జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

– గంటి భానుమతి

అదే మాట తల్లితో అంది.

‘‘ఇప్పటినుంచి ఈ విషయాలెందుకు? సమయం వచ్చినప్పుడు చూడచ్చు. నువ్వు ఎక్కువ రోజు లుండాల్సిన పని లేదు. ఉంటే ఓ వారం పదిరోజులు అంతే కదా. ఉన్నన్ని రోజులూ నీ గదిలో నువ్వుంటే సరి. వాళ్లందరితో మాట్లాడాల్సిన పనేం లేదు. ఏదో సర్దుకుపోతే సరి. ఏ గొడవా ఉండదు’’

మళ్లీ అదే పదం. సర్దుకుపోవడం. నచ్చని పదం.

‘‘నేను సర్దుకుపోవాలా. తెలీని మనుషుల మధ్య అడ్జస్ట్ అయిపోవడం ఏంటీ. ఇన్ని ఏళ్లు ఇక్కడ పెరిగిన నేను కొత్త చోటుకి వెళ్లి ఎలా సర్దుకుంటాను. నేను ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉంటాను. పైగా అది పల్లెటూరు. ఏదో ఓ రోజు ఉండడానికి బాగానే ఉంటుంది, రెండు రోజులు బావుంటుంది.’’

ఇంటికి వచ్చాక తల్లితో అదే అంది.

‘‘అక్కడ ఆ పరిస్థితి రాదులే. అయినా అది మరీ పల్లెటూరు కాదుట. పెద్ద ఇల్లు, నౌకర్లు, చేతిలో కారు, డ్రైవరు. ఓ పది కిలోమీటర్ల దూరంలో టౌను, పెద్ద సెంటరు, సినిమా హాళ్లు అన్నీ ఉన్నాయిట. హైద్రాబాదులో కూడా ఓ ఇల్లుందిట. అప్పుడప్పుడు అక్కడ కూడా ఉంటారట.’’

‘‘ఏమోనమ్మా నాకు ఇంత వరకూ ఎరగని, చూడని వాతావరణం. ఉత్త పల్లెటూరి మనుషులు. వాళ్ల మధ్య ఒక్కరోజు కూడా ఉండలేననిపిస్తోంది. ఈ జీవితం వేరు, ఆ జీవితం వేరు. సైజులో, ఆకారంలో, అంచుల్లో, హద్దుల్లో, సరిహద్దుల్లో అన్ని విధాలా’’

‘‘ముందర్నుంచి కంగారు పడిపోతావేంటి. నువ్వు చదువుకున్నదానివి, అన్ని తెలిసిన దానివి. అర్థం చేసుకునే జ్ఞానం ఉందని అనుకుంటున్నాను. ఇంతకన్నా మంచి అబ్బాయి మనకి దొరుకుతాడని అనుకోను. ఈ అమెరికా పెళ్లికొడుకు దొరకడం నీ అదృష్టం అనుకో. అయినా నువ్వు అమెరికా వెళ్లిపోతావు కదా, అంతగా అయితే కొన్ని రోజులు మా అమ్మ దగ్గర ఉంటానని చెప్పి ఇక్కడికి రా. అందుకని ఎప్పుడో జరగబోయే దానికి ఇప్పటినుంచి భయపడడం అనవసరం. నువ్వు పల్లెటూరు, పల్లెటూరు అంటూ అన్నిసార్లు అని తేలికైపోకు. ఓ వారం రోజు లుండడం కూడా కష్టమేనా! వ్రతం అవన్నీ అయ్యాక నువ్వు వెళ్లిపోతావు. ఓ నాలుగు రోజులుండాలి. ఆమాత్రం ఉండలేవా.’’

ఎందుకో సుధీర కన్విన్స్ అవలేకపోతోంది. అత్తగారు, ఆడపడుచులు, రకరకాల మనుషులు. వేవ్‌ ‌లెంత్‌ ఏమాత్రం కలవదు. తను పెళ్లవగానే అమెరికా వెళ్లిపోవాలి. అదే కదా అన్నారు. ఆ తరవాత ఎప్పుడో ఓ నాలుగేళ్లకి వచ్చినప్పుడు రెండేసి రోజులు ఉంటే సరిపోతుంది.

తల్లి వెళ్లిపోయాక ఆలోచనలో ఉండిపోయింది. పెద్దలు కుదిర్చినా, ప్రేమ పెళ్లైనా పెళ్లి లాటరీ లాంటిదే. తెలీని జీవితం. తెలీని దారి. ఇది ఎలాంటి దారి అవుతుంది. దారిలేని అడవి అవుతుందా. సముద్రపు ఒడ్డున ఒంటిగా నుంచుండి పోతుందా. ఏదైనా తను ఓ కొత్త సమాజంలోకి వెళ్తోంది. అందులో తను ఓ భాగం అవుతుంది.

 గుర్‌‌గ్రాం నుంచి అప్పారావు గారు ఓసారి ఫోన్‌ ‌చేసారు, విక్రాంత్‌ ‌తండ్రి సుబ్రహ్మణ్యం నాకు ఫోన్‌ ‌చేసాడు. ముగ్గురం కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అన్నారు. అదే విషయాన్ని సుధాకర్‌కి చెప్పారు.

 అన్ని విషయాలు అంటే ఏం విషయాలు వస్తాయి అన్న దాని మీదే ఆ రోజంతా మాట్లాడుకున్నారు. అందులో కట్నం, లాంఛనాలు, పెట్టుడు చీరలూ, సారెలు కూడా వచ్చాయి. సుధీర దేనికి అభ్యంతరం పెట్టలేదు. సుధీరకే ఆశ్చర్యం అనిపించింది, తను ప్రాక్టికల్‌ ‌మనిషి కాదు. తనకంటూ సొంత అభిప్రాయాలేం లేవు. పైగా అవి తొందరగా మారిపోతూంటాయి.

 ‘‘అన్ని విషయాల్లో కట్నం గురించి ఉంటుందని నేను చెప్పలేను. కాని వాళ్లకి అవేం అక్కర్లేదని నాకనిపిస్తోంది. వాళ్లకి భూమి పుట్రా అదీ బాగానే ఉంది. వాళ్లకి విక్రాంత్‌కి తగిన అమ్మాయి కావాలి. చదువుకున్నది, మనశాఖవాళ్లు కావాలనుకున్నారు. దీని ముందు కట్నం చాలా చిన్న విషయం అని నా కనిపిస్తోంది. నేను కూడా వస్తాను. అప్పారావుకి రావడానికి కుదరదని అన్నాడు. అందుకని మనం ఇద్దరం కలిసి వస్తున్నామని ఫోను చేస్తాను.’’ అని సుధాకర్‌ అన్నాడు.

 అనుకున్నట్టుగానే భాస్కరరావు, సుధాకర్‌ ‌హైద్రాబాదు వెళ్లి అక్కడినుంచి టాక్సీ తీసుకుని వెళ్లారు. విక్రాంత్‌ ‌లేడు. అమెరికా వెళ్లిపోయాడని మాటల్లో అన్నారు. అన్ని విషయాలు విక్రాంత్‌ ‌పెద్ద తాతగారు, తండ్రి, తల్లి, బామ్మ కూచుని మాట్లాడున్నారు.

‘‘కట్నం, లాంఛనాలూ అవీ ఏం వద్దన్నారు. ‘మా పిల్లలకి మేం పెట్టుకుంటాం. మీరు పెట్టడం ఏంటీ? విక్రాంత్‌ ‌సంతోషమే మా ఆనందం. విక్రాంత్‌కి అమ్మాయి బాగా నచ్చింది.’ అన్నారు. అయితే ఓ కండిషన్‌ ‌పెట్టారు. పెళ్లి మాత్రం వాళ్ల ఇంట్లో చెయ్యాలని. అదొక్కటే కోరారు.’’ అని ఢిల్లీ వచ్చాక భాస్కరరావు స్వర్ణతో అన్నాడు.

‘‘అదేంటీ, అలా ఎందుకు? మనమ్మాయి పెళ్లి మన ఊళ్లో చేస్తే మనకి బావుంటుంది కదా, ఇక్కడ చేస్తే మనకి ఎన్నో ఖర్చులు కలిసి వస్తాయి. అదే మాట అనకపోయారా?’’

‘‘అనకుండా ఎలా ఉంటాను? అన్నాను. మా ఊళ్లో చేస్తే మాకు కొన్ని వెసులు బాట్లుంటాయి. తెలిసిన వాళ్లు పెళ్లి పనులకీ వాటికీ సాయం చేస్తారు. మాకు స్వతంత్రం ఉంటుంది. మీ ఇంటి దగ్గర పెళ్లంటే చాలా వాటికి మీ మీద ఆధారపడాల్సి వస్తుంది’’ అని అన్నాం.

‘‘ఇది మా అబ్బాయి పెళ్లి. మా అందరికీ సరదాగా ఉంది. అదొక్కటే కాదు, మామ్మ గారికి ఒంట్లో బాగాలేదు. రెండు సార్లు హార్ట్ ఎటాక్‌ ‌వచ్చింది. ఆవిడ ప్రయాణం చేసే స్థితిలో లేదు. ఆవిడ కోసం మేం ఇక్కడే చేస్తే బావుంటుందని అంటున్నాం. మీరెంత మంది వచ్చినా ఫ•రవాలేదు. అందరికీ అన్నీ సౌకర్యాలు అందించగలం. ఈ వరసలో సగం ఇళ్లు మావే. ఆ ఇళ్లన్నీ మీకు విడిది. పనివాళ్లున్నారు. మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించం. మాకు కట్నం అదీ ఏమీ అక్కర్లేదు. మాలో కలిసిపోయే అమ్మాయి, మా వాడికి నచ్చిన అమ్మాయి, తగిన అమ్మాయి అయితే చాలు. మా ఆడపిల్లలకి లాంఛనాలూ అవీ కూడా డిమాండ్‌ ‌చెయ్యం. మీ ఇష్టం’’

‘‘అదీ నిజమే. అంత మంది ఈ ఢిల్లీ వస్తే, వాళ్లని ఎన్ని కోఠీలు (గెస్ట్‌హౌసులు) తీసుకుని ఉంచడం సాధ్యమవుతుంది.’’ అని అంది స్వర్ణ.

 అన్నీ విన్న సుధీరకి ఆ ఇంటి మీద, ఆ ఇంట్లో మనుషుల మీద, అటువంటి ఇంట్లో పుట్టిన విక్రాంత్‌ ‌మీద గౌరవం పెరిగింది. కారణం కట్నం వద్దన్నారు. ఇవన్నీ విక్రాంత్‌ అమెరికా వెళ్లే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి ఉంటాడు.

 ఆ ఇంటి గురించి, వాళ్ల మంచితనం గురించి చెప్తూంటే సుధీరకి చాలా సంతోషం వేసింది. అదే విషయాన్ని కొలీగ్స్ అం‌దరికీ చెప్పింది. పెళ్లి ఆ పల్లెటూరులో కాబట్టి, ఎప్పుడూ సౌత్‌ ‌చూడలేదు కాబట్టి, పెళ్లికి స్నేహితురాళ్లందరూ వస్తామన్నారు. మెహందీకి, సంగీత్‌కి ఆ ఊళ్లో కుదురుతుందో లేదో అని సందేహం వెలిబుచ్చారు. ఆ సందేహం అక్కర్లేదని మన డాన్సులు మనం చేద్దాం, వాళ్లు కూడా చూస్తారు అంది సుధీర.

 అవును. ఉత్తరాదిలో పెళ్లికి ముందు రోజున ఏం చేస్తారో అన్నీ వాళ్లకి ఈ మూలంగా తెలుస్తాయి. డాన్సులు చేద్దాం అని ఏ పాటలు బావుంటాయో, పాత పాటలా, కొత్త పాటలా, అందరం ఒకచోట ప్రాక్టీసు చెయ్యడానికి కుదరదు. స్కైపులో స్టెప్పులు అవీ చూసుకుందాం. అని ప్లాను వేసుకున్నారు.

పెళ్లి ఫిబ్రవరిలో అయితే ఇంకా మూడు నెలలుంది. పరవాలేదు చాలా టైముంది. ఈ లోపల తన జీతంతో తనకి కావలసిన బట్టలు కొనచ్చు.

‘‘నాకు బంగారం అదీ ఏం వద్దు. ఇమిటేషన్‌ ‌నగలు చాలు. ఒన్‌ ‌గ్రాం నగలు ఉండనే ఉన్నాయి. మీ దగ్గర ఉన్నదంతా, ఇన్ని రోజులు కూడబెట్టినదంతా నా కోసం ఖర్చు చెయ్యద్దు. అంతగా నాకు కావాలనిపిస్తే పెళ్లయ్యాక అమెరికా వెళ్లాక విక్రాంత్‌ ‌కొంటాడు.’’

‘‘ఇప్పుడు తులం బంగారం ముప్పైఐదు వేలు. అన్ని లక్షలు పోసి కొని నగలు చేయించడం అన్నది ఓ వెర్రితనం’’ అని దాన్ని పక్కకి పడేసారు.

విక్రాంత్‌ ‌తండ్రి సుబ్రమణ్యం కూడా డైరెక్ట్‌గా భాస్కరరావుతో మాట్లాడడం మొదలు పెట్టాక సుధాకర్‌ని సంప్రదించాల్సిన పని లేకపోయింది.

‘‘సుబ్రమణ్యంగారు చాలా మంచి మనిషి. మనం ఏదంటే అదే. ఇది కావాలి, అది కావాలి అని ఏం అడగడం లేదు. పైగా ‘మాకు ఒక్కడే కొడుకు. పెళ్లి మా అబ్బాయిది. మాకు కొన్ని సరదాలుంటాయి. వాటికోసం మీరు మాకు డబ్బు ఇవ్వడం ఏంటీ.. మా ఇంట పెళ్లికి మేం ఖర్చు పెట్టుకుంటాం. మీరు మాకు ఒక్క పైసా కట్నంగా ఇవ్వక్కర్లేదు’’ అన్నారు.

ఆ మాటలు విన్నాక అందరికీ ఆ కుటుంబం అంటే గౌరవం మరింత పెరిగింది.

రోజూ ఫోన్‌ ‌చేసి ఏం చేస్తున్నారు, మా ఇంట్లో విఘ్నేశ్వరుడిని పెట్టారు. వడియాలు పెడుతున్నారు. పెళ్లి పనులు మొదలుపెట్టాం. మేం వెల్లలు వేయిస్తున్నామని ఓ రోజు. మా ఆనవాయితీగా మేం పెట్టాల్సిన నగలు చేయిస్తున్నాం. మా అమ్మాయిలిద్దరూ వాళ్లకి ఏం కావాలో నాకు చెప్పారు, అవి కొనడానికి హైద్రాబాదు వెళ్తున్నామని ఓ రోజు.

అలాంటి సమయంలో ఓ రోజు ‘‘మా అమ్మగారికి మరోసారి గుండె నొప్పి వచ్చింది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేమని డాక్టరు అన్నారు. అందుకని పెళ్లి ఇక్కడ జరగడం కష్టం’’ అని చెప్పారు.

‘‘ఆవిడకి ఏదైనా జరిగితే. ఓ ఏడాది వరకూ చెయ్యకూడదు. అలా అయితే, అదే గనక జరిగితే’’ అంది స్వర్ణ. అక్కడ జరగడం కష్టం అంటే పెళ్లి ఆగిపోతుందా అనిపించింది.

‘‘ఇప్పటినుంచి మనసు పాడుచేసుకోవడం ఎందుకు, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. జరిగేదంతా.. అన్నీ మనమంచికే అనుకుందాం. పరవాలేదు. మనకి కూడా మంచిదే, ఓ ఏడాదిలో మనం కాస్త చెయ్యి కాలు కూడదీసుకోవచ్చు. అయినా ఈ విషయాన్ని సుబ్రమణ్యంగారిని అడుగుతా.’’ అని వెంటనే అడిగారు.

‘‘లేదండి. మేం మీ పొజిషన్‌లో ఉంటే మాకు ఇలాగే అనిపిస్తుంది. జరిపించేద్దాం.’’

‘‘ఎలా, ఆవిడకి బాగా లేదంటున్నారు కదా..!’’

‘‘నిజమే. ఆవిడ ఇవాళో రేపో అన్నట్లుగానే ఉన్నారు. అదే విషయాన్ని ఇంట్లో మాట్లాడు కుంటున్నాం. ఆవిడ పెద్దావిడ. అన్నీ చూసిన మనిషి. తొంభై దాటిన మనిషి. అలాంటి వాళ్ల మరణం కూడా పెళ్లి లాగా చేస్తారు. అందుకని పెళ్లి ఆగిపోకూడదని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగాల్సిందే అని బంధువులంతా పట్టుబట్టారు. అందుకే ఊళ్లో కాకుండా, అన్నవరంలో చేసేద్దాం, ముహూర్తం పెట్టేస్తాం.’’ అని అన్నారు.

ఇది స్వర్ణ, భాస్కరరావులకి ఏమాత్రం నచ్చలేదు. కానీ తప్పలేదు. మానసికంగా తయారయ్యారు. అందుకని పెళ్లి వారం రోజుల్లో చేసెయ్యాలని వాళ్లే నిర్ణయించారు.

‘‘మరీ ఇంత తొందరగానా, ఏ సరదా లేకుండానా’’ అని అనుకున్నా చెయ్యాల్సి వచ్చింది.

సుధీరకి ఇది అస్సలు నచ్చలేదు. పెళ్లి అంటే ఢిల్లీలో చూసిన పెళ్లి లాగా ఊహించుకుంది. ఆ బారాత్‌లూ, మెహందీలు, సంగీత్‌, ‌డాన్సులు అవి ఏవీ లేకుండా పెళ్లి చేసుకోవాలా. ఆఫీసులో అందరికీ ఎలా చెప్పాలి? వాళ్ల ప్లాన్లన్ని ఎలా తలకిందు లయ్యాయో తలుచుకుంటే ఏడుపొచ్చెస్తోంది. దీన్ని వాళ్లు ఎలా తీసుకుంటారో ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో, పెళ్లి పెళ్లిలాగా జరగాలి కానీ ఇదేంటీ ఇంత హడావుడిగా.

మర్నాడు పొద్దున్నే సుధాకర్‌ ‌హైద్రాబాదుకి ఫ్లైటు టిక్కెట్లు తీసుకొచ్చాడు.

‘‘అదేంటీ అప్పుడే టిక్కెట్లు పంపేసారా! అది కూడా ప్లేన్‌లోనా! ఏదో మేం ఇంకా రైలుకి వెళ్తే ఏమేం తీసుకెళ్లాలో, ఎలా తీసుకెళ్లాలో అని ఆలోచిస్తున్నాం. ఇంకా మా అన్నయ్యకి ఫోన్‌ ‌చేసి అన్ని విషయాలు చెబుదామని అనుకుంటున్నాను. ఏంటో అంతా కంగారుగా ఉంది. భయంగా ఉంది’’

‘‘నీకెందుకు, అంతా వాళ్లు చూసుకుంటామని అంటున్నారు కదా, ఏర్‌పోర్టులో దిగగానే, హైద్రాబాదులో వాళ్ల వాళ్లు వచ్చి, మీకంతా సాయం చేస్తారుట. కారు అరేంజ్‌ ‌చేస్తారుట. హోటల్‌ ‌బుక్‌ ‌చేస్తారుట. ఏం కొనాలనుకున్నా అవన్నీ అక్కడ కొనచ్చు’’ అని అన్నారు.

స్వర్ణకి, సుధీరకి మగపెళ్లి వారు బాగా అవమానిస్తున్నారినిపిస్తోంది.

‘‘అదేంటీ అంతా వాళ్ల ఇష్టమేనా! మనల్ని ఏమాత్రం సంప్రదించక్కర్లేదా! మనల్ని ఏమీ అడగక్కర్లేదా? అంతా ఏకపక్షంగా నిర్ణయించేసుకుని అన్నీ చేసేస్తున్నారు. ఎంత మగపెళ్లివారైతే మాత్రం, మరీ ఇంత అహంకారమా! మనం ఏం అంత లేనివాళ్లం కాదు. మన అమ్మాయి పెళ్లికి మనం ఆ మాత్రం ఖర్చు పెట్టుకోగలం’’ అని స్వర్ణ భాస్కర రావుతో అంది.

‘‘నిజమే వాళ్ల వ్యవహారం నాకు కూడా ఏం బాగా లేదు. కాని, నేను మాత్రం ఏం చెయ్యగలను. చూడు ఇప్పుడు టిక్కెట్లు కూడా పంపించేసారు. విమానం అంటే మనం ఎక్కువ బరువు తీసుకెళ్లడానికి ఉండదు. ముగ్గురిది కలిపి ఓ ఏభై కిలోలు మాత్రమే తీసుకెళ్లాలి. మనం ముగ్గురం ఏం బట్టలు తీసుకెళ్ల గలం చేతి బేగులు ఏడేసి కిలోలు మాత్రమే. అక్కడికి వెళ్లాక ఎన్నని కొంటాం, చాలా కష్టం. అక్కడికి, ఎందుకైనా ఉంటుందని నిన్ననే ఓ యాభై వేలు తీసుకొచ్చాను. అయినా ఎందుకిలా చేస్తున్నారు. మన ఇబ్బంది వాళ్లకి తెలీడం లేదు. అన్నీ మేం చూసు కుంటాం అంటే సరిపోతుందా. శుభలేఖలు వేయించాలి. కాని టైమేది?’’

‘‘కార్డులదేం ఉంది, ఒక్కరోజులో వేసిస్తారు, మెసేజ్‌లు పెడతాం, వాట్సప్‌లో శుభలేఖ పంపుతాం. విషయం అది కాదు. ప్రశాంతంగా పెళ్లి పనులు చేసుకోడం వేరు, రాత్రికి రాత్రి హడావుడిగా చేసుకోడం వేరు. ఎంతసేపు వాళ్లవే చూసుకుంటున్నారు. నాకేంటో ఈ పెళ్లి అవుతుందా లేదా అని అనిపిస్తోంది. కాస్త భయంగా కూడా ఉంది. మీ అన్నయ్యకి ఫోన్‌ ‌చేసారా మనం వస్తున్నామని’’ అని అంది స్వర్ణ.

‘‘చేసాను. కానీ తను పెద్ద ఉత్సాహం చూపలేదు, పైగా నీకో అన్నగారున్నరన్న విషయం గుర్తుందన్న మాట. అన్నీ నువ్వే చూసుకుంటున్నప్పుడు ఈ ఆఖరి నిమిషంలో చెప్పడం ఏంటీ అని నిష్టూరంగా మాట్లాడాడు. అప్పుడు జరిగినవన్ని చెప్పాక సరే పెళ్లికి వస్తాం. మీరు మా ఇంట్లోనే దిగండి’’ అని అన్నాడు.

‘‘అతనికి జెలస్‌ ‌వచ్చేసింది. వాళ్లమ్మాయికన్నా మన సుధీరకి మంచి అమెరికా సంబంధం వచ్చిందని.’’

‘‘అయితే అక్కడ దిగొద్దా మనం? అక్కడ కాకపోతే పోనీ ఏదో హోటల్లో ఉందాం. మనకి కావలసినవి అన్నీ అక్కడే కొనుక్కుని వాళ్ల ఊరు వెళ్లచ్చు. ఇంక అంతా వాళ్లదే భారం. బాధ్యత. మనం చూస్తూ కూచుందాం’’

అక్కడే ఉండి తల్లీ తండ్రీ మాట్లాడుకుంటున్నవి అన్ని వింటున్న సుధీరకి కూడా అలాగే అనిపిస్తోంది. ఏదో అవమానం జరిగిపోతున్నట్లుగా ఉంది. ఏం మగపెళ్లి వారైతే మాత్రం కొమ్ములొచ్చాయా. అంత అహంకారమా..

అంతలో ఫోను మోగింది.

‘‘వాట్సప్‌లో శుభలేఖ పెట్టాం, కార్డులు వేసే సమయం కూడా లేదు. చూసుకోండి. మేం అందరికీ ఇలాగే పంపించేస్తున్నాం. మీరు కూడా అలాగే చేయండి.’’

About Author

By editor

Twitter
Instagram