– వడలి రాధాకృష్ణ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

చీకటి చిట్లిపోయినట్లుంది! చిట్లిన చీకటి చారికలలోంచి వెలుతురు ప్రభంజనమై వీస్తుందని ఆశపడుతున్నాడు. కానీ యాదయ్యకు నిత్యం నిరాశ ఎదురవుతూనే ఉంది. అసలే అమావాస్య! వెలువెత్తుతున్న చీకటి తనను దుప్పటిలాగ కప్పేస్తూంటే భరిస్తూనే ఉన్నాడు. అది రాత్రివేళ ప్రకృతి ధర్మం! కానీ ఆ మిద్దె మీద బిక్కు బిక్కుమంటూ ఉన్న యాదయ్యకు కృతకంగా అనిపిస్తూ ఉంది. అలా పక్కకు తిరిగి చూసుకున్నాడు. తనతో బాటు ప్రక్క గదులలో తెలియని ఇద్దరు మనుషులు. కరోనా కారణంగా దిక్కుతోచక భయంతో ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు.

మనుషుల మధ్య మాటలు లేవు. ఎవరికి వారుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఏదో స్వచ్ఛంద సేవా సంస్థవారు పంపించిన ‘కరోనా కిట్‌’ ‌యాదయ్యకు బాగానే అక్కరకు వస్తూ ఉంది. తనకు కరోనా పాజిటివ్‌ అబ్బిన నాటి నుండి మరో స్వచ్ఛంద సేవా ట్రస్ట్‌వారు ముద్దను తెచ్చి అలా దూరంగా పారేసి పోతున్నారు.

యాదయ్యకు ఆ ముద్దను ముట్టబుద్ధి కావడం లేదు. కానీ కడుపులోని ఆకలి కళ్లలోకి తన్నుకొచ్చేసరికి ఎంగిలి పడక తప్పడం లేదు. కొంత ఆకలితోనూ, మరికొంత భయంతోనూ శరీరం కొంకర్లు పోతూ ఉంది.

అసలే చలికాలం. అంతలోనే చీకటి కాలంలో మనసంతా చీకటి కమ్మేసి బుద్ధి వంకర్లు పోతూ ఉంది. భార్య రమణకుమారి, కొడుకు వసంత్‌ ‌గుర్తుకొచ్చారు. తనలోని ఆత్మాభిమానం ఒక్కసారిగా పెల్లుబుకసాగింది.

తనకు ఈ వైరస్‌ ‌సోకిందని అయిన వాళ్లే దూరంగా విసిరి పారేశారు. ఇక లోకం సంగతి సరేసరి! ఊరిలోని ఆస్పత్రులలో బెడ్స్ ‌ఖాళీలు లేకపోవడం తనను భయాందోళనకు గురిచేస్తూ ఉంది. గతిలేక ఊరి చివరనున్న ఆరామ క్షేత్రంలోని ‘అపరకర్మలు’ చేయించే శాలలోకి చేరిపోయాడు.

అదృష్టం…ఇటువంటి విపత్కర పరిస్థితులలో కనీసం ఈ మాత్రం నీడ దొరికింది తనకు. లేకపోతే అక్కడినుండే ఎకాయికీ కాటికి చేరిపోయేవాడేమో! ఆ వాస్తవం యాదయ్యను నిలువునా కంపించి పోయేలా చేస్తోంది.

తానున్న పై మిద్దెలోని కిటికీ తలుపులు తెరవబోయాడు. కానీ తానున్న వాతావరణం స్ఫురణకు వచ్చి మానుకున్నాడు. గుండెను దిటవు చేసుకొని చిన్నగా తెరిచి చూశాడు. కాసింత దూరంలోని వల్లకాడులో కాలుతూన్న మృతదేహం తాలూకు వాస్తవం యాదయ్యలో అనేక ప్రశ్నలకు తెరదీస్తూ ఉంది.

‘కొన్ని క్షణాలలోనో, మరికొన్ని రోజులలోనో తాను ఇక్కడి నుండి అక్కడికి!’ యాదయ్య తనలో తాను తర్కించుకుంటున్నాడు.

పక్క గదులలోని కరోనా బాధితుల వివరాలు తెలియరావడం లేదు. ఎప్పుడో ఉదయం ఆహార పొట్లాలప్పుడు అలికిడి విన్న గుర్తు.

తర్వాత అంతా నిశ్శబ్దం అలుముకు పోయింది. చెప్పాలంటే యాదయ్య ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండక తప్పడం లేదు.

ఈ మహమ్మారి వైరస్‌ ‌కారణంగా ఊరికి దూరంగా, గతిలేని స్థితిలో ఈ ఆరామ క్షేత్రం ప్రాంగణంలో అడుగుపెట్టి పదిరోజులు దాటిపోయింది.అప్పటి నుంచి ఎవరో దాతలు ఇస్తున్న నాలుగు ముద్దల్ని తింటూ బతుకీడుస్తున్నాడు.

ఎదురుగా రాత్రనక, పగలనక నిత్యం కాలుతూన్న వాస్తవాలు తనలో తీవ్రమైన ఉత్కంఠను రేపుతున్నాయి.

యాదయ్య ఎప్పుడూ కాశీకి పోయి రాలేదు. కానీ తన తండ్రి సుబ్బయ్య చెబుతూ ఉండేవాడు. కాశీలోని హరిశ్చంద్ర ఘాట్‌లో దహనకాండలు పగలనక, రాత్రనక ముప్పొద్దులా జరుగుతూ ఉంటాయట! కాస్త అటుఇటుగా రోజూ ఇక్కడ అటువంటి సన్నివేశాలనే చూస్తున్నాడు.

కరోనా బారిన పడినవారి శవాలు అనేకం ఇక్కడే బారులు తీరుతున్నాయి. ప్రాణాలకు తెగించిన వెట్టివాళ్లు తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వచ్చిన వారి దగ్గరనుండి డబ్బుల్ని బాగానే గుంజుతున్నారు.

అలాగే అపరకర్మల్ని చేయించే జింకశాస్త్రి గారి సంగతి సరేసరి! ఆయన గారు ముప్పొద్దులా ఇక్కడే కొలువు దీరుతూ ఉన్నాడు. అకాల మృత్యువాత పడిన వారికి సద్గతులు కలగాలని తనదైన రీతిలో నమ్మబలుకుతున్నాడు. అందుకు తాంబూలాలను బాగానే డిమాండ్‌ ‌చేస్తున్నాడు.

యాదయ్యలోని అస్థిమితం అనేక ప్రశ్నలకు తెరతీస్తూ ఉంది. చేతిలోని సెల్‌ఫోన్‌ను చూసుకున్నాడు. ఊరిలోనే ఉన్న భార్య, కొడుకుల దగ్గర• నుండి గాని, ఇతర మిత్రుల నుండి గాని ‘మిసిడ్‌కాల్స్’ ఏమీ లేవు.

ఇంటికి ఫోన్‌ ‌చేద్దామనుకున్నాడు. కానీ చేయబుద్ధి కావడం లేదు.ఈ ఆరామ క్షేత్రానికి ఆనుకొని ఉన్న వాటికలో కాలుతూన్న మృత దేహాల తాలూకు మానవీయ స్వర్శలోని అంతరార్థం యాదయ్యకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

*************

క్రమంగా యాదయ్య ఆ భయానక వాతావరణానికి అలవాటు పడుతున్నాడు. చీకటి రాత్రుల్లోనూ, వెలుతురు పగలులోనూ నిర్భీతిగా కిటికీ తలుపులు తెరవగల్గుతున్నాడు.దేనికీ భయపడటం లేదు. కానీ ఉన్నట్లుండి కొంత భీతావహంగా అనిపిస్తూ ఉంది.

కారణం ప్రక్క గదిలోని మనిషి నిన్న రాత్రే మృత్యువాత పడ్డాడు. పరామర్శించడానికి కనీసంగానయినా ఎవరూ రాలేదు.

సంబంధిత వ్యవస్థ తాలూకు వారు వచ్చి ఇక్కడినుండి అక్కడికి తరలించేశారు.

యాదయ్యకు అయోమయంగా ఉంది. తనకు భయంగా అనిపిస్తూ ఉంది. నిన్న రాత్రే అతగాడు…. ఈరోజో రేపో లేక మరో పదిరోజుల తర్వాత తానో. తన ప్రస్థానమూ ఇక్కడినుండి అక్కడికి.

ఒక అణగారిన జీవన వాస్తవం యాదయ్య కంటి ముందర సజీవ దృశ్యమవుతూ ఉంది. మూసి ఉన్న కిటికీ తలుపు సందుల్లోంచి జొరబడుతున్న అనాలోచిత వెలుగు రేఖలు గదిలోకి చొరబడి తనను హెచ్చరిస్తున్నాయి.

యాదయ్య వాటికి ఎదురొడ్డక,గుండెను దిటవు చేసుకోక తప్పడం లేదు. ఇక్కడికొచ్చిన తనకు త్వరలోనే చావు ఖాయమని నిర్ధారించుకున్నాడు.

ఎంత నిబ్బరంగా ఉన్నా ఒక్కో సంఘటన తనను అతలాకుతలం చేస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం తన ప్రక్క గదిలోని కుర్రాడు కరోనాకు బలైపోయాడు. తర్వాత మామూలే!

యాదయ్యకి ఇక్కడినుండి మరోచోటికి తరలిపోవాలని ఉంది. లేదా ఎవరికీ తెలియకుండా మరో చోటికి పారిపోవాలని ఉంది. ఏ నదిలోనయినా దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తూ ఉంది.

కానీ లోకమంతా ఉపద్రవమై మహా కల్లోలాన మునిగి తేలుతున్న ప్రస్తుత పరిస్థితిలో అక్కరకురాని ఆలోచనలు ప్రతిబంధకాలుగా మారి కొట్టి పారేస్తున్నాయి.

ఆశ్చర్యంగా ఉంది. యాదయ్య తనను తాను నమ్మలేకపోతున్నాడు. తాను ఇంకా బ్రతికి ఉన్నాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఆ కరోనా ఉపద్రవాన్ని అధిగమించి అప్పడే ఐదు సంవత్సరాలై బతికి బట్టకట్టడం నిజమనిపించడం లేదు. ఈ భూమి మీద తనను కదిలించలేకపోయాయి.

ఇప్పుడు భార్య రమణకుమారి చాలా ప్రేమగా చూసుకుంటుంది. కొడుకు వసంత్‌ ‌పిల్లా పాపలతో ఉద్యోగం చేసుకుంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా పర్మినెంట్‌ ‌కావడంతో బదిలీ మీద తణుకు వెళ్లిపోయాడు యాదయ్య.

తను చేస్తున్న బంట్రోతు ఉద్యోగంలో రిటైరైపోయాడు యాదయ్య. నెలకు ఐదువేల రూపాయల ఫించను వస్తోంది. రిటైరైనప్పుడు వచ్చిన పదిలక్షల రూపాయల్ని బాగానే జాగ్రత్త చేసుకున్నాడు.ప్రస్తుతానికి ఏ ఉపద్రవాలకు లోనుకాకుండా బాగానే బ్రతుకుతున్నాడు.

‘ఎరియర్స్ ‌రెండు లక్షల రూపాయలు వచ్చాయి. వచ్చి తీసుకెళ్లమని’ ఇంతకు ముందు పనిచేసిన ఆఫీసునుండి కబురు రావడంతో చీరాల బయలుదేరాడు.

ఎందుకో అలనాటి కరోనా కష్టకాలం స్ఫురణకు వచ్చింది. వెన్నులో చిన్నగా వణుకు ప్రారంభమయింది. అప్రస్తుతమైనా ఆనాటి కల్లోల సమయంలో రెండు నెలలపాటు తనకు నిలువ నీడనిచ్చి నిలబెట్టిన ఆరామ క్షేత్రం వైపునకు వడివడిగా అడుగులు వేశాడు.

ఇప్పుడు అక్కడ ఏ అలజడీ లేకుండా కొంత ప్రశాంతత నెలకొని ఉంది. చెప్పాలంటే తాను మృత్యువును జయించినవాడు. ఆనక ఆత్మస్థైర్యంతో కాలాన్ని జయించినవాడు.

ఒక్కసారిగా యాదయ్య మనసారా నవ్వుకున్నాడు. తనను తాను పరామర్శించుకున్నాడు. అలా కొన్నాళ్లు బిక్కు బిక్కుమంటూ గడిపిన ఆరామ క్షేత్రంలోని మిద్దె మీదకు నడిచాడు.

అక్కడ ఉన్న గుమాస్తా తనను బాగానే గుర్తుపట్టాడు. తనవెంట తరలివచ్చాడు. యాదయ్య అక్కడి కిటికీ తలుపును తెరచిచూశాడు. ఒక మహాఉపద్రవం తర్వాత తెప్పరిల్లిన జీవన వాస్తవం అక్కడ అగుపిస్తూ ఉంది.

అక్కడ నిరంతరంగా కాలిన చితిమంటలు ఏమీ కానరావడం లేదు. కొంత నిర్మానుష్యంగానూ, మరికొంత ప్రశాంతంగానూ ఉంది.

 ఆ నిర్మానుష్యం వెనుక జీవనేతిహాసం యాదయ్యను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంది. దానితో అదే పనిగా చలించిపోతూ ఉన్నాడు.

కాలం కట్టెల పొయ్యిగా మారి కాల్చి పారేసిన ఒకనాటి ‘జీవన ధృతి’ స్పురణకు వస్తోంది.

‘ఈ ఆరామ క్షేత్ర నిర్వహణ చాలా కష్టతరమవుతోంది! నిధులు కొరత చాలా విపరీతంగా ఉంది. పైగా అతి ముఖ్యమైన నీటి వసతులు కూడా అరకొరగా ఉన్నాయి. కాబట్టి దొరల సహాయ సహకారాలతో ఆ కనీసం అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము.

కాబట్టి మీకు తోచినది చందారూపంలో ఇస్తే ఈ క్షేత్రానికి ఎంతో సహాయం చేసిన వారు అవుతారు అన్నాడు వెంటవచ్చిన గుమాస్తా. ‘ఇతర అవసరాలను తీర్చడానికి నా వంతుగా ఈ రెండు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నాను’అని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం యాదయ్యకు విపరీతంగా ఏమి అనిపించలేదు.

ఎంతో ఆత్మసంతృప్తిగా అనిపిస్తూ ఉంది. ఇందాక ఆఫీసులో ఇచ్చిన రెండు లక్షల రూపాయల ఎరియర్స్ ‌సొమ్ముల్ని ఆ గుమాస్తాకి ఇచ్చి రశీదు తీసుకొని వడివడిగా బయటకు నడుస్తున్నాడు యాదయ్య.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram