–  గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

గోప్యతకు మారుపేరు చైనా. మూడో కంటికి తెలియకుండా ముంచడం దాని నైజం. అన్ని విషయాల్లోనూ అది గుంభనంగా వ్యవహరిస్తుంది. నర్మగర్భంగా, నాటకీయంగా మాట్లాడుతుంది. పొరపాటున కూడా నిజాలు మాత్రం వెల్లడించదు. అమలు చేస్తున్న ద్రోహాలకు సిద్ధాంతం ముసుగు వేస్తుంది. ఇది ఏ ఒక్కరి అభిప్రాయమో కాదు. చాలా సందర్భాల్లో బీజింగ్‌ ఇలానే వ్యవహరిస్తుందన్నది స్థూలంగా అంతర్జాతీయ సమాజం అభిప్రాయం. దీనిని బీజింగ్‌, ‌దాని అనుంగు దేశాలు తోసిపుచ్చవచ్చు. కానీ అది కాదనలేని చేదునిజం. కరోనాకు సంబంధించి ఈ విషయం మరోసారి విస్పష్టంగా రుజువైంది. ధనిక, పేద దేశాలన్న తేడా లేకుండా యావత్‌ ‌ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనాయే కారణమని లోకం కోడై కూస్తోంది. ఈ విషయం ఎవరో ఆషామాషీగా చెప్పింది కాదు. వివిధ దేశాల శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనల అనంతరం తేల్చిన విషయమిది. సహజంగానే బీజింగ్‌ ‌దీనిని తోసిపుచ్చుతోంది.

కరోనా వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో సృష్టించారు. పైగా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు నమ్మించారు. చైనాలోని వుహాన్‌ ‌నగరంలో వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ ‌నుంచి ఇది విడుదలై ఉంటుందన్న వాదన బలంగా వినపడు తోంది. కరోనా తొలి కేసులు కూడా ఆ ల్యాబ్‌ ‌సమీపంలోనే వెలుగుచూశాయని చెబుతున్నారు. సార్స్ ‌కొవ్‌ -2 ‌వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటన్‌ ‌తేల్చింది. ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ అం‌గూస్‌ ‌డాల్‌ ‌గ్లిష్‌, ‌నార్వేకు చెందిన శాస్త్రవేత్త బిర్గర్‌ ‌సొరెన్‌ ‌సెన్‌ ఈ ‌విషయాన్ని నిర్ధారించారు. ఈ మేరకు బ్రిటన్‌ ‌పత్రిక ‘డైలీ మెయిల్‌’‌లో ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారంతో మరో నివేదిక సైంటిఫిక్‌ ‌జర్నల్‌లో త్వరలో ప్రచురితం కానుంది. గుహల్లో ఉండే గబ్బిలాల సహజ సిద్ధ కరోనా వైరస్‌ ‌సేకరించి అందులోకి కొత్త స్పైక్‌ను చొప్పించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా ఈ వైరస్‌ ‌ప్రమాదకరంగా, తీవ్రంగా వ్యాపించేలా రూపాంతరం చెందింది. దీనిని ల్యాబ్‌ల్లోనే సృష్టించా రనడానికి కొవిడ్‌- 19 ‌నమూనాల్లో ప్రత్యేక సంకేతాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేయడం గమనార్హం.

కరోనా వ్యాక్సిన్‌ ‌రూపొందించేందుకు చేసిన పరిశోధనలో భాగంగా చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ ‌జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు లోతుగా విశ్లేషించారు. వైరస్‌లోని స్పైక్‌ ‌ప్రొటీన్‌పై గల నాలుగు అమైనో ఆమ్లాలను పరిశీలించారు. మానవ శరీరంలోని భాగాలకు బలంగా అతుక్కోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల వైరస్‌ ‌సాంక్రమిక శక్తి బాగా పెరిగింది. ఈ అమైనో ఆమ్లాలు ఒకే వరుసలో ఉన్నాయి. కత్రిమంగా తయారు చేస్తేనే ఇది సాధ్యపడుతుంది. లేనట్లయితే వీలు పడదు. మహమ్మారిని సంక్రమింప చేసే సహజసిద్ధ వైరస్‌ ‌క్రమంగా ఉత్పరివర్తన చెంది, ఎక్కువగా సాంక్రమిక శక్తి పొందుతుంది. అదే సమయంలో మానవుల్లో తీవ్రవ్యాధిని కలిగించే శక్తిని కోల్పోతుంది. కరోనా విషయంలో అలా జరగలేదు. అది గబ్బిలాల నుంచి సహజసిద్ధంగా వ్యాపించిందని చెప్పడానికి చైనా శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతున్నారు. అయితే చైనా ల్యాబ్‌ ‌నుంచి కరోనా వైరస్‌ ‌లీకవ్వడం వల్లే కొవిడ్‌ ‌మహమ్మారి ఉత్పన్నమై ఉంటుందని బ్రిటన్‌ ‌శాస్త్రవేత్తలే కాకుండా అక్కడి నిఘా సంస్థలు సైతం చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారా లున్నాయని పేర్కొంటున్నాయి. ఈ మేరకు స్థానిక మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది.

కరోనా పాపం చైనాదేనని భారతీయ శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. ఈ వైరస్‌ ‌వుహాన్‌• ‌నగరంలోని ప్రయోగశాలలోనే పుట్టిందని పుణె శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డాక్టర్‌ ‌మొనాలీ రాహల్కర్‌, ‌డాక్టర్‌ ‌రాహుల్‌ ‌బాహులికర్‌ ఈ ‌విషయాన్ని వెల్లడించారు. తాము చేసిన పరిశోధనల్లో లభించిన ఆధారాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయని వారు తెలిపారు. గదిలో దొరికిన ఓ వైరస్‌ ‌జన్యుక్రమంలో చైనా శాస్త్రవేత్తలు మార్పులు చేస్తున్న సమయంలో కరోనా ఉద్భవించి ఉంటుందని వారు వివరించారు. కొవిడ్‌ ‌కారక వైరస్‌ ‌సార్స్ – ‌కొవ్‌-2 ‌పుట్టుక మూలాన్ని తెలుసుకునేందుకు గతేడాది ఏప్రిల్లో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా సార్స్ -‌కొవ్‌-2‌కు దగ్గరగా పరిగణించే ఆర్‌ఏటీజీ 13 వైరస్‌, ‌చైనాలో 2012లో జరిగిన కొన్ని పరిణామాలు మా దృష్టికి వచ్చాయి. దానికి సంబంధించిన పత్రాలను పరిశీలించాం. దక్షిణ చైనాలోని మొజియాంగ్‌ ‌నగరంలో వాడుకలో లేని రాగి గని ఉంది. దీనిలోని పేరుకుపోయిన గబ్బిలాల విసర్జితాలను తొలగించే పనిని 2012లో ఆరుగురికి అప్పగించారు. ఆ విసర్జితాలను తాకినా, వాటిపై నడిచినా వాటి రేణువులు కొన్ని వాతావరణంలో కలుస్తాయి. అవే అలర్జీకి కారణమవుతాయి. విసర్జితాలను తొలగించిన ఆ ఆరుగురు కొన్నాళ్లకు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొవిడ్‌ ‌బాధితుల మాదిరిగానే వారిలో జ్వరం, దగ్గు, రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు కనిపించాయి. అంతేకాక అలసట, న్యూమోనియా లక్షణాలను సైతం గుర్తించారు. వారికి సంబంధించిన వివిధ వైద్య పరీక్షల నివేదికలు సైతం ప్రస్తుత కొవిడ్‌ ‌బాధితుల నివేదికల మాదిరిగానే ఉన్నాయి. ఆ ఆరుగురిలో తరవాత ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వెలుగులోకి వచ్చాయి. వారికి అప్పట్లో అందించిన ఔషధాలు, ఇప్పుడు కొవిడ్‌ ‌బాధితులకు అందిస్తున్న ఔషధాల్లో పెద్దగా తేడాలేమీ లేవు. వారికి అప్పట్లో యాంటీ వైరల్‌, ‌యాంటీ బయాటిక్‌ ఔషధాలను ఇచ్చారు. చివరికి పరిస్థితి విషమించడంతో ఆరుగురిలో ముగ్గురు మరణించారు. గనిలో పనిచేసిన ఆరుగురికి ‘ఆర్‌ఏటీజీ 13’ సోకినట్లు పుణె శాస్త్రవేత్తలు వివరించారు.

మొజియాంగ్‌ ‌గని నుంచి ఆర్‌ఏటీజీ 13 ను వుహాన్‌ ‌శాస్త్రవేత్తలు సేకరించారు. ప్రయోగాల్లో భాగంగా వారు వైరస్‌ ‌జన్యుక్రమంలో మార్పులు చేసినట్లు అనుమానాలు లేకపోలేదు. ఆ మార్పుల వల్ల కరోనా అవతరించి ఉండవచ్చు. మనుషులకు నేరుగా, వేగంగా, వెంటనే సోకేలా దాని నిర్మాణం ఉంది. ప్రయోగశాలల్లోనే వైరస్‌ ‌రూపుదిద్దుకుని ఉండొచ్చని ఆ లక్షణాలు సూచిస్తున్నాయి. సముద్ర ఆహారోత్పత్తులను అమ్మే మార్కెట్‌ ‌నుంచి సార్స్-‌కొవ్‌-2 ‌పాకిందని చైనాలో ప్రచారం జరుగుతోంది. కానీ దానిని నిర్ధారించే ఆధారాలు ఏమీ లేవు. చైనా సృష్టించిన వైరస్‌ ఆ ‌దేశంపైనా ఎంతోకొంత ప్రభావం చూపించక పోలేదు. డ్రాగన్‌ ‌దేశంలోని వ్యవహారాలు సాధారణంగా వెలుగులోకి రావు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే విషయాలు పూర్తిగా నిజాలు కూడా కావు. అందువల్ల ప్రభుత్వం వెల్లడించే సమాచారం కన్నా నష్టం అధికంగా ఉంటుంది. కరోనా వెలుగుచూసిన తొలిరోజుల్లో వారంరోజుల వ్యవధిలో అత్యాధునిక సదుపాయాలతో వైద్యశాలను నిర్మించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా దేశంలో ఎంతమంది కన్నుమూశారన్న సమాచారం నేటికీ నిర్దిష్టంగా ఎవరికీ,  ఏ వార్తా సంస్థకూ తెలియదు. తాజాగా చైనాలో తొలిసారి ఓ వ్యక్తికి ‘హెచ్‌ 10 ఎన్‌ 3 ‌బర్డ్ ‌ఫ్లూ’ సోకింది. జియాంగ్‌నూ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే అతనికి ఆ వ్యాధి ఎలా సోకిందనే విషయాన్ని వెల్లడించలేదు. గతంలో ఎన్నడూ ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి వ్యాధి సోకలేదు. ఇది పక్షుల నుంచి మనుషులకు అరుదుగా సోకే వ్యాధి. దీని వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ మహమ్మారిగా పరిణమించే ముప్పు తక్కువే. ఇది మనుషులకు అంత ప్రమాదకారి కాదు. అయితే అడవి పక్షులకు, పెంపుడు పక్షులకు మాత్రం ప్రమాదకారి అని చెబుతున్నారు.

కరోనా కారకురాలైన చైనా ఇప్పటికీ ఆ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడలేదు. గ్వాంగ్‌ ‌ఝూ నగరంలో తాజాగా 11 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా మరో రెండు ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్‌ ‌విధించారు. నగరంతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇతర పట్టణాలకు, నగరాలకు వెళ్లాలంటే 72 గంటల్లోపు వారికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ కావడాన్ని తప్పనిసరి చేశారు. దేశంలో కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో గ్వాంగ్‌ ‌ఝూలో గత కొద్ది రోజులుగా కొత్త కేసులు వెలుగులోకి రావడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

బ్రిటన్‌, ‌నార్వే, భారతీయ శాస్త్రవేత్తల పరిశోధనల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌తన గళాన్ని పెంచారు. కరోనాకు కారణం చైనా అని గతంలో తాను ఆరోపణలు చేస్తే ఎవరూ విశ్వసించలేదని, ఇప్పుడేమంటారని ట్రంప్‌ ‌సూటిగా అడుగుతున్నారు. వుహాన్‌ ‌ల్యాబ్‌లోనే ఈ వైరస్‌ను సృష్టించారంటూ గతంలో తాను చేసిన ఆరోపణలను తాజా పరిశోధనలు నిర్ధారిస్తున్నాయ న్నారు. ఇంతటి ప్రపంచ విపత్తుకు కారణమైన చైనాను యావత్‌ అం‌తర్జాతీయ సమాజం తీవ్రంగా శిక్షిం చాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్‌ ‌చేశారు. ఆ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలతోపాటు స్వయంగా అమెరికా గూఢచారి సంస్థలు కొట్టిపారేసిన విషయం గమనార్హం.

గత ఏడాది నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోవడంతో తాత్కాలికంగా ఈ విషయం మరుగున పడిపోయింది. వైరస్‌ ‌చైనా సృష్టి అని, దానిని జీవాయుధంగా మార్చేందుకు బీజింగ్‌ ‌చేసిన పరిశోధనల ఫలితమే మహమ్మారి విలయమని శాస్త్రవేత్తలు తేల్చిన నేపథ్యంలో చైనా విశ్వసనీయతకు తీవ్రంగా భంగం వాటిల్లింది. దాని నిజాయతీ ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారింది. దాని అనుంగు మిత్రదేశాలు సైతం ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఆసియా అగ్రరాజ్యంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న దేశం ఇలాంటి తప్పుడు పద్ధతులకు పాల్పడటం క్షమించరాని నేరం. అమెరికా నుంచి అగ్రరాజ్య హోదాను పొందేందుకు అదేపనిగా పనిచేస్తున్న బీజింగ్‌ ‌శ్రమ అంతా ఈ ఘటనతో బూడిదలో పోసిన పన్నీరైంది.

రాజకీయ విభేదాలు, సరిహద్దు తగాదాలను విస్మరించి మానవాళికి మేలు చేయాల్సింది పోయి కీడు తలపెట్టడం ఒక్క చైనాకే చెల్లింది. ఏ దేశమూ ఇంతటి దారుణానికి పాల్పడదు. ఇంతటి అవ మానానికి గురవలేదు. వివిధ అంతర్జాతీయ వేదికలపై చైనా కూహకాలను ఎండగట్టాల్సి ఉంది. ఇందుకు కేవలం చైనా వ్యతిరేక దేశాలే కాదు, దాని మిత్ర దేశాలు కూడా కూడి రావాల్సిన అవసరం ఉంది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన దేశం రేపు మరో అవాంఛనీయ పనికి తెరతీయదనుకోలేం. కరోనా వల్ల అనేక దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటి ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఇక చిన్న, పేద, మధ్య ఆదాయ దేశాల గురించి చెప్పక్కర్లేదు. అవి ఈ మహమ్మారి నుంచి ఎప్పటికి కోలుకుంటాయో, ఆర్థికంగా మళ్లీ ఎప్పుడు గాడిన పడతాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. చేసిన తప్పునకు కనీసం పశ్చాత్తాపం, విచారం ప్రకటించడం బీజింగ్‌ ‌తక్షణ కర్తవ్యం. తన తప్పుడు చర్య వల్ల వుహాన్‌ ‌నగర ప్రతిష్టను దెబ్బతీసింది. గతంలో ఈ నగరంలోనే బ్రిక్స్ (‌బ్రెజిల్‌, ‌రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా) కూటమి శిఖరాగ్ర సభ జరిగింది. అప్పుడు ఈ సభ ద్వారా, ఇప్పుడు కరోనా ద్వారా వుహాన్‌ ‌ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram