తెలంగాణ ప్రభుత్వం మరొక సంవత్సరం పాటు మావోయిస్టు పార్టీని నిషేధించింది. కిందటేడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఆ పార్టీ మీద నిషేధం విధించాయి. తాజా నిషేధం ప్రకటించిన కొన్ని గంటలలోనే ఏప్రిల్‌ 21‌న తాము ఛత్తీస్‌గఢ్‌, ‌బీజాపూర్‌ ‌జిల్లాలో అపహరించిన జిల్లా రిజర్వు గార్డ్ ఎస్‌ఐ ‌తాటి మురళిని మావోయిస్టులు చంపారు. అతడి విడుదలకు ఒకపక్క చర్చలు జరుగుతూ ఉండగానే మల్లూరులోని జీఎల్‌ఎస్‌ ఆసుపత్రి దగ్గర శవాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈ ఎస్‌ఐ ‌గిరిజనులను బాధిస్తున్నాడట. వాళ్ల కార్యకర్తలను హింసిస్తున్నాడట. అలాగే కేంద్రం, రాష్ట్రం బస్తర్‌ ‌ప్రాంతంలోని ఖనిజ సంపదను కార్పొరేట్‌ ‘‌శక్తులకు’ అప్పగించాలని చూస్తుంటే, పోలీసులు సమర్థిస్తున్నారట. అలా సమర్థించేవాళ్లకి మురళికి పట్టిన గతే పడుతుందట. పోలీస్‌ ఉద్యోగులను చంపడం మావోయిస్టులకు కొత్త కాదు. కానీ మురళిని చంపడానికి చెప్పిన కారణాలలో చివరిది మరీ హాస్యాస్పదంగా ఉంది. గిరిజనుల మీద  పోలీసుల అరాచకాలకు మావోయిస్టుల అరాచకాలు ఏమీ తీసిపోవన్న విమర్శ మాటేమిటి? పోలీసు ఇన్ఫార్మర్ల పేరుతో ఎంతమంది గిరిజనులను మావోయిస్టులు పొట్టన పెట్టుకోలేదు? తుపాకీ నీడన జరిగే ప్రజాకోర్టులు, వాటిలో వెలువడే తీర్పులు, ఒక నిస్సహాయ స్థితిలో ఆ తీర్పులకు వచ్చే ఆమోదాన్ని ఊహించుకుంటే ఆ ఎస్‌ఐ ‌హత్య పెద్ద వింతేమీ కాదు.

ఈ నిషేధాలతో ఫలితం ఉంటుందా అని ప్రశ్నించుకోవలసిన అవసరం కనిపిస్తున్నది. అజ్ఞాతం నుంచి కార్యకలాపాలు జరిపే మావోయిస్టులు, ముస్లిం ఉగ్రవాదులకు ఈ మొక్కుబడి నిషేధాలు లెక్కలోకి వస్తాయా? 1968 నుంచి రకరకాల పేర్లతో ఈ దేశంలో వామపక్ష ఉగ్రవాదం పడుతూ లేస్తూ సాగుతూనే ఉంది. 2009లో యూపీఏ ప్రభుత్వం, 2015లో ఎన్‌డీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మావోయిస్టుల మీద నిషేధం విధించారు. మావోయిస్టు ప్రభావం ఇటీవలి కాలంలో తగ్గినట్టు కనిపించింది కూడా. కానీ 2020 మార్చిలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ‌తరువాత బస్తర్‌ ‌తదితర ప్రాంతాలలో మావోయిస్టులు పుంజుకున్న జాడలు కనిపించాయి. అప్పుడూ నిషేధం ఉంది. నిజానికి కేంద్రంలో చిరకాలం ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, బెంగాల్‌, ‌కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా చెప్పాలంటే కొన్ని రాజకీయ పార్టీలు కూడా మావోయిస్టులు లేదా నక్సలైట్ల పట్ల వ్యవహరించిన తీరు ప్రమాదకరమైనది. 2009లో కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మావోయిస్టు పార్టీ మీద నిషేధం విధించినప్పుడు సీపీఎం వ్యతిరేకించింది. కానీ ఈ వ్యతిరేకతకు తాత్త్వికత ముసుగు వేస్తూ ఉంటారు. నక్సల్‌ ఉద్యమాన్ని సీపీఎం శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూడదనీ, రాజకీయంగానే ఎదుర్కొనాలని చెబుతూ ఉంటుంది. వాదన మంచిదే గానీ అందులో చిత్తశుద్ధి లేదు. వాస్తవికతా లేదు.

దేశంలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నమాట నిజం. అందునా కొండా కోనా మరీ వెనుకబడి ఉన్నాయి. పేదరికం, అవిద్య, వైద్య సౌకర్యాల లేమి వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. కానీ 1968 నాటికీ, నేటికీ పరిస్థితులు అసలు మారలేదని చెప్పడం హ్రస్వదృష్టి. అసలు ప్రపంచమంతా కమ్యూనిజం పేరు తలవడానికీ, ఆ సిద్ధాంతాన్ని భరించడానికీ ఏమాత్రం సిద్ధంగా లేని కాలంలో అదే సిద్ధాంతం చెప్పినట్టు రక్తపాతం సృష్టిస్తూనే ఉంటాం, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అంటూ పాత పాట పాడడం అవాస్తవిక దృక్పథమే. నిజానికి ఇటీవలి కాలంలో మావోయిస్టులు, వీరిని సమర్ధిస్తూ బయట ప్రపంచంలో హంగు చేసే అర్బన్‌ ‌నక్సల్స్ ‌వైఖరి మానవీయతకే ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయి. 370 అధికరణాన్ని బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ రద్దు చేసింది. ఆ సమయంలో దండకారణ్య కమిటీ పేరుతో వెలువడిన ప్రకటన ముమ్మాటికీ దుందుడుకుతనమే. 370 అధికరణం రద్దును చాలా పార్టీలు వ్యతిరేకించాయి. సవరణలు సూచించాయి. నేరుగా ఇందుకు పార్లమెంటునే వేదికను చేసుకున్నాయి. నిరసన గళం రాజ్యాంగం ఇచ్చిన హక్కే కూడా. ఈ పని మావోయిస్టులూ చేశారు. కానీ 370 రద్దుకు నిరసన పేరుతో కశ్మీర్‌ ‌వేర్పాటువాదులకు ఎందుకు మద్దతు పలికినట్టు? కశ్మీర్‌ ‌వేర్పాటువాదులు చేస్తున్నదేమిటో మావోయిస్టులకు తెలియదా? వేర్పాటువాదుల హింసకు మూలం మతోన్మాదం కాదా? దీనికి పాకిస్తాన్‌ అం‌డ లేదా? 370 అధికరణం కశ్మీర్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న నిమ్న కులాలకు ఎంత అన్యాయం చేసిందో ఎరుక లేదా? కశ్మీరీ పండిత్‌ల మీద ఏ ప్రాతిపదిక మీద అకృత్యాలు జరిగాయి?

ఇక అర్బన్‌ ‌నక్సల్స్ ‌గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీళ్ల సంతానం అమెరికాలో ఉంటుంది. కొవిడ్‌ ‌వస్తే పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులలోనే వీరు వైద్యం చేయించుకుంటారు. విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేయడం నిత్యకృత్యం. వీళ్లు మావోయిస్టులు ఆడమన్నట్టే ఆడతారు. ఇందుకు తాజా ఉదాహరణ, మళ్లీ 370 రద్దు ఉదంతమే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మేధావులు (మావోయిస్టు బ్రాండ్‌), ‌కార్యకర్తలు ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆ బాణీకి తగ్గట్టే ఇక్కడ ఆడారు.

మావోయిస్టు పార్టీలో చేరే వారి చైతన్యాన్ని శంకించనక్కరలేదు. సమాజం బాగు పడాలన్న వారి ఆశయాన్ని వెక్కిరించనక్కరలేదు. కానీ తొక్కుతున్న పంథా ఏమిటో చూడాలనే ఎవరైనా చెబుతారు. ఈ యాభయ్‌ ఏళ్లలో సాధించినది ఏపాటో గమనించమంటారు. అటువైపు మొగ్గుతున్న యువతను జన జీవనస్రవంతిలోకి తీసుకురావాలి. వారూ మన సోదరులే. సాటి భారతీయులే. కానీ మేధావుల ముసుగులోని విద్రోహుల బారిన పడుతున్నారు. దీనిని నివారించే వరకు ఎన్ని నిషేధాలు విధించినా సత్ఫలితాలు రావు.

By editor

Twitter
Instagram