– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అడ్డం పెట్టుకుని బీజేపీనీ, ప్రధాని నరేంద్ర మోదీనీ ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో మొదటి పావును కదిపినది విపక్ష శిబిరమే. రాష్ట్రపతి ఎలక్టోరల్‌ ‌కాలేజీలో ఎన్‌డీఏకి 48 శాతం వరకే అధికారికంగా ఓట్లు ఉన్నాయి. కానీ మిగిలిన ఓట్లన్నీ విపక్షానివేననుకోవడానికి ఎలాంటి ప్రాతిపదికా లేదు. ఆ తప్పుడు లెక్కతో తమ అభ్యర్థిని గెలిపించవచ్చునని విపక్ష శిబిరం విర్రవీగడమే వింతల్లో కెల్లా వింత.  ఈ లెక్క ఘోరంగా తప్పింది. విపక్ష రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు మాట అటుంచి, ఆ శిబిరమే కుప్ప కూలిపోయింది. ఇది విపక్షాల ఘోర వైఫల్యం. దీనికే ఇదంతా మోదీ రాజకీయమని పేరు పెట్టి  ప్రచారం చేశారు.  సిద్ధాంత రహిత రాజకీయాలు, అవసరార్థ స్నేహాలు, పొత్తులు, కలయికలు ఎప్పుడూ సత్ఫలితాలను ఇవ్వవు. వ్యక్తి వ్యతిరేక రాజకీయాలదీ ఇదే పరిస్థితి.


2014లో నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు, అవి నడుపుతున్న రాజకీయాలను విశ్లేషించినప్పుడు ఇలాంటి అభిప్రాయాలు కలగక మానవు. సంపూర్ణ ఏకాభిప్రాయం లేనప్పటికీ కనీసం కొన్ని అంశాల్లో అయినా ఉమ్మడి నిర్ణయాలను తీసుకోలేని పక్షాలు వాటి వైరిపక్షం మీద విజయం సాధించగలవా? ప్రజలు మాత్రం వాటిని ఎలా నమ్ముతారు? ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలలో విపక్షాలకు ఎదురైన ఓటమిలో ఇవన్నీ కనిపిస్తాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికలలోను ఇదే పునరావృతమవుతుంది. విపక్షాల ఓటమి.

 నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేసిన మరుక్షణం నుంచి కూడా ఆయనను గద్దె దించాలని ప్రాకులాడుతున్న విపక్షాలు దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలో అయినా ఏకాభిప్రాయానికి రాలేక పోయాయి. ఉమ్మడి అభ్యర్థి దొరకని పరిస్థితి. మొదట శరద్‌పవార్‌ అనుకున్నారు. ఆయన కాదన్నారు. తరువాత కశ్మీర్‌ ‌వేర్పాటువాది ఫరూక్‌ అబ్దుల్లాను లాగారు. ఆయన వెనక్కి తగ్గారు. గాంధీజీ మనుమడు అంటూ గోపాలకృష్ణ గాంధీని బరిలో దించాలని అనుకున్నా సాధ్యపడలేదు. అంతిమంగా టీఎంసీ నాయకుడు యశ్వంత్‌ ‌సిన్హాను ఎంపిక చేసుకున్నారు. ఇంతకీ ఈయన రెండు దశాబ్దాలు బీజేపీలో పని చేసి వచ్చిన నేత. ఈయన ఏకైక ఎజెండా మోదీ వ్యతిరేకత మాత్రమే.

 ఓడిపోతామని తెలిసినప్పటికీ విపక్షాలు ఒక తాటిమీదకు రాలేకపోయాయి. రేపు అధికారం తథ్యమని అనిపిస్తే ఎన్ని వివాదాలు వస్తాయో చెప్పనక్కర్లేదు. ప్రధాని పదవి కోసం వారిలో ఎంత పోటీ ఉంటుందో ఊహించగలం. రాష్ట్రపతిగా గెలవలేని ఎన్నిక అభ్యర్థి ఎంపికలో విపక్షాలు మల్లగుల్లాలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ ‌ముందే చేతులెత్తేసింది. పార్టీ అధినేత్రి సోనియా, యువరాజు రాహుల్‌ ‌గాంధీ ఈడీ విచారణలతో సతమతమయ్యారు. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో వారు పీకల్లోతుల్లో ఇరుక్కుపోయారు. ఇప్పటికి విపక్ష శిబిరంలో కీలక పాత్ర పోషిస్తున్న పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత శరద్‌ ‌పవార్‌ ‌చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తొలుత వారి వైఖరిని చూసి గట్టి పోటీ ఇస్తారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలిగింది.

అలాంటి సమయంలో ఎన్‌డీఏ అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము పేరును బీజేపీ సంధించింది. దీనితో విపక్ష శిబిరం ఒక్కసారిగా డీలా పడింది. అందులో మొదటి అస్త్ర సన్యాసం చేసిన వారు సాక్షాత్తు కూటమి నేతే కావడం విశేషం. ద్రౌపది ముర్ము అని మాకు ముందు చెబితే మేం కూడా సమర్థించేవాళ్లం అని యశ్వంత్‌ ‌కూసాలు కదిలిపోయే ప్రకటన చేశారు మమతా బెనర్జీ. దీనికి తోడు శివసేనలో చీలిక దృష్ట్యా, ఇక మిగిలినది ద్రౌపది గెలుపేనని కూడా ప్రకటించారు మమత. మహారాష్ట్ర రాజకీయాలను అంతగా కలుషితం చేసిన శరద్‌పవార్‌ ‌పాలిట ఈ ప్రకటన శరాఘాతమే. ఈ పరిణామాలన్నీ విపక్షాలు తమ అభ్యర్థిని తామే ఓడించే పరిస్థితికి దారి తీశాయి.

పార్టీలకు అతీతంగా ద్రౌపది ముర్ముకు మద్దతు వెల్లువెత్తడం మొదలయింది. కొన్ని రాష్ట్రాల్లో తటస్థులే కాదు, భాజపాయేతర ప్రజాప్రతినిధులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. వామపక్ష పాలిత కేరళలో మొత్తం ఓట్లు సిన్హాకే వస్తాయని అందరూ భావించారు. ఇక్కడ అధికార వామపక్ష, విపక్ష కాంగ్రెస్‌ ‌కూటములు ఆయనకే మద్దతు ప్రకటించాయి. కానీ ఇక్కడ ముర్ముకు ఒక ఓటు లభించడం విశేషం. ఆప్‌ ‌పాలిత ఢిల్లీ, పంజాబ్‌ల లోనూ 8 ఓట్లు రావడం గమనార్హం. నిజానికి ఆప్‌ ‌రాష్ట్రపతి ఎన్నికలలో రాసుకు పూసుకు తిరగలేదు. చివరికి యశ్వంత్‌కు మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17మంది ఎంపీలు, 125 మంది శాసనసభ్యులు తమ పార్టీల నిర్ణయానికి వ్యతిరేకంగా ముర్ముకు మద్దతుగా నిలిచారు. దీంతో ఊహించిన దాని కంటే ఆమెకు ఎక్కువ మెజార్టీ లభించింది. గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. యూపీలో సమాజ్‌ ‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌బాబాయి శివపాల్‌ ‌యాదవ్‌ ‌ద్రౌపదీకి దన్నుగా నిలిచారు. గతంలో పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌సిన్హాను ఐఎస్‌ఐ ఏజెంటుగా అభివర్ణించారని, అందువల్ల ఆయనకు తాను ఎలా ఓటేస్తానని శివపాల్‌ ‌యాదవ్‌ ‌ప్రశ్నించారు. సమాజ్‌ ‌వాదీ పార్టీ మిత్రపక్షం ఎస్‌ ‌బీఎస్‌పీ (సుహల్‌ ‌దేవ్‌ ‌భారతీయ సమాజ్‌ ‌పార్టీ) ఎమ్మెల్యేలు ఆరుగురు ముర్ముకే జైకొట్టడం విశేషం. అసోంలో 20 మంది హస్తం పార్టీ శాసనసభ్యులు ముర్ముకు జైకొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఏఐయూడీఎఫ్‌ (ఆలిండియా యునైటెడ్‌ ‌డెమొక్రటిక్‌ ‌ఫ్రంట్‌) ‌శాసనసభ్యుడు కరీముద్దీన్‌ ‌బర్బుయాన్‌ ‌వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగుకు పాల్పడిన హరియాణా హస్తం పార్టీ శాసనసభ్యుడు కులదీప్‌ ‌బిష్ణోయ్‌ ఈ ఎన్నికల్లో ‘అంతరాత్మ ప్రబోధానుసారం’ ఓటేశానని ప్రకటించడం విశేషం. ఒడిశాకు చెందిన హస్తం పార్టీ శాసనసభ్యుడు మహమ్మద్‌ ‌మొఖిం, జార్ఖండ్‌ ఎన్సీపీ ఎమ్మెల్యే కమలేశ్‌ ‌సింగ్‌, ‌గుజరాత్‌ ఎన్సీపీ ఎమ్మేల్యే కంథల్‌ ‌జడేజా ముర్ముకు మద్దతుగా నిలిచారు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ ఎమ్మెల్యే మన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ అయాలీ అధ్యక్ష ఎన్నికకు దూరంగా ఉన్నారు. లోక్‌ ‌జనశక్తి పార్టీ అధినేత చిరాగ్‌ ‌పాశ్వాన్‌ ‌కూడా ముర్ముకు మద్దతు ప్రకటించారు. దివంగత రామ్‌ ‌విలాస్‌ ‌పాశ్వాన్‌ ‌కుమారుడైన చిరాగ్‌ ‌పాశ్వాన్‌ ‌భాజపాకు మిత్రుడేమీ కాదు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ నిర్వహించిన నమూనా పోలింగుకు ఆయన హాజరయ్యారు. వాస్తవానికి 2020 నాటి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి చిరాగ్‌ ‌బీజేపీకి దూరంగా ఉంటున్నారు. నమూనా పోలింగుకు హాజరైనంత మాత్రాన తాను మళ్లీ ఎన్డీయేలో భాగమవుతున్నట్లు పరిగణించరాదని ఆయన స్పష్టం చేయడం విశేషం. కేవలం అభ్యర్థిని చూసి తాను ఓటేయనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన చివరికి ముర్ముకు మద్దతు ప్రకటించింది. మమతా బెనర్జీ తరువాత మోదీ వ్యతిరేక శిబిరంలో పెద్ద నోరుతో కనిపిస్తున్న తెరాసకు కూడా రాష్ట్రపతి ఎన్నిక వేడి కొద్దిగానే అయినా తగిలింది. ద్రౌపదికి మద్దతు ఇవ్వనందుకు నిరసనగా ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్‌ ‌పార్టీకి రాజీనామా చేశారు. ఒక గిరిజన మహిళకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని పార్టీ విస్మరించిందన్నారు. ఈ విష యంలో కేసీఆర్‌ ‌నిర్ణయం తనను బాధించిందన్నారు. గినిజన అభ్యర్థిపై ఆయన పునరాలోచించాల్సిన అవసరం ఉందని రామచంద్రు తెజావత్‌ ‌వాదన. అంతేకాక ముర్మును ఎంపిక చేసిన మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఒక గిరిజన మహిళను అత్యున్నత పదవికి ఎంపిక చేయడంపై అభినందించాల్సింది పోయి గిరిజనుల మెడపై కత్తి పెట్టేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొనడం సీపీఐ నారాయణ అపరిపక్వతకు నిదర్శనం. బడుగులకు తమ పార్టీలోనే కాస్త పెద్ద పదవులు ఇవ్వడానికి ముందుకు రాని ఆ పార్టీ, దాని సోదర పార్టీ ముర్ము ఎంపిక ప్రాధాన్యం గ్రహించగల వనీ, ఓటు వేస్తాయనీ అనుకోవడం భ్రమ.

ద్రౌపది ముర్ము ఎన్నిక విషయంలో బీజేపీ జాగ్రత్తగానే అడుగులు వేసింది. ఆంధప్రదేశ్‌లో వైకాపాను, ఒడిశాలో బిజూ జనతాదళ్‌ను ముందుగానే సంప్రతించింది. ఆ రెండు పార్టీలు వెంటనే ఆమోదం తెలిపాయి. పైగా ముర్ము ఒడిశావారు కాబట్టి నవీన్‌ ‌పట్నాయక్‌ ‌తక్షణం మద్దతు ప్రకటించారు. జార్ఖండ్‌కు చెందిన జేఎంఎం (జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా) వంటి పార్టీలు కాంగ్రెస్‌, ఆర్‌జేడీ మద్దతుతో అధికారంలో ఉన్నా ముర్ముకు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. దేశంలో తొలిసారి ఒక గిరిజన మహిళను అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేస్తే అందులో తాము భాగస్వాములం కాకపోవడం అసంబద్ధమని జేఎంఎం భావించింది. మోదీ మీద వ్యతిరేకతతో ఇలాంటి ఒక గొప్ప చారిత్రక నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్న ఇంగిత జ్ఞానం కాంగ్రెస్‌, ‌మమత, కేసీఆర్‌, ‌కమ్యూనిస్టులు కోల్పోయారు. కానీ చివరి నిమిషంలో అయినా బీజేపీ వ్యతిరేక పార్టీలు కొన్ని, కొందరు సభ్యులు ముర్ముకు మద్దతు ప్రకటించి పరిణతిని ప్రదర్శించారు.

నిజానికి ఎన్డీఏ ప్రతిపాదించిన ముర్మును ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా చేసినట్లయితే 1977లో నీలం సంజీవరెడ్డి తరవాత ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత ముర్ముకు దక్కేది. అలాంటి మంచి అవకాశాన్ని విపక్షాలు జారవిడుచు కున్నాయి. ఏ కోణంలో చూసినా ద్రౌపదీ అభ్యర్థి త్వాన్ని వ్యతిరేకించాల్సినంత అవసరం ఏ పార్టీకీ లేదు. ఆమె ఒక మహిళ, అందునా గిరిజన నారి. ఒడిశాకు చెందిన వెనుకబడిన మహిళ. వివాదర హితురాలు. విద్యావంతురాలు. నిరాడంబర జీవనం గడుపుతున్నవారు. నిగర్వి. ఆమె రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అభిమానించాల్సిన మహిళ. ఏ కోణంలో చూసినా వంక పెట్టాల్సిన అవసరం కనపడదు.

ముర్మును ఎంపిక చేసినందుకు భాజపాను అభినందించాలి. కానీ ఆపాటి పరిణతి విపక్షాలకు కొరవడింది. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది ప్రాథమిక లక్షణం. దానిని కాదనలేం. ఓడిపోతామని తెలిసినా పోటీ చేయడంలో తప్పులేదు. పోటీ అన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అదే సమయంలో వాస్తవాలను గమనించకుండా గుడ్డిగా వ్యతిరేకించడం కూడా సమంజసం అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో పోటీ ఎంత ముఖ్యమో, మంచి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కూడా అంతే ముఖ్యమన్న సంగతిని మరవరాదు. ఒక్క 1969లో తప్ప మిగిలిన ఎన్నికల్లో విజేత ఎవరన్నది ముందే తెలిసిపోయింది. అప్పట్లో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని కాదని నాటి ప్రధాని ఇందిరాగాంధీ వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. చివరికి గిరి గెలిచారు. అది మినహా మిగిలినవన్నీ ఏకపక్ష ఎన్నికలే. ఈ విషయం తెలిసీ విపక్షాలు సిన్హాను బరిలోకి దించి అభాసు పాలయ్యాయి. అప్రతిష్టను మూటగట్టుకున్నాయి. వాటి బలహీనతను అవే పరోక్షంగా చాటుకున్నాయి. ఇది కాదనలేని సత్యం.

ఇక ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎంపికలోనూ విపక్షాలు వివేచనను ప్రదర్శించలేకపోయాయి. ప్రభుత్వానికి సహకరించడాన్ని పక్కనపెడితే కనీసం అవి ఒక్కతాటిపై నిలబడలేకపోయాయి. రాష్ట్రపతి ఎన్నిక దగ్గర స్వైరవిహారం చేసిన మమతా బెనర్జీ ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గర కాడి దించేశారు. అసలు ఓటే వేయడం లేదని ప్రకటించారు. అభ్యర్థి ఎంపిక విషయంలో తమను ఆలస్యంగా పరిగణనలోనికి తీసుకున్నారని మమతా బెనర్జీ అర్థం పర్థం లేని విమర్శలకు దిగారు. ఎన్డీఏ ప్రతిపాదించిన జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌కు మద్దతిచ్చే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. నిన్నమొన్నటి వరకు బెంగాల్‌ ‌గవర్నర్‌గా వ్యవహరించిన ధన్‌ఖడ్‌తో మమతా బెనర్జీ ఉప్పూ నిప్పుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అంతిమంగా విపక్షాలన్నీ ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన వ్యవహరించాయి. తద్వారా తమలోని లోపాలను, అనైక్యతను బయట పెట్టుకున్నాయి.

విపక్షాలు తమ అభ్యర్థిగా కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు మార్గరెట్‌ ఆల్వా పేరును ప్రతిపాదించాయి. ఆల్వా గతంలో రాజ్యసభ సభ్యురాలుగా, కేంద్రమంత్రిగా, గవర్నరుగా పనిచేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరిస్తు న్నట్లు టీఎంసీ చేసిన ప్రకటన వెనక వేరే కారణం ఉంది. మమత సహా అన్ని విపక్షాలు ఒక్కటైనంత మాత్రాన అవి ధన్‌ఖడ్‌ ‌విజయాన్ని నిలువరించలేవు. రాష్ట్రపతి ఎన్నిక మాదిరిగా కాకుండా ఉప రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో బీజేపీ మెజార్టీ స్పష్టం. విపక్షాల అభ్యర్థి ఓటమి ముందే రాసి పెట్టి ఉంది. ఈ విషయం గమనించే టీఎంసీ దూరంగా ఉంది. అందువల్లే విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వా నామినేషన్‌ ‌కార్యక్రమాన్ని మమత పార్టీ బహిష్కరించింది. కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్‌ ‌పక్షం నేతలు అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధరి, మల్లికార్జున ఖర్గె, సంజయ్‌ ‌రౌత్‌ (‌శివసేన), రామ్‌ ‌గోపాల్‌ ‌యాదవ్‌ (ఎస్పీ), తిరుచ్చి శివ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), వైగో (ఎండీఎంకే) తదితర నేతలు మాత్రమే పాల్గొన్నారు. టీఎంసీ, ఆప్‌ ‌పార్టీల నేతలు పాల్గొన లేదు. ఆల్వా అభ్యర్థిత్వంపై టీఎంసీ అభ్యంతరం పెట్టడంలో అర్థం లేదు. ఆమె అనుభవం గల నాయకురాలు. ఉన్నత విద్యావంతు రాలు. అభ్యర్థి ఎంపికలో తనను విస్మరించారంటూ టీఎంసీ వాదించడంలో పసలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో మాదిరిగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో చొరవ చూపుతానంటే మమతను కాదనే వారు ఎవరూ లేరు. ఆమెను కాదని హడావిడి చేసేంత ఆసక్తి గల నాయకులు కూడా విపక్ష శిబిరంలో లేరు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ‌నానా కష్టాల్లో ఉంది. మహారాష్ట్రలో ఎంవీయే సంకీర్ణ సర్కారు పతనంతో శరద్‌ ‌పవార్‌ అచేతనంగా ఉన్నారు. ఇంతకు మించి పెద్ద పార్టీలు గానీ, చురుకైన నాయకులు గానీ విపక్షంలో లేరు. అలాంటప్పుడు మమత చొరవ తీసుకుంటే అభ్యంతర పెట్టేవారు లేరు. కేవలం తాను వ్యతిరేకించిన జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌దేశంలో రెండో అత్యున్నత పదవిని చేపట్టడం ఖాయమని తేలిన క్షణం నుంచి ఆమెకు ఏమీ పాలుపోవడం లేదు. అంతకుమించి మరో కారణం లేదన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. మొత్తానికి దేశ అత్యున్నత పదవులకు అభ్యర్థుల ఎంపికలో, ఎన్నికలో విపక్షాల డొల్లతనం, వైఫల్యం, అనైక్యత, అవగాహనా రాహిత్యం స్పష్టంగా కనపడింది.

ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీని విపక్షాలు ఎలా డీకొనగలవన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజం. రేపటి పార్లమెంటు ఎన్నికల్లో సైతం నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయన్స్ ‌ప్రభుత్వం మళ్లీ అధికార పీఠాన్ని అధిష్టించ గలదన్న ఆత్మ విశ్వాసం ఆ కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో ఊపు మీదున్న ఎన్డీఏ కూటమి రేపటి ఎన్నికల్లో శరవేగంగా దూసుకు పోయేందుకు సమాయత్తమవుతోంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE