముగరిడీలు ముమ్మరంగా ప్రదర్శితమవుతాయి.

‘సిరిమానోత్సవం’ విశిష్టత

పైడిమాంబ జాతరలో ‘సిరిమానోత్సవం’ తలమానిక సన్నివేశం. శరన్నవరాత్రుల ప్రారంభం నాడే, అంటే… ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు అమ్మవారి ఆలయం ఎదుట నేరేడు చెట్టు కొమ్మను నాటి జాతర ఏర్పాట్లు మొదలుపెట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

‘సిరిమాను’ తయారీకి ఉత్సవానికి నెల ముందే అనువైన చింతచెట్టును ఆలయ పూజారి గుర్తిస్తారు. ఎంపిక చేసిన చెట్టు మొదట్లో కుంభం పోసి అన్నదానం చేసి, చెట్టును మొదలును తప్పిస్తారు. మేళతాళాలతో పూజారి ఇంటికి తరలిస్తారు. హుకుంపేటలోని వడ్రంగులు దానిని సిరిమానుగా మలుస్తారు.

సుమారు 50-60 అడుగుల నిడివి గల సిరిమాను తయారీ పక్రియలో భాగంగా చెట్టు దిగువ భాగాన్ని తల ఆకారంలో, చివరి భాగంలో అమ్మవారు (ప్రధాన పూజారి) కూర్చునేందుకు వీలుగా పీఠం అమర్చుతారు. దీనిని ఎడ్లబండిపై ఉంచి రెండు పక్కల ఇరుసు మానులకు బిగిస్తారు. మాను కొసన పొడుగైన తాడు (మోకు)ను వేలాడదీస్తారు. సిరిమానును అధిరోహించే ప్రధాన పూజారిని పైడితల్లమ్మగా పరిగణిస్తారు. అందుకే కలికి తురాయితో తలపాగా, నుదుట బొట్టు, కుడిచేతిలో నిమ్మకాయలు, ఎడమ చేతిలో విస్సన్నకర్ర, బొడ్డులో కత్తితో వచ్చే ఆయన పాదాలను పసుపు నీళ్లతో కడుగుతూ ఆహ్వానిస్తారు. చిన్నారులను నేలపై పడుకోపెడతారు. ఆయన వారిని దాటుకుంటూ వెళితే చిన్నారులకు కీడు ఉంటే తొలగిపోయి మంచి జరుగుతుందని తల్లిదండ్రుల విశ్వాసం. సాధారణంగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సిరుమాను ఆలయానికి చేరుతుంది. దానికి పూజాదికాలు జరిపిన తరువాత పూసపాటి రాజవంశీయులు సిరిమానును లాంఛనంగా లాగి ఊరేగింపును ప్రారంభిస్తారు. సిరిమాను అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు మూడుసార్లు నడుస్తుంది. గజపతుల ఆడపడుచులు కోటబురుజు నుంచి ఉత్సవాన్ని వీక్షించి అమ్మవారికి నీరాజనాలు అర్పిస్తారు.

అంజలి రథం

సిరిమానోత్సవంలో తెల్ల ఏనుగు మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. సంస్థానాధీశులు భద్రగజాన్ని అధిరోహించి సిరిమాను ముందు నడిచేవారు. దానిని భక్తులు ఐరావతంగా పరిగణించేవారు. ఈ ఆచారం 1956 వరకు కొనసాగింది. అటు తరువాత ఏనుగు ఆకారంలో రూపొందించిన బండిని వినియోగిస్తు న్నారు. దానిపై ఏడుగురు మహిళా వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. స్త్రీ వేషధారులను పైడితల్లి అమ్మవారి అక్కాచెల్లెళ్ల లాంటి గ్రామదేవతలుగా, పురుషుడిని పోతురాజుగా భావిస్తారు. వీరంతా అందరికి నమస్కరిస్తూ సాగుతారు కనుక ‘అంజలి రథం’ అంటారు.

జాలరి వల

సిరిమానోత్సవంలో జాలర్లకు ప్రత్యేక స్థానం ఉంది. చెరువు గర్భం నుంచి అమ్మవారి విగ్రహాన్ని వెలికితీయడంలో స్థానిక జాలర్ల సహాయం విశేష మైనదిగా చరిత్ర చెబుతోంది. వారికే ఆమె విగ్రహం తొలిసారి దర్శన భాగ్యం దక్కింది. నాటి నుంచి జాలర్లు సిరిమానోత్సవంలో ప్రముఖంగా పాల్గొంటూ వస్తున్నారు. అమ్మవారి విగ్రహం తెలికితీతకు వల ఉపయోగించినందున దానిని ఉత్సవంలో ఉంచుతారు. అప్పట్లో కోట వెనుక దట్టంగా ఉన్న అడవులలో నివసించే గిరిజలు కోటకు రక్షణగా ఉండేవారట. వారిని స్మరించుకుంటూ కొందరు ఈటెలు ధరించి డప్పుల శబ్దంతో ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు పాతికేళ్లుగా అమ్మవారికి పెద్ద చెరువులో హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వ హిస్తున్నారు.

పైడిమాంబను కనకదుర్గ అంశంగా విశ్వసిస్తారు. ఒకప్పుడు బెజవాడను ఏలిన విజయనగరం పూసపాటి వంశీయుల మూలపురుషుడు రఘునాథ రాజు ధర్మపాలనను మెచ్చిన దుర్గమ్మ ఏడు ఘడియల పాటు కనకవర్షం కురిపించిందని, ‘కనకం’ అంటే ‘పైడి’ (స్వర్ణం) కనుక కనకదుర్గమ్మే ‘పైడితల్లి’గా అవతరించిందని విశ్వాసం. ఒక్కొక్క ప్రాంతవాసులు పిల్లలకు అక్కడి దేవుడు, దేవతల పేర్లు పెట్టుకోవడం అనవాయితీగా వస్తున్నట్లే ఉత్తరాంధ్రలో పైడిమాంబ పేరుతో పైడితల్లి, పైడమ్మ, పైడిరాజు, పైడన్న, పైడప్పడు లాంటి పేర్లు కనిపిస్తున్నాయి. సిరిమానోత్సవం నాటి (మంగళవారం) తర్వాత వచ్చే మంగళవారం నాడు గుడి వద్ద స్తంభానికి ఊయల (ఉయ్యాల కంబాల) కడతారు. కార్తిక శుద్ధ పాడ్యమితో సిరిమాను ఉత్సవాలు ముగుస్తాయి.

About Author

By editor

Twitter
Instagram