సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ఆశ్వీయుజ శుద్ధ అష్టమి – 03 అక్టోబర్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌గవర్నర్‌లకీ, రాష్ట్ర ప్రభుత్వాలకీ మధ్య వివాదాలు కొత్తవేమీ కాదు. కానీ బీజేపీ/ఎన్‌డీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్‌లో ఏ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వమైనా తప్పులు మాత్రమే చూస్తుంది. ఇక తమ ప్రభుత్వ దాష్టీకాలను దాష్టీకాలంటూ ప్రస్తావిస్తే ఘోర నేరంగానే జమ కడుతుంది. ఇప్పుడు కేరళలో జరుగుతున్నది అదే. రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా ఏలుతున్న సీపీఎం నిర్వాకాల గురించి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌ ‌సెప్టెంబర్‌ 20‌న రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ కడిగి పారేశారు. యూనివర్సిటీలను ఎర్ర తైనాతీలతో నింపుతానంటే ప్రేక్షక పాత్రకు పరిమితం కాలేనని తెగేసి చెప్పారు. అసలు వీళ్ల కమ్యూనిజం విదేశాల నుంచి దిగుమతి అయిందనీ, దానికి వ్యతిరేకంగా ఎవరు అసమ్మతి ప్రకటించినా చావగొట్టి చెవులు మూసేందుకు బలగాలను ఉసిగొల్పడమంటే దానికి మహా ప్రీతిపాత్రమని చెప్పారు గవర్నర్‌.

2019‌లో కన్ననూర్‌ ‌విశ్వవిద్యాలయంలో తనపై హత్యాయత్నం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, ఆ విషయమే కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు అంతకు ముందు రోజు ఆరిఫ్‌ ‌చెప్పారు. నిజంగా అదొక దుర్ఘటన. ఇండియన్‌ ‌హిస్టరీ కాంగ్రెస్‌ ‌సమావేశాల పేరుతో అక్కడ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ ‌హబీబ్‌, ఇం‌కొందరు వేసిన ‘ప్రగతిశీల వీరంగం’ టీవీ చానళ్లలో జాతి యావత్తు వీక్షించింది. మైకు దగ్గర నిలబడిన ఆరిఫ్‌ను ప్రొఫెసర్‌ ‌హబీబ్‌ ‌వెనక్కి లాగారు. చరిత్ర కాంగ్రెస్‌లో సీఏఏకి వ్యతిరేక ఉపన్యాసాలు హోరెత్తుతుంటే ఆపడానికి ఆరిఫ్‌ ‌ప్రయత్నించడం, దానితో కొందరు భౌతిక దాడికి యత్నించడం కూడా జరిగాయి. ఆరిఫ్‌ ‌వెళుతుంటే అవహేళన చేసిన వారిని నిరోధించకుండా పోలీసులను పినరయ్‌ ‌కార్యదర్శి రాగేశ్‌ ‌నిరోధించారు. గతం నుంచి పినరయ్‌, ఆరిఫ్‌ల మధ్య నున్న విభేదాలు తాజా ప్రకటనతో తారస్థాయికి చేరాయి.

ఆరిఫ్‌ ‌విలేకరుల సమావేశం, అందులో చెప్పిన సత్యాలు పెను సంచలనం రేపాయి. ఆ మాటలన్నీ కమ్యూనిస్టుల గుండెలను పగలగొట్టేవే కూడా. కమ్యూనిస్టు అనేవాడికి చెవుల్లో మరిగించిన సీసం పోసినట్టు ఉండే మాట కూడా అనేశారాయన. అదే-‘ఆర్‌ఎస్‌ఎస్‌తో నాకు బాంధవ్యం ఉంది’ అని. పైగా అది అత్యంత సన్నిహిత బంధం సుమ అని విడమరచి మరీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌తో ఆరిఫ్‌ ‌సమావేశం కావడం (సెప్టెంబర్‌ 18) ‌గురించి విలేకరులు అడిగినప్పుడు ఎలాంటి శషభిషలు లేకుండా ఈ విషయం కుండబద్దలు కొట్టారాయన. ఇదేమీ అసాధారణం, జరగకూడనిదీ కాదన్నారు.  ఆర్‌ఎస్‌ఎస్‌తో తన బంధం 1986 నుంచి, అంటే మూడున్నర దశాబ్దాలుగా పరిఢవిల్లుతున్నదని కూడా చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిషిద్ధ సంస్థ అనుకుంటున్నారా? గణతంత్ర వేడుకలలో పాల్గొనవలసిందిగా నెహ్రూ వారిని ఎందుకు ఆహ్వానించారు? అని కూడా ప్రశ్నించారు ఆరిఫ్‌.

‌పాపం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌కి  గవర్నర్‌ ‌మాటతో  మెదడు మొద్దుబారిపోయినట్టే ఉంది. కానీ కోలుకుని గంగవెర్రులెత్తిపోయారు. ఆరిఫ్‌ ‌సంఘ పరివార్‌కి లొంగిపోయారంటూ ఇల్లెక్కి అరిచారు. మాట్లాడేటప్పుడు పదాలను స్పృహతో ఉపయోగించాలని ఉచిత సలహా ఇచ్చారు. వ్యక్తిగా ఆరిఫ్‌కు ఏవో అభిప్రాయాలూ, ఏదో సంస్థతో అనుబంధాలూ ఉండవచ్చు. కానీ ఆయన గవర్నర్‌ ‌వంటి రాజ్యాంగ పదవిలో ఉన్నంతకాలం కమ్యూనిస్టు వ్యతిరేకతకు ప్రతీకగా కనిపించకూడదని లోతైన సుద్దులు వక్కాణించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి వ్యక్తిగత హోదాలోనే అయినా ప్రకటనలు గుప్పించరాదని కూడా పినరయ్‌ ‌తేల్చేశారు. విదేశాల నుంచి వచ్చిన సిద్ధాంతాలతో ఆయన విభేదించవచ్చు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ను శ్లాఘించడంలో ఆ సంస్థ కార్యకర్తను మించిపోతున్నారని అక్కసంతా వెళ్లగక్కారు. ఏ భారతీయ కామ్రేడ్‌కైనా ఆర్‌ఎస్‌ఎస్‌ను తీవ్రంగా విమర్శించాలంటే నాజీలు, నాజీయిజం వంటి పదాలు ఠక్కున నాలుక మీదకు వచ్చి వాలతాయి. పనిలో పనిగా హిట్లర్‌ ‌పూన్తాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంతం, నిర్మాణం కూడా హిట్లర్‌ ‌నాజీయిజం నుంచి ఉట్టిపడిందంటూ పాత పాచిపాటను వినిపిస్తారు. అలాగే తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో చరిత్ర తెలుసుకోండి అంటారు. ఇప్పుడు పినరయ్‌ ఈ ‌పాచిపాటలనే వల్లించారు. అంతర్గత శత్రువులు కనిపించకూడదన్నదే భారతీయ సంస్కృతి అట. దానిని హిట్లర్‌ ‌ప్రేరణతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు అమలు చేస్తున్నదట. కమ్యూనిస్టులు, యూదులు అంతర్గత శత్రువులని హిట్లర్‌ ‌చెప్పిన సిద్ధాంతాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇక్కడ వల్లె వేస్తోందని పినరయ్‌ ‌గతితార్కికంగా కాబోలు భాష్యం వెలగబెట్టారు. దేశంలో పలుచోట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మైనారిటీల మీద జరుపుతున్న అరాచకాలు భయానక వాతావరణాన్ని సృష్టించిందట. మరి కేరళలో సీపీఎం ప్రోద్బలంతో ముస్లిం మతోన్మాదులు చంపుతున్నది ఎవరినీ? లవ్‌ ‌జిహాద్‌లు చేస్తున్నదెవరు? కమ్యూనిస్టు ముఖ్యమంత్రికి కళ్లు మసకేశాయా? కాగా సెప్టెంబర్‌ 20‌న ముస్లిం మేధావులు ఎస్‌ ‌వై ఖురేషీ (మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌), ‌నజీబ్‌ ‌జంగ్‌ (‌ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌) ‌మోహన్‌జీ భాగవత్‌తో సమావేశమయ్యారు. జ్ఞాన్‌వాపి మసీదు వివాదం నేపథ్యంలో దేశంలో మత సామరస్యం నెలకొల్పే విషయం వారు చర్చించారని చెబుతున్నారు. ఇది కూడా కమ్యూనిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేయగలిగేదే.

కమ్యూనిస్టుల అసలు బాధ -మార్క్సిస్టులు, ముస్లిం మతోన్మాదులు హాయిగా ఏలుకుంటున్న రాజ్యంలో ఒక ముస్లిం తాను ఆర్‌ఎస్‌ఎస్‌ను అభిమానిస్తానని ప్రకటించడం ఎన్ని మార్పులకు దారి తీయవచ్చు!? ఆ మార్పులు మార్క్సిస్టులకు నచ్చేవి కావు. ఇది పినరయ్‌ ‌పాలిట పీడ కలే మరి!

About Author

By editor

Twitter
Instagram