– రత్న లక్ష్మీనారాయణరెడ్డి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘నేత్రదానం చేసిన అన్నల బాధితుడు’ ఆరోజు చాలా పేపర్లలో దాదాపు ఇదే శీర్షికతో వెలువడిందా వార్త. వరంగల్‌ ఎం.‌జి.ఎమ్‌. ‌హాస్పిటల్లో అంతిమ క్షణాలు లెక్కిస్తూ, తన అవయవాలను ఇతరులకు దానం చేయమని చెప్పాడతడు. ఒక్క షరతు మాత్రం పెట్టాడు. తన కళ్లని అన్నలకు, లేదంటే వాళ్ల సానుభూతిపరులకి, ఇంకా కావాలంటే వాళ్ల కన్నవారికి అమర్చితే తన జన్మ ధన్యమైందని అనుకుంటానని కూడా చెప్పాడు. మృత్యు ముఖంలోను అతడి మాట విన్నవారికి ఆశ్చర్యం కలిగింది. తన కంటి చూపుతో, అంటే మారిన దృష్టితో వారి మనసు మారుతుందని ఆశ పడుతున్నాడట. వాళ్లు, అంటే తన ఊపిరి తీయాలని అనుకున్ననవారు, అతడి కళ్లతో మన దేశాన్నీ, వాస్తవాలనీ చూడాలట.

ఈ రోజుల్లో నేత్రదానం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఇంకొందరు శరీర అవయవాలన్నీ దానం చేసి చరితార్థులు అవుతున్నారు.

ఇలాంటి కోరిక కోరిన అతడెవరు? పేరేంటన్న ప్రశ్న సహజం. పేరుదేముంది! అన్నల దాష్టీకానికి బలైన ఓ సగటు మనిషి. నక్సలైట్ల ఖిల్లాలో ఎదిగి, భారతమాత ఒడిలో ఒదిగిన ఓ వీరకిశోరం. ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు. అరవై ఎకరాల మాగాణికి ఆసామి కాదు. ఊర్లో ఓ పెంకుటిల్లు. పైగా దినసరి కూలి. ఉదయం ఆరుగంటలకు వాడకట్టు వారినందరిని పేరుపేరున లేపి ‘నిత్యశాఖ’కు తీసుకు వెళ్లడం అతడి నిత్యకృత్యం. అది అతడు మంచి పని అని నమ్మాడు. అదే వారికి, అంటే అన్నలకి కూడని పని. ఈ ‘చెడ్డ పనిని’ అతడికి పరిచయం చేసినవారు ఓ తెలుగు మాస్టారు. ఆ శాఖలో, ఆ సిద్ధాంతంలో ఏం కనిపించిందని అంత వెంపర్లాట? అంత సాహసం? చాలామంది వేసిన ప్రశ్న. ఒక్కటే జవాబు ఇచ్చేవాడు. దేశంలో ఎన్నో సిద్ధాంతాలు చలామణి అవుతు న్నాయి. వాటి కార్యక్రమాలు ఏవీ ‘భారతమాతాకీ జై’ అంటూ ముగియవు. యువకుల మనసులలో భారతమాతను ప్రతిష్టించాలని మా మాస్టారు చెప్పారు. నేను నమ్ముతున్నాను, అని చెప్పేవాడు.

‘ఈ వేషాలు మాని, బుద్ధిగా పక్కకి తప్పుకో!’ వాళ్లు ఎన్నోసార్లు హెచ్చరించారు. అతడిని అవి భయ పెట్టలేదు. పైగా అతడి కార్యదక్షతను పెంచినాయి. ఫలితం బౌతికదాడులూ జరిగాయి. దొంగదెబ్బ ఆ శత్రువు నైజం. నిశిరాత్రి దాడి చేసేవాడే శత్రువైతే జాగ్రత్తలు ఏం చేస్తాయి? ప్రభుత్వం గన్‌మన్‌లను ఇస్తామంటే, అసౌకర్యం, వద్దని చెప్పాడు. అనుమాని స్తున్నట్టే అతనిపై ప్రాణాంతక దాడి జరిగిపోయింది. ఓ రాత్రి గ్రామసభ పేరుతో పిలిపించి విచారించకుండానే తూటాల వర్షం కురిపించారు. అడ్డువచ్చిన వారిని చితక బాదారు. కొన ఊపిరితో ఎం.జి.ఎమ్‌. ‌హాస్పిటల్‌ ‌చేర్చినప్పుడు అతడు అన్న చివరిమాటలే పత్రికలలో వార్తా కథనాలయ్యాయి.

దృష్టిలోపం వచ్చిన రఘురాంరెడ్డి చెవిన పడ్డాయా వార్తలు. ఆయన పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నేత్రదాత చివరి మాటలూ ఆయనని ఆకర్షించాయి.

‘అతడి’ రెటీనా తనకు అమర్చమని హాస్పిటల్‌కు వచ్చాడు, అవసానదశలో ఉన్న రఘురాంరెడ్డి. మళ్లీ పత్రికలలో వార్తల వెల్లువ. అన్నల బాధితుడు అనే వార్తకి ఇది ఫాలోఅప్‌ అయినా కూడా, అసలు వార్తకు మించి పెద్ద చోటే ఇచ్చాయి ఒకటి రెండు పత్రికలు. కారణం- ఆయన అలనాటి వీర విప్లవవాది. రిక్రూర్‌. ఎన్నో కేసులు, పోలీసుల వేధింపులు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన చరిత్ర. అందుకే జర్నలిస్టులకు ఆసక్తి.

రఘురాంరెడ్డి ఉద్యోగంలో కాలుపెట్టినపుడు ఎందరో ఆయన మాటలకు ఆకర్షితులయ్యారు. ట్రిం చేసిన గడ్డంతో, బక్కపలచగా ఉండేవాడు. పెదవుల మధ్య నిరంతరం సిగరెట్‌. ఎక్కడైనా, ఏ వేళలో అయినా ఆయన ఉన్నాడంటే అదో సభే. బి.ఇడి.తో పాటు ఎం.ఏ ఫిలాసఫీలో పట్టు (పట్టా) ఆయన మాటలని మరింత మంత్రముగ్ధులని చేసేది. ప్రభుత్వాల మీద నిశిత విమర్శలూ, కూడు గుడ్డ, నీడ వంటి పదాలు బాగా దట్టించేవాడు. ‘గురువుగారు’ అయ్యాడు యువతకి.

మొత్తానికి ఆ ఊరిలో ఆయనంటే పడిచచ్చే గుంపు తయారైంది. దాని ప్రభావం ఎంతంటే, ఆయన కాలుపెట్టి వెళ్లిన కొద్దిరోజులకే ఊరు రెండు వర్గాలుగా విడిపోయింది. వర్గాలకీ, పార్టీలకీ అతీతంగా ఉన్న ఊరిలో ఎన్నికలు, గ్రూపులు పుట్టుకొచ్చాయి. యువతకి గురువుగారు విప్లవ సాహిత్యం అందించేవారు. అది చదివి కొందరు అడవుల బాట పట్టినారు. ఆయన పని చేసిన పది సంవత్సరాలలో ఊరు ప్రశాంతతను కోల్పోయింద న్నదే ఎక్కువ మంది నిశ్చితాభిప్రాయం. ప్లాటూన్లలో ఎక్కువ మందిని రిక్రూట్‌ ‌చేసిన ఘనత మాత్రం ఆ ఊరికే దక్కింది.

పదేళ్ల క్రితం రిటైరయ్యారు. ఈ కాలంలోనే ఓ తరమే మారి పోయింది. సిద్ధాంతాలు మారి పోయాయి. భారత రాజకీయ ముఖచిత్రం మారింది. పార్టీల రంగులు మారాయి. అసలు ప్రపంచ రాజకీయాలే దిశని మార్చేశాయి. రఘురాంరెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని మారిన ప్రపంచం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. దానిని నమ్మిన దళాలు, గ్రూపులు తుపాకులు విడిచి జనజీవన స్రవంతిలో కలసి పోయాయి. ‘లొంగు బాట’ మామూలైంది. ఈ విషయాలే పత్రికలలో వార్తా కథనాలైనాయి. రఘురాంరెడ్డి రాక ఉగ్రవాదం కుదేలైందనడానికి నిదర్శనమన్నారు కొందరు. ప్రపంచాన్ని ఏలాలనుకొన్న కమ్యూనిజం కనుమరుగై పోయిందనడానికి రుజువన్నారు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదేననీ తీర్పు ఇచ్చారు.

**************

ఇది జరిగిన కొన్ని రోజులకే ఓ యువకుడు పరామర్శించిపోదామని రఘురాంరెడ్డి దగ్గరకు వచ్చాడు. అతడు రఘురాంరెడ్డి మాస్టారి శిష్యుడు. ఆయన క్లాసు బయటి పాఠాలకి ప్రభావితుడైనవాడు కాదు. పైగా ఈ శిష్యుడు పదవ తరగతి పూర్తి చేసుకుని పాఠశాల వీడిపోతున్న సమయంలో రఘురాంరెడ్డి గారు అక్కడికొచ్చారు. ఆ కొద్దికాలంలోనే ఆ ఇద్దరు ఎన్నో విషయాల మీద మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ శిష్యుడు పట్టణంలో జాతీయవాదాన్ని ప్రవచించే విద్యార్థి విభాగంలో ఎదిగినవాడు. ప్రత్యర్థి సంఘాల విద్యార్థులతో ఎన్నో విషయాలు చర్చించేవాడు. హయగ్రీవాచారిని చంపడం నుంచి అలిపిరి బాంబు పేలుళ్ల్ల వరకు ఎన్నో!

ఇద్దరూ టీ తాగుతూ ఉండగానే అతడు అన్న ఒక్క మాటకి రఘురాంరెడ్డి దాదాపు తుళ్లిపడ్డారు.

‘గురూజీ! మీరు విన్నది అక్షరాల నిజం. అన్నలు మళ్లీ రావాలి. రావాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నా!’ అన్నాడు శిష్యుడు.

‘పాతికేళ్ల క్రితం వాళ్ల ఉనికినే ఇష్టపడని వాడివి. తీరా వాళ్లు దాదాపు కనుమరుగైపోయి అంతరించే దశలో ఉన్నపుడు మళ్లీ రావాలని చెప్పడంలో అంతరార్థం…? అని ఆర్థోక్తితో ఆగిపోయారు గురువుగారు.

మళ్లీ ఆయనే అన్నారు.

‘ఇప్పుడు కొత్తగా వాళ్ల అవసరం ఏం వచ్చింది? నీవు అర్థంకావు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలంటావు. ఎన్నికల వ్యవస్థని పూర్తిగా వ్యతిరేకించే వారు తిరిగి రావాలనడం…!’ కటువుగా అన్నారు గురువుగారు.

‘సరే, ఓటేస్తే తాట తీస్తాం అని పోస్టర్లు వేసిన నేతలు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలసిన తర్వాత ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నారు? అది ఆత్మహత్యా సదృశం కాదా? ఆ పిలుపుతో ఎంతమందిని చంపారు? కానీ జనంలోకి వచ్చాక కనీస పశ్చాత్తాపం లేకుండా అదే ఓట్ల రాజకీయంలో భాగం కావడం ఏమిటి?’ అన్నాడు ఆ శిష్యుడు.

‘ఏ వ్యవస్థలో అయినా ఒకటి రెండు అంశాలు స్వాగతించేవి ఉంటాయి. అందులో కొన్నింటిని కాలానుగుణంగా అవసరం మేరకు స్వీకరిస్తారు. కాని మొత్తం వ్యవస్థనే తిరస్కరించలేం!’ అన్నారాయన.

‘సరిగ్గా చెప్పారు. కానీ అజ్ఞాతంలో ఉన్నప్పుడు, లొంగిపోయినపుడు దళ సభ్యులు చెప్పే మాటల మధ్య పొంతన ఉండదు. ముఖ్యంగా ఆడవారు చెప్పే విషయాలు. ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుట్టడం మేలని కదా! కానీ ఆ అడవిలోనూ స్త్రీకి స్వేచ్ఛలేదని ప్రకటించారు వారు. గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలనీ, ఉద్యమంలో భాగంగా ఎవరో ఒకరికి లొంగిపోవాని నిర్బంధం చేస్తారనీ ఎందరో చెప్పారు. అవి నిజమే అయినా ఆ సిద్ధాంతం సమాజానికి అసలు ఏమీ చేయలేదని నేను మొండిగా వాదించను. వారే లేకుంటే తెలంగాణ పల్లెల్లో భూస్వాములు ఎంత చెలరేగిపోయేవారో అన్న వాదనతో నేను ఏకీభవిస్తాను’ అన్నాడు యువకుడు ఉద్వేగంగా.

‘కానీ అన్నల బలం భూస్వాములకే లాభించింది కదా! వీళ్ల భయంతో భూస్వాములు భూములన్నీ అమ్ముకొని ఇరవై ఏండ్ల క్రిందనే నగరాలకు మకాం మార్చినారు. పెద్దపెద్ద కాలేజీలు పెట్టారు. అపార్టు మెంట్లు కట్టారు. బిల్డర్ల అవతారం ఎత్తారు. కార్పొరేటు హాస్పిటళ్లలో షేర్లు కొన్నారు. నగరాల చుట్టు ఫామ్‌హౌజ్‌లు కట్టారు.’ గురువుగారు ఈ మాట అనడం వింతగా ఉన్నా, వాస్తవం చెప్పారని లోపల అనుకున్నాడు శిష్యుడు.

‘భూస్వాములు పోతే ఏమైంది? వారి స్థానం ఖాళీగా ఉందా! లేదు. సామాజిక నిచ్చెనలో కిందివాడు పై స్థానం చేరతాడు! ఆ స్థానాన్ని సానుభూతిపరులు ఆక్రమించారు. వీరి అవతార మహిమ చూడండి. వీరే నయా రాజకీయనాయకులు. వీరికే పెద్దపెద్ద పదవులు. సానుభూతిపరుడనే లేబుల్‌ ‌పెద్ద కార్డు అయింది.’ అన్నాడు యువకుడు.

శిష్యుడి మాటకు ఇంకాస్త జోడించారు గురువు గారు. ‘భయపడి కాదు, రాజకీయపార్టీలే అవసరం కోసం వీరికి పదవులు ఇస్తున్నాయి. కొన్ని పార్టీలైతే ఇంకొక అడుగు ముందుకేసి నక్సలైట్లే దేశభక్తులని ఆకాశానికి ఎత్తుతున్నాయి. టికెట్లు ఇచ్చి పోటీకి నిలబెడుతున్నాయి. కొన్ని సందర్భాలలో వాళ్లు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఏటా ఎన్నికలు బహిష్కరించండని చెప్పిన వీరు ఐదేండ్లకోమారు ఫలాన పార్టీకి ఓటువేయండని లోపాయికారిగా సూచన చేయడం విడ్డూరం.’

ఈ వాదనకి అంతే ఉండదు. కానీ తను అనదలుచుకున్న మాట అనడానికి సరైన సమయమన్న విషయం మాత్రం శిష్యుడికి అర్థమైంది. అందుకే అన్నాడు.

‘ఇప్పుడు నా కోరిక గురించి చెబుతున్నాను. ప్రభుత్వాలనే వ్యతిరేకించేవారు ప్రభుత్వాలలోకి తమ సానుభూతిపరులను రిక్రూటు చేయడం ఆలోచించ వలసినదే! అలా రిక్రూట్‌ అయిన వారి లీలల వాస్తవ చిత్రాన్ని గమనించడానికైనా ఓసారి అన్నలు రావాలని నేను కోరుకుంటున్నా!’

శిష్యుడు ఊహించినట్టే, ఏదో అర్థమయింది గురువుకి. ఒక క్షణం తరువాత అన్నాడు, చిన్న గొంతుకతో. ‘పార్టీలో నిజంగానే విలువలున్న సమయంలో నీవు వ్యతిరేకించేవాడివి. నేను గుడ్డిగా సమర్థించేవాడిని. నా బతుకు మూడు పోలీసు స్టేషన్లు, ఆరు కోర్టు హాజర్లు అయ్యింది. ఈ రోజు అందులో లేశమాత్రం విలువలు లేవు. చెప్పడానికే గాని ఆచరించడానికి అనువైన సిద్ధాంతం కాదని చెప్పాల్సిందే.’ ఒక్క నిమిషం తరువాత కొంచెం బాధగా అన్నారాయన,‘ నా మాటలతో ప్రభావితం అయిన యువకులే అతనిని పొట్టన బెట్టుకున్నారు. నేనేమో చనిపోతున్న వాడి చివరి కోరికను దీర్చినట్లయింది.’

అలా చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారాయన.

‘నగరాలలో జరిగే ప్రతి భూదందా వెనక సానుభూతిపరులున్నారన్న విషయం ఒప్పుకోవాలి. ఊరిలో బికారిలా, జంగిల్‌ ‌మ్యాన్‌లా తిరిగినవాడు, సిటీలో జంటిల్‌మ్యాన్‌లా చలామణి అవుతున్నాడు. వీళ్లు కోట్లకు పడుగలెత్తారు.’ ఈ మాటలో ఎంతో నిస్సహాయత వ్యక్తమైంది.

‘సానుభూతిపరులు కావడానికి నాడు ఎన్నో కారణాలుండేవి. ఈనాడు రిక్రూట్మెంటే లేదు. సిద్ధాంతం ఏనాడో ప్రక్కదారి పట్టింది. వర్గపోరాటం అంటే శత్రువును చంపడం అనే కుసంస్కారానికి తెరలేపారు. బడి పిల్లలను చేర్చుకొని మాది పెద్ద ప్లాటూన్‌ అం‌టున్నారు.’ అన్నాడు విచారంగా రఘురాంరెడ్డి మళ్లీ.

మీరన్న మాట అక్షరాల నిజం. యాభయవ దశకంలో ఆ సిద్ధాంతానికి గొప్ప విలువ ఉండేది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఎందరో పెద్దపెద్ద చదువులు చదివిన వారు పార్టీ పట్ల ఆకర్షితులైనారు. కాని ఇప్పుడు సిద్ధాంతం అంటే తెలియని వారు చేరుతున్నారు.’ అన్నాడు యువకుడు.

‘అప్పటికి, ఇప్పటికి మౌలిక మార్పు అదే. సర్కస్‌లో సింహాలను ఆడించేవాడి దగ్గర హంటర్‌ ఉన్నట్లు వీరి దగ్గర తుపాకీ ఉంది. ఆ హం•ర్‌ ‌దెబ్బలకు సింహాలు భయపడి చెప్పినట్లు సర్కస్‌ ‌ఫీట్లు చేస్తాయి. వీళ్ల తుపాకీ భయంతో ప్రజలు అణిగి ఉంటున్నారు’ అన్నాడు గురువుగారు.

కొంత సమయం నిశ్శబ్దం తరువాత ఒప్పుకోలుగా అన్నారు రఘురాంరెడ్డి.

నిజమే, ఆ అబ్బాయి కళ్లు నాకు వచ్చాయి. నేను అతని దృష్టిని కూడా అమర్చుకున్నానని అనిపిస్తోందంటే నమ్మాలి. ఆ యువకుడు నిజంగా ధన్యుడు. సామ్రాజ్యవాదం, వర్గపోరాటం వంటి మాటలతో ఈ ప్రపంచం ముందు మేధావిగా చలామణి కావాలని అనుకోలేదు. కటిక దరిద్రంలో ఉండి కూడా నమ్మిన సిద్ధాంతం కోసం భరతమాత సేవలో తరించాడు. కాని నా మాటల ప్రభావంలో పడినవాళ్లు ఏం చేశారు? అతడి ప్రాణం తీసుకున్నారు.’

తాను ఆనాడు చూసిన రఘురాంరెడ్డేనా అనుకున్నాడు శిష్యుడు. ఈ మాటతో అది రూఢి అయింది కూడా.

‘కొంచెం ఆలస్యంగానే అయినా, ధనం దగ్గరకు వచ్చేసరికి అందరి దృష్టి ఒక్కటేనని అర్ధమైంది. లొంగిపోయినవారే హేవ్స్-‌ధనికవర్గంగా- ఆవిర్భ వించడం ఎంత వింత? వీళ్లు పెద్దపెద్ద వారితో కలసి కంట్రాక్టులు చేస్తున్నారు. అయినా అన్నలు మళ్లీ వస్తే బాగుండని ఎందుకు కోరుతున్నావో తెలియడం లేదు.’ అన్నారు గురువు గారు.

‘అన్నలు మళ్లీ రావాలంటే నా ఉద్దేశం మరో యాభయ్‌ ఏళ్ల విప్లవం కోసమని కాదు గురువుగారు! సర్కస్‌లో సింహాల ఆట కొంతసేపే. దాంతో క్రూర మృగాలతో కూడ వినోదం కలిగించవచ్చని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఊర్లలో ఇరవై ఏండ్ల క్రింద ప్రతిష్టించిన పోతరాజులు పోతరాజులుగానే ఉన్నారా లేక రాజులుగా అవతారం ఎత్తారా? అది చూసిపొమ్మని చెబుతున్నాను’ అన్నాడు యువకుడు స్పష్టంగా.

‘పెటీ భూస్వామ్య వ్యవస్థ అంటే ఇదే కాబోలు. ఇప్పుడు పల్లెలలో సానుభూతిపరులదే రాజ్యం. పూటకో రాజకీయ పార్టీ మారుతున్నారు. రోజుకో కండువా కప్పుకొంటున్నారు. మొన్నటికి మొన్న అధికారంలో ఉన్న పార్టీలో మునిగి తేలినారు. నిన్న అధికారంలోకి వచ్చిన పార్టీలోకి కప్పలాగ దుమికినారు. రేపు ఇంకొక పార్టీలోకి మారారని గ్యారంటీ లేదు.’ అన్నారు రఘురాంరెడ్డి.

అవును. ఇప్పుడున్న రాజకీయ నాయకుల ప్రవేశాన్ని గమనిస్తే ఆ విషయమే తెలుస్తుంది నాడు అన్నం పెట్టినవారు,షెల్టరిచ్చినవారు, సమాచారం అందించిన కొరియర్లు, విప్లవ సాహిత్యం రాసిన వారు, బైకిచ్చి సాగనంపినవారు ఇంట్లో పెట్టుకొని వైద్యం చేపించినవారు, నేడు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. వారిని గుడ్డిగ వ్యతిరేకించినవారు తుపాకీ గుండ్లకు బలయ్యారు. లాటి దెబ్బలు రుచిచూసారు. దానికి వారు పెట్టిన పేరు వర్గ శత్రువులలో చాలా మంది సగటుజీవులే. ఒక్కొక్కసారి శ్రమజీవులు కూడా ప్రాణాలొదిలారు. దానికి అన్నలు ఏదో కుంటిసాకు చెప్పినారు.’ అన్నాడు రఘురాంరెడ్డి గారు.

‘ ఒక ప్రశ్న మాస్టారు! వర్గ శత్రువును తయారు చేసేది సమాజమా? మనిషిలోని కూడబెట్టాలనే గుణమా? కూడబెట్టి కుబేరున్ని చేయాలనే ఆశనా? ఆస్తి అంటేనే కూడబెట్టడం కాదా! నిమ్నకులాలలో కూడ కోటీశ్వరులున్నారు. వారు కూడ కూడబెట్టడం అనే గుణం వల్లనే కోటీశ్వరులయ్యారు. అందువల్ల వర్గశత్రువుకు స్పష్టమైన నిర్వచనం ఏదీ? అడిగాడు శిష్యుడు.

అవును. వర్గశత్రువు అంటే స్పష్టమైన నిర్వచనమేదీ స్ఫురించదు. ఇంత ఆస్తి ఉన్నవాడు వర్గశత్రువు అన్న గీత గీయడం కష్టమే. ఇవాళ ఆస్తులు కూడబెట్టడమనేది, అంతులేని సంపాదన అనేది ఇతరులను పీడిస్తేనో, లంచాల ద్వారానో, వడ్డీ వ్యాపారం ద్వారానో మాత్రమే జరగడం లేదు. అమెరికా, అరబ్బు దేశాలకు వెళ్లినవాళ్లు, అరుదుగానే అయినా లాటరీ తగిలినా, లంకెబిందెలు దొరికినా, ఇంటిల్లిపాది కూడబలుక్కొని కష్టపడి పైసా పైసా కూడబెట్టినా సంపద తయారవుతుంది. వీళ్లని వర్గశత్రువు అంటే ఎలా?’ సాలోచనగా అన్నాడు గురువుగారు.

శిష్యుడి ముఖంలో దరహాసం. అదేదో విజయ మన్నట్టు కాకుండా మృదువుగా అన్నాడీ మాటలు శిష్యుడు.

‘విచిత్రం చెప్పమంటారా?. నేను మాట్లాడ వలసినవి మీరు మాట్లాడుతున్నారు. ఈ విషయాలే గత ఇరవై ఏండ్ల కింద మాట్లాడుకొన్నాం. దేశంలో సానుకూల మార్పు ఒక నిజం. చాలా కుటుంబాలు దారిద్య్రరేఖను దాటి ముందుకు వచ్చాయి. జనానికి ప్రక్కవాడితో మాట్లాడే తీరిక లేదు. తెల్లవారి లేస్తే ఉరుకులు పరుగ•లు. డబ్బు సంపాదించే ఆత్రం.’ అన్నాడు యువకుడు.

‘అవును. కాలం గతిశీలమైంది. మనిషి జీవితంలో ఓ పాతికేళ్ల కాలం చిన్నదికాదు. నేను ఉడుకురక్తంతో ఉండగా ఊహించనిది ఇప్పుడు తారుమారైంది. ఆనాడు మీరు ఊహించినది నిజమైంది. సమ సమాజ స్థాపన అంటూ తుపాకులు పట్టిన వారికీ కొండలలో కొత్త సూర్యోదయం కనిపిస్తున్నది. ఒక్కరొక్కరే ఇంటిదారి పట్టుతున్నారు. జన జీవన స్రవంతిలో కలవడానికి వాళ్లు చెబుతున్న కారణాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి. అవి కూడా హఠాత్తుగా కనిపించడం వింతగా అనిపిస్తుంది. అక్కడా కులమే రాజ్యమేలు తోందన్నారు. ఆరోగ్యం సహకరించడం లేదని కొందరు. ఇంకొందరు కార్యకర్తల అభిప్రాయానికి విలువ లేదంటున్నారు. కారణాలు ఏమైనా, దళాలకు దళాలే లొంగిపోతున్నాయి.’ అన్నారు గురువు గారు.

‘అంటే…!’ శిష్యుడు ఏదో చెప్పబోతుండగా రఘురాంరెడ్డి అన్నారు.

‘గ్రామాల స్వరూపం మారిపోయి, కళావిహీన మైనాయి. అలాంటి చోట పేదలని వారి మానాన వారిని వదిలి పట్టణాలకు వలసపోతున్న డబ్బున్న జనాన్ని ఆపడానికి అన్నలు రావాలని ఆశపడు తున్నావా? అన్నారు గురువు గారు.

‘నేను ఆ మాట అనడంలో నా ఉద్దేశం ఏదో మొదటే చెప్పాను కదా మాస్టారు! అయినా నేను రమ్మన్నా ఈరోజు అన్నలు ఊరిలోకి వస్తే పట్టించుకొనే నాథుడు ఏడీ? అందరు మెరుగైన జీవితమే సాగిస్తున్నారు. ఇప్పుడు వారు వస్తేనే లేనిపోని కొత్త సమస్యలు. ఇంక మీరు వర్గశత్రుత్వం అంటే పట్టణాలకీ పల్లెలకీ మధ్య అని సూత్రీకరించ లేమో కూడా! సిటీలో ఉన్నవాడి ఆస్తి, పల్లెలో ఉన్నవాడి ఆస్తితో సమానం చేసే కొలమానం ఏది? కాడెద్దులతో వాడి కారు ఎలా సమానం అవుతుంది?’ అన్నాడు యువకుడు.

‘నిజంగా అన్నీ ప్రశ్నలేనోయ్‌! ‌డబ్బు కూడబెట్టడం అనే లక్షణం నుంచి పుట్టిందే ఆ సిద్ధాంతం. డబ్బు కొలమానంగానే సమాజాన్ని ధనిక, బీద వర్గాలుగా చూశాం. కానీ ఎంత డబ్బుంటే ధనవంతుడనే నిర్వచనం ఈయలేకపోయాం. ఎలాగంటే, ఊర్లో ధనవంతుడనుకొన్నవాడు, ఇంకో ఊరివారితో పోలిస్తే సాధారణ మనిషి అవుతున్నాడు. ఊర్లలో డబ్బులున్న వారిని ఏరేరి కాల్చి చంపినవారు అడవులలో ఆ డబ్బు సంచులను చూసి ఒకరినొకరు కాల్చి చంపుకొంటున్నారు.’ అన్నాడు గురువుగారు.

‘ఇవాళ్టి సమస్య పల్లెటూళ్లలో లేదు. సమస్య అంతా పట్టణాలలో ఉంది. నగరాలలో ఉంది. చచ్చిచెడి బ్రతుకుతున్న పల్లెల మీదనే ఇప్పటికీ మీ దృష్టి ఎందుకుంది? అడవులలో ఉండి ఇంతకాలం సాధించినదేమిటి? అన్నలు మళ్లీ వస్తే, పట్టణాలలో చూస్తే, హిట•లిస్టు తయారుచేస్తే, అందులో మీ సానుభూతిపరులూ, మాజీలే ఎక్కువ ఉంటారు.’ యువకుడు ఒకింత ఉద్వేగానికిలోనై మాట్లాడినాడు.

గురువుగారు కండ్లు మూసుకొని దీర్ఘాలోచనలో పడక కుర్చీలో ఒరిగిపోయారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram