సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌శ్రావణ శుద్ధ  ఏకాదశి – 08 ఆగస్ట్ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌గ్రేట్‌ ‌మొగల్స్‌లో చివరివాడు ఔరంగజేబ్‌ ‌నృత్యగానాలను నిషేధించాడు. వాటి జోలికెళ్లడమంటే ఇస్లాంను వ్యతిరేకించడమేనని పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాలవాడైన ఆ పాదుషా ఫర్మానా చేసి పారేశాడు. కళలూ, రచనలూ వంటి ‘పిచ్చి’ ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే తరిమి కొట్టమని కూడా శాసించాడు. చిత్రంగా అలాంటి మధ్యయుగాల మతోన్మాద మనస్తత్త్వం ఈనాటికీ భారతదేశంలో కొందరు ముస్లిం మత గురువుల నరనరాన బుసలు కొడుతోంది. ఆగస్ట్ 1, 2022‌న, అంటే 21వ శతాబ్దంలో సరిగ్గా ఔరంగజేబ్‌ ‌మాటలనే యథాతథంగా వల్లించారంటే ఆ ధోరణిని మరొక రకంగా అర్థం చేసుకునే అవకాశం లేదు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సవాన్‌, ‌కన్వార్‌ ‌యాత్రను ఒవైసీ వంటివారు వివాదాస్పదం చేయడానికి శతథా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ భక్తుల మీద చల్లడానికి ప్రభుత్వం పూలను సరఫరా చేయిస్తుంది కానీ, ముస్లింల మీదకు బుల్డోజర్లు పంపుతుందని వ్యాఖ్యానించాడీ ప్రబుద్ధుడు. మరి హజ్‌ ‌యాత్ర పేరుతో మైనారిటీల తీర్థయాత్రకు పోస్తున్న ధనం సంగతేమిటని జనం నిలదీయవలసి వచ్చింది. ఆ వివాదం అక్కడితే ఆగిపోలేదు. సవాన్‌, ‌కన్వార్‌ ‌యాత్ర సందర్భంగానే ‘హరహర శంభు’ అన్న మకుటంతో ఒక పాట విడుదలయింది. ఆ పాటను ఆ పరమేశునికే అంకితం చేశారు కూడా. కానీ ఆ పాట పాడిన గాయని ఒక ముస్లిం మహిళ. అదే ముస్లిం మతగురువులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇండియన్‌ ఐడల్‌ 12 ‌పోటీతో పేర్గాంచిన ఫర్మనీ నాజ్‌ ఈ ‌పాట పాడి, శంకరుడికి అంకితం చేయడాన్ని ఆసరా చేసుకుని మరొక వివాదాన్ని దేశం మీదకు వదలడానికి మతోన్మాద మత గురువుల• ప్రయత్నించారు. జూలై 24న శ్రావణమాసం నేపథ్యంలో యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటను తొమ్మిది లక్షల మంది వీక్షించారట.

ప్రముఖ దేవబంద్‌ ‌ముస్లిం ఆధ్యాత్మిక కేంద్రం ఉలేమా మౌలానా ముఫ్తి అసద్‌ ‌ఖాజ్మీ ఏ రూపంలో ఉన్నా నృత్యం, గానం ఇస్లాంలో నిషిద్ధం అన్నారు. ఆ మహిళ (నాజ్‌) ‌పాట పాడడం నిషిద్ధం అని కూడా తేల్చేశారు. లౌక్యం ప్రదర్శిస్తున్నానని అనుకుంటూనే, ఔరంగజేబ్‌ ఆత్మను ఆవహింప చేసుకున్నారు. అసలు ఆ పాట అని మాత్రమే కాదు, ఏ పాట పాడడమైనా ఇస్లాంకు వ్యతిరేకమే. ఏ నృత్యమైనా మా మతంలో నిషిద్ధమేనని తీర్పు ఇచ్చారు. ‘ముఖ్యంగా ఒక మహిళ, తనను తాను ముస్లింగా పరిగణించుకుంటున్న మహిళ ఇలాంటి పాటలు పాడడం దగ్గర సంయమనం పాటించాలి’ అంటూ మనసులో ఉన్న అసలు విషయం, దాంతో పాటు కాస్త విషం కక్కారు. ఇలాంటి కళాపోషణ వ్యవహారాలను బహిష్కరించమంటూ పనిలో పనిగా అశేష ముస్లిం జనాభాకు కూడా పిలుపు ఇచ్చారు. ఎందుకంటే ఏ పాట అయినా, గానకళ అయినా ఇస్లాంకు ‘చేటు’ అని ప్రకటించారు. ఈయనే కాదు, కొందరు ఇతర ముస్లిం మత పెద్దలు కూడా ఈ పాటే పాడారు. ఆ పాత పాటకి బాణీ, విద్వేషపు శ్రుతీ మారలేదు.

కానీ హిందువులు! ముస్లిం పాడిన ఈ పాట మనం వినడమేమిటనో, ఆమె నోట శంకరుని నామమేమిటనో, మనోభావాలు మంటగలిశాయనో గోల పెట్టలేదు. ఏ మఠాధిపతి చీదరించుకోలేదు. నాజ్‌ ‌విమర్శకుల కళ్లు తెరిపించే సమాధానమే ఇచ్చారు. గానానికీ, సంగీతానికీ మతం లేదు. మాస్టర్‌ ‌సలీం, మహ్మద్‌ ‌రఫీ వంటి మహా గాయకులు ఏనాడో భజన్స్ ‌గానం చేశారు. దయచేసి గాయకులనీ, గానాన్నీ మతంతో ముడిపెట్టవద్దు అని చెప్పారామె. ఇంకా, ‘నేను పాట పాడుతుంటే సర్వం మరచిపోతాను. నేను •వ్వాలీలు కూడా పాడతాను.’ అని గుర్తుచేశారు కూడా. విషాదం ఏమిటంటే, ఈమెకు దురదృష్టవశాత్తు పుట్టుకతోనే కొన్ని రుగ్మతలు ఉన్న కొడుకు పుట్టాడు. దానితో భర్త వదిలేసి పోయాడు. 2017లోనే ఆమెకు వివాహం అయింది. ఇప్పుడు ఒంటరి. ఆ విషయం మాత్రం మతపెద్దల దృష్టికి రాలేదు. భర్త పలాయనం చిత్తగించిన తరువాతే ఆమె పాటతో బతుకు వెళ్లదీస్తున్నది.

మీరు మతం మారి ఉండవచ్చు. కానీ మీ జీవన విధానం ఈ మట్టితోనే ముడిపడి ఉంది అని ముస్లింలకు వీఎస్‌ ‌నయీపాల్‌ ‌వంటి నోబెల్‌ ‌బహుమతి గ్రహీతలు తమ రచనలతో సున్నితంగా హెచ్చరించారు. దేశం హిందూ భారత్‌, ‌ముస్లిం పాకిస్తాన్‌గా విడిపోయిన రెండు మూడు దశాబ్దాల వరకు ఏ పండుగనయినా హిందువులు, ముస్లింలు కలిసే చేసుకున్నారు. ఈ సుహృద్భావ వాతావరణాన్ని ముస్లిం మతోన్మాదులు, కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, ఇటీవలి స్వయం ప్రకటిత మేధావులు దిగ్విజయంగా నాశనం చేశారు. హిందువుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టమని ఈ మధ్య అజ్మీర్‌ ‌దర్గా మత పెద్ద వీరావేశంతో చేసిన ప్రకటనతో మరింత దూరం పెరిగింది. చాలా దర్గాలను హిందువులే బహిష్కరించారు. గానం, నృత్యం, చిత్రకళ, శిల్పం, ఇంకా ఎన్నో ఈ మట్టిలో అంకురించిన కళారూపాలు. ఈ నేల వరకు కళ భగవదానుగ్రహం పొందడానికి ఒక సాధనం. త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు వంటి వైతాళికులు తమ కళే దైవ సాన్నిథ్యాన్ని ప్రసాదించిందని భావించారు.

సంగీతం, పాటల మీద వేటు వేయడానికి జరుగుతున్న ప్రయత్నం కాబట్టి, ఆ రకంగా ఇస్లాంను అందరి మీదా రుద్దే యత్నం కనిపిస్తున్నది కాబట్టి ఒక్క సంగతి గుర్తు చేసుకుందాం. బిస్మిల్లాఖాన్‌… ‌భారతదేశం గర్వించదగిన సంగీత విద్వాంసుడు. సంగీత ప్రపంచం ఉస్తాద్‌ అని గౌరవిస్తుంది. జాతి భారతరత్న ఇచ్చి సత్కరించింది. ఆయన స్వస్థలం కాశీ నగరం. ఆయన అన్నారు, నేను అన్నపూర్ణ గుడిలో షెహనాయి నేర్చాను, ఆ అమ్మ కృప అని. ఒకసారి ఎవరో మీరు అమెరికా వచ్చేయండి అంటే, ‘అక్కడ గంగ లేదు కదా!’ అని సమాధానం ఇచ్చారు. ఈ మట్టి వాసన ఇప్పుడు ఎందుకు గుబాళించడం లేదు?

About Author

By editor

Twitter
Instagram