ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌ ‌కార్డులే ఆ ప్రభుత్వాన్ని ముంచనున్నాయి. సర్కారు అమలుచేసే సంక్షేమ పథకాలన్నిటికీ అర్హత రేషన్‌కార్డులే. అధికారం కోసం, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగా కోరిన వారందరికీ తెల్లరేషన్‌ ‌కార్డులిచ్చారు. ప్రభుత్వోగం చేసి పదవీ విమరణ పింఛన్లు తీసుకుంటున్నవారికి కూడా తెల్లరేషన్‌ ‌కార్డులు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా కోరినవారికి తెల్లరేషన్‌ ‌కార్డులిచ్చేశారు. దాంతో 1.48 కోట్ల తెల్లకార్డులు రాష్ట్రంలో ఉన్నాయి.

అధికారం కోసం పలురకాల పథకాలు, నగదు బదిలీలు చేస్తానని హామీ ఇచ్చిన వైకాపా కార్డుల సంఖ్యను పరిగణించలేదు. తీరా అధికారంలోకి వచ్చాక తమ పథకాలను 1.48 కోట్ల కార్డులకు అమలుచేయాలంటే ఉన్న నిధులు చాలడంలేదు. ప్రతి నెలా ఈ పథకాల్లో నగదు చెల్లింపులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల్లో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టగా 4.70 లక్షల కార్డులు తొలగించారు. ఈ సంఖ్యతో ప్రభుత్వానికి ఎలాంటి మేలు జరగలేదు. తొలగించిన కార్డుల ద్వారా రూ.250 కోట్లు మాత్రమే ఆదా అవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కావాలంటే వీటి సంఖ్యను మరింత పెంచాలి. గత ప్రభుత్వాలు లబ్ధిదారుల ఆదాయ వివరాలు చూడకుండా విచ్చలవిడిగా ఇచ్చిన తెల్లకార్డులు 50 క్షలకు పైగానే ఉన్నాయి. వీటిని కూడా తొలగిస్తే ప్రభుత్వానికి కాస్త వెసులుబాటు ఉంటుంది. కాని ప్రస్తుతం తీసేసిన 4.70 లక్షల కార్డుదారులు చూపుతున్న వ్యతిరేకత చూస్తుంటే, అనర్హత కలిగిన మరో 50 లక్షల కార్డులను తీసేసే సాహసాన్ని ఈ ప్రభుత్వం చేయగలదా? అనేది సంశయమే.

సంక్షేమం పేరుతో పందేరం

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో చేస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాలు ఖజానాను ఖాళీ చేస్తున్నాయి. తోచిన పంపకాలకు తొమ్మిదిరకాల పేర్లు పెట్టి అన్నిటికి తెల్లరేషన్‌ ‌కార్డు అర్హతగా నిర్ణయించి రెండేళ్లుగా వీటిని అమలుచేస్తున్నారు. ఒక్కో పథకానికి నెలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అర్హతగా నిర్ణయించిన తెల్లరేషన్‌ ‌కార్డుల్లో 35 నుంచి 40 శాతం అనర్హులకు కేటాయించినవే ఉన్నాయి. నవరత్నాల పథకం ద్వారా ఇచ్చే నగదు సంపన్నులకే చేరి విలువైన ప్రజాధనం వృధా అవుతుంది. అర్హులైనవారికి న్యాయం చేయడం లేదు. ఉదాహరణకు సామాజిక పింఛన్లు నెలకు రూ.3 వేలు ఇస్తామని వైకాపా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాని తర్వాత ఆ హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. ప్రతిపక్షాలు చేసిన ఆందోళనలతో విడతల వారీగా పెంచుతామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత రూ.250 మాత్రమే పెంచారు. ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతామని ప్రకటించినా ఏడాది దాటిపోయినా ఇంకా పెంచలేదు.

తెల్ల రేషన్‌కార్డులు (ఇప్పుడు బియ్యం కార్డులు) ఇవ్వాలంటే ఏడాదికి ఆదాయం నగరాల్లో క్ష మించరాదు. గ్రామాల్లో రూ.80 వేలకు మించరాదు. కాని పౌరులు చేసుకున్న దరఖాస్తులను బట్టి వారి జీవన పరిస్థితులు పరిశీలించకుండానే గతంలో పౌరసరఫరాల శాఖ కార్డులు ఇచ్చేసింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తకార్డులు ఇవ్వడం ప్రారంభించింది. అయితే వీరు కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు. కేవలం ఇన్‌కంటాక్స్ ‌సంస్థ సమాచారం మీదనే ఆధారపడ్డారు. ఏడాదికి రూ.2.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారి వివరాలు ఐటీ సంస్థ నుంచి తీసుకుని వారికి మాత్రమే రేషన్‌ ‌కార్డులు తీసేసారు. తర్వాత 300 యూనిట్లకు పైగా నెలకు కరెంటు బిల్లులు వచ్చినవారికి కార్డులు తొలగించారు.

ఈ సందర్భంగా కార్డుల్లో పేర్లు మార్పులు ఉన్నా తొలగించి, విచారించాక వాటిని పునరుద్ద రించారు. ఇలా వచ్చిన సమాచారంతో ఇప్పుడు ప్రభుత్వం సుమారు 4.70 లక్షల కార్డులు తొలగించింది. కాని ఐటీకి దొరక్కుండా చేసే వ్యాపారులు, మారుపేర్లతో చేసే వ్యాపారులు, సర్వీసు చేస్తూ ఆదాయం పొందేవారు మాత్రం తప్పించుకుంటున్నారు. ఇలా 50 లక్షల మంది కార్డులు పొందారు.

ఇలా తప్పించుకుంటున్నారు!

1). తల్లిదండ్రుల పేర భవనాలు ఉంటే పిల్లల పేరున రిజిస్టర్‌ ‌చేయించరు. ఆ ఇళ్లు, భవనాల్లో పిల్లల కుటుంబాలు నివసిస్తూ, అద్దెలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో వీరి తల్లిదండ్రులకే రేషన్‌కార్డు నిలిపివేస్తున్నారు. కాని పిల్లలకు మాత్రం రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇలాంటి కార్డులే అనర్హత గల కార్డుల్లో 50శాతం వరకు ఉన్నాయి.

2). కుటుంబ పెద్దకు ఆదాయం పెరిగితే ఆ వ్యక్తిని మాత్రం కార్డు నుంచి తొలగించి మిగతా వారి పేరున కార్డులు ఇస్తున్నారు. కుటుంబ పెద్దకు వచ్చిన జీతం, లేదా ఆదాయం ఒక్కడే ఖర్చుచేసుకోడు. కుటుంబం మొత్తానికి ఖర్చుచేస్తారు. అది గమనించని ప్రభుత్వం ఆ వ్యక్తినే కార్డు నుంచి తప్పిస్తుంది. కార్డుల జారీలో ఇదో పెద్ద తప్పు.

3). బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరపని కొందరు వ్యాపారుల వద్ద తెల్లరేషన్‌ ‌కార్డులున్నాయి. వీరు సేల్స్‌టాక్స్ ‌నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ‌చేయించుకోరు. కొందరు వ్యాపారాలను తల్లిదండ్రుల పేర్లు పెట్టి తాము మాత్రం తెల్లరేషన్‌కార్డులు తీసుకున్నవారు 20 శాతం వరకు ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే కొన్ని పథకాలు

1). అమ్మఒడి ద్వారా ఏటా రూ.15 వేలు.

2). ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌ద్వారా వృత్తి విద్యాకోర్సుల్లో ఫీజు మొత్తం చెల్లింపు. వసతి దీవెన ద్వారా ఏడాదికి రూ.20 వేల చెల్లింపు.

3). జగనన్న చేయూత. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారికి ఏటా రూ.18,750 చెల్లింపు.

4). జగనన్న ఆసరా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు బ్యాంకుల్లో చేసిన అప్పు పూర్తిగా చెల్లింపు.

5). 60 ఏళ్లు దాటిన అందరికి సామాజిక పింఛన్లు నెలకు రూ.3 వేల చొప్పున చెల్లించాలి.

6). పేదలకు ఇళ్లు

నవరత్నాల్లో ఈ కింది పథకాలు చూపిస్తున్నా ఆరోగ్యశ్రీ ద్వారా మాత్రమే డబ్బు పంపిణీ జరుగుతుంది.

7). జలయజ్ఞం

8). ఆరోగ్యశ్రీ

9).మద్యనిషేధం

ప్రతి కుటుంబానికి మూడు నుంచి

4 పథకాల లబ్ధి

తెల్లరేషన్‌కార్డులున్న ప్రతి ఇంటిలో ఒక వృద్ధురాలు లేదా రెండు, మూడిళ్లలో వితంతు పెన్షన్‌ ‌తీసుకునేవారున్నారు. వీరికి రూ.2,250 ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాలకు ఆసరా పథకం ద్వారా ప్రతి ఇంటికి అమలౌతుంది. దీని ద్వారా ఏడాదికి సుమారుగా సగటున రూ.7,500 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అమ్మఒడి పథకం కూడా తెల్లకార్డు ఉన్న వారిలో 80 శాతం మందికి లభిస్తుంది. దీని ద్వారా ఏడాదికి రూ.15 వేలు లభిస్తాయి. వైఎస్‌ఆర్‌ ‌చేయూత పథకం ద్వారా తెల్లకార్డుదారుల్లో 25 శాతం మంది మహిళలు ఏడాదికి రూ.రూ.18,750 నగదు పొందుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌ద్వారా భారీ ఖర్చు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌పథకం ద్వారా ప్రభుత్వంపై భారీ ఖర్చుపడుతోంది. ఈ పథకం ద్వారా వృత్తివిద్యా కోర్సులకు పూర్తిఫీజు చెల్లిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్నా అనుమతి ఉంది. ఇంజనీరింగ్‌ ‌కోర్సులకు కనిష్టంగా రూ.35 వేలు జమచేస్తున్నారు. వసతి దీవెన పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నారు. ఒక్క విద్యార్థికి ఏడాదికి రూ.55 వేలు లబ్ధిచేకూరుతుంది. కాని తెల్లకార్డుల ద్వారా అత్యధిక ఆదాయం ఉన్నవారు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.

నిజమైన పేదలు పథకాల ద్వారా లభించే సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు. కరోనా వల్ల వీరికి కొంత ఆర్థిక వెసులుబాటు అయింది. కాని అధిక అదాయం సంపాదించేవారు మాత్రం ఈ డబ్బును బంగారం, లేదా విలాస వస్తువులు కొనేందుకు వినియోగిస్తున్నారు. పండుగ సమయాల్లో ఇస్తే వస్త్రాలు కొంటున్నారు. కొందరు దూరప్రాంతంలోని ప్రార్ధనా మందిరాలకు వెళ్తున్నారు.

తొలగిస్తే భారీగా ఆదా

ఇటీవల తొలగించిన 4.70 లక్షల రేషన్‌కార్డుల వల్ల నెలకు రూ.250 కోట్లు ఆదా అవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అనర్హత కలిగిన 50 లక్షల కార్డులను తొలగిస్తే నెలకు రూ.2500 కోట్లచొప్పున, ఏడాదికి రూ.30 వేల కోట్లు ఆదా అవుతుంది. ఈ డబ్బుతో ఎన్నో ప్రాజెక్టులు అమలుచేయవచ్చు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులన్నిటికీ రూ.10 వేల కోట్లు సరిపోతాయి. కాని వాటిని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎందరో కష్టార్జితం నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఈ సంపదను దుర్వినియోగం కాకుండా చేయాలంటే అనర్హత గల కార్డులను తొలగించాలి.

తెల్ల రేషన్‌కార్డుల వ్యవహారం ప్రభుత్వానికి ముందు చూస్తే నుయ్యి… వెనుక చూస్తే గొయ్యి చందాన తయారైంది. కార్డులు తొలగించకుంటే భరించలేని ఆర్థికభారం. తొలగిస్తే ఓటుబ్యాంకు పోతుందేమోనని మరో భయం ప్రభుత్వానికి పట్టుకుంది. రెండేళ్ల నుంచి నవరత్నాల ద్వారా లబ్ధిపొందినవారు ఇప్పుడు లబ్ధిని నిలిపివేయడంతో ప్రభుత్వాన్ని తీవ్రంగా దూషిస్తున్నారు. గతంలో ప్రభుత్వాన్ని పొగిడినవారు కూడా నేడు బాహాటంగానే తిడుతున్నారు. సంక్షేమ పథకాల అమలు తప్పించి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నీ ప్రభుత్వం చేపట్టలేదు. డబ్బు తీసుకున్నవారు ఒక్కసారిగా నిలిపివేస్తే చూస్తూ ఊరుకోరు.

తొలగించిన 4.70 క్షల కార్డుదారులు 10 లక్షల ఓటర్లుగా పేర్కొనవచ్చు. 50 లక్షల కార్డులు తీసేస్తే కోటి ఓట్లు పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే వైకాపా 2024 ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో 50 క్షల మంది అనర్హులకు కార్డులు తొలగించే సాహసం ప్రభుత్వం చేసే అవకాశం లేదు.

-తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram