చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరవింద ఘోష్‌ ‌జన్మించిన బెంగాల్‌ ఇదేనా?

సమ్మెలు, లాకౌట్లు, హత్యలు, అత్యాచారాలతో వర్ధిల్లిన నాలుగు దశాబ్దాల కమ్యూనిష్టు నిహిలిష్టు పాలన ముగిసింది.

ఇప్పుడు మమతా దీదీ అనే కొత్త భూతం వచ్చింది.

‘మాతో పోరాటానికెవరొస్తారో, రండి! ముక్కలు ముక్కలు చేస్తాం’ అంటూ గద్దించగల ‘స్ట్రీట్‌ఫైటర్‌’ ‌మమత. నిన్న అజిత్‌పాంజా అనే సాంకోపాంజా- నేడు పార్థా చటర్జీ అనే మరో దొంగ. ఇద్దరూ ఈమె ఆంతరంగికులే.

ఎవరీ పార్థా చటర్జీ? అలనాడు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు, మెడికల్‌ ‌సీట్లు తెగనమ్మి కోటాను కోట్లు సంపాదించాడు.

తిలా పాపం తలా పిడికెడు పంచుకున్నారు. ‘ఈ పాపంలో నాకేమీ సంబంధం లేదు’ అన్నది మమతాబెనర్జీ, తాజాగా.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌పట్టుకోబట్టి సరి పోయింది కాని లేకుంటే ఆ రాత్రికి రాత్రే ఈ కట్టలపాములను ఎక్కడికో తరలించేవారే. మొత్తం అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికింది.

ఈ అర్పిత ఎవరు? భర్తకు విడాకులిచ్చి కళాపోషణకు సినిమాలలో చేరింది. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చింది. ఒక విధంగా పార్థా బినామి. ఈమె ఇంట్లో దొరికిన డబ్బు మొత్తం పార్థాదే. పాపం, ఆ విషయాన్ని ఆమె నిజాయతీగా ఈడీకి మాత్రమే చెప్పింది. తనని బలిపశువును చేశారంటూ పార్థా పాచిపోయిన ప్రకటన చేశాడు.

‘సువేందు అధికారి దొంగ. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌సభ్యుడు బీజేపీలో చేరగానే  సత్పురుషుడైనాడా?’ అని తృణమూల్‌ ‌వారు ప్రశ్నిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సువేందు అయినా, మమతా బెనర్జీ అయినా సరే!

ఎన్నెన్ని దుర్మార్గాలు జరిగాయో! అవన్నీ వెలుగులోకి వచ్చాయా? లేదే! ఇంగ్లీషులో టిప్‌ ఆఫ్‌ ‌ది ఐస్‌ ‌బెర్గ్ అని సామెత. అంటే గుమ్మడికాయలో ఆవగింజంత మాత్రమే బయటకు వచ్చింది. కాంగ్రెస్‌, ‌కమ్యూనిష్టు, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ల కాలంలో జరిగిన హత్యలు, గృహదహనాలు, లూటీలు గుర్తు లేవా?  చంపి చెట్టుకు వేలాడదీసే ఘట్టాలు ఒకప్పుడు బెంగాల్‌లో నిత్యకృత్యం. దీనినే ప్రజా స్వామ్యమని నమ్మమంటారు.

కాంగ్రెస్‌ ‌నాయకుడు అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి మమతా బెనర్జీకి ఒక లేఖ రాస్తూ, విద్యాశాఖ మంత్రిగా, పరిశ్రమల మంత్రిగా పార్థా చటర్జీ కోట్లు గడించిన విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి, మంత్రివర్గం నుండి బర్తరఫ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశాడు. బాగుంది. మరి సోనియా, రాహుల్‌గాంధీల మాటేమిటి? దీనినే గురివింద సామెత అంటారు. బర్తరఫ్‌ ‌చేయవలసింది పార్థా చటర్జీని మాత్రమేనా? మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని కూడా బర్తరఫ్‌ ‌చేయాలి. నేరం చేసిన వారికీ, రక్షించినవారికీ యావజ్జీవ కారా గార శిక్ష విధించవలసినదే. అరెస్టు అయిన రోజు తెల్లవారుజామున పార్థా మూడుసార్లు దీదీకి ఫోన్‌ ‌చేశారు. అటువైపు ‘స్పందించుటకు’ ఎవరూ లేరు.

తనకు ఆరోగ్యం బాగాలేదని దవాఖానాలో చేరాడు పార్థా. అక్కడి నుంచి కలకత్తాలో ఉన్న మంచి డాక్టర్ల చేత పరీక్ష చేయిస్తే ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉన్నదని తేల్చారు. పాపం ఇప్పుడు బీజేపీ కుట్ర, కేంద్రం దుర్వినియోగం అంటూ ఆరోపించడానికి అవకాశం లేకుండా చేసింది కలకత్తా హైకోర్టు. అంతా కోర్టువారి కనుసన్నలలోనే కదా జరిగింది.

ఇప్పుడు తేలవలసిందేమిటి? ఈ డబ్బులో మమతాబెనర్జీ వాటా ఎంత? ఆమె మేనల్లుడు అభిషేక్‌ ‌బెనర్జీ పాత్ర ఏమిటి?

బెయిల్‌ ‌మీద వచ్చిన గోల్డ్ ‌స్మగ్లర్లు ముఖ్య మంత్రులతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ భారత ప్రజాస్వామ్యాన్ని  అపహాస్యం చేస్తున్నారు.

సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్‌ ‌శ్రేణులు రోడ్డుకెక్కి వాహనాలకు నిప్పు పెట్టాయి. ఎందుకు?

–  ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌, ‌విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
Instagram