మత విశ్వాసాలు గాఢంగా ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుణ్యకార్యక్రమాలను కూడా క్రమం తప్పకుండా నిర్వహించుకునే సంప్రదాయం భారతదేశంలో, ముఖ్యంగా హిందువులలో సర్వసాధారణం. అలాంటిది పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళాల గురించి చెప్పేదేముంది? కానీ ధార్మిక కార్యక్రమాలకూ, సామాజిక పరిస్థితులకూ అడపా దడపా సంఘర్షణ రావడం చరిత్రలో కనిపిస్తుంది. ఆ సంఘర్షణను సామరస్యంగా నివారించవలసిందే. అందుకు కావలసిందేమిటి? మతపెద్దలు చూపించే ఔదార్యం, దేశాధినేతలు చూపించే విజ్ఞత. ఇరువురూ కలసి వాస్తవికంగా యోచించడం. హరిద్వార్‌లో, గంగా కుంభమేళ- 2021 ఆకస్మిక ముగింపులో ఇదే కనిపిస్తుంది.

 ఏప్రిల్‌ 30 ‌వరకు జరగవలసిన హరిద్వార్‌ ‌కుంభమేళ మహోత్సవం ముగిసినట్టు ఆ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా ఉన్న జునా అఖాడా అధిపతి స్వామి అవధేశానందగిరి ఏప్రిల్‌ 17‌న ప్రకటించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి, దేశకాల పరిస్థితులను వివరించారు. కుంభమేళా కార్యక్రమంలో ముఖ్యమైన షాహి స్నాన్‌ (‌పుణ్య తిథులలో చేసే పవిత్ర స్నానాలు) ముగిసింది కాబట్టి, మిగిలిన కుంభమేళాను లాంఛనంగా నిర్వహించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇందువల్ల కొవిడ్‌ ‌మహమ్మారితో దేశం చేస్తున్న పోరాటానికి మరింత శక్తి వస్తుందని అఖాడాల పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఏప్రిల్‌ 17‌వ తేదీన దేశంలో 2.3 లక్షల కొవిడ్‌ ‌కేసులు నమోదైన నేపథ్యంలోనే ప్రధాని ఇలాంటి విన్నపం చేయవలసి వచ్చిందన్న వాస్తవం విస్మరించలేం. ప్రధాని మాట్లాడిన కొద్ది గంటలకే అందుకు స్వామి అంగీకరించారు. ఇక ప్రజలు కుంభమేళ కోసం హరిద్వార్‌ ‌వచ్చే ప్రయత్నం చేయవద్దని కూడా స్వామి పిలుపునిచ్చారు. దేశ పరిస్థితి, ప్రజల ఆరోగ్యం సాధుసంతులకు ఎప్పుడూ ముఖ్యాంశమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 13 అఖాడాలతో కూడిన పరిషత్‌లో జునా అఖాడాకు మూడో స్థానం ఉంది. నిరంజన్‌, ఆనంద అఖాడాలు కూడా ఈ ఏటి కుంభమేళాకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించాయి. శైవ సంప్రదాయానికి చెందిన ఆవాహన, అగ్ని అఖాడాలు కూడా ప్రధాని పిలుపును గౌరవిస్తూ కుంభమేళా నుంచి తప్పుకున్నాయి. జునా అఖాడావారు శనివారమే దేవీ ప్రతిమలకు స్నానాలు చేయించారు. దీనితో కుంభమేళాకు స్వస్తివాచకం పలికినట్టే.

కుంభమేళ హిందువులకు ఎంతో పవిత్ర కార్యక్రమమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వాములు, సాధువులు ప్రధాని పిలుపును అర్ధం చేసుకుని, దేశహితం కోణం నుంచి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రస్తుత పరిస్థితులతో ఎంతో కీలకం. దేశ ప్రజలు కూడా ఇందుకు పూర్తిగా సహకరించాలి. హరిద్వార్‌ ‌కుంభమేళలో పాల్గొనాలనీ, పవిత్ర స్నానం ఆచరించాలని కోట్లాదిమంది హిందువులు ఆశిస్తారు. ఏ ప్రాంతంలో, ఏ నదీ పుష్కరాలకైనా ఇలాంటి ఆశయం, దాదాపు జీవితాశయం వంటిది-ఉంటుంది. ఈ కుంభమేళా నిజానికి ఈ జనవరి నుంచి ఏప్రిల్‌ ‌నెలాఖరు వరకు జరగాలి. కానీ కొవిడ్‌ ‌వల్ల ఏప్రిల్‌ 1 ‌నుంచి 30 వరకు జరపాలని నిర్ణయించారు. ఇప్పుడు మళ్లీ పదిరోజులు తగ్గించారు. ఏప్రిల్‌ 12‌న సోమావతి అమావాస్య పర్వదినాన, ఏప్రిల్‌ 14 ‌నాటి మేష సంక్రాంతి పర్వదినాన- కొన్ని లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

ఎంతో పవిత్రంగా, నిర్మలంగా జరుపుకునే కుంభమేళ మహా కార్యక్రమం ఈసారి సాధులోకానికి చేదునే మిగిల్చింది. మహా నిర్వాణ్‌ అఖాడా (మధ్యప్రదేశ్‌) ‌మహామండలేశ్వరులు స్వామి కపిల్‌దేవ్‌ ఏ‌ప్రిల్‌ 13‌న కొవిడ్‌తోనే పరమపదించడం బాధాకరం. ఆఖరికి అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షులు మహంత నరేంద్ర గిరి కూడా కొవిడ్‌తో హృషీకేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరవలసి వచ్చింది. ఒక్క నాలుగు రోజులలోనే (ఏప్రిల్‌ 10-14) 1,701 ‌మంది కుంభమేళ భక్తులు ఆ మహమ్మారి బారిన పడవలసి వచ్చింది. వీరిలో భక్తులతో పాటు ఎందరో సాధువులు కూడా ఉన్నారు.

ఏ విధంగా చూసినా ఈ కుంభమేళా అర్ధాంతరంగా ముగిసినా చరిత్రలో నిలిచిపోతుంది. హిందూధర్మం ఆచార సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తుందో మనిషి ప్రాణాలకు కూడా అంతే విలువ ఇస్తుందని నిరూపించిన అపూర్వ ఘటన ఇది. బాహ్య శరీరమే కాదు, శరీరాంతర్భాగంలోను శౌచం ఉంటే వారికి పూజాకార్యక్రమాల నుంచి మినహాయింపు ఉంటుంది. శరీరం చక్కగా ఉంటేనే, మనిషి సకార్యాలను నిర్వర్తించగలడని ప్రగాఢంగా నమ్ముతుంది మన జీవన విధానం. కాబట్టి ధార్మిక కార్యక్రమాలకూ, సామాజిక పరిస్థితులకూ ఘర్షణ తలెత్తినప్పుడు ధర్మమే పెద్దరికం చూపాలి. ఈ కుంభమేళాలో జరిగింది ఇదే. దాదాపు మూడున్నర నెలలు జరగవలసిన అతి పెద్ద హిందూ సమ్మేళనాన్ని పద్దెనిమిది రోజులకు కుదించడానికి సాధుసంతులు వెనకాడలేదు. ధర్మం మంట కలిసిపోయిందంటూ, ధర్మగ్లాని జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టలేదు. అలాగే ప్రధాని కూడా ఎవరి మనోభావాలకు దెబ్బ తగలకుండా వ్యవహరించిన తీరు శ్లాఘనీయం. కీలక పవిత్ర స్నానాల ఘట్టం ముగిసింది కాబట్టి ఇక లాంఛనంగా కుంభమేళా సాగించే విషయం ఆలోచించమని ఆయన కోరడంలోను ఔచిత్యం ఉంది. మానవాళికి ముప్పు వచ్చినప్పుడు మత విశ్వాసాలకు ప్రత్యామ్నాయం చూపించే మానవత్వం హిందూ జీవన విధానంలోనే ఉంది. ఇతర మతాల వారి ప్రార్థనా స్థలాలలో జనం కిక్కిరిసినా పట్టించుకోని మీడియా హరిద్వార్‌ను భూతద్దంలో చూపింది. హిందువులకు వేరే ఎవరో సుద్దులు చెప్పవలసిన అవసరం లేదన్న తీరులో అంతా వ్యవహరించడం నిజంగా వందనీయం. హిందువులు, హిందూ సంస్థలు చూపించిన హుందాతనం అద్భుతం.

About Author

By editor

Twitter
Instagram