ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం

ప్రతి మనిషికీ ఆహారం, నివాసంతో పాటు వస్త్రం కూడా కూడా అత్యవసరం. మన దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి అవకాశాలు చేనేత రంగంలోనే ఉన్నాయి. కానీ మరమగ్గాల ధాటికి చేనేత మగ్గాలు కుదేలైపోయాయి. ఈ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి రోజు రోజుకీ దుర్భరంగా మారుతోంది. చేనేత రంగాన్ని, నేతన్నలను ఆదుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 2015 నుంచి ఏటా ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సంగా జరుపుకుంటున్నారు. చేనేతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది.


భారతీయ వస్త్ర పరిశ్రమ ఎంతో ప్రాచీన మైనది. చేనేత రంగం వారసత్వంగా వస్తోంది. భారతదేశ వస్త్ర సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శమైంది. మనకు అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం, హరప్పా నాగరికతలో ప్రజలు నూలుతో తయారు చేసిన వస్త్రాలను ధరించిన ఆనవాళ్లను చూడవచ్చు. వేద సాహిత్యంలో కూడా ఈ ప్రస్తావన కనిపిస్తుంది. ఈజిప్టులోని పుస్టాట్‌ ‌సమాధుల్లో గుజరాత్‌ ‌నుంచి దిగుమతి అయిన పత్తి ఆనవాళ్లు కనిపిస్తాయి. భారతదేశ పత్తి, పట్టు వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉం‌డేది. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసే నైపుణ్యం భారతీయ నేతన్నలకు ఉండేది.

అప్పట్లో భారతీయ వస్త్రాలు సిల్క్ ‌రూట్‌ ‌ద్వారా పశ్చిమ దేశాలకు రవాణా అయ్యాయి. సముద్ర మార్గంలో కూడా అనేక దేశాలకు మన దేశం నుంచి నాణ్యమైన వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. ఈ పరిశ్రమ ఆధారంగానే భారత్‌ ‌సుసంపన్నంగా ఉండేది. పాశ్చాత్యులు మన దేశాన్ని బంగారు పిచ్చుక (సోనేకి చిడియా)గా అభివర్ణించారు. 17,18 శతాబ్దాల నాటికి ప్రపంచ వస్త్ర వ్యాపారంలో 25 శాతం వాటా భారత్‌దే. మొఘలుల కాలంలో బ్రిటన్‌కు ఈస్టిండియా కంపెనీతో పాటు ఫ్రెంచ్‌, ‌పోర్చుగీస్‌, ‌డచ్‌ ‌కంపెనీలు మన దేశం నుంచి 85 శాతం మేర యూరోప్‌కు వస్త్ర వ్యాపారం సాగించారు.

స్వాతంత్య్ర సమరంలో పాత్ర

భారతదేశం నుంచి వచ్చే నాణ్యమైన పత్తితో యూరోప్‌ ‌దేశాల్లోని పరిశ్రమలు బానిసల ద్వారా చౌకగా వస్త్రాలను తయారుచేసేవి. బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంలో బానిసత్వాన్ని రద్దు చేసిన తర్వాత అక్కడి పరిశ్రమలకు కష్టకాలం వచ్చింది. కారుచౌకగా, పెద్ద మొత్తంలో పత్తి కోసం భారత్‌లో వ్యవసాయరంగాన్ని దెబ్బతీశారు. ఫలితంగా మన దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడింది. అదే సమయంలో బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం కారణంగా యంత్రాల మీద వస్త్రాల తయారీ మొదలైంది.

బ్రిటిష్‌ ‌ప్రభుత్వం మన దేశం నుంచి చౌకగా ముడిసరుకు తీసుకెళ్లి, అక్కడి పరిశ్రమల్లో తయారు చేసిన వస్త్రాలను మన దేశంలో విక్రయించేది. దీనికి పన్నులను మినహాయించారు. అదే సమయంలో దేశీయ వస్త్ర పరిశ్రమలపై పన్నుల భారాన్ని పెంచారు.

బ్రిటిష్‌ ‌ప్రభుత్వ విధానాలతో దేశీయ వస్త్ర పరిశ్రమ కుదేలైపోయింది. దీంతో స్వరాజ్య ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ నినాదం చేరింది. దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులనే ధరించాలనే సందేశం బలంగా వెళ్లింది. 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్‌ ‌హాలులో నిర్వహించిన భారీ సమావేశంలో నేతలంతా విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్ప త్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అదే సమయంలో రాట్నంపై నూలు వడికి తయారు చేసిన వస్త్రాలనే ధరించాలని మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు దేశాన్ని కదిలించింది.

మర మగ్గాలతో చేనేతల కష్టాలు

ప్రపంచానికి వస్త్ర నాగరికతను నేర్పిన భారతీయ చేనేతలకు కష్టాలు కొత్తగా వచ్చినవి కాదు. చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) ‌మింగేశాయి. ఇప్పుడు ఆధునిక మగ్గాలు మింగేస్తున్నాయి. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్టను నేసే నేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది. 2019-20 నాటికి మన దేశంలో 26,73,891 మంది చేనేతలు ఉన్నారు. వీరుకాకుండా మరో 8,48,621 మంది అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. మొత్తం మీద 35,22,512 మంది చేనేత రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత అత్యధికులు చేనేత పరిశ్రమ ద్వారానే ఉపాధిని పొందుతున్నారు.

మన చేనేతల్లో అంకితభావం, పట్టుదల, నైపుణ్యం, దానిని ప్రదర్శించే ఓరిమి ఉన్నాయి. చేనేత కార్మికులు మిల్లులతో పోటీ పడి ఆకర్షణీయ మైన డిజైన్లలో చీరెలు, దుప్పట్లు, కర్టెన్లు తయారు చేస్తున్నారు. విదేశాల్లో మన చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉంది. అంతర్జాతీయంగా, జాతీయంగా జరిగే వస్త్ర ప్రదర్శనల్లో చేనేత వస్త్రాలు ఎన్నో అవార్డులను గెల్చుకున్నాయి. ఇప్పటికీ గెల్చుకుంటున్నాయి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లలేక పోటీ ప్రపంచంలో నేతన్నలు నెగ్గుకు రాలేకపోతున్నారు.

ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్‌ ‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి, విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. 1905లో ఇదే రోజున కలకత్తాలో జరిగిన సభలో స్వదేశీ వస్త్రాలను ధరించాలని పిలుపునివ్వడం తెలిసిందే. 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధాని మోదీ చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో అధికారికంగా ప్రారంభించారు. 2014లో రాజ్‌ఘాట్‌లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్యఅతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీశాఖ మంత్రి సంతోష్‌ ‌కుమార్‌ ‌గంగ్వార్‌ ‌ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం నిర్వహిస్తామని మాటిచ్చారు. ఈ మేరకు 2015 జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్‌ ‌విడుదల చేసింది. చేనేత పరిశ్రమ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించడం జాతీయ చేనేత దినోత్సవ లక్ష్యం.

చేనేతల సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలు

చేనేత కార్మికుల అభివృద్ది సంక్షేమం కోసం కేంద్ర టెక్స్‌టైల్స్ ‌మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషనర్‌ ‌ద్వారా నాలుగు ప్రధాన కార్యక్రమాలను చేపట్టింది. అవి. 1. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (NHDP), 2. సమగ్ర చేనేత క్లస్టర్‌ అభివృద్ధి పథకం (CHCDS), 3. చేనేత నేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం (HWCWS), 4 నూలు సరఫరా పథకం (YSS)

ఈ పథకాల కింద ముడి సరుకులు, మగ్గాలు, ఉపకరణాల కొనుగోలు, డిజైన్‌ ఆవిష్కరణ, ఉత్పత్తుల వైవిధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాల పెంపుదల, లైటింగ్‌ ‌యూనిట్లు, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌, ‌రాయితీ ధరలకు రుణం కోసం ఆర్థిక సహాయం అందిస్తారు.

2015-16లో నేషనల్‌ ‌హ్యాండ్లూమ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌పోగ్రామ్‌ (‌NHDP) ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా బ్లాక్‌ ‌లెవల్‌ ‌క్లస్టర్‌ (‌BLC)లను ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం. స్కిల్‌ అప్‌‌గ్రేడేషన్‌, ‌హత్కర సంవర్ధన్‌ ‌సహాయత (హెచ్‌ఎస్‌ఎస్‌), ‌ప్రొడక్ట్ ‌డెవలప్‌మెంట్‌, ‌వర్క్‌షెడ్‌ ‌నిర్మాణం కార్యక్రమాలను అమలు చేస్తారు.

జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో చేనేత మార్కెటింగ్‌ ‌సహాయం ఒకటి. తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి మార్కెటింగ్‌ ‌ప్లాట్‌ఫారమ్‌ను అందించడానికి, దేశీయ, విదేశీ మార్కెట్‌లలో మార్కెటింగ్‌ ఈవెంట్‌లను నిర్వహించడానికి చేనేత ఏజెన్సీలకు ఆర్థిక సహాయం అందిస్తారు.

చేనేత కార్మికులకు 6 శాతం రాయితీ వడ్డీ రేటుతో వీవర్స్ ‌ముద్ర పథకం కింద రుణం అందిస్తారు. మార్జిన్‌ ‌మనీ సహాయం ప్రతి నేతకు గరిష్ఠంగా రూ.10,000 ఉంటుంది. మూడు సంవత్సరాల కాలానికి క్రెడిట్‌ ‌గ్యారెంటీ కూడా అందిస్తారు. మార్జిన్‌ ‌మనీ, వడ్డీ రాయితీ కోసం నిధుల పంపిణీలో జాప్యాన్ని తగ్గించడానికి పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంక్‌తో కలిసి ముద్ర పోర్టల్‌ అభివృద్ధి చేశారు. చేనేత ఉత్పత్తుల ఉత్పాదకత, నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారి ఆదాయాలను పెంచడానికి నేత కార్మికులకు మగ్గాలు, ఉపకరణా లను అందించాలనే లక్ష్యంతో 2016 డిసెంబర్‌ 1‌న హెచ్‌ఎస్‌ఎస్‌ ‌కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద, మగ్గం/ ఉపకరణాల ఖర్చులో 90 శాతం భారత ప్రభుత్వం భరిస్తుంది, మిగిలిన 10 శాతం లబ్ధిదారులు భరించాలి. భారత ప్రభుత్వ వాటాను నేరుగా లబ్ధిదారుని బ్యాంక్‌ ‌ఖాతాలో విడుదల చేస్తారు

చేనేత కార్మికులు, వారి కుటుంబాలకు విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ ‌యూనివర్శిటీ (ఇగ్నో), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ ‌స్కూల్‌ (‌NIOS)తో టెక్స్‌టైల్స్ ‌మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

చేనేత కార్మికుల కోసం దూరవిద్య విధానం ద్వారా డిజైన్‌, ‌మార్కెటింగ్‌, ‌వ్యాపార అభివృద్ధి మొదలైన ప్రత్యేక విషయాలతో సెకండరీ, సీనియర్‌ ‌సెకండరీ స్థాయి విద్యను NIOS అందిస్తోంది..

2015 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘ఇండియా హ్యాండ్లూమ్‌’ ‌బ్రాండ్‌ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. అత్యధిక నాణ్యత ఉన్న చేనేత ఉత్పత్తుల బ్రాండింగ్‌ ‌కోసం దీన్ని ప్రారంభించారు. ఇది పర్యావరణహిత, ప్రామాణిక, సాంప్రదాయ డిజైన్లతో చేనేత ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

మిల్‌ ‌గేట్‌ ‌ధరలో అన్ని రకాల నూలును అందుబాటులో ఉంచేందుకు దేశవ్యాప్తంగా నూలు సరఫరా పథకం ప్రారంభించారు. నేషనల్‌ ‌హ్యాండ్లూమ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం కోసం వీవర్స్ ‌కాంప్రహెన్సివ్‌ ‌వెల్ఫేర్‌ ‌స్కీమ్‌ (HWCWS), ‌ప్రధాన మంత్రి జీవన్‌ ‌జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), కన్వర్జడ్ ‌మహాత్మా గాంధీ బంకర్‌ ‌బీమా యోజన (MGBY) అమలు చేస్తున్నారు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram