బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఆరంభం అదిరింది. హైదరాబాద్‌ ‌పాతబస్తీ జనసంద్రమయింది. చార్మినార్‌ ‌నలువీధులూ కిక్కిరిసిపోయాయి. కేసీఆర్‌ ‌చేతిలోంచి తెలంగాణ విముక్తే లక్ష్యంగా ఈ యాత్ర మొదలయిందని సంజయ్‌ అన్నారు. ఈ పాదయాత్రలో మేము సైతం అంటూ వందల మంది వెంట నడుస్తున్నారు. రాష్ట్ర రాజధాని నగరం నుంచి మొదలుకొని.. జిల్లాల గుండా సాగుతోంది. గ్రామ గ్రామానా జనం నీరాజనం పడుతున్నారు. పల్లె పల్లెనా బీజేపీ శ్రేణులు పాదం కలుపుతున్నారు. గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేసే ఆశయానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా గోచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది.

పోరాడి సాధించుకున్న తెలంగాణ కేవలం ఒకే కుటుంబానికి ప్రయోజనకరంగా మారిందని, ఒక్కరి చేతిలో బందీ అయ్యిందంటూ.. ప్రజలందరి తెలంగాణగా మార్చేదిశగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోందని, అందులో భాగంగానే పోరాటమే శరణ్యంగా ముందడుగు వేస్తున్నామని ఆ పార్టీ నేతలు చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మీ అమ్మవారి సమక్షంలో ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా అదే ఆలయం నుంచి బండి సంజయ్‌ ‌ప్రజాసంగ్రామ యాత్ర అట్టహాసంగా మొదలయింది.

పాదయాత్ర సాగుతున్న తీరు, యాత్రలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులు, ఎక్కడికక్కడ ఈ బృందంతో పాటు నడుస్తున్న ప్రజలు.. యాత్ర మార్గంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న బహిరంగ సభలు బీజేపీలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. నాయకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపుతున్నాయి. తెలంగాణలో అధికారం పక్కా అన్న భరోసాను ఇస్తున్నాయి.

ఆగస్ట్ 28‌న చార్మినార్‌ ‌వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్‌ ‌ప్రజాసంగ్రామ పాదయాత్ర మొదలయింది. రెండు రోజుల పాటు రాజధాని నగరంలోని వీధులు, ప్రధాన రహదారుల మీదుగా  సాగింది. మూడో రోజు నగర శివారు మీదుగా పల్లెల్లోకి సంగ్రామ యాత్ర అడుగుపెట్టింది. పల్లెలు, పట్టణాల గుండా కొనసాగుతోంది. పాదయాత్ర సాగుతున్న తీరు అధికార టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌లో కదలిక తెచ్చింది. ఇప్పటికే హుజురాబాద్‌ ఎన్నికల పుణ్యమాని ప్రగతిభవన్‌, ‌ఫామ్‌హౌస్‌ ‌దాటి జిల్లాల బాటపట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు బీజేపీ యాత్రతో హస్తిన బాట పట్టారు. అప్పటికప్పుడు హడావిడిగా అపాయింట్‌మెంట్లు కోరారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వరుస భేటీలు నిర్వహించారు. బయటకు అధికారిక పర్యటన అయినా.. లోగుట్టు వేరే ఉందన్నది పరిశీలకుల మాట. రాష్ట్ర బీజేపీ టీఆర్‌ఎస్‌పై ముప్పేట దాడి చేయడం, కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామంటూ పదే పదే ప్రకటనలు చేయడం, తననే లక్ష్యంగా చేసుకొని ప్రజా సంగ్రామయాత్రకు శ్రీకారం చుట్టడం కేసీఆర్‌ను కుదురుగా ఉండనీయలేదన్న వాదనలున్నాయి.

బండి సంజయ్‌ ‌పాదయాత్రను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం పాదయాత్ర వ్యవహారాలు, ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌ ‌రూపొందించడం కోసమే ఓ కమిటీని నియమించారు. పాదయాత్ర ప్రారంభం కాకముందు నుంచే ఈ కమిటీ చురుగ్గా పనిచేస్తోంది. పాదయాత్ర ప్రముఖ్‌గా డాక్టర్‌ ‌జి.మనోహర్‌ ‌రెడ్డి, పాదయాత్ర సహ ప్రముఖ్‌గా మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ ‌కుమారుడు టి.వీరేందర్‌ ‌గౌడ్‌ ‌వ్యవహరిస్తున్నారు. యాత్ర కోసం 30 కమిటీలు, 180 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర ఏర్పాట్లను చేశారు. పెద్దఎత్తున కార్యకర్తలు వెంట నడిచేలా ప్రణాళికలు రూపొందించారు. ముందుగా బండి సంజయ్‌తో కలిసి పాదయాత్రలో నడిచేందుకు ఆరు వందల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ, యాత్రలో బస, భోజనం వంటి సౌకర్యాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. పాల్గొనేవారి సంఖ్యను 300కే పరిమితం చేసినట్లు చెబుతున్నారు. మొత్తం నాలుగు దశలుగా పాదయాత్ర కొనసాగనుంది. తొలి విడత యాత్ర అక్టోబర్‌ 2, ‌గాంధీ జయంతి వరకూ కొనసాగనుంది.

తొలిరోజు యాత్ర ప్రారంభానికి ముందు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ఛుగ్‌, ‌నేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్‌సింగ్‌, ‌లక్ష్మణ్‌తో కలిసి బండి సంజయ్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తర్వాత చార్మినార్‌ ‌వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీకి మెట్రో రైలు రప్పిస్తామని.. హిందూ-ముస్లింలకు ఉద్యోగాలిప్పిస్తామని సంజయ్‌ ఈ ‌సందర్భంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక మెదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద నిర్వహిస్తామని చెప్పారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసే వరకు పోరాటం చేస్తామన్నారు. పాతబస్తీలో హిందూ సమాజానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంగ్రామ యాత్ర రెండోరోజు సంజయ్‌ ‌కుడికాలికి స్వల్ప గాయమయింది. అయినా పాదయాత్రకు అంతరాయం కలగకుండా కొనసాగిస్తూనే ఉన్నారు.

యాత్రలో ప్రతిరోజూ ఓ బహిరంగ సభలో బండి సంజయ్‌ ‌ప్రసంగిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, ‌కేసీఆర్‌ ‌లక్ష్యంగా సూటి విమర్శలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ‌మెడలు వంచేది బీజేపీ అని ప్రజలు భావిస్తున్నందువల్లే పాదయాత్రకు భారీ స్పందన కనిపిస్తోందన్నారు. ఈ స్పందన చూశాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తలపెట్టింది కాదని అన్నారు. నియంత పాలన నుంచి విముక్తి పొందాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, వారి కష్టాలు, బాధలు, ఇబ్బందులను క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకుని, వారికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే పాదయాత్ర చేపడుతున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారన్న సంజయ్‌.. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటే ప్రత్యేక తెలంగాణ ప్రాథమిక లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరుతాయనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారని చెప్పారు.

అంతేకాదు, తాను ఉపయోగించే భాషకు గురువు కేసీఆరే అని, ఆయన దగ్గర నేర్చుకున్న భాష కాబట్టి ఆయనకు ఆ తరహాలోనే సమాధానం చెబుతున్నానని, సీఎంగా కేసీఆర్‌ ‌మాట్లాడే భాష తప్పు కానప్పుడు నేను మాట్లాడే భాష ఎలా తప్పు అవుతుందని సంజయ్‌ ‌ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలున్నాయని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన సమయంలో తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ పాదయాత్ర దశల వారీగా 2023 వరకు కొనసాగుతుందని, తద్వారా ప్రజలు, కార్యకర్తలను కలుసుకుని రాజకీయపరంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని మీడియాకు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన కింద రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే.. ప్రధాని మోదీకి ఎక్కడ పేరు వస్తుందోనని సీఎం కేసీఆర్‌ ‌దాన్ని డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల పథకంగా పేరు మార్చారని ఆరోపించారు సంజయ్‌. ‌కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన కింద 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిందన్నారు. దానికి సంబంధించి లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని అనేక సందర్భాల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను ఇవ్వలేదన్నారు. 100 గదులతో, వందల కోట్ల రూపాయలతో ప్రగతి భవన్‌ ‌కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌… ‌పేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు మాత్రం కట్టివ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని వ్యక్తి ఇక ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన పథకాన్ని అమలుచేయాలన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి అంతటికి కారణం కేంద్రం నిధులేనని సంజయ్‌ ‌పేర్కొన్నారు. ప్రజలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే కేసీఆర్‌ ‌తానొక్కడే సాధించినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, మూడు ఎకరాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి మోసంచేశారని అన్నారు. హుజురా బాద్‌ ఎన్నికల్లో దళితుల ఓట్లను ఆకట్టుకునేందుకే దళితబంధు ప్రవేశపెట్టారన్నారు. కేవలం గెలుపే లక్ష్యంగా ఓటర్లను కొనుక్కుంటున్నారని విమర్శించారు.

సంజయ్‌ ‌యాత్ర ద్వారా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ ‌పెరుగుతోందనే అంచనాలు అందరికీ వచ్చాయి. పార్టీ అధిష్టానం సైతం యాత్రపై భారీగానే ఆశలు పెట్టుకుంది. యాత్రకు వస్తున్న ఆదరణ, మారుతున్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయి. ఇప్పటికే సంజయ్‌ ‌పాదయాత్రకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపించడం, వారంతా ఈ యాత్రను పర్యవేక్షిస్తూ ఉండడంతో పాటు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ ‌షాకి పంపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా సంజయ్‌ ‌పాదయాత్ర మొదలు కాకముందే అమిత్‌ ‌షా బృందం హైదరాబాద్‌కు రావడం, యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై పరిశీలన చేయడం వంటివి జరిగాయట. మొత్తం ఆరుగురు సభ్యుల బృందం ఈ యాత్రను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ నివేదికలు పంపుతోందని అంటున్నారు.

యాత్రకు ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రులను ఒక్కొక్కరిని ఈ యాత్రలో పాల్గొనే విధంగా ప్రణాళిక సైతం రూపొందించారు. సెప్టెంబర్‌ 4‌వ తేదీన వికారాబాద్‌ ‌పాదయాత్రలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్‌, 7‌వ తేదీన సంగారెడ్డిలో బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ తేజస్వీ సూర్య పాల్గొన్నారు. అలాగే, ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌ ‌విమోచన దినాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా పాల్గొననున్నారు.

– సుజాత గోపగోని,  సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

By editor

Twitter
Instagram