– కాశింశెట్టి సత్యనారాయణ, 9704935660, విశ్రాంత చరిత్రోపన్యాసకులు

మాకొద్దీ తెల్లదొరతనము గేయానికి వందేళ్లు

‘ఈ ఘోరశిక్షను ఆంధ్రదేశమెట్లు ఆదరించును? పసిబాలురకు, ప్రచారకులకు, కడకు భిక్షకులకు కూడా సత్యనారాయణ గారి గీతములు కంఠపాఠములుగా వచ్చును. వీధులలో భిక్షగాడు, గృహములలో బాలికలూ, పొలములలో పశువుల కాపరులూ ఉత్సాహంతో ఈ పాటలనే పాడుచున్నారు’. 1922 ప్రాంతంలో ఒక దేశభక్తి ఏ విధంగా ఆనందతాండవం చేస్తున్నదో వర్ణిస్తూ ‘జన్మభూమి’ అనే పత్రిక ఆగస్ట్ 8, 1922‌న రాసిన వాక్యాలివి. ఆ గేయమే ‘మాకొద్దీ తెల్లదొరతనము’. పాట శక్తిని 1905లోనే భారతదేశం గుర్తించింది. అదే ‘వందేమాతరం…’ పదిహేనేళ్ల తరువాత మాకొద్దీ తెల్లదొరతనము పాట అక్షరాలా తెలుగునేలను కదిపి కుదిపింది. వలసపాలనను వణికిపోయేటట్టు చేసిన పాట అది. నిజానికి అది 164 చరణాలని చెప్పుకునే తూటాలు ఉన్న హారం. అది పెళ్లిలో పాటైంది. పుష్కరాలలో భక్తిగీతమైంది. తంబుర మీటుతూ పాడే పాడే బైరాగుల తత్త్వమైంది. ఆ పాట రాసిన మహనీయుడు గరిమెళ్ల సత్యనారాయణ.


గరిమెళ్ల మాతృ భాషాభిమానం నిరుపమాన మైనది. ఆంధ్ర సరస్వతిని నవ్యాభరణాలతో అలంకరించాలని ముచ్చటపడ్డారు. అభినవాంధ్ర భారతి కొత్త పుంతలలో నడవాలని ఆశించాడు. అదే సమయంలో భారతమాత శృంఖలాలు తెంచే పోరులో ముందు నిలిచాడు. అందుకు కలమే ఆయుధంగా చేసుకున్నాడు. దేశభక్తి కవిత రాసినా కారాగారవాసం అనుభవించవలసి ఉంటుందని దేశానికి మొదట చెప్పినది ఆయన జీవితమే. ‘మాకొద్దీ తెల్ల దొరతనము’ పాట పాడిన వారికే జైలు శిక్ష పడినప్పుడు ఆ పాట రాసిన కవికి శిక్ష పడటంలో వింతేముంటుంది? అధికారుల గుండెదడ పుట్టించిన పాటలు రాసిన వారిలో గరిమెళ్ల ఆద్యుడే కాదు, అఖండుడు కూడా.

స్వాతంత్య్రం కోల్పోతే కొమ్ములు తిరిగిన వాడైనా కుక్కిన పేనులా ఉండక తప్పదు. బుసలు కొట్టే నాగైనా బుట్టలో ఉంటే గుట్టుగా ఉండవలసిందే. అలాగే ముగుతాడు తగిలించిన పోట్లగిత్త, బోనులో పులీ అణగి మణిగి ఉండక తప్పదు.

వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చిన పాశ్చాత్యులు రాజకీయంగా బలపడటంతో మన స్వాతంత్రానికి గ్రహణం పట్టింది. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయి ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకడం ఎలా ఉంటుందో క్రమక్రమంగా తెలిసి వచ్చింది. దోపిడీ, అణచివేతలతో దేశ ప్రజలలో ఆందోళన మొదలయింది. అది జాతీయోద్యమానికి దారి తీసింది. ఎందరో యోధులు స్వాతంత్య్రం కోసం తమ సర్వశక్తులనూ ఒడ్డారు. వారిలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన గరిమెళ్ల సత్యనారాయణ తన రచనలతో, గేయాలతో తన గాత్రంతో ఆ సమర యోధులను ఉర్రూత లూగించారు.

జాతీయకవి గరిమెళ్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట తాలూకా గోనేపాడు గ్రామంలో 1893లో జన్మించారు. తండ్రి వెంకటనరసింహం, తల్లి సూరమ్మ. ఆ దంపతులకు ఐదుగురు కుమారులూ, ముగ్గురు కుమార్తెలూ. వీరిలో సత్యనారాయణ పెద్దవాడు. ఈయన ప్రియాగ్రహారం, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్ర వరంలలో చదువుకున్నారు. పట్టభద్రుడయ్యాక గంజాం జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో గుమాస్తాగా, తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగానూ ఉద్యోగం చేశారు. అనేక పత్రికల్లో అనేక హోదాల్లో పని చేశారు కానీ ఎక్కడా ఎక్కువ కాలం కొనసాగలేదు.

ఈలోగా 1920 డిసెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ ‌సభ సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించింది. మన స్వాతంత్య్రాన్ని హరించిన బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి సహాయం చేయకూడదని ఆ ఉద్యమ ఆశయం. మహాత్ముని పిలుపు గరిమెళ్లను తాకింది. అంతే, చదువుతున్న చదువు మరే విషయం గానీ ఆయనకు ప్రముఖంగా కనిపించలేదు. చదువుకు స్వస్తి చెప్పాడు, వీరావేశంతో ఉద్యమంలో దూకాడు. సహజంగా స్వాతంత్యప్రియుడూ, కవి అయిన గరిమెళ్ల కంచుకంఠం నుండి ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అనే పాట వెలువడింది. ఆంగ్ల ప్రభుత్వం అనుసరించిన దమననీతిని సామాన్యులకు కూడా తేటతెల్లం చేస్తున్న ఈ గేయరాజాన్ని సరిగ్గా నూరు సంవత్సరాలకు పూర్వం రచించినందుకు గరిమెళ్లకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష పడింది.

చరిత్ర ప్రసిద్ధమైన ఆ గేయం ఆనాటి జాతీయోద్యమ వీరులకు తారక మంత్రం. ఆ ప్రబోధగీతం ఆలపిస్తే చాలు ఆనాటి ప్రభుత్వం జైలు శిక్ష విధించేది. తెల్లదొరల్నీ పరాయి ప్రభుత్వాన్నీ గడగడలాడించిన ఆ పాటను గరిమెళ్ల తన కంచుకంఠంతో పాడుతూ ఉంటే ప్రజలు ఊగిపోయేవారని చరిత్ర చెబుతున్నది. అప్పటి ఒక ఉదంతాన్ని ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు క్రొవ్విడి లింగరాజు చెప్పగా మద్దూరి సుబ్బారెడ్డి గ్రంథస్తం చేశారు.

1921లో రాజమహేంద్రవరం కలెక్టర్‌గా జి.టి.హెచ్‌. ‌బ్రాకెన్‌ అనే అయన ఉన్నాడు. గరిమెళ్ల గేయాల వల్ల ప్రజలు ఉద్రేకపూరితులైతే ఉద్యమం బలపడుతుందని పోలీసు అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. ఆ సమయంలో బ్రేకన్‌ ‌గరిమెళ్లను పిలిపించి తన ఎదుట పాడమన్నారు. తన కంచు కంఠంతో ఆయన ‘మాకొద్దీ తెల్లదొరతనము’ పాట పాడారు. అంతా విని బ్రేకన్‌ ‘‌భాష రాని నాకే గగుర్పాటు కలిగింది, ఇక దేశీయుల్లో ఎంత ఉత్తేజం కలిగిస్తుందో అర్ధమయ్యింది’ అని వెంటనే 124 ఎ సెడిషన్‌ ‌చట్టం క్రింద అరెస్టు చేయించి జైలుకు పంపారట.

మాకొద్దీ తెల్లదొరతనము పాట పెద్దల్నీ, పిన్నల్నీ మంత్రం ముగ్ధుల్ని చేసింది. ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీ టోపీ పెట్టుకుని, బారులు తీరి, మువ్వన్నెల జెండా ఎగురవేస్తూ, కవాతుచేస్తూ ఈ పాటను ఆకాశం దద్దరిల్లేలా పాడేవారట. ఫిబ్రవరి 11, 1922లో గరిమెళ్లను నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు గరిమెళ్ల ఇచ్చిన సందేశాన్ని ‘ది హిందూ’ ప్రచురించింది. ‘నేను నా ధర్మం కొంత నిర్వర్తించి నందుకు కొంచెం ఎక్కువగానే విశ్రాంతి తీసుకోవ డానికి వెడుతున్నాను, ప్రజల భద్రతకు-అనగా ప్రభుత్వ ఉనికికే-నేను ప్రమాదకరంగా పరిణమించ గలనని వారికి తోచింది…. స్వరాజ్య స్థాపన, మీ ఘన విజయాల ప్రశస్తినీ ఉద్దేశించి నేను గానం చేయడానికి గానూ భగవంతుడు నన్ను మళ్లీ మీ మధ్యకు పంపగలడు’.

‘మాకొద్దీ తెల్ల దొరతనము’ అనే పల్లవి ఈ గేయానికి చెప్పలేనత నిండుదనాన్ని తెచ్చింది. ఏదో మంత్రశక్తి అబ్బినట్లవుతుంది. ఇది 162 చరణాల దీర్ఘ గేయం. బ్రిటిష్‌ ‌పాలన, అందులో భారతీయుల ఇక్కట్లకు సంబంధించి ఇందులో ప్రస్తావించని విషయమంటూ లేదు. గరిమెళ్ల మొదట ప్రస్తావించిన విషయం ఆహార సమస్య. వివిధ రాష్ట్రాలలో పంటలు బాగా పండుతున్నప్పటికీ, సామాన్యుడికి పట్టెడు మెతుకులు మాత్రం కరవయ్యాయి. ఉప్పు ముట్టు కుంటే దోషం. కుక్కలతో పోరాడి కూడు తినవలసి వస్తున్నది. సామాన్య మానవుడికి పప్రధమముగా కావల్సింది తిండి, తీర్ధాలే!. తర్వాత చరణంలో వర్తకానికంటూ వచ్చిన తెల్లవారు మొదట పట్టణాలను స్వాధీనం చేసుకుని పిదప రాజ్యాన్ని స్థాపించుకున్న అంశం ప్రస్తావనకు వస్తుంది. దేశీయుల్లో స్నేహభావాన్ని చంపడానికి ప్రయత్నిం చారు. కోర్టులంటూ పెట్టి పార్టీలు పుట్టించారు, ద్రవ్యంతో పాటు దురూహలు కూడా కల్పించారు. ‘మాదు నెయ్యము చెడగొట్టువాడు’ బ్రిటిష్‌ ‌వాడు అన్నారు గరిమెళ్ల.

నోరు తెరచి అడగటానికి అవకాశం లేదు. 144 సెక్షన్‌ ‌విధించాడు. జాతీయ గీతాలాపన చేయ కూడదు, పాలకుల్ని విమర్శించకూడదు. పాలకులు కల్లు సారాయి దుకాణాలు తెరిచారు. సామాన్యుల పండంటి సంసారాలు కూల్చారు. చివరకు భార్యల పుస్తెలు కూడా మత్తు కోసం తెగిపోయాయి. ఇక రైతుల బాధలు చెప్పనలవి కాదు, శిస్తులు ఎక్కువ చేశారు. పంటలు పోయినా పన్నుల బాధ మాత్రం తప్పదు, వాటి వసూలుకు అధికారుల్ని పంపుతారు. వాళ్లు వసూలు చేయలేకపోతే ఉద్యోగాల• హుళక్కి. ఫలితమే ఆ దాష్టీకం.

జాతీయ పతాకాలను పీకి వేసేవారు. జాతీయ వాదుల్ని భయపెట్టడం కోసం సాయుధుల్ని వీధుల్లో తిప్పేవారు. యూనియన్‌ ‌జాక్‌ (‌బ్రిటిష్‌ ‌వారి పతాకం) కు శాల్యూట్‌ ‌చేయమనేవారు. గాంధీ టోపీ ధరించి పాఠశాలలకు వెళ్లకూడదు. రాజద్రోహమంతా రాట్నం లోనే ఉందంటూ దాన్ని బడులలో పెట్టవద్దన్నారు.

చీరాల పౌరులను చూసి అయినా తెల్లవారు సిగ్గు తెచ్చుకోలేదు. బీరాలు మానరట, గాంధీజీ నాయకత్వానికి జోహార్లు అర్పించారు, భారతమాత గాంధీజీ తో కలిసి తపస్సు చేయగా ధర్మ దేవత ప్రత్యక్షమై కోరిన వరాలు ప్రసాదిస్తాడన్నది. ఆ కారణంగా తెల్లదొరలకు గుండెదడ పుట్టుకు వచ్చింది. గోమాత విషయములో తెల్లవారు జోక్యం చేసుకున్నారు. ఆవు మాంసం తెల్లవారికి ఇష్టం కనుక పాడి ఆవుల్ని కోస్తారంటూ ‘మా సూడి ఆవుల మంద తిరిగి ఇంటికి రాదు’ అని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల నాగరికత, మన నాగరికత, మన మతం, మన మతంలోని మేలిమి సర్వమూ, దీనిలో (ఈ పాదంలో) మహాధ్వనిగానున్నది అని విశ్వనాథ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గోమాతను పవిత్ర దృష్టితో చూడటం మన సంప్రదాయం.

మన దేశంలో వాడి తాతగారిముల్లె దాచిపెట్టి నట్లు ధాటీ చేస్తాడట తెల్లవాడు. పైగా ఇందులో మోమాటము రవ్వంతైనా లేదట. వాడి పాటు పాడై పోనూ, వాడి శాసనాలు మాడిపోనూ – అంటాడు గరిమెళ్ల. తెల్లదొరల సేవ చేస్తూ కాలం గడపడం నల్లని మచ్చగా భావించండి – భూమితల్లి ఏడ్పులు వినవస్తున్నాయి. దైవం చూసి మెచ్చాడు. ఏ ఉద్యమ మైనా ఏ దేశమైనా ముందుకు సాగాలంటే ప్రజాభిమానం అందుకు అత్యవసరం. అది లేకుండా తక్కినవి ఎన్ని ఉండీ చిల్లిగవ్వంత కూడా లాభం లేదు. ప్రజాభిమానం, ధర్మం ఉన్నచోట విజయం తథ్యం. మా ధర్మాన్ని మేము మరువం, ఐకమత్యంతో మేము మసులుకుంటాం, ‘గర్వం నశించాలి – సర్వం ఏకం కావాలి’ అన్నదే ఆయన సిద్ధాంతం. అందరూ ఐకమత్యంతో పోరాడితే గాని స్వాతంత్య్రం రాదన్న వాస్తవాన్ని గరిమెళ్ల చక్కగా సూచించాడు.

రాట్నలక్ష్మి నవ్వు మొగంతో పాడుతుందనీ, దాని గుండా స్వేచ్ఛ తిరుగుతుందనీ, దాని ప్రభావాన కరవు మాడిపోతుందనీ గరిమెళ్ల రాట్నపు శక్తిని గురించి గొప్పగా చెప్పాడు.

ఎందుకు మనకిన్ని భేదాలు – బ్రాహ్మణ, ఆబ్రాహ్మణ, పంచమ ఈ భేద భావాలు కాల్చి వేయ మన్నాడు. హిందూ దేశవాసులందరూ సహోదరులు అన్నాడు. అంటుదోషం పాపమంటూ చాటుదా మన్నాడు. హరిజనుల ఆలయ ప్రవేశాన్ని అయన సమర్ధించాడు. మహాపాపం చేసుకున్న వారికే పారతంత్రం అనే భావం కలవాడు. కన్ను మిన్ను గానక తిరగడం, నేరాలు చేయడం, ప్రజల అన్నాన్ని హరించడం, రాక్షసులకన్నా మరీ క్రూరంగా ప్రవర్తించడం – మొదలయినవి పారతంత్య్ర హేతువులుగా భావించవచ్చును.

భారతమాత చేతిలో పూలగుచ్చాలున్నాయి. ఆమె ఎన్నో ముచ్చట్లు తెలుపుతుంది. అయితే ఆమె దర్శనం అస్వతంత్య్ర భారతంలో కాదు, కారాగృహంలో, కనుక చచ్చు రాజ్యమైన అస్వతంత్య్ర దేశం విడిచిపెట్టి సరాసరి జైలుకు రండి, స్వాతంత్య్రం కోసం కారాగృహానికి వెళ్లడమంటే మాతృరుణం తీర్చుకోవడమన్న మాట. అందువల్ల దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ఈ త్యాగ ఫలితంగా మన దేశంలో కొత్త సృష్టి జరుగుతుందని ఆశించాడు.

గాంధీజీ అంటే గరిమెళ్లకు ఎంత భక్తి భావమో చెప్పనలవి కాదు. గాంధీజీ మన శక్తేమిటో మనకు తెలియజేశాడు. పాశ్చాత్య పాలకుల పశుబలాన్ని ఎదిరించే నైతిక శక్తిని కలిగించిన వారు గాంధీజీయే. ఈ స్వాతంత్య్ర సందేశం పల్లెలలో పలికించ•డానికి కారణం గరిమెళ్ల. దైవాన్ని మానం ఇమ్మని కోరుతూ ఈ అద్భుత గేయాన్ని ముగించాడు గరిమెళ్ల.

‘మా ప్రాణాలు పొంచి మానాలు హరియించి’ అన్నాడు. అంటే తెల్లవారి ప్రభుత్వంలో ‘మానం’ హరించారు కనుక భగవంతుడా ఆ ‘మానం’ ప్రసాదించు అని కోరుతూ ముగించాడు. అందుకే విశ్వనాథవారు ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అన్న పాట శాకుంతలం వంటిది అన్నారు. పాట రాసినందుకు జైలు శిక్ష వేశారనే విషయాన్ని గాంధీజీ ముందు నమ్మలేదు. తరువాత దానిని ఆంగ్లంలోకి అనువదించమన్నారు.టంగుటూరి ప్రకాశం ఆంగ్లం లోనికి అనువదించి తన ‘స్వరాజ్య’ పత్రికలో ప్రచురించారు. తరువాత అనేక ఇతర భాషల్లోకి కూడా అనువదించారు.

గరిమెళ్ల వారిని గురజాడ రాఘవశర్మ జాతీయ గేయ కవి సార్వభౌముడన్నారు. విశ్వనాథవారు ‘జాతీయ కవి సార్వభౌము’డన్నారు. ఎన్‌.‌జి. రంగా గారు వారిని ‘ప్రజా పాటల త్యాగయ్య’ అనీ, అనేకులు ఆయనను ఆంధ్రా ‘సుబ్రహ్మణ్య భారతి’ అని కొనియాడారు. ఎందరు ఎన్ని బిరుదులిచ్చినా ఎన్ని సన్మానాలు చేసినా గరిమెళ్ల చివరి రోజుల్లో యాచక వృత్తిని చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు అనాధ శవమయ్యాడు. ఈ నగరంలో ఉంటూ (మద్రాసు) ఎందుకండీ ఈ అవస్థ అని ఓ మిత్రుడు అడిగితే, అయన ఇచ్చిన సమాధానం ‘మరెక్కడా లేని లాభం ఇక్కడ వుంది, ఈ మూల అడుక్కుని తిన్నట్టు ఆ మూలవాడికి తెలియదు’ అన్నారు గరిమెళ్ల.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్‌ 15, 1952‌న మరణించారు. ఆంధ్ర రాష్ట్రం అట్టుడికిపోయింది, కర్ఫ్యూ విధించారు. సరిగ్గా అదే సమయం డిసెంబర్‌ 18, 1952‌న గరిమెళ్ల వారు మరణించారు. కాబట్టి ఈయన మరణాన్ని ఎవరూ గుర్తించలేదు. చందాలు వేసుకుంటూ ఈ అనాథ శవం దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. నిస్వార్థ సేవకు బహుమానం నిరుపేదతనం – కటిక దారిద్య్రం. సుబ్రహ్మణ్య భారతికీ గరిమెళ్లకూ చాలా పోలికలున్నాయి. తమిళ ప్రజలు ఆయన్ని మరణించాక గుర్తించారు. తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఈ తరానికి ఆయనెవరో తెలియదు. అయినా ఆయన పాటకు నూరు వసంతాలు నిండాయి. డాక్టర్‌ ‌చల్లా రాధాకృష్ణ శర్మ గరిమెళ్ల గురించి రాస్తూ ‘నీ జీవితమొక విషాదగేయం – తెలుగు జాతికది మానని గాయం’ అన్నారు.

Source:

గరిమెళ్ళ సాహిత్యం

(సుప్రసిద్ధ జాతీయ కవి సాహిత్య చరిత్ర)

డా. చల్లా రాధాకృష్ణ శర్మ

(లక్ష్మీ నారాయణ గ్రంథమాల ప్రచురణ)

P – 41 to 49, 2, 5, 23, 99 to 103

About Author

By editor

Twitter
Instagram