– డా।। చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


అప్పటికే విశాలమైన గుణరాజు ఇంటి పడమర వైపున, దక్షిణ, ఉత్తర భాగాల్లోనూ అడుగు పొడవు గోడలా రాళ్లు పైకి ఎగిశాయి. చిన్నపాటి కుడ్యంలా కనిపిస్తున్నప్పటికీ అదంతా డొల్లడొల్లగా అతుకుల బొంతలా ఉంది. ఏ రప్పనూ కదిలించినా మొత్తమంతా కుప్పకూలేలా ఉంది.

‘‘తాకితే పడిపోయే గోడలు లేపితే మటుకు కోట అయిపోతుందటే!’’ మరోమారు మరొక సందేహాన్ని తల్లి ముందు వెలిబుచ్చింది గంగు.

‘నిజమే. తాకితే పడిపోయే గాలిగోడల దుర్గం లాగానే ఉంది మన్యంలోని ముఠాదారు వ్యవస్థ. కాకపోతే దాన్ని తాకేవాడు, కూల్చేవాడే కనబడ్డం లేదు. వస్తాడు. తప్పకుండా వస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు అలాంటివాడు వచ్చి తీరుతాడు.’ మనసులోనే రేక అనుకుంటూ,

‘‘భలే అడిగావే గంగూ! పదహారో ఏడు వస్తోంది కదూ నీకు! గుబ్బటవయ్యావు. నీ తెలివి గట్టి బడుతోంది. జ్ఞానం వస్తోంది. నువ్వన్నట్టు ఇదేం కోట కాదు. పేటా కాదు. కానీ, ముఠాదారు తీర్పు చెప్పేముందు అతగాడి ఇంటి చుట్టూ ఇలా తాత్కా లికంగా గోడలు కట్టవలసిన అగత్యం ఉంది. ఇది కొండల్లో నియమం. పైగా ఈ పని మొత్తం మన కోలగాళ్లమే చేయవలసి ఉంది. ఈ రాళ్ల మధ్యనే ముఠాదారు దుర్గనాయకుడిగా తనను తానే ఊహించుకుని తగవు చెబుతాడు.’’ వెటకారపు నవ్వుతో పలికింది. ఆనక తూర్పువైపు గోడపని పూర్తిచేసే ప్రయత్నంలో పడింది.

తల్లి చెప్పినదంతా గంగు బుర్రకెక్కింది. కాకపోతే తగవు అనే ఊసు వినబడగానే ఆ పిల్ల మనసు అదోలా అయింది. నిన్నటి సాయంవేళ నుంచీ బరువెక్కుతూ వస్తున్న గంగమ్మ హృదయం మరింతగా భారమైనట్టూ అయింది. ఇందుకు ప్రధాన హేతువు ఇప్పుడు జరగబోతున్న పంచాయితీ గంగు ప్రియ నేస్తురాలు గరిక చుట్టూ అల్లుకు పోయినది కావడమే. అందుకే, ఆ బాధలోనే,

‘‘గరిక చాలా మంచిదమ్మా! దాన్ని చెన్నడే మోసం చేశాడు.’’ తల్లికి వినిపించేటట్టుగా మెల్లగానే అందామనుకున్నా పక్కనే ఉన్న తండ్రికీ వినబడి పోయింది గంగు మాట. గతుక్కుమనిపోయాడు కోలడు. అతనే కాదు. అతని పక్కగా రాళ్లపనిలో ఉన్న మిగిలిన వారూ విస్మయం పాలయ్యారు. తేరుకున్న కోలన్న వెనువెంటనే,

‘‘హెచ్చుమాటలాడకే గంగమ్మా. గొడవ పరిష్కార సమయంలో మన బంధువర్గమంతా ఇక్కడ ఉండి తీరాలన్న నిబంధన వల్ల నిన్ను ఇక్కడికి తెచ్చాను. నోరు మెదపకు. కొంపముంచకు.’’ నిష్ఠూరపడుతూ అనేశాడు. చిన్నబోయింది గంగు. తండ్రి ఎప్పుడూ తనను ఉద్దేశించి అంతలా మాట్లాడలేదు. అందుకనే ఆమె నేత్రాలు తడిశాయి. గ్రహించింది రేక.

‘‘కచేరీ విషయం కదా. అందుకే అలా మాట్లా డాడు నాన్న. జ్ఞానం ఉంటే సరిపోదు. అది ఎక్కడ బయటపెట్టాలో అక్కడే పెట్టాలి. సరేనా.’’ కోలన్న మాటల్నే మరోలా మార్చి చెప్పింది. బోధపడింది గంగుకి. గుడ్లనీరు కుమ్ముకుంటూ స్థాణువులా ఉండిపోయింది.

ఈ సమయంలోనే నలుగురు గ్రామపెద్దలు పెద్ద పెద్ద తలపాగాలతో తగుమనుషులుగా అక్కడికి చేరారు. చేరడమే కాదు. అకటావికటంగా ఏర్పడ్డ రాళ్లగోడల మధ్య కోటద్వారమని చెబుతున్న జాగా దాటుకుంటూ మహామంత్రుల్లా చొచ్చుకువచ్చారు. తలలు దించుకుంటూ కోలగాళ్లందరూ వాళ్లకు దారిచ్చారు. వారి వెంబడి వచ్చిన ఊరి జనం పంచాయితీని పరికించేందుకు బిలబిలమంటూ ఆవరణ నాలుగు దిక్కులూ కమ్మేశారు.

తలపాగా పెద్దలు రాజు ఇంటి వాకిట పీనె మీద కూర్చోగానే ముఠాదారు గుణయ్య పెద్దపెళ్లాం కుంటెనతో సహా వేంచేశాడు. అరుగు మీది గద్దెవంటి విశాలమైన మట్టి పీటమీద తీరుబడిగా ఈ దంపతులు కూర్చున్నారు. నలువైపులా నిలబడ్డ రాళ్లగోడలను చూశారు. సంతోష పడ్డారు. అదో కోట అన్నట్టూ, తామే దానికి ప్రభువుల మన్నట్టూ పొంగిపోయారు. పై పెదవి మధ్యన కాకుండా చివరికెక్కడో గుబురుగా పెరిగి, ముఖాన్ని అసహ్యంగా చేస్తున్న దిక్కుమాలిన మీసాలను గుణరాజు తిప్పుకున్నాడు. దిబ్బ శరీరాన్ని కదల్చలేక కదల్చలేక నల్లికిళ్ల పాములా కుంటెన కదిల్చింది.

తాము మండివలస మహారాజు మహారాణీ అన్నట్టుగానే కాకుండా సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులమే అన్నట్టుగా ఆ మొగుడూపెళ్లాల వదనాలు మెరిశాయి. వాళ్ల గురించి వాళ్లు ఎలాగయినా అనుకోవచ్చు. వాళ్లకి ఆ హక్కుంటుంది. కానీ, అక్కడివాళ్లెవరికీ వాళ్లు ఆదిదంపతులుగా అస్సలు కనిపించలేదు. సర్వమంగళగా కుంటెన అగుపించకపోగా పేరుకు తగినట్టుగా కుంటెనకత్తెగా కానవచ్చింది. గుణయ్య సైతం శివయ్యలా కాకుండా చేటపెయ్యిలా దర్శనమిచ్చాడు. అత గాడెంత అడ్డనామాలు పెట్టినా, పూసలదండలు వేసినా ఈశ్వరభక్తుడిలా కాకుండా యమ కింకరుడిలాగానే అవుపించాడు. పోనీ అని, అతనికి తగవు తీర్చడంలో సహాయపడటానికి వచ్చిన నలుగురు పల్లెపెద్దల స్థితీ గొప్పగా ఏమీ లేదు. నిలువుబొట్లతో వాళ్లు నిమానుగా కాకుండా నిలువూనిపాతమూ కుళ్లు నింపుకున్న వాళ్లుగానే కిచకిచమంటున్నారు. ఈ లోపటే గుణయ్య గొంతు గుర్రం సకిలింపులా బయల్పడింది.

‘‘తగవు మొదలుపెడదామా! కచేరీకి కక్షిదారులు వచ్చినట్టేనా!’’ అదురు పుట్టేటట్టుగా గయ్‌మన్నాడు. అప్పటికే గ్రామస్తులంతా పీనె అరుగు ఎదురుగా వలయాకారంలో చుట్టడిపోయి నిలుచున్నారు.

‘‘చిత్తం. చిత్తం. ఇరుపక్షాలూ సిద్ధమేనండీ.’’ కోలన్న రెండుచేతులూ కట్టుకుని జనవలయంలో ఒకమూలన నిలుచున్న గరికను, దాని తల్లిదండ్రులను చూపించాడు. వారికి ఎదురుగా మరోవైపు చేరిన చెన్నడు, వాడి కుటుంబసభ్యులకూ అప్రమత్తం కావాలన్నట్టుగా సైగలూ చేశాడు. తగవు చెప్పడం మొదలైంది.

గుణయ్య వైపు తిరిగి, నేత్రాలతోనే అతడు జారీ చేసిన అనుజ్ఞను అందుకుని గ్రామపెద్దల్లో ఒకడైన పెద్ద తలపాగా సింగడు నోరు కదిపాడు.

‘‘ఎన్నాళ్లనుంచీ నడుస్తోంది ఈ భాగోతం?’’ కోపంగా అడుగుతున్నట్టు చెన్నడి అమ్మానాన్నలను అడిగాడు. కానీ, ఆ కోపంలో కోపమే కనిపించలేదు. మీదు మిక్కిలిగా వాళ్లు తనవాళ్లేనన్న ప్రేమ కాన వచ్చింది.

చెన్నడి తండ్రి గిల్లడు గళం సవరించుకున్నాడు.

‘‘నా కొడుకు చెన్నడిదేం తప్పు లేదండీ. అభం శుభం తెలియని నా కొడుకును ముగ్గులోకి దించింది గరికే.’’ కొరకొరా పలికాడు. కలవరపడింది గరిక కుటుంబం.

‘‘అది సరే. ముగ్గులోకి దించి ఏం చేసింది?’’ మళ్లీ ప్రశ్నించాడు పెద్ద తలపాగా సింగయ్య.

ఈ సారి తన వంతు అన్నట్టుగా చెన్నడి తల్లి పూసల చెలరేగింది.

‘‘చెప్పేదేముందండీ. పెళ్లికి సిద్ధపడిపోయింది. మావాడు అమాయకుడు. విషయమంతా మాకు చెప్పాడు. మేం జాగ్రత్తపడి కచేరీకి ఫిర్యాదు చేశాం.’’ పెద్ద నోరుపెట్టింది. తదుత్తర క్షణంలోనే,

‘‘మీరు దొరలని, వాళ్లు కోలగాళ్లనీ, ఇద్దరికీ నప్పదనీ, అగ్రజాతులవారితో కడజాతులు కలవ కూడదని, ఇదంతా కొండల్లో కుదరదనీ చెప్పలేదా? మన కులకట్టును పిల్లాడికి బోధ పరచలేదా?’’ ఈ తడవ కుంటెన నోరెత్తింది. దొరసాని హోదాలో దొరకుటుంబమైన చెన్నడి పరివారాన్ని మాటవరసకు నిలదీసినట్టుగా నిల దీసింది. దీనికీ పూసలే సమాధానమిచ్చింది.

‘‘మావాడి మంచితనాన్ని ఆ గరికగుంట లోపుగా తీసుకుంది. ఎంచక్కా చిన్న కులంది పెద్ద కులంలోకి చొరబడిపోవాలని చూసింది. ఆ దేవుడు గొప్పవాడు. దయామయుడు. ముందుగానే మమ్మల్ని మేల్కొలి పాడు. మీ వంటి ధర్మాత్ముల వద్దకు పంపించాడు.’’ చురచురలాడింది.

ఆ మాటలకి గరిక, ఆమె కన్నవారు నిలువునా నీరయ్యారు. చేష్టలుడిగినట్టుగా నీరసంగా నీరవంగా తలలు వాల్చేసుకున్నారు. గరిక అయితే ఆ క్షణంలో ప్రాణాలు పోయినా బాగుండేదన్నట్టుగా అయింది. వీళ్లే కాదు. ఊళ్లో అందరి కోలగాళ్ల స్థితీ అదే. అందరూ సగం చచ్చినట్టుగా అయిపోయారు. చెన్నడి అమ్మాఅబ్బలు చెబుతున్నది పచ్చి అబద్ధమని వాళ్లకి తెలుసు. గరిక ఎంత మంచి పిల్లో తెలుసును. పబ్బం గడుపుకుని, గరిక బతుకును బుగ్గిచేస్తున్న చెన్నడి వ్యవహారమూ ఎరుకే. ఇన్నీ బుర్రలోనే ఉన్నా ఏమీ చెయ్యలేని ఘోరమైన పరిస్థితి వారిది. మరీ ముఖ్యంగా కోలన్న, రేకమ్మ, గంగు అయితే మనసును బాధ పెట్టుకుంటూ వలయంలో ఒక భాగమై అచేతనంగా నిలుచుండిపోయారు.

కోలన్నకి గరిక తండ్రి బారడు తమ్ముడి వరస. బారడు, వాడి పెళ్లాం చిన్నమ్మ స్థితి చూస్తుంటే కోలడికి గుండె తరుక్కుపోతోంది. కానీ, వాడు కచేరీ సేవకుడు. ఏం మాట్లాడగలడు. అందుకే నోరు కుట్టు కున్నట్టయ్యాడు. ఇంతలోనే,

‘‘అది సరేలేవమ్మా పూసలా. నీ కొడుకును మాట్లాడమను. వాడు నోరువిప్పడా?’’ ముఠాదారు గుణరాజు తప్పదన్నట్టుగా కేకపెట్టాడు. ఆ కేకతో భయపడ్డాడు చెన్నడు. తల్లిదండ్రుల ము•ం చూశాడు. ధైర్యం తెచ్చుకున్నాడు.

‘‘నా మానాన నేను మండివలసలో బతుకు తుంటే ఈ గరికే పక్కదారి పట్టించింది. పెళ్లి పెళ్లి అంటూ నా వెనుక తిరి గింది. వద్దంటే విన లేదు. నేను దొరను. నువ్వు గరికవి. గరిక పోచ అంత కూడా విలువలేని జాతి నీది అని చెప్పాను. గరి కతో నేనెప్పుడూ హద్దులు దాటి చరించలేదు.’’ ఏమీ తెలియని వెర్రిపప్పలా అమాయకంగా నోరు పెట్టేశాడు.

ఆ మాటలకు కోల గాళ్లందరూ నివ్వెర పోయారు. మరీ ఇన్ని అసత్యాలా అన్నట్టుగా మ్రాన్పడి పోయారు. బారడు, చిన్నమ్మా శోకాలు అందు కున్నారు. గరిక పరిస్థితి దారుణాతి దారుణంగా తయారైంది.

చెన్నడు మాట్లాడుతున్నది పచ్చి అబద్ధమని, తనను వాడుకుని వదిలేసేందుకు పన్నాగం పన్నాడని, తనతో తిరిగినప్పుడు కులప్రస్తావన తేనేలేదని, ప్రేమపేరిట తన సర్వస్వం దోచుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని, ఇప్పుడు కల్లలాడుతున్నాడని గగ్గోలుగా చెబుతూ కిందపడి దొర్లింది.

అనంతమైన దుఃఖంతో నేలమీద పొర్లాడుతున్న పిల్లను చిన్నమ్మ గబగబా లేపింది. ఆ పిల్ల కళ్లు తుడిచే ప్రయత్నమూ చేసింది. ఆమె ఒంటికీ, బట్టలకీ అంటుకున్న మట్టిని పోగొట్టేందుకు పాటుపడింది. కానీ, ఇవేమీ గరిక పడనివ్వకుండా తల్లిభుజం మీద వాలిపోయి బావురుమంది. గరిక చెప్పిన మాటలు, ఆమె పెట్టిన ఏడుపులు, నూటికి నూరుపాళ్లూ యదార్థాలేనన్న సంగతి అక్కడికి చేరిన అందరికంటే గంగుకే ఎక్కువగా తెలుసు.

‘తన కళ్ల ముందే కదా చెన్నడుగాడు గరికను నానారకాలుగానూ బతిమలాడుకున్నది. తనముందే కదా పెళ్లిచేసుకుంటానని దానికి వాడు మాట ఇచ్చింది. తను చూస్తుండగానే కదూ చెట్లచాటుకు దాన్ని లాక్కుపోయింది.’ ఎప్పుడయితే ఇవన్నీ గంగమ్మకు గుర్తుకువచ్చాయో ఒక్కసారిగా ఒంట్లో ఉన్న ప్రాణాలన్నీ ఎటో పోయినట్టుగా అయిపోయింది.

‘మరీ ఇంత అన్యాయమా. చూస్తూ చూస్తూ ఇంత అన్యాయంగా చెన్నడు మాట్లాడతాడా. మగనా కొడుకయి ఉండి మగాడిలా కాకుండా నీచ నపుంస కుడిగా బతుకుతాడా. మళ్లీ వీడిదో అగ్రకుమా.’ అనుకుంటూ కుసిల్లిపోయింది. ఆ తరుణంలోనే కూతురివైపు రేక అదోలా చూసింది. అలా చూడటం వెనుక ‘నోరు ఎత్తకు సుమీ..’ అనే గదమాయింపు ఉందన్న భోగట్టా గంగుకి అర్థమైపోయింది. ఈ సమయంలోనే,

‘‘ఇక చెప్పేదేముంది. మనం అడక్కుండానే తన వాదనేదో వినిపించేసింది గరిక. దాన్ని తల్లి దండ్రులేవైనా మాట్లాడితే మాట్లాడవచ్చును. కాదంటే గరిక మాటలకి తగిన సాక్ష్యాలుంటే చూపించ వచ్చును.’’ గుణయ్య పక్కవాడి తగవు వినవేడుక అన్నట్టుగా కిచకిచమన్నాడు.

ఒక్కసారిగా ఎందుకనో అంతటి యాతనలోనూ కోపధారి అయిపోయింది చిన్నమ్మ. ఎక్కడలేని బాధా చుట్టుముట్టేయగా దాని నోరు పెద్దపెట్టున ఎగసి పోయింది.

‘‘ఏం సాక్ష్యాలు చూపించమంటారండీ. ఏం రుజువులు తెమ్మనమంటారు. ఇద్దరూ తిరిగిన చెట్టూ పుట్టా వచ్చి ఇప్పుడు మాట్లాడగలవా? ఇద్దరూ గడిపిన క్షణాలు మనముందు నిలిచి నోరు పెట్టగలవా? ఆకాశమో, భూతలమో నడిచివచ్చి గళం విప్పగలవా?’’ ధ్వజమెత్తేసింది. కచేరీకి చేరిన వారంతా నిశ్చేష్టులైపోయారు. గరిక కొంచెం తేటపడింది. కోలగాళ్లంతా కొద్దిపాటి మోదాన్ని పొందిన్టయ్యారు. గంగు అయితే పిన్నమ్మ మాటలకి సంతోషపడిపోయింది. తను మాట్లాడలేక పోయినా అదయినా నోరుపెట్టిందని సంబరపడింది.

అయితే ముఠాదారు ఎదుట, ఒక ఆడది అందునా కోలగాళ్ల ఆడది అరుపులకు దిగడం కుంటెనకు అస్సలు నచ్చలేదు. ఇలా నేలబారు కులపు వాళ్లంతా నోళ్లు పెట్టడం మొదలైతే మన్యంలోని ముఠా దారులందరూ చెట్టోపిట్టగా చెదరి పోవాల్సివస్తుందని, ముష్టిచిప్ప చేతపట్టుకుని పోవాల్సివస్తుందనీ భయపడింది. అందుకేనేమో తనూ వాయి పెంచేసింది.

‘‘ఏం చిన్నమ్మా! ఏంటి నువ్వు మాట్లాడుతున్నది. పెద్దల సమక్షంలో ఆడదానివై ఉండి రెచ్చిపోవడం ఏంటి? ఆడపిల్ల తల్లివి. తిరుగుళ్లు తిరిగే కూతుర్ని అదుపులో పెట్టుకోలేకపోయావు. పెద్దకబుర్లాడితే ఎలాగ. పిచ్చిపిచ్చిగా పేలకు.’’ గద్దించింది. దెబ్బకి చిన్నమ్మ నోరు మూసుకుపోయింది.

వెంటనే దాని ఎడమచేతిని తన కుడిచేతితో బారడు గట్టిగా పట్టుకున్నాడు. మరేమీ మాట్లాడ వద్దన్నట్టుగా అదమడం మొదలుపెట్టాడు. చేసేదిలేక కళ్లనీళ్లతో నిలుచుండిపోయింది చిన్నమ్మ. అమ్మ భుజాన తలపెట్టుకుని గరిక ఏడుస్తున్న ఏడుపులే ఆ క్షణాన అక్కడ వినబడుతున్నాయి. అంత నిశ్శబ్దం అయిపోయింది ఆ ప్రాంతమంతాను.

అప్పటికి బొమ్మెత్తువేళ ఎప్పుడో మలిగిపోయింది. మధ్యాహ్నం కల్లుతాగే గీతవేళ కావస్తుండటంతో సూర్యుడు నడిమింటినుంచి పడమటకు బయలు దేరాడు. మునుకోలు శ్రావణమాసం గనక గాలి స్తంభించింది. దరిద్రపు తీర్పు ఏదో వెలువడ బోతోందన్న సంగతి ప్రకృతిముందుగానే పసి గట్టినట్టుంది. చేమలు ఊగడం లేదు. చెట్లు తమ కొమ్మల్ని కదిలించడం లేదు. తగవు చోటుకు వలయాకారంగా కూడిన జనం త్వరగా ఇంటికి పోవాలన్నట్టుగా ఆకలి కడుపులతో ఉన్నారు. ఆత్మారాముడి గోలలో పడ్డారు. అలాంటప్పుడే కుంటెన మరో దఫా ఎగిరిపడింది.

‘‘ముఠాదారువారూ ఆలస్యం దేనికి? ఇందులో తగవుచెప్పడానికి ఏముంది. తిరగలేదని వాడంటు న్నాడు. తిరిగానని ఇది అంటోంది. దేనికీ సాక్ష్యాలు లేవు. దీనికింత రాద్ధాంతమా.’’ మొగుణ్ణి ముఠా దారుగా సంబోధించినా ఆ గౌరవం దాని మాటల్లో పక్షి ఈకముక్కంతపాటీ కనిపించలేదు. గుణరాజు సర్దుకున్నాడు. తాను ఏదో ఒక తీర్పు చెప్పకపోతే కుదరదన్నట్టుగా అయ్యాడు. తన తెలివిని వీలయినంత హెచ్చుగా ప్రదర్శించబోయాడు. చక్కని తీర్పు వెలువ రించడంతో పాటుగా తనకూ వ్యక్తిగతంగా కొంత లాభం ఉండాలన్నట్టుగా కదిలాడు. పెళ్లామూ తన తెలివిడి చూసి సంతోషపడాలని తాపత్రయపడ్డాడు. కుడిచేతిని పిడికిలిగా మూసి నుదుటకు తాకించుకుని అడవిదేవతను తలుస్తున్నట్టుగా అయ్యాడు. ఆ మీదట మాట కదిపాడు.

‘‘గ్రామప్రజలందరికీ నమస్కారం. మీరూ ఈ గోల విన్నారు. తగుమనిషిగా ఇందులో నేను చెప్పేది తక్కువే ఉంటుంది. అయినప్పటికీ పంచాయితీని ఒక పద్ధతికి తేవాలి కాబట్టి మాట్లాడుతున్నాను.’’ సాలోచనగా ఆగాడు.

అతగాడు ఏం చెబుతాడో విందామన్నట్టుగా నిరీక్షిస్తున్న జనం ఒక్కసారి ఉస్సురన్నట్టయ్యారు. మళ్లీ ఏం మాట్లాడి గుణయ్య ఏం పలుకుతాడోనని అటు గరిక పరివారమూ, ఇటు చెన్నడి కుటుంబమూ భారంగా కాలం వెళ్లదీస్తోంది.

‘ఏదో ఒకటి గబగబా చెప్పితగలడు.’ అన్నట్టుగా మొగుడి కళ్లల్లోకి సూటిగా చూసింది కుంటెన. దెబ్బకి అతగాడు దేశభక్తి గుర్తుకువచ్చిన నిబద్ధసైనికుడిలా అయిపోయాడు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram