– బంకించంద్ర చటర్జీ

సుకుమారి ఈ డబ్బాను ఏదో ఆట వస్తువు అనుకుంది. చేతులతో డబ్బాను అటు యిటు ఊపింది. మూత తెరిచింది. ఒక మాత్ర ఎగిరి తండ్రి పంచపైన పడింది. ఈ పడిన వస్తువును చూచి సుకుమారి ఇదేదో మరొక ఆట వస్తువు అనుకుంది. డబ్బాను వదిలి ఈ మాత్రను చేతులతో తీసుకుంది.

విషపుడబ్బాను సుకుమారి ఇంతసేపూ ఎందుకు నోట పెట్టుకోలేదో చెప్పలేం. కాని మాత్ర చేతికి చిక్కడంతోటే నోట కుక్కుకుంది. ‘ప్రాప్తి మాత్రేణ భోక్తవ్యం’ అన్నారు గదా!

‘‘ఏమిటి తింటున్నావు? ఏం తిన్నావు?’’ అంటూ కంగారుపడింది కల్యాణి. నోటిలో వేలుపెట్టి తడిమింది. నేలమీద విషపుడబ్బా రెండు భాగాలుగా పడి ఉండడం కనిపించింది. కల్యాణి సుకుమారి నోటిలోనుండి కొంత అరిగిన మాత్రను బయటకు తీసి పడవేసింది. భార్యాభర్తలు చాలా ఆదుర్దా పడిపోయారు. సుకుమారి ఏడవడం మొదలు పెట్టింది. ఇద్దరి మనసులు అమంగళాన్ని శంకిస్తు న్నాయి. కల్యాణి నది నుంచి నీరు తెచ్చి సుకుమారి నోటిలో పోసి కడుగుతోంది.

కొంత సేపటికి కల్యాణి ధైర్యం తెచ్చుకొని – ‘‘ఇంక చేసేది ఏముంది? రాత్రి భగవంతుడు పిలిచిన చోటికి సుకుమారి చేరుకోననే చేరుకున్నది. నేనూ ఆ దారినే అనుసరించడం ఉచితం!’’ అన్నది. .

ఈ మాటలు అంటూనే ఆమె విషపుమాత్రను నోట వేసుకుని మింగివేసింది. మహేంద్రుడు విలపించసాగాడు. ‘‘ఏం చేశావు కల్యాణీ! ఏంచేశావు! ఎందుకిలాంటి పని చేశావు?’’

కల్యాణి ఎలాంటి జవాబు చెప్పగల స్థితిలో లేదు. భర్త పాదధూళి తీసుకుంది. ‘‘ప్రభూ! నోట మాటరాదు, ఇక… నాకు సెలవు’’ అంది అతి ప్రయత్నం మీద.

‘‘అయ్యో! ఇలా ఎందుకు చేశావు కల్యాణీ! మిమ్మల్ని ఇంటివద్ద దింపి నేను వెడదామనుకున్నాను. కార్యసిద్ధి అయిన తరువాత తిరిగి కలుసుకోగల మనుకున్నాను. ఇలా ఎందుకు చేశావు? నా సర్వస్వం నీవే! నిన్ను కోల్పోయి యింక నేనేం చేయగలను? నేను బ్రతికి ఉండడం ఎందుకు? అంటూ మహేంద్రుడు విలపించసాగాడు.

‘‘నన్ను ఎక్కడకు తీసుకుపోతారు? నాకు ఎక్కడుంది చోటు? తల్లీతండ్రీ, స్నేహితులు, సంబంధీకులు అందరూ ఈ దుర్దినాలలో నాకంటే ముందుగానే వెళ్లిపోయినారు గదా! నన్ను ఎక్కడ వదలివెడతారు? ఎక్కడికి వెళ్లడం శ్రేయస్కరం? నేను మీ దారికి అడ్డువున్నాను. నన్ను వదిలించుకుంటే మీరు ఏమయినా చేయగలరు. నన్ను ఆశీర్వ దించండి. నేను ఆ అలోకమయిన లోకానికి వెళ్లి మీకోసం ప్రతీక్షిస్తూ వుంటాను. మీకోసం వేచి ఉంటాను!’’

ఈ మాటలు అని కల్యాణి తిరిగి భర్త పాదధూళి తీసుకుంది. మహేంద్రుడు ఏమీ జవాబు చెప్పకుండా ఏడుస్తూ ఉండిపోయాడు.

కల్యాణి అతి మృదు, అతి మధుర, స్నేహమయ కంఠస్వరంతో ఇంకా ఇలా అంది: ‘‘దేవతల సంకల్పం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. వారి దారికి అంతరాయం లేదు. నాకు అనుజ్ఞ ఇవ్వండి వెళ్లిపోతాను. నేను ఆత్మహత్య చేసుకున్నాను. నన్ను ఇంకొకళ్లు చంపేపని ఏముంది? మీరు దేశోద్ధారక వ్రతం స్వీకరించండి. మీరు త్రికరణశుద్ధిగా దేశసేవకు, మాతృసేవకు అంకితం అయిపోండి. ఇలా చేస్తే పుణ్యం వస్తుంది. ఈ పుణ్యంలో నాకూ భాగం ఉంటుంది. మనమిద్దరం స్వర్గసుఖాలను అనుభవిద్దాం.’’

ఇంతలో సుకుమారి ఒకమారు పాలు కక్కుకుంది. నిజానికి ఆమె మింగినది కొద్దిపాటి విషం. ఈ వాంతితో అది కూడా బయటకు వచ్చి కిందికి పడిపోయింది. ఆమె ప్రాణానికి ఏమీ భయంలేదు. కాని మహేంద్రుడు ఈ స్థితిని గమనించే స్థితిలో లేడు. అతడు అమ్మాయిని కల్యాణి ఒడిలో ఉంచాడు. ఇద్దరినీ గాఢాలింగనం చేసుకుని విపరీతంగా ఏడవసాగాడు. ఆ సమయంలో అరణ్య మధ్యం నుండి మృదుమధుర గంభీరస్వరంలో ఈ కీర్తన వినవచ్చింది.

‘‘హరే మురారే మధుకైటభారే! గోపాల గోవింద ముకుంద శారే!’’

ఈ సమయంలో విషం కల్యాణిపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఆమెకు కొద్దికొద్దిగా స్మృతి తప్పుతోంది. ఆమె కూడా పాడసాగింది. ‘‘హరే మురారే మధుకైటభారే!’’ ఆమె మహేంద్రునికూడా ఈ పాట పాడమని కోరింది. అతడు అనుసరించాడు.

అప్పుడు ఆ పాట పాడుతూ, మహేంద్రుడు తన శోక సంతాపాన్ని మరచిపోగలిగాడు. ఉన్మత్తుడై కల్యాణితో పాటు కీర్తన పాడసాగాడు. అరణ్యం నుండి వస్తున్న గొంతుతో గొంతు కలిపి పాడసాగాడు. కల్యాణి గొంతు పీలగా అయిపోతోంది.

క్రమంగా కల్యాణి కంఠం క్షీణించిపోయింది. ఆమె గొంతు లోంచి ఇప్పుడు పాట రావడమే లేదు. కళ్లు మూసుకుపోయాయి. శరీరం చల్లబడిపోతోంది. మహేంద్రుడు ఆమె ‘హరే మురారే’ పాట పాడుతూనే వైకుంఠానికి వెళ్లిపోయిందని గమనించాడు.

ఇంతలో ఎవరో వచ్చి అతడిని ఆలింగనం చేసుకున్నారు. అతడి కంఠంలో నుండి ‘హరే మురారే మధుకైటభారే!’ అని పాట వెలువడుతోంది.

ఇద్దరూ అనంత నామస్మరణ చేస్తున్నారు. సత్యానందుడు మహేంద్రుడిని తన బాహువులలో పట్టుకుని కూర్చున్నాడు.

13

ఇక్కడ రాజధానిలో పరిస్థితులు చాలా గందర గోళంగా ఉన్నాయి. కలకత్తాకు తరలించుకుపోతున్న డబ్బంతా సన్యాసులు దోచుకుంటున్నారని వదంతి బయలుదేరింది. రాజాజ్ఞ పొంది సిపాయిలు సన్యాసులను పట్టుకుని బంధిస్తున్నారు. దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ఈ ప్రదేశంలో సన్యాసులు కూడా ఎవరూ లేరు. అందరూ కాశీ ప్రయాగాది క్షేత్రాలకు వెళ్లిపోయారు. సంతానులు మాత్రం సన్యాస వేషధారణ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సిపాయీలు వెదుకుతున్నారని సన్యాసి వేషం వేసుకున్న సంతానులు కూడా జాగ్రత్తగా మెలుగుతున్నారు.

సత్యానందుడు, మహేంద్రుడు ఒకరినొకరు ఒడిసి పట్టుకుని దైవనామకీర్తన చేస్తున్నారు. అప్పుడు ఒక సిపాయీల దళం అటువైపు వచ్చింది. వారి నాయకుడు ఇద్దరినీ గమనించాడు. ‘‘అడుగో సన్యాసి! పట్టుకోండి’’ అని ఆజ్ఞాపించాడు.

ఒకడు సత్యానందుడిని, మరొకడు మహేంద్రు డిని పట్టుకున్నారు. కారణం, సన్యాసితో ఉన్నవాడు వేషం ఎలావుంటే మటుకు సన్యాసి కాకుండా పోతాడా అని! మూడవ సిపాయి కల్యాణిని పట్టు కుందుకు ముందుకు దూకాడు. కాని ఆమె సన్యాసిని కాదనీ, ఒక మృతదేహం మటుకేనని గ్రహించి అటు వెళ్లకుండా ఆగిపోయాడు. అలాగే సుకుమారిని కూడా వదలాడు.

మహేంద్రుడు శోకమూర్తి అయినాడు. తమను సిపాయీలు లాక్కుపోతున్నారు. ఇక్కడ కల్యాణి, సుకుమారిల మృతదేహాలు ఏమవుతాయి? ఈ శరీరాలకు సంస్కారం జరగదా? నక్కలు లాక్కుపో వలసిందేనా?

వారిద్దరూ సిపాయిలతో మాట్లాడకుండా, తమ ఆత్మరక్షణ కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండా వెనువెంట నడచి రావడం చూచి సిపాయీల నాయకుడు ‘‘మీరు నామస్మరణ చేసుకోండి. నాకు అభ్యంతరం లేదు. కాని ఈ బద్మాష్‌ ఉన్నాడే, వాడికి మాత్రం ఉరిశిక్ష తప్పదు’’ అన్నాడు సత్యానందుడితో.

బ్రహ్మచారి కీర్తన ప్రారంభించాడు : ‘‘ధీర సమీరే తటినీతీరే వసతివనే వరనారీ! మా కురు ధనుర్ధర గమన విలంబన మతి విధురా సుకుమారీ!’’ నగరానికి చేరిన తరువాత వీరిద్దరినీ కొత్వాలుకు అప్పగించారు. కొత్వాలు నవాబుకు కబురుచేశాడు. వారి నుండి తిరిగి కబురు వచ్చేంత వరకు ఇరువురినీ కారాగారంలో పెట్టాడు. ఆ కారాగారం అతి భయంకరమైనది. దానిలోనికి వెళ్లినవాళ్లు ఎవరూ మళ్లీ తెల్లవారిన తరువాత ఇవతలకు రావడానికి నోచుకోలేదు. వాళ్ల విషయం ఆలోచించిన వారు లేరు.

14

రాత్రి అయింది. కారాగారంలో ఉన్న సత్యా నందుడు మహేంద్రుడితో ఇలా అన్నాడు : ‘‘ఈ రోజు చాలా ఆనందదాయకమైన రోజు. కారణం ఏమిటంటే, మనం కారాగారంలో బందీలమై ఉన్నాం. పాడు, హరే మురారే…’’

మహేంద్రుడు కాంతరస్వరంతో పాడనారం భించాడు. ‘‘హరే మురారే…’’

సత్యానందుడు ‘‘కాంతరుడవు అవుతున్నావేం? నీవు ఈ మహావ్రతాన్ని స్వీకరించవలెనంటే భార్యాపిల్లలను వదలివేయాలి. ఇక ఎటువంటి సంబంధమూ ఉండదు’’ అన్నాడు.

‘‘త్యాగం ఒక పద్ధతి! యమదండం మరొక పద్ధతి! ఏ శక్తి ఆధారంతో నేను ఈ వ్రతం స్వీకరించ గలనని అనుకున్నానో ఆ శక్తి నా భార్య, కుమార్తెల తోనే పోయింది’’ అన్నాడు మహేంద్రుడు.

‘‘శక్తి వస్తుంది. ఆ శక్తి నేను ఇస్తాను. మహా మంత్రం స్వీకరించు. మహావ్రతం గ్రహించు.’’

మహేంద్రుడు ఆలోచించి, ‘‘అక్కడ నా భార్య, కుమార్తెల కళేబరాలను కుక్కలు, నక్కలు పీక్కు తింటూ ఉంటాయి. ఇప్పుడు నాకు వ్రతాన్ని గురించి ఎటువంటి మాట చెప్పకండి!’’

‘‘ఈ విషయం నీవేమీ ఆలోచించకు, దిగులు పడకు. సంతానులు ఆ కళేబరాలకు సంస్కారం చేస్తారు.’’

 ‘‘మీకు ఎలా తెలుసు? మీరు నాతోనే ఉన్నారు కదా!’’

‘‘నేను మహామంత్ర దీక్షితుడిని. నాకు దేవతలు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందిస్తారు. ఈ రాత్రియే నీవీ కారాగారం నుండి విముక్తుడవు అవుతావు.’’

మహేంద్రుడు ఏమీ మాట్లాడలేదు. అతడికి తన మాటలలో విశ్వాసం కలగలేదని సత్యానందుడు గ్రహించాడు. ‘‘సరే, నీకు నమ్మకం కలిగిస్తాను’’ అంటూ కారాగారం ద్వారం వరకు నడిచాడు. అక్కడ ఏం చేశాడో మహేంద్రుడికి తెలియదుగాని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపించింది.

సత్యానందుడు వెనక్కు వచ్చి ‘‘నీవు ఇప్పుడే కారాగారం నుండి బయటపడతావు!’’ అన్నాడు.

ఇంతలోనే కారాగార ద్వారం తెరుచుకుంది. ఒక వ్యక్తి లోనికి వచ్చి ‘‘మీలో మహేంద్రసింహుడు ఎవరు?’’ అని అడిగాడు.

మహేంద్రసింహుడు ముందుకు వచ్చి ‘‘నేనే!’’ అన్నాడు.

‘‘మిమ్ము విడుదల చేయటానికి ఉత్తరువు వచ్చింది. మీరు ఇక వెళ్లవచ్చును!’’

మహేంద్రుడు ముందు ఆశ్చర్యపోయినాడు. ఇదంతా అబద్దమేమో అనిపించింది. పరీక్ష కోసం ఇవతలకు వచ్చాడు. ఎవరూ అతన్ని అడ్డగించలేదు. అతడు రహదారి చేరుకున్నాడు.

ఇక్కడ కారాగారంలో ఆగంతకుడు సత్యా నందునితో ‘‘మహారాజా! మీరు కూడా రండి నేను తమకోసమే వచ్చాను’’ అన్నాడు.

 ‘‘ఎవరునీవు? గోస్వామి ధీరానందుడవా?’’

 ‘‘అవునండీ!’’

 ‘‘కాపలావారు ఏమయ్యారు?’’

‘‘భవానందుడు నన్ను పంపాడు. కాపలా సిపాయికి మత్తు కలిగించే పానీయం ఇచ్చాను.’’

‘‘సరే! నీవు నగరానికి వెళ్లిపో. నేను ఇప్పుడు ఈ విధంగా బయటకు రాలేను.’’

‘‘ఏం?’’ ‘‘ఈ రోజు సంతానులకు పరీక్ష దినం.’’ మహేంద్రుడు తిరిగి వచ్చాడు. సత్యానందుడు ‘‘ఏం, తిరిగి వచ్చావేం?’’ అన్నాడు.

‘‘తాము నిశ్చయంగా సిద్ధపురుషులు. నేను తమను విడిచి వెళ్లలేను’’ అన్నాడు మహేంద్రుడు. ‘‘సరే! ఈరాత్రి మనమిద్దరం మరో రకంగా బయటకు చేరుకుందాం!’’

ధీరానందుడు బయటకు వెళ్లాడు. సత్యా నందుడు, మహేంద్రుడు కారాగారంలోనే ఉండి పోయారు.

15

బ్రహ్మచారి గానాన్ని చాలామంది విన్నారు. అందరితోపాటు జీవానందుని చెవులలో కూడా ఈ పాట జొరబడింది. జీవానందుడు మహాప్రభు స్వామి సంకేతాన్ని తెలుసుకోగలిగాడు. ‘‘ధీరసమీరే తటనీతీరే వసతివనే వరనారీ!’’

నది ఒడ్డున ఎవరైనా స్త్రీ తిండితిప్పలు లేకుండా పడివున్నాదా ఏమిటి? అనుకున్నాడు ఈ పాట విని. ఇలా ఆలోచించుకుంటూ నదీతీరానికి వెళ్లినాడు. బ్రహ్మచారి ముసల్మాను సిపాయీలతో వెళ్లిపోవడం అగుపించింది. బ్రహ్మచారి చెప్పిన మాటలు పాటించడం జీవానందునకు తక్షణ కర్తవ్యంగా అగుపించింది. ఆయన చేసిన సంకేతానికి ఏదో అర్థం వుంటుంది. ఆయన ఆజ్ఞ పాటించటం చాలా ముఖ్యం.

జీవానందుడు నది ఒడ్డునే నడిచి వెళ్లసాగాడు. వెళ్లగా వెళ్లగా ఒకచోట స్త్రీ మృతదేహం పడివుండడం కనిపించింది. ఆ దేహం పక్కన ఆడుకుంటూ వున్న పసిపాప కూడా ఉంది. మహేంద్రుని భార్యను, కుమార్తెను జీవానందుడు ఒకమారు కూడా చూచి ఉండలేదు. మనసులో ఇలా అనుకున్నాడు : ‘‘బహుశా వీరు మహేంద్రుని తాలూకు మనుషులు అయివుంటారు. ఏమంటే, ప్రభువుల వారితో పాటు మహేంద్రుడు కూడా వెడుతూ కనిపించినాడు ఇందాక. సరే! ఇక్కడ తల్లి చనిపోయి ఉంది. పిల్ల బతికేవుంది. ముందు వీరిని రక్షించే మార్గం చూచుకోవాలి. లేకపోతే ఏ పులులో వీరిని నోట కరుచుకు వెడతాయి. భవానందుడు ఈ ప్రాంతంలోనే ఎక్కడో తిరుగాడుతూ ఉంటాడు. అతడే మృతదేహం సంగతి చూచుకుంటాడు…’’ అనుకుని జీవానందుడు పిల్లను , చంకనిడుకుని వెళ్లిపోయాడు.

పిల్లను ఎత్తుకుని జీవానందగోస్వామి అరణ్యం గుండా నడిచాడు. అరణ్యాన్ని దాటి, భైరవీపురం అని ఒక గ్రామం ఉంది. దాన్ని జనులందరూ భర్మయీపురం అంటూ ఉంటారు. భర్మయీపురం సామాన్యమైన గ్రామం. ఆ చుట్టుపట్ల పెద్ద పట్టణం ఏమీ లేదు. గ్రామం దాటితే మళ్లీ అరణ్యమే వస్తుంది. నాలుగు ప్రక్కల అడవి, వెనుక ఈ చిన్ని గ్రామం. అయితేనేం, గ్రామం చాలా సుందరంగా ఉంటుంది. ఒక పెద్ద మామిడిచెట్టు, దాని వెనుక చిన్న ఇల్లు ఉన్నాయి. నాలుగుపక్కల మట్టి ప్రహరీ గోడలు వున్నాయి. ఆ గోడలను ఆనుకుని నాలుగు గదులు ఉన్నాయి. ఆ గృహస్థుకు పశువుల పెంపకం కూడా ఉన్నట్లుంది. ఆవులు, దున్నపోతులు, మేకలు, మైనా, చిలుక కూడా వున్నాయి. ఒక కోతి కూడా ఉంది. కాని దానికి తిండి పెట్టటానికి శక్తిలేక వదలివేశారు. ధాన్యం పోగుపోసుకునే గాదె ఒకటుంది. ఇంటి ముందు చెట్లు చేమలు ఉన్నాయి. ఇంటిలో ఎక్కువ మంది మనుషులు లేరు. జీవానందుడు పిల్లను ఎత్తుకుని ఇంటిలోనికి వెళ్లాడు.

లోపల రాట్నం కనిపించింది జీవానందుడు రాట్నం తిప్పసాగాడు. ఆ శబ్దానికి భయపడి పిల్ల ఏడవసాగింది. ఈ ఏడ్పు విని లోనుండి ఒక పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల వయసున్న అమ్మాయి ముందుకు వచ్చింది. జీవానందుడిని చూచి ‘‘ఏమిటి అన్నయ్యా? ఎప్పుడు వచ్చావు? రాట్నం తిప్పుతున్నావెందుకు? ఈ పిల్ల ఎవరు? మళ్లీ పెళ్లి చేసుకున్నావా ఏమిటి?’’ అంది.

జీవానందుడు లేచాడు. ‘పిల్లను ఆ అమ్మాయికి అందించాడు. ‘‘ఏమిటే అంటున్నావు కోతీ! నేను అల్లాటప్పా మనిషిననుకున్నావా? ఇంట్లో పాలున్నాయా, ముందు చెప్పు’’ అన్నాడు.

యువతి ‘‘ఇంట్లో పాలెందుకు లేవు? తీసుకు వస్తాను తాగుతావా?’’ అంది. ‘‘ఆ! తాగుతాను!’’

యువతి లోనికి వెళ్లి పాలు వెచ్చ జేయసాగింది. అంతవరకు జీవానందుడు అక్కడేవుండి రాట్నం తిప్పుతూ కూర్చున్నాడు. పిల్ల యువతి ఒడిలో చేరింది గనుక ఏడుపు ఆపేసింది. పిల్ల ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియదు. బహుశా ఈ యువతి తనతల్లే అనుకొని ఉంటుంది. కొంతసేపు అయిన మీదట తిరిగి లోపల నుండి పిల్ల ఏడుపు వినిపించింది. జీవానందుడు ‘‘ఏమే కోతీ! ఇంకా పాలు వెచ్చబడలేదా?’’ అని కేకవేశాడు.

‘‘వెచ్చపడ్డాయి’’ అంటూ కుండతో పాలు పట్టుకు వచ్చింది యువతి. జీవానందుడు కోపంతో ‘‘ఈ పాలు నాకోసం అనుకున్నావటే కోతీ! ఈపిల్లకు పట్టు’’ అన్నాడు.

ఆ యువతి సుకుమారికి పాలు పడుతూ అడిగింది : ‘‘అన్నయ్యా! ఈ పిల్ల ఎవరు?’’

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram