పౌరసత్వ చట్ట సవరణకు నిరసన, షాహీన్‌బాగ్‌ ‌తిష్ట,  సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో దొంగ రైతుల రగడ, ఎర్రకోట మీద కిరాయి రైతుల దాడి, కర్ణాటకలో హిజాబ్‌ ‌వివాదం- ఇవన్నీ ఒక పథకం ప్రకారం భారత సార్వభౌమత్వం మీద దాడికి ఉద్దేశించినవే. త్రివర్ణ పతాకం చేతపట్టి, గాంధీజీనీ, అంబేడ్కర్‌నూ స్మరిస్తూ ఈ ఉద్యమాలన్నీ సాగినట్టు కొందరు నమ్మింప చూసినా, వీటిలో ఏదీ రాజ్యాంగ బద్ధ నిరసన కాదు. అదొక విధ్వంసం. భారత ఐక్యత మీద దాడి. మతోన్మాదం, ఉదారవాదం పేరుతో చెలామణి అవుతున్న అరాచకత్వం జమిలిగా సాగించిన దాష్టీకం. భిన్నత్వంలో ఏకత్వం వంటి విశ్వాసాన్ని అవన్నీ నిలువునా పాతరేసేవే కూడా. అంతిమంగా ఇదంతా  హిందూత్వ రక్షణ కోసం నిలబడిన ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీల మీద పరోక్ష దాడి.ఇదంతా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, ఉదారవాదులు కలసి చేస్తున్న దగా. దీనికి కొనసాగింపే- ఏప్రిల్‌ 2 ‌నుంచి మొదలై శ్రీరామనవమి, హనుమత్‌ ‌జయంతి ఉత్సవాల మీద జరిగిన దాడులు. వాటి వేడి ఇంకా చల్లారలేదు.

భారతీయులు భక్తితో కొలిచే రామచంద్ర ప్రభువు పేరిట సాగే గొప్ప ఉత్సవం రోజే దేశంలోని పన్నెండు రాష్ట్రాలలో మత ఘర్షణలు జరిగాయి. అంటే దాదాపు సగం భారతదేశం ఏప్రిల్‌ ‌మాసంలో మత కల్లోలాలతో భయ విహ్వలమైంది. ఇదంతా ఇస్లామిక్‌ ఉన్మాదం సాగిస్తున్న అరాచకం. దీనిని ఏమనాలి? ఎలా చూడాలి? ఈ విధ్వంసం మొత్తం ఒకే, కూడబలుక్కుని పన్నిన కుట్ర తీరున సాగిపోయింది. రాళ్లు రువ్వడం, ఒక వర్గం దుకాణాలు, వాహనాలు తగలపెట్టడం, ఈ మూకలకి కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు మద్దతు నివ్వడం. జమ్ముకశ్మీర్‌లో మొదలైన ఈ రాళ్లు రువ్వే దుండగీడుతనం ఇప్పుడు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ముస్లిం మతోన్మాద మూకలు తీసుకువచ్చాయి.  పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా,  ఆ తానులో భాగం ఎస్‌డీపీఐలు వీటి వెనుక ఉన్నాయని ఇప్పటికే ఆరోపణలు మొదలయినాయి. పీఎఫ్‌ఐని నిషేధించే యోచనలో కేంద్రం ఉన్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముస్లిం మతోన్మాదాన్ని ప్రదర్శించి దేశాన్ని గడగడలాడించడం, సగటు భారతీయునికి బీజేపీనీ, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిరాకరించక తప్పని పరిస్థితి కల్పించడం ఇక్కడ ముస్లిం మతోన్మాదుల లక్ష్యం. గడచిన ఏడేళ్ల బీజేపీ పాలనలో మత కల్లోలాలు లేవన్న ఖ్యాతిని మంట గలిపితే సామాన్యుడు భయపడతాడని ఉన్మాదుల ఊహ. తద్వారా వచ్చే ఎన్నికలలో భారతీయ ఓటరును సందిగ్ధంలోకి నెట్టడం వీళ్లందరి ఉద్దేశం. ఇదంతా దేశంలో పెరుగుతున్న ముస్లింలలో పెరుగుతున్న మతోన్మాదానికి రుజువు.

ఈ దేశాన్ని మత ప్రాతిపదికన మరొకసారి విభజించాలన్న రాక్షస వ్యూహానికి తార్కాణం. కారణం ఏదైనా ఈసారి దివాంధులైన ఉదారవాదులలో, కాంగ్రెస్‌ ‌మూర్ఖులలో కనిపిస్తున్న చిరు మార్పు- అల్లర్లకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కారణమంటూ పేలడానికి సాహసించలేదు.

భారతదేశంలో హిందువులు తమ పండు గలను వేడుకగా జరుపుకోకూడదని ఎక్కడైనా ఫత్వా జారీ అయిందా? భారతీయ సంస్కృతిని ప్రతి బింబిస్తూ సాగే హిందూ బంధువుల సామూహిక ఉత్సవాలను ఇకపై సాగనీయరాదని ఏ మసీదు స్పీకరైనా హుకూమిచ్చిందా? ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు కాషాయ జెండాలు, రథాలు, హిందూ దేవతల ప్రతిమలు ప్రవేశించ రాదనీ, ప్రవేశిస్తే ధ్వంసం చేయాలనీ, తరిమి కొట్టాలనీ ఏ మౌల్వీ అయినా హుంకరించాడా? రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, జార్ఖండ్‌, ‌బిహార్‌, ‌ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌, ఆం‌ధప్రదేశ్‌లలో ఉగాది, శ్రీరామనవమి, హనుమత్‌ ‌జయంతిల రోజునే జరిగిన హింసాకాండను గమనించినట్టయితే ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతాయి. అలాంటి నిబంధనలను ఇప్పుడే ముస్లిం మతోన్మాదులు హిందువుల పండుగల మీద అమలు జరుపుతున్నట్టే అనిపిస్తుంది. దేశమంతా ఒకే తీరున ఘర్షణలు జరపడానికే అన్నట్టు, హిందువుల ఊరేగింపులు ముస్లింలు అధికంగా ఉన్నచోటకి ప్రవేశించగానే ఇళ్లపై నుంచి రాళ్ల వర్షం కురిసింది. కొన్నిచోట్ల తుపాకీ కాల్పులు జరిగాయి. నిజానికి హిందువులు పండుగల నిర్వహణ మీద తమిళనాడులోని కొన్ని చోట్ల- క్రైస్తవ రాజ్యాలు పరిఢవిల్లుతున్న చోట- ఇలాంటి నిషేధాజ్ఞలు ఈ ఘనత వహించిన సెక్యులరిస్టు భారతంలో ఇప్పటికే అమలవుతున్న మాట ఒక చేదు నిజం. ఇక ఏప్రిల్‌ 10‌న ఘనత వహించిన ఢిల్లీ జేఎన్‌యూలో నవమి వేడుక మీద ఉదారవాదులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ‌వాళ్లు చేసిన దాడి, దానికి వీళ్లు ఇచ్చిన భాష్యం జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇందులోని వామపక్ష, ఉదారవాద, కాంగ్రెస్‌ ‌విద్యార్థి సంఘాలు ఈ దేశానికే ఒక మచ్చలా మారిపోయాయి.

తెలుగువారి ఉగాది రోజునే, రాజస్థాన్‌ ‌వారి ఉగాది కూడా వచ్చింది. ఆ సందర్భంగా ఏప్రిల్‌ 2‌న ఆ రాష్ట్రంలోని కరౌలీ నగరంలో నిర్వహించిన నవ్‌ ‌సంవత్సర్‌ ఉత్సవం ఊరేగింపు మీద దాడి జరిగింది. హిందువుల బైక్‌ ‌ర్యాలీ హత్వాడా రోడ్డులోని ఒక మసీదు వద్దకు చేరుకున్నప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ వెంటనే నగరంలో కీలక కూడలి ఫూటాచౌక్‌ ‌వద్ద జరిగిన విధ్వంసంలో కొన్ని దుకాణాలు, 70 వరకు వాహనాలు దగ్థమైనాయి. 50 మందికి వరకు అరెస్టయ్యారు. ఇలాంటి మత ఘర్షణ ఈ ప్రాంతంలో మేము ఎన్నడూ చూడలేదు, ఊరేగింపు నిర్వహించిన వారికీ, రాళ్లు రువ్వడానికీ ఎలాంటి సంబంధం లేదని హత్వాడా ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇండియా టుడేతో సుస్పష్టంగా చెప్పారు. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన దాడేనని కూడా ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి చెప్పారు. మత్బూల్‌ అహ్మద్‌ (ఇం‌డిపెండెంట్‌ ‌కౌన్సిలర్‌)‌ను ఈ అల్లర్లకు సంబంధించి అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌ ‌కూడా నమోదు చేశారు. కానీ కాంగ్రెస్‌ ‌వైఖరి ఎలా ఉంది? ఇప్పటికీ దేశాన్ని దగా చేయడమే.సెక్యులరిజాన్ని వంచించ డమే. మసీదును చూడగానే రెచ్చిపోయి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలే మొదట రాళ్లు రువ్వారని ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లోత్‌ ‌మొదలు పోలీసు అధికారుల వరకు ఒకటే పాట పాడారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత హిందూ ముస్లిం విభజన తీవ్రమైందని గెహ్లోత్‌ ‌నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఇలాంటి విభజన సరికాదని మోదీ దేశ ప్రజలకు నచ్చచెప్పాలని కూడా ఈ వెన్నెముక లేని ముఖ్యమంత్రి చెబుతున్నారు. తన రాష్ట్రంలో పరిస్థితి తెలిసి కూడా ఈ ప్రబుద్ధుడు ఉత్తర ప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం అరాచకాలు చేస్తున్నదని ప్రజల దృష్టి అటు మళ్లించే యత్నం చేశారు. అంబేడ్కర్‌ ‌మీద, సర్దార్‌ ‌పటేల్‌ ‌మీద బీజేపీకి అసలు భక్తే లేదని గెహ్లోత్‌ ఆదరాబాదరా ఇప్పుడు ప్రకటించారు. ఈ కాంగ్రెస్‌ ‌విద్రోహక మూకంతా గమనించవలసిన మొదటి విషయం శ్రీరామనవమి సందర్భంగా యోగి రాష్ట్రంలో ఒక్క శోభాయాత్ర మీద కూడా రాళ్ల దాడి జరగలేదు. ఒక్క ఘర్షణ కూడా లేదు.

ఏప్రిల్‌ 16‌న హనుమత్‌ ‌జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన ఊరేగింపు మీద రాళ్ల దాడి జరిగింది. ఇందులో కొందరు పోలీసులు, పౌరులు గాయపడ్డారు. ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేసే ఒక ఎస్‌ఐకి తూటా తగిలింది. సాయంత్రం ఆరు ప్రాంతంలో శోభాయాత్ర మీద జరిగిన ఆ దాడి కేవలం ఆవేశంతో అప్పటికప్పుడు జరిగింది కాదని, అది కుట్రపూరితమని ఢిల్లీ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దేశంలో అక్రమంగా చొరబడి ఎక్కడ బడితే అక్కడ తిష్టవేసిన మతోన్మాదులే ఈ పనికి పాల్పడ్డారని బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు ఆదేశ్‌ ‌గుప్తా, బీజేపీ ఎంపీ మనోజ్‌ ‌తివారీ చెబుతున్నారు. రాళు విసరడంతో పాటు, వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. మరొక బీజేపీ నాయకుడు కపిల్‌ ‌మిశ్రా ఈ దాడులు ఉగ్రవాద దాడులేనని అంటున్నారు. ఈ దాడులలో కీలకపాత్రధారిగా చెబుతున్న మహమ్మద్‌ అన్సారీ సహా మొత్తం 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఒకే ‘వర్గం’వారు. అన్సారీ పాత నేరగాడు. ఇప్పటికే ఇతడి మీద కేసులు ఉన్నాయి. కర్ణాటకలోని హుబ్లీ, ఆంధప్రదేశ్‌లోని హులగండలలో కూడా హనుమాన్‌ ‌జయంతి రోజున రాళ్లు రువ్విన సంఘటనలు జరిగాయి.

 భారత రాజ్యాంగం సెక్యులరిజానికి పట్టం గట్టింది. కానీ ఆచరణలో చూస్తే సెక్యులరిజం ఇక్కడ పెద్ద అబద్ధం. గత ఏడున్నర దశాబ్దాల చరిత్రను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఓటుబ్యాంకు రాజకీయాలను వంటబట్టించుకున్న గత పాలకులు మెజార్టీ వర్గాల ప్రయోజనాలను పణంగా పెట్టి, మైనార్టీ మతాలవారిని ప్రోత్సహించడం, బుజ్జ గించడం, వారికి సర్కారు ఖర్చుతో అనేక సౌకర్యాలను కల్పించడం, వారి పట్ల వల్లమాలిన ప్రేమ కనబరచడం తెలిసిందే. వారి దాష్టీకాలు, ఆగడాల పట్ల చూసీచూడనట్లు వ్యవహరించడం కొత్తేమీ కాదు. మెజార్టీ మతం వారి పండగల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం, వారి ప్రదర్శనలు, మతపరమైన ఊరేగింపులపై దాడులు చేయడం తెలిసిందే. కలకత్తాలో అయితే ముస్లింల ఉత్సవం ముగిసిన తరువాత దసరా ఉత్సవాలు చేసుకోవచ్చు నని మమత బాహాటంగానే చెప్పిన సంగతి మరచి పోరాదు. ఇంతకీ శ్రీరామనవమి, హనుమజ్జయంతి సందర్భంగా హిందువులు నిర్వహించిన శోభా యాత్రల మీద దాడులు బీజేపీయేతర పాలిత రాష్ట్రలతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ చోటు చేసుకోవడం గమనార్హం. కాబట్టి ముస్లిం మతోన్మా దులకు కాంగ్రెస్‌, ‌బీజేపీ ఒకటే. వాళ్ల లక్ష్యం హిందూ సమాజం, దాని విధ్వంసం.

శ్రీరామనవమి, హనమజ్జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ‌జార్ఖండ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌గోవా, గుజరాత్‌, ‌కర్టాటక రాష్ట్రాలల్లో చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలు ఆవేదన, ఆందోళన కలిగించాయి. నిందితులపై కేసు నమోదు చేయడం, పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు చర్యలు చేపట్టడం మినహా ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ ఘటనలు హిందూ ముస్లిముల ఐక్యతను బలపరచే గంగా యమున తెహజీబ్‌ ‌సంస్క్కతిని అపహాస్యం పాల్జేస్తున్నాయి. హనుమజ్జయంతికి ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ‌కర్ణాటకల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేశారు. ఈ అల్లర్లు వేటికవే ప్రత్యేకమైనవి. ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో 8 మంది పోలీసులు, ఒక వ్యక్తి గాయపడ్డారు. 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లూ ఉన్నారు. నిందితుల నుంచి 3 తుపాకులు, అయిదు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఘర్షణల సమయంలో వీరిలో ఒక వ్యక్తి తుపాకీతో కాల్చగా, ఓ ఎస్సై గాయపడ్డారు. ఢిల్లీ లోని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలను అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఆప్‌ ‌సర్కారు విధి లేక ఖండించింది. దేశ రాజధానిలో జరిగిన ఈ అవాంఛనీయ ఘటనలను విపక్షాలు గట్టిగా ఖండించ లేకపోవడం వాటి ద్వంద్వ వైఖరిని చాటుతోంది. లౌకికవాదానికి తామే అసలైన సిసలైన ప్రతినిధుల మని చెప్పుకునే కాంగ్రెస్‌, ‌వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు మొక్కుబడి ప్రకటనలే పరిమిత మయ్యాయి. దాడులను ఖండించకపోగా బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ప్రత్యారోపణ చేయడం వాటి ద్వంద్వ నీతిని బయట పెడుతోంది.

జార్ఖండ్‌లోని లోహర్‌ ‌దగా జిల్లాలోని హిర్హి గ్రామంలోని భోక్తా బగీచా ప్రాంతంలో శోభాయాత్రపై దుండగులు దాడులు చేశారు. పది మోటారు బైకులకు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా 16 మంది గాయపడ్డారు. ఇక్కడ హేమంత్‌ ‌సొరెన్‌ ‌సారథ్యంలోని జేఎంఎం (జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా) పాలన సాగిస్తోంది. ఈ ఘటనను హేమంత్‌ ‌సర్కార్‌ ‌ఖండించిన దాఖలాలు కూడా లేవు. మమతాబెనర్జీ నాయకత్వంలో, ఆమె పార్టీ టీఎంసీ పాలనలో అరాచ కాలకు ఆలవాలంగా మారిన పశ్చిమ బెంగాల్‌లోనూ దుండగులు రెచ్చి పోయారు. కోల్‌కతాలోని హౌరా ప్రాంతంలోని శివపూర్‌లో శోభా యాత్రపై స్థానిక ముస్లిములు దాడులకు తెగబడినా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారన్న ఆరోపణలు వినిపించాయి. విశ్వహిందూ పరిషత్‌, ‌బజరంగ్‌ ‌దళ్‌, ‌దుర్గావాహిని తదితర హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. ఇలాంటి సందర్భాల్లో దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. కానీ ఇందుకు భిన్నంగా ప్రదర్శకులపైనే పోలీసులు చర్యలు తీసుకున్నారని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఉపాధ్యక్షుడు ప్రియాంక శర్మ ఆరోపించారు. ఈ దాడులను, వేధింపులను రాష్ట్ర బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, నందిగ్రామ్‌ ‌శాసనసభ్యుడు సువెందు అధికారి ఖండించారు. కానీ మమత సర్కారు స్పందించిన దాఖలాలు లేవు. బంకుర జిల్లా కేంద్రంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ సందర్భంగా 30 మందిని అరెస్టు చేశారు. ఈ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి డాక్టర్‌ ‌సుభాష్‌ ‌సర్కార్‌ ‌ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్తగా సెక్యులరిజం స్వీకరించినవారి అత్యుత్సాహం ఎలా ఉంటుందో ఉద్ధవ్‌ ‌ఠాక్రేని చూస్తే సులభంగా అర్థమవుతుంది. ఆయన నాయకత్వంలోని మహావికాస్‌ అఘాడి పాలనలో గల మహారాష్ట్రలోనూ శ్రీరామనవమికి దాడులు జరిగాయి. దేశ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబయి మహానగరంలోని మాద్‌ ‌ఖుర్‌ ‌ప్రాంతంలో దుండగులు వాహనాలకు నిప్పు పెట్టారు. కొన్నింటిని అపహరించుకుపోయారు. ఈ మేరకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఎప్పటిలాగానే రాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ ‌వాల్సె పాటిల్‌ ‌ఘటనను ఖండించి చేతులు దులిపేసుకున్నారు. అంతటితో తమ పని అయి పోయిందనిపించుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర నవ నిర్మాణ సమితీకీ, ఉద్ధవ్‌ ‌ఠాక్రేకీ నడుమ స్పీకర్ల యుద్ధం నడుస్తున్నది. ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి. మసీదుల మీద స్పీకర్లు గట్టిగా అరిస్తే తాము వాటిలో హనుమాన్‌ ‌చాలీసాలు పఠిస్తామని ఎంఎన్‌ఎస్‌ ‌నేత రాజ్‌ ‌ఠాక్రే హెచ్చరించి అన్నంత పనీ చేస్తున్నారు. ఈ వివాదం చాలా మలుపులు తిరుగుతున్నది. ఇలా ఉండగా నేషలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అని పేరు కూడా పెట్టుకుని జాతీయతకు చేటు చేస్తున్న శరద్‌ ‌పవార్‌ ‌బలగం హనుమంతుని ఆలయంలో ఇఫ్తార్‌ ‌విందు ఇవ్వడానికి సిద్ధపడింది.


జేఎన్‌యూలో అదే తంతు

ఉదారవాదం పేరుతో ఉన్మాదాన్ని చెలామణి చేస్తున్న విఖ్యాత విద్యా సంస్థ జవహర్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ). ఏప్రిల్‌ 10‌న, శ్రీరామ నవమి సందర్భంగా ఆ ప్రాంగణంలో జరిగిన రగడ ఇందుకు ఉదాహరణ. దేశ రాజధానిలో ఉండే ఈ విశ్వవిద్యాలయంలో చేరిన ‘లెలి’ (లెఫ్ట్ ‌లిబరల్స్)‌లు ప్రజాధనంతో బలుస్తున్న విద్రోహులు. శ్రీరామ నవమి కార్యక్రమం మీద దాడి చేసి, దానిని శాకాహార, మాంసాహార రగడగా చిత్రించిన ఘనత ఈ ఎరుపు, ఉదారవాద గూండాలది.ఈ మధ్య హిందూ ధర్మం మీద దాడి చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటున్నది. కాబట్టే హిందుత్వ మీద దాడి చేసి, దానికి వేరే భాష్యం చెబుతున్నారు. ఇప్పుడు జేఎన్‌యూ స్టూడెంట్స్ ‌యూనియన్‌ ‌వీరి చేతిలోనే ఉంది. చేసినది హిందూత్వ మీద దాడి. కానీ తమను మాంసాహారం తినకుండా అడ్డుకుని తమ హక్కును హరించారని లెలిలు వాదిస్తున్నారు. కావేరీ విద్యార్థి వసతిగృహం ముందు కాపు కాసి మరీ ఏబీవీపీ విద్యార్థుల మీద కర్రలు, రాడ్లు, బ్యాట్లతో దాడి చేశారు. వామపక్ష విద్యార్థి సంఘ సభ్యులకి ఎన్‌ఎస్‌ ‌యూఐ కూడా తోడైంది. ఈ మొత్తం ఘర్షణలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.

వామపక్ష, ఎన్‌ఎస్‌యూఐ కలసి నవమి పూజా కార్యక్రమాన్ని భగ్నంచేశాయి. అంతేకాని ఇందులో శాకాహారం, మాంసాహారం వివాదం లేనేలేదు. నవమికి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టడమే వాళ్లకి కన్నెర్ర అయింది అని జేఎన్‌యూ ఏబీవీపీ శాఖ అధ్యక్షుడు రోహిత్‌ ‌కుమార్‌ ‌చెప్పారు. మేము అసలు మాంసాహారానికి వ్యతిరేకం కానేకాదని కూడా చెప్పారు. ఇతర వసతి గృహాలలో (మరో 17) మాంసాహారం వడ్డించారు కూడా. ఒక వారం క్రితం మాత్రం సర్వసభ్య సమావేశంలో కావేరిని మాంసాహారం నుంచి మినహాయించాలని నిర్ణయించినట్టు కూడా రోహిత్‌ ‌తెలియచేశారు.

కావేరి వసతి గృహంలో నవమికి హోమం నిర్వహించారు. ఈ సందర్భంలోనే కాదు, ప్రతి హిందూ పండుగకు, పర్వదినానికి ఇక్కడ హోమం జరిపించి, పూజాదికాలు చేయడం ఏబీవీపీ క్రమం తప్పకుండా చేస్తున్నది. తమ కార్యక్రమాన్ని వామపక్ష విద్యార్థి సంఘాల వాళ్లు వచ్చి అడ్డుకున్నారని ఏబీవీపీ చెబుతోంది. కావేరీలో తమను మాంసాహారం తినకుండా అడ్డుకోవడమే కాకుండా, మెస్‌ ‌సిబ్బంది మీద కూడా ఏబీవీపీ దాడి చేసిందని వామపక్ష విద్యార్థుల కట్టు కథ చెబుతున్నారు. అక్కడ వామపక్ష, ఉదారవాద సంఘాల విద్యార్థులలో హిందుత్వను అవహేళన చేయడం, జాతీయతను ద్వేషించడం సర్వసాధారణం కాబట్టి ఆ  లెలిల మాటను ఎవరూ నమ్మడం లేదు. 2014లో కూడా ఇదే విధంగా కావేరి వసతిగృహంలో హోమం వెలిగించి పూజ చేస్తున్న ప్పుడు అందులో వామపక్ష విద్యార్థులు నీళ్లు పోశారు. 2016లో ఈ దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినదించిన ఘనత వీళ్లది. దేశం మీద, హిందుత్వ మీద వీళ్లు కక్ష కట్టారు.ఈ విద్రోహ చర్యలను ఏబీవీపీ నిరంతరం వ్యతిరేకిస్తున్నది.

మావోయిస్టులు, వామపక్ష విద్యార్థి సంఘ సభ్యులు, జిహాదిస్టులు అంటే, ఇస్లామిక్‌ ‌టెర్రరిస్టు మద్దతుదారులు ఇక్కడ యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక అర్బన్‌ ‌నక్సల్స్‌కు ఇది నిలయం. తామే దాడి చేసే, తమనే బాధితులుగా నమ్మించేటట్టు చేయడం వీళ్లందరికి బాగా తెలుసు. అందుకు కొందరు మేధావులు, ఉదారవాదులు, మీడియా శక్తి మేరకు సహకరిస్తున్నది. ఉదారవాదాన్ని అడ్డం పెట్టుకుని తమ వ్యతిరేకులను, మరీ ముఖ్యంగా హిందువులను, జాతీయవాదులను ఏ విధంగా వెంటాడతారో మకరంద్‌ ఆర్‌ ‌పరాంజపే పుస్తకం జేఎన్‌యూ: నేషనలిజమ్‌ అం‌డ్‌ ఇం‌డియాస్‌ అన్‌సివిల్‌ ‌వార్‌’ ‌చెబుతుంది. అక్కడి ఇంగ్లిష్‌ ‌భాషా విభాగంలో పనిచేసిన పరాంజపే వామపక్ష విద్యార్థి సంఘాల దాష్టీకానికి బలైనవారే కూడా. అక్కడ ఉన్నదంతా ఉదారవాద రహిత ఉదారవాదమని ఆయన అంటారు. లెలి అనే  మాటను ఈయనే ఉపయోగించారు.

వామపక్ష, ఉదారవాద విద్యార్థులు మేధావులమని భావిస్తారు. కానీ వీరిలో ఎవరికీ సొంత అభిప్రాయాలు లేవని అనిపిస్తుందని పరాంజపే అంటారు. పితృస్వామిక వ్యవస్థ, స్త్రీకి స్వేచ్ఛ లేకపోవడం హిందు జీవనంలోనే ఉన్నదని వీరు నమ్ముతున్నట్టు కనిపిస్తారు. కానీ నిజంగానే పితృస్వామిక వ్యవస్థకు ప్రతీకలైన బురఖా, తలాక్‌ ‌గురించి మాట్లాడరు. స్థూలంగా చెప్పాలంటే హిందూ ధర్మంలో అనాచారాలు ఉన్నాయంటూ ఊదరగొట్టే ఉదారవాదులు ఇస్లాంలో లేదా క్రైస్తవంలో ఉన్న అనాచారాలు, మూఢత్వం గురించి నోరెత్తరు.

తాజా ఘర్షణ గురించి చెప్పాలంటే, ఏప్రిల్‌ 12‌న విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం, హోమం దగ్గర పూజలను నిలువరించాలని ప్రయత్నించడం వల్లనే ఘర్షణ తలెత్తింది. కాబట్టి ఏబీవీపీ చెప్పినదే నిజం. వసతిగృహాలలో మాంసాహారం మీద ఎలాంటి నిషేధం లేదు కాబట్టి ఇక్కడ ఆ వివాదం ఏదీ రాదని జేఎన్‌యూ రిజిస్ట్రార్‌ ‌రవికేశ్‌ ‌చెప్పారు.  రామనవమికి కొందరు విద్యార్థులు కావేరి వసతిగృహంలో హోమం వెలిగించి పూజలు చేశారు. దానిని ఇతర విద్యార్థులు భగ్నం చేయాలిని చూశారని కూడా ఆయన చెప్పడం విశేషం. వామపక్ష, ఉదారవాద విద్యార్థులు చెప్పేవన్నీ అబద్ధాలేనని అందరికీ తెలుసు.


హిజాబ్‌ ‌వివాదంతో కర్ణాటకను అల్లకల్లోలం చేసిన ఎస్‌డీపీఐ కొంత ఆలస్యమైనా మళ్లీ అల్లర్లను సాగించింది. సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ పోస్టింగ్‌ ‌విద్య, వాణిజ్య కేంద్రమైన హుబ్లీ నగరంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పోస్టింగ్‌తో మైనార్టీ మతానికి చెందిన కొంతమంది వ్యక్తులు పాత పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. స్టేషన్‌ ఎదురుగా గల కార్వార రహదారిలో వాహనాలకు నిప్పు పెట్టారు. 12 మంది పోలీసులు గాయపడ్డారు. 60 మంది అనుమాని తులను అరెస్టు చేశారు. కోలార్‌ ‌జిల్లా ముళబాగల్‌ ‌లోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నవమి ప్రదర్శనకారులపై దుండగులు దాడులకు పాల్పడ్డారు. కార్లు, బైకులను దహనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 7 నుంచి 11 వరకు వివిధ కార్యక్రమాలు జరిగాయి. కలబురగి (ఒకప్పటి గుల్బర్గా)లోని సెంట్రల్‌ ‌యూనివర్సిటీ ప్రాంగణంలోని ఒక ఆలయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) సారథ్యంలో విద్యార్థులు ప్రార్థనలు చేస్తుండగా దుండగులు దాడులకు దిగారు. ఘటనను ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై ఖండించారు. పర్వత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనూ హనుమజ్జయంతి ఊరేగింపు సందర్భంగా దాడులు జరిగాయి. ఇళ్ల పైకప్పుల నుంచి కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో తొక్కిసలాట జరిగింది. విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ ‌నగరంలో జరిగిన ఘటనలు మళ్లీ దేశం దృష్టిని ఆకర్షించాయి. తలోబ్‌ ‌ప్రాంతంలో నవమి ఊరేగింపుపై దుండగులు దాడులకు దిగారు. పది ఇళ్ల• దహనం చేశారు. ఈ సందర్భంగా 77 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బర్వానీ జిల్లాలోనూ దుండగులు తమ ప్రతాపం చూపారు. జిల్లాలోని సెంధ్యా పట్టణంలో శోభాయాత్ర సందర్భంగా దాడి జరిగింది. ఒక పోలీసు అధికారి సహా మరో ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం మాదిరిగానే ఇక్కడ కూడా శివరాజ్‌ ‌సింగ్‌ ‌రాళ్ల దాడికి పాల్పడిన వారి ఇళ్లను వెనువెంటనే కూల్చివేయించారు. అసదుద్దీన్‌ ఒవైసీ లాంటి వాళ్లు ఇళ్లను కూల్చే హక్కు ఎవరిచ్చారని వాగుతున్నారు. అలాగే సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ అనే కాంగ్రెస్‌లోని మేధో ముస్లిం మతోన్మాది పిల్లలు చేసినదానికి పెద్దల ఇళ్లు ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. అంతేగాని, మొదట ముస్లిం మతోన్మాద మూకలు రాళ్లు ఎందుకు రువ్వ వలసి వచ్చిందన్న సంగతి మాత్రం ప్రస్తావించ లేదు. వీళ్లు సరే, ఈ దేశంలో ఎవరూ కూడా ముస్లింలు చేసిన దాడులను ఖండించడం అనే చర్యకు చచ్చినా పూనుకోవడం లేదు. హిందువులు ఉత్సవం మీద దాడి ఎందుకు చేశారు అని దాడులకు దిగినవారిని ఎందుకు ప్రశ్నించరు. హిందువుల ఉత్సవాలను, పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడం ముస్లిం మతోన్మాదుల జన్మహక్కు అన్నట్టే ఈ మేధావులు వైఖరి ఉంది. ఇంతకాలమైనా, ఇన్ని దాడులు జరుగుతున్నా వీళ్ల వైఖరిలో మార్పు రావడం లేదు. వీళ్లందరిదీ ముస్లింలు దాడులకు దిగినా హిందువులు మౌనంగా భరించవలసిందేనన్న ధోరణి కూడా.

పశ్చిమ రాష్ట్రమైన గోవాలోనూ దాడులు జరిగాయి. వాస్కోలోని బైనా ప్రాంతంలో గల ఇస్లాంపూర్‌లో శోభాయాత్ర సాగుతుండగా దుండగులు రాళ్ల దాడికి దిగారు.


‌పీఎఫ్‌ఐ ‌మీద నిషేధం?

పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ)- ‌గడచిన ఐదారేళ్లలో భారత్‌లో ఎక్కడ ఏ ఘర్షణ జరిగినా వినిపించిన పేరు ఇది. ఈ వివాదాస్పద, మతోన్మాద సంస్థను నిషేధించాలని  సీఏఏ అల్లర్ల సమయం నుంచి ప్రయత్నం జరుగుతున్నది. ఏప్రిల్‌ 10 ‌నాటి శ్రీరామనవమి ఉత్సవాల మీద దాడితో దీని పాపం పండిందని భావిస్తున్నారు. ఈ నిషేధం గురించి కొద్దిరోజులలోనే కేంద్రం ప్రకటన వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు. సీఏఏ వ్యతిరేక అల్లర్లు, షాహీన్‌బాగ్‌ ‌శిబిరం ఏర్పాటు, దొంగరైతులు ఎర్రకోట మీద దాడి చేయడం వంటి ఘటనల వెనుక పీఎఫ్‌ఐ ఉం‌దని రుజువైంది. కొత్త సంవత్సర వేడుకల సమయంలో రాజస్థాన్‌లోని కసౌలిలో, రామ నవమికి మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోనెలో జరిగిన అల్లర్ల వెనుక పీఎఫ్‌ఐ ‌కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. 2006లో ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. నివేదికలను బట్టి 2010లోనే ఈ సంస్థ పురోగమనం ప్రభుత్వానికి గుబులు పుట్టించింది. 2017 నుంచి నిషేధం ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందని చెబుతారు. కేరళ, ఆంధప్రదేశ్‌, ‌మణిపూర్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌లలో ఈ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. కర్ణాటక  హిజాబ్‌ ‌వివాదం వెనుక ఉన్నది కూడా ఈ సంస్థే.

 కరౌలీ హింసాకాండ తరువాత జైపూర్‌లో పీఎఫ్‌ఐ ఒక ఊరేగింపును కూడా నిర్వహించింది. ఎంత గడుసుతనమంటే, రాజస్థానీల ఉగాదికి రెండు రోజుల ముందే పీఎఫ్‌ఐ ఆ ‌రోజు కరౌలీలో హింసాకాండ జరగవచ్చునంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసింది. కేరళలో ఎక్కువ మంది ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ కార్యకర్తలను చంపినది కూడా ఈ సంస్థే. ప్రవక్త మీద వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌చేతులు నరికినది కూడా ఈ సంస్థ సభ్యులే. లవ్‌ ‌జిహాద్‌లో కూడా ఈ సంస్థదే ప్రధాన పాత్ర. ఇందులో ఎక్కువ మంది సభ్యులు నిషేధిత స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియాకు చెందినవారే.

ఆఖరికి ముస్లిం ఉగ్రవాదుల మీద ఈగ వాలినా సహించలేని కేరళ సీపీఎం కూడా పీఎఫ్‌ఐ ఉ‌గ్రవాద సంస్థ అని చెప్పింది. అక్కడ జరిగిన 27 హత్యలతో ఈ సంస్థకు సంబంధం ఉందని పోలీసులు ఆ రాష్ట్ర హైకోర్టుకు ఇచ్చిన వాఙ్మూలం లో ఆరోపించారు. మహారాష్ట్రలో మసీదుల నుంచి లౌడ్‌ ‌స్పీకర్లను తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందంటూ థానే దగ్గరలోని ముంబ్రాకు చెందిన పీఎఫ్‌ఐ ‌నాయకుడు అబ్దుల్‌ ‌మాటిన్‌ ‌షెఖాని చేసిన తీవ్ర హెచ్చరికలను ఒక జాతీయ టీవీ చానెల్‌ ‌ప్రసారం చేసింది. ఎంఎన్‌ఎస్‌ ‌నాయకుడు రాజ్‌ ‌ఠాక్రే లౌడ్‌ ‌స్పీకర్ల తొలగింపును గట్టిగా కోరుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో మరింత గట్టిగా పోరాడేందుకు ముస్లింలు ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలంటూ పీఎఫ్‌ఐ ఒక వీడియోను కూడా విడుదల చేసింది.


 రెండు దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్‌ను అల్లకల్లోలం చేయాలని ముస్లిం మతోన్మాదులకు ఆశ ఉండడం సహజం. దానిని నెరవేర్చుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ నవమికి అక్కడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. సబర్‌కాంత్‌ ‌ప్రాంతంలోని హిమ్మత్‌నగర్‌లో శోభాయాత్ర సందర్భంగా అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. వాహనాలను ధ్వంసం చేశాయి. సాయంత్రం 4.15కు రామ్‌జీ మందిర్‌ ‌వద్ద ప్రారంభమైన ప్రదర్శన ముందుగా నిర్ణయించిన మేరకు క్లాక్‌ ‌టవర్‌కు చేరుకోవాలి. అయితే మార్గమధ్యంలో సంఘ విద్రోహ శక్తులు ప్రదర్శనను అటకాయించాయి. ఆనంద్‌ ‌జిల్లా ఖంబాల్‌ ‌పట్టణంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ అరెస్టు చేసిన వారిలో ముగ్గురు మౌల్వీలు ఉండటం గమనార్హం. ఇలాంటి ఘటనలు, దాడులు అన్యమత ఊరేగింపులపై జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విపక్షాలు ఉవ్వెత్తున విమర్శలకు దిగుతాయి. మీడియా కూడా ఇదే విధంగా స్పందిస్తుంది. కానీ ప్రస్తుత ఘటనలను ప్రస్తావించేందుకు సైతం కొన్ని మీడియా సంస్థలు వెనకడుగు వేశాయి. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఇరువర్గాల ఘర్షణ అంటూ అర్థసత్యాలను రాస్తున్నాయి. కొందరు పోలీసు అధికారులు సైతం పైపై చర్యలతో సరిపెడుతున్నారు.

ముస్లిం మతోన్మాదం కశ్మీర్‌ను ఏ స్థితికి తెచ్చిందో మనందరం చూశాం. దాని పక్కనే ఉన్న పాకిస్తాన్‌, ఆ ‌పక్కనే ఉన్న అఫ్ఘానిస్తాన్‌లో ముస్లిం మతోన్మాదులు ఏం వెలగబెడుతున్నారో కూడా మనం గమనించాం. వాళ్ల వారసులు, ఆ వారసత్వాన్ని ఇక్కడకు కూడా తెస్తామంటే మిగిలిన భారతీయు లంతా మౌనంగా ఉండిపోవలసిందేనా? కనీసం షియాలను కూడా గౌరవించలేని ఈ వర్గం భారతదేశంలో వైవిధ్యాన్ని ఎలా మన్నించగలుగు తుంది? ఎనభయ్‌ ‌శాతం ఉన్న మిగిలిన భారతీయు లపై స్వారీ చేద్దామని కొందరు మతోన్మాదులు అర్రులు చాస్తూ ఉంటే అది సాగదని చెప్పడం మేధావులు కర్తవ్యం. పవిత్ర రంజాన్‌ ‌మాసంలో కూడా హింసకూ, విధ్వంసానికీ పాల్పడే మతాన్ని, దాని ప్రస్థానాన్ని ప్రపంచం ఇప్పటికే అనుమానా స్పదంగా చూస్తున్నది. అయితే భారత్‌లో గాని, ప్రపంచంలో గాని మెజారిటీ సైలెన్స్ ‌గొప్ప చేటు చేస్తున్నది. ముస్లింల ఉద్దేశాలు ఏమిటో, వాటి సాధనకు వారు అనుసరించదలచిన మార్గం ఏమిటో వారి చేత సూటిగా చెప్పించడం అవసరం. అందుకు తగ్గట్టే ప్రపంచం, భారతదేశం వ్యవహరించక తప్పదు. లేకుంటే ముస్లిం మతోన్మాదులు ఇలా పెట్రేగిపోతూనే ఉంటారు. అప్పుడు హిందువులు మౌనం వీడక తప్పదు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగాలి? మత మౌఢ్యానికి అడ్డుకట్ట పడేదెప్పుడు? ప్రజలు చైతన్యవంతులైనప్పుడు కుహనా లౌకికవాదుల ఆటలు, వీరి అండతో హింసను ఆశ్రయిస్తున్న మతోన్మాదుల ఆగడాలు సాగవు. ఈ విషయాన్ని మతశక్తులు, వారి సమర్థ కులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

– జాగృతి డెస్క్/ ‌గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్‌

About Author

By editor

Twitter
Instagram