– పొత్తూరు రాజేంద్ర ప్రసాద్‌వర్మ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘బావాజీ’’ జయ నెమ్మదిగా పిలిచింది. తండ్రికి ఎదురుగా రాకుండా గొడ్లసావిడిలో వాల్చిన మంచం పక్కన నిల్చుని.

కూర్చుని దూడ వెయ్యకు గడ్డి తినిపిస్తున్న రామచంద్రరాజు తలెత్తి కూతురు వైపు చూసాడు.

‘‘మా రాజు గారు.. అదే మీ అల్లుడు గారు.. కొత్తగా మనింట్లో పుట్టిన దూడను నాతో పంపించ మని మిమ్మల్ని అడగమన్నారు…’’ జయ మాటలు నెమ్మదిగా అన్నా ఆయనకు ములుకుల్లా గుచ్చుకున్నాయి

గడ్డి పరకలు మేస్తున్న దూడను, దానిని ఆనుకుని కర్రకు కట్టిన తల్లి ఆవును మార్చిమార్చి చూసాడు. తర్వాత కూతురు వైపు తిరిగి. ‘‘ఈ దూడంటే నాకు ఎంతో ఇష్టమమ్మా.’’ అన్నాడు దానిని దగ్గరకు తీసుకుంటూ…

‘‘ఎందుకో ఆయన గారికి ఈ లేగ దూడ మీద మనసయ్యింది. ఇది కాస్త పెరిగి పెద్దయితే ఇంట్లో పాలకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పమన్నారు..’’

రామచంద్రరాజు ఏమీ మాట్లాడలేదు. గోధుమ రంగులో ముద్దొస్తున్న దూడను తల్లి పక్కన పడుకోబెట్టి మంచం వెనుక నిల్చున్న కూతురు వైపు చూసి..‘‘ కొత్తగా పుట్టిన ఈ ఆవు దూడే అల్లుడు గారికి కావల్సి వచ్చిందా? పాడి ఆవు కావాలంటే సంతలో కొను క్కోవచ్చు కదా?’’ పాకలోంచి ఇంటిలోకి నడిచారు.

కూతురు జయ కూడా తండ్రి వెంటే నడుస్తూ.. ‘‘బావాజీ.. మీరు ఇస్తామన్న కట్నం డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదని అత్తయ్య గారు కూడా మూడు సార్లు అన్నారు. ఎలాగైనా ఆవుదూడను పంపించమన్నారు..’’

అల్లుడు ఏటుకూరి కుమారరాజు పట్టుదల రామచంద్రరాజుకు తెలుసు. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనే రకమన్న విషయం చిన్నతనం నుం చీ చూస్తున్నాడు. బంధుత్వాలు కొనసాగాలని మేన మామ పదే పదే బతిమిలాడ బట్టి ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు. కానీ జూట్‌ ‌మిల్లులో కార్మికుడిగా పని చేసేవాడికి తన ముద్దుల కూతుర్ని ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు.

‘‘బావాజీ.. మా రాజుగారి పట్టుదల మీకు తెలియంది కాదు. దూడను తీసుకుని రాకపోతే నన్ను కూడా వాళ్లింటికి రావద్దని కూడా చెప్పారు..’’

రామచంద్రరాజు కూతురు వైపు చూసాడు. తలొంచుకుని ఓ వార నిల్చుంది. మాసిపోయిన చీర జాకెట్టు వేసుకుంది. పెళ్లయి నాలుగేళ్లయినా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. పెళ్లి చేసినా పెట్టింది పెద్దగా ఏమీ లేదు. కట్న కానుకల ఊసే లేదు. అమాయకంగా అడుగుతున్న కూతురు పట్ల జాలి కలిగింది..

‘‘చూద్దాంలే.. జయమ్మా.’’ అంటూ బైట గోలెంలో చెంబును ముంచి కాళ్లు కడుక్కుని ఇంటిలోకి వెళ్లిపోయాడు. జయ తండ్రి వెళ్లిన వైపే చూస్తుండిపోయింది.

అత్తవారింటి నుంచి వచ్చి రెండు వారాలు దాటి పోయింది. అత్తవారిది రాయినిపేట చిన్న పల్లెటూరు. రాజుల తాళ్లవలసను ఆనుకుని ఉంటుంది.. పెళ్లయి నప్పుడు అందరు అమ్మాయిల్లాగా ఆమె కూడా ఎన్నో కలలుకంది. పేద క్షత్రియ కుటుంబంలో పుట్టిన తనకు అంతకన్నా మంచి సంబంధం తీసుకు రావడం బావాజీకి కష్టమని తెలుసు. అందుకే తన అత్తవారిల్లు మేడిల్లు కాకపోయినా సరిపెట్టుకుంది. చిన్న పూరిపాకనే ఇంద్ర భవనంగా భావించింది. భర్త చేసే జూట్‌ ‌మిల్లు ఉద్యోగానికి వచ్చే జీతం ఇంటిలో వారి పోషణకు సరిపోక పోయినా ప్రతినెలా పుట్టింటి నుంచి బావాజీ పంపించే పచారీ సామాన్లు, తిండి గింజలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రోజువారీ జీవితం నిస్సారంగా గడుస్తున్నా తల్లి దండ్రుల వెన్ను దన్నులు జయకు ధైర్యాన్ని ఇచ్చేవి.

‘‘జయమ్మా.. ఏమి చేస్తున్నావు?’’ ఇంటి లోపలి నుంచి అమ్మయ్య గట్టిగా పిలవడంతో జయ ఆలోచనల నుంచి బైటపడింది.

‘‘వస్తున్నా అమ్మా.’’ ఇంటి లోపలికి దారి తీసింది. బావాజీ అని పిలిచే తండ్రి అంటే చిన్నతనం నుంచి ఒక లాంటి భయం ఉండేది.

కానీ అమ్మయ్య వద్ద అటువంటిది ఏమీ ఉండేది కాదు. ఏ విషయమైనా తనతో నేరుగా చెప్పగలిగేది.

‘ఫ•లహారం తినకుండా ఏమీ చేస్తున్నావమ్మా..’’ అంది తల్లి లక్ష్మి

పీట వేసి దాని ముందు కంచంలో ఉప్మా పెట్టి…’’ చాలా పొద్దు పోయింది. తిను తల్లి..’’ అంది ప్రేమగా.

తల్లి చూపించిన ప్రేమకు జయకు ఏదోలా అయిపోయింది.

పెళ్లయి అత్తారింటికి వెళ్లాక ఎన్ని ఆనందాలు కోల్పోయిందో ఆమెకు గుర్తుకు వచ్చాయి… అప్రయత్నంగా పీట మీద కూర్చుంది

భర్త కోరికను తల్లితో చెప్పా లని అనుకుంది.

‘‘అమ్మయ్యా.. ఇందాక బావాజీతో చెప్పాను. నువ్వు కూడా ఆయనతో చెప్పి ఒప్పించాలి..’’

‘‘ఏమిటి జయా..’’ ఆమె విస్మయంగా అడిగింది.

‘‘మీ అల్లుడిగారి మొండి పట్టుదల గురించి తెలుసు కదా? మనింట్లో కొత్తగా పుట్టిన లేగదూడను తోలుకుని రమ్మని నన్ను ఇక్కడికి పంపేటప్పుడు చెప్పారు.

ఆవుదూడ కాస్త పెరిగి పెద్దయిన తర్వాత పాలకు ఉపయోగపడు తుందని ఆయన గారి ఆలోచన’’ జయ నెమ్మదిగా తల్లితో చెప్పింది.

ఆమె కూతురు వైపు ఎగాదిగా చూస్తూ.. ‘‘అందుకా నువ్వు వచ్చావు? ఆవు ఈనిందని కబురు చేస్తే సరదా పడి వచ్చావనుకున్నాను… ఏకంగా పుట్టిన లేగ దూడ మీదే ఆల్లుడుగారు కన్నేసారన్నమాట. మీ బావాజీ ఈ ఆవు పాలను రెండు మూడిళ్లకు ఇస్తూ వచ్చిన దాంతో కొన్ని ఖర్చులను గట్టెక్కి స్తున్నారు. దూడ పుట్టింది కదా… అది కూడా కొంత ఉపయోగపడుతుందని ఎంతో ఆశ పడుతున్నారు. అల్లుడు గారు దూడను అడుగుతున్నారని నువ్వు చల్లగా చెబుతున్నావు..’’ ఆమె కూతురు అమాయకపు మొహంవైపు సూటిగా చూస్తూ చెప్పింది.

జయ తల్లి మాటలకు ఏమీ సమాధానం చెప్పలేదు.

కుమార రాజు కోపం ఆమెకు గుర్తుకు వచ్చింది. అతని మాట చెల్లుబాటు కాకపోతే ఎంతలా పిచ్చెక్కి పోతాడో జయకు బాగా తెలుసు. దూడను తీసుకుని తాను అత్తారింటికి వెళ్లకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో…

తిన్న కంచాన్ని నీళ్ల కుండీ పక్కన పెట్టి జయ చేతులు కడుక్కుంది. తడి చేతుల్ని చీర చెంగుతో తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి. ‘‘లేగదూడతో రాయినిపేట రాకపోతే నన్ను కూడా వాళ్లింటికి రావద్దని అన్నారు.

పుట్టింట్లోనే ఆవుల్ని కాసుకుని ఉండిపోమని కోపంగా చెప్పారు. ఆవు పెయ్యి కోసం బావాజీ, నువ్వు ఎందుకిలా అయిపోతున్నారో అర్థం కావడం లేదు..’’ జయ కూడా తల్లితో కాస్త ధైర్యం తెచ్చుకుని చెప్పింది.

‘‘అమ్మా జయా… నీకు అర్ధం కావడం లేదు. తల్లి పిల్లల్ని వేరు చేయగలమా చెప్పు? దూడ పెయ్యను వదిలి ఆవు ఇక్కడ ఉండగలదా?’’

ఇంతలో వీధిలోకి ఎవరో రైతు వచ్చాడు.. ‘‘బైరేగి రాజు గారూ పశువుల డాక్లరు వచ్చాడండి. ఆవుల్ని, గేదెల్ని చూసి మందులిస్తున్నాడు.’’ అన్నాడు

ఈ మాటలు విని ఇంటి లోపల ఉన్న రామ చంద్రరాజు బైటికి వచ్చాడు. అతని పేరు రామ చంద్రరాజు అయినా ఆ పేరు చాలామందికి తెలీదు. చిన్నప్పటి నుంచి బైరేగిరాజు గారూ! అంటూనే అందరూ పిలుస్తుంటారు.

‘‘అందరూ పశువుల్ని చూపించుకుంటున్నారు. మీ ఆవును కూడా తీసుకురండి’’ అంటూ వెళ్లి పోయాడు.

రామచంద్రరాజు గబగబా పశువుల దొడ్లోకి వెళ్లి తువ్వాలు చేతుల్లో పెట్టుకుని కింద నున్న లేగ దూడను ఎత్తుకుని దాని మీద పడుకోబెట్టుకున్నాడు. తల్లి ఆవు అతని వైపు అయోమయంగా చూసింది. తన పిల్లను ఎక్కడికో తీసుకుని వెళుతున్నారని దానికి అర్థం అయింది. లేచి నిల్చుంది.

రామచంద్రరాజు రాటకు ఆవును కట్టిన తాడును విప్పాడు. ఎత్తుకున్న దూడతో ఇంటిలో నుంచి బైటికి వచ్చాడు. తల్లి ఆవు అనుసరించింది. జయ వెళుతున్న తండ్రి వైపు చూస్తుండిపోయింది.

‘చూసావా జయమ్మా… మీ బావాజీకి ఈ ఆవు అంటే ఎంతిష్టమో.. దానికి ఏ చిన్న కష్టం లేకుండా చిన్నప్పటి నుంచి పెంచారు. అది చూలుతో ఉన్న ప్పుడు కూడా క్షణం వదిలి పెట్టేవారు కాదు. అందుకే పశువుల డాక్లరు వచ్చాడంటే పరుగెడుతున్నారు. దానికి ఏ ఇబ్బంది లేదు అయినా డాక్టరుకు చూపిం చాలన్న తపనతో వెళుతున్నారు..’’ అంది తల్లి లక్ష్మి.

‘‘బావాజీకి ఈ దూడను ఇవ్వడం కష్టమైతే పాలిచ్చే ఆవును కొనిస్తే సరిపోతుంది కదా..’’జయ తల్లితో యధాలాపంగా అంది. అలా అంటున్నప్పుడు తల్లి మొహం వైపు చూడలేకపోయింది

‘‘నీ పెళ్లి కోసం చేసిన అప్పులను ఇంకా తీర్చ లేదు. అసలుకు వడ్డీలు కడుతున్నారు. రోజు గడ వడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పాడి ఆవును కొనడం ఎంత కష్టమో తెలుసా?’’ తల్లి మాటలు జయకు కాస్త బాధ కలిగించాయి.

బావాజీ మాటలు అమ్మయ్య మాటలు ఆమెకు చికాకును కూడా తెప్పించాయి. పుట్టింటిలో భర్త హుంకరింపులు, హెచ్చరికలు గుర్తుకువచ్చాయి. తర్వాత తల్లి వైపు తిరిగి.. ‘‘పోనీలే అమ్మయ్యా… మరి రాయినిపేట వెళ్లనవరం లేదు ఇక్కడే బావాజీనీ నిన్నూ చూసుకుంటూ ఉండిపోతాను.’’ అంటూ నెమ్మదిగా నడుచుకుని ఇంటిలోకి వెళ్లిపోయింది.

కూతురు నిష్ఠూరంగా ఆడిన మాటలు ఆమెకు బాధ కలిగించాయి. ఇంటిలో పరిస్థితులు చూస్తే దయనీయంగా ఉన్నాయి.

ముదునూరి వారి ఆడపడుచుగా పెళ్లి చేసుకుని అత్తింటికి… దండ కడియాలు, బంగారు కాలి పట్టీలు, ముక్కుపుడక, నాగరాలు ఎన్నో వస్తువులతో హుందాగా వచ్చింది. ఏడుగురు అన్నయ్యలకు ఒక్కర్తె చెల్లెలు కావడంతో వారంతా ఎంతో ఇష్టపడి కట్న కానుకలు భారీగా అందించారు. విజయనగరం అయ్యకోనేరు గట్టు కింద ఉన్న రాజుల వీధిలో ఉన్న పుట్టింటి నుంచి మేనాలో ఎక్కించి పంపించారు.

బంగారు వస్తువులన్నీ కాలక్రమంలో కలిసి పోయాయి. ఒంటి మీదనున్న బంగారు ఆభరణాలన్నీ ముందు తాకట్టుకు తర్వాత మార్వాడీ వద్దకు అమ్మకానికి వెళ్లిపోయాయి. రాజుల హోదాలు దర్జాలకు ఉన్నవన్ని కరిగిపోయాయి.

పెళ్లయిన పదేళ్లకు జయ పుట్టిన సమయానికి ఆస్తులన్నీ హారతి కర్పూరం అయిపోయాయి. జీవనానికి ఇబ్బందిగా ఉండేది.

జయకు దూరపు సంబంధం చేయాలంటే కట్న కానుకలు ఇవ్వాలని మేనమామ కొడుకు కుమార రాజుతో పెళ్లి జరిపించేసారు. కూతురు అత్త వారిం టికి వెళ్లిపోయిన తర్వాత చాలా రోజులు బెంగ అనిపించింది. తర్వాత కొద్ది రోజుల్లోనే భార్యాభర్తలు సర్దుకున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఇప్పుడు మళ్లీ ఈ దూడ తంటా వచ్చి పడింది… ముదునూరి లక్ష్మిలో ఆలోచనల పరంపర.

********

‘‘లక్ష్మీ..’’ రామచంద్రరాజు భార్యను పిలిచాడు.

మంచం మీద పడుకున్న భర్త వద్దకు వచ్చింది లక్ష్మి.

రామచంద్రరాజు కళ్లల్లో తడి చేరింది. ‘‘లక్ష్మీ. పెళ్లయినప్పుడు ఎన్నో నగలతో ఇంటికి వచ్చావు. నా అలవాట్లు వల్ల అవన్నీ నీ నుంచి మాయమై పోయాయి నా పేదరికంతో కలిసిపోయి నువ్వు కూడా నాతో సాధారణంగానే జీవిస్తున్నావు. ఇప్పుడు మనింటిలో పుట్టిన లేగదూడను అల్లుడుగారు తెమ్మంటున్నారని లేకపోతే అత్తింటికి రావద్దం టున్నారని జయ అంటున్నది..’’ ఆగాడు.

‘‘ఏడుస్తున్నారా?’’

‘‘ఏడుపు నా కెప్పుడూ రాలేదు. మా బావాజీ చనిపోయినప్పుడు మొదటిసారి ఏడ్చాను. తర్వాత నాకు కంట్లో నుంచి ఎప్పుడూ చుక్క నీరు కూడా రాలేదు. కానీ ఇప్పుడు వస్తోంది’’ రెండు క్షణాలు ఏమీ మాట్లాడలేదు తర్వాత..

‘‘గోమాతను చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచాను. నేను కుడితి కలిపి పెడితే కానీ తాగదు. నేను దగ్గరుంటే కాని పాలు తియ్యనివ్వదు. దానికి పుట్టిన బంగారు తల్లిని దాని నుంచి ఎలా దూరం చేయగలను’’

భర్త మాటలు లక్ష్మిలో ఆలోచనలు రేపుతున్నాయి.

‘‘అమ్మాయి నిద్ర పోయిందో లేదో తెలీదు. పక్క గదిలోకి మన మాటలు వినిపిస్తాయి నెమ్మదిగా మాట్లాడండి..’’ లక్ష్మి అనునయించింది.

‘‘జయ చెప్పిన విషయం విన్న దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు. లేగదూడను దాని తల్లి నుంచి విడదీయలేను కొత్త పాడిఆవును కొనాలంటే అంత స్తోమత మన దగ్గర లేదు. ఉన్న అప్పులకు తోడు కొత్తగా అప్పు చేయలేను. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఛ•స్తున్నాం. ఏమి చేయాలో తెలియడం లేదు…’’ ‘‘అల్లుడు గారితో మాట్లాడి ఒప్పించవచ్చు కదా?’’

‘లక్ష్మీ… మనం రాజులం. మనని మరొకరు ఆడిగారంటే మనం వారి కన్నా పదడుగులు పైన ఉన్నట్టు లెక్క. అడిగింది కూడా ఎవరు? నా మేనల్లుడే కదా! కుమారరాజు కూడా చాలా పౌరుషం కలిగిన మనిషి. తన మాట పోయిందని తెలిస్తే ఎంతో బాధపడిపోతాడు. ఇంకొకరికి అటువంటి బాధ కలిగించడం నాకు అసలు ఇష్టం లేదు… ’’

‘‘ఏనాడూ మీ మాటను కాదనలేదు. నా నగలన్నీ తాకట్టులోకి వెళ్లిపోయిన విషయం తెలుసుకుని మా అన్నయ్య జగన్నాథరాజు మీతో గొడవకు వద్దామని అనుకున్నారు. కానీ నేనే వారించాను. మీతో ఏడడు గులు నడిచిన తర్వాత అన్నీ మీతోనే. ఈ విషయంలో మీరే నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. మనకు పాలు లేకపోయినా ఆవువల్ల వస్తున్న ఆదాయం రాకపోయినా ఇబ్బంది లేదు. అమ్మాయి మాట పడకుండా చూసుకోవాలి…’’ లక్ష్మి ఒక్కో మాట భర్తతో చెబుతున్నప్పుడు ఆమె పెదవులు సన్నగా వణికాయి.

అయినా బైటికి కనిపించనివ్వలేదు.

********

ఆవును అందంగా అలంకరించారు. కొమ్ములకు పసుపు రాసి కడుపు నిండా కుడితి పెట్టారు. లేగదూడను ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నారు. పాకను శుభ్రం చేసారు. జయ తండ్రి చేస్తున్న అన్ని పనులను గమనిస్తోంది. ‘‘జయమ్మా… అల్లుడుగారు ఎన్నింటికి వస్తారు?’’

‘‘వచ్చేస్తారు బావాజీ.. ఫోను కూడా చేసారు. ఏదో వ్యాన్‌ ‌బెత్తాయించి తీసుకుని వస్తామని అన్నారు..’’

‘‘మధ్యాహ్నానికి అల్లుడు గారికి భోజనాలు సిద్ధం చేయమని అమ్మయ్యకు చెప్పు..’’ అలా చెబుతున్న ప్పుడు రామచంద్రరాజు గొంతులో అదో లాంటి జీర…

‘‘బావాజీ.. ఆయనతో పాటు నేను కూడా అత్తారింటికి వెళ్లిపోతాను అమ్మయ్యతో ఇందాకే చెప్పాను..’’ అంది జయ.

రామచంద్రరాజు కూతురు వైపు తలెత్తి చూసాడు అతని చూపుల్లో ఎటువంటి భావం కనిపించలేదు.

భోజనం టైం అయిపోయిన వరకు గొడ్ల శాలలోనే ఆవు, దాని లేగదూడ వద్దే ఉండిపోయాడు.. అల్లుడు కుమారరాజు వచ్చి… ‘‘రండి మామయ్యా! అత్తయ్య పిలుస్తున్నారు… భోజనానికి వెళదాం’’ అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు

‘‘ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు’’ వంటి పరామర్శలు చేయడం మరిచి పోయి అతని వెనుకే వంట గదిలోకి వెళ్లి భోజనం చేసాడు.

భోజనం చేస్తున్నంత సేపూ అల్లుడు ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. మీకు శ్రమ లేకుండా వ్యాన్‌ ‌కూడా తీసుకుని వచ్చాను. లేగదూడను బాగా చూసుకుంటాను. మీకు వాటి మీదున్న ప్రేమ నాకు తెలియంది కాదు…’’

భోజనం పూర్తి అయి చేతులు కడుక్కుంటుండగా అల్లుడి దగ్గరగా వచ్చి….’’ తల్లీబిడ్డల్ని విడదీయలేను కుమారరాజా. లేగ దూడను మాత్రమే మీకు ఇవ్వలేను. దాని తల్లిని కూడా పంపిస్తున్నాను…’’ అన్నాడు.. అలా అంటున్నప్పడు అల్లుడి వైపు సూటిగా చూడలేకపోయాడు.

‘‘నిజమా! బైరేగి మామయ్యా.. నేను గొప్ప అదృష్ట వంతుడ్ని.’’ అంటూ సంబరపడిపోయాడు. దూరంగా ఉన్న వ్యాన్‌ ‌డ్రైవర్ని కేకేసి…’’ ఆవు దూడలు రెండింటిని అందులో ఎక్కించాలి ఎక్కడ బాగుం టుందో చూడు..’’ హుషారుగా అన్నాడు.

ఎత్తు ప్రదేశం కింద వ్యాన్‌ను ఉంచి ఆవును అతి కష్టం మీద ఎక్కించారు.. కిందనున్న పెయ్యి వైపు చూస్తూ తల్లి ఆవు గట్టిగా అరుస్తోంది.

జయ తన బట్టలు సర్దుకున్న పెట్టెను వ్యాన్‌ ‌ముందు సీటులో పెట్టి ఎక్కడానికి సిద్ధంగా ఉంది

లక్ష్మీ ఇంటి అరుగులో నిల్చుని ఇదంతా చూస్తోంది

‘‘లోపలున్న బొంత తీసుకుని రా… లేగ పిల్ల పడుకోవడానికి వ్యాన్‌ అనుకూలంగా లేదు..’’ భార్య లక్ష్మితో నెమ్మదిగా చెప్పాడు. అతని మాటల్లో ఆజ్ఞ లేదు. అభ్యర్ధన ఉంది. అది కూడా జాలిగా వినిపించింది. లక్ష్మి లోపలి నుంచి బొంత తీసుకుని వస్తే దాని పైన లేగ దూడను పడుకోబెట్టాడు రామ చంద్రరాజు.

అప్పటివరకు అరుస్తున్న తల్లి ఆవు తన అరుపుల్ని ఆపి బొంత మీద పడుకున్న పిల్లని నాకడం ప్రారంభించింది.

‘‘ఉదయాన్నే దీనికి కుడితి పెట్టాలి. తౌడు చిట్టు సిద్ధం చేసుకో. వెర్రి ముండకు నోరులేదు. అడగలేదు. ఆకలేస్తే గట్టిగా అరుస్తుంది అంతే! లేగపిల్లను కూడా జాగ్రత్తగా చూసుకో.. వీటినెప్పుడూ కొట్టొద్దు…’’ మరి మాటను పూర్తి చేయలేకపోయాడు.

రామచంద్రరాజు గొంతు గద్గదమైంది. అత్త మామల వద్ద సెలవు తీసుకుని కుమారరాజు వ్యాన్‌ ఎక్కాడు. అతనితో బాటు నవ్వుతూ జయ కూడా ఎక్కి కూర్చుంది. డ్రైవరు ఇంజను స్టార్టు చేసాడు.

ఆగమని డ్రైవరుకు సైగ చేసి గబగబా లోపలికి వెళ్లి గొడ్లశాలలో ఆవు కోసం ఎప్పుడో కొన్న గడ్డిని, చిట్టు బస్తాను తీసుకుని వ్యాన్‌లో పెట్టాడు.

వ్యాన్‌లో నిల్చున్న ఆవు గడ్డిని తింటూ…. రామచంద్రరాజు వైపు లక్ష్మి వైపు చూసింది.

దాని చూపు… ఎక్కడికి వెళ్లిపోతున్నానో…. ఎందుకు వెళ్లిపోతున్నానో తెలియనివిధంగా ఉంది.

రామచంద్రరాజు వ్యాన్‌ ‌లోంచి చేతులు ఊపు తున్న కూతురు అల్లుడు వైపు చూశాడు. వారిద్దరి కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతోంది.

వ్యాన్‌ ఉన్న ఆవు దూడల వైపు ఆశగా చూసాడు. ఆపుకున్న కన్నీళ్లు పొంగుకుని వచ్చాయి. ఆవు దూడలకు కన్నీటి పొర అడ్డంగా నిలిచింది.

About Author

By editor

Twitter
Instagram