ఆగస్ట్ 1 ‌నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

అమ్మ అంటే వాత్సల్యం. వాత్సల్యమంటే ప్రేమ, మాలిమి, ఆదరం. ఆదరం అంటే మన్నన. మన్నన చూపడమంటే అక్కున చేర్చుకుని ప్రియత్వాన్ని ప్రసాదించడం. ఇవన్నీ తల్లిపాలలో ఉన్నాయి కాబట్టే అవి అమృత బిందువులు. వాటిని పసిబిడ్డ నోటికి అందించి ప్రాణం నిలబెడుతుంది మాతృమూర్తి. నవ మాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసే ఆమె ప్రత్యక్ష దైవం. మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు జననిని, తాను కటాక్షించే క్షీర ప్రాధాన్యాన్ని విపులీకరిస్తూనే ఉన్నాయి. వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యానికి, సామాజిక ఉత్తమత్వానికి దోహదపడే అమ్మపాల విలువను పెద్దలెందరో తేటతెల్లం చేస్తూనే ఉన్నారు. అన్ని విధాల ఆరోగ్యాలకీ మూలకారకాలలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. పోతపాలు కాదు – తల్లిపాల వల్లనే బిడ్డకు రక్ష అని చాటి చెబుతున్నారు. మన దేశానికే పరిమితమైన అంశం కాదిది. ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఆగస్టు ఒకటో తేదీన మొదలయ్యే తల్లిపాల వారోత్సవాలు ఆరోగ్య, సామాజిక, మహిళా రంగాలతో పాటు మొత్తం వ్యవస్థకే దిశానిర్దేశం చేస్తున్నాయి. తల్లిపాలు పట్టడాన్ని ప్రోత్సహించడం ఉమ్మడి బాధ్యతగా ప్రకటిస్తున్నాయి. అన్ని ధర్మాలూ, శాస్త్రాలూ విధానాలూ కాలపరిణామ సిద్ధాంతాలూ శభాష్‌ అం‌టున్న రీతి. ఎనలేని సరిలేని అమూల్య కానుక ఏదం•- మాతృదేవత తన పసికందుకు రుచి చూపించే ఆ మధుర సుధ. ఔషధం, ఆయురద్రవం, శక్తి సాధనం, పసి నాలుకలకు పసందైన విందు అంతా అమ్మపాలే. ‘నా పాలి దైవం’ అంటాం కృతజ్ఞతగా. సంతానం పాలిట దైవం ప్రాతిపదికగా, అంతర్జాతీయ స్థాయి వార్షిక ఉత్సవాలను ఆరంభించి ఇప్పటికి మూడు దశాబ్దాలు.


‘తల్లిపాల సంస్కృతీ పరిరక్షణం సర్వసమాజా నికీ సకల ఆరోగ్యప్రదం’ అనే నినాదం, విధానంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి బాలల నిధి, బ్రెస్ట్ ‌ఫీడింగ్‌ ‌ప్రమోషన్‌ ‌నెట్‌వర్క్ ఆఫ్‌ ఇం‌డియా సంస్థలు అమ్మపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. పర్యవేక్షణను వరల్డ్ అలియెన్స్ ‌ఫర్‌ ‌బ్రెస్ట్ ‌ఫీడింగ్‌ ‌యాక్షన్‌ ‌వ్యవస్థ చేపట్టింది. ఈసారి ప్రచారాంశంగా ‘అన్ని వర్గాల, స్థాయుల మహిళలనీ కలుపుకునేలా’ అనే పేరుతో ముందుకు తీసుకెళ్తోంది. దీనివైపు ప్రభుత్వాలు, సామాజిక ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు చూపు సారించాలని సూచిస్తున్నాయి. మరి ఈ ఉత్సవాలు ఆగస్టులోనే ఎందుకన్న ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తుంది. ప్రభుత్వాల విధాన నిర్ణేతల బృందాలు, అంతర్జాతీయ వ్యవస్థల ప్రతినిధుల సంఘాలు సంతకాలతో 1990 ఆగస్టులో ప్రకట నను వెలువరించాయి. అమలులోకొచ్చిన తేదీనుంచే, ఆ ప్రాతిపదికన వారోత్సవాలు కొనసాగుతూ వస్తున్నాయి. జాతీయ స్థాయిలో మాసోత్సవాల నిర్వహణా ఆగస్టులోనే.

అమ్మ దయామయి. ఆ స్పర్శ, పరామర్శల మేలు కలయికే కౌగిలి. అది ఆ తల్లి మది పలికే మౌనగీతి. తనువుకీ, మనసుకీ అదొక మనోహర అనుభూతి. తల్లీబిడ్డల హృదయాలను స్పందింపజేసే సంగీత తరంగమది. బిడ్డ నెత్తుకుని ముద్దాడుతుంది ధాత్రి. భూదేవి అంతటి సహనశీలి. చనుబాలు అంతంత ఓరిమిగా అందించగలిగిన కారణంగానే, ఏటేటా లక్షలాది ప్రాణాలకు రక్షణ. శాస్త్రీయ అవగాహన, తగినన్ని జాగ్రత్తలతో పాలిస్తే ఎందరెందరో చిన్నారులు ఈ లోకాన సురక్షితంగా మనగలు గుతారు. నవజాత శిశువుల ఆరోగ్య భాగ్యమే ప్రధాన లక్ష్యంగా నిరంతరం పరిశ్రమిస్తున్న ‘తల్లిపాల నిధి’ సంస్థలూ చెబుతున్నదిదే. నాటి భారతీయ వైద్య పారంగతులైనా, నేటి వైద్యశాస్త్ర నిపుణులైనా చెప్పిందీ, చెప్తోందీ ఒకటే.శిశువుల భవిత సమస్తం స్తన్యంతోనే దృఢతరమవుతుంది. పుట్టిన ప్రతీ బిడ్డకీ తొలి గురువు తల్లి, మొదటి ఔషధం ఆమె పాలు. ఇస్తున్న అమ్మకీ, స్వీకరిస్తున్న చిన్నారికీ ఎంతెంతో అలౌకికత. ఆకలిదప్పులు తీర్చిన మాత, ఎదుగుదల సాధించిన శిశువు – ఈ ఇద్దరూ వాత్సల్య ప్రేమల ప్రతి రూపాలు. తల్లిది మమతల తేట, పసి ప్రాణానికి అదే వెలుగుబాట.

ప్రాథమిక బాధ్యత

ప్రకృతి ప్రసాదితాన్ని, శారీరక ధర్మాన్ని, సంప్రదాయ సారాంశాన్ని గౌరవిద్దాం. ప్రకృతినే మాతగా భావిస్తుంది మన పురాణ సారస్వతం. మాత అనగానే మొదటిదీ, ముఖ్యమైనదీ అని అంతరార్థం. బిడ్డకు తల్లిగా మొదట ఆమె పాలిచ్చి పోషిస్తుంది. స్తన్యమివ్వడాన్ని అత్యంత పవిత్ర కర్తవ్యంగా పరిగణిస్తుంది. నిజానికి అదే ఒక సహజ సిద్ధ్ద ఆరోగ్య పద్ధతి. శాస్త్రీయంగా నిరూపితమైన బహుళ ప్రయోజక విధానం. ప్రత్యామ్నాయమంటూ ఏదీ ఉండదు. ప్రసవమైన గంట లోపల పాలు పట్టి, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే దాకా స్తన్యమిస్తూ పరిరక్షకురాలు కావాలి జనని. గర్భంతో ఉన్న ప్పుడే శిశువుతో కలిగిన ప్రేమానుబంధం విస్తరి స్తుంది. కాన్పు అయ్యాక పాలిచ్చే సమయంలోనూ అదే ఆత్మీయతా అనురాగం. ఎంతైనా తాను అందించేది పరిపూర్ణ ఆరోగ్యం కదా! ఒంటికి బలం, వ్యాధి నిరోధకం, జీర్ణ పక్రియను పదిలపరచడం- అన్నీ అమ్మపాలతోనే. అందువల్లనే ఉభయులకీ ముందు ముందు ఎటువంటి చింతా ఎదురవదు. పాలివ్వడంతో వెలువడే శారీరక పదార్థం కారణం గానే, అమ్మ గర్భసంచీ కాన్పు మునపటి దశలో కొస్తుంది. తల్లి పాలు వరమని, పోతపాలు శాపమనీ అందరికీ తెలుసు. ఎంత తెలిసినా దేశంలోనైనా, ప్రపంచంలోనైనా అవగాహన కలిగిన తల్లులు ఎంతమంది? ఇదీ అసలు ప్రశ్న. దానిని పాటిస్తే, శారీరకంగానే కాదు, మానసికంగా కూడా తల్లిపాలు ఎటువంటి సమస్యలనీ పిల్లల దరిచేరనివ్వవు. సత్తువనిస్తాయి, తెలివి పెంచుతాయి, చక్కగా ఎదిగేలా చేస్తాయి. అంటువ్యాధులు రాకుండా అడ్డుకునే గుణం తల్లి పాలలో ఉంది. సకల విధాలుగా వికాసం కలిగించే పోషకాల ప్రదాయనీ అదే. ఈ అన్ని ఉప యోగాలను పల్లెసీమల్లో ప్రచారాల ద్వారా తేటతెల్లం చేయాలని సమగ్ర శిశు అభివృద్ధి సంస్థలు కృషి సాగిస్తున్నాయి. రోజులో కనీసం ఏడెనిమిదిసార్లు పాలివ్వాలని, శిశువులకు సంతులిత ఆహారాన్ని ఇస్తున్నామన్న స్పృహతో వ్యవహరించాలని తల్లులకు సూచిస్తున్నాయి. ‘అమ్మపాలే కమ్మన – అన్నింటికన్న మిన్న’, ‘తల్లిపాలు – ఆరోగ్య ప్రయోజనాలు వేన వేలు’, ‘స్తన్యమివ్వడం తల్లీబిడ్డకు క్షేమదాయకం..’ ఇలా అనేక నినాదాలతో ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు తమవంతు కర్తవ్యాలు నిర్వర్తిస్తు న్నాయి. ఎందరు ఎంత చెప్పినా, ఎన్ని సంస్థలు ఎన్నెన్ని ప్రచారాలు చేసినా, ప్రసవించిన ప్రతి తల్లీ తన ప్రాథమిక బాధ్యత తెలిసి మసిలితేనే సర్వత్రా ఆరోగ్య భాగ్యం.

సేవామృత వాహిని

బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు పట్టాలన్నది ఇప్పటికీ చాలామంది వనితల్లో ప్రశ్నార్థకమే! వైద్య నిపుణులు, శిశు చికిత్స ప్రవీణులు ఎంతగా చెప్తున్నా, ఎన్ని ముందు సూచనలిస్తున్నా ఫలితం అంతంత మాత్రం గానే ఉంటోంది. అంతా తమకే తెలుసనుకుని వ్యవహరించే కొందరు కుటుంబ పెద్దలు, అందునా పెద్ద మహిళలతో సమస్య ఏర్పడుతోంది. తెలిసీ తెలియనితనం ఆ విపత్కర పరిస్థితికి మూలకారణం. వారిచ్చే ఉచిత సలహాలు, వాటిని అదే మని అడగకుండానే అనుసరించే పసికందు తల్లులు అటు తర్వాత నానా ఇబ్బందుల పాలవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో, పెద్దలిచ్చే సరైన సూచనలూ, సలహాలను పాటించని వైనం, ఇంకెవరినో అడిగి, అంతర్జాలంలో ఏవేవో చూసి వాటినే పాటించే తత్త్వం కూడా కాలక్రమంలో సమస్యల తీవ్రతకు కారణమవు తున్నాయి. వాస్తవాలను తెలుసుకోలేక, కనీసం ఆ మేర ప్రయత్నమైనా చేయక, ఇష్టానుసార నిర్ణయా లతో కొంతమంది అతివలు కష్టనష్టాల్లో చిక్కుపడుతు న్నారు. ఇలాంటి పరిస్థితిని చక్క దిద్దడానికి భాగ్య నగరంలోని ‘ధాత్రి తల్లిపాల నిధి’ వంటి సేవా సంస్థలు, రామకృష్ణమఠం కేంద్రంగా రూపొందిన ‘ఆర్యజనని’ కృషి చేస్తున్నాయి. ప్రతి నవజాత శిశువుకీ తల్లిపాలు అందాలన్నది ధాత్రి ధ్యేయం. ఆరేళ్ల కాలక్రమంలో ఈ నిధి జాతీయ స్థాయిలోనే పెద్దదిగా రూపుదిద్దుకుంది. నగరంలోని వైద్యశాల ‘నిలోఫర్‌’‌లో ఏటా వేల మంది పుడితే; వివిధ కారణా లతో మృతి చెందుతున్న వారి శాతం పదికి పైనే. అలాంటి వారికి సరైన సమయంలో తగిన రీతిలో అమ్మపాలు అందిస్తే మృత్యుంజయులవుతారు. అలా ఊపిరి పోసేందుకే ఏర్పాటైంది ఆ నిధి. ఉదార హృదయ ముదితలు మాతృక్షీరం అంపిస్తే, దానిని భద్రపరిచేలా యంత్రంతో వెచ్చబెడుతున్నారు. పాలలో పోషక విలువలు కాపాడేలా జాగ్రత్త చర్యలు తీసుకుంటు న్నారు. వాటిని నిల్వవుంచి, నెలల తక్కువ పసివాళ్లకు పాలు తాగించి, ప్రాణ రక్షకులవుతున్నారు. అదీ సేవాతత్వమంటే!

సదా సదవగాహనే మిన్న

గర్భంతో ఉన్నప్పుడు అమ్మ జీవిత విధానమే, బిడ్డ పుట్టాక ఆ పసికందుకీ సంక్రమిస్తుంది. గర్భవతులకు ఆమేర సదవగాహన ముందుగానే కలిగేలా చక్కని శిక్షణనిస్తోంది హైదరాబాద్‌ ‌కేంద్రంగా ఉన్న ‘ఆర్యజనని’.

తల్లిపాలు తాగుతూ పెరిగే బాలల్లో వికాసం ఎక్కువ. ఆ ఇద్దరూ ఒకరికొకరుగా ఉంటుంటారు. ఆ అనిర్వచనీయ భావం గట్టి పడటానికి కీలక కారణం అమ్మపాలే! గతంలోనే 25 దేశాల్లో ఒకేసారి కొనసాగిన అధ్యయనం పలు ముఖ్యాంశాలను వెల్లడించింది.

ఒక సంవత్సరంలో, పుట్టిన గంటలోనే (గోల్డెన్‌ అవర్‌) ‌మాతృస్తన్యం దక్కని శిశువులు ఎంతమంది అంటే అక్షరాలా ఏడుకోట్ల ఎనభై లక్షలు!! తొలి గంట కల్లా తల్లిపాలు అందకుంటే ఆ పసికందు శాశ్వతంగా కన్నుమూసే అవకాశాలు ఒకటీ రెండూ కాదు. 30 శాతానికి పెరుగుతాయి. వీటన్నింటిని పరిశీలించి నప్పుడు, పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో అర్థమవుతుంది. ప్రతి సంవత్సరమూ జరిగే తల్లిపాల వారోత్సవాలు కాగితాల మీద రాతలకో, వేదికలపైన ప్రసంగాలకో పరిమితం కాకూడదు.

ప్రత్యేకించి భారతీయ కుటుంబ, సామాజిక వ్యవస్థల నేపథ్యంలో ఈ ఉత్సవాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేయాలి. నవజాత శిశువుల తల్లులకు వివరించి చెప్పడం ద్వారా, చిన్నారులకు పరిపూర్ణ ఆరోగ్య భాగ్యం కలిగి ఇళ్లల్లో నవ్వుల పువ్వులు వికసిస్తాయి. అమ్మల పరంగా, పరిపూర్ణ అవగాహన ప్రాప్తిరస్తు!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram