నాసికకీ, నోటికీ చేతి నాలుగు వేళ్లే ఆచ్ఛాదనగా భక్తి ప్రపత్తులతో చుట్టూ నిలిచిన శిష్యగణం… సంప్రదాయ వస్త్ర ధారణతో, ముకుళిత హస్తాలతో బారులు తీరి నిరీక్షించి ఉన్న భక్తజనం…. వారి సమక్షంలోకి తీసుకుపోయే క్షణం కోసం ఎదురు చూపులు…ఆరోజు స్కందగిరి కుమారస్వామి ఆలయం (సికింద్రాబాద్‌) ఇలాంటి ఆధ్యాత్మిక శోభతో అలరారింది. భక్తిభావానికి నిలయమైంది. మే నెలలో ఆ ఆలయం కల్యాణ మండపంలో కంచి కామకోటి పీఠాధిపతులు, కామాక్షి స్వరూపులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వేంచేసిన సమయంలో, ఓ సాయం వేళ కనిపించిన కమనీయ దృశ్యమిది. శిష్యులు చెప్పేవి వింటూనే, వారికి సూచనలిచ్చారు వారు. మధ్య మధ్య వారి ఆసనానికి దగ్గరగా కూర్చున్న ఇద్దరు ఉత్తర భారత పత్రికా రచయితలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఒకవైపు శంకర భగవత్పాదులు, ఇంకొక వైపు అమ్మవారి పటం ఉన్న ఆ ఉన్నతాసనం వెనకే నిలబడి ఉన్న ఇద్దరు ముగ్గురు వదాన్యులతో ధార్మిక కార్యక్రమాల గురించీ, సేవా కార్యక్రమాల గురించీ, వాటి విస్తరణ గురించీ చర్చించారు. ఇంకా ఏమేమి చేయాలో మార్గదర్శనం చేశారు. ఆ మధ్యలో భక్తులు చెప్పుకునే మాటలు శ్రద్ధగా ఆలకించారు. వినతులు విన్నారు. బాలబాలికలను చిరునవ్వుతో పలకరించారు. కొందరు బాలురు ప్రవర చెబితే శ్రద్ధగా విన్నారు. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌- ఎవరు ఏ భాషలో సంభాషిస్తే అదే భాషలో అనర్గళంగా మాట్లాడారు. కుంకుమ ప్రసాదం, ఒక ఫలం చేతికి ఇచ్చి ప్రతి భక్తుడినీ, భక్తురాలినీ ఆశీర్వదించారు. ప్రతి లిప్త విలువైనదే. ప్రతి భాషణం లోతయినదే. ఆయన తన వెనుక ఉన్న వారితో మాట్లాడిన అంశాలు సేవకీ, ధర్మానికీ సంబంధించినవి. సమాజానికి ఉపయోగ పడడానికీ, అందుకు అవసరమైన నిధులు ఇవ్వడానికీ ముందుకు వచ్చిన వారికి ఇచ్చిన సూచలనే అవన్నీ. ఆ మధ్యలోనే జాగృతి తరఫున అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. మన కుటుంబ వ్యవస్థను రక్షించుకునే మార్గాలు చెప్పారు. దేవాలయాలను ప్రభుత్వ ఆధిపత్యం నుంచి తప్పించడం సరైన మార్గమేనని అన్నారు. మార్పిడులు రైల్వే లైన్ల దగ్గర కాని, ఇతరుల ధర్మంలో కాదని స్పష్టంగా చెప్పారు. జ్ఞాన్‌వాపి, మధుర వివాదాలు న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పటికి దేశ గౌరవాన్ని కాపాడడం మనందరి కర్తవ్యంగా భావించాలని హితవు పలికారు. విద్య, వైద్యం, వేదం అనే త్రివేణీ విస్తరణ కోసం కంచిపీఠం సేవలేమిటో వివరించారు. ఏ మాటైనా నిగూఢంగానే ఉంది. ఒక వాక్యంలోనే ఒక చారిత్రక సందర్భం ప్రతిధ్వనించే విధంగా, అదే సమయంలో ఎవరి పేరు ప్రస్తావించకుండా, ఎవరినీ నొప్పించకుండా వారు చెప్పిన మాటలు ఎప్పటికీ విలువైనవే. పూజ్యశ్రీ విజయేంద్ర స్వామి వారి అభిభాషణం ఇలా సాగింది:

భారతీయ జీవనానికీ, సంస్కృతికీ కేంద్ర బిందువు కుటుంబం. కాలపరీక్షకు నిలిచిన ఆ వ్యవస్థ బీటలు వారకుండా నేటి తరాలు తీసుకోవలసిన బాధ్యత ఏమిటి?

ముందు విద్యావ్యవస్థలో మార్పురావాలి. అప్పుడే కుటుంబం, కుటుంబ వ్యవస్థ రక్షణ గురించి యోచించగలుగుతాం. ఏ మతానికైనా, జాతికైనా కుటుంబ వ్యవస్థ అనేది ముఖ్యం. కుటుంబ వ్యవస్థ చుట్టూ తిరిగే మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి విద్యావిధానంలోనూ చెప్పాలి. కానీ… డిగ్రీల గురించి చెపుతున్నాం, ఉద్యోగాలూ, జీతాలూ గురించి నేర్పిస్తున్నాం. జీవితం గురించి మాత్రం అక్కడ ఏమీ నేర్పటం లేదు. ప్రకృతి పరిరక్షణకీ, కుటుంబ వ్యవస్థ రక్షణకీ కూడా బంధం ఉంది. ప్రకృతి సిద్ధమైన లక్షణాలను పరిరక్షించాలి. ఎలాగంటే సృష్టిలో ఆడవాళ్లకు కొన్ని విధులు, కర్తవ్యాలు; మగవాళ్లకు కొన్ని విధులు, కర్తవ్యాలు చెప్పినారు. ఆ ఇద్దరికీ నిర్దేశించిన పనులూ, పరిధులతో పాటు, ఈ విభజననూ గౌరవించాలి. అంటే సృష్టితత్త్వాన్ని గౌరవించాలి. అప్పుడే ఆత్మతత్త్వం వికసిస్తుంది. ఉన్నత విద్య దశకు వచ్చినప్పుడు ప్రత్యేక విద్యాలయాలు, ప్రాంగణాలు ఉండాలి. కళాశాలలు, విశ్వవిద్యాల యాలు పురుషులకు, మహిళలకు విడివిడిగా ఉండాలి. కేవలం ఫిలాసఫి అనుకుంటూ పైపైనే చూస్తుంటే భవనం దృఢంగా ఉండదు. భవనం బలంగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి. మనదంతా యుద్ధకాలే శస్త్రాభ్యాసం అన్నట్టు ఉంది. ముందు నుండి జాగ్రత్తపడాలి. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేందుకు ఇపుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు- బేటీ బచావో, బేటీ పడావో వంటివి. ప్రసూతి సెలవు పెంచారు. మంచిదే. ఇంకొకటి కూడా జరగాలి. మనదేశంలో సుఖప్రసవాలను ప్రోత్సహించాలి. అంతకంటే ముందు పెళ్లి ఖర్చులు తగ్గించాలి. నిరాడంబర వివాహాలు చేయాలి. కంచి మహాస్వాముల వారు వరకట్నం తీసుకోవద్దని సందేశం ఇచ్చారు. దానిని ఇవాళ్టి యువతకీ చెప్పాలి, తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. అసలు వివాహం అనే దాంట్లో ప్రేమ అనేది ముఖ్యంగానీ శారీరక సుఖం కాదు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండడమూ అంటే, తల్లిదండ్రులను చక్కగా గౌరవించాలి. ఇప్పుడు కనిపిస్తున్నదేమిటీ అంటే, స్వతంత్రం అనే మాటను యువత సరిగా అర్థం చేసుకోవడంలేదు. సౌకర్యం అనే దాన్ని పెద్దవాళ్లు అర్థం చేసుకోవాలి. కొన్ని కుల సంఘాలు ఉన్నాయి. వాటిలో సంస్కృతీ విభాగం ఉండాలి. వివాహ వ్యవస్థ గురించి యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి సరైన అవగాహన కల్పించడం ఇవాళ్టి అవసరం. వేదాంతులు సంసారం గురించి పట్టించుకోకపోవటం వేరు. సంసారంలో ఉన్నవారు పట్టించుకోవాలి కదా! పరస్పర అవగాహన ఉంటేనే సంసారం మంచిగా జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఈ మధ్య ఫ్యామిలీ కోర్టులు ఎక్కువయ్యాయి. వీటి సంఖ్యను తగ్గించడంలో తల్లిదండ్రులు, యువత కూడా సహకరించాలి. ఎందుకంటే, వృద్ధాశ్రమాలు పెరగటం, ఫ్యామిలీ కోర్టులు పెరగటం అభివృద్ధిగా భావించకూడదు. ప్రభుత్వం కూడా ధర్మం గురించి మరిన్ని సానుకూల చర్యలు తీసుకోవాలి. అనేక కారణాలచేత- ఆర్థికం, సామాజికం, రాజకీయం ఇట్లాంటి కారణాల చేత వివాహం ఆలస్యమవుతున్నది. ఇది అవాంఛనీయం. స్వీయ నియంత్రణ విధానం రావాలి. వ్యాపార రంగంలో స్వదేశీ లిబరలైజేషన్‌ ‌రావాలి. అంటే స్వదేశీయులకు స్వతంత్రం ఇంకా ఎక్కువ ఇవ్వాలి. అదే సమయంలో సెల్ప్ ‌కంట్రోల్‌ అనేది సంస్కృతిలో ఉండాలి. గుడి, గ్రామం, కుటుంబం ఈ మూడు విషయాలలో కూడా అంతా శ్రద్ధ తీసుకోవాలి. దేవస్థానం అనేది తల్లిదండ్రులకీ, యువతకీ మార్గదర్శనం చేసే రీతిలో ఉండాలి.

హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల ఆధిపత్యం గురించి హిందువులు ఎలాంటి దృష్టి కలిగి ఉండడం మంచిది? వాటిని హిందూ ధార్మిక సంస్థలకు, ధర్మకర్తల మండళ్లకి ఇవ్వాలని ఇటీవల హిందువులు గట్టిగా కోరుతున్నారు.

దేవాలయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించా లన్న ఆలోచన మంచిదే. దీనికి సంబంధించి, పీపీపీ నమూనా ఉండాలి. అంటే పబ్లిక్‌ ‌ప్రైవేటు పార్టనర్‌ ‌షిప్‌. ‌భక్తులు కోరినంత మాత్రానే ఆలయాలను వెంటనే అప్పగించరు కదా! వాటి నిర్వహణ బాధ్యతను స్వీకరించడానికి ప్రైవేటు సంస్థలు కూడా సిద్ధమవ్వాలి. అలాంటి సంసిద్ధత వారిలో రావాలి. ఈ పక్రియలో ప్రజ, ప్రభుత్వం, పూజారి-ఈ మూడు వ్యవస్థలు కూడా ముందడుగు వేయాలి. ఇందులో ప్రజలను సంసిద్ధులను చేయడం కోసం కంచి మఠం తనదైన ప్రయత్నం ఆరంభించింది. హైదరాబాద్‌లో కంచి మహాస్వామి చారిటీ మేనేజ్‌మెంట్‌ ‌కోర్సు ప్రారంభిస్తున్నాం. అది ఇందుకు సంబంధించినదే. ఈ కోర్సులో ఒక్క ఆలయం గురించి మాత్రమే కాదు, దేవాలయ పరిరక్షణ, పూజాపద్ధతి, దేవాలయ నిర్మాణం, జీర్ణోద్ధరణ, గోశాల, వేద పాఠశాల, వృద్ధాశ్రమ నిర్వాహణ, దివ్యాంగులకు సేవా కార్యక్ర మాలు వంటివి బోధిస్తారు. ప్రభుత్వ ఆధిపత్యం నుంచి దేవాలయాలు బయటపడడం అనే పక్రియలో ప్రైవేటు సంస్థల సంసిద్ధత చాలా ముఖ్యం. అలాగే ధర్మకర్తగా వ్యక్తి ముందుకు రావాలి. ఈ ధర్మకర్తృత్వా నికి అవసరమైన శిక్షణ కూడా ఆ కోర్సులో భాగంగా ఇస్తాం. ఆగమశాస్త్రం ప్రకారం, మన సంప్రదాయం మేరకు గుడుల నిర్వహణ, పూజా విధానం నేర్పించటం కూడా ఆ శిక్షణలో భాగమే. పూజ ఎలా చేయాలి? కొబ్బరికాయ ఎలా కొట్టాలి? హారతిచ్చే విధానం ఏది? దైవదర్శనానికి వచ్చినవారు పంచె కట్టుకొని రావాల్సిన అవసరం… వస్త్రధారణ- ఇవన్నీ గుడికి సంబంధించిన నియమాలు. ఆ కోర్సులో బోధనాంశాలే. పద్దులన్నీ చట్టబద్ధంగా ఎలా రాయాలి? ఆస్తిపాస్తులు, సొమ్ములు ఉంటే వాటిని ఎలా పరిరక్షించుకోవాలి? వంటివీ ఆ కోర్సులో నేర్పిస్తారు. అంటే అటు శాస్త్రం నేర్పిస్తారు, ఇటు ఆలయ నిర్వహణ, పాలన గురించీ శిక్షణ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే నిధి, నియమం, నిర్వాహణ- ఈ మూడూ నేర్పిస్తారు. ధర్మరక్షణతో పాటు మంత్రంతో మానవ సేవ అన్నమాట.

ఆలయాల విషయంలో ప్రభుత్వాలు కూడా చట్టం ప్రకారంగా వ్యవహరించాలి. సరైన చర్యలు తీసుకోవాలి. దేవాలయ రక్షణ మీద మంచి నిర్ణయాలు రావాలి. హిందూ సమాజం కూడా జాగ్రత్తపడాలి. దాని కోసం ధర్మప్రచారం చేస్తూ ఉండాలి. అందులో ప్రజలు కూడా భాగస్వాము లవ్వాలి. తరువాత దేవాలయాలను ప్రైవేటుకు అప్పగించిన పర్వాలేదు. ప్రభుత్వం, ప్రైవేటు ఇద్దరు కలసి పనిచేసేటట్టు చేయాలి. తరువాత ప్రజలకు ఇవ్వాలి. అప్పుడే శాస్త్ర, సంప్రదాయాలను కాపాడడం సులభమవుతుంది. అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు ఆలయాలను అప్పగించే క్రమంలో మధ్యంతర ఏర్పాటు ఉండాలి.

ఈ హైదరాబాద్‌ ‌పర్యటనలోనే తమరు మతమార్పిడులు వద్దు అని హిందూ సమాజానికి సందేశం ఇచ్చారు. దేశభద్రతకు మత మార్పిడులు ముప్పు అన్న వాదనతో పాటు భారతీయతకు అవి చేస్తున్న చేటు కూడా నిర్వివాదాంశమైనది. అలాగే హిందూ పండుగల విషయం వచ్చేసరికి పండుగల తోనే పర్యావరణానికి ముప్పు, కాలుష్యం వంటి సమస్యలను ముందుకు తెస్తున్నారు. ఈ ధోరణుల పట్ల హిందువులు ఎలా స్పందించాలి?

సహనం, సహకారం, సమన్వయం ఈ మూడు ప్రజలలో ఉండాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందు తుంది. నాదే ముఖ్యం, నాది మాత్రమే ముఖ్యం అనుకుంటే కుదరదు. దేశ సమస్యలు తీరాలి. ఆకలి తీరాలి. దానికి కలి లేకుండా ఉండాలి. దేశంలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడాలి. దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి ఈ మూడు ముఖ్యం. వెయ్యి సంవత్సరాల ఇబ్బంది తర్వాత ఈ వాతావరణం వచ్చింది. కావలసింది ఓర్పు. 2002 లేదా 2004 లోనో ఢిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్పుడు ఒక మాట చెప్పాను. అది గుర్తు చేస్తాను. మార్పిడిలు రైల్వే లైన్‌ ‌మీద చేయండి, మీటర్‌గేట్‌ ‌నుండి బ్రాడ్‌ ‌గేజ్‌ ‌వరకు చేయండి! కానీ మతమార్పి డులు చేయకండి. వన్‌ ‌వే ట్రాఫిక్‌ ‌పనికి రాదు. వన్‌ ‌వే ట్రాఫిక్‌ ‌గాని, ఓన్‌ ‌వే ట్రాఫిక్‌ ‌గానీ పనికిరావు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలి. నా సిద్ధాంతం నాదే అనేవారు, 130 కోట్ల జనాభా సంగతి విస్మరించరాదు. వేరు వేరు భాషలు, వేరు వేరు విశ్వాసాలు. శాంతి ఇక్కడ ముఖ్యం. తానొప్పక తానొవ్వక అని చెబుతుంది సుమతీ శతకం. అదే భారతదేశ తత్త్వం. ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రతీ కుల సంఘంలో మనదైన సంస్కృతి పరిరక్షణ కూడా అంతర్భాగంగా ఉండాలి. కంచిలో ఒక్కొక్క కుల సంఘాన్ని పిలిపించి హోమాలన్నీ చేస్తున్నాం. స్వయంవర పార్వతీ హోమం చేస్తున్నాం. కుమ్మరి సంఘంవారు, ఆర్య సంఘంవారు వచ్చారు. నాడార్‌, ‌మొదలియార్లు వచ్చారు. వాళ్లందరికి సంకల్పం ఇప్పించి ప్రసాదం ఇస్తున్నాం. మంత్రం ద్వారా మానవ సేవ చేస్తున్నాం. చట్టం, సమాజం, శాస్త్రం చదువుకున్నవారితో ఒక అవగాహన సదస్సు జరగాలి. మనదేశానికి భద్రతా ముఖ్యమే, ఉపాధి కల్పన ముఖ్యమే. దీంట్లో సందేహం లేదు. కానీ ఉపాసన కూడా ముఖ్యం. డిజిటల్‌ ఇం‌డియా అంటాం. దాంతో పాటు మనం చేయాల్సింది డివైన్‌ ఇం‌డియా (దివ్య భారతదేశం). విదేశీయులు డివైడ్‌ ఇం‌డియా (విభజిత భారతం) చేసి పోయారు. మనం ఇప్పుడు డివైన్‌ ఇం‌డియా చేయాలి. దానికి సుస్థిరత కలిగిన సర్కార్‌ ‌కావాలి. సర్కారులోను, సంస్కృతిలోను సుస్థిరత కావాలి.

జ్ఞాన్‌వాపి మసీదు, మధుర కృష్ణ జన్మభూమి వివాదాల మీద మీ నుంచి హిందూ సమాజం ఎలాంటి సందేశాన్ని ఆశించవచ్చు?

అవి కోర్టులో ఉన్నాయి కదా! వీళ్లు చేయాల్సింది చేయాలి. తరువాత కర్తవ్యం ప్రధానంగా ఉండాలి. అంతా గుర్తించాల్సిన విషయం-ఒకవైపు కేవలం హక్కుల గురించి మాట్లాడడం కనిపిస్తుంది. హక్కులు కావాలనుకున్నా, కర్తవ్య నిర్వహణ కూడా ప్రధానంగా ఉండాలి. ఈ దేశ వ్యక్తిత్వాన్ని మనం కాపాడాలి. ప్రతీ వ్యక్తీ దానికోసం పనిచేయాలి. కాశీలో కొత్తగా కారిడార్‌ ఏర్పాట్లు చేశారు. గుడి విశాలం చేశారు. నేరుగా గంగ నుంచి గుడికి వెళ్లగలిగేటట్టు చేశారు. కాశీవిశ్వనాథుడంటేనే గంగాధరుడు. ఆయనకు నేరుగా గంగతో బంధం కలిపారు. మంచిగా చేశారు. భారతదేశంలో తెలివితేటలకు లోటు లేదు. ఎవరు చెప్పేది ఎవరు వినాలనేదే సమస్య. కాళిదాసు చెప్పినదేమిటంటే ‘నచారి హింసా విజయస్త హస్తే’. అర్థం-అరి అంటే శత్రువు. శత్రువులను హింసించ కుండానే మనకు విజయం కలగాలి. లేదా శత్రువుల చేత మనకు హింస కలగకుండా మనకు విజయం రావాలి. విన్‌ ‌విన్‌ అం‌టారు. ఇద్దరికీ జయం. అదీ ఈ కాలం.

ఇప్పుడు సంఘం, సంస్కృతి వీటి పట్ల పౌరులలో వస్తున్న వైమనస్యానికి విరుగుడు ఏమిటి?

డివోషన్‌, ‌డైరెక్షన్‌, ‌డెడికేషన్‌- ‌సమాజానికి ఈ మూడూ కావాలి. డివోషన్‌- ‌భక్తి, డైరెక్షన్‌- ‌మార్గ దర్శనం, డెడికేషన్‌- ‌సమర్పణా భావం. ఇపుడు మనకు కావలసింది అహంభావం కాదు. సేవాభావం. అందరూ పనిచేయాలి. పనిచేయకుండా ఫలితం ఎట్లా వస్తుంది? కర్మయోగము చెప్పిన భూమి కదా! అంటే మనం కర్మయోగాన్ని వేరే రకంగా చెబుతున్నాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కానీ మనం అడ్వాన్స్ ‌పేమెంట్‌ ‌చేసేయి అంటాం. అపుడు దేశం ఎట్లా వృద్ధిలోకి వస్తుంది? కార్యకారణ భావం సరిగా లేదు. మంచిని కోరుకుంటున్నాం. మంచి చేయట్లేదు. కార్యానికి కారణానికి సంబంధం ఉంటుంది. కఠిన పరిశ్రమ, ప్రజల మధ్యలో సౌజన్యం రెండూ కావాలి. సౌహార్థం, సౌమనస్యం, సుముఖత ఉండాలి. ఇపుడు విముఖత, ప్రముఖత రెండే ఉన్నాయి. సుముఖత (సానుకూల దృక్పథం) తగ్గింది. ఇక నేనే పెద్దవాడిని అనుకోవడమే ప్రముఖత. విముఖత అంటే-ఓ ఇబ్బంది వచ్చింది. కానీ, నాకేం పని! ఆ ఇబ్బంది సంగతి వారు చూసుకుంటారని అనుకుంటారే గాని, వీళ్లు పట్టించుకోవడం లేదు.

చరిత్రాత్మక కంచి పీఠం దేశ ప్రజలకు ఎలాంటి ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను అందిస్తున్నది?

విద్య, వైద్యం, వేదం- ఈ మూడు అంశాల కోసం కంచి పీఠం పలు సేవాకార్యక్రమాలు నిర్వ హిస్తున్నది. కొన్ని ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇంకొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కశ్మీర్‌లో కంచి మఠం తరఫున పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శంకర జయంతి హోమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చేశారు. ఈశాన్య భారతదేశంలో ఇపుడు వేదపాఠశాల ప్రారంభమయింది. గౌహతిలో పూర్వ తిరుపతి బాలాజీ మందిర్‌, ‌పెద్ద కంటి ఆసుపత్రి- శంకరదేవ్‌ ‌నేత్రాలయ ఉంది. గౌహతిలో భక్తి ప్రచారం చేసిన శంకర్‌దేవ్‌ అనే మహనీయుని పేరు మీద కంటి ఆసుపత్రి నిర్మించారు. దీనికి పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉండగా స్థలం ఇచ్చారు. సిక్కింలో ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, వేద పాఠశాల నడుస్తున్నాయి. నేపాలీ వారు వచ్చి సిలిగురి అనేచోట ఇవన్నీ నేర్చుకుంటారు. చికెన్‌ ‌నెక్‌ అం‌టారు. ఇది దేశ భద్రతా కోణం నుంచి నిరంతరం జాగ్రత్తగా చూసుకోవలసిన చోటు. అక్కడ వేదపాఠశాల ఉంది. అండమాన్‌లో నేషనల్‌ ఇం‌టిగ్రెషన్‌ ‌సెంటర్‌ ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతున్నది. అరుణాచల్‌‌ప్రదేశ్‌లో శివాలయం, సూర్యుడికి, చంద్రుడికి గుడులు కట్టారు. గిరిజన సంస్కృతిలో సూర్యుడిని, చంద్రుడిని పూజిస్తారు. షిల్లాంగ్‌లో విద్యాభారతి సంస్థతో కలిసి కంచి కామకోటి విద్యాభారతి ఇంగ్లిష్‌ ‌మీడియం స్కూల్‌ ‌నడుస్తున్నది. అక్కడ విఘ్నేశ్వర గుడికట్టారు. గోవాలో బాలాజీ మందిర్‌ ఉం‌ది. ఇపుడు సంస్కృతం, శాస్త్ర ప్రచారం కోసం పొదిలి (ఉమ్మడి ప్రకాశం జిల్లా) అనే గ్రామంలో ‘సనాతన ధర్మ సేవాగ్రామం’ ఉంది. అదే తరహాలో తెలంగాణలో కూడా సేవాగ్రామం చేయటానికి ప్రయత్నం జరుగుతున్నది. గుంటూరు లోనూ కంటి ఆసుపత్రి ఉంది. ఇపుడు నార్సింగ్‌లో కంటి ఆసుపత్రి భవన నిర్మాణం కోసం భూమిపూజ జరిగింది. వచ్చే ఉత్తరాయణానికి, ఉగాదికి శంకర కంటి ఆసుపత్రి ప్రారంభమవుతుంది. తెలంగాణలో నాదస్వర పాఠశాల, శిల్పశాస్త్ర పాఠశాల, గుడికి అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవడానికి మార్గదర్శనం చేయడం మా లక్ష్యం. ఇదంతా మతంలో మౌలిక వసతుల కల్పన, సిబ్బందిని తయారు చేయడం అనే పథకం కింద జరుగుతున్నది. శిల్పులను తయారు చేయడం, అర్చకులను తయారు చేయడం, నాదస్వర నిపుణులను తయారుచేయటం, పూలమాలలు కట్టేవారి కోసం, సున్నం వేసేవారి కోసం శిక్షణ ఇస్తున్నాం. నేపాళంలో భారత్‌ ‌సర్కార్‌ ఐఐటీ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్ని స్తున్నది. ఇది మంచిది.

దేవాలయం, ధర్మం విషయంలో ప్రతి హిందువు తప్పక నిర్వర్తించవలసిన విధి ఏమిటి?

గుడులూ గోపురాలూ కట్టేశారు ఆ కాలంలో. మన కనీస బాధ్యత వాటిని పరిరక్షించుకోవడం. ఆలయం కేంద్ర బిందువుగా ఉన్న ధార్మిక దృష్టి, కళ, శాస్త్రం, శిల్పం వంటివాటినన్నింటినీ రక్షించు కోవాలి. అది సంస్కృతి వారసత్వంగా ఇచ్చిన సంపద. వచ్చే తరం వారికి అందించాలి. అందుకని హిందువు లందరూ తమ సంపాదనలో 10 శాతం కల్చరల్‌ ఎడ్యుకేషన్‌ ‌కోసం ఖర్చు పెట్టాలి. అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎన్నో నిధులు ఖర్చు చేస్తుంటాయి. ఆ నిధులలో కనీసం 10 శాతం శాస్త్రీయ సంగీతం, నాట్యం, శిల్పకళ లాంటి వాటికి ఖర్చు చేయాలి.

– జాగృతి డెస్క్, (‌డా. కేకేవీ శర్మ,  సీహెచ్‌ ‌వినోద్‌ల సహకారంతో..)


సనాతన ధర్మ పరిచయ తరగతులు

కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆదేశంతో మే 9వ తేదీ నుంచి 21 వరకు పద్నాలుగు రోజుల పాటు సనాతన ధర్మ పరిచయ తరగతులు జరిగాయి. ఇందులో సనాతన ధర్మం, నాట్యశాస్త్రం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, ప్రకృతి, శిల్పశాస్త్రం, వాస్తు, జ్యోతిష్యం, తెలుగు సాహిత్యం, తెలుగు భాషా పరిచయం, ఆయుర్వేదం, గోసంరక్షణ, పతంజలి యోగాశాస్త్రాలు వంటి అంశాలను నిష్ణాతులు ప్రాథమిక అవగాహన కల్పించారు. బోధన పట్ల తరగతులకు హాజరైనవారు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అంశాల మీద మరింత అవగాహన కల్పించేందుకు తరువాత స్థాయిలో యోజన జరుగుతున్నది.


About Author

By editor

Twitter
Instagram