సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, 26 సెప్టెంబర్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఈ ‌దేశం ఎటు పోతోంది? ఇదేదో రొడ్డకొట్టుడు ధోరణితో, మొక్కుబడిగా, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో వేదికలెక్కి వేస్తున్న ప్రశ్న కాదు. వర్తమాన విధ్వంసాన్ని చూసిన కళ్ల నుంచి జారుతున్న రక్తకన్నీరు దీనంగా అడుగుతున్న ప్రశ్న. ఈ దేశ ధార్మిక జీవనం, ఆధ్యాత్మిక ఔదార్యం చలించి అడుగుతున్న ప్రశ్న. దిగజారడానికి ఇక అవకాశం లేదని తెలిసిన నైతిక విలువలు చేస్తున్న పరిహాసం కూడా. ఏ విలువలూ పట్టని కొందరు పురుషాధములు ఈ నీచానికి ఒడిగట్టారంటేనే ఎంతో క్షోభ కలుగుతుంది. ఆ బాధ ఉద్దేశం అలాంటి వాళ్లకి శిక్ష పడడం. కానీ ఒక విశ్వవిద్యాలయంలో, ఒక విద్యార్థినే సాటి విద్యార్థినులను అసభ్యకరంగా చిత్రించి ఆ వీడియోలను బయటకు చేరవేస్తున్నదంటే మన విలువలు ప్రశ్నార్థకం కావడం లేదా? ఈ దేశానికి ఏమైంది? ఇలా ప్రశ్నించుకోవద్దా? ఆ తప్పును నిప్పుతో కడగవద్దా? ఆత్మ విమర్శ చేసుకోవద్దా? కౌటుంబిక విలువలను సమీక్షించుకోవద్దా?

ఇదంతా మొహాలీలోని చండీఘడ్‌ ‌విశ్వవిద్యాలయంలో జరిగిన నిర్వాకం. 60 మంది విద్యార్థినులు వసతిగృహాలలో స్నానాలు చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు బయటపడడమంటే జాతికి శరాఘాతమే. ఇందుకు సాటి విద్యార్థినే పాల్పడడం క్షమార్హం కాని అపరాధం. దీని మీదే సెప్టెంబర్‌ 17‌న విద్యార్థిను లంతా భగ్గుమన్నారు. మత్తు బానిసలతో నిండిపోయి, ఉడ్తా పంజాబ్‌గా పేరు తెచ్చుకున్న ఆ రాష్ట్ర రాజధానిలో ఈ ఘోరం జరగడం కొత్త ప్రశ్నలకు తావిచ్చేదే. అధికారం కోసం ఎలాంటి విద్రోహపు హామీని అయినా ఇవ్వడానికి వెనుకాడని ఆప్‌ ‌ప్రభుత్వం అక్కడ ఉంది. ఈ పనిచేసిన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ముఖ్యమంత్రి మాన్‌ ‌చెబుతున్నారు. పీకల దాకా తాగిన మాన్‌ను జర్మనీలో విమానం నుంచి అర్ధచంద్రాకార ప్రయోగం చేసినట్టు అదే సమయంలో వార్త రావడం జాతి ప్రారబ్ధం. ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి ఏదీ విలువ? అయినా సిట్‌ ‌దర్యాప్తు చేస్తోంది. మంచిదే.

జాతి యావత్తు తల దించుకునేటట్టు చేసిన మొహాలీ భయానక ఉదంతం తరచే కొద్దీ పరమ వికృతంగా కనిపిస్తున్నది. ఆ వసతిగృహంలో ఇలాంటి వీడియోలు చాలానే చిత్రీకరించారని, అవి బయటకు వెళ్లిపోయాయని సమాచారం. అదేం చిత్రమో, పోలీసులు ఈ వివాదాన్ని అక్కడే పాతరేయడానికి చూస్తున్నారని అనిపిస్తుంది. ఈ నికృష్టపు పనిలో ఉన్నప్పుడే అడ్డంగా దొరికిపోయిన విద్యార్థిని తాను ఇదొక్కటి మాత్రమే తీశానని చెబుతోంది కాబట్టి పెద్ద వివాదం కాదన్నట్టు వాదిస్తున్నారు. ఒక్కటే అయినా ఘోర నేరమే. మొహాలీకి చెందిన ఈ విద్యార్థిని వాటిని సిమ్లాలో ఉన్న మిత్రుడికి పంపుతుందట. వసతిగృహంలో ఉన్న ఇతర విద్యార్థినులు స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఆ విద్యార్థిని వీడియోలు తీస్తూనే ఉండేదని సమాచారం. ఆ వీడియోలను పంపితే, సిమ్లా చెలికాడు ఆన్‌లైన్‌లో ఉంచుతాడట. ఇది నీలిచిత్రాల వ్యవహారం కాదా? గత కొద్దిరోజులుగా ఆ మానసిక రోగి నిర్వాకం పట్ల కన్నేసి ఉంచిన విద్యార్థినులు సెప్టెంబర్‌ 17‌న ఆధారాలతో పట్టుకున్నారు. విశ్వవిద్యాలయం అధికారులు ఆ విద్యార్థినిని ప్రశ్నిస్తే, తాను వీడియోలు తీసిన మాట నిజమేననీ, కానీ వాటిని తన సిమ్లా మిత్రుడి ‘ఆజ్ఞ’ మేరకే తీశాననీ చెప్పింది. ఈ వికృత వివరణే దీని వెనుక ఎంతమంది ఉన్నారో సూచనప్రాయంగా చెబుతోంది. తమను అసభ్యంగా చిత్రించిన వీడియోలు వైరల్‌ అవుతున్న సంగతి తెలిసి నవనాడులు క్రుంగిపోయాయని మిగిలిన విద్యార్థినులు చెప్పారు. పాపం, ఒక అభాగ్యురాలు గుండెపోటుకు గురైంది. వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.

అయితే మీడియా సమాచారానికీ, పోలీసుల వివరణకీ పొంతన కుదరడం లేదు. ఆ చీడపురుగు ఒక్క వీడియో మాత్రమే తీసిందని పోలీసు బాబుల భాష్యం. మరి, అంతమంది విద్యార్థినులు ఎందుకు భీతిల్లినట్టు? మీడియా సమాచారం ప్రకారం ఆమెకు అదే నిత్యకృత్యం. ఈ సంగతి వెలుగు చూడగానే ఎనిమిది మంది బాధిత విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నట్టు మొదట వార్త వచ్చిన సంగతేమిటి? ఇది అబద్ధమని తేలడం మాత్రం పెద్ద ఊరట. కానీ తమకు జరిగిన ఘోర అన్యాయం గొంతు ఎత్తిన విద్యార్థినుల పట్ల కొందరు విశ్వవిద్యాలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం బొత్తిగా అమానుషం.

ఆ సరస్వతీ నిలయంలో ఒక చీడపురుగు చేసిన ఈ దుశ్చర్య రాజకీయ నేతలను కొంచమైనా కదిలించిందా? ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీకి ఏ విలువలూ లేవు సరే. దేశ ప్రజానీకం స్పందన ఏది? మహిళాలోకం, మహిళా హక్కుల కార్యకర్తల స్పందన ఏది, ఎక్కడ? మొహాలీలో ఈ క్షుదక్రిమి తీసిన వీడియోలను, సిమ్లాలో కూర్చున్న ఆ మరో క్షుద్రజీవి తాను మాత్రమే చూసుకుని పైశాచికానందం పొందుతుందనీ, అక్కడితో అవి కాలగర్భంలో కలసిపోతా యనీ అనుకోగలమా? అవి నిస్సందేహంగా అంగడి సరుకులవుతాయి. దీనికి ఒక విద్యార్థిని కేంద్రబిందువు కావడం లక్షల ప్రశ్నలకు తావిస్తుంది. ఇటీవలి కాలంలో తాగి రోడ్ల మీద పోలీసుల పైన తిరగబడడం, నిశి వేళ విన్యాసాలు యువతులలోనూ సాధారణంగా మారుతోంది. టిక్‌టాక్‌ల పేరుతో తైతెక్కలకీ, పార్టీల పేరుతో అంగాంగ ప్రదర్శనలకీ, టీవీ షోలలో ద్వంద్వార్థాల మాటలకీ యువతులు, అక్కడక్కడా గృహిణులు కూడా తెగబడుతున్నారు. మహిళలు సాధించుకున్న నిజమైన స్వేచ్ఛ మళ్లీ వ్యాపార విషవలయంలో తమకు తాము అంగడి వస్తువుగా మారిపోయేందుకు దోహదం చేయకూడదు. నిజమైన చైతన్యం కలిగిన స్త్రీ తన శరీరం మీద గౌరవం పోగొట్టుకోదు. అందుకు అనుమతించదు. స్వేచ్ఛ, హక్కులు, ఆధునికత వంటి పేర్లతో యువతులను వారి వ్యాపారాలకు, ప్రయోజనాలకు ఉపయోగించుకునే అధములు, మోసకారి సంస్థలు మన చుట్టూ ఎప్పుడూ సిద్ధమే. మీ ధార్మికదృష్టిని, మీ సాంస్కృతిక నేపథ్యాన్ని వీళ్లే ఛిద్రం చేసి, మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తారు. అది యువతులు గమనించాలి. ముఖ్యంగా కుటుంబాలు మేల్కొనాలి.

About Author

By editor

Twitter
Instagram