సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌శ్రావణ శుద్ధ  చవితి – 01 ఆగస్ట్ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌రాష్ట్రపతి పదవికి అధికార పార్టీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేసిన ఘటనలే రైసినా హిల్స్ ‌చరిత్రలో ఎక్కువ. ఆ పదవి మీద ఓ రబ్బర్‌ ‌స్టాంప్‌ అం‌టూ ముద్ర వేయడం వెకిలితనమే తప్ప పూర్తి వాస్తవం కాదు. ఆ స్థానాన్ని అత్యున్నత రాజ్యాంగ పదవిగా, చేపట్టిన వారిని ప్రథమ పౌరునిగా గౌరవించవలసిందే. అలాకాక రాష్ట్రపతులందరినీ ఒకే గాట కట్టడం వికృత చేష్ట. ప్రథమ రాష్ట్రపతి రాజెన్‌బాబు, ప్రథమ ప్రధాని నెహ్రూ మధ్య పరోక్ష యుద్ధం సాగింది. 1969లో ఆత్మ ప్రబోధం పేరుతో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని నాటి ప్రధాని ఇందిరాగాంధీయే ఓడించి, వీవీ గిరిని గెలిపించుకున్నారు. ఈ పరిణామం ఎంతవరకు పోయిందంటే, పార్టీని చీల్చింది. దేశం, దేశ నాయకత్వం సమైక్యంగా లేవన్న సంకేతాలను పొరుగు దేశానికి పంపింది. 1971లో పాకిస్తాన్‌ ‌యుద్ధానికి దిగేటంత సాహసం చేయడం వెనుక ఉన్న కారణాలలో ఇదీ ఒకటని పీవీ నరసింహారావు తన ఆత్మ కథాత్మక నవల ‘లోపలి మనిషి’లో చెప్పారు కూడా. 1975లో ఇందిరాగాంధీ తీసుకువచ్చిన అత్యవసర పరిస్థితి ఆదేశం మీద సంతకం చేసి చరిత్రలో అభాసుపాలైన రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌. ‌రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన తపాలా బిల్లును నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ ‌తిప్పి పంపారు. ఆయన సొంత పార్టీ అభ్యర్థే మరి. నాడు అదొక సంచలనం. ఏపీజే అబ్దుల్‌కలాం వంటి రాజకీయాలతో ప్రమేయం లేని కొందరూ ఎన్నికై వన్నె తెచ్చారు. రాష్ట్రపతి దేశ ఔన్నత్యానికి ప్రతీక. 14వ రాష్ట్రపతిగా జూలై 25న పదవీ విరమణ చేసిన రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ అలాంటి ఔన్నత్యానికి ప్రతిరూపం.

ప్రభుత్వంతో, ప్రధానితో విభేదాలు లేకపోవచ్చు. అయినా కోవింద్‌ ‌పదవీ కాలం (జూలై 25, 2017-జూలై 25, 2022) నల్లేరు మీద నడక కాదు. దేశ పరిస్థితులు ఆయనను ఎన్నో రాత్రులు నిద్రకు దూరం చేశాయనే అనాలి. ప్రధాని మోదీ మీద, బీజేపీ మీద దురుద్దేశాలతో విపక్షాలు చేసిన రగడ, విదేశీ శక్తులు, విధ్వంసకర శక్తులు చేసిన విన్యాసాలు కోవింద్‌ను నిరంతరం కలవరపరిచే ఉంటాయి. దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా అపహాస్యం చేయబోయిన కొందరి పైశాచికానందమూ బాధించి ఉంటుంది. ఎస్‌సీ వర్గం నుంచి వచ్చినా, ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానం విపక్షాలకు భరించరానిదే అయింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైనప్పుడు 2010 నాటి పాత వివాదం తవ్వి తీశారు. ముస్లింలు, క్రైస్తవులు విదేశాలకు చెందినవారు అంటూ ఆయన ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్య మాత్రమే అది. కోవింద్‌కు రెండోసారి అవకాశం రాలేదు. అది వేరే విషయం. అయినా చివరి క్షణం వరకు ఆయన ప్రదర్శించిన హుందాతనం, చెరగని చిరునవ్వు ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాయి.

పదవీ విమరణకు కొన్ని గంటల ముందు జాతిని ఉద్దేశించి కోవింద్‌ ‌చేసిన ప్రసంగమూ ప్రేరణదాయకమే. ఈ శతాబ్దం భారత్‌దేనంటూ గొప్ప సానుకూల దృక్పథాన్ని దేశం ముందు ఉంచి ఆయన రాష్ట్రపతి భవన్‌ ‌నుంచి నిష్క్రమించారు. యువకులు తమ మూలాలను మరచిపోరాదన్నదీ, పర్యావరణాన్ని రక్షించుకోవాలన్నదీ విలువైన సూచనలే. ప్రథమ పౌరుడిగా నేను ఇచ్చే సలహా ఏమైనా ఉన్నదీ అంటే అది ఈ దేశంలో నదులు, పర్వతాలు, అడవులు, చెట్లు కాపాడమనే చెప్పారాయన.

కేంద్ర కేబినెట్‌, ‌పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లుల మీద సంతకాలు చేయడం రాష్ట్రపతి రాజ్యాంగ విధి. ఒకవేళ తిప్పి పంపినా, పార్లమెంటు మళ్లీ ఆమోదించి పంపితే సంతకం చేయవలసిందే. ఏ రాష్ట్రపతి అయినా తన ఐదేళ్ల పదవీకాలంలో కొన్ని వందల బిల్లు మీద సంతకం చేస్తారు. కానీ, రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌కాలంలో ఆమోదించిన బిల్లులలో చరిత్రాత్మకమైనవి ఉన్నాయి. చరిత్రను తిరగరాసినవీ ఉన్నాయి. చారిత్రక తప్పిదాలను సరిదిద్దేందుకు ఉద్దేశించినవీ ఉన్నాయి. ఒకటి రెండు తప్ప ఎక్కువ బిల్లులను విపక్షాలు తమ అనవసర రాద్ధాంతానికి ఉపయోగించుకున్నాయి కూడా. బాలల ఉచిత, నిర్బంధ విద్య బిల్లు మీద (2017) సంతకం చేసినవారు కోవింద్‌. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగానికి తెచ్చిన 105వ సవరణ బిల్లు కూడా ఆయన హయాంలోనే చట్టమైంది. 12 ఏళ్ల బాలికల మీద జరిగే లైంగిక అత్యాచారాలకి మరణ దండన విధించాలన్న చట్టం ఆయన సంతకంతో (2018) వచ్చినదే. వీటన్నిటికి తలమానికమైనది 370 ఆర్టికల్‌ ‌రద్దు బిల్లు. అలాంటి చరిత్రాత్మక బిల్లు కోవింద్‌ ‌చేవ్రాలుతోనే చట్టరూపం దాల్చింది.

కోవింద్‌ ‌బీజేపీ నుంచి వచ్చారు. ఆ పార్టీకి మూలమైన భారతీయ జనసంఘ్‌ ‌కాలంలో ఏర్పరుచుకున్న విధానమే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ ‌రద్దు. 1951లో ఏర్పాటైన జనసంఘ్‌, 1977‌లో జనతాపార్టీలో విలీనమైంది. తరువాత ద్వంద్వ సభ్యత్వం వివాదంతో మాజీ జనసంఘీయులు 1980లో బీజేపీని స్థాపించుకున్నారు. కానీ తమ పాత నినాదం- ‘370 రద్దు’ను యథాతథంగా స్వీకరించారు. ఆర్టికల్‌ 370 ‌రద్దు అంటే, సంస్థానాల విలీనంతో భారత్‌ను సమైక్యం చేయాలన్న సర్దార్‌ ‌పటేల్‌ ‌కలకు పరిపూర్ణత కల్పించడమే. దేశానికి రాజకీయ ఐక్యతను అద్దడమే. ఆ పని 2019లో సాధ్యమైంది. కాబట్టి జనసంఘ్‌/‌బీజేపీ 75 ఏళ్ల కలను సాకారం చేస్తూ వచ్చిన బిల్లు మీద సంతకం చేసే మహదవకాశం, చారిత్రక సందర్భం కోవింద్‌ ‌హయానికే మకుటాయమానమైనది. ఇదే స్వతంత్ర భారత చరిత్రలో కోవింద్‌ ‌స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. ఇది చాలామందికి రుచించదు. రాజ్యాంగ విలువలను అణచివేయడంలో కోవింద్‌ ‌బీజేపీకి తోడుదొంగలా సహకరించా రంటూ మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించడం ఇందుకే. కానీ తన పదవీ విరమణ రోజునే కార్గిల్‌ ‌దివస్‌ ‌పేరుతో శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకం సాక్షిగా వైభవంగా జరిగిన సంరంభం కోవింద్‌ ‌విజయం. మెహబూబా వంటి వారికి సరైన సమాధానం.

About Author

By editor

Twitter
YOUTUBE