– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌భారతదేశానికి సెక్యులరిజం నేర్పే అసంబద్ధ చర్యకి కొన్ని హక్కుల సంఘాలు, సర్వే సంస్థలు పూనుకోవడం కొత్తకాదు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలోనే మత ఘర్షణలు జరిగే దేశంలో ఈ రగడ ఎవరిదో వాళ్లకి తెలియదు. అమెరికాలోనో, జర్మనీలోనో లేకుంటే మరొక దేశంలోనో ఉండి భారత్‌ ‌మీద విషం చిమ్ముతూ ఉంటారు. ఇదంతా మైనారిటీల తెరచాటు నాటకం. డిజ్‌మ్యాంటిల్‌ ‌గ్లోబల్‌ ‌హిందుత్వ వంటి సదస్సుల తమాషా. దీనికి కొందరు భారతీయులే వంత పాడడం కొసమెరుపు. అందుకే భారత్‌లో మత స్వేచ్ఛ కనుమరుగై పోతున్నదంటూ నిత్యం చేసే ఆ ప్రచారాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తున్నది. మానవ హక్కులు నాశనమైపోతున్నాయనీ, మైనారిటీలను అణచివేస్తున్నారని భారతీయులను అభిశంసించే పేరుతో హిందూత్వ మీద దాడి చేస్తూ ఉంటారు. కానీ కశ్మీర్‌లో పండిత్‌ల సంగతి, ఈ దేశంలో పది రాష్ట్రాలలో మైనారిటీలుగా హిందువుల హక్కుల సంగతి వీళ్లకి పట్టదు. ఒక్క తీగ కదిపితే చాలు, మొత్తం ఆ డొంకంతా కదులుతుంది. ఇదంతా హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక, పాక్‌,‌చైనా అనుకూల బీరకాయ పీచు.

యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌కమిషన్‌ ఆన్‌ ఇం‌టర్నేషనల్‌ ‌రెలిజియస్‌ ‌ఫ్రీడమ్‌ (‌యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఏ‌ప్రిల్‌ 25‌న విడుదల చేసిన తన నివేదికలో భారత్‌ను ‘ప్రత్యేక ఆందోళనకారక దేశం’ (సీపీసీ)గా ‘బ్లాక్‌ ‌లిస్టు’లో పెట్టాలని మళ్లీ సిఫారసు చేసింది. ఈ తంతు 2020 నుంచి కొనసాగుతూ వస్తోంది. ఈవిధంగా వరుసగా మూడోసారి కూడా యూఎస్‌సీ ఐఆర్‌ఎఫ్‌ ఈవిధంగా సిఫారసు చేసిందంటే, ఈ కమిషన్‌లో భారత వ్యతిరేక లాబీ ఎంత తీవ్రంగా ఉన్నదీ వ్యక్తమవుతోందనేది న్యూఢిల్లీలోని సౌత్‌ ‌బ్లాక్‌, ‌నార్త్ ‌బ్లాక్‌ అధికారుల అభిప్రాయం. ఇంటర్నేషనల్‌ ‌రిలిజియస్‌ ‌ఫ్రీడం యాక్ట్ (ఐఆర్‌ఎఫ్‌ఏ) ‌కింద 1998లో అమెరికా ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అమెరికా వెలుపల సార్వజనీకమైన మతస్వేచ్ఛ హక్కు ఏవిధంగా అమలవుతున్నదీ, పరిశీలించి ఏటా యుఎస్‌ ‌ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం ఈ సంస్థ పని. ఈ నివేదికలను ఇప్పటివరకు భారత్‌ ‌పెద్దగా ఖాతరు చేయలేదు. అవి ఏకపక్షంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ వివక్షాపూరిత నివేదికలను మన విదేశాంగశాఖ ఖండిస్తూ వస్తోంది. ముఖ్యంగా గత మూడేళ్ల నుంచి ఈ సంస్థ వరుసగా భారత్‌ను ‘ప్రత్యేక ఆందోళనకారక దేశం’గా పేర్కొంటూ వస్తున్నదంటే, ఈ సంస్థపై పెరుగుతున్న భారత వ్యతిరేక లాబీ ప్రభావంతో పాటు, పశ్చిమ దేశాల్లో భారత వ్యతిరేకతను పెంచిపోషించడం కోసం అవసరమైన ‘‘వనరులను’’ ఏవిధంగా వినియోగిస్తున్నదీ అర్థమవుతుంది.

కొద్దివారాల క్రితం యుఎస్‌లో పౌరహక్కుల సంఘాలు, విశ్వాస ముఠాలుగా చెప్పుకుంటున్నవారు యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌కు ఒక లేఖరాస్తూ ‘మతపరమైన మైనారిటీలను ఇబ్బందులకు గురిచేస్తున్న దేశంగా భారత్‌ను గుర్తించాలని’ సిఫారసు చేశాయి. ఇండియన్‌ అమెరికన్‌ ‌ముస్లిం కౌన్సిల్‌, ‌హిందూస్‌ ‌ఫర్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్, ‌జూబ్లి కాంపెయిన్‌ ‌యుఎస్‌ఏ, ఇం‌టర్నేషనల్‌ ‌క్రిస్టియన్‌ ‌కన్‌సర్న్, ఇం‌డియా సివిల్‌ ‌వాచ్‌ ఇం‌టర్నేషనల్‌, ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ అమెరికన్‌ ‌క్రిస్టియన్‌ ఆర్గనైజేషన్‌, ‌దళిత్‌ ‌సాలిడారిటీ ఫోరమ్‌ ఇన్‌ ‌ది యుఎస్‌ఏ, ‌కామెరూన్‌ అమెరికన్‌ ‌కౌన్సిల్‌, ఆసియన్‌ ‌చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ ‌ఫెలోషిప్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌ముస్లిమ్స్ ఆఫ్‌ అమెరికా, ఇంటర్నేషనల్‌ ‌సొ సైటీ ఫర్‌ ‌పీస్‌ అం‌డ్‌ ‌జస్టిస్‌, ‌జస్టిస్‌ ‌ఫర్‌ ఆల్‌, ‌దార్‌ ఎల్‌ ఎమాన్‌, ‌కౌర్‌డి అలైన్‌ ‌బైబిల్‌ ‌చర్చ్, ‌న్యూ లైఫ్‌ ‌చర్చ్, ‌ఫ్రెష్‌ ‌హార్ట్ ‌మినిస్ట్రీస్‌, ‌గ్రీన్‌ ‌ట్రీ గ్లోబల్‌ ‌పొకేన్‌ ‌ఫాదర్‌ ‌హుడ్‌ ఇనిషియేటివ్‌, ఇం‌డియన్‌ ‌ముస్లిం అసోసియేషన్‌ ఆఫ్‌ ‌కరోలినాస్‌, ‌క్రిస్టియన్‌ ‌ఫ్రీడమ్‌ ఇం‌టర్నేషనల్‌, ఇం‌టర్నేషనల్‌ ఆసియన్‌ ‌క్రిస్టియన్‌ ‌ఫ్రంట్‌ ‌వంటి సంస్థలు ఈ లేఖపై సంతకాలు చేశాయి.

చేటు చేస్తున్న లాబీయింగ్‌ ‌సంస్థలు

యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ‌సంస్థ పేర్కొన్న జాబితాలోని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ఆంక్షలు విధించవచ్చు. ముఖ్యంగా లాబీయింగ్‌ ‌సంస్థలు, ఈ జాబితాలో పేర్కొన్న దేశాల్లో పెట్టుబడులు రాకుండా అడ్డుకోవ డమే కాదు, ఆయా దేశాలకు అంతర్జాతీయంగా ఉన్న మంచిపేరును దెబ్బతీయడానికి కృషిచేస్తాయి. 2021, నవంబర్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ ‌మతస్వేచ్ఛను పాటించని నేరానికి పాల్పడుతున్న పది దేశాల జాబితాను ప్రకటించారు. విచిత్రమేమంటే ఇందులో భారత్‌ ‌పేరు లేదు. 2020లో అప్పటి విదేశాంగ మంత్రి మైక్‌ ‌పాంపియో కూడా భారత్‌ ‌పేరును ఈ జాబితాలో చేర్చడానికి సుతరామూ అంగీకరించలేదు. 2020 వార్షిక నివేదికలో భారత్‌ను సీపీసీ చేర్చాలని నివేదిక రూపొందించిన మహానుభావుడు హారిసన్‌ ‌హాకిన్స్. ఈయన దక్షిణాసియాకు సంబంధించి సీనియర్‌ ‌విధాన విశ్లేషకుడు. అంతేకాదు యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌కు గతంలో పాక్‌ ‌రాయబారిగా వ్యవహ రించిన అక్బర్‌ అహమ్మద్‌కు అత్యంత ఆప్తుడు. ఇక 2021 నుంచి యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ‌చీఫ్‌గా ఉన్న నడేన్‌ ‌మైంజా భారత్‌లో తీవ్రస్థాయి మతస్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధం ఉన్న భారత సంస్థలు, అధికార్లపై ఆంక్షలు విధించాలంటూ మళ్లీ సిఫారసు చేశారు. అటువంటి వారి ఆస్తులను స్తంభింపజేయడం, యుఎస్‌లోకి రాని వ్వకుండా నిరోధించడం వంటి చర్యలు చేపట్టాలని కూడా ఆమె కోరారు. నడేన్‌ ‌మైంజా 2018లో యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లో చేరారు. అంతకుముందు ఆమె పాకిస్తాన్‌కు నమ్మకమైన మిత్రుడైన యుఎస్‌ ‌రాజకీయవేత్త రిక్‌ ‌సాంటోరమ్‌ ‌కోసం పనిచేశారు. ఈమె ‘పేట్రియాట్‌ ‌వాయిస్‌’ అనే సంస్థకు అధ్యక్షురాలు కూడా. దీన్ని 2012లో సాంటోరమ్‌ ‌నెలకొల్పారు. ఈ సంస్థలో ఆమె సహచరుడిగా పనిచేస్తున్న టెర్రీ అలెన్‌ ‘‌ఫిడిలిస్‌ ‌గవర్నమెంట్‌ ‌రిలేషన్స్’ (ఎఫ్‌జీఆర్‌) అనే లాబీయింగ్‌ ‌సంస్థలో భాగస్వామి. ఈ ఎఫ్‌జీఆర్‌ను ఇండియన్‌ అమెరికన్‌ ‌ముస్లిం కౌన్సిల్‌ (ఐఏఎం‌సీ)అద్దెకు తీసుకుంది. ఇందుకు ప్రధాన కారణం యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లో భారత వ్యతిరేక లాబీయింగ్‌ ‌జరపడానికి, ఎఫ్‌జీఆర్‌ను ఉపయోగించుకోవడం. ఐఏఎంసీకి అధినేతగా రషీద్‌ అహమ్మద్‌ ‌పనిచేస్తున్నారు. ఈయన 2008-17 మధ్యకాలంలో ఇస్లామిక్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ‌నార్త్ అమెరికా (ఐఎంఏఎన్‌ఏ) ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌గా పనిచేశారు. కోవిడ్‌ ‌నిధుల దుర్వినియోగం చేశారంటూ ఈ సంస్థపై ఆరోపణ లున్నాయి. ఇదే సంస్థకు చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్ ‌జాహిద్‌ ‌మహమ్మద్‌ ‌పాకిస్తాన్‌ ‌నేవీకి చెందిన మాజీ అధికారి.

యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌కు ఎందుకింత అక్కసు?

అమెరికాలో పనిగట్టుకొని భారత వ్యతిరేక ప్రచారం చేసే ఇస్లామిస్ట్ ‌గ్రూపులైన ఐఏఎంసీ, జామాత్‌ అనుబంధ సంస్థలకు అనుకూలంగా యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లోని ప్రముఖ అధికార్లు వ్యవహ రిస్తుంటారని ‘డిజ్‌ఇన్‌ఫో ల్యాబ్‌’ ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఇది ఒక ఓపెన్‌ ‌సోర్స్ ఇం‌టెలిజెన్స్ ‌సంస్థ. ఇటీవలి సంవత్సరాల్లో యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ‌భారత్‌ ‌పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. దేశంలో మైనారిటీల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనను భారత ప్రభుత్వం పట్టించు కోవడంలేదంటూ మనదేశాన్ని సదా అప్రతిష్టపాలు చేయడానికి యత్నిస్తున్న ఈ యు.ఎస్‌. ‌ఫెడరల్‌ ‌కమిషన్‌ ‌వెనుక ఎవరున్నారనేది ‘డిజ్‌ ఇన్‌ఫో ల్యాబ్‌’ ‌నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఇస్లామిస్ట్ ‌గ్రూప్‌ ఇం‌డియన్‌ అమెరికన్‌ ‌ముస్లిం కౌన్సిల్‌ (ఐఏఎం‌సీ), 2013- 14 నుంచి యుఎస్‌సీ ఐఆర్‌ ఎఫ్‌లో పెద్ద ఎత్తున లాబీయింగ్‌ ‌నిర్వహించి పలుకుబడిని సంపాదించింది. దీని వ్యవస్థా పకుడు షేక్‌ ఉబాయిద్‌. ఇస్లామిక్‌ ‌సర్కిల్‌ ఆఫ్‌ ‌నార్త్ అమెరికా (ఐసీఎన్‌ఏ)‌లో ఒకప్పుడు ప్రముఖ పాత్ర పోషించారు. 2005లో అప్పటి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీని అమెరికా రాకుండా నిషేధించడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఐసీఎన్‌ఏ ‌సంస్థనే. ఐఏఎంసీ వ్యవహారశైలిపై మనదేశ మీడియాలో గతంలో ఎన్నోమార్లు వార్తలు వచ్చాయి. 2021 డిసెంబర్‌లో, త్రిపురలో మతఘర్షణలు చెలరేగినప్పుడు తప్పుడు వార్తలను ప్రచారం చేసిందన్న కారణంగా ‘చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) సవరణ చట్టం’ (యూఏపీఏ) కింద ఈ సంస్థపై కేసు నమోదైంది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంలో ఐఏఎంసీ మాజీ భారత ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీని ఆహ్వానించడం అప్పట్లో పెద్ద వివాదం సృష్టించింది. 2013-14 నుంచి షేక్‌ ఉబాయిద్‌, ఐఏఎం‌సీతో కలిసి యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లోను ప్రముఖ స్థానాల్లో ఉన్నవారితో ముఖ్యంగా ఇప్పటి యు.ఎస్‌. ‌ఫెడరల్‌ ‌కమిషన్‌ ‌ఛైర్‌ ‌పర్సన్‌ ‌నడేన్‌ ‌మైంజాతో కలిసి పనిచేస్తూ భారత్‌ను సి.పి.సి. జాబితాల్లో చేర్చేందుకు కృషిచేస్తున్నాడు. ఐఏఎంసీ మొట్ట మొదటిసారి, ఫెడ్రిస్‌ ‌గవర్నమెంట్‌ ‌రిలేషన్స్ (ఎఫ్‌జీఆర్‌) ‌లాబీయింగ్‌ ‌సంస్థ అధ్యక్షుడు టెర్రీ అలెన్‌కు కొంత మొత్తం చెల్లించి భారత్‌ను బ్లాక్‌ ‌లిస్ట్‌లో పెట్టేందుకు యుఎస్‌సీ ఐఆర్‌ఎఫ్‌లో లాబీయింగ్‌ ‌చేసినట్టు ఆరోపణ లున్నాయి. కేవలం ఈ లాబీయింగ్‌ ‌ప్రభావం వల్లనే భారత్‌ ‌మ్యాపులో జమ్ము-కశ్మీర్‌, ‌లద్దాక్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లు లేకుండా 2014లో యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ‌ప్రచురించింది. ఇదిలావుండగా ప్రస్తుత యుఎస్‌సీ ఐఆర్‌ఎఫ్‌ ‌చీఫ్‌గా వ్యవహరిస్తున్న నడేన్‌ ‌మైంజాకు, భారత్‌కు చెందిన ఆంథ్రోపాలజిస్టు, చరిత్రకారిణి, ఫెమినిస్టు అంగనా చటర్జీ సంస్థ ‘హార్డ్‌వైర్డ్ ‌గ్లోబై’లో భాగస్వామ్యం ఉందని చెబుతారు. మరి ఈ అంగనా చటర్జీ, ఐఎస్‌ఐ ఏజెంట్‌ ‌గులాం నబీ ఫాయ్‌కి అత్యంత సన్నిహితురాలుగా పేరుంది. అంతే కాకుండా ‘కొయిలేషన్‌ అగెనెస్ట్ ‌జీనోసైడ్‌’ ‌సంస్థకు షేక్‌ ఉబాయిడ్‌, అం‌గనా చటర్జీలు వ్యవస్థాపక సభ్యులు. ఈమె తరచుగా వాషింగ్టన్‌లో కశ్మీర్‌పై ఐఎస్‌ఐ ‌నిర్వహించే కార్యక్రమాలకు హాజరవు తుంటారని డిసిన్‌ఫో ల్యాబ్‌ ‌బయటపెట్టింది.

బర్మా టాస్క్ ‌ఫోర్స్

ఇస్లామిక్‌ ‌సర్కిల్‌ ఆఫ్‌ ‌నార్త్ అమెరికాకు అనుబంధ సంస్థే బర్మా టాస్క్ ‌ఫోర్స్ (‌బీటీఎఫ్‌) అని అధికార్లు చెబుతున్నారు. ఈ బీటీఎఫ్‌ ‌వ్యవస్థాపకుల్లో షేక్‌ ఉబాయిద్‌ ‌కూడా ఉన్నాడు. ఐసీఎన్‌ఏ ‌పూర్వ రూపం ‘‘హల్‌ఖా-ఇ- హబాబ్‌-ఇ- ఇస్లామీ’’ (హెచ్‌ఏఐ). ఇది 1968లో ఏర్పాట యింది. 1971లో ‘‘బెంగాల్‌లో మేధావుల జీనోసైడ్‌’’‌కు కారకుడుగా నేరం నిరూపితమైన అష్రాఫుజ్‌ ‌జమాన్‌ ‌ఖాన్‌కు ‘‘ఐసీఎన్‌ఏ ‌క్వీన్స్ ‌చాప్టర్‌ ‌న్యూయార్క్’’‌తో సంబంధాలున్నాయి. బర్మా టాస్క్ ‌ఫోర్స్ ‌వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకడు. జమాత్‌-ఇ-ఇస్లామీ, హిజ్‌బుల్‌ ‌ముజాహిద్దీన్‌ ‌వ్యవస్థాపకుడు సలావుద్దీన్‌తో ఐసీఎన్‌ఏకున్న సంబంధాలు జగద్విదితమే. ఎఫ్‌జీఆర్‌ను, బర్మా టాస్క్ ‌ఫోర్స్ (‌బీటీఎఫ్‌) ‌కూడా అద్దె ప్రాతిపదికన తన ఆధీనంలో ఉంచుకుంది. బీటీఎఫ్‌ ‌కూడా భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. యుఎస్‌ ‌కాంగ్రెస్‌లో కూడా భారత్‌కు వ్యతిరేకంగా లాబీయింగ్‌ ‌జరిపేందుకు ఎఫ్‌జీఆర్‌ను ఈ సంస్థ ఉపయోగించు కుంటోంది. ఐఎస్‌ఐ ఏజెంట్‌ ‌గులాం నబీ ఫాయ్‌కి ఆశ్రయం ఇచ్చింది. 2011లో 3.5 మిలియన్‌ ‌యుఎస్‌ ‌డాలర్లను అమెరికానుంచి పాకిస్తాన్‌కు అక్రమ బదలాయింపు కేసులో ఎఫ్‌బీఐ ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇతడు కశ్మీరీ వేర్పాటు వాదులకు లాబీయింగ్‌ ఏజెంట్‌గా ఐఎస్‌ఐ ‌తరపున పనిచేస్తాడన్నది లోక విదితమే. యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌కు చెందిన అనురిమ భార్గవ కూడా భారత్‌కు వ్యతిరేకంగా విద్వేష ప్రచారంలో పాలుపంచు కుంటున్నారు. జార్జ్ ‌సోరస్‌ ‌స్థాపించిన ఓపెన్‌ ‌సొసైటీ ఫౌండేషన్‌లో ఈమె సభ్యురాలు. భారత్‌, ‌రష్యా, చైనాల్లోని జాతీయవాదాన్ని సోరస్‌ ‌తీవ్రంగా వ్యతిరేకిస్తారు.

యుఎస్‌సిఆర్‌ఐఎఫ్‌కు చెందిన చాలామంది సీనియర్‌ అధికార్లు… ఐఏఎంసీ, జమాత్‌ అనుబంధ సంస్థలైన ‘బర్మా టాస్క్ ‌ఫోర్స్’, ‘‌జస్టిస్‌ ‌ఫర్‌ ఆల్‌’ ‌వేదికలపై తరచుగా కనిపించడమే కాదు, 2018-20 మధ్య కాలంలో భారత్‌ ‌పట్ల తమ విద్వేషాన్ని వెళ్లగక్కడం గమనార్హం. రొహింగ్యాలకు సహాయం పేరుతో బర్మా టాస్క్‌ఫోర్స్ 2018‌లో ‘జకాత్‌’‌ను సేకరించి, ‘ఫెడిలిస్‌ ‌గవర్నమెంట్‌ ‌రిలేషన్స్’ ‌సంస్థకు కొంత ముట్టజెప్పి లాబీ నడిపిన పుణ్యమాని యుఎస్‌సీఆర్‌ఐఎఫ్‌ ‌తన నివేదికలో సీపీసీ కింద భారత్‌ను తక్కువ చేస్తూ, వ్యతిరేకిస్తోందన్న ఆరోపణ లున్నాయి. విచిత్రమేమంటే బర్మా టాస్క్‌ఫోర్స్‌ను జస్టిస్‌ ‌ఫర్‌ ఆల్‌ ‌సంస్థ కూడా నిర్వహిస్తుంది. ‘డిజ్‌ఇన్‌ఫో ల్యాబ్‌’ ‌ప్రకారం ఈ సంస్థకు కావలసిన అన్ని వనరులను చికాగోకు చెందిన ‘సౌండ్‌ ‌విజన్‌’ అనే మల్టీమీడియా సంస్థ సమకూరుస్తుంటుంది. ఈ సౌండ్‌ ‌విజన్‌ను 1988లో జమాత్‌కు చెందిన ‘ఐసీన్‌ఏ’ ‌నెలకొల్పింది. ఐసీఎన్‌ఏ ‌మ్యాగజైన్‌ ‘‌ది మెసేజ్‌ ఇం‌టర్నేషనల్‌’ ‌హిజ్‌బుల్‌ ‌ముజాహిద్దీన్‌ ఉ‌గ్రవాది సయ్యద్‌ ‌సలావుద్దీన్‌ను కశ్మీర్‌ను భారత్‌ ‌నుంచి వేరుచేయడానికి ఎంతో కృషి చేశారంటూ గతంలో పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం.

ఊపందుకున్న భారత వ్యతిరేక ప్రచారం

ఇదిలావుండగా ఈ పరిణామాలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తున్న పశ్చిమదేశాల్లోని మన అధికార్లు చెప్పిన దాని ప్రకారం, పశ్చిమదేశాల్లో ఇటీవల భారత వ్యతిరేక సదస్సులు, సమావేశాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇందులో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన ‘ప్రభావశీలుర’ను అన్ని ఖర్చులూ భరించి ఆయా సమావేశాలకు ఆహ్వానించి, ‘మతసహనం’పై వారి అభిప్రాయాలను వ్యక్తం చేయమంటారు. ఈవిధంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల సారాంశం, యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ‌నివేదికకు ప్రధాన ఆధారం. ముఖ్యంగా పాకిస్తాన్‌ ‌ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసేవారు ఈవిధంగా భారత వ్యతిరేక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.

భారత్‌పై ప్రభావం ఎంత?

మనదేశ కేంద్ర నాయకత్వం పటిష్టమైన రీతిలో, వ్యూహాత్మక విదేశాంగ విధానంతో ముందుకెళుతోంది. అమెరికా, రష్యా, యు.కె, ఫ్రాన్స్, ఆ‌స్ట్రేలియా, జపాన్‌ ‌వంటి అగ్రదేశాలు, యూరప్‌ ‌దేశాలు మనదేశ భాగస్వామ్యం, సహకారం లేకుండా ముందడుగు వేయలేని స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అన్ని గ్రూపుల్లో సభ్యులుగా ఉంటూ, మన దేశ హితం కోసమే దేశ నాయకత్వం పనిచేస్తుండటం, అన్ని దేశాల్లోను ఆలోచనను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం 40 దేశాలు మన విదేశాంగ విధానాన్ని ఒక నమూనాగా తీసుకోవడం ఇందుకు ఉదాహరణ. భారత సహాయ సహకారాలు లేకుండా ఇండో-పసిఫిక్‌ ‌రీజియన్‌లో అమెరికా తన వ్యవహారాలను నడపలేదు. అమెరికాలో మానవహక్కుల ఉల్లంఘనపై వేలెత్తి చూపే స్థాయికి భారత్‌ ఎదిగింది. భారత్‌తో వ్యవహ రించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు కోవాల్సిన పరిస్థితి ఆయా దేశాల్లో నెకొంది. ఈ నేపథ్యంలో యుఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ‌నివేదికపై అమెరికా ప్రభుత్వం పెద్దగా దృష్టిపెట్టే అవకాశం ఉండదు. కాకపోతే రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో కొరుకుడు పడని భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడైనా ఈ నివేదికను అమెరికా ఉపయోగించు కోవచ్చు. కానీ తమదేశంలోని నల్లజాతివారిపై వివక్షను భారత్‌ ఎత్తిచూపితే దానివద్ద సమాధానం ఉండదు. ఇది ఇప్పటికే అమెరికా గడ్డ పైనే మన విదేశాంగ మంత్రి జయశంకర్‌ ‌కుండబద్దలు కొట్టారు.

వాస్తవాలను తోసిరాజని, లాబీయింగ్‌లు, లంచాలు మెక్కి తయారుచేసే నివేదికలకు ఎప్పటికీ విలువ ఉండదు. తమ మతాల వ్యాప్తికోసం విపరీతంగా పోటీ పడుతున్న ‘క్రైస్తవ’, ‘ముస్లిం’ సంస్థలు, మత సహనంపై మాట్లాడటమే విచిత్రం. ‘నిజం’ ఎప్పుడూ నిప్పులాగానే ఉంటుంది. దాన్ని అడ్డుకోవాలనుకునే తాటాకుల వంటి ‘అబద్ధాలు’ భస్మం కాకమానవు.

By editor

Twitter
Instagram