తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వ్యవహారశైలి, జూలై 10న ప్రగతిభవన్‌లో పెట్టిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాల నేపథ్యంలో మీడియాకు సమాచారమిచ్చిన కేసీఆర్‌.. ‌సమావేశంలో ఆ విషయాన్ని పక్కనపెట్టి రాజకీయ విమర్శల ‘వర్షం’ కురిపించారు. మొదట్లో నాలుగైదు మాటలు మినహా దాదాపు రెండున్నర గంటల పాటు ‘రాజకీయ తిట్ల’కే ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయంగా అనే కన్నా.. బీజేపీ మీదే, ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీ మీదే విమర్శలు గుప్పించేందుకు ఆ సమయాన్ని వెచ్చించారు. దీంతో, నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన వైనాన్ని విపక్షాలు గుర్తుచేసుకుంటున్నాయి.

కేసీఆర్‌ ‌మీడియా సమావేశంలో.. కొద్ది రోజులుగా రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలపై ఆయన అసహనం స్పష్టంగా కనిపించిందంటున్నారు విశ్లేషకులు. అందుకే పదే పదే ప్రధాని మోదీ పైనా, ఇతర బీజేపీ నాయకుల పైనా విరుచుకుపడ్డారని, తనలో ఉన్న అసహనాన్ని వ్యక్తంచేశారని అభిప్రాయపడుతున్నారు. అధికార పీఠం ఎక్కడ చేజారుతుందో అన్న బెంగ, భయం ఆయన ముఖంలో ప్రస్ఫుటమయ్యాయని కూడా అంటున్నారు.

కేసీఆర్‌ ‌రాజకీయ వ్యూహాల గురించి రాష్ట్ర నాయకులకు, ముఖ్యంగా టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులందరికీ తెలుసు. ఆయన చాతుర్యం, రాజకీయ చాణక్యం, సమయానుకూలంగా ప్రవర్తించే తీరు, సందర్భానుసారంగా మీడియాను పిలిచి మరీ తాను చెప్పాలనుకున్నది, జనం వినాలనుకునే రీతిలో చెప్పడంలో కేసీఆర్‌ ‌దిట్ట. సొంతపార్టీ నేతలే కాదు.. ఇతర పార్టీల నాయకులు కూడా దీన్ని తోసిపుచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జూలై 10, ఆదివారం ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చారు. అప్పటికప్పుడు మీడియా సమావేశం అని సమాచారమిచ్చారు. అయితే, రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలు, పొంచి ఉన్న ముప్పుపై కేసీఆర్‌ అ‌ప్రమత్తం చేస్తారని అందరూ అనుకున్నారు. ప్రెస్‌మీట్‌ ‌ప్రారంభమయ్యే కొంచెం ముందు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో విద్యాసంస్థలకు వచ్చే మూడురోజుల పాటు సెలవు ప్రకటించారు. ఎడతెరిపిలేని వర్షాలకు ఇళ్లకే పరిమితమైన జనమంతా టీవీల ముందుకు చేరారు. అప్పటికే చిన్నారులను స్కూళ్లకు పంపడం ఎలా అని ఆలోచిస్తున్నవాళ్లకు ప్రభుత్వం నిర్ణయం ఊరట నిచ్చింది. దీంతో, కేసీఆర్‌ ఇం‌కేం చెబుతారో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, ఒకటీ రెండు నిమిషాలకే ఆ అంచనాలన్నీ తుస్సయ్యాయి. మీడియా సమావేశం మొత్తం బీజేపీని తిట్టేందుకే వినియోగించుకున్నారు. అయితే, ఆ ప్లాన్‌ ‌బూమ రాంగ్‌ అయ్యిందని, ఆయనలోని ఆందోళన ప్రజలం దరికీ తెలిసిందన్న అంచనాలు బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

ఏక్‌నాథ్‌ ‌షిండేలంటే భయమెందుకు?

కేసీఆర్‌ ‌ప్రెస్‌మీట్‌లో కేవలం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఇతర నాయకులను విమర్శించేందుకు, దూషించేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి ఆ లక్ష్యంతోనే మీడియా ముందు విరుచుకుపడాలంటే.. బీజేపీ బహిరంగ సభ నిర్వహించిన మరుసటిరోజో, ఆ తెల్లవారో వచ్చే అవకాశం ఉంది. కానీ, బీజేపీ సభ జరిగిన సరిగ్గా వారం తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చారు. అది కూడా వర్షాలను ఆసరాగా చేసుకొన్నారు. అంతేకాదు, కేసీఆర్‌ ఉన్నట్టుండి ప్రెస్‌మీట్‌ ‌పెట్టడానికి ఒక్క పేరే ప్రధాన కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఆ ఒక్కపేరు కేసీఆర్‌ను బాగా డిస్టర్బ్ ‌చేసిందని, అందుకే తాను మీడియాతో లైవ్‌లో మాట్లాడిన రెండున్నర గంటల్లో కనీసం 50 సార్లు ఆ పేరును నెమరేసుకున్నారని ఆయన ప్రసంగాన్ని విన్న వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆ పేరే ఏక్‌నాథ్‌ ‌షిండే. మహారాష్ట్రలో ఇటీవలి పరిణామాలన్నీ ఆ పేరు చుట్టూనే తిరిగాయి. ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చేసిన వ్యక్తి ఆయన. అధికారపక్షంలో ఉంటూనే రహస్యంగా భారతీయ జనతాపార్టీతో జట్టుకట్టి.. ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏక్‌నాథ్‌ ‌షిండే. అయితే, టీఆర్‌ఎస్‌లోనూ ఏక్‌నాథ్‌ ‌షిండేలు ఉన్నా రని, బీజేపీ ముఖ్యనేతలు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌కు షాకిచ్చినట్లు అర్థమవుతోంది. అందుకే ఏక్‌నాథ్‌ ‌షిండేను తనదైన శైలిలో ఏకిపారేశారు కేసీఆర్‌. ‌చాలా విషయాల్లో మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన కేసీఆర్‌.. ‌మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండేపై ఒంటికాలుపై లేచారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రేపై ప్రేమ కురిపించారు. తన ప్రభుత్వంలో షిండేలు ఎవరూ లేరని చెప్పుకున్నారు. చెప్పుకున్నారనే కంటే తనకు తాను సర్దిచెప్పుకున్నారని అనుకోవాలి. వాస్తవానికి ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రతి స్థాయిలోని నాయకులనూ తన అదుపాజ్ఞల్లో పెట్టుకోవడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. వాళ్లందరి మీదా నిఘా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. దీంతో, పార్టీలోగానీ, ప్రభుత్వంలో గానీ చీమ చిటు క్కుమన్నా కేసీఆర్‌కు తెలిసిపోతుంది. అలా.. కేసీఆర్‌ ‌మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత మొదలవుతుందన్న సంకేతాలు రాగానే.. ముందుజాగ్రత్త పడ్డారు. ఎవరూ ఊహించని రీతిలో అప్పటికప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే.. దుబ్బాక, హుజురాబాద్‌, ‌జీహెచ్‌ఎం‌సీ ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ముఖ్యంగా కేసీఆర్‌కు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లుగా చేశాయి. ఇక అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా కేసీఆర్‌ ‌ప్రతిపక్షాలను ముఖ్యంగా బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్‌ ‌చేస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను కూడగట్టే పనిలోకి దిగారు. గల్వాన్‌ ‌సైనికులకు, ఉద్యమంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి తెర లేపారు. పంజాబ్‌, ‌ఢిల్లీ చుట్టి వచ్చారు. కర్ణాటక కూడా వెళ్లారు. మధ్యలో చర్నా కొరాటా లిఫ్ట్ ‌కోసం మహారాష్ట్ర వెళ్లారు. కేసీఆర్‌ ‌వెళ్లగానే అప్పటి సీఎం ఉద్ధవ్‌ ‌భారీ స్వాగతం చెప్పారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్‌, ఉద్ధవ్‌ ‌మధ్య స్నేహబంధం మొదలయింది. ఇదే తరుణంలో ఏక్‌నాథ్‌ ‌షిండే రూపంలో ముసలం పుట్టి ఉద్ధవ్‌ ‌రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా కేసీఆర్‌ ఓ ‌మిత్రుడిని కోల్పోయారు. అంతేకాదు.. ఏక్‌నాథ్‌ ‌షిండే వెనక బీజేపీ నిలవడం, దగ్గరుండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడంతో ఆ ఆగ్రహాన్ని కేసీఆర్‌ ఈ ‌రూపంలో వెళ్లగక్కారు.

టీఆర్‌ఎస్‌లోనూ షిండేలు!: సంజయ్‌

‌కేసీఆర్‌ ‌ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తూర్పార బట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ‌దిగజారి మాట్లాడారని మండిపడ్డారు. ఆయన పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, అందుకే తీవ్ర అసహనానికి లోనవుతు న్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాము నిజాయి తీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. తాము తలచుకుంటే, చక్రం తిప్పాలని అనుకుంటే సీఎం పదవి తీసుకుని ఉండే వాళ్లమన్నారు. కానీ డిప్యూటీ సీఎం పదవికే పరిమితమైనట్లు చెప్పారు. ఇక, టీఆర్‌ఎస్‌లో ఏక్‌నాథ్‌షిండేలు చాలామంది ఉన్నారని, కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యుల్లోనూ ఏక్‌నాథ్‌షిండేలు ఉండొచ్చని బండి సంజయ్‌ ‌బాంబు పేల్చారు. సొంత పార్టీ మనుగడపై కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‌పేర్లు వింటేనే కేసీఆర్‌కు నిద్రపట్టట్లేదని, అందుకే ఇన్ని రోజుల తర్వాత ఫామ్‌హౌస్‌ ‌నుంచి బయటికొచ్చాక కూడా మోదీపై విమర్శలకు పరిమితమయ్యారని విమర్శించారు. ప్రధాని మోదీని గౌరవించలేని కుసంస్కారి కేసీఆర్‌ అని, మోదీని ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడడాన్ని ఖండిస్తున్నా మని, మేం కూడా మీరు మాట్లాడే భాషనే ఉప యోగిస్తే కేసీఆర్‌ ‌ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అని బండి మండిపడ్డారు. కేసీఆర్‌.. ‌మోదీని ఎద్దేవా చేస్తూ తెలంగాణ దేవాలయాల పేర్లు చదివిన సందర్భంలో ‘జోగులాంబ.. ఆ అంబ.. ఈ అంబ..’ అని వ్యాఖ్యా నించడం హిందూ దేవతలను అవమానించినట్లేనని, ఇందుకు హిందువులకు క్షమాపణలు చెప్పాలన్నారు. అంతేకాదు, కేసీఆర్‌ ‌తాజా ప్రెస్‌మీట్‌ ‌వెనుక మరో కోణం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో పోడు రైతులపై అటవీ అధికా రుల దాష్టీకానికి సంబంధించిన వీడియోలు సామా జిక మాద్యమాల్లోనూ వైరల్‌గా మారాయి. దీంతో ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ సమా వేశం నిర్వహించారన్న ప్రచారం కూడా జరిగింది.

రాజకీయాల్లో ప్రతిపక్షాలు అత్యంత ఆవశ్యకం. అవి ఉంటేనే ప్రజా సమస్యలు బయటపడతాయి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించొచ్చు. అలాగే అధికార పార్టీలకు కూడా కాస్త భయం ఉంటుంది. కానీ, కొన్నేళ్లుగా తెలంగాణలో రాజకీయాలు మారిపోయాయి. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు, తమ అధికార బలాన్ని ఉపయో గించి ప్రతిపక్షాలను లేకుండా చేసేందుకు చూస్తోంది. టీఆర్‌ఎస్‌ ‌ప్రతిపక్షాలను ఎంతగా తొక్కేయాలని చూస్తున్నా సరే ప్రజలే ప్రతిపక్షాలకు తావు కల్పిస్తు న్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. అసలు రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం ఉండకూడ దనుకున్న కేసీఆర్‌.. ‌కాంగ్రెస్‌, ‌టీడీపీలపై దెబ్బ కొట్టారు. కేసీఆర్‌ ‌దెబ్బకు టీడీపీ ఉనికి కోల్పోయింది. కాంగ్రెస్‌ ‌పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడే పరిస్థితికి చేరింది. దీంతో ఓ దశలో కేసీఆర్‌కు తిరుగే లేదనే పరిస్థితి నెలకొంది. ఫలితంగా టీఆర్‌ఎస్‌ది ప్రజా స్వామ్య ప్రభుత్వం అనే కన్నా.. ఏకపక్ష పాలన అన్న పేరు తెచ్చుకుంది. అయితే, కేసీఆర్‌ ‌చేసిన పనులు, ఆయన వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలే అప్రమత్తం అయ్యారు. భారతీయ జనతాపార్టీకి అండగా నిలి చారు. బలమైన ప్రతిపక్షంగా మార్చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. క్షేత్రస్థాయిలో ముఖ్యనేతలంతా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. కమలదళం వెనక్కి తగ్గకుండా పనిచేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో కమలం వికసించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram