సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌భాద్రపద  బహుళ నవమి – 19 సెప్టెంబర్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌భారత వ్యతిరేకత అనే జబ్బు కాంగ్రెస్‌లో రోజురోజుకూ పెరిగిపోతోంది. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడానికీ, భారత జాతీయతనీ, భారతీయతనీ ద్వేషించడానికి మధ్య ఉన్న తేడాను ఆ పార్టీ పూర్తిగా వదిలేసి చిరకాలంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నది. భారత్‌ ‌జోడో యాత్ర పేరుతో ఆ జబ్బును దేశానికంతకి అంటించాలని ఇప్పుడు రాహుల్‌ ‌గాంధీ ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో వర్గాల మధ్య తెచ్చిన వైషమ్యాన్ని తగ్గించి, ఏకం చేయడానికి భారత్‌ ‌జోడో యాత్ర చేపట్టినట్టు పైకి చెబుతున్నా, నిజానికి అది భారత్‌లో జ్వాలలు రగిలించే ఉద్దేశంతోనే జరుగుతున్నది. ఈ యాత్రలో కనిపించేది హిందూ ద్వేషం. స్పష్టంగా కనిపిస్తున్నది అధికార దాహం. హింసాద్వేషాలు పరిష్కారం కాదని ధర్మపన్నాలు చెబుతూనే, విధ్వంసాన్ని, విద్వేషాన్నీ సృష్టించే వాతావరణాన్ని నిర్మించడానికే ఈ యాత్రను రాహుల్‌ ‌ప్రారంభించారు.

భారతమాతను, హిందూధర్మాన్ని బాహాటంగా నిందించే పాస్టర్‌ ‌జార్జి పొన్నయ్యను కలసి, జీసస్‌ ఒక్కడే దేవుడు, శక్తి కాదు అంటూ అతడి నోటి నుంచి మరొకసారి హిందూధర్మాన్ని కించపరిచేటట్టు ఈ యాత్ర ద్వారా చేశారు రాహుల్‌. ‌తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకప్పటి యూనిఫారమ్‌లోని నిక్కర్‌కు నిప్పు పెట్టినట్టు చూపే ఫోటోను రాహుల్‌ ‌గాంధీ పార్టీగా చెప్పే మూకకి సెప్టెంబర్‌ 12‌న ట్వీట్‌ ‌చేసింది. ఇది ముమ్మాటికీ తుంటరితనమే. హద్దులు మీరిన తెంపరితనమే. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విధానాలతో కలిగిన నష్టాన్ని అంచెలంచెలుగా నివారిస్తాం, అందుకు ఇక 145 రోజులు మిగిలి ఉంది అంటూ ఒక వ్యాఖ్యనూ జత చేశారు. ఇది ఆ రెండు సంస్థల మీద హింసను ప్రేరేపించడం కాదా? ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహ సర్‌ ‌కార్యవాహ్‌ ‌మన్‌మోహన్‌ ‌వైద్య, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ ‌పాత్రా కూడా ఈ దుశ్చర్యను ఖండించారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారానే కాంగ్రెస్‌ ‌భారతీయులను కలపాలని అనుకుంటున్నదని వైద్య అన్నారు. తమ సంస్థల మీదకు ఉగ్రవాదులను ఉసిగొల్పడమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ‌జోడో యాత్రను ప్రారంభించిందని సంబిత్‌ ‌పాత్రా గట్టి విమర్శ చేశారు. వైద్య చెప్పినట్టు కాంగ్రెస్‌, ‌దాని తైనాతీలు, కమ్యూనిస్టులు, భారత వ్యతిరేకశక్తులు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద ఎంత విషం కక్కుతున్నా హిందూత్వకు ఆదరణ పెరుగుతూనే ఉంది. కాంగ్రెస్‌ ‌తదితర విద్రోహ శక్తులు ఎంత అరచి గీపెట్టినా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రాధాన్యం ఇనుమడిస్తూనే ఉంది.

భారతదేశానికీ, హిందూత్వకూ పచ్చి వ్యతిరేకి జార్జి పొన్నయ్యను కేరళలో కలుసుకున్న రాహుల్‌కు ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల కోసం నిర్మించిన స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించడానికి మాత్రం కొద్ది సమయం దొరకలేదు. ఆ యాత్రలో భాగంగానే ఆవిష్కరణ కార్యకమం ఏర్పాటు చేశారు. ఖిలాఫత్‌ ఉద్యమం పేరుతో మోప్లా హింసాకాండలో హిందువుల రక్తం పారిన నేల అది. మోప్లా నూరేళ్ల సందర్భాన్ని ఘనంగా జరుపుకున్న నేల కూడా అదే. అక్కడ ఈ దేశ స్వాతంత్య్రం కోసం పాటు పడిన వారిని గౌరవిస్తే ముస్లింలకు కోపం రాదా? అది అందరి కంటే బాగా పసిగడుతున్నవాడు రాహుల్‌ ‌గాంధీయే. అందుకే దేశభక్తి ప్రపూరితమైన ఒక మంచి కార్యక్రమానికి మొహం చాటేశారు. ఈకే మెమ్మన్‌, ‌పి. గోపీనాథ్‌ ‌నాయర్‌ అనే స్వాతంత్య్ర సమరయోధుల సేవలకు గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నాన్ని ఆ దారిలో వెళుతూ కూడా రాహుల్‌ ‌గాంధీ పట్టించుకోలేదని స్టేట్స్‌మన్‌ ‌న్యూస్‌ ‌సర్వీస్‌ ‌సెప్టెంబర్‌ 12‌న వెల్లడించింది. ఈ స్మారక చిహ్నాన్ని రాహుల్‌ ఆవిష్కరిస్తారని ముందుగా ప్రకటించారు కూడా. ఆ ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులు, కేరళ పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్‌, ఎం‌పీ శశిథరూర్‌ ‌వంటి వారంతా రాహుల్‌ ‌రాక కోసం ఎదురు చూస్తుండగానే ఆ స్మారక చిహ్నానికి దగ్గరగా ఉన్న రోడ్డు మీద నుంచే రాహుల్‌, ఆయన వెనుక జోడో యాత్ర సాగిపోయింది. ఇలాంటి చర్యలు విశ్వసనీయతను దెబ్బ తీస్తాయని శశి థరూర్‌ ‌వ్యాఖ్యానించవలసి వచ్చింది. జరిగిన దానికి కేరళ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులకు క్షమాపణ చెప్పుకున్నారు కూడా. ఇది దేనికి నిదర్శనం? మన దేశ స్వాతంత్య్ర పోరాటం మీద, దేశభక్తుల మీద రాహుల్‌కు ఆవగింజంత గౌరవం లేదు. ఉండదు.

ఆర్‌ఎస్‌ఎస్‌, ఆ ‌మహా సంస్థ ఔన్నత్యం, భారతీయ సమాజానికి అందిస్తున్న సేవ, ఆ సంస్థ ప్రవచించే జాతీయవాదం, అందులోని ప్రయోజనం రాహుల్‌, ఆయన మూకకి తల్లకిందులుగా తపస్సు చేసినా అర్ధం కావు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో సంఘ్‌ ‌వేల సంఖ్యలో పాఠశాలలు నిర్వహిస్తున్నది. వందల సంఖ్యలో అనాథాశ్రమాలను నెలకొల్పింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే హిందూధర్మ చింతన పునాదిగా నిర్మితమైన జాతీయవాద సౌధం. ఇవాళ్టి హిందువులకు ప్రేరణ. ఒక భరోసా. వారి గుండెచప్పుడు. దేశభక్తి దాని ఆత్మ. సేవాభావం, ధర్మరక్షణ రెండు కళ్లు. గాంధీజీ హత్య సహా, ఏ మత ఘర్షణ ఆరోపణ, ఎన్నో అల్లర్లకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద వచ్చిన ఏ ఒక్క ఆరోపణ న్యాయస్థానాలు ధ్రువీకరించకలేకపోయాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తాత్త్వికతలో ద్వేషం ఎక్కడిది? ఉంటే రాహుల్‌, ఉన్మాద మౌల్వీలు, విద్రోహ ఫాదర్లు ఇలా బరితెగించి మాట్లాడగలిగేవారేనా?

అధికారాన్నీ, ప్రాబల్యాన్నీ కోల్పోతున్న కొద్దీ కాంగ్రెస్‌లో పిచ్చి ధోరణులు ముదిరిపోతున్నాయి. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసుతో అది మరింత ముదిరింది. భారత్‌ ఒక దేశమే కాదని విదేశీ విశ్వవిద్యాలయాలలో కారుకూతలు కూసిన రాహుల్‌ ‌నడతలో, నడకలో, మాటలో ఇంతకు మించి ఆశించలేం. దేశాన్నీ, దేశ సమైక్యతనీ ఎక్కడికి తీసుకుపోతాయో ఆలోచించకుండా యాత్రంతా జ్వాలలు రగులుస్తూ పోతే ఏం జరుగుతుందో ఆలోచించే ఇంగిత జ్ఞానం రాహుల్‌కు కరవైంది. అదే విషాదం.

About Author

By editor

Twitter
Instagram