– ఎం. సూర్యప్రసాదరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


సెల్‌ ‌ఫోన్‌ ‌రింగవడంతో సడెన్‌గా మెలకువ వచ్చింది సమయం.. తెల్లవారు ఝామున 3:00 గంటలు! పట్టిన కలత నిద్ర చెదరిపోయింది. ‘‘హలో!’’ ‘‘అన్నయ్యా! నాన్న పోయారు! ఇప్పుడే!’’ క్షణం నిర్ఘాంతపోయాను. ‘‘డాక్టర్‌ ఇం‌కా రెండు రోజులుంటారని చెప్పారుగా’’! గద్గదస్వరంతో అడిగాను.

‘‘అవునన్నయ్యా! అందరం అలాగే అనుకున్నాం! నువ్వు నిన్న సాయంత్రం బయలుదేరగానే గురక మొదలై ఇప్పుడే ఆగిపోయింది. ఆయన అంతిమ శ్వాస వదిలాడు!

ఇంటికి పెద్దవాడిని! అంత్యక్రియలు చేయాల్సిన బాధ్యత నాదే! అన్నింటికీ నేనే ముందుండాలి! నాన్నను వదలి బయలుదేరుతుంటే.. తమ్ముడు అడిగాడు. ‘‘అన్నయ్యా! తప్పదా?’’ ‘‘పెద్దాడా! వెళ్లక తప్పదా?’’ అమ్మకూడా అడిగింది.

‘‘తప్పదమ్మా! సమ్మర్‌ ‌హాలిడేస్‌ ‌తరువాత కాలేజీ తెరిచేరోజు రేపే! జాయినవ్వాలి. తరువాత సెలవు పెట్టిరావచ్చు! రేపు సాయంత్రానికి వచ్చేస్తాను.

అమ్మ ఏమీ మాట్లాడలేదు. ‘‘మీకు ఏవేవో సెలవులు ఉంటాయట గదరా!’’ అక్క అడిగింది.

‘‘ఉంటాయక్కా! రేపు వెళ్లకపోతే.. సమ్మర్‌ ‌జీతం ఇవ్వరు. కొన్ని ప్రత్యేకమైన సెలవులు పెట్టాలి! అవి మేనేజ్‌మెంట్‌ ‌మంజూరు చేయాలి! మరో రెండు, మూడు నెలల తరువాత గానీ ఆ జీతం వస్తుంది!’’

‘‘పోనీ.. అలా చేస్తే..’’ తమ్ముడు సలహా ఇచ్చాడు..

‘‘రిటైర్‌మెంట్‌ ‌దగ్గర పడింది. అవి మంజూరు కాకపోతే పెన్షన్‌ ‌పేపర్లు వెళ్లవు. పెన్షన్‌ ‌త్వరగా మంజూరు కాదు!’’ వివరించి చెప్పాను.

‘‘చదువుకోని వాళ్లం మాకేం తెలుసురా! నీకు ఎలా వీలుగా ఉంటే.. అలా చేయి నీ ఇష్టం! వెళ్లడం తప్పదంటున్నావుగా!’’ అమ్మ నిర్లిప్తంగా అంది.

‘‘ఈ సాయంత్రం వెళ్లి . రేపు సాయంత్రానికి వచ్చేస్తానుగా!’’ అందరినీ ఒప్పించి ట్రైన్‌లో మా ఊరు చేరేసరికి రాత్రి పదయింది. స్టేషన్‌ ‌దగ్గరే రెండు చపాతీలు తిని ఇంటికి చేరుకున్నాను!

పదిరోజులుగా తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు తీసేసరికి విపరీతమైన ఉక్కపోత! ఉక్కిరి బిక్కిరి చేసింది. అసలే ఎండాకాలం! లోపల భగ్గుమనే వాతావరణం అలముకొంది.

కిటికీలు తెరచి అన్ని గదుల్లో ఫ్యాన్లు ఆన్‌ ‌చేసిన అరగంటకు కొంచెం చల్లబడినట్లయింది. ఆవిడ దేశం కాని దేశంలో ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లింది. కొడుకు లిద్దరూ రాష్ట్రం కాని రాష్ట్రంలో చదువు కుంటున్నారు. పడుకున్నా.. నిద్రపట్టలేదు. నిద్ర పట్టిందో.. లేదో.. సెల్‌ ‌ఫోన్‌ ‌దుర్వార్త వినిపించింది. ‘‘నాన్నా!’’ బావురుమని ఏడవాలనిపించింది!. గుండెలవిసేలా ఏడవాలనిపించింది!. కరవు తీరా ఏడవాలనిపించింది!. ఎవరైనా… ఏమైందని అడిగితే.. ఏమని చెప్పాలి! ఏం జరిగిందని సమాధానం చెప్పాలి?

గొంతులోనే దుఃఖాన్ని దిగమ్రింగుకున్నాను. ‘‘అన్నయ్యా!’’ తమ్ముడు మళ్లీ ఫోన్‌ ‌చేశాడు. ‘‘ఎన్ని గంటలకు వస్తావన్నయ్యా.’’ వాడు అడిగాడు. గొంతు దుఃఖంతో పెగలడం లేదు. ‘‘ఎప్పుడు వస్తావన్నయ్యా?’’ మళ్లీ అడిగాడు.

ఏఏ ట్రైన్లు ఎప్పుడెప్పుడు మా ఊరికి వెళతాయో.. నాకు కరతలామలకమే! ముఫ్పై మూడేళ్లుగా అమ్మనాన్నలను చూడడానికి వెళుతూనే ఉన్నానుగా!

‘‘ఇక్కడ ఉదయం పదిన్నరకు ట్రైన్‌ ఉం‌దిరా! అక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండున్నరవుతుంది. అన్నీ సిద్ధం చేసుకోండి! టైముకు వచ్చేస్తాను.’’

వాడికి పోగ్రాం వివరించాను. ‘‘అలాగే అన్నయ్యా! అంతిమయాత్రకు అన్నీ రెడీ చేసుకుంటాం. నువ్వు రావడమే ఆలస్యం! నీ కోసమే అందరం ఎదురు చూస్తుంటాం!’’

వాడే ఫోన్‌ ‌స్విచాఫ్‌ ‌చేశాడు. ‘‘రాజా!’’ నాన్న గొంతు వినిపించింది. ‘‘నాన్నా!’’ ‘‘నువ్వు పనిచేయరా! చదువు కోవద్దురా!’’ ‘‘నేను చదువుకుంటాను నాన్నా!’’ ‘‘చదువుకోవద్దురా!’’ మళ్లీ అన్నాడు. ‘‘చదువుకుంటాను నాన్నా!’’ మళ్లీ అదే సమాధానం చెప్పాను. ‘‘నా మాట వినరా!’’ ‘‘చదువు కుంటాను నాన్నా!’’ ‘‘నా చేతిక్రింద ఉండరా! నాకు చేదోడు వాదోడుగా ఉండరా!’’ నేనేమీ సమాధానం చెప్పలేదు.

అప్పటికే మేం ఆరుగురు సంతానం! రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబ జీవనం! బంగారు పనే మా జీవనాధారం!

‘‘తమ్ముడెలాగూ చదవడం లేదుగా! వాడు నీ చేతిక్రింద ఉంటాడులే!’’ తరుణోపాయం సూచించాను.

‘‘అయితే.. నువ్వు తప్పితే చదివించను. చదివించడానికి నాకు ఆర్థిక స్తోమత లేదు. ఎలా చదువుకుంటావో.. నీ ఇష్టం!’’ తెగేసి చెప్పేశాడు.

‘చదువుకుంటాను..’ అనే మాట మీదే నిలబడ్డాను. ఎలా చదువుకున్నానో.. ఎవరెవరిదగ్గర ఆర్థిక సహాయం పొందానో… భగవంతునికే తెలుసు.

ఆ వృత్తికి దూరమయ్యాను. ఓ లెక్చరర్‌ ‌గా స్థిరపడ్డాను. సంస్కారవంతమైన ఉద్యోగంతో కుటుంబాన్ని తీర్చిదిద్దుకున్నాను.

పిల్లలను చదివించుకున్నాను. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా.. మూడు గంటల వ్యవధి••లో జన్మభూమిని చేరుకునే ఊరిలోనే స్థిరపడ్డాను. కళ్లు మూసు కున్నానో.. లేదే.. మళ్లీ నాన్న పిలుపు వినిపించింది. ‘‘రాజా! తబలా నేర్చుకుంటావా?’’ నేర్చుకోవడానికే ప్రయత్నించా! కానీ విద్య అంత త్వరగా అబ్బుతుందా? ‘‘థా.. థిన్‌.. ‌థిన్‌.. ‌థా.. తిరికిట థిన్‌.. ‌థి థా’’ తబలాపై ఆయన వేళ్లు కదులుతూనే నేర్పించడానికి ప్రయత్నించాయి.

నోటితో అక్షరాలు స్పష్టంగా దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి.

ఫొటోలను చూపిస్తూ తబలిస్టులను పరిచయం చేశాడు. ‘ఈయన ఉస్తాద్‌ అల్లారఖా! పండిట్‌ ‌రవిశంకర్‌ ‌సితార్‌ ‌వాదనకు వాద్య సహకారం అందిస్తాడు!’’. రవిశంకర్‌, అల్లారఖాల వాద్యసంగీత ట్రైలర్లున్న సినిమాలకు తీసుకువెళ్లే వాడు.

‘‘ఈయన శాంతాప్రసాద్‌! ‌శాంతారాం ‘ఝనక్‌ ‌ఝనక్‌ ‌పాయల్‌ ‌బాజే సినిమాలో తబలా విన్యాసం సన్నివేశంలో కనిపించే వ్యక్తి అతడే!’’

ఆ సినిమాను సుమారు పదిహేనుసార్లు తబలా వాద్యం కోసమే చూశాడు. నాకు రెండు మూడుసార్లు చూపించాడు.

తబలా నేర్చుకోకపోయినా.. శ్రుతి, లయ, తాళ బద్దమైన సంగీత జ్ఞానం మాత్రం నన్ను కనికరించింది. నాకు కాలేజీలో కల్చరర్‌ అడ్వయిజర్‌ ‌హోదా కల్పించింది.

తెలతెలవారుతోంది!

‘నేనే బరస్టయితే.. నేనే బేలనైతే.. నేనే విషాదానికి లోనైతే.. నన్ను సముదాయించే వారెవరు? మా ఊరికి తీసుకువెళ్లే వారెవరు? అంత్యక్రియలు నిర్వహింపచేసే వారెవరు? ఊరు కాని ఊరు! ఈ దుఃఖంలో సాంత్వన చేకూర్చే వారెవరు? ఓదార్చి కన్నీరు తుడిచేవారెవరు?

సంయమనం పాటించాలి! సహనం సాధించాలి! దుఃఖాన్ని దిగుమింగు కోవాలి! సమయానికి ఊరికి చేరుకోవాలి! నాన్న అంతిమ సంస్కారాలు చేయాలి!!

దుఃఖమనే విషాన్ని గొంతులో దాచేసుకున్నాను. ఆలోచించడం ప్రారంభించాను! ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎలా చెప్పి ఊరు దాటాలి? ‘తండ్రిపోయిన మైల’ అని తెలిస్తే.. ఎవరూ ఇంటికి రానివ్వరు! ఎవరూ నన్ను తాకటానికి కూడా సాహసించరు.’ చాదస్తపు కుటుంబాల మధ్య….సహా అధ్యాపకుల మధ్య ముప్పయ్‌ ‌మూడేళ్ల జీవనం కర్తవ్యోన్ముఖుడిని చేసింది.

స్నానం చేసి పదిరోజులకు సరిపోయే బట్టలతో, సామాగ్రితో బయలుదేరాను! ఇంటికి జాగ్రత్తగా తాళం వేసి ప్రక్క ఇంటివాళ్లకు చెప్పాను…’ నాన్నగారికి సీరియస్‌గా ఉందని!’

మధ్యాహ్నందాకా కళ్లు తిరిగి పడిపోకుండా ఉండడానికి తినలేకున్నా టిఫిన్‌ ‌తినవలసి వచ్చింది! అప్పటికి ఉదయం తొమ్మిది దాటింది. కాలేజ్‌ ఆఫీస్‌ ‌తీసే ఉంది. సమ్మర్‌ ‌వెకేషన్‌ ‌తరువాత రీఓపెనింగ్‌ ‌రోజున జాయనింగ్‌ ‌రిపోర్ట్ ఇచ్చేశాను!

 ‘అమ్మయ్యా’ గట్టిగా ఊపిరిపీల్చుకున్నాను! – ఆఫీసు సిబ్బందికి, ప్రిన్సిపల్‌కు విషయం వివరించి బయలుదేరాను! ‘నాన్నగారికి సీరియస్‌గా ఉంది! వారం రోజులు సెలవు కావాలని!’ లీవ్‌ ‌లెటర్‌ ఇచ్చేశాను. కాలేజీ క్యాంపస్‌ ‌వదిలేసరికి తొమ్మిదీ నలభై అయిదు అవుతోంది! అప్పుడే స్టాఫ్‌ ‌మెంబర్లు ఒక్కరొక్కరే వస్తున్నారు. అందరినీ మౌనంగా పలకరిస్తూ.. ‘స్టేషన్‌ ‌చేరుకున్నాను! కాలినడక అయితే… పదిహేను నిమిషాలు పడుతుంది. కాలినడకనే ఆశ్రయించాను! ప్లాట్‌ ‌ఫాం చివర ట్రైన్‌ ‌కోసం నిరీక్షించసాగాను. సమయం పదిగంట లౌతోంది. ట్రైన్‌ ఓ అరగంట లేటులో నడుస్తోంది.

‘‘నాన్నకు అసలేమీ బాగుండడం లేదురా! ఒక్కసారి వచ్చి చూచి వెళ్లరా!’’ సరిగ్గా సంవత్సరం క్రితం… ఇలాగే ఎండాకాలంలో అమ్మ ఫోన్‌ ‌చేయించింది. అప్పటికి సెల్‌ ‌ఫోన్లు వినియోగంలోకి వచ్చేసాయి.

‘‘తప్పకుండా వస్తానమ్మా!’’

 ‘‘కోడలూ,పిల్లలూ ఎలాగు లేరుగదా! పది రోజులుండేటట్లు రారా!’’ అమ్మ ఆశగా అడిగింది.

పదిరోజులేం ఖర్మ.. ఇరవై రోజులుంటానులే! ఎలాగూ సమ్మర్‌ ‌వెకేషన్‌ ‌మొదలౌతుందిగా!’ అనుకోకుండా ఉండలేకపోయాను.

ఇంటర్‌ అడ్వాన్స్ ‌సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ‌నిర్వహణ కారణంగా పది రోజుల పాటు వెళ్లలేకపోయాను.ఆ తర్వాత వెళ్లి చూద్దును గదా….! నాన్న బల్లిలా మంచానికి అతుక్కొని ఉన్నాడు. ‘‘ఏమైంది నాన్నా!’’ గాభరాగా అడిగాను. ‘‘వడదెబ్బ తగిలిందిరా!’’ నీరసంగా అన్నాడు. విరేచనాలతో డీహైడ్రేషన్‌ ‌లక్షణాలు స్పష్టంగా కనిపిచాయి. సెలైన్‌ ఎక్కించడంతో కొద్దిగా కోలుకున్నాడు. నెమ్మదిగా ఏదో ఒకటి తింటూ శక్తి పుంజుకున్నాడు. ఇరవై రోజులు ఆయన సేవ చేసుకోగలిగాను. అప్పటికే నా నాలుగు రేఖాచిత్రాలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వాటిని నాన్నకు చూపించాను! ‘‘వారత్వపు లక్షణాలు ఎక్కడకు పోతాయిరా?’’ నాన్న కళ్లు ఆనందంతో మెరిశాయి! అలవాటుగా గది నాలుగు గోడల్ని పరిశీలించాను. అందంగా కనిపించే ఎన్నో పెయింటింగ్స్ ‌మాసిపోయినా, ఇంకా గది గోడల్ని అలంకరించుకునే ఉన్నాయి. ఎస్‌.ఎం. ‌పండిట్‌ ‌చిత్రించిన శకుంతల, మేనకా విశ్వా మిత్రులు, గంగావతరణం జీవకళలొలుకుతూనే ఉన్నాయి.

సి.కొండైరాజ్‌ ‌చిత్రించిన అమ్మవార్ల చిత్రాలు అభయహస్తాలతో చూడగానే భక్తి భావాన్ని పాదుగొలిపేలా కనిపిస్తున్నాయి. జె.పి.సింఘాల్‌ ‌చిత్రించిన అద్భుతమైన అతిలోక సుందరీమణుల చిత్రాలు కన్నార్పకుండా చూడాలనిపిస్తూనే ఉన్నాయి. నాటి చిత్రాలు వనితల సౌకుమార్యం, స్నిగ్ధత్వం, ముగ్ధమనోహర సౌందర్యంతో గంధర్వ కన్యలను తలపింప చేస్తున్నాయి.

నాన్న నెమ్మదిగా లేచి ఎప్పటిదో మూలపడి ఉన్న చిన్న ట్రంక్‌ ‌పెట్టెను తెరచి డ్రాయింగ్‌ ‌పుస్తకాలను బయటకు తీశాడు. అందులో గోడలను అలంకరిం చిన తైలవర్ణ చిత్రాలన్నీ రేఖా చిత్రాలుగా దర్శన మిచ్చాయి.

వడ్డాది పాపయ్య వాటిలో దర్శనమిచ్చారు. ‘‘నాన్న! ఇవన్నీ…’’ అర్ధోక్తిలో ఉండగానే.. ‘‘నేను గీచినవేరా!’’ ఆనందంగా జవాబు చెప్పాడు. ‘‘యు ఆర్‌ ‌గ్రేట్‌ ‌నాన్నా!’’ మనస్ఫూర్తిగా అభినందించాను. ‘‘అందుకేనే.. వారసత్వ లక్షణాలని అన్నానురా!’’ నా రేఖాచిత్రాలు చూస్తూ అన్నాడు. ఆయన చిత్రించిన రకరకాల డిజైన్లు, లతలు, పువ్వులున్న పేపర్లు గోధుమ రంగులోకి మారిపోయాయి. ‘‘యువర్‌ అటెన్షన్‌ ‌ప్లీజ్‌.. ‌నం..కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ‌మరికొద్ది సేపటిలో ఒకటవ నంబర్‌ ‌ప్లాట్‌ ‌ఫాంపైకి రానున్నది!’’ ఎనౌన్సర్‌ ‌కంఠం జ్ఞాపకాల నుండి బయటకు పట్టుకువచ్చింది. చివరి కంపార్ట్‌మెంట్‌లు కావడం చేత సీటు దొరికింది. బ్యాగ్‌ ‌పైన పెట్టి సీటుకు జారగిలబడి కళ్లు మూసుకున్నాను. మళ్లీ నాన్న జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. కర్తవ్యం గుర్తుకు వచ్చింది.

వెంటనే తమ్ముడికిఫోన్‌ ‌చేశాను ‘ట్రైన్‌ ఎక్కానని.. మూడు గంటల్లో అక్కడ ఉంటానని.. కార్యక్రమానికి హాజరవుతానని’ హామీ ఇచ్చాను.

గుండెల్లో బాధ సుడులు తిరుగుతూనే ఉంది. గొంతుదాకా వచ్చి ఆగి పోయింది. ‘గుండె గొంతుక లోన కొట్టాడుతాది!’ నండూరి వారి ఎంకిపాట జ్ఞాపకం వచ్చింది.

‘‘కల్లులేని కబోదిని బాబూ! దరమం సెయ్యండి బాబూ!’’ అడుక్కుంటూనే అందరి దృష్టిని ఆకర్షించ డానికి జాలి గీతం అందుకొంది.

‘‘అమ్మా.. అని అరచినా.. ఆలకించవేవమ్మా.. ఆవేదన లేనిరోజు ఈ జన్మకు లేదా.. కనిపిస్తే కన్నీళ్లతో కాళ్లు కడుగుతా నాన్నా…’ ‘నాన్నా.. నాన్నా…’ గుండెలను పిండే విషాదం ఆమె గొంతులో సుడులు తిరుగుతోంది.

తల్లిదండ్రుల పట్ల అనుసరించిన అనుచిత వైఖరికి పశ్చాత్తాపంతో సినిమాలోని పాత్ర పడే ఆవేదనను ఆవిష్కరించే ఆ పాట ఘంటసాల వారి గొంతులో జీవం పోసుకుంది. అజరామరమై పోయింది!

నాన్నను చూడగానే కన్నీళ్లతో కాళ్లు కడిగేయాలి!’’ మనసులో నిశ్చయించు కున్నా!

‘‘ఒరేయ్‌! ‌రాజా! డాబామీద నాన్న, మావయ్యల పాట కచేరి జరుగుతోందిరా? చూద్దాం.. వస్తావా?’’ అక్కయ్య పాటలంటే చెవికోసు కుంటుంది. నన్ను ఆహ్వానించింది!

పాటలంటే ఇష్టం లేనివారెవరు? ‘‘శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తి గాన రసం ఫణిః’ డాబా మీద ఒక హార్మోనియం, రెండు తబలాలు, ఇద్దరు గాయకులతో పాట కచేరి జరుగుతోంది.

ఒక మావయ్య పాటలు పాడతారు. ఒక మావయ్య హార్మోనియం వాయిస్తారు! నాన్న, బావ తబలాలు వాయిస్తారు. టైలరింగ్‌ ‌పనిచేసుకునే ఔత్సాహికుడు రెండవ గాయకుడౌతాడు.

మావయ్య పాడే పాటలన్నీ ఘంటసాలవారివే! ఆ మాధుర్యం మావయ్య గొంతులో కూడా తొణికిసలాడేది! ‘‘సినిమాల్లో ప్రయత్నించరాదా.. మావయ్యా!’’ ఎంకరేజ్‌ ‌చేద్దామనే అన్నాను. ‘ఘంటసాల వారుండగా, మరో ఘంటసాల ఎలా పాడతాడురా!’’ మావయ్య గొంతులో ఆశో.. నిరాశో.. అర్థం కాలేదు. ‘‘కుడి ఎడమైతే.. పొరబాటు లేదోయ్‌.. ఓడిపోలేదోయ్‌!’’ ‌దేవదాసు పాటకు మావయ్య ప్రాణం పోశాడు. ‘‘కనుమూసినా కనిపించే నిజమిదేరా. ఇల లేదురా.. నీతి.. ఇంతేనురా.. లోకరీతి… మేలుకో… మేలుకో…’’ సంతానంలో పాట గుండెలను బరువెక్కించింది. ‘‘అమ్మా.. అని అరచినా.. ఆలకించవేమమ్మా.’’ ఆ పాటతో మావయ్య నూరుశాతం మార్కులు కొట్టేసేవాడు. సెల్‌ ‌ఫోన్‌ ‌మోగడంలో మళ్లీ జ్ఞాపకాలు దూరమయ్యాయి. ‘‘అన్నయ్యా! ఎక్కడున్నావ్‌!’’ ‌తమ్ముడి నుంచి ఫోన్‌. ‘‘అం‌తా రెడీగా ఉంది! నువ్వు రావడమే ఆలస్యం!’’ ఫోన్‌ ‌పెట్టేశాడు.

ట్రైన్‌ ఆగిఉంది. కిటికీలోంచి తొంగి చూద్దును గదా. ‘విజయవాడ’ స్టేషన్‌ ‌దర్శనమిస్తోంది. ‘ఇక్కడి నుండి నలభై నిమిషాల్లో నాన్న దగ్గర ఉంటాను!’ ముసురుకుంటున్న నాన్న జ్ఞాపకాలతో బావురుమని ఏడవాలనిపిస్తోంది! అయినా తమాయించుకుంటూనే ఉన్నాను. మళ్లీ కళ్లు మూసుకున్నాను! ‘‘రాజా! అన్నం తినరా!’’ నాన్న అన్నం పళ్లెంతో ముందు నిలబడ్డాడు.

‘‘తినబుద్ధి కావడం లేదు నాన్నా!’’

‘‘కొంచెం తింటే.. కడుపులో తిప్పడం తగ్గుతుంది!’’ ఆయన నోటి కందిం చాడు. ఫ్యామిలీ ప్లానింగ్‌ ‌తోబాటు మరో చిన్న ఆపరేషన్‌ ‌చేయంచు కున్న నాకు రెండు రోజులనుండి నాన్నే భోజనం తెస్తున్నాడు. తినిపిస్తునే ఉన్నాడు.

‘‘చిన్న ఆపరేషనేరా! పెద్ద జబ్బేం కాదు. రెండు మూడు రోజుల్లో మామూలు మనిషివైపోతావు!’’ ఆయన ఇచ్చిన ఉత్సాహమే త్వరగా కోలుకునేలా చేసింది.

నేను తిన్న కంచం ఆయనే కడిగి బాస్కెట్లో సర్దుకొని వెళ్లిపోయేవాడు. ఆ బంధమే నాకు ఆయనకు ఆఖరి ముద్దలు తినిపించే అవకాశమిచ్చింది.

‘‘రాజా! ఆయన అన్నం తినడంలేదురా! నువ్వయినా పెట్టు.. రెండు ముద్దలు తింటారేమో!’’ అమ్మ నా చేతికి అన్నం కలిపి ముద్ద అందించింది.

అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థ్ధమైంది. క్రమంగా ఆయన పరిస్థితి క్షీణిస్తోందనే అనుమానం నిజమైంది.

‘‘నాన్నా! అన్నం తింటావా?’’

కళ్లు, నోరు సగం తెరచి చూచాడు ముద్దనోట్లో పెట్టాను. గుటక వేశాడు రెండో ముద్ద తిన్నాడో.. లేదో.. చాలని కళ్లు మూసుకున్నాడు. క్రమంగా నాన్న కోమాలోకి జారుకున్నాడు.

తరువాత సెలైన్‌ ‌ద్వారా ఆహారం అందిస్తున్నారు. అప్పుడే సమ్మర్‌ ‌వెకేషన్‌ ‌తరువాత జాయిన్‌ అవడానికి బయలుదేరింది.. ట్రైన్‌ ఆగింది! మా ఊరు వచ్చే సింది! క్షణం ఆలస్యం చేయలేదు. రిక్షా కట్టించుకొని ఇంటికి వచ్చేశాను. సరిగ్గా.. సందు మొదట్లో పూలతో అలంకరించిన నాన్న అంతిమయాత్ర రథం ఆగి ఉంది. ఇంటిముందు షామియానా.. జనం.. నిర్జీవంగా నాన్న… రిక్షాదిగి ఒక్క అంగలో నాన్న ముందుకు చేరుకున్నాను. ‘‘నాన్నా!’’ బావురు మన్నాను. ‘‘అన్నయ్యా!’’ తమ్ముడు నన్ను కావలించు కొని బావురుమన్నారు.

 ‘‘నాన్నా!’’ అప్పటిదాకా దిగమింగుకున్న దుఃఖం గొంతులోంచి తన్నుకు వచ్చింది. వెక్కివెక్కి ఏడ్చాను. చిన్నపిల్లాడిలా ఏడ్చాను. జీవితంలో ఎప్పుడూ అంతగా ఏడవలేదేమో..! అంతగా… గుండెలవిసేలా ఏడుస్తుంటే.. ఎవరో ఓదార్చడానికి ప్రయత్నించారు.

‘‘వాడిని ఏడవనివ్వండి! ఎన్నిగంటల నుండి వాడి గుండెల్లో బాధ గూడుకట్టుకొని ఉందో.. దానిని కరిగి పోనివ్వండి. ఒంటరిగా ఎంత వేదన అనుభవించాడో దానిని ఆవిరి కానివ్వండి! వాడిని ఓదార్చకండి! కాసేపటికి వాడే తేరుకుంటాడు. హృదయభారం తగ్గిన తరువాత వాడే మామూలు మని షై పోతాడు!’’

అది పాటలు పాడే మావయ్య గొంతు! కొంచెం సేదదీరిన తరువాత ఆయన పాడినపాట కొంత ఉపశమనం కలిగించింది. ‘‘గుండె మంటలారిపే సన్నీళ్లు కన్నీళ్లు… ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్లు… పోయినోళ్లు అందరూ మంచోళ్లు… ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు..’’ సమయం.. సరిగ్గా మధ్యాహ్నం… మూడు గంటలు.

About Author

By editor

Twitter
YOUTUBE