– డా।। గోపరాజు నారాయణరావు

‘‘ఆ తర్వాత పాడేవాళ్లం, ‘అందమైన నందపురము… నందియాటలే ఆడివద్దాం! తీయ గుమ్మడి తీసివద్దాం-మళ్ల గుమ్మడి మరలివద్దాం!’’ ‘‘నందపురం ఎక్కడ తాతా?’’ అంది ఆ పిల్ల. తన ఊతకర్ర ఠక్కున అందుకుని సుతారంగా జబ్బ మీద ఓ దెబ్బ వేశాడు రామునాయుడు. ‘‘అబ్బ!’’ అంది నవ్వుతూ ఆ పిల్ల. ‘‘వాన కొవ్వలిలాగా ఉంది (వాన పాము), పాపం ఆ బొట్టెని కొడతావేటీ, ఏదో చెప్పమంటే?!’’ అంది మరొక ముసలమ్మ. ‘‘ఏమే, ముసిలీ! దీని తాత ఎక్కడ చచ్చాడే, నన్నడుగు తాందిది? అందుకే చిన్న దెబ్బ.’’ అని నవ్వుతూ కొట్టిన దెబ్బకి వివరణ ఇచ్చి, ఆపై అసలు కథ కూడా చెప్పడానికి రామునాయుడు నోరెత్త బోతుంటే అంది సన్యాసమ్మ కూతురు. ‘‘మా తాత మాట్లాడు! ఏటీ సెప్పడు!’’ అంది కళ్లు తిప్పుతూ ఆ పిల్ల. ‘‘అలాగా! అరటి పండుతినరా కొండదొరా అంటే, ఉడకలేద న్నాడంట. అలాగుందిప్పుడు! ఆడు మాట్లాడా?! నువ్వు ఇనిపించుకోవా? సర్లే, ఇదిగో విను.’’ అని ఒక నిమిషం ఆగి చెప్పాడు. ‘‘జయపురం మారాజు ఉన్నాడా? కళింగంలో జయపురం. ఆయనే ఒకప్పుడు ఈ మన్యానికి మారాజు. ఆ రాజుగారి రాజ్యానికి రాజధాని నందపురం. అక్కడికెల్లి నందిపండగ ఆటలాడి వద్దాం, ఓ తీయ గుమ్మడి పండూ! ఓ మళ్ల గుమ్మడి పండూ! అని పాడుతున్నారు. అర్థమైందా?’’ అన్నాడు రామునాయుడు. ‘‘సరేగానీ, జయపురం మారాజు ఉండగా… మరి, సముద్రాల వతల నుంచి ఈ తెల్లోడు ఎలా ఊడిపడ్డాడిక్కడికి?’’ అడిగిందో ముసలమ్మ. ‘‘మన రాజులే ఓడిపోయి, ఆళ్ల సేతుల్లో పెట్టారు మన్యాన్ని. తెల్లోళ్లు మనల్ని కూడా ఆళ్ల సొంతం చేసుకున్నారు…’’ అన్నాడు రామునాయుడు. ‘‘కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు కాదయ్యా! కొంచెం అర్థమయ్యేలా చెప్పు!’’ అందామె.

‘‘ఇజీనగరం రాజులూ, సీమదొరలు యుద్ధం చేసుకున్నారు. మళ్లీ బొబ్బిలి జమిందార్లూ ఇజీనగర పోళ్లూ యుద్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి మన్యానికి తెగులు పట్టింది. ఈ గూడెం కొండలని గొలుగొండ జమిందార్లు ఏలేవారంట. ఈ గొలు గొండ జమిందార్లు ఎవరనుకుంతాక్రు? మళ్లీ ఇజీనగరం రాజులకి సామంతులు. యుద్ధవంటే మాటలా? ఆ యుద్ధంతోనే ఇజీనగరపోళ్ల పనై పోయింది. ఈళ్ల వైబోగం తగ్గాక గొలుగొండోళ్లు మొగల పాదుషాల పంచన చేరారు. పేష్కష్‌ ‌కూడా ఆళ్లకే చెల్లించేవారంట. అంటే కప్పం. మొగల పాదుషాలు కూడా పోయారు. తెల్లోళ్లు దిగారు. గొలగొండోళ్లు పాదుషాలని ఒగీసి తెల్లోడి ముడైనక పడ్డారు. ఇప్పటికీ తెల్లోడికే కప్పం కడతన్నారు. ఇదెందుకు చెబుతున్నానంటే, దేవుడిచ్చిన ఈ అడవి మీద పన్నుల గొడవంతా ఈ గొలుగొండ కాడ నుంచే మొదలైంది. ఇనే వోళ్లుండి, చెప్పేవోళ్లుంటే రంప గొడవలు కానీ, గూడెం కతలు కానీ గొప్పగా ఉంటాయి. ఇంటే బారతం ఇనాలన్నట్టే ఉంటాయి’’ చెప్పాడు రామునాయుడు.

ఈ చుట్టూనే ఉన్న ఊళ్లినక ఇన్నిన్ని కతలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. వాళ్లకి. ‘‘ఇదిగో ముసలీ! ఈ తెల్లోళ్ల మీద మా చిన్నప్పుడు ఓ పాట కట్టారే. బలే పాట అనుకో…’’ అంటూ, అటూ ఇటూ ఒకసారి చూసి, బాగా గొంతు తగ్గించి పాడాడు రహస్యం వెల్లడిస్తున్నట్టు, ‘‘ఊ… ఊ… చెట్టుకు పన్నేస్తాడు, రాతికి పన్నేస్తాడు, భూమికి పన్నేస్తాడు… చీటి పొందకపోతే జైలుకు పంపిస్తాడో…!’’ అంటూ చక్కని హావభావాలతో సహా, చిటికలు వేస్తూనే చేతులు తమాషాగా ఆడిస్తూ పాడి వినిపించాడు.

పిల్లలంతా కూడా తలలు ముందుకు పెట్టి విన్నారు. పాటలో ఏముందో తెలియకపోయినా, తాత గొంతులో లయతో మాత్రం వాళ్ల తలలు కూడా నెమ్మదిగా ఊగాయి. అప్పుడే దూరంగా బాస్టియన్‌ ‌గొంతు వినిపించింది. అన్నీ బూతులు. ఎవరి మీదనో కొరడాతోనో, చింత బరికెతోనో దాడి చేసినట్టే ఉంది. ‘‘అబ్బా!’’ ఎవరిదో స్త్రీ గొంతు. అక్కడంతా విని పించింది. తరువాత కొన్ని మగగొంతుల నుంచి కూడా అవే ఆర్తనాదాలు. భయంతో రామునాయుడి గొంతు మూగబోయింది.

పిల్లలంతా కిక్కురు మనకుండా అటువైపు చూస్తు న్నారు, వణికిపోతూ. ఒక పిల్లాడు ఏడుపు మొదలు పెట్టాడు. ‘‘ఈ పూట ఈళ్లకి ఇంకో అరజాము ఆలస్యం… వొణానికి’’ అన్నాడు రామునాయుడు, ఒక నిమిషం తరువాత నెమ్మదిగా మౌనం వీడుతూ. ‘‘అదేంటయ్యోయ్‌!’’ అం‌ది నోరు నొక్కుకుంటూ ఓ ముసలమ్మ. ‘‘దొర గాండ్రిస్తడు. ఈళ్లు ఇంకో అరజాము పన్జేస్తారు. ఇంకో అడుగు రోడ్డేసి కదులు తారు…! ’’ రహస్యం విప్పాడు రామునాయుడు. కడుపులో కాలిపోతున్నా పని చేస్తూనే ఉన్నారు అక్కడ పెద్దవాళ్లు. అన్నం పెట్టే అమ్మ రాకకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఆకలితో నకనకలాడిపోతున్న పిల్లలు.

* * * * * * * * *

సాయంత్రం ఐదు గంటల వేళ. అలసటతో భారంగా ఒక్కొక్కటీ ఎక్కుతున్నారు గెస్ట్ ‌హౌస్‌ ‌మెట్లు, డాక్టర్‌ ‌మూర్తి. వేకువన బయలుదేరారాయన. ఇప్పటి కైంది. ఎక్కువ భాగం నడక. పై మెట్టుకు చేరాక ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి విస్తుపోయారు. మధ్యభాగం దగ్గర గోడకి జారబడి ఉన్నాడతడు. మేడ  మీద కూర్చుని కాళ్లు బారజాపాడు. మోకాళ్లు దిగువన ఒక టవల్‌ ‌చుట్టుకుని ఉన్నాడు. కాళ్ల దగ్గర కూర్చుని ఒక సహాయకుడు పాదాలు ఒత్తుతున్నాడు. మరొకడు వెనుక నిలబడి ఒళ్లు పడు తున్నాడు. చేతిలో పింగాణి ప్లేట్‌. ‌దాంట్లో వేయించిన చేప ముక్కలు కాబోలు ఉన్నాయి. ఫోర్కుతో ఒక్కొక్కటి నోట్లో పెట్టుకుంటూ ఆ ప్రకృతినే తదేకంగా చూస్తున్నాడతడు. డాక్టర్‌ ‌మూర్తి వచ్చిన సంగతి గమనించినా కాస్త కూడా కదల్లేదు. దారికి మధ్యలో ఉన్నాడు. ‘‘హలో…! ఆయామ్‌ ‌డాక్టర్‌ ‌మూర్తి. గవర్నమెంట్‌ ‌డాక్టర్‌ని. మీరు…?’’ అన్నాడు గొంతు సవరించుకుని. ‘‘విలియం, ఫ్రం విశాఖపట్నమ్‌. ‌డ్రైవర్‌ని.’’ అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. కానీ కదల్లేదు. ‘‘ఓ… మీరేనా? స్టీమ్‌ ‌రోడ్‌ ‌రోలర్‌ ‌డ్రైవ్‌ ‌చేస్తారట కదా! గ్రేట్‌. ‌మీ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలి!’’ నవ్వుతూ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి. – తాను డ్రైవర్‌నని తెలిసినా ఒక డాక్టర్‌ ‌నిష్కల్మషంగా చూపిస్తున్న మర్యాద అతడిలో కదలిక తెచ్చింది. అందుకే కొంత ధోరణి మార్చుకుని వినయంగా లేచి పక్కగా నిల బడ్డాడు. ‘‘మధ్య వాటాలో దిగారా! నాకు మంచి కాలక్షేపం అన్నమాట. చాలా అలసటగా ఉంది. ఇవాళికి మాట్లాడలేను. మళ్లీ కలవాలి మనం. థాంక్యూ’’ అని తన గదిలోకి వెళ్లారు డాక్టర్‌ ‌మూర్తి.

* * * * * * * * *

ఎక్కడ నుంచి తెచ్చి వేశారో మరి, ఆస్పత్రిలో ఉపయోగించే మంచంలా ఉంది. నెమ్మదిగా చలి అందుకుంటోంది. స్వెటర్‌ ‌వేసుకుని, ఒక మఫ్లర్‌ ‌చుట్టుకుని కూర్చున్నారు డాక్టర్‌ ‌మూర్తి. మంచం కింద కుమ్మర్లు చేసే మట్టి కుంపటి పెట్టారు. గెస్ట్ ‌హౌస్‌లో వెచ్చగానే ఉంది. నర్సీపట్నం నుంచి తెచ్చు కున్న లాంతరు వెలుగుతోంది, ముక్కాలి పీట మీద. దేని కోసమో, మెడికల్‌ ‌కిట్‌ ‌తెరిచారాయన. లోపలే ఉంది, ఆ డైరీ. అసలు పని మరచి దానిని బయటకు తీశారు. మొదటి బటన్‌ ‌లాగారు డాక్టర్‌ ‌మూర్తి. మన్యం డాక్టర్‌గా నియామకపుటుత్తర్వులు వచ్చాక ట్రైనింగ్‌ ‌కోసం మద్రాస్‌ ‌వెళ్లినప్పుడు వెతికి వెతికి కొనుక్కున్న డైరీ. వృత్తి పరమైన అనుభవాలు ఎలాగూ రాసి పెట్టాలి. అదే కాకుండా కొన్ని అరుదైన సంఘ టనలు మన్యంలో ఎదురుకావడం తథ్యం. వాటిని కూడా నమోదు చేసే ఉద్దేశంతోనే అలాంటి డైరీని ఎంపిక చేసుకున్నారాయన. కాస్త పెద్దదే. చూడ్డానికి ముచ్చటైన పెట్టెలాగే ఉంటుంది. మూడు వైపులా నల్లటి బటన్స్ ‌పెట్టారు. ఆయనకు ఇష్టమైన ఆకుపచ్చ రంగులో ఉంది. సంవత్సరం క్రితం, అంటే 1921 సంవత్సరం, మార్చి నెలలో దాదాపు 20 రోజులు మన్యంలో ఉన్నప్పుడు రాసుకున్న డైరీ. పేజీలు తిప్పుతూ ఒకచోట ఆగారు. ఆ పేజీ నింపిన క్షణం కళ్ల ముందు కదిలింది. కొండ మీద ఊరు చింతపల్లి. అదే మొదటిసారి చూడడం. అక్కడ ఇంకాస్త ఎత్తులో కట్టారు తాటాకుల ప్రభుత్వ బంగ్లా. చుట్టూ బలమైన వెదురు బొంగులతో కంచె నిర్మించారు. ఒక మధ్యాహ్నం లేత ఎండలో ఆ బంగ్లా అరుగుమీద కూర్చుని రాశారాయన… చింతపల్లి: 19-2-1921 డియర్‌ ‌మన్యం డైరీ! ఈ అడవి అద్భుత సౌందర్యాన్ని, కొండల ఠీవినీ, కొండగాలి పాటకి వివశత్వంతో ఊగిపోతున్నట్టుండే ఆకుల హొయలనీ, ఎండుటాకు లతో కలసి ఇసుక రేణువులు చేసే జుగల్బందీనీ, లోయల నిశ్శబ్దంలోని మార్మికతనీ, సెలయేళ్ల లయనీ అక్షరాలలో బంధించి నాతో తీసుకుపోదామన్న ఆశతో నిన్ను మోసుకొచ్చాను. కానీ నా కలంలోని ముదురు నీలం సిరాచుక్కలు అడవిబిడ్డల కన్నీళ్ల ముందు వెలవెలబోతున్నాయి. వాళ్ల కళ్లలోని తడిలో అంతటి దట్టమైన చీకటి. వాళ్ల గుండెల్లో తుపానుని ఏ చర్మచక్షువులూ చూడలేవు. అదెలా ఉంటుందో ఊహించుకున్నాక సిరాచుక్కలు సైతం ఆ నీళ్ల ముందు తేలిపోయాయి. అసలు అడవి గురించిన ఇప్పటి నా ఊహ తప్పేమో! అదిగో, ఎక్కడో మరి ఏదో పక్షి అరుస్తోంది. అడగాలంటే ఇక్కడ ఎవరూ లేరు. లోయంతా ప్రతిధ్వనించింది. అది సరే, ఇక్కడ రెండున్నరేళ్ల నుంచి రోడ్లు వేస్తున్నారు. నేను రెండేళ్ల నుంచి చూస్తున్నాను. తూర్పు కనుమలలో ఈ విశాఖ మన్యం మీద సర్కారు వారికి ఇలా హఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? రోడ్లు నాలుకల మాదిరిగా మన్యమంతా సాచుకుంటున్నాయి. 1882లో అటవీ చట్టం వచ్చే దాకా అడవుల గురించి కవులకి తప్ప బయటివారికెవ్వరికీ పట్టలేదు. ఆ సంవత్సరమే మొదటిసారి కొండసంత – లంబసింగి ఘాట్‌ ‌నిర్మించారట. 2,400 రూపాయలు ఖర్చు పెట్టి, మూడేళ్లు శ్రమిస్తే ఎద్దుల బండి తిరగడానికి వీలుగా ఓ రోడ్డు తయారైందట. అంటే సంత అవసరాల కోసమే. అటవీ సంపద బయటకు తరలిపోవడానికి ఓ చిన్న దారి. మళ్లీ ఇన్నేళ్లకి… ఎక్కడ చూసినా రోడ్డు పనే. ఎప్పుడూ లేదు, వాగుల మీద వంతెనలు కూడా కడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన అంటారే, అలా. – ప్రపంచ యుద్ధం తరువాత కరువొస్తే మళ్లీ మన్యంలో రోడ్డు పని మొదలయింది. రోడ్డు పనికొస్తే బియ్యం, కూలీ ఇస్తారు. అడవిలో అడుగు పెట్టడానికి వీల్లేని కొండోడు రోడ్డు పనికి వస్తున్నాడు. మన్యంలో గూడెం డివిజన్లో మొత్తం పది ముఠాలున్నాయి. గూడెం కొండలు రోడ్ల నిర్మాణంతో మార్మోగుతున్నాయి. మన్నెకొట్టాలంతా రోడ్ల పనే. లంబసింగి, పెద్దవలస, మాకారం, గూడెం ముఠాలలో ఏ మూలకి వెళ్లినా వాటి ప్రస్తావనే. లంబసింగి- కొండకంబేరు రోడ్డు, లంబసింగి-గూడెం రోడ్డు, లంబసింగి-గెమిలి రోడ్డు, లంబసింగి-మినుములూరు రోడ్డు, సింగరాజుపేట- దానూరు; సింగరాజుపేట బొంకులపాలెం రోడ్లు, బొంకులపాలెం-మరిపాలెం రోడ్డు, మర్రిపాలెం- గోర్జ, గోర్జ-దానూరు రోడ్డు పనులు, కొయ్యూరు ఘాట్‌ ‌రోడ్డు పని, ఏడొంపుల ఘాట్‌, ‌కృష్ణదేవిపేట-కాట్రగడ్డ రోడ్డు, కాట్రగడ్డ-గంగరాజు మాడుగుల, గంగరాజు మాడుగుల-లోతుగెడ్డ బ్రిడిల్‌ ‌పాత్‌, ‌నడింపాలెం-శరభన్నపాలెం రోడ్డు, కాట్రగడ్డ- పెద్దవలస రోడ్డు, లోతుగెడ్డ రోడ్డుకి మెరుగులు, కొన్నింటికి సోలింగ్‌, అలయన్మెంట్‌, ‌మెటలింగ్‌, ‌రీమెటలింగ్‌- ఇలా పనులే పనులు. ఇంకా ఉన్నాయి. గుర్తుకు రావడం లేదు. ఈసారి వెళ్లినప్పుడు చూడాలి. ఇంకో రకం పనులు కూడా ఉన్నాయి. మినుములూ రులో డిప్యూటీ తహసీల్దారు క్వార్టర్స్ ‌కడుతున్నారు. చింతపల్లి యూరోపియన్‌ ‌బంగ్లాకి మెరుగులు దిద్దు తున్నారు. గూడెంలో బంగ్లా నిర్మాణం, లంబసింగి బంగ్లాలకి మెరుగులు…. అబ్బో చాలా జరిగిపోతు న్నాయి. ఈ పనులన్నీ మన్యప్రజలే చేస్తున్నారు. ఆడ, మగ అంతా వెళుతున్నారు. వెళ్లడం లేదు, తీసుకువెళుతున్నారంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే- రోడ్డు పనికి లాక్కెళుతున్నారంటే అదే తిరుగులేని వాస్తవమవుతుంది. ఇప్పుడు ఈ కొండలూ, ఆ పురాతన వృక్షాలూ, సెలయేళ్లూ, జలపాతాలూ మాట్లాడగలిగితే అడవి బిడ్డల దుర్భర స్థితిని తప్ప మరొకటి చెప్పవు. అందుకే నా ఊహ తప్పనిపిస్తోంది- అడవి గురించి….. డైరీ మూసి పక్కన పెట్టారు, కళ్లు మూసుకుపోతున్నాయి. ‘అడవంటే ఒక బీభత్స సౌందర్యమేనా?’ నిద్ర మత్తు ముంచుకొస్తున్నా ఇదే ప్రశ్న ఆయన మెదడంతా తిరుగుతోంది.

* * * * * * * * *

ఓ వంకర గునపం పట్టుకుని అక్కడే ఏదో పెద్ద పని ఉన్నట్టు వడివడిగా వస్తున్నాడు కిష్టయ్య. చదును చేసిన చోట బుంగతో నీళ్లు చల్లుతూ నేర్పుగా తడుపు తోంది సన్యాసమ్మ. ఒక్కతే ఉంది. అక్కడ నేలని పరీక్షిస్తున్నట్టు గునపం గుచ్చుతున్నాడు కిష్టయ్య. ఒక్క నిమిషం తరువాత అర్థమైంది సన్యాసమ్మకి. ‘ఈడెనకాలే బేస్టీను దొరొస్తాడు’ మనసులోనే అనుకుందామె. బట్టలు తడిసిపోయాయి. చిన్నగా చలేస్తోంది. అదేమీ లెక్క చేయకుండా వేగంగా మట్టిబుంగతో నేల తడుపుతోంది. ఆమె అవయవాల మీద తడిసిన చీర. గుండెల దగ్గరే కాదు, వెనుక భాగం కూడా కొంత తడిసింది. కిష్టయ్య వంకర గునపంతో మట్టి కెలికి ఏదో పరీక్షిస్తున్నట్టు నటిస్తున్నాడు. దూరం నుంచి బాస్టియన్‌ ఇదంతా చూస్తున్నాడు. సంవత్సరం క్రితం జరిగిన చింతపల్లి రోడ్డు పని దగ్గర నుంచి సన్యాసమ్మని చూసి లొట్టలు వేస్తూనే ఉన్నాడు బాస్టియన్‌. ‌ప్రస్తుతం దగ్గర నుంచి చూసి ఆనందిస్తున్నాడు. కారం తమ్మన దొరనీ, ద్వారబంధాల చంద్రయ్యనీ కొండ ఆడవాళ్లు ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. బయటి నుంచి వచ్చిన వాళ్లు కొండ ఆడవాళ్లని తినేసేటట్టు చూసినా, అక్కడికే పరిమితమై మీద చెయ్య వేయడానికి కూడా భయపడతారంటే కారణం- తమ్మనదొర, చంద్రయ్య. అమ్మోరు ముందు ఇద్దరు పోలీసులని నరికిపారేశాడు తమ్మన. అక్కడి ఆడవాళ్ల మీద కన్నేసినట్టు అనుమాన మొచ్చినా చాలు… ఇప్పటికీ చాటు నుంచి బాణాల వర్షం కురుస్తుందని భయం. బుంగ అడుగున ఉన్న నీళ్లు విసురుగా విరజిమ్మి మళ్లీ నీళ్లు తేవడానికి వెళ్లింది సన్యాసమ్మ. అప్పుడే ‘కిష్టయ్య’ అంటూ ప్రవేశించాడు, బాస్టియన్‌, ఏదో ముఖ్య విషయం చెబుతున్నట్టు. రెండు నిమిషాలలో సన్యాసమ్మ కూడా వచ్చింది, నిండు కడవతో వయ్యారంగా. ‘ఆడ కొండముచ్చు చుట్టూ తిరిగే మొగ కొండముచ్చులాగా ఉన్నాడు’ అనుకుందామె. బాస్టియన్‌ ‌కూడా ఓ గట్టి కర్ర తీసుకుని అక్కడ నేల పరీక్షిస్తున్నాడు. ‘‘సన్యాసమ్మ పనంటే ఇంక చూసుకోనక్కర్లేదురా!’’ అన్నాడు ఆమెకు వినపడేటట్టు. అదేమీ పట్టించుకోవడం లేదామె. ముందు మభ్య పెడతారు. తరువాత భయపెడతారు. ఆమె వెనుకభాగం, ముందుభాగం గుటకలు మింగుతూ చూస్తూనే ఉన్నాడు బాస్టియన్‌. ‌పూర్తిగా అనాచ్చాదితంగా ఉన్న నడుం భాగం మీద నుంచి కళ్లు తిప్పుకోలేకపోతున్నాడు.

సన్యాసమ్మని ఒక్కమాట కూడా బాస్టియన్‌ అనడని అందరికీ తెలుసు. సన్యాసమ్మ అంటే ఏమిటో కూడా తెలుసు. నిప్పు. మధ్యాహ్నం భోజనం చేస్తుంటే కొండమ్మ దగ్గరగా వచ్చి అడిగింది సన్యాసమ్మ, ‘‘కొండమ్మా! నేను ఆడ కొండముచ్చులా కనిపి స్తానా?’’ ‘‘ఛఛ అయేం మాటలు?’’ అందామె. ‘‘మరి ఆ బేస్టీను కొండముచ్చు ఎందుకు ఎప్పుడూ నా చుట్టే తిరుగుతాది?’’ అంది సన్యాసమ్మ. పకపకా నవ్వేసింది కొండమ్మ. ‘‘ఇంక రండి… చీకటడ్డాక దిగుతారా…?’’ కింద నుంచి అరుస్తున్నాడు కిష్టయ్య. ‘‘కుదురుగా నాలుగు ముద్దలు కూడా తిన్నీయరు… నరకానికి పోతారు…’’ కొండమ్మ కసిగా అంది.

* * * * * * * * *

నాలుగు రోజులు గడిచాయి. చిట్రాళ్లగొప్పు మధ్యకి వచ్చింది రోడ్డు పని. ఇక్కడనుంచి కిందకి వెళ్లే రోడ్డు పని మొదలు పెడుతున్నారు. తెల్ల లుంగీ, దాని మీద చొక్కా, ఆ పైన పాత కోటు ధరించాడు పిళ్లే, వీఎస్‌ ‌సంతానం పిళై. ఎప్పుడూ అదే వేషం. నుదుట విభూతి రేఖలు. మధ్య కుంకం బొట్టు. నోట్లో తమలపాకులు.. మైదాన ప్రాంతాలలో కరణాలు ఉప యోగించే కొలత గొలుసే అది. ఒక కొస కిష్టయ్య, రెండో కొస పిక్స్ ‌పట్టుకుని నేల మీద గుర్తులు పెడుతున్నారు. పది గొలుసుల దూరం, అంటే ఒక ఫర్లాంగు. కిష్టయ్య నేల మీద చిన్నపుల్లతో గుర్తు పెడుతుంటే దాని మీద కొసలు చెక్కిన, అడుగు పొడవున్న కర్రలు దిగొడుతున్నారు కొందరు గిరిజ నులు. – ‘‘ఇదిదా కట్‌? అం‌టే… అదేమబ్బా? ఆ… ఆ… కొలత. పత్తు గొలుసుల దూరం. సమయం నాలుగు దినములు.’’ గట్టిగా అరిచి చెప్పాడు పిళై. అతడు తెలుగు బాగానే మాట్లాడతాడు. కానీ కొన్ని తమిళ పదాలు ప్రతివాక్యంలోను దొర్లుతుంటాయి ఫర్లాంగు దూరం రోడ్డు… నాలుగు రోజులలో పూర్తి చేయాలి. ఒక్క నిమిషం వృధా చేసినా ప్రమాదమే అన్నట్టు చకచకా పని అందుకున్నారు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram