–  ఏనుగుల రాకేష్‌ ‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ

తెలంగాణలో కేసీఆర్‌ ‌పాలన ‘ఎన్నికల నుండి ఎన్నికల’ వరకు అన్నట్టుగా సాగుతోంది తప్ప ప్రజాసంక్షేమం, అభివృద్ధి అన్న అంశాలు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పట్టవు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే.. వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు, వ్యూహాలు, వనరులు సిద్ధం చెయ్యడంపైనే వారి దృష్టి ఉంటుంది. కేసీఆర్‌ ఏ ‌పనిచేసినా పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజలకు మేలు చెయ్యాలని కాదు. ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం కట్టబెడితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకోవడం ఎందుకు? ప్రజాగ్రహం ఎక్కువ కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి సెంటిమెంట్‌ ‌రగిలించి రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారు.

2014 ఎన్నికల్లో ప్రజలు ఐదేళ్లు (2019 దాకా) పాలించమని అవకాశమిచ్చారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికలతో వెళ్తే నరేంద్రమోదీ, బీజేపీ ప్రభంజనంలో తాము కొట్టుకుపోవడం ఖాయం అని భావించి మధ్యలోనే కాడెత్తేసి 2018లో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌చంద్రబాబుల అనైతిక పొత్తును అడ్డుపెట్టుకొని, ఆంధ్ర-తెలంగాణ సెంటిమెంట్‌ ‌రగిలించి రాజకీయ లబ్ధి పొందారు. మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌చంద్రబాబు కూటమిని ఓడించడం కోసం ప్రజలు తెరాస వైపు నిలబడ్డారు. బీజేపీపై ప్రేమ ఉన్నప్పటికి అప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఆ కూటమిని ఓడించే పార్టీగా తెరాసను చూశారు. ఆ తర్వాత కేసీఆర్‌ ఊహించినట్టే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం చూశాం. బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. మహబూబ్‌నగర్‌లో స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజల్లో కేసీఆర్‌ ‌పట్ల, తెరాస పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు పుంజుకుంటోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పరిణామాలు కేసీఆర్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. పాలన గాడిలో పెట్టడం చేతకాక ‘ముందస్తు’ అంటూ, ‘జాతీయ పార్టీ’ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆరే స్వయంగా ప్రెస్‌మీట్‌ ‌పెట్టి ముందస్తుకు సిద్ధం అన్నారు. కానీ ఆయన అసెంబ్లీ రద్దు చెయ్యరట! ‘ఎన్నికల తేదీలు ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తా. దమ్ముంటే రండి’ అంటున్నారు. అంటే ఆయన సవాల్‌ ఎన్నికల కమిషన్‌తోనా? అసెంబ్లీ రద్దు చెయ్యకుండానే ఎన్నికల తేదీలు ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌కే సవాలు విసురుతున్న కేసీఆర్‌కు ఓటమి భయంతో మతి భ్రమించినట్టుంది. మీరు అసెంబ్లీ రద్దుచేస్తే ఎన్నికల గురించి ఎన్నికల కమిషన్‌ ఆలోచిస్తుంది. అంతేకాని ముందుగానే ఎందుకు తేదీలు ప్రకటిస్తుంది? ఇదంతా రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించి తన మీద ఏదో కుట్ర జరుగుతోందని, అన్యాయం చేస్తున్నారని ముందస్తు ఎన్నికలకు వెళ్లి సానుభూతితో గెలవాలన్న తపన మాత్రమే.

ఇవన్నీ కేసీఆర్‌ ‌మార్క్ ‌డైవర్షన్‌ ‌పాలిటిక్స్‌లో భాగం. అసలు విషయం ఏమంటే రాష్టంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. పాలన కుంటుపట్టింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్త పింఛన్లు రాక గ్రామాల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు నెలల తరబడి జీతాలు రాకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ల పంపిణీ నిలిచిపోయింది. పంటలు వేయాల్సిన పోడు రైతుల భూములు పోలీసులతో కొట్లాటలతో యుద్ధ క్షేత్రాలుగా మారి పోయాయి. విద్యారంగ అభివృద్ధి నిలిచిపోయింది. ఇన్ని సమస్యలతో రాష్టం అల్లకల్లోలం అవుతుంటే కేసీఆర్‌ ‌పాలనను గాడిలో పెట్టడం చేతకాక ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

‘పార్లమెంట్‌ను రద్దుచేసి ఎన్నికలకు రండి’ అంటూ బీజేపీకి సవాలు విసురుతున్న టీఆర్‌ఎస్‌ ‌పార్టీ మంత్రులకు ఏమైనా సోయి ఉందా? బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు రావాలా? లోక్‌సభలో 303 స్థానాలు ఉన్న బీజేపీని.. 17 స్థానాల్లో కేవలం 8 సీట్లు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సవాల్‌ ‌చేయడం ఎంత వరకు సబబు? అయినా ఏనుగు(బీజేపీ)లతో, ఎలుకల(టీఆర్‌ఎస్‌)‌కు పోటీ ఏమిటి?

బీజేపీ సవాల్‌ ‌చేస్తోంది. దమ్ముంటే కేసీఆర్‌ అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు రావాలి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కేసీఆర్‌కు దుబ్బాక, హుజురాబాద్‌లో పట్టిన గతే రాష్ట్రమంతా పడుతుంది. ఇక కేసీఆర్‌ ఇం‌టికే పరిమితం కావడం ఖాయం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram