వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన రచన

– యర్రమిల్లి ప్రభాకరరావు

రాజయ్య మొత్తానికి ఆ ఉదయం ఎనిమిది గంటలకు తన ఊరు చేరుకున్నాడు, అతి కష్టం మీద. రావిచెట్టు బండమీద కూర్చుని టీ చప్పరిస్తున్న ఓబులేసు ఒక్క ఉదుటున కిందకు దిగి రాజయ్యను వాటేసుకున్నాడు. ‘‘రాజిగా! ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. ఈయల్టికి మేం యాదొచ్చామా! నీ సిగతరగ’’ అంటూ రాజయ్య చేతిసంచిని తీసుకొని, ఆయన చెయ్యి పట్టుకొని బండమీద కూలేసాడు. రాజయ్య నవ్వుతూ బండమీద కూలబడ్డాడు.

‘‘ఓబులేసు- బొంబాయంతా బందైపోయింది గదా! అక్కడ యాపారాలూ యవ్వారాలూ అన్నీ ఆగిపోయాయి. చాలకట్టమైపోతోంది, ఇంక అక్కడుండడం. చేతిలో పైసలాడడం లేదు. రోజు గడవడం కనాకష్టమైంది. అంచేత మనూరు ఒచ్చేసా, ఎలాగోలా గడుస్తుందని.’’

ఓబులేసు గళాసులో పోసిన టీ గుటకేస్తూ ‘‘మంచోడివే రాజయ్య! మనూళ్లో బతకలేమా ఏంటి? మాతోపాటే నువ్వు కూడా. ఒక్కడివే గదా! కట్టమేముండదు లే. ఇంటికి పోదాం’’ మాసిన కండువా దులిపి లేచాడు. ‘‘ఈడేం చేత్తాడు ఆ మాసిన కండువా చూస్తే తెలీదా యేంటీ? కబుర్లోడు.’’ మనసులోనే అనుకొంటూ నడిచాడు రాజయ్య.

రాజయ్యను చూసిన వెంటనే ఆశ్చర్యపోయింది ఓబులేసు పెళ్లాం పాలమ్మి. ‘‘అన్నా ఇదేంటి ఇల్ల….’’ అంటోంది. ఓబులేసు ‘‘ఆ కతంతా తర్వాత తీరుబాటుగా ఇనొచ్చు. ముందట కాసిని ఉడుకు నీళ్లెట్టు. ఈడు తానం ఎప్పుడు చేసాడో? ఆ మొకం చూడు ఎల్లా ఉందో.. అబ్బా…’’ అన్నాడు గట్టిగా నవ్వుతూ. ‘‘దానికేంది? ఒక్క నిమిసం. పోయిలో అగ్గి అల్లాగే ఉంది. ఏడి నీళ్లకేం బాగ్యం?’’ అంటూ లేచింది పాలమ్మి.

రాజయ్య వేడినీళ్లతో స్నానంచేసాడు. ఓబులేసిచ్చిన చాకింటి పంచె కట్టుకున్నాడు.

చుక్కల బనీను తొడుక్కున్నాడు. చాపమీద కూర్చున్నాడు. అరుగు మీద ఎండ పైకెక్కుతోంది.

శీతాకాలం ఎండ కొద్ది చురుక్కుమంటోంది అల్లాగే చాపమీద పడుకున్నాడు. ఒళ్లుతెలీని నిద్రపట్టేసింది. ‘‘చూడేసె.. ఎల్లా పడుండాడో! పాపం ఎంత కట్టపడొచ్చాడో, ఆడి నుండి’’ ఓబులేసు రోడ్డుపైకొచ్చాడు, గుడొరకు ఎల్తానని చెబుతూ.. పాలమ్మ ‘‘ఎగిరంరా! ఆలశం చెయ్య మాకు’’ అంటుంటే తల ఆడిస్తూ..

      *    *    *

‘‘ముద్దేళయింది అన్నా… ఇక లే కూసింత తిని మల్లా పడుకోవచ్చు. ఓబులేసు కూడా వొచ్చిండు’’ అంది పాలమ్మ.

రాజయ్య చాప మీంచి లేచాడు. ఇంటెనక్కి వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కొని వచ్చాడు. ఓబులేసు, రాజయ్య ఇస్తరాకుల ముందు కూర్చొన్నారు. ‘‘అన్నా నీవొచ్చావని చేపల పులుసు చేసా’’ అంది పాలమ్మ. ‘‘చాలా బాగుంది చెల్లీ. నీ చేతొంట తిని చాలనాళ్ల య్యింది?’’ రాజయ్య నోట్లో ముద్ద పెట్టుకొని అన్నాడు. ‘‘చాలా నాళ్లెంటి అన్నా… రేపొచ్చే సంకురాత్రికి నాలుగేళ్లయింది మా ఊరొదిలి’’ అంది పాలమ్మ. ఊఁ కొట్టాడు రాజయ్య. వాళ్లిద్దరూ తిన్నాక పాలమ్మ కూడా అక్కడే భోజనం చేసింది. ముగ్గురి భోజనాలు అయిన తరువాత ‘‘ఇప్పుడు చెప్పన్నా నీ కత….’’ అంది పాలమ్మ, తీరుబాటుగా కూచొని.

‘‘అందరికీ తెలిసిందే కరోనా వచ్చి ముంచేసింది గదా! బొంబాయిలో చానా ఎక్కువగా కమ్మింది. అంచేత లాక్‌డౌను చేశారు. ఎవరికీ పనులు లేవు. ఇక పైసలు ఎల్లాగా? ఒంటరోడ్ని అయినా బతకాలి గదా! కనస్ట్రక్షన్‌ ‌వర్కులు ఎక్కడివక్కడే మూతొడ్డాయి. దాంతో నా తాపీ మూల పడింది. అదే ఇషయం’’ పెద్దగా నవ్వుతూ చెప్పాడు రాజయ్య.

‘‘ఇక్కడ కూడా ఏం బాగోలేదన్నా. అందరి పనులు పోయాయి. కూలోళ్లందరూ ఖాలీయే. ఊడుపుల దగ్గర్నుంచి కోతల వరకు ఎగసాయం సన్నబడింది! ఈ యాల పనుంటే రెండ్రోజులు ఖాళీ! అంతేగదయ్యా….’’ అంది పాలమ్మ. అవునన్నట్లు తలూపాడు ఓబులేసు.

‘‘మా బాయ్యకూ పని లేదు. సినిమాలు ఆడటం లేదుగా మరి. టిక్కట్లు చింపేపని పోయింది. ఈడికి అది తప్పితే మరేదీ రాదు గదా!’’ నవ్వుతూ అంది పాలమ్మ.

‘‘మరి…’’

‘‘ఏదో చెయ్యాలి గదా! నా గేదెలు న్నాయి గదా! ఆ పాలే ఆధారం. ఈ కట్ట కాలంలో ఆ రెండు గేదెలు ఆటొచ్చా యయ్యా!’’ పాలమ్మ నెమ్మదిగా చెప్పింది, ‘‘నా పేరే పాలమ్మి గదా!’’ అంటూ…

సాయంకాలం నాలుగు గంటలకు ఓబులేసు, రాజయ్య ఇద్దరూ రామాలయం దగ్గరకు వెళ్లారు. రామాలయం దగ్గరున్న పుష్కరిణిలో తూడు బాగా పట్టింది. రెండు రోజుల నుంచి ఓబులేసు పుష్కరిణిలోంచి తూడు అంతా తీసి పుష్కరిణి చెత్తాచెదారం లేకుండా చేశాడు. గుడి బయట చేలో ఒక పెద్ద గొయ్యి తీసి అందులో తూడును కప్పి పెడుతున్నాడు. ‘‘మంచి పని చేత్తున్నావు ఓబులూ- ఒక ఏల్లో తూడు మంచి ఎరువవుతాది. పుష్కరిణీ బాగవుతాది’’ అన్నాడు రాజయ్య, ఓబులేసుకు సాయం చేస్తూ. ‘‘అంతేకాదు రాజయ్య! పుష్కరిణిలో నీళ్లు కూడా శుభ్రంగా ఉంటాయి. భక్తులందరికీ సదు పాయంగా ఉంటుంది. అంచేత నేనే కొద్ది సాయం చెయ్యమని ఓబులేసునడిగాను. అది సరే నువ్వెప్పు డొచ్చావు? బొంబాయి నుండి’’ అడిగాడు పూజారి నాగేశ్వరరావు పంతులు.

‘‘ఈయాలే వచ్చానయ్యా! ఎల్లాగా అక్కడ పనులన్నీ మూతొడ్డాయి. దమ్మిడీ ఆదాయం లేదు. ఆపైన కరోనా భయం’’… రాజయ్య కండువాతో తడి చేతులు తుడుచుకొంటూ ఆలయం అరుగు మీద కూర్చున్నాడు. ఓబులేసు కూడా చేతిలో ఉన్న గడ్డపార పక్కన పెట్టి పని చాలించి కూర్చున్నాడు.

‘‘రాజయ్యా! రైళ్లూ, బస్సులూ లేవు గదా? ఎల్లా వచ్చావు?’’ అడిగాడు పూజారి. ‘‘అదంతా ఒక పెద్ద కతయ్యగారూ! కొంతదూరం రైళ్లు, కొంతదూరం బస్సులూ ఎక్కి వచ్చానయ్యా! కొంతదూరం లారీ మీద కూడా…’’

‘‘ఎన్ని రోజులు పట్టింది?’’

‘‘ఇరవైనాళ్లపైనే పట్టిందయ్యా! మధ్య మధ్యలో కరోనా పరీక్షలు కూడా చేశారయ్యా! హైదరాబాదు దాటిన తరువాత పదేనురోజులు కారంటైన్‌లో ఉంచారు. అదేదో ఊరు. పేరు నాకు గుర్తులేదు. బడిలో ఉంచారు. మందులిచ్చారు కూడా’’

‘‘కొంతమంది మంచోళ్లు వన్నం, దాహం కూడా దారంతా ఇత్తానే ఉన్నారు. ఏదో కట్టపడి వచ్చిపడ్డా. చేతిలో డబ్బాడకపోతే ఎల్లా ఉంటుందో తెలిసొ చ్చిందయ్యా’’ గట్టిగా నిట్టూర్పు విడిచాడు రాజయ్య.

‘‘రాజయ్య! ఆ బాధలు నీకే కాదయ్యా! ఇక్కడా ఉన్నాయి. అందరి చేతుల్లోనూ పని పోయింది, చాలామంది పస్తులుంటున్నారు. నువ్వే చూడు- మన గుడి ఇంత ఖాళీగా ఎప్పుడైనా ఉందా? భక్తులు రావడం బాగా పడిపోయింది.’’ కొబ్బరి ముక్కలు, ప్రసాదం చేతిలో పెడుతూ అన్నాడు నాగేశ్వరరావు పంతులు.

వాళ్లు మాట్లాడుతున్నంతసేపు గుడి స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పంతులు గారి పెద్దకొడుకు సుధాకర్‌. ‘‘‌బాబెప్పుడొచ్చాడు? పట్నంలో ఇస్కూల్లో మేస్టారు గదా!’’ ఓబులేసు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘ఏం చెప్పమంటావు ఓబులేసు. స్కూళ్లు కూడా మూత పడ్డాయి గదా కరోనా వల్ల. జీతాలు ఇవ్వలేక మేనేజ్మెంటు కొంతమందిని ఉద్యోగాల లోంచి తీసేసింది. వాళ్లలో వీడొక్కడు. పట్నంలో గది ఖాళీ చేసి ఇంటికొచ్చేసాడు’’ గట్టిగా నిట్టూర్పు విడిచాడు పూజారి. వాళ్ల సంభాషణ అంతా మౌనంగా వింటున్నాడు సుధాకర్‌, ఏమీ మాట్లాడకుండా.

‘‘బీఈడీ చదివించాను టీచర్‌ ఉద్యోగం పర్మినెంట్‌ అయితే ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకొన్నా. అన్ని తారుమారయ్యాయి’’ నాగేశ్వరరావు పంతులు గుడికి తాళం వేస్తూ అన్నాడు. తండ్రి వెనకే నడిచాడు సుధాకర్‌. ఓబులేసు, రాజయ్య- ఇద్దరు కూడా ఇంటి దారి పట్టారు.

రాజయ్య వచ్చి వారం రోజులు దాటింది. ఈ వారం రోజులు ఆ ఊర్లో గాని, పక్క ఊర్లో గాని ఏమైనా పని దొరుకుతుందేమోనని చూశాడు. ఎక్కడా పని దొరికే మాటే లేదు. కొత్త ఇళ్లు కట్టడాలు ఆగిపోయాయి. చేతిలో డబ్బులు ఆడకపోవడం చేత ఎవరు ఇంటి రిపేరు పనులు కూడా చేయడంలేదు. కూలీలందరూ ఖాళీగా కూర్చున్నారు. కొంతమంది ఇంకేదైనా ఊర్లో పని దొరుకుతుందేమోనని పిల్లాపాపలతో పోతున్నారు. అంతా అయోమయం. రాజయ్య చాప మీద కూర్చొని ఆలోచనలో పడ్డాడు.

‘‘ఎంతో ఆశతో బొంబాయి నుండి వచ్చేసాడు, ఇక్కడ ఏదో ఒక పని దొరుకుతుందని ఏం ప్రయోజనం లేదు. ఇక్కడా పనులేం జరగడం లేదు. ఇక్కడ కూడా కరోనా భయమే. ఎవరూ పనికి పిలవడం లేదు. ఏదైనా కొద్ది తలం ఉంటే ఏ కూరో నారో వేసు కోవచ్చు. తనకు అదీ లేదు. బొంబాయి లోనే నయంగా ఉండేదేమో. రోడ్డు బిడ్జి కింద చనక్కాయలో, మురుగులో అమ్ముకొని బతికే వీలుండేది. బిడ్జి కింద చిన్నపాకలో ఉంటున్న సత్తి గుర్తుకొచ్చింది రాజయ్యకు. అవును సత్తి ఎల్లా ఉందో? ఆ పిల్లకు ఎవరూ లేరు. తను బొంబాయెళ్లిన ప్పటి నుంచి చూత్తున్నాడు. ఒకతే ఉంటోంది. నెమ్మదైనదయినా చురుకైంది. చలాకీగా ఉంటుంది. మాట అర్థం చేసుకుంటుంది. అంతే కానీ మాట్లాడలేదు కదా! సైగలతో మాట్లాడుతుంది. తన కంటే నాలుగైదేళ్లు చిన్నది. అయినా తాను బొంబాయి వెళ్లిన కొత్తల్లో తనే చూసుకుంది, తన కతా కమామీషు ఏం తెలియనప్పటికీ. ఎక్కడో కేరళట ఆ పిల్లది. అమ్మ, అయ్యలతో ఎప్పుడో చిన్నప్పుడే వచ్చేసింది. అయ్యది టీ కొట్టుట. ఆళ్లు పోయిన తర్వాత తనే బతుకుతోంది, ఏదో కూలీ నాలీ చేసుకుంటూ. హిందీ అర్థమవుతుంది ఆ పిల్లకు. అంతే. తనతో నువ్వే నాకు అండ అని యాక్టింగ్‌ ‌చేసి చూపెట్టి పకపకా నవ్వేది. నల్లగా ఉన్నా ఆ ముఖంలో మంచి కాంతి, పెద్ద పెద్ద కళ్లు. చక్కని పిల్ల. గడుసుగా ఉంటుంది గానీ ఉత్తి బోలా…’’ సత్తి గుర్తుకొచ్చి రాజయ్య బాధపడ్డాడు, ఆమెతో చెప్పకుండా వచ్చేసానని.

కానీ ఇప్పుడేం చేస్తాడు? తాను తిరిగి బొంబాయి వెళితే గాని ఆమెని చూడటం పడదు. రాజయ్య గుండె బరువెక్కింది.

మరో రెండు రోజులు గడిచాయి. ఏదైనా పని దొరుకుతుందేమోనని ఓబులేసు బయటకెళ్లాడు. ఆ గట్టు మీద, ఈ గట్టు మీద రాలిన మామిడికాయలు, దొరికిన దోసకాయలు, కొబ్బరికాయలు ఒబ్బిడి చేస్తోంది పాలమ్మి. కొబ్బరికాయల పీచు తీసి కాయలు శుభ్రం చేస్తోంది.

‘‘చెల్లమ్మ! మీకు నేను చానా కట్టం ఇత్తున్నా, పనీపాటా లేవుగదా!’’ ‘‘పర్లేదు అన్నా… మాతోబాటే నువ్వు కూడా! ఏదో కొన్నాళ్లు… సర్దుకుపోవాలి గదా!’’ పాలమ్మ అంది. ఆ మాటలు పాలమ్మ అంటుంటే ఆయమ్మలోని అమాయకత కనబడింది రాజయ్యకు.

‘‘సరే చెల్లెమ్మా! నీ మాట కాదంటానేటి? ఇదిగో ఆ కాయలు గోతాంలో ఏసీ ఇయ్యి. తణుకెళ్లి ఏ కొట్టులోనో అమ్ముకొత్తా. ఓబులేసు సైకిల్‌ ఉం‌ది గదా!’’ అన్నాడు రాజయ్య.

‘‘అల్లాగే అన్నా కూసంత మజ్జిగ అన్నం తిని వెల్లు. ఎండ ముదిరింది గదా!’’ పాలమ్మ మొహంలో తృప్తి కనబడింది రాజయ్యకు. పాలమ్మకు సంతోషం కలిగింది రాజయ్య కొబ్బరికాయలు అమ్ముకొస్తానని చెప్పడం వలన కాదు, తన ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నందుకు. ఆ విషయం రాజయ్యకు కూడా తెలుసు.

తణుకు శివారునున్న ఆ పల్లె నుండి సైకిల్‌ ‌మీద రాజయ్య తణుకు చేరాడు. రెండు, మూడు కొట్లలో కనుక్కున్నాడు, కొబ్బరికాయలు కొంటారా? అని ఎవరూ అక్కర్లేదని చెప్పారు. చివరకు ఒక షావుకారు కొనడానికి ముందుకు వచ్చాడు. కానీ కాయకు పన్నెండు రూపాయల కంటే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. రాజయ్య బేరం చేస్తే చాలా కష్టం మీద పదమూడుకి ఒప్పుకున్నాడు.

రాజయ్య గోతాంలో ముప్పైకాయలు ఉన్నాయి. అవి ఇచ్చి డబ్బు పుచ్చుకున్నాడు రాజయ్య. మూడు వంద నోట్లు, తొమ్మిది పదులు. వేసుకున్న బనీనుకు జేబు లేదు. పంచెలో నడుము దగ్గర నోట్లు జాగ్రత్తగా దాచుకున్నాడు. గోతాంలో ఒక కాయ మిగిలించి కాయతో గోతాన్ని మడిచి కేరియర్‌ ‌దగ్గర కట్టేసాడు రాజయ్య తృప్తిగా.

ఇంతలో రాజయ్యకు ఏవో మాటలు వినిపిం చాయి. ‘‘కొబ్బరికాయెంత?’’ ఎవరో కుర్రాడు షావుకారుని అడుగుతున్నాడు. ‘‘ముప్పై రూపాయలు’’ షావుకారు జవాబిచ్చాడు.

‘‘ఇరవై ఏడు రూపాయలకు ఇవ్వరా! నా దగ్గర అంతే ఉంది. మా యమ్మ ఇచ్చిన వంద రూపాయలలో అరకేజీ కందిపప్పు కొంటె మిగిలింది ఇంతే. మా అమ్మ వీలుంటే ఒక కొబ్బరికాయ తెమ్మని చెప్పింది.’’ సన్నని స్వరంతో ఆ పదేళ్ల కుర్రాడు అడుగుతున్నాడు.

‘‘కిట్టదయ్యా….’’ కొట్టు వాడి స్వరంలో విసుగు. వెళ్లిపోతున్న కుర్రవాడిని చూసాడు రాజయ్య. కుర్రాడి మొహం చిన్నబుచ్చుకుంది. ‘‘అబ్బాయి ఇల్లా రా’’ పిలిచాడు రాజయ్య.

‘‘కొబ్బరికాయ కావాలా?’’

‘‘ఊఁ కానీ నా దగ్గర ఇరవైఏడు రూపాయలే ఉన్నాయి, మరి…’’

‘‘తీసుకో పర్లేదు’’ రాజయ్య కేరియరుకు కట్టిన గోతాంలోంచి కొబ్బరికాయ తీసి ఇచ్చాడు.

కుర్రాడు అనుమానంగా రాజయ్యను చూస్తూ కాయ తీసుకున్నాడు. ‘‘ఇదిగో డబ్బులు…’’ గుప్పిట్లో నుంచి నోట్లు తీసి ఇచ్చాడు. రాజయ్య నవ్వాడు. ‘‘డబ్బులేం అక్కర్లేదు. పట్టుకెళ్లు’’. కుర్రాడి మొహంలో ఆనందం.. ‘‘నిజంగా’’.. రాజయ్య ఏం బదులు చెప్పలేదు. సైకిల్‌ ఎక్కాడు. కాయ పెద్దది. నీళ్లు కూడా ఉన్నాయి. కాయను గలగలా ఆడిస్తూ కుర్రాడు ముందుకు పరుగెత్తాడు.

రాజయ్య మొహంలో సంతృప్తి నాట్యం చేసింది. ‘‘అందరూ బతకాలగదా!’’ అనుకున్నాడు మనసులో.

రోజు రాజయ్య పట్నం వస్తున్నాడు, సైకిల్‌ ‌మీద పల్లెలో పండిన కాయో ఆకో తీసుకుని… అవి అమ్మి డబ్బులు తీసుకుని సాయంకాలం ఇంటికి వెళ్తున్నాడు. పాలమ్మ చేతుల్లో పెడుతున్నాడు.

‘‘అన్నా నీ దగ్గర్నుండి డబ్బు తీసుకోవడం నాకు మొమాటంగా ఉందన్నా!’’ అంది పాలమ్మ.

‘‘ఏం పర్లేదు చెల్లెమ్మా! నువ్వు పంపించిన కూరలే గదా. ఆ డబ్బులు నీయే ఏదో అమ్మిపెడుతున్నా.. కాయకట్టం నీదే గదా!’’ రాజయ్య సమాధానం. ఈ మాటలు విని ఓబులేసు నవ్వుకుంటాడు.

పాలమ్మ డబ్బులు గిన్నెలో వేసి వంటింటి గూడులో పెడుతుంది భద్రంగా. ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ లెక్కకడుతుంది రోజు.

‘‘కరోనా పున్నేన ఈ సంవత్సరం భోజనాలు లేవు, పెళ్లిళ్లు లేవు. అయినా కూరల ధరలు ఎల్లా ఉన్నాయో చూడు అన్నా.. రోజు నీకు తోటకూర పులుసు, గోంగూర పులుసు నాకు చాలా మొమాటంగా ఉందయ్యా! నీ ఆకులో ఎయ్యడానికి’’ అంది పాలమ్మ ఒకరోజు.

‘‘ఏం పర్లేదు చెల్లెమ్మా! అందరితో పాటే మనం కూడా. అయినా రోజూ మజ్జిగ, పెరుగో ఇత్తున్నావు గదా! ఇంకేంటి కావాలా?’’ రాజయ్య మజ్జిగన్నంలో మిరపకాయ చొరుక్కుంటూ అన్నాడు.

‘‘అన్నట్టు రాజయ్యన్నా సెప్పడం మరిసిపోయా. రాతిరి పంతులుగారబ్బాయి ఉరేసుకొన్నాడు. ఊరంతా ఒకటే గోల, ఏడుపులు?’’ నువ్వు ఈయాల పొద్దుటే ఎళ్లిపోయావుగా కూరలమ్మడానికి అంచేత.. రాజయ్య అవాక్కయ్యాడు ‘‘ఏది ఆ అబ్బాయే… మాస్టారుద్యోగం…’’ అంటున్నాడు.

‘‘అవును రాజయ్యా! ఆ కుర్రాడే ఉన్న ఫలాన ఉరేసుకున్నాడు.

పూజారి, పూజారమ్మ గొల్లున ఏడుస్తున్నారు పాపం…’’ రాజయ్య నోట్లో ముద్ద అడ్డుపడింది. చివాలున తినడం ఆపి లేచాడు.

‘‘అదంతా సరేగాని.. రాజయ్య అక్కడ సత్తాలు (సత్తి)ని ఒదిలేసొచ్చావు.

నీకేమైనా బావుందయ్యా!’’… ఓబులేసు రాజయ్య మొహంలోకి చూస్తూ అడిగాడు.

‘‘రాజయ్య తల దించుకున్నాడు’’

‘‘అన్నా పెద్ద తప్పు చేసావన్నా.. నీ మాటలన్నీ ఈ నెల రోజులు ఆలకించా. సత్తాలు మాటలేందే నువ్వు బొంబాయి ఇశేషాలు ఏయీ చెప్పలేదు. అంటే సత్తాలంటే నీ కిట్టం అని నాకు అర్ధమైంది. కరోనా చాలా మందిని పొట్టనెట్టుకుంది కూడాను.. మరి ఆ పిల్ల ఏం కట్టపడుతుందో…’’ రాజయ్య లేచి నిలబడ్డాడు. ‘‘కోపం వద్దయ్యా! సత్తాలుకు నాయం చెయ్యి. నిన్నే నమ్ముకుందని నా కెరికయింది. మీరిద్దరూ కలిసే ఉండాలా…’’ పాలమ్మ మెల్లగా చెప్పింది.

రాజయ్య మౌనంగా బయటకు నడిచాడు.

ఇంకొక పది రోజులు గడిచాయి. రాజయ్య బొంబాయి నుంచి వచ్చి రెండు నెలలు దాటింది. కరోనా ఉద్ధృతి తగ్గడంతో లాక్‌డౌన్‌ ‌నిబంధనలు తగ్గాయి. రైళ్లు, బస్సులు తిరుగుతున్నాయి. రాజయ్యకు ఈ మధ్యకాలంలో ఆందోళన ఎక్కువైంది. అక్కడ సత్తాలు ఎల్లా ఉందో? తాను మోసం చేశాడని అఘాయిత్యం చేసుకొంటే? రాజయ్య కలత. నిద్దురలో రాత్రిళ్లు పక్క మీద అటూ, ఇటూ దొర్లుతున్నాడు. అన్నం కూడా సరిగ్గా తినడంలేదు. ఉరేసుకున్న సుధాకర్‌ ‌గుర్తుకొస్తున్నాడు. సత్తాలు కూడా ఇలాగే.. ‘‘అమ్మో’’ అనుకున్నాడు. పాలమ్మ ఇదంతా చూస్తూనే ఉంది.

ఒకరోజు ‘‘అన్నా! రైళ్లు తిరుగుతున్నాయి గదా! ఇదో బొంబాయికి టికెట్‌ ‌తీసా ఈ రేతిరే నీ పయానం.

ఈ మూడు నెలలు నువు చేసిన గనకార్జం చాలు. ఎల్లి సత్తెమ్మను చూచుకో. ఆ పిల్ల ఎల్లా ఉందో, ఏమో!’’ పాలమ్మ కన్నులు రెండు తుడుచుకుంది, చీరచెరగుతో.

రెండు రోజులు గడిచాయి. ఉదయం ఎనిమిది గంటలైంది. రాజయ్య భయంభయంగా బ్రిడ్జి దగ్గర సత్తెమ్మ ఇంటిముందు నిలబడ్డాడు.

సత్తెమ్మ రాజయ్య బట్టలు ఎండబెడుతోంది. అకస్మాతుగా తలెత్తి చూసింది.

రాజయ్య.. ఒక్క పరుగున వచ్చి రాజయ్యను వాటేసుకుంది. సత్తెమ్మ కన్నీటి వరదలో తడిసి పోయాడు, రాజయ్య..

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram