వైకాపా ప్రభుత్వం దేవాలయాల ఆస్తులపై కన్నేసింది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్‌లుగా వేసిన ఆలయాల ఆదాయాన్ని  విత్‌ ‌డ్రా చేయడం ప్రారంభించింది. ఆలయ ఇఓలు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి శ్రీ వినాయక స్వామి వారి ఆలయంలో రూ.30 లక్షలు, నెల్లూరు మూల స్ధానేశ్వరస్వామి ఆలయం నుంచి రూ.30 లక్షలు, సింగరాయపాలెం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి రూ.20 లక్షలు, యనమలకుదురు రామలింగేశ్వరస్వామి వారి ఆలయం నుంచి రూ.30 లక్షలు, వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి రూ.60 లక్షలు, కోటి లింగాల క్షేత్రం నుంచి రూ.40 లక్షలు విత్‌‌డ్రా చేసి ప్రభుత్వానికి చెందిన కామన్‌ ‌గుడ్‌ ‌ఫండ్‌ ‌ఖాతాలో జమచేశారు. మొత్తం రూ.300 కోట్లకు మించి నిధులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తనకు లేని హక్కులతో ప్రభుత్వం ఏ రకంగా ఈ నిధులను తన ఖాతాలోకి  జమచేసుకుంటుందని హిందూ పరిరక్షణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. దేవాలయాలకు ఏనాడూ రూపాయి ఇవ్వని ప్రభుత్వాలకు ఆలయాల ఆస్తులను తీసుకునే హక్కులేదని మండిపడుతున్నాయి. దేవాలయాల భూములు కబ్జాకు గురౌతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు డబ్బును కూడా దోచేయడానికి పన్నిన పన్నాగంగా అగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొందరు ఆర్థిక నిపుణులైతే ఆర్థికంగా దివాళా తీసిన ప్రభుత్వం చిట్టచివరకు దేవుడి డబ్బును కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. 

హిందువులు ఆలయాలను సందర్శించి నపుడు హుండీల్లో కానుకలు వేస్తారు. కొందరు దాతలు పెద్ద ఎత్తున డబ్బు, భూములు స్వామివారికి కానుకగా సమర్పిస్తారు. ఈ నిధుల్లో కొంత ఆలయ నిర్వహణకు వాడుతూ, మిగిలిన సొమ్మును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్లు చేసి వచ్చే వడ్డీతో ఆలయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రాష్ట్రం మొత్తంమీద 1500 వరకు వివిధ స్ధాయిల్లో ఆదాయాలు కలిగిన ఆలయాలున్నాయి. ఈ ఆలయాలు బ్యాంకుల్లో దాచిన నిధుల నుంచి సుమారు రూ.500 కోట్ల వరకు  తీసుకుని వాడుకునేందుకు ప్రభుత్వం జీవోలు జారీచేసింది. దేవాలయ ఖర్చులు పోను రూ.2 లక్షల ఆదాయం మిగిలిన ఆలయాలు 21.5 శాతం ప్రభుత్వానికి జమచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కామన్‌ ‌గుడ్‌ ‌ఫండ్‌కు 9 శాతం, అడ్మినిస్ట్రేషన్‌కు 8 శాతం, అర్చకుల సంక్షేమ నిధికి 3 శాతం, ఆడిట్‌ ‌ఖర్చులకు 1.5 శాతం మొత్తం కలిపి 21.5 శాతం అవుతుంది. అర్చకుల సంక్షేమ నిధికి జమచేయడాన్ని హిందూ సంస్థలు తప్పుపట్టడం లేదు. కాని కామన్‌గుడ్‌ ‌ఫండ్‌కు, అడ్మినిస్ట్రేషన్‌ ‌విభాగానికి జమచేయడాన్నే హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక దేవాదాయ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కొందరు ఈఓలు కొన్ని దేవాలయాల్లో ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్లను రద్దుచేసి ఈ నిధులను కామన్‌ ‌గుడ్‌ఫండ్‌కు బదిలీ చేశారు. ఇదే ఇప్పుడు హిందువుల ఆగ్రహానికి కారణమైంది.

పథక రచన

కామన్‌ ‌గుడ్‌ ‌ఫండ్‌లోకి (సీజిఎఫ్‌) ‌జమచేసిన మొత్తాన్ని తమ చిత్తం వచ్చినట్లు ఖర్చు చేసుకునేందుకు పథక రచన జరిగినట్లు హిందూ సంస్థలు ఆరోపిస్తు న్నాయి. సీజీఎఫ్‌ను 40 లక్షలకు మించి వసూలు చేయరాదనే నిబంధన ఉన్నా దానిని మార్చేసుకున్నారు. అప్పటి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ శాఖ నుంచి రూ.40 కోట్లు డ్రా చేసి తన నియోజకవర్గంలో ఖర్చుచేసినట్లు ఆరోపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానంలో మొదట రూ.5 కోట్లు కామన్‌ ‌గుడ్‌ ‌ఫండ్‌కు బదిలీ చేయగా, దానిని రూ.50 కోట్లకు పెంచారు. ఇది రానురాను ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రభుత్వం దేవాలయాలకేం ఇచ్చింది?

ఈ ప్రభుత్వం దేవాలయాల నుంచి తీసుకునే ముందు అసలు దేవాలయాలకు ఏం ఇచ్చారనేది ఆలోచించాలి. మొదటి నుంచి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వా లేవీ దేవాదాయ శాఖకు నిధులు ఇవ్వడం లేదు. ఆలయాల నిర్వహణ పేరుతో ఏర్పడిన దేవాదాయ శాఖ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని వాటిని ఉద్ధ్దరించడానికన్నా దుర్వినియోగానికే ఎక్కువగా పాల్పడిందని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు దేవాలయ కమిటీల పేరుతో రాకీయ నిరుద్యోగులకు పదవులివ్వడంతో అనర్హులు సైతం ఆలయాలపై పెత్తనాన్ని చేస్తున్నారు. వీరంతా పదవుల పేరుతో దేవాలయ ఆస్తులను దిగమింగడం మినహా ఏనాడూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆలయాలకు తీసుకు రాలేదు. ఆలయాల అభివృద్ధిపై అసలు దృష్టి కేంద్రీకరించ లేదు. దేవాలయం కేంద్రంగా భక్తుల నుంచి దర్శన టికెట్లు, సర్వీసులకు ప్రత్యేక టిక్కెట్లు వసూలు చేస్తు న్నారు. నేరచరిత ఉన్నవారు, దేవుడంటే విశ్వాసం లేని వారు కూడా దేవాలయ కమిటీ సభ్యులు, ఛైర్మన్‌లుగా పదవులు అనుభవిస్తున్నారు. ఈ అంశాన్ని కోర్టు కూడా తప్పుపట్టింది.

ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది?

పూర్వం ఆలయాలకు ప్రభువులు కొంత నిధులిచ్చి వాటి జోలికి మాత్రం వెళ్లేవారు కాదు. అంతేకాదు దాతలు ఇచ్చిన భూములు, నిధులు అన్నీ కూడా ఆలయాలకే చెందుతాయి. అందుకే దేవుడి మాన్యం అంటారు. వాటిపై ప్రభుత్వానికి ఏ విధమైన హక్కులు లేవు.

కరవుతో ఆర్థిక•పరమైన ఇబ్బందులు ఏర్పడి ప్రజలు తిండిలేక అల్లాడి పోతుంటే అప్పుడు కూడా ప్రభుత్వం దివాళ తీసినట్లు ప్రకటించి దేవాలయ సొమ్మును వాడుకునేవారు. ఏపీ ప్రభుత్వం మాత్రం దమ్మిడి ఇవ్వకపోగా దేవాలయ సొమ్మును వాడేయాలని చూస్తోందని పరిపూర్ణానంద స్వామి ఆరోపిస్తున్నారు. ‘ఆలయాల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రభుత్వానికి చర్చిలు, మసీదు నుంచి డబ్బును తీసుకునే దమ్ముందా?’ అని అభిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌జీవిఆర్‌ ‌శాస్త్రి సవాల్‌ ‌విసిరారు. ఆలయాల డబ్బును వాడుకునే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు. దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తామని కూడా హెచ్చరిస్తున్నారు. కామన్‌ ‌గుడ్‌ ‌ఫండ్‌ అనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి లోబడి ఉంటుందని, కానీ ఇందులో జమ అయిన దేవాలయాల నిధులను అన్యమతస్థులకు పంచి, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాలన సాగుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బహిరంగ లేఖ ద్వారా విమర్శించారు. దేవాలయాల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు బలపడే విధంగా ప్రభుత్వ ఆదేశాలు కనపడుతున్నాయని, అందువల్ల దేవాలయాల అస్తుల విషయంలో ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

హిందూ వ్యతిరేక విధానాలు

వైకాపా ప్రభుత్వం ఆది నుంచి హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. అన్యమతాలను ప్రోత్సహిస్తూ, హిందూ మతాన్ని అవమానిస్తోంది. దేవాయాల అభివృద్ధి మాట అటుంచి వాటి పరిరక్షణ చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు.

దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, విగ్రహాలు ధ్వంసం చేస్తోన్నా, ధర్మ పరిరక్షణకు హాని జరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిధుల నుంచి చర్చిల నిర్మాణానికి నిధులు కేటాయిస్తోంది. చర్చి ఫాస్టర్లు, ముల్లాలకు జీతాలిస్తోంది. తన ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉన్నవి లేనివి అప్పులు చేసి వచ్చిన డబ్బును పంచేస్తుంది. ఇప్పుడవి చాలక దేవాలయాలకు భక్తులు వేసిన కానుకల సొమ్ముపై ప్రభుత్వం కన్ను పడింది. దీనిపై హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram