కాళేశ్వరం.. అదో ఆధ్యాత్మిక కేంద్రం.. పరమశివుడు, యముడు కొలువైన క్షేత్రం. త్రివేణీ సంగమం, గోదావరి పరవళ్లతో అలరారే ప్రదేశం. వీటికితోడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేసిన ప్రయోగంతో ఇప్పుడు కాళేశ్వరం అంటే కళ్లముందు మెదిలేది, గుర్తుకొచ్చేది భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు ఇది. లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి దీనిని నిర్మించారు. జూన్‌ 21, 2019‌న ప్రారంభించిన ఈ ప్రాజెక్టు మూడేళ్లు పూర్తయ్యేసరికి ఘోరమైన షాకిచ్చింది. మొన్న గోదావరి నదికి వచ్చిన వరదల్లో ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పంప్‌హౌస్‌లు మునిగిపోయాయి. వందల కోట్ల రూపాయల విలువైన బాహుబలి మోటార్లు సహా.. భారీ యంత్ర సామగ్రి వరద పాలైంది.

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద 17 భారీ మోటార్లు గల కన్నెపల్లి పంప్‌హౌస్‌, ‌రోజుకు 2 టీఎంసీల నీటిని బయటకు పంపే సామర్థ్యం ఉన్న ఏడు భారీ మోటార్లు గల అన్నారం పంప్‌హౌస్‌లు నీట ముని గాయి. రెండు పంపుహౌజుల్లో కలిపి 29 బాహుబలి మోటార్లు, వాటిని ఆపరేట్‌ ‌చేయాల్సిన ఎలక్ట్రో మెకానికల్‌ ఎక్విప్‌మెంట్స్, ‌కంట్రోల్‌ ‌ప్యానళ్లు, కంప్యూటర్లు, రెండు భారీ ఎయిర్‌ ‌కండిషన్‌ ‌సిస్టమ్‌లు, రెండు స్కాడా సిస్టమ్‌లు, సబ్‌ ‌స్టేషన్లు.. ఇలా అన్నీ వరదలో కనిపించకుండా పోయాయి. దీంతో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇందుకు డిజైన్‌, ‌మెయింటనెన్స్ ‌లోపాలే ప్రధాన కారణమని రిటైర్డ్ ఇం‌జనీర్లు అంటున్నారు. పరిస్థితిని ముందే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఇన్ని కోట్ల ప్రజాధనం వరద పాలైందని చెప్తున్నారు.

రూ. వందల కోట్ల నష్టం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది మహోగ్రంగా ప్రవహిస్తుండటంతో ఎస్సారెస్పీ నుంచి మొదలుపెట్టి అన్నారం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. దీంతో అన్నారం పంపుహౌస్‌ను వరద చుట్టుముట్టింది. గోదావరి నిండుగా ప్రవహిస్తుండ టంతో జల్లారం వాగు నీళ్లు ఎగతన్నాయి. అవి వెళ్ల డానికి మార్గం లేకపోవడంతో అన్నారం పంపు హౌస్‌ ‌వైపు పరుగులుపెట్టాయి. నిరుడు ఈ పంపు హౌస్‌లోకి ఇదే వాగు నుంచి నీళ్లు చేరడంతో పంపుహౌస్‌ ‌చుట్టూ 129 మీటర్ల ఎత్తయిన ప్రొటెక్షన్‌ ‌వాల్‌ (‌రక్షణ గోడ) నిర్మించారు. అయితే, ఆ మట్టికట్ట తెగి పంపుహౌస్‌ ‌నీట మునిగింది. దీంతో పాటు సబ్‌స్టేషన్‌ ‌కూడా మునిగిపోయింది. అలాగే, కన్నెపల్లి పంపుహౌజ్‌లోని బ్రెస్ట్ ‌వాల్‌ ‌కూడా కొట్టుకుపోయింది. మేడిగడ్డ బ్యారేజీకి ఒక్కసారిగా 17 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడం, హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌గేట్ల నిర్వహణ, బ్రెస్ట్ ‌వాల్‌ ‌మెయింటనెన్స్ ‌లోపాలతో ఆ వాల్‌ ‌కొట్టుకుపో యినట్లు తెలుస్తోంది. రూ. 180 కోట్లతో నిర్మించిన సబ్‌ ‌స్టేషన్‌ ‌కూడా వరద నీటిలో మునిగిపోయింది. కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటార్లతో పాటు రూ.50 కోట్ల విలువైన స్కాడా సిస్టమ్‌, ‌కంట్రోల్‌ ‌ప్యానళ్లు, రూ.150 కోట్లతో ఏర్పాటుచేసిన ఆటోమేటెడ్‌ అడ్వా న్స్‌డ్‌ ఎయిర్‌ ‌కండీషన్‌ ‌సిస్టం తదితర పరికరాలు కూడా గోదావరి వరదలో మునిగిపోయాయి.

జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ ‌మండలంలోని కన్నెపల్లి వద్ద కన్నెపల్లి పంపుహౌస్‌ను 2 వేల 827 కోట్ల రూపాయలతో నిర్మించారు. 40 మెగావాట్ల కెపాసిటీ గల 11 మోటార్లతో 2 టీఎం సీలు ఎత్తిపోసేలా పనులు చేశారు. మోటార్ల కోసమే రూ. 440 కోట్లకు పైగా ఖర్చుచేశారు. అదనపు టీఎంసీ కోసం ఇంకో రూ. 240 కోట్లు వెచ్చించి మరో ఆరు మోటార్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ పంపుహౌస్‌లో 17 మోటార్లు ఉన్నాయి. కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోసేందుకు పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం కాశీపేట వద్ద రూ.2 వేల కోట్లతో అన్నారం పంపుహౌస్‌ ‌నిర్మించారు. ఇక్కడ రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు రూ.400 కోట్లతో ఎని మిది మోటార్లు బిగించారు. అదనపు టీఎంసీ కోసం ఇంకో రూ.200 కోట్లు ఖర్చు చేసి మరో నాలుగు మోటార్లు ఏర్పాటుచేశారు. ఈ పంపుహౌస్‌లో మొత్తం 40 మెగావాట్ల కెపాసిటీ గల 12 మోటార్లు ఉన్నాయి.

కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌లకు ప్రమాదం పొంచి ఉందని డిజైనింగ్‌ ‌విభాగం నిపుణులు పలు మార్లు హెచ్చరించారు. ప్రాజెక్టు ఫీల్డ్ ‌విజిట్‌ ‌చేసి నప్పుడు కన్నెపల్లి పంపుహౌస్‌ ‌ప్రొటెక్షన్‌ ‌వాల్‌ ‌పరిస్థితి, హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌గేట్లలో లీకేజీలపై అప్రమత్తం చేశారు. వారి హెచ్చరికలను పంపుహౌస్‌ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కంపెనీ పెడచెవిన పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అన్నారం పంపుహౌస్‌ను గోదావరి నది ప్రవహించే లెవల్‌ ‌కన్నా దిగువన నిర్మించడంపై డిజైనింగ్‌ ‌నిపుణులు పలు సందేహాలు వ్యక్తంచేశారు. నిరుడు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే జల్లారం వాగు నీళ్లు ఎగతన్ని పంపు హౌస్‌లోకి చేరాయి. మళ్లీ ఆ పరిస్థితి రాకుండా 129 మీటర్ల లెవల్‌లో మట్టికట్ట కట్టినా దానికి రివిట్‌మెంట్‌ ‌చేయకపోవడంతో అది తెగి ఇప్పుడు పంపుహౌస్‌ ‌మునిగిపోయింది. ఈ డిజైన్‌పై అప్పట్లో వచ్చిన సందేహాలను పరిగణనలోకి తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు.

ఆది నుంచే లోపాలు..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచే ఒక్కొక్కటిగా లోపాలు బయట పడుతున్నాయి. ప్రాజెక్టు ప్రారం భించిన రెండు నెలలకే, 2019 ఆగస్టులో లక్ష్మీపూర్‌ ‌పంప్‌హౌస్‌ ‌ప్రొటెక్షన్‌ ‌వాల్‌ ‌దెబ్బతిని నీళ్లు లీకయ్యాయి. అదే ఏడాది సెప్టెంబర్‌ 3‌న కన్నెపల్లి పంప్‌హౌస్‌ ‌ప్రొటెక్షన్‌ ‌వాల్‌ ‌దెబ్బతిని మోటార్లపైకి నీళ్లు చేరాయి. మూడో టీఎంసీ పనులు చేస్తున్న సమయంలోనూ ప్రొటెక్షన్‌ ‌వాల్‌ ‌దెబ్బతింది. 2019 అక్టోబర్‌ 9‌న అన్నారం బ్యారేజీ గేట్లలో లీకేజీలు ఏర్పడ్డాయి.

2020 జూన్‌ 6‌న భారీ వర్షాలకు కొండపోచమ్మ పంపుహౌస్‌ ‌కట్ట దెబ్బతింది. జూన్‌ 13‌న మల్లన్న సాగర్‌ ‌గ్రావిటీ కాల్వకు గండిపడి ఎర్రవల్లి గ్రామం లోని పంట భూములు నీటమునిగాయి. యాదాద్రి జిల్లాకు నీళ్లు తరలించే గ్రావిటీ కెనాల్‌ ‌కూడా జూన్‌ 30‌న తెగింది. అదే ఏడాది జూలై 7న రంగనాయక సాగర్‌ ‌డెలివరీ సిస్టర్న్ ‌వద్ద రివిట్‌మెంట్‌ ‌దెబ్బతింది. ఆగస్టు 23న కొద్దిపాటి వర్షాలకే కాళేశ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్‌ ‌లైనింగ్‌ ‌కూలింది. కొండపోచమ్మ సాగర్‌లో నిర్మించిన వాకోవర్‌ ‌బ్రిడ్జి అదే ఏడాది ఆగస్టు 30న కూలిపోయింది.

అన్నారం పంపుహౌస్‌ ‌నుంచి నీటిని సరఫరా చేసే పైపులైన్‌ 2021 ‌జూలై 28న భారీ వర్షాలతో భూమిలోంచి పైకితేలింది. ఎస్సారెస్పీకి భారీ వరద ముంచెత్తడంతో సెప్టెంబర్‌ 13‌న నిజామాబాద్‌ ‌జిల్లాలోని పంపుహౌస్‌ ‌మునిగిపోయింది. అదే ఏడాది సెప్టెంబర్‌ 27‌న సుందిళ్ల బ్యారేజీ కట్ట దెబ్బతింది. ఇప్పుడు భారీ వరదలకు కన్నెపల్లి, అన్నారం పంపుహౌజ్‌లు మునిగిపోయాయి.

కేసీఆర్‌ ‌కలల ప్రాజెక్టుగా, మానస పుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ స్థాయిలో దెబ్బ తినడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విప క్షాలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ అవినీతికి బలైపోయిందంటూ మండిపడుతున్నారు. ఇంకో మూడు నాలుగేళ్లు కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తలేని పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు మునిగిపోవడానికి కేసీఆర్‌ అవినీతి, డిజైన్ల లోపం, నిర్లక్ష్యమే కారణమన్నారు. అంతేకాదు. రాష్ట్రవ్యాప్తంగా గోదావరి పరివాహక ప్రాంతం పూర్తిగా మునిగిందని; కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌, ఆదిలాబాద్‌ ‌వరద బాధిత జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో ముంపు ప్రభావం తీవ్రంగా ఉందని, దీనంతటికీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని విపక్షాల నేతలు ఆరోపించారు. రెవెన్యూ, పంచాయతీ, వైద్యశాఖలను ప్రభుత్వం సమన్వయం చేయడంలో విఫలమైందన్నారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘క్లౌడ్‌ ‌బరస్ట్’

‌రాష్ట్రమంతటా వరద పరిస్థితుల గురించి తనపై ముప్పేట దాడి జరుగుతుండటంతో ఆలస్యంగానైనా ఏరియల్‌ ‌వ్యూ (విహంగ వీక్షణం) చేశారు కేసీఆర్‌. ‌భద్రాచలంలో ఏరియల్‌ ‌సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కుండపోత వర్షంపై ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని బాంబు పేల్చారు. విదేశీయులు కావాలనే మనదేశంలో అక్కడక్కడా ‘క్లౌడ్‌ ‌బరస్ట్’ ‌చేస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానిం చారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అలాంటి అనుమానం ఏదైనా ఉంటే, అందుకు సంబంధించి సమాచారం తమ వద్ద ఉంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. లేదా సంబంధిత అధికారులు లేదా శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్‌ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వరద సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్‌ ఇలాంటి ఆరోపణలు చేశారన్నది కాదనలేని నిజం. నిజానికి, వరదల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం సీరియస్‌గా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విపత్తు ముంచుకొస్తోందని హెచ్చ రికలు వచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల కేసీఆర్‌ ‌వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులతో సమీక్ష చేసినా విలేకరుల సమావేశంలో రెండే రెండు ముక్కల్లో ఆ విషయన్ని తేల్చేశారు. ఆ తర్వాత రెండున్నర గంటలు రాజకీయ విమర్శలకు సమయం కేటాయించారు.

గవర్నర్‌ ‌పర్యటనతో.. ఏరియల్‌ ‌వ్యూ

గవర్నర్‌ ‌తమిళి సై వరద పోటెత్తిన భద్రాచలంలో పర్యటించేందుకు కదిలిన తర్వాత గానీ, ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌ముంపు ప్రాంతాలలో పర్యటించే ఆలోచన చేయలేదు. అప్పటిదాకా ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు ఏమాత్రం షెడ్యూల్‌ ‌రూపొందించు కోలేదు. గవర్నర్‌ ‌పర్యటన ఖరారయ్యాకే కేసీఆర్‌ ఏరియల్‌ ‌సర్వేకు సమాయత్తమయ్యారు.

క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టే?

వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం, పది కిలోమీటర్ల లోపు విస్తీర్ణం ఉన్న ప్రాంతంలో ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్‌ ‌బరస్ట్ ‌సంభవించ వచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లు తుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్‌ ‌బరస్ట్ అని చెప్పలేం. ఇది భౌగోళిక, వాతా వరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

రుతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. వెస్ట్రన్‌ ‌డిస్ట ర్బెన్స్ ‌కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్‌, ‌పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి తేమను తోడ్కొని వస్తాయి. ఈ రెండూ ఢీ కొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా తక్కువ సమ యంలో భారీగా వర్షిస్తాయి. పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్‌ ‌బరస్ట్ ‌సంఘటనలు అధికంగా జరుగుతుంటాయి. సాధారణంగా రుతు పవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్‌ ‌బరస్ట్ ‌జరుగుతుంటుంది. ఎక్కువగా మే నుంచి జూలై-ఆగస్ట్ ‌వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE