భాగ్యనగరితో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఆషాడ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. కొవిడ్‌ ‌కారణంగా రెండేళ్లు సీదాసాదాగా జరుపుకున్న సంబరాలను ఈ ఏడాది అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. ఈ నెల (జూలై) మొదటి ఆదివారం గోల్కొండ జగదంబిక ఆలయంలో ప్రారంభమైన బోనాలు, రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, మూడవ ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. నాలుగవ ఆదివారం పాతబస్తీ లాల్‌ ‌దర్వా మహంకాళి అమ్మవారి సన్నిధిలో సంబరాలతో బోనాలు ముగుస్తాయి. పల్లెలలో మఖ కార్తెలో బోనాలు జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రభుత్వం దీనికి ‘రాష్ట్ర ఉత్సవం’ హోదా కల్పించి, నిర్వహిస్తోంది. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఏటా బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.


ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం. ప్రకృతిశక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతం పేర్కొంటోంది. పరమాత్మను జగత్పతిగా, ప్రకృతిని విశ్వమాతగా ఆరాధిస్తారు. ప్రకృతి తల్లిలాంటిది. ఆ తల్లి ఒడిలో సేదతీరాలంటే ఆమెను పూజించాలి. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. మానవ మనుగడకు అదే శ్రీరామరక్ష. అందుకు భిన్నంగా వ్యహరించినప్పుడు, ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరిణామాలు ఎదురుకాక తప్పదు. వాటిని అధిగమించే క్రమంలో, అనంత కాలవాహినిలో మారుతున్న రుతువులు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామదేవతలను వేడుకుంటూ జరుపుకునే పండుగే బోనాలు. ప్రత్యేకించి తెలంగాణ జానపద సంస్కృతి పర్వదిన త్రయంలో ఇది ఒకటి కాగా, బతుకమ్మ రెండవది, సమ్మక్క సారలమ్మ జాతర (ఇది రెండేళ్లకు ఒకసారి వస్తుంది) మూడది. బోనాలు సంబరాలను హైదరా బాద్‌- ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో ఆషాడంలో జరుపుకుంటే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో శ్రావణంలో నిర్వహిస్తారు. ఏటా ఆషాడ మాస తొలి ఆదివారం బోనాల జాతర మొదలై ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది. మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయం (ఎల్లమ్మ)లో, ఆ తరువాత వరుసగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజలోని మహంకాళి ఆలయంలో నాలుగవ ఆదివారంతో జాతర పరిసమాప్తమవుతుంది. ఈ ప్రధాన ఆలయాలతో పాటు వాడవాడలా కొలువై ఉన్న గ్రామదేవతలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పించుకుంటారు. గ్రామదేవతలను ఆషాడం అతిథులుగా ఆరాధించే సంప్రదాయం తెలంగాణలో కొనసాగుతోంది’ అని పాల్కురికి సోమనాథుడు తమ ‘పండితారాధ్య చరిత్ర’లో పేర్కొన్నారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ… ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు.

ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రామదేవతలను దేవీ భాగవతం పేర్కొంటోంది. శ్రీమాత సకల జగత్తును తన ఉదరమనే అమృత భాండంలో నిక్షిప్తం చేసుకుందని, అందుకు సంకేతంగా అన్న పదార్థాలను మట్టి కుండలలో వండి ‘బోనాలు’ గా సమర్పిస్తారని చెబుతారు. ‘మన శరీరం బోనపు కుండకు ప్రతీక అనుకుంటే కుండలోని అన్నం జీవశక్తికి సంకేతం. కుండపై వెలిగే దీపం ఆత్మజ్యోతి. ఈ ఆత్మజ్యోతిని పరంజ్యోతితో మమమేకం చేయాలన్నది బోనాలు సంబరాల ఆంతర్యం’ అని ఆధ్యాత్మికవాదులు విశ్లేషిస్తారు.

బోనాలు చరిత్ర

లోకకల్యాణం, సకల జనసంక్షేమం ఆషాడ బోనాల అంతరార్థం. అలాంటి బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉందని తెలుస్తోంది. ప్రకృతిశక్తి ప్రసాదితాలైన సస్యాలు, ధాన్యాది శాకాలను ఆమెకే సమర్పించి కృతజ్ఞతను చాటుకోవడమే బోనాలు పరమార్థమనీ చెబుతారు. ఆరు వందల ఏళ్ల క్రితం పల్లవ రాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందిందని ప్రతీతి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏడు కోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి, బోనాలు సమర్పించారట. ‘ఆ గంగకున్‌, ‌వెలయున్‌ ‌వేటలు /బోనముల్‌ ‌సిరులు కావించెన్‌ ‌సుతోత్పత్తికై….’ (కుమారుడు పుట్టాలని కోరుతూ గంగమ్మకు బోనాలు సమర్పించారు) అని ‘హంసవింశతి’ కావ్యంలోని పద్యంలో బోనాల ప్రస్తావన ఉంది. కాకతీయుల కాలంలో రుద్రమదేవి తమ ఇలవేల్పు ‘కాకతి’కి బోనాలు పేరుతో అన్నపురాశులను సమర్పించారని జాయపసేనాని ‘నృత్యరత్నావళి’ చెబు తోంది. రెండవ ప్రతాపరుద్రుడి హయాంలో ఆషాడ బోనాల సందర్భంలో అన్న సంతర్పణ అవిచ్ఛిన్నంగా సాగిందని చరిత్ర చెబుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలోని హుస్నాబాద్‌లో సర్వాయి పాపన్న 1676లో ఎల్లమ్మ గుడి కట్టించి, ఆమెకు బోనాలు సమర్పించినట్టు కైఫీయతుల్లో, గౌడనాడులు గ్రంథంలో ఉంది. ఇక భాగ్యనగరం విషయానికి వస్తే 1869లో ప్లేగు వ్యాధి ప్రబలి పెద్ద సంఖ్యలో ప్రాణనస్టం వాటిల్లింది. అందుకు దైవాగ్రహం కారణంగా భావించిన ప్రజలు, ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేందుకు గ్రామదేవతలను శాంతపరచడమే శరణ్యంగా భావించారట. అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా ఆరాధిస్తూ, ఆమెను ప్రసన్నం చేసుకొనే క్రమంలో ఈ జాతరను మరింత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తూ వస్తున్నారు.

బోనమంటే….

అమ్మవారికి భక్తితో సమర్పించే పప్పు అన్నాన్ని బోనం అంటారు. ఇది భోజనం అనే మాట నుంచి వచ్చింది. ‘భోజనం’ ప్రకృతి కాగా, ‘బోనం’ వికృతి అని చెబుతారు. వేకువజామునే తలస్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి కొత్తకుండలో బియ్యం, పాలు, నెయ్యి, చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. మట్టి లేక రాగి పాత్రలో వండుతారు. ఈ పదార్థాలతో కూడిన నైవేద్యంతో పాటు భక్తులు తమ మొక్కుబడులకు అనుగుణంగా కూడా ప్రసాదాలు తయారు చేస్తారు. పలానా పదార్థాలతో నైవేద్యం పెడతామని మొక్కుకుంటే వాటితోనే చేస్తారు. నైవేద్యం ఏదైనా దానితో పాటు ‘సాకర’ (చెట్టుకొమ్మ)ను సమర్పిస్తారు. కొత్త కుండకు సున్నం రాసి, చుట్టూ పసుపు, కుంకుమతో అలంకరించి, దానిపై దీపం (గండ దీపం) ఉంచి, తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో ఆలయానికి వెళతారు. అక్కడ ఏడు ప్రదక్షిణలు చేసి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.కొంత ప్రసాదాన్ని ఇళ్లకు తెచ్చుకొని ఇరుగుపొరుగులకు పంచుకుంటారు. అమ్మవారు ‘చిత్రాన్నప్రియ’ అని స్తోత్రాలు చెబుతున్నందున ఆ తరహా నైవేద్యాలూ సమర్పిస్తారు. స్త్రీ శక్తికి ప్రతిరూపం. సంప్రదాయానికి చిహ్నం. అందుకే ఈ బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనం తలకెత్తుకున్న వారిని ‘అమ్మశక్తికి ప్రతీకగా భావించి, భక్తులు బోనమెత్తిన వారి పాదాలను కడుగుతారు. బోనాన్ని సమర్పించే పక్రియను ‘ఊరడి’ అంటారు. పల్లె ప్రాంతాలలో ‘పెద్దపండుగ, ఊర పండుగ’ అని పిలుస్తారు. బోనం ఎత్తిన నాడు లేదా మరునాడు భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తయారు చేసి బండిపై ఊరేగింపుగా తీసుకువెళతారు. దీనిని ‘ఫలహారం బండి’ అంటారు.

ఘటోత్సవం

సమృద్ధిగా వానలు కురవాలని, ప్రకృతి పచ్చదనంతో శోభించాలని, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ, ‘సాకబెట్టు’ పేరుతో పసుపు, వేపాకు, పచ్చకర్పూర, సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో శక్తిమాతలను అభిషేకిస్తారు. ఒక కుండ (ఘటం)ను చక్కగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దానిపై ఉంచి మంగళ వాయిద్యాలతో వీధివీధి తిరుగుతారు. బోనాల జాతర రాకను తెలియ చెప్పడమే ఈ ఊరేగింపు ఉద్దేశం. మరోమాటలో చెప్పాలంటే, తన జాతరకు రావలసిందిగా అమ్మవారే స్వయంగా ఆహ్వానించడంగా చెబుతారని మరో కథ ప్రచారంలో ఉంది. అలా ఊరేగుతున్న అమ్మవారికి ఎదురు వెళ్లి పసుపు కుంకుమలతో పూజించి, నూతన వస్త్రాలు సమర్పించి ఆలయానికి తీసుకు వస్తారు. అమ్మవారు ఆషాడ మాసంలో పుట్టింటికి వచ్చి భక్తులు బాగోగులు చూసుకుంటారని విశ్వాసం. ఘటోత్సవంతో పాటు పిల్లలు ఆరోగ్యంతో, పూర్ణాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ ఉయ్యాల తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు. వీటిని పూలతో తయారుచేస్తారు. వెదురుబొంగులను రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు. ఇవి మూడు అంతస్తుల నుంచి ఏడు అంతస్తుల వరకూ ఉంటాయి. పండుగ ముగిసిన మరునాడు వీటిని డప్పు వాయిద్యాలు, పాటలు, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.

రంగం/భవిష్యవాణి

బోనాల పండుగ మరుసటి రోజు ఘటాల ఊరేగింపు తర్వాత ‘రంగం’ అనే కార్యక్రమం జరుగుతుంది. మట్టితో చేసి కాల్చిన పచ్చికుండను మండపంలో అడుగులోతున పాతిపెడతారు. ఒక కొత్త చేటను దానిపై పెట్టి పసుపు, కుంకుమలతో ముగ్గులు వేస్తారు. జోగినిగా మారిన మహిళ (మాతంగ కన్య) దానిపై నిలబడి అమ్మవారి విగ్రహం వంక చూస్తూ , ఆమెను ఆవహింపచేసుకుంటూ భవిష్యత్తు పరిణామాలు, ముఖ్య విశేషాలను వివరిస్తుంది. రాబోయే ఏడాది తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తుంది. దీన్నే ‘అమ్మమాట, భవిష్యవాణి’ అని కూడా అంటారు. అమ్మవారు రంగం చెప్పే మహిళను అవహించగానే ఆమె బరువు తగ్గుతుందని, దానిని నిరూపించేందుకే ఆ మహిళను అలా పచ్చి కుండపై నిలబెడతారని చెబుతారు. మాతంగి కన్య చెప్పే విషయాలు, విశేషాలను ‘అమ్మ వాక్కు’గా పరిగణిస్తారు భక్తులు. రంగం పూర్తయ్యాక అమ్మవారి సోదరుడు పోతరాజు ఆలయం చుట్టూ తిరుగుతూ, తాండవం చేస్తారు. తర్వాత దైవసన్నిధిలోని ప్రసాదం, దీపాల ప్రమిదలు, పూలు మొదలైనవి అన్నీ ఒక గంపలో వేస్తారు. ‘బలిగంప’గా పిలిచే దానిని ఊరి పొలిమేరలో నిక్షిప్తం చేస్తారు.

పోతరాజుల విన్యాసాలు

బోనాలు సందర్భంగా పోతరాజుల వీరంగం ప్రత్యేక ఆకర్షణ. ఏడుగురు అక్కాచెల్లెళ్లు (ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ)కు ఆయన ఏకైక సోదరుడు. అమ్మవార్లు ఊరిలో పూజలు అందుకుంటుండగా సోదరుడు పొలిమేరల్లో అదృశ్యంగా కాపలాకాస్తూ, గ్రామ రక్షణ బాధ్యత వహిస్తాడని విశ్వసిస్తారు. సోదరికి తీసుకువెళ్లే ఫలహారం బండ్ల ముందు వీరంగాలు వేస్తూ కదులుతారు. బోనాలు సమయంలో యువకులు పోతరాజులా ఒళ్లంతా పసుపు పూసుకొన్న ఆహార్యంతో , కొరడా ఝళిపిస్తూ, తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తారు. ఆయన వీరంగానికి దుష్టగ్రహాలు పలాయనం చిత్తగిస్తాయని భక్తుల నమ్మకం.

 సాంక్రమిక వ్యాధులు ప్రబలకుండా..

ఆషాడంలో ప్రకృతిపరంగా అనేక అనారోగ్య పరిస్థితలు ఏర్పడతాయి. వర్ష ప్రభావం వల్ల సాంక్రమిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలాంటి వాటినుంచి రక్షణ పొందేందుకు దైవశక్తిని ఆశ్రయించడంలో భాగంగా శక్తిని అర్చించాలన్న ఆర్షధర్మం ప్రకారం, వివిధ దేవతలను ఆరాధిస్తారు. అందులో బోనాలను ఒక భాగంగా చెబుతారు. బోనాలలోని శాస్త్రీయతను తెలిపే అనేక విషయాలను ఉదహరిస్తారు. ‘పసుపు, బెల్లం, బియ్యంతో తయారు చేసే బోనాన్ని స్వీకరించడం వల్ల పసుపులోని యాంటీ బయోటిక్స్ ‌దేహంలోని రోగ కారకాలను నాశనం చేస్తాయి. వేపాకులతో కూడిన మట్టికుండలను మోసుకురావడం వల్ల వాతావర•ణంలోని వ్యాధి కారక క్రిములు నశిస్తాయి. మహిళలు పాదరక్షలు లేకుండా పసుపు కాళ్లతో నడిచి రావడం వల్ల పాదాల పసుపు నేల రాలి మట్టిలోని వ్యాధి కారకాలను నిర్మూలి స్తుందని, వేపాకు క్రిమినాశినిగా పనిచేస్తుంది కనుక రోగ నిరోధకత కోసం ఇంటికి వేప తోరణాలు కడతారని చెబుతారు.

అమ్మవారికి నిండు మనసుతో బోనం సమర్సిస్తే మెండు మనసుతో అనుగ్రహం కురిపిస్తుందని భక్తుల విశ్వాసం.

– ఎ. రామచంద్ర రామానుజ

About Author

By editor

Twitter
Instagram