ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల వేళ ఆధునిక భారతదేశంలో మరొక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

 ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి పీఠం అధిరోహించారు. ఆమె ద్రౌపది ముర్ము.

 పోరాట పటిమకు చిరునామా వంటి సంథాల్‌ ‌తెగ నుంచి వచ్చారు. 1855-56లో అదే తెగ ఈస్టిండియా కంపెనీ మీద ధ్వజమెత్తి చరిత్ర సృష్టించింది. అరవై వేలమంది గిరిజనులు వెంటరాగా సిధు, కన్హు సోదరులు ఆ ఉద్యమాన్ని నడిపించారు. వారే ముర్ము సోదరులుగా చరిత్ర ప్రసిద్ధులు. ఆ ఉద్యమాన్ని గౌరవిస్తూ చరిత్ర ఇచ్చిన పేరే సంథాల్‌ ‌హూల్‌.


ఆ ‌తెగలోనే పుట్టిన ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అలా స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌ ‌సంథాల్‌ ‌హూల్‌తో ప్రతి ధ్వనించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న గిరిజన తెగ ఆడపడుచు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నిక కావడం నిశ్చయంగా విప్లవమే.

స్వరాజ్య సమరం నాటి అన్ని వర్గాల త్యాగాలకూ, రక్తతర్పణలకు గుర్తింపు నివ్వాలన్న లక్ష్యం ఆజాదీ కా అమృతోత్సవాల లక్ష్యంగా చెప్పుకు న్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఆ త్యాగాల ఫలితంగా లభించిన స్వతంత్ర భారతావనిలోను అన్ని వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సమాన ప్రాధాన్యం ఉండాలన్న ఆకాంక్షను ద్రౌపది ముర్ము ఎంపిక ద్వారా బీజేపీ ప్రకటించింది.

 ఈసారి జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. స్వాతంత్య్రానంతరం జన్మించి, రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి మహిళ ద్రౌపది ముర్ము. ఆ పదవికి ఇప్పటివరకు ఎన్నికైనవారిలో పిన్న వయస్కురాలు. పేదరికం, వెనుకబాటుతనంతో పనిలేకుండా సొంత సామర్థ్యంతో, స్వశక్తితో అత్యున్నత స్థానాన్ని చేరుకోవడానికి ఎవరికైనా అవకాశం కల్పించే భారత ప్రజాస్వామ్య ఔన్నత్యం ప్రపంచానికి స్ఫుటంగా వెల్లడైంది. అందరికీ సమానావకాశాలు అని చెప్పే భారత రాజ్యాంగంలోని వాస్తవికత నిర్ద్వంద్వంగా వ్యక్తమైంది. సామాజిక న్యాయం అంటూ గొంతు చించుకోవడం కాదు, దానిని ఆచరణలో చూపితేనే సార్ధకత అన్న వాస్తవాన్ని తాను ఎంతగా నమ్ముతున్నదో బీజేపీ ఈ దేశ ప్రజల అనుభవానికి తెచ్చింది. కొండకోనలలో పుట్టి పెరిగిన సామాన్యురాలిని రైసినా హిల్స్‌కు తోడ్కొని వచ్చిన పల్లకికి బోయీ అయింది. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముతో ప్రమాణస్వీకారం చేయించినది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తెలుగువాడు జస్టిస్‌ ఎన్‌.‌వి. రమణ కావడం కూడా ఒక ప్రత్యేకతే.

ద్రౌపది ముర్ము నేపథ్యం

ఒడిశాలో సంథాల్‌ ‌తెగ ప్రజలు అధికం. జూన్‌ 10, 1958‌న ద్రౌపది ముర్ము జన్మించారు. స్వస్థలం ఒడిశాలోనే, మయూర్‌ ‌భంజ్‌ ‌జిల్లా, ఉపర్‌బెడ గ్రామం. తండ్రి బిరంచి నారాయణ్‌ ‌తుడు. తండ్రి తాతలు పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థలో గ్రామ పెద్దలుగా పనిచేశారు. ద్రౌపది ముర్ము భువనేశ్వర్‌లోని రమాదేవి ఉమెన్స్ ‌కళాశాల నుంచి ఆర్టస్ ‌పట్టభద్రురాలు. తరువాత ఆమె జీవితానికి రాయ్‌రంగాపూర్‌ ‌కేంద్ర బిందువైంది. చదువు అయిన తరువాత రాయ్‌రంగాపూర్‌కే చెందిన శ్యాంచరణ్‌ ‌ముర్ము (బ్యాంకు ఉద్యోగి)ని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2009-2015 మధ్యకాలంలో తన భర్త, ఇద్దరు కుమారులు, తల్లి, సోదరుడిని కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మనశ్శాంతి కోసం బ్రహ్మకుమారిల ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. వివిధ ఆలయ ప్రాంగణాలను పరిశుభ్రం చేసేవారు. భర్త, ఇద్దరు కుమారుల పేరిట ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన భర్త రాయ్‌రంగాపూర్‌లోనే నిర్మించిన సాధారణ ఇంటిలో ఆమె నివసించేవారు. ఈమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము, బ్యాంక్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.

ద్రౌపది ముర్ము నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా  జీవితాన్ని ప్రారంభించి 1979-83 వరకు పనిచేశారు. అటు తర్వాత రాయ్‌రంగాపూర్‌ ‌లోని శ్రీ అరవిందో ఇంటిగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్ ‌సంస్థలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌గా పనిచేసి, 1997లో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాయ్‌రంగాపూర్‌ ‌నగర పంచాయతీ కౌన్సిలర్‌గా, 2000 సంవత్సరంలో అదే నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ గిరిజన మోర్చా జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు. తర్వాత ఆమె రాయ్‌రంగాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై, 2000లో ఏర్పాటైన బిజూ జనతాదళ్‌ -‌బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్యం, రవాణా (2000 మార్చి 6 నుంచి 2002 ఆగస్టు 6 వరకు), తర్వాత మత్స్య-పశుసంవర్ధక శాఖలు (2002 ఆగస్టు 6 నుంచి 2004, మార్చి 16 వరకు) నిర్వహించారు. 2004లో రాయ్‌రంగా పూర్‌ ‌నియోజకవర్గం నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో ఒడిశా అసెంబ్లీలో ఉత్తమ ఎమ్మెల్యే (నీలకంఠ సన్మాన్‌) ‌పురస్కారాన్ని పొందారు. మే 18, 2015న ముర్ము ఝార్ఖండ్‌ ‌తొమ్మిదవ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌ ఈమెనే కావడం విశేషం. ఆరేళ్లపాటు అంటే 2021 వరకు పూర్తికాలం గవర్నర్‌గా కొనసాగారు. ఆ విధంగా పూర్తికాలం ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించిన ఘనత కూడా ఈమెదే.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గిరిజనుల సంఖ్య 104 మిలియన్లు. మొత్తం జనాభాలో 8.6 శాతం. దేశంలో మొత్తం 705 గిరిజన తెగలను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. వీరు మొత్తం లక్షా 45వేల గ్రామాల్లో నివసిస్తున్నప్పటికీ కేవలం 1,17,064 గ్రామాల సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. మరి ఈ గిరిజనులను  ప్రకృతి ఆరాధకులుగా పరిగణిస్తూ, వీరు హిందువులు కారంటూ, క్రమంగా  తమ మతంలోకి మారుస్తున్న క్రైస్తవ మిషనరీలకు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం మింగుడుపడని అంశం. నిజానికి సంథాల్‌ ‌గిరిజన తెగలవారు శివారాధకులు. ద్రౌపది ముర్ము శివాలయం ప్రాంగణాన్ని చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి అక్కడి నంది చెవిలో ప్రార్థించడం గమనార్హం. నంది చెవిలో తమ కోర్కెలు విన్నవిస్తే, ఆయన శివుడికి చేరవేస్తాడన్నది సంథాలీ ప్రజల నమ్మకం. నిజానికి దేశమంతటా ఉన్న విశ్వాసం. అదే విశ్వాసం ద్రౌపది ముర్ములో వ్యక్తమైంది.

ద్రౌపది ముర్ము ఎంపికలో హిందూత్వ కోణం ఉన్నదని ఎవరైనా అంటే దానిని నిరాకరించవలసిన అవసరం లేదు. ఎన్‌డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసిన తరు వాత ఆమె చేపట్టిన తొలి కార్యక్రమం శివాలయంలో ఆర్చన. ఆ విధంగా తనను తాను ఆమె వ్యక్తీకరించు కున్నారు. తనదైన అస్తిత్వాన్ని చాటుకున్నారు. అట్టడుగున ఉన్న హిందువులు ఇప్పటికీ దూరంగా ఉండిపోయారన్న అపవాదు నుంచి దేశాన్ని బయట పడవేయడానికి బీజేపీ ఈ సమున్నత నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల నుంచి కూడా ఒక నేతను తయారుచేసి, ఆమెకు రాష్ట్రపతి పదవిని అప్పగించడం వెనుక ఉన్నది దేశ సమైక్యతకు సంబం ధించిన ఆలోచన మాత్రమే. వేరుగా చూస్తున్నారన్న ప్రచారాన్ని నమ్ముతున్న కొందరు గిరిజనులకు అది తప్పని, ఇకపై సాగదని చెప్పడానికే బీజేపీ ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. అందుకే ఇదొక చరిత్రాత్మక ఘట్టం.


జయ్‌పాల్‌ ‌ముండా ముర్ముకు మార్గదర్శకుడవుతారా?

రాజ్యాంగ నిర్మాణ సభలో ఒకే ఒక గిరిజన సభ్యుడు జయ్‌పాల్‌సింగ్‌ ‌ముండా. 1928లో ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో జరిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌లో హాకీ టీమ్‌ ‌కెప్టెన్‌. ఈ ‌టీమ్‌ ఈ ‌పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. ఈయన ఆదివాసీస్తాన్‌ ‌కావాలని డిమాండ్‌ ‌చేసిన వ్యక్తి. తనకు మాట్లాడే అవకాశం కల్పించినప్పుడు మతం, జాతి, తెగ పరంగా గిరిజనులపై ఏవిధమైన వివక్ష చూపడానికి వీల్లేదని రాజ్యాంగసభకు సూచించారు. గిరిజన తెగలవారు మతం మారినా వారి జీవన విధానాల్లో మార్పు ఉండదని ఈయన రాజ్యాంగ నిర్మాణసభకు తన అభిప్రాయం చెప్పడంతో, గిరిజనులను మైనారిటీలుగా గుర్తించి రాజ్యాంగసభ వీరికి కూడా రిజర్వేషన్లు వర్తింప జేసింది. దీంతో గిరిజనులు మతం మారినా రిజర్వేషన్లు వర్తించే పక్రియ కొనసాగుతోంది. ఈ సదుపాయం మిగిలిన వర్గాలకు లేదు.

బాబా కార్తిక్‌ ఒరాన్‌, ‌బిహార్‌లోని ఒరాన్‌ ‌గిరిజన తెగకు చెందినవాడు. ఈయన్ను బాబా కార్తిక్‌ ‌సాహెబ్‌ అనికూడా పిలిచేవారు. 1970 దశకంలో లోహర్‌దగా పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఈయన విమానయానశాఖ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. క్రైస్తవంలోకి గిరిజనుల మతమార్పిడులను అడ్డుకునేందుకు తీవ్రంగా కృషిచేశారు. ఈ నేపథ్యంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఆయన మతం మారిన గిరిజనులకు రిజర్వేషన్లు అవసరం లేదన్న ప్రతిపాదను తయారుచేసి 322 మంది లోక్‌సభ సభ్యులు, 26 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలతో అప్పట్లో భారత ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించారు. లోక్‌సభలో 50 మంది క్రైస్తవ అనుకూల ఎంపీలు ఈ మెమోరాండంను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కార్తిక్‌ ఒరాన్‌ ‌చేసిన ప్రతిపాదనలు ‘‘జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ ఆన్‌ ‌షెడ్యూల్‌ ‌క్యాస్ట్ అం‌డ్‌ ‌షెడ్యూల్డ్ ‌ట్రైబ్స్ (అమెండ్‌మెంట్‌) ‌బిల్‌-1967’’‌కు పూర్తి అనుగుణంగా ఉన్నప్పటికీ క్రైస్తవ మిషనరీల తీవ్ర ఒత్తిడితో ఇందిరాగాంధీ ముందడుగు వేయలేకపోయారు. ఫలితంగా ఇప్పుడు ఈశాన్య భారత్‌లోని గిరిజనుల్లో 90%కు పైగా క్రైస్తవులుగా మతమార్పిడికి గురయ్యారు. దేశీయ సమస్యలను వాస్తవికత ఆధారంగా పరిష్కరించాలనుకున్నప్పటికీ విదేశీ ప్రభావిత శక్తులు తమ లక్ష్యాలకు అనుగుణంగా మాత్రమే ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనిస్తాయన్న సత్యానికి ఇదొక ఉదాహరణ. ఇందుకోసం అవి ఎంతకైనా తెగబడతాయన్నది కూడా నిష్టుర సత్యం. ఇందుకు ఒక్కటే కారణం. మనదేశంలో మైనారిటీలని చెప్పే మతాలు, అంతర్జాతీయంగా మెజారిటీలు కావడం, భారత్‌లో మెజారిటీ వర్గంగా భావించే హిందువులు అంతర్జాతీయంగా మైనారిటీలు కావడం! కేవలం ఈ కారణమే మనదేశ రాజకీయాలను, సామాజిక వ్యవస్థను శాసిస్తోంది. కుహనా లౌకికవాదుల ‘మైనారిటీ’ భజన కూడా ఇందుకే కావచ్చు. ప్రస్తుత జాతీయవాద ప్రభుత్వం నిజాయతీగా నాటి జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ బిల్లు వంటి దానిని ముందుకు తీసుకువస్తే ద్రౌపది ముర్ము మద్దతిస్తారా లేదా అనేది వేచిచూడాలి.


ఎవరికెన్ని ఓట్లు?

అనుకున్నట్టే ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తలలు కూడని విపక్షాలు ఆపసోపాలుపడి ఎట్టకేలకు ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికచేసిన యశ్వంత్‌ ‌సిన్హాపై, ఆమె 2,96,626 ఆధిక్యంతో గెలుపొందారు. రిటర్నింగ్‌ అధికారి పి.సి. మోదీ ప్రకటించిన ప్రకారం ద్రౌపది ముర్ముకు మొత్తం 6,76,803 ఓట్లు రాగా, విపక్ష అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు 3,80,177 ఓట్లు దక్కాయి. పోలైన 4754 ఓట్లలో చెల్లిన ఓట్లు 4701. నిజానికి మూడో రౌండ్‌కే ద్రౌపది ముర్ముకు 51% ఓట్లు రావడంతో గెలుపు ఖాయమైపోయింది. మొత్తం పోలైన ఓట్ల విలువ 10,72,377 (ఓట్లు 4754) కాగా, చెల్లిన వాటి విలువ 10,56,980 (ఓట్లు 4701), చెల్లని ఓట్లు 53 (వీటి విలువ 15,397). చెల్లని 53 ఓట్లలో 15 పార్లమెంట్‌ ‌సభ్యులవి, 38 ఎమ్మెల్యేలవి. ముర్ముకు దక్కినవి 2,824 (6,76,803). అంటే 64.03%. యశ్వంత్‌ ‌సిన్హాకు దక్కినవి 1877 (3,80,177). అంటే 35.97%. 2017లో రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కు వచ్చిన 65.65% ఓట్లకంటే ద్రౌపదికి కొంచెం తగ్గాయి. కానీ అప్పటి విపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు వచ్చిన 34.35% ఓట్లకంటే, ప్రస్తుత అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాకు కొంచెం ఎక్కువ రావడం గమనార్హం.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram