మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరం. మీ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మీకెంత ఉందో, అవతలి వారికి అంతే స్వేచ్ఛ ఉంటుంది. ఎదుటివారిపై మీ విశ్వాసాలు రుద్దుతామంటేనే సమస్యలు వస్తాయి. ప్రార్థనాలయాల్లో లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగాన్ని ఇదే కోణం నుంచి చూడాలి. హిజాబ్‌ ‌లాగే ‘అజాన్‌’‌ను కూడా సమస్యను చేసి దేశంలో సామరస్యాన్ని దెబ్బతీయాలని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఇస్లాంలో అజాన్‌ ‌కోసం లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగం తప్పనిసరి కాదని అలహాబాద్‌ ‌న్యాయస్థానం గత ఏడాది స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అజాన్‌ అం‌టే నమాజ్‌కు పిలుపు. ఇందుకోసం రోజుకు 5 సార్లు లౌడ్‌ ‌స్పీకర్లను ఉపయోగిస్తున్నారు. ఇస్లాంలో ఇలాంటి సంప్రదాయం ప్రస్తావన ఎక్కడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ ‌దేశాల్లో కూడా లౌడ్‌ ‌స్పీకర్ల మీద నియంత్రణ ఉంది. భారత్‌లో మాత్రం ఇదొక సమస్యగా మారింది.

అజాన్‌, ‌లౌడ్‌ ‌స్పీకర్లే కేంద్ర బిందువుగా ఇటీవల మహారాష్ట్రలో తలెత్తిన పరిణామాలు చర్చనీయాం శాలుగా మారాయి. చివరికి ఇదే ‘అజాన్‌ ‌వర్సెస్‌ ‌హనుమాన్‌ ‌చాలీసా’గా మార్చింది మీడియా. ఉత్తరప్రదేశ్‌, ‌కర్ణాటకతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాలను కూడా ఈ సమస్య ప్రభావితం చేస్తోంది. దీన్ని బీజేపీ, వీహెచ్‌పీలతో ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. రాజ్‌ ‌ఠాక్రే, రవి రాణా, నవనీత్‌ ‌దంపతుల హెచ్చరికలు, అరెస్టులు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. కానీ ఈ సమస్యకు ఎక్కడ బీజం పడిందనే అంశంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు.

రాజ్‌ ‌ఠాక్రే డిమాండ్‌

‌ముంబైలోని శివాజీ పార్క్‌లో నిర్వహించిన గుడిపడ్వ ర్యాలీలో మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ ‌సేన అధినేత రాజ్‌ ‌ఠాక్రే మసీదుల్లో లౌడ్‌ ‌స్పీకర్లను తొలగించాలని డిమాండ్‌ ‌చేయడంతో అందరి దృష్టి అటు మళ్లింది. మే 3వ తేదీలోగా తన డిమాండ్‌ ‌నెరవేరాలని హెచ్చరించారు కూడా. ‘మాకు మహారాష్ట్రలో అల్లర్లు రేపడం ఇష్టం లేదు. ప్రార్థనలకు వ్యతిరేకం కాదు. కానీ మీరు లౌడ్‌స్పీకర్‌లో ప్రార్థన చేస్తే, మేము కూడా లౌడ్‌స్పీకర్లను ఉపయోగిస్తాం. చట్టం కంటే మతం పెద్దది కాదని ముస్లింలు అర్థం చేసుకోవాలి’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు రాజ్‌. ‌మతాలు పుట్టినప్పుడు మైకులున్నాయా? ఇతర దేశాల్లో మీరు మైకులను చూశారా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత, మీరు లౌడ్‌ ‌స్పీకర్లలో అజాన్‌ ‌చేస్తే, మేం మసీదుల ముందు హనుమాన్‌ ‌చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. ఇంతకీ రాజ్‌ ఈ ‌ప్రకటన ఎందుకు చేశారు? మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ ‌లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది సుస్పష్టం. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శివసేనలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో శివసేన ప్రాబల్యాన్ని తగ్గించి ఆ స్థానాన్ని భర్తీ చేయడమే రాజ్‌ ‌ఠాక్రే ఎత్తుగడ అని విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో జరిగే ముంబై సహా నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికల కోసమే రాజ్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

ఆత్మరక్షణలో ఉద్ధవ్‌ ‌సర్కార్‌

‌రాజ్‌ ‌హెచ్చరికల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మత కార్యకలాపాలలో స్పీకర్లు ఉపయోగానికి అనుమతులు తప్పనిసరి చేయనున్నట్టు హోం శాఖ వెల్లడించింది. ఈ అంశం మీద గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించి నట్టు తెలిపింది. రాజ్‌ఠాక్రే హెచ్చరికలతో శివసేన, అఘాడీ సర్కార్‌ ఆత్మరక్షణలో పడ్డాయి. రాజ్‌ను ‘హిందూ ఒవైసీ’గా అభివర్ణించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ ‌రౌత్‌. ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్‌ ఒవైసీ వ్యవహరించినట్లు రాజ్‌ఠాక్రే మహారాష్ట్రలో పని చేస్తున్నారని ఆరోపించారు. కొత్త ఒవైసీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని, రాముడు, హనుమంతుల పేరుతో అల్లర్లు రెచ్చగొట్టే లక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతున్నది.

హనుమాన్‌ ‌చాలీసా కలకలం

మహారాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్‌ ‌కపుల్‌గా ప్రసిద్ది పొందిన రవి రాణా, నవనీత్‌ ‌కౌర్‌ ‌ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు ప్రశ్నార్థకంగా మారారు. రవి రాణా బద్నేరా శాసన సభ్యుడు. ఆయన భార్య, సినీ నటి నవనీత్‌ అమరావతి నుంచి లోక్‌ ‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ స్వతంత్రులు. రాష్ట్రంలో శాంతి నెలకొన డానికి ముఖ్యమంత్రి చాలీసాను పఠించాలని రాణా దంపతులు డిమాండ్‌ ‌చేశారు. ఉద్ధవ్‌ ‌తిరస్కరించారు. ఈ క్రమంలో తామే ముఖ్యమంత్రి ఇంటి ముందు ఏప్రిల్‌ 23‌వ తేదీన హనుమాన్‌ ‌చాలీసా చదువుతామని రవి, నవనీత్‌ ‌ప్రకటించారు. దీనినే శివసైనికులు రచ్చ చేశారు.

రాణా దంపతుల ప్రకటనతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు ఉద్దవ్‌ ‌ఠాక్రే ఇంటి ముందు పారాయణాన్ని తలపెట్టిన తేదీకి ముందు రోజు రాత్రే ముంబై లోని రాణా నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. తాము ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడం, మరుసటి రోజు ముంబైలో ప్రధాని పర్యటను దృష్టిలో పెట్టుకొని తమ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు రాణా దంపతులు. అయినా మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నించారనే అభియోగంపై ఆ ఇద్దరిని ముంబై పోలీసులు ఆరెస్టు చేశారు. తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలన్న నవనీత్‌ ‌దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించినా ధర్మాసనం వారి పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా పోలీసు స్టేషన్‌లో తనను వేధించారని లోక్‌సభ స్పీకర్‌కు ఓం బిర్లాకు నవనీత్‌ ‌కౌర్‌ ‌లేఖ రాశారు. దీనిపై జవాబు చెప్పాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్‌ ‌సెక్రటేరియట్‌ ‌నోటీసులు జారీ చేసింది. మరోవైపు హనుమాన్‌ ‌చాలీసా వివాదంపై ముఖ్య మంత్రి ఉద్దవ్‌ ‌తీవ్రస్థాయిలో స్పందించారు. తన ఇంటి వద్ద చాలీసా పఠిస్తే ఎలాంటి ఇబ్బందీ లేదని, దాదాగిరి చేస్తే మాత్రం సహించబోమన్నారు. హిందుత్వ గురించి తమకు ఎవరి పాఠాలు అవసరం లేదని, శివసేనను సవాల్‌ ‌చేస్తే తమ ఉగ్రరూప మేంటో చూపిస్తానని హెచ్చరించారు..

ఉత్తరప్రదేశ్‌లో ఆదేశాలు

ప్రార్థనా స్థలాలలో లౌడ్‌స్పీకర్‌ ఉం‌డరాదని ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల (ఏప్రిల్‌ 19) ఆదేశాలు జారీ చేశారు. మే 3వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇతర మతపరమైన ధార్మిక సంస్థలు ఉన్న మార్గాల్లో, ఆలయాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో స్పీకర్లు ఉపయోగించడంపై నిషేధం విధించారు. ఇప్పటికే ఉపయోగిస్తున్న ప్రార్థన స్థలాల్లో శబ్దం నిర్ణీత ప్రదేశాన్ని, పరిమితిని మించకూడదని ఆంక్షలు విధించింది.

ఉత్తరప్రదేశ్‌లో కొత్త ధార్మిక స్థలాల్లో లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగానికి అనుమతి తప్పనిసరి చేశారు. శోభాయాత్రలు, ఊరేగింపులు తీయడానికి అనుమతు లపై షరతులు విధించింది. ఈ నిబంధనలన్నీ అన్ని మతాలకు వర్తిస్తాయన్న యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు సంబంధించి పోలీసులు అనుమతిస్తేనే నిర్ణీత పరిమితి మేరకు చేపట్టే వీలు కల్పించింది యోగి సర్కార్‌. ‌లౌడ్‌ ‌స్పీకర్ల వాడకంపై ఇప్పటికే సెంట్రల్‌ ‌పొల్యుషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డ్ (‌సీపీసీబీ) నిర్దేశకాలున్నప్పటికీ అమలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో తాజా నిబంధనలకు ప్రాధాన్యత ఏర్పడింది.

రోజుకు 5 సార్లు చాలీసా

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌లో హిందూ జాగరణ్‌ ‌మంచ్‌ ‌ప్రాంతీయ మంత్రి విమల్‌ ‌ద్వివేది లౌడ్‌ ‌స్పీకర్‌లో అజాన్‌కు ప్రతిగా హనుమాన్‌ ‌చాలీసా పారాయణం ప్రారంభించడం కలకలం సృష్టించింది. నగరంలోని మొహల్లా హౌసింగ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌వద్ద ఉన్న శివాలయం నుంచి ఇటీవల రోజుకు 5 సార్లు హనుమార్‌ ‌చాలీసాను లౌడ్‌ ‌స్పీకర్‌ ‌ద్వారా వినిపించారు. అజాన్‌ ‌వర్సెస్‌ ‌హనుమాన్‌ ‌చాలీసా పోస్టర్లతో జై శ్రీరామ్‌ ‌నినాదాలు కూడా చేశారు. ముస్లిమేతర మెజారిటీ సమాజం మసీదుల నుండి ఆజాన్‌ ఎం‌దుకు వినాలి? అని ప్రశ్నించారు విమల్‌ ‌ద్వివేదీ. అజాన్‌లో అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించా లని చెప్పారని, ఇది ఎక్కడో హిందువుల మత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుంద న్నారు.

లౌడ్‌స్పీకర్‌ ఇస్లాంలో భాగం కాదని కోర్టు స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను అమలు కావడం లేదన్నారు ద్వివేదీ. మసీదుల నుంచి రోజుకు ఐదు సార్లు స్పీకర్ల ద్వారా అజాన్‌ ‌వినిపిస్తే తాను హనుమాన్‌ ‌చాలీసా వినిస్తామన్నారు. జిల్లాలోని ప్రతి దేవాలయంలోను హిందూ సమాజం దీనిని ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగంపై యోగి ప్రభుత్వం ఆంక్షలు విధించిన క్రమంలో విమల్‌ ‌ద్వివేదీ ఈ కార్యక్రమం చేపట్టడం విమర్శలకు దారి తీసింది.

కర్ణాటకలో గత ఏడాదే నిషేధం

కర్ణాటక రాష్ట్ర వక్ఫ్ ‌బోర్డు గత ఏడాది (2021) మార్చిలోనే కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 వరకూ లౌడ్‌ ‌స్పీకర్స్‌ను ఉపయోగించరాదని పిలుపును ఇచ్చింది. శబ్ద కాలుష్యం నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. సైలెన్స్ ‌జోన్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలను ఉల్లంఘించరాదని వక్ఫ్ ‌బోర్డు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. అజాన్‌, ‌ముఖ్యమైన ప్రకటనలకు మాత్రమే లౌడ్‌ ‌స్పీకర్లను వాడాలని కోరారు.

తాజాగా శబ్ద కాలుష్య నియంత్రణ నియమాలు పాటించని ప్రార్థనామందిరాలకు కర్ణాటక పోలీసు శాఖ నోటీసులు జారీ చేసింది. బెంగళూరు లోని 125 మసీదులకు, 83 దేవస్థానాలకు, 22 చర్చిలకు ఈ నోటీసులు వెళ్లాయి. కాగా మసీదు లౌడ్‌స్పీకర్ల శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రత్యేక పరికరా లను అమరుస్తున్నామని బెంగళూరు జామియా మసీదు ప్రధాన ఇమామ్‌ ‌మక్సూద్‌ ఇ‌మ్రాన్‌ ‌తెలిపారు.

అభ్యంతరాలు ఎన్నో..

అజాన్‌ ఉద్దేశం నమాజ్‌ ‌సమయం గుర్తు చేయడమే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందిన ఈ రోజుల్లో మసీదులో లౌడ్‌ ‌స్పీకర్లలో అజాన్‌ ‌వినిపించడం ఏ మేరకు అవసరం అనే ప్రశ్న తలెత్తు తోంది. లౌడ్‌ ‌స్పీకర్లో అజాన్‌ ‌వినిపించడం ఇతరులను ఇబ్బంది పెట్టడమేనని అంటున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరా మొబైల్‌ ‌ఫోను ఉన్నప్పుడు మసీదుకొచ్చి ప్రార్థనలు చేసేవారందరికీ మొబైల్‌లో రిమైండర్‌ ‌పంపించవచ్చు. అలాగే మసీదు ప్రాంగణంలో మాత్రమే వినబడేలా లౌడ్‌ ‌స్పీకర్‌ ‌సెట్‌ ‌చేసుకోవచ్చు..

తన నివాసానికి సమీపంలో ఉన్న ఒక మసీదులో ‘అజాన్‌’ ‌కోసం ఉపయోగించే లౌడ్‌ ‌స్పీకర్లను నిషేధించాలని కోరుతూ అలహాబాద్‌ ‌విశ్వవిద్యాలయ వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌సంగీత శ్రీవాస్తవ జిల్లా కలెక్టర్‌కు గతంలో ఓ లేఖ రాశారు. అజాన్‌ ‌వల్ల తన నిద్రకు భంగం కలుగుతోందని చెప్పారు. అజాన్‌ అయి పోయిన తర్వాత కూడా మళ్లీ నిద్ర పట్టడం లేదని చెప్పారు. దీనివల్ల తనకు తలనొప్పి రావడమే కాకుండా.. తన పనితీరుపై కూడా ప్రభావం పడుతోందని అన్నారు.

2017లో బాలీవుడ్‌ ‌గాయకుడు సోనూ నిగమ్‌ ‌మార్నింగ్‌ అజాన్‌ ‌విషయంలో చేసిన ట్వీట్‌ ‌కలకలం రేపింది. ‘దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. నేను ముస్లింని కాదు, ఉదయం అజాన్‌తో నిద్ర లేవాలి. భారతదేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడు అంతమవుతుంది?’ అని ప్రశ్నించాడు. సోనూ ట్వీట్‌పై బెదిరింపులు వచ్చాయి. ఈ గాయకుడికి గుండు కొట్టిన వారికి రూ. 10 లక్షలు ఇస్తానని ఒక ముల్లా ఫత్వా జారీ చేశాడు. ఇలా ఎంతో మంది అజాన్‌ ‌కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. బెదిరింపులకు భయపడి ఏమీ చేయలేని పరిస్థితి. మసీదులలో లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగాన్ని నిషేధించా లని కోరుతూ ఇటీవల గుజరాత్‌, ‌జార్ఖండ్‌ ‌హైకోర్టులలో వివిధ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

లౌడ్‌ ‌స్పీకర్‌ ‌తప్పనిసరి కాదు

మసీదుల్లో అజాన్‌కు సంబంధించి 2020 మే మాసంలో అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు ఇచ్చింది. నమాజ్‌ ‌పిలుపు కోసం లౌడ్‌ ‌స్పీకర్లు, ఇతర శబ్ద పరికరాలు ఉపయోగించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది మౌలిక విషయం కాదని, కేవలం గొంతెత్తి పిలవడం మాత్రమే ఉన్నదని, అది మాత్రమే అనుమతిస్తామని న్యాయస్థానం పేర్కొంది. మసీదుల్లోని మినార్ల పై నుంచి ముయెజిన్‌ (‌వ్యక్తులు) గొంతెత్తి అజాన్‌ ‌చేయడం మాత్రమే ఉన్నదని, లౌడ్‌ ‌స్పీకర్ల ద్వారా కాదని స్పష్టం చేసింది.

ధ్వని కాలుష్య నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా లౌడ్‌ ‌స్పీకర్లను ఉపయోగించడం చట్ట వ్యతిరేకమని కోర్టు గుర్తు చేసింది. అనుమతులు లేని వారు మైకుల్లో అజాన్‌ ‌పఠించకూడదని ఆదేశించింది. ప్రార్థనా మందిరాలు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం లేకుండా చూడాలంటూ న్యాయస్థానం అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను ఆదేశించింది. అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దాఖలైన పిటిషన్‌లను శబ్ద కాలుష్య నివారణ నిబంధనల ప్రకారం పరిశీలించవచ్చని పేర్కొంది. లౌడ్‌ ‌స్పీకర్ల వాడకం 25 అధికరణం కింద పేర్కొన్న ప్రాధమిక హక్కు కాదని, రాజ్యాంగంలోని మూడవ భాగం కింద ప్రాధమిక హక్కు కూడా ప్రజా వ్యవస్థ, ఆరోగ్యం, ఇతర అంశాలను ప్రభావితం చేయనంత వరకేనని కోర్టు చెప్పింది.

సుప్రీం కోర్టు, ఇతర కోర్టుల్లో..

మన దేశంలో సుప్రీంకోర్టు సహా పలు న్యాయస్థానాలు లౌడ్‌ ‌స్పీకర్ల వాడకం మీద ఇప్పటికే తీర్పులు చెప్పాయి. బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల మధ్య లౌడ్‌ ‌స్పీకర్లు, మ్యూజిక్‌ ‌సిస్టమ్‌లను ఉపయోగించడాన్ని జులై 2005లో సుప్రీం కోర్టు నిషేధించింది. ప్రజల ఆరోగ్యంపై శబ్ద కాలుష్యం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. పండుగలు, మతపరమైన సందర్భాలలో అర్ధరాత్రి వరకు లౌడ్‌ ‌స్పీకర్ల వాడకంతో సహా ధ్వని కాలుష్య నిబంధనలను సడలించడానికి రాష్ట్రాలను అనుమతించే చట్టబద్ధమైన నియమం చెల్లుబాటును అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సి లాహోటి, జస్టిస్‌ అశోక్‌ ‌భాన్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించింది. అయితే నిషేధాన్ని సడలించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అధికారులకు అప్పగించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

లౌడ్‌ ‌స్పీకర్‌ ‌వాడకం ప్రాథమిక హక్కు కాదని 2016 ఆగస్ట్‌లో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. లౌడ్‌ ‌స్పీకర్‌ ‌లేదా పబ్లిక్‌ అ‌డ్రస్‌ ‌సిస్టమ్‌ను ఉపయోగించే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ‌ద్వారా అందించిన ప్రాథమిక హక్కు అని ఏ మతం లేదా శాఖ క్లెయిమ్‌ ‌చేయలేదని హైకోర్టు పేర్కొంది. అన్ని మత స్థలాలు శబ్ద కాలుష్య నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని మేము నమ్ముతున్నాం. లౌడ్‌ ‌స్పీకర్‌ ‌లేదా పబ్లిక్‌ అ‌డ్రస్‌ ‌సిస్టమ్‌ను ఉపయోగించడం కోసం ఏ మతం లేదా శాఖ ప్రాథమిక హక్కును కోరలేదని స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌ ‌హైకోర్టు 2018 జూన్‌లో లౌడ్‌ ‌స్పీకర్లకు ఐదు డెసిబల్‌ ‌పరిమితిని విధించింది. పగటిపూట కూడా లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగం, శబ్దం స్థాయి ఐదు డెసిబల్స్‌కు మించకూడదని వినియోగదారు హామీ ఇవ్వడంపై ఉత్తరాఖండ్‌ ‌హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అర్ధరాత్రి 12 దాటినా లౌడ్‌ ‌స్పీకర్లు మోగుతూనే ఉంటాయి. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాల ద్వారా కూడా అధికారుల నుండి రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్‌ ‌స్పీకర్‌ ఉపయోగించడానికి అనుమతి ఉండదని కోర్టు పేర్కొంది.

2020 జులైలో ఉత్తరాఖండ్‌ ‌హైకోర్టు ఐదు డెసిబల్స్‌కు పరిమితం చేస్తూ 2018లో జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది. రాష్ట్రంలోని మత సంస్థలలో లౌడ్‌ ‌స్పీకర్ల వాడకంపై నిషేధాన్ని ఎత్తివేయడానికి మార్గం సుగమం చేసింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ధ్వని కాలుష్య నియంత్రణ నిబంధనలు-2000 ప్రకారం మైకులు, లౌడ్‌ ‌స్పీకర్లు, ఇతర పబ్లిక్‌ అ‌డ్రెస్‌ ‌సిస్టమ్స్‌ను అనుమతి లేకుండా వాడరాదు. ఇందుకు అధికారుల రాతపూర్వక అనుమతి అనివార్యం.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మైకులు, మ్యూజిక్‌ ‌సాధనాలు, సౌండ్‌ ‌యాంఫిల్‌ఫైర్స్ ‌వంటివి వాడరాదు. అయితే ఆడిటోరియం, కమ్యూనిటీ హాళ్లలో ఉపయోగించ వచ్చు. లేదా పబ్లిక్‌ ఎమర్జెన్సీ సమయంలోనూ వాడొచ్చు.

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్రాల అవతర దినోత్సవాలు, పండగలు, సాంసృతిక ప్రదర్శనలు, మతపరమైన కార్యక్రమాలకు పరిమితుల మధ్య రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మైకులు వాడేందుకు అనుమతులు ఇవ్వొచ్చు. అయితే సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఇందుకు అనుమతించాలి.

జన నివాస ప్రాంతాల్లో ధ్వని తీవ్రత పగలు (ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలు) 55 డెసిబల్స్ ‌కంటే ఎక్కువ ఉండరాదు. రాత్రి వేళ (రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలు) 45 డెసిబల్స్ ‌మించరాదు. మైకులు ఉన్న ప్రాంతంలో ధ్వని తీవ్రత ఆ ప్రాంతంలో అనుమతించి ప్రమాణాలకు అదనంగా 10 డెసిబల్స్ ‌కంటే ఎక్కువ ఉండకూడదు.

సౌదీలో నిషేధం

లౌడ్‌ ‌స్పీకర్లు, అజాన్‌ అం‌శాన్ని మైనారిటీల వేధింపులలో భాగమని ప్రతిపక్షాలు, కొన్ని సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే పలు ఇస్లామిక్‌ ‌దేశాల్లో వీటిమీద ఇప్పటికే నియంత్రణ కొనసాగుతున్న మాట వాస్తవం.

ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న సౌదీ అరేబియాలో సైతం ఇలాంటి ఆంక్షలు విధించారు. గత ఏడాది సౌదీ క్రౌన్‌ ‌ప్రిన్స్ ‌మొహమ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌ ‌కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వాటి ప్రకారం మసీదుల్లో లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగాన్ని పరిమితం చేశారు. గరిష్ట వాల్యూమ్‌లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ సెట్‌ ‌చేయకూడదు. మసీదులు అజాన్‌, ఇఖామత్‌ (‌సామూహిక ప్రార్థన కోసం) పిలుపు కోసం మాత్రమే లౌడ్‌ ‌స్పీకర్లను ఉపయోగించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారు. వాస్తవానికి సౌదీ అరేబియాలో 2009లోనే ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వహాబీ ఆదిపత్య సున్నీలు ఎక్కువగా ఉండే ఆ ఎడారి దేశంలో సంప్రదాయవాదుల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా అమలు కాలేదు. లౌడ్‌ ‌స్పీకర్ల ద్వారా పెద్ద శబ్దాలు పిల్లలకు, వృద్ధులకు ఇబ్బందికరంగా ఉన్నాయని ఇస్లామిక్‌ ‌వ్యవహారాల మంత్రి అబ్దుల్‌ ‌లతీఫ్‌ ‌తెలిపారు. ఈ కారణంగా నిషేధాన్ని విధించామని సమర్ధించుకున్నారు. ప్రార్థించాలనుకునే వారు ఇమామ్‌ల ప్రార్థన కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE