– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న ఆనందంతో 1947 ఆగస్టు 15న దేశమంతా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటే హైదరాబాద్‌ ‌నిజాం మాత్రం తపంచాలు పేల్పించి ప్రజల ప్రాణాలు తీశాడు. ఇది ఒక వైపరీత్యం. ఆ విపరీత, విషాద ఘట్టాలపై నైజాంలో ‘రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, ధనవంతుల అకృత్యాలకు దబలైన బతుకులెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన కంఠాలెన్నో’ అని దాశరథి కృష్ణమాచార్యులు అన్నారు.

మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌హైదరాబాదు సంస్థానానికి చివరి నిజాం. బ్రిటిష్‌ ‌పాలకులకు విశ్వాసపాత్రుడైన మిత్రుడిగా వలస వ్యతిరేకులపై సైన్యాలను నడిపి, వలస పాలకులకు కొమ్ము కాసి ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేశాడు. ప్రజల నుండి వంద రకాల పన్నులు వసూలు చేసుకునే అధికారం దొరలకి దఖలు పరచాడు. ఆ దొరల గడీల్లో జరిగిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వారి నుంచి తనకు క్రమం తప్పకుండా నజరానాలు, కప్పాలు వస్తే చాలు అన్నట్లుండే వాడు. అలా ప్రపంచంలోనే రెండవ పెద్ద ధనవంతుడిగా పేరు మోశాడు. ప్రజల నెత్తుటితో పోగుపడిన ధనంలో 10వ వంతు సొంత ఖర్చులకే ఉపయోగించేవాడు. ప్రపంచ విహారం చేయడానికి దక్కన్‌ ఎయిర్‌లైన్స్‌ను ఖరీదు చేశాడు.  ‘ప్రాణములొడ్డి ఘోర అడవులను పడగొట్టి మంచి మాగాణములన్‌ ‌సృజించి, ఎముకలు నుసిజేసి పొలాలు దున్ని భోషాణముల నిండా నవాబుకు స్వర్ణము నింపిన రైతులదీ తెలంగాణము’ అన్నారు దాశరథి.

 పంద్రాగస్టున మౌంట్‌ ‌బాటెన్‌ ‌ప్రణాళిక ప్రకారం భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినా దేశం రెండు ముక్కలైంది. అవి ఇండియన్‌ ‌యూనియన్‌, ‌పాకిస్థాన్‌. ‌స్థానిక సంస్థానాలు రెండు దేశాలలో దేనిలోనైనా చేరవచ్చు. కానీ తాను స్వతంత్ర రాజ్యంగా కొనసాగడానికే మొగ్గు చూపాడు నిజాం. భారత ఉక్కు మనిషి సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌ ‌భారత్‌కు అనుకూలంగా ఉండే సంస్థానాలన్నిటినీ భారత్‌లో చేర్చారు. దక్షిణ భారత్‌ ‌నడిబొడ్డున గల హైదరాబాద్‌ ‌మాత్రం విలీనానికి అంగీకరించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రూమెన్‌ను కలిశాడు. ఐక్యరాజ్య సమితిలో కేసు వేశాడు, 85 శాతం హిందూ ప్రజలను భయభ్రాంతులను చేసి తనకు అను కూలంగా మార్చుకోవడానికి నరరూప రాక్షసుడిగా చెప్పదగిన కాసిం రజ్వీని రప్పించాడు. అతని అనుయాయులే రజాకారులు. హిందూ ప్రజలపై పెద్ద ఎత్తున దురాగతాలకు పాల్పడ్డారు.

‘మా నిజాం నవాబు జన్మ జన్మల బూజు’ అని దాశరథి• నిప్పులు చెరిగారు. ‘గోల్కొండ ఖిల్లా కింద గోరీ కడతాం’ అని యాదగిరి పాటెత్తుకున్నాడు. ‘తూ కిషన్‌ ‌పర్షాద్‌ ‌హైతో మై ఖుదా పర్షాద్‌’..‘ ‌పర్షాద్‌’ అం‌టే ప్రసాదం. నువ్వు కృష్ణుడి ప్రసాదమైతే, నేను ఖుదా ప్రసాదాన్ని అంటూ దాడులకు తెగబడి హిందువుల గుర్తుల మీద బొట్లపైన మతద్వేషాన్ని వెళ్లగక్కడంతో ఆ దాష్టీకాన్ని భరించలేకే గిరిజన నాయకుడు కొమరం భీం, చాకలి ఐలమ్మ తిరగ బడ్డారు. అబీద్‌ ‌రోడ్డులో నారాయణరావు పవర్‌ ‌నిజాంపై బాంబు విసిరాడు.

రజాకారులు బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. చెల్లించలేని వారి గోళ్ల కింద మాంసం కత్తిరించి, గోళ్లు ఊడబీకేవారు. భర్తల ముందే భార్యలపై అత్యాచారం చేయడం, రజాకారులకు భయపడి ఎవరైనా పారిపోతే వారి ఆచూకీ చెప్పా లంటూ వారి భార్యలను వేధించేవారు. లేకపోతే ఇంట్లో పిల్లల్ని పైకి ఎగరవేసి కత్తికి గుచ్చి చంపేవారు. రజాకార్ల దండు గుర్రాలపై వెళుతూంటే  ప్రజలు ఇళ్ల తలుపులు మూసుకుని వాటి సందుల్లోంచి చూసేవారట. వాళ్లు వెళ్తున్నప్పుడు పొరపాటున ఎవరైనా ఎదురైతే గుర్రాలకు కట్టి పాశవికంగా చచ్చేదాకా ఈడ్చుకు వెళ్లేవారట. భారత ప్రభుత్వానికి సహకరించే వారిని చంపుతామని బెదిరించేవారు. ఆ సమయంలో 32 వేల మంది స్థానికులు మిలిటరీ కంటోన్మెంట్‌లో దాక్కున్నారు. ప్రజల భాష తెలుగును నిజాం నిషేధించాడు. తెలుగు పత్రికలను దొంగతనంగా చదువుకోవాల్సి వచ్చేది. హిందూ పండుగలు నిషేధించి, బొట్టు పెట్టుకుంటే రజాకారులు తమ నాలుకతో నాకేసేవారు.

హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని స్వతంత్య్ర రాజ్యంగా ఉంచాలని కాసింను నిజాం తన ప్రతినిధిగా ఢిల్లీకి పంపాడు. హైదరాబాద్‌ను ఇండియన్‌ ‌యూనియన్‌లో కలిపితే మేము ఒప్పుకోబోమని, అలా జరిగితే అక్కడి కోటిమందిని ఊచకోత కోస్తామన్న కాసిం బెదిరింపు లను సర్దార్‌ ‌వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ఏ ‌మాత్రం లక్ష్యపెట్టలేదు. ‘నీకు ఇద్దరు భార్యలు ఆరుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ మీ నిజాంకు పదుల సంఖ్యలో భార్యలు, వందల సంఖ్యలో పిల్లలున్నారు. వారంతా క్షేమంగా ఉండాలన్నదే మా కోరిక’ అని సమాధానమిచ్చారు. దానితో కాసిం దౌత్యం బెడిసికొట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రూమెన్‌ ‌ద్వారా చివరి ప్రయత్నంగా ఐక్యరాజ్య సమితికి కూడా విన్నవించుకున్నాడు.

 హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికే మొగ్గుచూపిన షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‌వంటి దేశభక్తులను హత్య చేశారు. రజాకార్లు కాసిం రజ్వీ నాయకత్వంలో హిందూ జనాభాపై హింసాత్మక దాడులు ప్రారంభించారు. దానితో పోలీసు చర్య ద్వారా రజాకార్లను, నైజాం సైన్యాన్ని ఓడించి హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేశారు. రజాకార్లు హిందువులపై చేసిన హింసాకాండ, మారణకాండ వర్ణనాతీతం.

ఇనుగుర్తిలో ఒద్దిరాజు సోదరులు ఓ గ్రంథాల యాన్ని, ఓ పత్రికను నడుపుతూ తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కారణంతో 1922 దాడి చేసి వాటిని తగులబెట్టారు. షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‘ఇ‌మ్రోజ్‌’ అనే పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను ఎండగట్టాడు. మత దురహంకారాన్ని నిలదీశాడు. రజాకారుల చర్యలను నిష్పక్ష పాతంగా, నిర్భయంగా రాశాడు. ఆతను పత్రిక ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా (1948 ఆగస్టు 22న) హత్య చేశారు. సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ’ పత్రిక ద్వారా నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. అనేక గ్రామాల ప్రజలు గ్రామ రక్షక దళాలుగా సంఘటితమై రజాకార్లను ఎదుర్కొన్నారు. వీర భైరాన్‌పల్లి, పెనుమానూరు, పరకాల, నెల్లికుదురు, కుటిగల్‌, ‌లింగాపూర్‌, ‌దూల్మిట్ట సంఘటనలు వాటిలో ప్రధానమైనవి. బైరాన్‌పల్లిని కేంద్రంగా చేసుకుని రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. వీరిలో దువ్వూరి రామిరెడ్డి, మురళీధరరావు, ముకుందరెడ్డి నాయకత్వంలో కాపుకాసి గెరిల్లా దాడులు చేశారు. లింగాపూర్‌, ‌దుల్మిట్ట గ్రామాల్లో దోచుకున్న సంపదను ఎత్తుకెళుతుండగా, స్వాధీనం చేసు కున్నారు. బైరాన్‌పల్లి రక్షక దళంపై రజాకార్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే వారు బురుజులో ఉండుట వలన ప్రాణాలతో బయట పడ్డారు. బురుజుపై మూడుసార్లు దాడి చేసి విఫలమయ్యారు కానీ 1948 ఆగస్టు 27 అర్ధరాత్రి 1200 మంది సైన్యంతో ఖాసీలద్నూర్‌ ‌గ్రామానికి చేరుకొని 96 మందిని కాల్చి చంపి స్త్రీలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక కొందరు మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఓజమ్మ అనే భైరాన్‌పల్లె సమరయోధురాలు చెప్పారు. ఇక్కడ పోరు జరుగుతుండగా కొందరు రజాకార్లు కూటిగల్‌ ‌గ్రామంపై దాడి చేసి అనేక మందిని చంపారు. ఆ మారణహోమం నుంచి తప్పించుకున్నానని వంగపల్లి బాలయ్య అనే గ్రామస్థుడు చెప్పారు.

నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన మరో పోరుగడ్డ ‘పరకాల’ ఇది సూర్యాపేట దగ్గరలో ఉంది. సెప్టెంబర్‌ 2‌వ తేదీన పరకాల తాసీల్దార్‌ ‌కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగుర వేయాలని నిర్ణయించుకున్న ఉద్యమ నేతలు ప్రతి గ్రామం నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పోలీసులు వరంగల్‌ ‌జిల్లాలో అన్ని సమావేశాలను నిషేధించారు. అయినప్పటికీ సమీప గ్రామాల నుంచి దాదాపు 1500 మంది కార్యకర్తలు జెండావిష్కరణకు బయలుదేరారు. వారు చాపలబండ వద్దకు వచ్చేసరికి రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరపగా 22 మంది అక్కడికక్కడే మరణించారు. 10 మంది గాయపడ్డారు. పరకాల వీరుల్లో వడ్డేపల్లి వీరయ్య, ఆకుతోట మల్లయ్య మొదలైన వారి చరిత్ర ముందు తరాలకు తెలిసేలా అక్కడ అమరధామం నిర్మించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 2‌వ తేదీన దానికి నివాళులర్పిస్తారు.

మహబూబాబాద్‌ ‌జిల్లా డోర్నకల్‌ ‌మండలంలోని ‘పెరుమాండ్ల సంకీస’ పల్లెవాసులు రజాకారులతో పోరాడడానికి సైనిక శిక్షణ తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజాకార్లు ఓ రోజు రాత్రి ఊరుపైబడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడి, రైతులను బంధించి కాల్పులు జరిపారు. కొన ఊపిరితో ఉన్న మరికొందరిని గడ్డివాముల్లో వేసి సజీవ దహనం చేశారు. ఆ సంఘటనలో 21 మంది అమరులయ్యారు. కూరపాటి సత్తయ్య, గుండా ముత్తయ్య, కాశం లక్ష్మీ నరసయ్య, బీరెడ్డి నరసయ్య, దేశబోయిన వీర వెంకటయ్య, కనకం కిష్టయ్య, కనకం సర్వయ్య, గుండ్రాతి రామయ్య, తీరాలా గురవయ్య, రామయ్య, బాలయ్య నాయిని అప్పయ్య, సోమన బోయిన రాములు, శెట్టి పేద నరసయ్య, రామయ్య చైనా నరసయ్య, దాసరి కిష్టయ్య మొదలైనవారు అగ్నికి ఆహుతయ్యారు.

ప్రజలు ఓ రోజు రాత్రి కత్తులు, కర్రలు, కారం పొడి, బాంబులతో నెల్లికుదురు ఠాణాపై దాడి చేసి విజయం సాధించారు. ఆనపకాయ బుర్రలో ఎండుమిర్చి నింపి అందులో నిప్పులు వేసి బాగా పొగ వచ్చేటట్లు చేసి దాన్ని ఠాణాపై విసిరారు. మూడు రోజుల పాటు కాల్పులు జరిగాయి. చివరకు నాలుగో రోజు నిజాం సైనికులు, రజాకార్లు లొంగిపోయారు.

 నిజాం ఎన్ని పన్నాగాలు పన్నినా, దురాగతాలు చేసినా చివరకు సర్దార్‌ ‌పటేల్‌ ‌చొరవ, పట్టుదల మేరకు సైనిక చర్య ద్వారా భారత సైన్యం 1948 సెప్టెంబర్‌ 13‌న హైదరాబాద్‌ను చుట్టుముట్టడించి (ఆపరేషన్‌ ‌పోలో) నిజాంను 1948 సెప్టెంబర్‌ 17‌న లొంగదీసుకోగలిగింది.

‘దగాకోరు బటాచోర్‌ ‌రజాకారు పోషకుడవు.

దిగిపొమ్మని జగత్తంత నగరాలు కొడుతున్నది.

దిగిపోవోయ్‌, ‌తెగిపోవోయ్‌’ అన్న దాశరథి నినాదం ఫలించినట్లయింది.

కాసిం రజ్వీ పాకిస్థాన్‌ ‌పారిపోయాడు. చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ 24 ‌ఫిబ్రవరి 1967లో మరణించాడు.

About Author

By editor

Twitter
Instagram