– గన్నవరపు నరసింహమూర్తి

వాకాటి  పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది’’ అని నిన్న చెప్పాను. అది నిజమో కాదో ఈ ప్రయోగం ద్వారా మీరు తెలుసుకుంటారు’’ అంటూ మూడు అట్టలతో తయారుచేసిన పరికరాలను, వాటి మధ్యలో ఉన్న రంధ్రాలతో ఒకే వరసలో ఉన్నట్లు పేర్చి ఒక చివర కొవ్వొత్తి వెలిగించాడు మహేష్‌..

అతను ఆ ఊరి జిల్లా పరిషత్‌ ‌హైస్కూల్లో ఫిజిక్స్ ‌మాష్టారు..

ఆ తరువాత ఇద్దరు విద్యార్థుల్ని పిలిచి ఇటువైపు అట్టకున్న రంధ్రం గుండా చూసి ఏం కనిపిస్తుందో చెప్పమని అడిగాడు.

వాళ్లు చూసి ‘‘వెలుగుతున్న కొవ్వొత్తి కనిపిస్తోంది, సర్‌’’ అని చెప్పారు.

అప్పుడు మహేష్‌ ‌మధ్యలో అట్టని కొద్దిగా పక్కకి జరిపి ‘‘ఇప్పుడో?’’ అని అడిగితే వాళ్లు ‘‘కనిపించటం లేదు సర్‌’’ అని చెప్పారు. ఆ తరువాత మరో ముగ్గుర్ని పిలిచాడు, వాళ్లూ అదే చెప్పారు… అలా ఐదు నిమిషాల్లో క్లాసులోని యాభైమంది పిల్లలకి ఆ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూపించాడు..

‘‘దీని ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు?’’ ఆ ప్రయోగాన్ని అందరికీ చూపించిన తరువాత వాళ్లను ప్రశ్నించాడు మహేష్‌..

‘‘‌కాంతి తిన్నగా ప్రయాణిస్తుంది.’’ అని వాళ్లందరూ గట్టిగా చెప్పారు. ‘‘కరెక్ట్… ‌దాన్నే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పాలి.’’

ఇంతలో స్కూలు ముందర మారుతీ డిజైర్‌ ‌కారాగింది.. అందులోంచి ఒక వ్యక్తి దిగి స్కూలు వైపు రావడాన్ని మహేష్‌ ‌గమనించాడు.

నల్ల కళ్లద్దాలు, సూటూబూటుతో వస్తున్న వ్యక్తి ఎవరో అర్థం కాక గాబరాపడి క్లాసు నుంచి బయటకు వచ్చి ‘‘ఎవరు మీరు?’’ అని అడిగాడు.

ఆ వ్యక్తి నల్ల కళ్లజోడుని సవరించుకొని ‘‘ఏరా! అప్పుడే నన్ను పోల్చుకోలేనంత వాడివయ్యేవట్రా?’’ అంటూ కళ్లజోడు తీసాడు…

ఇప్పుడు ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించ సాగింది. అంతే మహేష్‌ ‌ముఖంలో చిరునవ్వు…

‘‘ఓరి నువ్వట్రా సూర్యం’’… కళ్లజోడు పెట్టుకునే సరికి పోల్చుకోలేక పోయాన్రా… రా లోపలికి’’ అంటూ అతన్ని క్లాసులోకి తీసికెళ్లాడు మహేష్‌…

‌మాష్టారు మహేష్‌తో పాటు ఇంకో కొత్త వ్యక్తి లోపలికి రావటాన్ని చూసిన విద్యార్థులంతా ‘‘నమస్కారం’’ అంటూ లేచి నిలబడ్డారు..

‘‘కూర్చోండర్రా… వీడు నా చిన్ననాటి స్నేహితుడు సూర్యనారాయణ… మేమిద్దరం ఈ స్కూల్లోనే చదువుకున్నాం… వాడు నా కన్నా పెద్ద చదువులు.. అంటే ఇంజనీరింగ్‌ ‌చదివి అమెరికాలో పెద్ద ఇంజనీరుగా పనిచేస్తున్నాడు’’ అంటూ అతన్ని పరిచయం చేసాడు.

‘‘ఏంట్రా! పిల్లలకి సైన్స్ ‌పాఠాలు అదర గొట్టేస్తున్నావే… నీకింకా చిన్నప్పటి అలవాట్లు పోలేదన్నమాట… చూడండి పిల్లలూ… మీ మాష్టారికి చిన్నప్పట్నుంచి సైన్స్ అన్నా, ప్రయోగాలన్నా మహా సరదా… వీడే కానీ అప్పుడు నాతో పాటు అమెరికా వస్తే నా కన్నా పెద్ద సైంటిస్ట్ అయ్యేవాడు’’ అనీ వాళ్లతో చెప్పాడు…

ఇంతలో పిరియడ్‌ ‌ముగిసినట్లు బెల్‌ ‌విని పించటంతో మహేష్‌ ‌సూర్యాన్ని వెంటబెట్టుకొని స్టాఫ్‌ ‌రూమ్‌కి వచ్చాడు.

అక్కడ నలుగురు ఉపాధ్యాయులు కూర్చొని ఉన్నారు. వాళ్లకి సూర్యాన్ని పరిచయం చేశాడు. ఆ తరువాత అక్కడికి దగ్గర్లోని టీస్టాల్‌ ‌కి తీసికెళ్లాడు మహేష్‌. ‌టీలు తెచ్చి ఇచ్చాడు కుర్రాడు.. చిన్నప్పుడు ఇదే టీస్టాల్లో టీ తాగుతూ చదువుకునే రోజులు మహేష్‌కి గుర్తుకు రాసాగాయి.. 15 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో మహేష్‌, ‌సూర్యం చదువు కున్నారు.

మొదట్నుంచీ మహేష్‌కి సైన్స్ అం‌టే చాలా ఇష్టం.. 8వ తరగతిలో ఉన్నప్పుడు అప్పల్నాయుడు అనే సైన్స్ ఉపాధ్యాయుడు ఉమ్మెత్త పువ్వు గురించి చెబుతూ బోర్డ్ ‌మీద దాని బొమ్మ గీసి అన్ని భాగాలను ప్రత్యక్షంగా చూపిస్తూ చెప్పేవాడు. దాంతో మహేష్‌కి దాని గురించి బాగా తెలిసింది.

అలాగే భౌతిక శాస్త్రంలో న్యూటన్‌ ‌వర్ణచక్రం గురించి చక్రాన్ని తిప్పుతూ సప్తవర్ణాలన్నీ తెలుపు వర్ణంగా కనిపించడానికి గల కారణాన్ని వివరించడం మహేష్‌ ‌మనసులో ముద్రపడిపోయింది.

ఆ తరువాత భౌతిక శాస్త్రాన్ని ఔపాసన పట్టడం మొదలుపెట్టాడు. కాంతి, ధ్వని, విద్యుచ్ఛక్తి, అయస్కాంతం, ఘర్షణ (ఫిక్షన్‌), ‌వేగము, త్వరణము, అణుశక్తి, స్నిగ్ధత (విస్కాసిటి), రశ్యుధారత (రేడియో యాక్టివిటి) ఇవన్నీ పదవతరగతికి వచ్చేసరికి కరతలామలకం అయ్యాయి.

10వ తరగతి మహేష్‌ ‌ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైతే సూర్యానికి ద్వితీయ శ్రేణి వచ్చింది. మహేష్‌ ‌తండ్రి పేదరైతు కావడంతో ఇంటర్మీడియెట్‌ ‌చదివించడానికి డబ్బులు లేక వ్యవసాయం చేసు కోమని చెప్పాడు. కానీ మహేష్‌ ‌గొడవ పెట్టడంతో తల్లి గొలుసమ్మి అతన్ని ఇంటర్లో చేర్పించాడు.

సూర్యం వాళ్ల నాన్న ఆ ఊరి మోతుబరి కావటంతో అతను విశాఖలో కార్పొరేట్‌ ‌కళాశాలలో చేరాడు.

ఇంటర్‌ ‌తరువాత బీయస్సీలో మహేష్‌ ‌చేరితే, సూర్యం డొనేషన్‌ ‌కట్టి ఇంజనీరింగ్‌ ‌చేసి అమెరికా వెళ్లి ఎమ్మెస్‌ ‌చేసి అక్కడే పెద్ద సాఫ్ట్‌వేర్‌ ‌కంపెనీలో ఉద్యోగంలో చేరాడు..

మహేష్‌ ‌బీయస్సీ తరువాత బీఈడీ చేసిన తరువాత జిల్లా పరిషత్‌ ‌పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు.

అప్పట్నుంచీ తన విద్యకు పదును పెట్టి విద్యా ర్థులకు సైన్స్ ‌బోధించ సాగాడు. రెండు సంవత్స రాల్లో ఆ స్కూలు పేరు జిల్లాలో మారుమ్రోగి పోయింది. 50 మందిలో 40 మందికి ప్రథమ శ్రేణి రావడమే కాకుండా సైన్స్‌లో 80 శాతం మందికి 90 మార్కులు దాటడం ఆ స్కూలు ప్రతిష్ఠని మరింత పెంచింది. అనతి కాలంలోనే మహేష్‌ ‌పేరు జిల్లాలో మారుమ్రోగిపోయి రెండు సంవత్సరాల తరువాత ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యాడు.

ఆ తరువాత తను పనిచేస్తున్న పాఠశాలకి సరైన ప్రయోగశాల లేకపోవడంతో స్వంత డబ్బు ఖర్చు పెట్టి చాలా పరికరాలు కొనుగోలు చేసి పిల్లలకు పాఠ్యాంశాలు బోధించడం మొదలుపెట్టాడు.

ఆ విషయం ఒక దినపత్రికలో రావడంతో కలెక్టర్‌ ఆ ‌పాఠశాలని సందర్శించి ప్రయోగశాల కోసం రెండు లక్షల రూపాయలు మంజూరు చెయ్యడంతో అన్ని పరికరాలు అందుబాటులోకి వచ్చి మహేష్‌ ‌పిల్లలకు సైన్స్‌ని మరింత సౌకర్యంగా బోధించడం మొదలు పెట్టాడు. ఆ సంవత్సరం.. ఆ స్కూల్లో పదవ తరగతి చదివిన 10 మంది విద్యార్థులకు ఐఐటీలో సీట్లు రావడంతో మహేష్‌ ‌పేరు రాష్ట్రంలో మారుమ్రోగి పోయింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పుడతను చాలా పాఠశాలలకి వెళ్లి పదేసి రోజులపాటు సైన్స్ ‌బోధించటంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం కూడా పెరగడం మొదలైంది.

ఆ సంవత్సరం 100 మంది రాష్ట్ర విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు రావడంతో జాతీయ స్థాయిలో మహేష్‌కి పేరొచ్చింది. ఎన్నో పత్రికలు, ఛానళ్లు అతని ఇంటర్వ్యూలను ప్రచురించి, ప్రసారం చేసాయి. అనేక కార్పొరేటు స్కూళ్లు అతన్ని తమ సంస్థల్లో చేరాలని కోరినా మహేష్‌ ఒప్పుకోలేదు.

**************

మహేష్‌కి గతం అంతా ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలింది.

‘‘ఏంట్రా మహేష్‌… ‌నువ్వు బాగా పాఠాలు చెబుతున్నావనీ, ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నావని తెలిసింది. నీలాంటి తెలివైనవాడు అమెరికాలో ఉండాలి కానీ ఇలాంటి పల్లెల్లో ఉంటే ఎలా చెప్పు? నువ్వు ఊ.. అంటే నీకు అమెరికాలో ఉద్యోగం వచ్చే ఏర్పాట్లు ఇప్పుడే చేస్తాను.’’ అన్నాడు సూర్యం.

‘‘అవన్నీ ఇప్పుడెందుకురా. నువ్వు రావడం చాలా ఆనందంగా ఉంది. పద ఇంటికి వెళదాం’’ అన్నాడు మహేష్‌.

‘‘ఏమిట్రా! నువ్వీ పల్లెటూళ్లోనే ఉంటున్నావా? దగ్గర్లోని పట్నంలో ఉండొచ్చు కదరా?’’

‘‘పాఠశాల ఉపాధ్యాయులందరూ అది ఉన్న ఊళ్లోనే ఉండాలన్నది ప్రభుత్వ నిబంధన… అయినా నాకు ఇక్కడే బాగుంది… పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వాళ్లకి చదువు చెబుతుంటాను. అయినా నువ్వు అమెరికా వెళ్లిన తరువాత రావడమే మానేశావు.. మమ్మల్నందర్నీ మరిచిపోయిన ట్లున్నావు’’ అన్నాడు మహేష్‌.

‘‘‌నేను అమెరికా వెళ్లిన నాలుగు సంవత్సరాలకు నాన్నగారు, అమ్మ చనిపోయారు. అప్పుడే నేను మొదటిసారిగా వచ్చాను. ఆ తరువాత మా పొలం అమ్మేసి వెళ్లిపోయాను. ఒకసారి అమెరికా జీవితానికి అలవాటు పడ్డ వాళ్లకి ఇక్కడికి తిరిగి రాబుద్ధి కాదురా…’’

‘‘మరిప్పుడు దేనికి వచ్చావురా? ఏదైనా పని పడిందా?’’

‘‘అవున్రా! మా బావమరిది కొడుక్కి పెళ్లి… అందుకే వచ్చాను. ఎలాగూ వచ్చాను కాబట్టి నిన్ను, మన ఊర్ని చూడాలని వచ్చాను.’’

‘‘చాలా మంచి పనిచేసావురా… నువ్వొచ్చావని రమణని కూడా రమ్మంటాను అని అతనికి సూర్యం రాక గురించి సమాచారం ఇచ్చాను. వాడు పక్క ఊళ్లోనే నాలాగే లెక్కల మాష్టారుగా పనిచేస్తున్నాడు’’ అని చెప్పాడు మహేష్‌. ‌రమణ కూడా వాళ్లతోపాటే ఆ ఊరి హైస్కూల్లో 10వ తరగతి దాకా చదివాడు. అతడి తండ్రి అదే స్కూల్లో సోషల్‌ ‌మాష్టారుగా పనిచేసేవారు.

అలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగానే మహేష్‌ ఇల్లు వచ్చింది.

అది ఆ ఊరి చివరలో ఉంది. కొత్తగా కట్టిన స్లాబ్‌ ఇల్లు. చుట్టూ పచ్చటి పొలాలు.. వెనకవైపు ఏరు.. చల్లటి గాలి వీస్తోంది..

ఇంటి ముందర మామిడి, కొబ్బరి చెట్లున్నాయి. వాళ్లిద్దర్ని చూడగానే మహేష్‌ ‌భార్య బయటకొచ్చి మంచినీళ్లు ఇచ్చింది. ‘‘నా భార్య సులోచన’’ అని భార్యని సూర్యానికి పరిచయం చేసాడు.

‘‘సులోచనా! ఎప్పుడూ చెబుతుంటానే అమెరికా సూర్యం వీడే…’’ అని చెప్పగానే ఆమె సూర్యానికి నమస్కారం చేసింది.

‘‘నీ పిల్లలురా?’’ అని అడిగాడు. వాళ్లు మా స్కూల్లోనే చదువుతున్నారు.

భోజనానికి దూరమని ఇంటికి రారు. కేరేజ్‌ ‌పట్టుకెళ్తారు’’ అని అతను చెబుతుండగానే రమణ మోటారు సైకిల్‌ ‌మీద వచ్చాడు.

అతన్ని చూడగానే సూర్యం ‘‘ఎలా ఉన్నావురా రమణా?’’ అని అడిగాడు.

‘‘బాగానే ఉన్నాము… నువ్వెలాగున్నావు? అయినా నీకేంటి అమెరికాలో ఉన్నావు’’ అన్నాడు నవ్వుతూ. అరగంట తరువాత ముగ్గురికీ భోజనాలు అరిటాకుల్లో వడ్డించింది సులోచన.

వేడి అన్నం, పప్పు, సాంబారు, పచ్చడితో చాలా రుచిగా ఉంది భోజనం. చాలా రోజులకి మంచి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ తిన్నాడు సూర్యం.

భోజనం తరువాత ముగ్గురూ డాబా మీదకు వెళ్లారు…. కొబ్బరి చెట్టు నీడలో చాపమీద కూర్చున్నారు. చల్లటి మలయమారుతం వీస్తుంటే మనసు ఆహ్లాదకరంగా ఉంది.

‘‘మహేష్‌! ‌నువ్వేం మారలేదురా… ఎంత సేపూ పిల్లలూ, చదువూ, స్కూలూ తప్పా డబ్బు వెనకేసు కుందామన్న ధ్యాసే లేదు నీకు’’ ఈ వయసులో సంపా దించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాము చెప్పు? ఇంకా నువ్వు అద్దింట్లోనే ఉండటం చాలా బాధగా ఉంది. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న నువ్వు నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించక పోవడం తప్పు..’’ అన్నాడు సూర్యం.

ఇంతలో ఓ ఆరుగురు విద్యా ర్థులు, వాళ్ల తల్లితండ్రులతో పాటు డాబా మీదకు వచ్చారు. వస్తూనే ఆ విద్యార్థులు మహేష్‌ ‌కాళ్లకు దండం పెట్టారు. అందులో ఓ వ్యక్తి ‘‘మాష్టారూ! మీ వల్లే ఈ ఆరుగురికి ఐఐటీలో సీట్లొచ్చాయి. మీరు చెప్పిన విధానం, మూలాలు నేర్పించిన వైనం వీళ్లకు ఆ సీటు వచ్చేటట్లు చేశాయి. మీ వల్ల మన రాష్ట్రంలో ఈ సంవత్సరం వందమందికి పైగా ఐఐటీల్లో సీట్లు వచ్చాయి. ఇక వైద్య విద్యలో అయితే చెప్పక్కర్లేదు. ఒక దీపం వేవేల దివ్వెల్ని వెలిగిస్తుందన డానికి మీరే సాక్ష్యం’’ అని చెప్పి వాళ్ల ముగ్గురికి స్వీటు ఇచ్చాడు. ఆ తరువాత వాళ్లు వెళ్లిపోయారు. ‘‘సూర్యం… డబ్బు అన్నది చంచల మైనది. అది స్థిరంగా ఒకరి దగ్గర ఉండదు. మీ తాత ఈ ఊరి జమీందారు.. కానీ మీ నాన్నగారి సమయంలో అంతా పోయింది. మళ్లీ నువ్వు సంపాదిస్తున్నావు. అటువంటి డబ్బు వెనక మనం పడకూడదు. ధనం మనకు, మన కుటుం బాలకే సుఖ సంతోషాలనిస్తుంది కానీ పదిమందికి సాయం చేస్తే కొన్ని వందల కుటుంబాలు బాగుపడ తాయి. నువ్వు అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపా దించావు. కానీ నీ గురించి ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. నీలాంటి వాళ్లు అమెరికాలో చాలామంది ఉన్నారు. కానీ పదిమందికి చదువు చెబుతూ వాళ్ల కోసం తాపత్రయం పడుతూ మహేష్‌ ‌చేస్తున్న ఈ విద్యాయజ్ఞం చక్కని ఫలితాలనిస్తోంది. ఇప్పటికి వెయ్యిమందికి పైగా ఐఐటీల్లోనూ, ఇంకా మంచి విద్యాలయాల్లోనూ చదువుతూ మంచి మంచి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. కొంతమంది ఐఏయస్‌, ఐపీయస్‌కి కూడా ఎంపికయ్యారు. మనం మనకోసం కాకుండా ఇతరుల కోసం బతికితే అందులో ఉన్న ఆనందం ఎంత డబ్బు సంపాదించినా రాదు. అధిక ధనం మనిషికి స్వార్థాన్నీ, అసూయనీ పెంచీ దుఃఖా లకు కారణమవుతుంది. పేదలకి సహాయం చేస్తే వాళ్ల జీవితాల్లో వెలుగొస్తుంది’’ అని చెప్పాడు రమణ.

ఆ మాటలు సూర్యం గుండెని తాకాయి. ఆ తరువాత అతను చాలా సేపు మౌనం వహించాడు. సూర్యం వాళ్లతో రెండు రోజులు గడిపి అమెరికా వెళ్లిపోయాడు.

**************

నెలరోజుల తరువాత మహేష్‌ ‌పేరిట 50 లక్షల రూపాయల చెక్కు, ఒక ఉత్తరం సూర్యం నుంచి వచ్చాయి.

‘‘మహేష్‌! ‌మొన్నగానీ నేను నీ దగ్గరికి రాకుండా ఉంటే మనిషి ఎలా బతకాలో తెలిసేది కాదు. అక్కడికి రావటం వల్ల నా అంతఃచక్షువులు తెరుచుకొన్నాయి. ఇతరులకు ఇవ్వటంలో ఉన్న గొప్పతనం తెలిసింది. ఇప్పుడు నా గమ్యం ఏమిటో తెలిసింది. నేను పంపిన డబ్బు పాఠశాలల్లో ప్రయోగశాలలకు, గ్రంథాలయాల కోసం ఖర్చు పెట్టు.. ఇక నుంచి ప్రతి సంవత్సరం పంపిస్తుంటాను. కొన్నాళ్ల తరువాత నేను కూడా అక్కడికి వచ్చి నీ సేవలో పాలుపంచుకుంటాను. – సూర్యం’’ అని అందులో ఉంది. ఆ ఉత్తరాన్ని చూసి మహేష్‌ ‌కళ్లు చెమర్చాయి.

About Author

By editor

Twitter
Instagram