– తురగా నాగభూషణం

గోదావరి వరదలతో ఆంధప్రదేశ్‌లోని నదీ ప•రీవాహక ప్రాంతంలోని ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా, అంబేద్కర్‌ ‌కోనసీమ జిల్లా, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రాజమండ్రి, కడియం, కొవ్వూరు, నర్సాపురం, రాజోలు, యానాం, నిడదవోలు, ఆచంట, సిద్దాంతం, ముమ్ముడివరం మండలాల్లోని 626 గ్రామాలు నీటమునిగాయి. లక్షలాది మంది నీడ కోల్పో యారు. వేల ఇళ్లు నీట మునిగాయి. 10,757 ఎకరాల్లో పంట నష్టం, భారీగా పశునష్టం జరిగింది. ఆస్తులు కోల్పోయిన బాధితులు వారం రోజులుగా వరద నీటిలోనే కంటిపై కునుకు లేకుండా గడిపారు. కరెంటు, నీరు, ఆహారం లేక లంకలు, ఏజెన్సీ గ్రామాలు అంధకారంలో మగ్గి పోతున్నాయి. ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉండడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు, సహాయపడేందుకు వచ్చిన విపక్షాలకు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇక ఎన్నడూ లేనంతగా గోదావరిలోకి వచ్చిన వరదతో 800 టిఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలసిపోయింది.


వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో పడిన భారీ వర్షాలతో గోదావరి పొంగి దిగువ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా, అంబేద్కర్‌ ‌కోనసీమ జిల్లా, ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఓడిశా, ఆంధప్రదేశ్‌లు (గోదావరి బేసిన్‌) ‌గోదావరి పరీవాహక ప్రాంతాలు. ఈ రాష్ట్రాల్లో పడిన భారీ వర్షాలతో గోదావరికి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు, శబరిల్లో భారీగా వరద నీరు చేరింది. అదంతా గోదావరిలో కలసి ధవళేశ్వరం వద్దకు చేరడంతో నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేశారు. ఫలితంగా గౌతమీ, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదీపాయల్లో వరద జలాలు నురగలు కక్కుతూ ప్రవహించాయి. బలహీనమైన గట్లు తెగిపోయి సమీప గ్రామాలను ముంచేశాయి. గోదావరి మధ్యలో, గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాల్లోని గ్రామాల ప్రజలు వరదలో చిక్కుకుపోయారు. వరద దిగ్బంధంలో ఉన్న లంక గ్రామాల ప్రజలు రాత్రి గడిస్తే చాలనే భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించారు.

కొన్ని గ్రామాలకు విద్యుత్‌ ‌సరఫరా నిలిపి వేయడంతో చిమ్మ చీకటిలోనే కాలం వెళ్లదీశారు. నిత్యావసర వస్తువులు ముఖ్యంగా కూరగాయలు, గ్యాస్‌, ‌పాలు, మంచినీరు వంటివి అందకపోవడంతో ఆందోళన చెందారు. అనారోగ్యాలతో ఉండేవారికి మందులు కూడా దొరకని పరిస్థితి. సమీప ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వైద్యసేవలు అంతంత మాత్రంగానే అందాయి. కనీసం బహిర్భూమికి వెళ్లలేని పరిస్థితులు లంక గ్రామాల్లో ఏర్పడ్డాయి. వారం రోజుల నుంచి ఏదో రూపంలో ముంపు కొనసాగ•డంతో లంక గ్రామాల ప్రజలకు ఉపాధి కూడా కరవైంది. ప్రధానంగా సురక్షిత ప్రాంతాలకు వెళితే తమ ఇళ్లు లూటీ అవుతాయన్న భయంతో ఏ ఒక్కరూ ఇల్లు కదలలేదు. బాధితులు ఇళ్ల పైకప్పులపై తలదాచుకున్న ప్రాంతాలనేకం ఉన్నాయి. బాధితులకు నీరు, ఆహారం అందించకపోగా ఆగస్టులో అధికంగా వరద వస్తుందని, జూలైలో ఈ స్థాయిలో వరదను ఊహించ లేదని, అందువల్ల అధికారులు అప్రమత్తంగా లేరని, బాధితులకు అన్నీ సక్రమంగా అందుతున్నాయని మంత్రులు, అధికారులు పేర్కొనడంతో విపక్షాలు మండిపడ్డాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాతో పాటు అమలాపురం తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, అయ్యాజీ వేమ, జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబులతో కూడిన బృందం పర్యటించింది.ఏలూరు జిల్లాకు సంబంధించి పోలవరం విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరు పాడు, పోలవరం తదితర ప్రాంతాల్లో శాసనమండలి భాజపా పక్షనేత పీవీఎన్‌ ‌మాధవ్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిలతో కూడిన కమిటీ పర్యటించింది. బాధితులను పరామర్శించ •డంతో పాటు వారికి ఆహారపొట్లాలు, మంచి నీరు అందచేశారు. ఈ రెండు కమిటీలు వరదలు, బాధితుల సమస్యలపై పార్టీ రాష్ట్ర శాఖకు ఒక నివేదిక సమర్పిస్తాయి.

లక్ష మంది బాధితులు

బాధితులు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలతో ప్రభుత్వం స్పందించి వరద తాకిడి ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసింది. 6 జిల్లాల్లోని 62 మండలాల పరిధిలోని 626 గ్రామాలు వరద బారిన పడ్డాయి. 97,205 మంది నిరాశ్రయులయ్యారు. బాధితుల కోసం పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రదేశాల్లో 191 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్క అల్లూరి జిల్లాలోనే 290 గ్రామాలకు చెందిన 53,107 మంది 103 సహాయ శిబిరాల్లో, ఏలూరు జిల్లాలోని 169 గ్రామాల నుంచి 18,707 మంది 23 సహాయ శిబిరాల్లో, అంబేద్కర్‌ ‌కోనసీమ జిల్లాలోని 74 లంక గ్రామాల నుంచి 9,290 మంది, 29 సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

10,757 ఎకరాల్లో పంట నష్టం

వరద తీవ్రతకు ఆరు జిల్లాల్లో పంటలు, మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లిన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 10,757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. 3,375 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 7,382 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. కోనసీమ జిల్లాలో 5,253 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 1,802 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు వరదలకు ధ్వంసమయ్యాయి. 156 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. 35 రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 34,749 ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి.

మునిగిన నర్సీలు

దేశవ్యాప్తంగా నర్సరీలకు పేరు గాంచిన కడియం మండలంలో పొట్టిలంక, కడియపులంక, బుర్రిలంక, వెంకయ్యపేట, వేమగిరి గ్రామాల లంక భూముల్లో రైతులు అరటి, కంద, దొండ, వంగ, పచ్చిమిర్చి, బెండ వంటి కూరగాయ పంటలు, జామ, కోకో, బొప్పాయి వంటి వాణిజ్య పంటలు, మామిడి, సపోటా, ఎవెన్యూ, వేప, రావి, మహాగని, స్పెదోడియా, కోనోకార్పస్‌ ‌వంటి మొక్కలు, నిమ్మ, నారింజ, బత్తాయి, జామ వంటి పండ్ల మొక్కలు, కనకాంబరం, బంతి, లిల్లీ, జాజులు వంటి పూలతోట లను సాగుచేస్తారు. నర్సరీల రైతులు జూలై నెలాఖరు నాటికి మొక్కలను అమ్మేసి వరదకు వదిలేస్తారు. అయితే ఈ సారి మాత్రం వరద ముందుగా రావడంతో నర్సరీ రైతులకు నష్టమే మిగిలింది. వరద ఉధృతి తగ్గినా మొక్క గత నాలుగు రోజులుగా నీటిలో మునిగిపోవడంతో క్రింద వేరు భాగం కుళ్లిపోయి మొక్క చనిపోతుందని రైతులు అంటున్నారు. దీంతో కూరగాయలు, ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉద్యాన శాఖ గణాంకాల ప్రకారం సుమారు 250 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, ఇందులో 90 హెక్టార్ల వరకు నర్సరీలు ఉన్నాయని సంబంధిత అధికారులు అంటున్నారు. ఉద్యాన పంటలకు ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు, నర్సరీలకు ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజు రోజుకూ పెరిగిన ప్రవాహం

వారం క్రితం గోదారంతా ఎండిపోయింది. లంకలన్నీ పైకితేలిపోయాయి. ఇసుక మేటలు కనిపిం చాయి. ఖరీఫ్‌కు సాగునీరు కష్టమే అనుకున్నారంతా. అంతలోనే అంచనాలు తల్లకిందులయ్యాయి. జూలై 9వ తేదీన గోదావరికి కాస్త వరదొచ్చింది. అంతా మామూలే అనుకున్నారు. అప్పటి నుంచి గంట గంటకు వరదనీటి చేరిక పెరిగింది. 9న ఈ ఏడాది తొలిసారిగా 2.21 లక్షలు క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. అలా 16వ తేదీ వరకు నీరు చేరుతున్న దామాషాలో దిగువకు వదిలారు.

గరిష్ఠంగా కుంభవృష్టి

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్‌ ‌సమీపంలో త్రయంబకేశ్వర్‌ ‌వద్ద జన్మించే గోదావరి.. తూర్పు కనుమల మీదుగా 1,465 కిలో మీటర్లు ప్రవహించి అంబేడ్కర్‌ ‌కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి పరీవా హక ప్రాంతం 3,12,150 చదరపు కిలోమీటర్లు. దీన్లో మహారాష్ట్రలో 48.5 శాతం, తెలంగాణ, ఏపీల్లో 23.30, ఛత్తీస్‌ ‌గఢ్‌లో 12.5, మధ్యప్రదేశ్‌లో 8.6, ఒడిశాలో 5.70, కర్ణాటకలో 1.40 శాతం ఉంది. దేశ విస్తీర్ణంలో ఇది 9.5 శాతంతో సమానం. గోదావరి బేసిన్లో గత 30 ఏళ్ల వర్షపాతం ఆధారంగా.. కనిష్టంగా 877 మిల్లీమీటర్లు, గరిష్టంగా 1,498 మిల్లీమీటర్లు, సగటున 1,117 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. ఇందులో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్‌ 12 ‌నుంచి సెప్టెంబరు 30 వరకు సగటున 824 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా. గోదావరికి ఉన్న తొమ్మిది సబ్‌ ‌బేసిన్లలో ఎల్లి సబ్‌ ‌బేసిన్‌ (‌జి-2) (మహారాష్ట్రలో కనిష్ఠంగా 758.34.. కుంట సబ్‌ ‌బేసిన్‌ (‌జి-7) (శబరి-ఒడిశా, ఆంధప్రదేశ్‌)‌లో గరిష్ఠంగా 1,503 మి.మీ. వర్షం కురుస్తుంది. జూలై ప్రథమార్ధంలో ప్రాణహిత (జి-2 టెకా), గోదావరి (జి-4 మంచిర్యాల), ఇంద్రావతి (జి-5 పాతగూడెం), శబరి (జి-7 కొంటా)లలో సగటున 526 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే.. రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షంలో 63.84 శాతం పది రోజుల్లోనే కురిసింది. సుమారు 60 రోజుల్లో కురవాల్సిన వర్షం పది రోజుల్లోనే పడింది.

800 టీఎంసీలు సముద్రం పాలు

గోదావరి వరద జలాలు జూలై 13న 129.98 టీఎంసీలు.. 14న 132.98 టీఎంసీలు.. 15న 161.99 టీఎంసీలు.. 16న 204.20 టీఎంసీలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 800.75 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దీనిలో 13 నుంచి 16 వరకు నాలుగు రోజుల్లోనే 629.15 టీఎంసీలు కడలిలో కలిశా యంటే గోదావరి ఏ స్థాయిలో విశ్వరూపం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1862 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. గత 160 ఏళ్లలో జూలైలో అదీ ప్రథమార్ధంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో గోదావరి వరద జలాలు కడలిలో కలిసిన దాఖలాల్లేవు.

కాఫర్‌ ‌డ్యాం ఎత్తు పెంపు

గోదావరికి భారీ వరద పోటెత్తుతుండడంతో ఎగువ కాఫర్‌ ‌డ్యాం ఎత్తు ఒక మీటరు మేర రెండు మీటర్ల వెడల్పున పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 కి.మీ పొడవునా మీటరు ఎత్తు, 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచే పనులు జూలై 15న ప్రారంభమయ్యాయి. జూలై 17 నాటికి ఈ పనులను పూర్తి చేశారు.

ప్రస్తుతం ఎగువ కాఫర్‌ ‌డ్యాం 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారు. దీనికి మించి వరద నీరు వస్తే ఎగువ కాఫర్‌ ‌డ్యాం పై నుంచి నీరు దిగువకు ప్రవహించే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మీటరు మేర కాఫర్‌ ‌డ్యాం పొడవునా 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎగువ కాఫర్‌ ‌డ్యాం ఎగువ భాగం మొత్తం 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మొత్తం కాకుండా 2 మీటర్ల వెడల్పుతోనే ఎత్తు పెంచారు. నీరు ఎగువ కాఫర్‌ ‌డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేపట్టారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE