సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ఆషాడ  బహుళ ద్వాదశి – 25 జూలై 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌కళ, కళా విమర్శ పేరుతో దేశం మీద, మెజారిటీ ప్రజల మనోభావాల మీద ఎంత బురదయినా చల్లవచ్చా? సినిమాలలో వాస్తవికత పేరుతో కొద్దికాలం అత్యంత అవమానకరమైన దృశ్యాలను చొప్పించారు. భారతీయ జీవన విధానాన్ని సిద్ధాంతాల ముసుగులో, విజ్ఞానశాస్త్రం పేరుతో వక్రీకరించే ప్రయత్నమే అదంతా. ఇప్పుడు, అసలు హిందూ జీవిత చిత్రణే అవాంఛ నీయమన్న ధోరణికి వచ్చారు. ఒక సిద్ధాంతాన్ని రుద్దే క్రమంలో సినిమాలు తీసేవాళ్లూ, వాటిని అదే సిద్ధాంత చట్రంలో ఇమడ్చే ప్రయత్నంతోనే విమర్శ రాసే వాళ్లూ భారతీయతను భారతీయతగా చూపిస్తే దానికి మౌఢ్యమనో, చాదస్తమనో ముద్ర వేస్తున్నారు. ఇండియన్‌ ‌స్పేస్‌ ‌రిసెర్చ్ ఆర్గనైజేషన్‌ (ఇ‌స్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ ఈ ‌మధ్య చేసిన వ్యాఖ్యలు సరిగ్గా దీనికే అద్దం పడుతున్నాయి.

‘కొన్ని కొన్ని సమయాలలో హాస్యాస్పదమనిపిస్తుంది. మీకు తెలుసు కదా! నంబి నారాయణన్‌ను (సినిమాలో) హిందువుగా చూపించారనీ, ఆయన పూజ చేస్తున్నట్టు చిత్రించడమేమిటనీ, సుప్రభాతం చదువుతున్నట్టు, అలాంటి మత కార్యకలాపాలేవో చేస్తున్నట్టు చూపించాలా అనీ వాళ్లు అంటున్నారు. హిందూత్వం చూపేందుకూ, హిందుత్వం (ప్రచారం) కోసమే ఇదంతా చిత్రించారని చెబుతున్నారు.’ ఇదీ నంబి నారాయణన్‌ ఈ ‌మధ్య ఒక ప్రత్యేక సందర్భంలో చేసిన వ్యాఖ్య. ఆయన హాస్యాస్పదం అన్నదీ ఈ ధోరణినే. దీనికి కొసమెరుపు- ‘నేను ఒకటి అడగదలుచుకున్నాను. నేను హిందువునే. అంటే నా ఉద్దేశం, నేను హిందువును అని చెప్పుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడను అని. ఏమి? హిందువుగా పుట్టడం తప్పా?’ అంటూ ఈ విమర్శల నేపథ్యంలో నిలదీశారాయన. తాను హిందువును కాబట్టి హిందువుననే చెప్పాననీ, క్రైస్తవుడిననో, మహమ్మదీయుడిననో చెప్పలేను కదా అని కూడా ఆయన అన్నారు.

‘రాకెటరీ: ది నంబి ఎఫెక్ట్’ అన్న చిత్రం మీద విమర్శలకు ఆ మహోన్నత శాస్త్రవేత్త ఇచ్చిన సమాధానమిది. ప్రఖ్యాత తమిళ చలనచిత్ర నటుడు, దర్శకుడు ఎ. మాధవన్‌ ఈ ‌చిత్రాన్ని నిర్మించారు. జూలై 1న విడుదలైంది. అంతకు ముందే కేన్స్ ‌చలనచిత్రోత్సవాలకూ ఎంపికైంది. నంబి నారాయణన్‌ ‌జీవిత ఘట్టాల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో మాధవన్‌ ‌నాయక పాత్ర కూడా పోషించారు. మీనా నారాయణన్‌ (‌సిమ్రన్‌), ‌విక్రమ్‌ ‌సారాభాయ్‌ (‌రజిత్‌ ‌కపూర్‌), ఏపీజే అబ్దుల్‌కలాం (అమాన్‌) ‌వంటి నంబి సమకాలిక శాస్త్రవేత్తలు, భారత రాకెట్‌ ‌సాంకేతిక పరిజ్ఞానానికి ఆద్యులు కూడా ఇందులో పాత్రలుగా దర్శనమిస్తారు. నంబి నారాయణన్‌తో పాటు ప్రఖ్యాత నటులు షారుఖ్‌ఖాన్‌, ‌సూర్య అతిథి పాత్రలలో కనిపిస్తారు.

ఈ చిత్రం నిజంగా స్వాగతించదగినదన్న సద్విమర్శలు ఉన్నాయి. చలనచిత్ర రంగానికి ఇది మాధవన్‌ ‌చేసిన గొప్ప సేవ అని కూడా వ్యాఖ్యలు వచ్చాయి. కానీ చిత్ర నిర్మాణంలో ఇవీ లోపాలంటూ వచ్చిన విమర్శలో స్పష్టమైన కుట్ర ఉందని అనిపిస్తుంది. ఈ విమర్శల ప్రహసనంలో రెండు విషయాలు కనిపిస్తున్నాయి. నంబి నారాయణన్‌ ఆధునిక భారతదేశంలో ఒక సమున్నత శాస్త్రవేత్త. ప్రిన్స్‌టన్‌ ‌విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రపంచ ప్రఖ్యాత నాసాలో ఫెలోషిప్‌ ‌చేశారు. 1966లో తుంబా రాకెట్‌ ‌ప్రయోగ కేంద్రంలో శాస్త్రవేత్తగా జీవితం ప్రారంభించారు. వికాస్‌ ‌రాకెట్‌ ఇం‌జన్‌ అభివృద్ధి చేసినవారు ఆయనే. భారత్‌ ‌ప్రయోగించిన మొదటి పీఎస్‌ఎల్‌వీలో ఉపయోగించిన ఇంజన్‌ అది. కానీ మాల్దీవులకు చెందిన ఇద్దరు స్త్రీల వలలో పడి మన క్రయోజనిక్‌ ‌సాంకేతిక పరిజ్ఞానాన్ని విదేశాలకు అమ్మేశారన్నది ఆయన మీద ఆరోపణ. 1994లో అరెస్టు చేసి జైలుకు పంపారు. సామాజిక బహిష్కరణ చేశారు. ఈ కేసును 1996లో సీబీఐ కొట్టి పారేసింది. ఆయన మీద దర్యాప్తును సుప్రీంకోర్టు ఆదేశాలతో కేరళ ప్రభుత్వం నిలిపివేసింది. ఇదంతా ఒక కుట్రని రుజువై, ఆయనకు యాభయ్‌ ‌లక్షల పరిహారం ఇవ్వవలసిందని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మరొక కోటీ ముప్పయ్‌ ‌లక్షలు కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కానీ ఈ దురదృష్టకర పరిణామంతో భారత రాకెట్‌ ‌సాంకేతిక పరిజ్ఞానం కొన్నేళ్లు వెనక్కి పోయిందని చెబుతారు. అదీకాక ఒక అమాయకుడిని దారుణమైన మానసిక క్షోభకు గురి చేయడం, తన వృత్తికీ, కుటుంబానికీ దూరం చేయడం పరమ కిరాతకంగా జరిగిపోయాయి. కేరళ కమ్యూనిస్టు నాయకులు, కాంగ్రెస్‌ ‌నాయకులు, వీళ్ల తొత్తులైన కొందరు పోలీసు అధికారులు కలసి స్వతంత్ర భారత్‌ ‌సిగ్గుపడే ఆ దురంతానికి పాల్పడ్డారు. ఇంతకీ క్రయోజనిక్‌ ‌పరిజ్ఞానం ఇది జరిగిన పదేళ్ల తరువాత భారత్‌కు వచ్చింది. అంటే ఒక కుట్రతో ఒక జాతి శాస్త్ర పురోగతిని కర్కశంగా నులిమివేసిన సందర్భం.

ఇవన్నీ వదిలేసి నంబిని గుడిలో చూపించడమేమిటనీ, సుప్రభాతం చదివినట్టు చిత్రించడమేమిటనీ ప్రశ్నించే వాళ్ల వ్యక్తిత్వాన్నీ, ఉద్దేశాన్నీ శంకించవలసిందే. తనను తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆదరించా రని కూడా నంబి చెప్పారు (2019లో పద్మభూషణ్‌ ‌పురస్కారం ఇచ్చారు). ఈ కేసు నుంచి విముక్తం చేయడంలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ ‌కూడా తోడ్పడ్డారని గుర్తు చేసుకున్నారు. అంతమాత్రానే తనను కమ్యూనిస్టు అంటారా అని అడిగారు. నుదుట తిలకం కనిపిస్తే, ఆలయంలో ముకుళిత హస్తాలతో కనిపిస్తే, గొంతులో సుప్రభాతం లేదా లలితా సహస్రనామాలు వినిపిస్తే ఆ దృశ్యాలలో కొందరు మేధావులు చాదస్తాన్ని ఎందుకు చూడవలసి వస్తున్నది? అవన్నీ ఈ దేశంలో మెజారిటీ ప్రజల జీవనవిధానంలో భాగం. వాటిని ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించే వాళ్లని, అసలు మీ నిజరూపం ఏమిటో బయట పెట్టమని దేశప్రజలు ప్రశ్నించాలి.

About Author

By editor

Twitter
Instagram