వందేళ్ల ఖిలాఫత్‌ ఉద్యమం-6

అక్టోబరు 27,1919న మనదేశంలో ఖిలాఫత్‌ ఉద్యమం ప్రారంభం అయింది. ఆ తర్వాత సంవత్స రానికే లోకమాన్య  బాలగంగాధర్‌ ‌తిలక్‌ అసువులు బాశారు. దానితో జాతీయ కాంగ్రెసు రాజకీయాలకు గాంధీ కేంద్రబిందువయ్యారు. ఖిలాఫత్‌ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. డా।।అంబేడ్కర్‌ ‌మాటల్లో  ‘ఖిలాఫత్‌ ఉద్యమాన్ని గాంధీ నెత్తిన పెట్టుకున్నారు. ఆయన పట్టుదల, నమ్మకం అనేకమంది ముస్లింలను సైతం ఆశ్చర్యపరిచింది’ (Pakistan or The Partition of India, p. 136). గాంధీ ఆ ఉద్యమానికి వ్యక్తిగతంగా మద్దతు ప్రకటించటమే కాక కాంగ్రెసు పార్టీని కూడా దించారు. ఖిలాఫత్‌ ఉద్యమం సందర్భంగా బయట పడిన హిందూ- ముస్లిం నాయకుల ప్రవర్తన, ఆలోచనాసరళి ఆకస్మికం కావు. 1857 స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఇరువర్గాల వారి అనుభవాలు వాటిని ప్రభావితం చేశాయి.

‘విభజించు – పాలించు’ విధానం

మన పాఠ్యగ్రంథాల నుండి సినిమాల వరకు ఆంగ్లేయులు ‘విభజించు – పాలించు’ అనే విధానాన్ని అనుసరించారని, అన్నదమ్ములను విడగొట్టి లబ్ధి పొందారనే అభిప్రాయాన్ని ప్రచారం చేశాయి. ఆ అభిప్రాయం మనందరి మనసులలో ఎంత గాఢంగా నాటుకొన్నదంటే, ఇందులో నిజానిజాలను తెలుసుకొనే ప్రయత్నాన్ని మనమెన్నడూ చేయలేదు కూడా. మన అంతర్గత విభేదాలను శత్రువు తెలివిగా వాడుకో వటంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. వ్యూహం (Strategy) లేకుండా కేవలం విధాన (Policy) రూపకల్పన చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రిటిష్‌ ‌వారు అనుసరించిన రెంటినీ కూడా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి.

హిందూ-ముస్లింల మధ్య విరోధం ఆంగ్లేయులు సృష్టించింది కాదు. రెండు వర్గాల మధ్య వైరం ఎప్పటి నుండో కొనసాగుతున్నది. ఒకరిపట్ల మరొకరికి విశ్వాసం లేదు. కనకనే స్వాతంత్య్రోద్యమం సందర్భంగా హిందూ-క్రైస్తవ, హిందూ-పార్శీ, హిందూ-యూదుల ఐక్యత గురించి ఉద్యమ నాయకులు ఎప్పుడూ ఆందోళన చెందలేదు. హిందువులు- ముస్లింల మధ్య సమైక్యత సాధించటం ఎట్లాగ అనే వారు తలలు బాదుకొన్నారు. ఒకవేళ ఈ ఇరువర్గాల మధ్య ఆంగ్లేయులే తేడాలు, భేదాభి ప్రాయాలు సృష్టించి ఉంటే, వారు వెళ్లిన తర్వాతైనా ఈ రెండు వర్గాల మధ్య సౌహర్ద్ర వాతావరణం ఏర్పడి ఉండాలి. అలా జరగలేదు. థాయ్‌లాండ్‌ ‌వంటి దేశాలు ఆంగ్లవలస పాలన కింద ఎన్నడూ లేవు. అక్కడ కూడా ముస్లింలకూ, ముస్లిమేతరుల మధ్య, ముస్లింలకు  హిందువులకు మధ్య విరోధం ఉంది. దానిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ సందర్భంగా ఇద్దరు ప్రముఖుల అభిప్రాయాన్ని చూద్దాం. వారిద్దరూ ముస్లింల మనోగతాన్ని అందరికంటే లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తులు. వారిద్దరూ కాంగ్రెసు పక్షంలో ఎన్నడూలేరు కూడా. అందులో మొదటివారు వీర సావర్కర్‌ (1883-1966). ‌రెండవవారు డా।।అంబేడ్కర్‌ (1891-1956).

1939 ‌నాటి అభిల భారత హిందూ మహాసభ లో అధ్యక్షోపన్యాసం చేస్తూ సావర్కర్‌ ‘‌మూడవ వ్యక్తి ప్రమేయం సిద్ధాంతాన్ని’ (Third Party Culpability Theory) పటాపంచలు చేశారు. ‘మూడవ వ్యక్తి (ఆంగ్లేయుల) ప్రమేయం సిద్ధాంతం కాంగ్రెసు వారు నమ్మబలుకుతున్న ప్రచారం తప్ప మరేదీ కాదు. వారు ఎప్పుడూ ఇటువంటి కాకమ్మ కథలే చెబుతుంటారు. ముస్లింలు వారంతట వారు జాతి వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేప్టరని, బ్రిటిష్‌ ‌వారి ప్రమేయంతోనే అట్టి పనులకు వారు ఒడిగడుతుంటారని చాలాకాలం నుండి కాంగ్రెసు పార్టీలోని వేలాది హిందువులకు నూరిపోశారు. ఇంతకంటే హాస్యాస్పదమైన మూఢ నమ్మకం మరొకటి లేదు. మహమ్మద్‌ ‌ఖాసిం, గజనీలు, ఘోరీలు, అల్లావుద్దీన్‌లు, ఔరంగజేబులను ఆంగ్లేయులే రెచ్చగొట్టి, దేశంపై దాడి చేయించి, హిందూదేశాన్ని మత అగ్నిగుండలోకి నెట్టివేశారని అన్నట్టే కాంగ్రెసు నాయకత్వం చెబుతున్నది. గత పది శతాబ్దాల నుండి హిందువులకు, ముస్లింలకు మధ్య జరుగుతున్న ఎడతెరిపిలేని యుద్ధాల చరిత్రను ఒక అభూతకల్పనగా, ఎవరో చొప్పించిన అంశంగా వారు నమ్మించాలని చూస్తున్నారు. అంతేకాదు అలీ సోదరులు, జిన్నా, సర్‌ ‌సికిందర్‌లు మిఠాయికి ఆశపడే చిన్నపిల్లలు అయినట్లు, వారికి ఆశపెట్టి వారిచేత తమ పొరుగువారైన హిందువుల ఇళ్లమీద రాళ్లు వేయిస్తున్నారని చెబుతున్నట్టే ఉన్నది వీరు చెప్పేది. ఆంగ్లేయులు రాకముందు హిందువులు-ముస్లింల మధ్య ఘర్షణలు ఎన్నడూ జరగలేదని వారు అంటున్నారు. నిజమే ఆనాడు ‘ఘర్షణలు’ లేవు. జరిగినవి ‘యుద్ధాలు’. అవి రోజువారీ సంవత్సరాల తరబడి జరిగిన యుద్ధాలు’ (Hindu Rasthra Darshan, V.D. Savarkar, pp.57-58)).

హిందూ-ముస్లిం వర్గాల మధ్య నెలకొన్న శత్రుత్వం గురించి డా।।అంబేడ్కర్‌ ఇచ్చిన విశ్లేషణ ఎంతో లోతుగానూ, ఆలోచనలు రేపేదిగానూ ఉంది ‘హిందువులు, ముస్లింల మధ్య సమైక్యతను సాధించలేకపోవటంలో విఫలం కావడానికి ప్రధాన కారణం ఆంగ్లేయులేనని హిందువులు అభిప్రాయ పడుతున్నారు. హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ వివరణ సత్యదూరమైంది. క్లిష్టమైన అంశాలను పట్టించుకోవటం ఇష్టంలేని వారు ఏర్పరచుకొనేది. ఈ వివరణకు, అభిప్రాయానికి కాలం చెల్లింది. దానిని చెత్తబుట్టలో వేయటం అవసరం. ‘విభజించు -పాలించు’ అనే విధానం దానికి అదే విజయాన్ని ఇవ్వలేదు. విభజించటానికి అనువైన పరిస్థితులు సమాజంలో ఇంచుమించుగా శాశ్వతంగా నెలకొని ఉన్నప్పుడే, అవి కూడా సామాన్యమైనవి, పైపైన కనిపించేవికాక, ఏమాత్రం రాజీకి అవకాశం లేనివి అయినప్పుడే విభజించటానికి వీలవుతుంది. శత్రుత్వానికి కారణాలు భౌతికమైనవి కానప్పుడు, విభజనకు దారి తీసిన పరిస్థితులు విభజనను శాశ్వతం చేస్తాయి. వారి మధ్య శత్రుత్వానికి దారి తీసిన కారణాలు భౌతికమైనవి కావు. అవి ఆధ్యాత్మిక మైనవి. అందుకు మూలాలు వారి చారిత్రక, సాంస్కృతిక, సామాజిక పరిస్థితులలో, దృక్పథాలలో ఉన్నాయి. రాజకీయ వ్యతిరేకత అనేది  ఒకానొక స్పందన మాత్రమే. హిందూ-ముస్లింల మధ్య ఉన్న ఈ అనైక్యత స్థానంలో ఐక్యత ఏర్పడుతుందని భావించటం అసహజం’’ (Pakistan or The Partition of India, p. 322-323).

ఆంగ్లేయుల వ్యూహం

డిసెంబర్‌ 28, 1885‌న కాంగ్రెసు పార్టీని ఆనాటి వైస్రాయి లార్డ్ ‌డఫ్రిన్‌ ‌మద్దతుతో ప్రారంభించారు. 1891 తర్వాత అధికారికంగా ఆంగ్లేయులు  కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించారు. 1905 వరకు కాంగ్రెసు వలస పాలకులకు విధేయంగానే పనిచేసింది. కాంగ్రెసుకు సమాంతరంగా దేశంలో విప్లవోద్యమం పెద్ద ఎత్తున చెలరేగింది. అయితే ఆ ఉద్యమంలో అత్యధికులు హిందువులు. విప్ల వోద్యమంలో పాల్గొన్న ముస్లింలను వేళ్లపై లెక్కించ వచ్చు. అంతేకాదు 1900 తర్వాత కాంగ్రెసులోని ముస్లింల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది (The Khilafat Movement in India, 1919-24, A.C. Niemeijer, 1972, p.24-27).

మొట్ట మొదటి కాంగ్రెసు సభకు ముస్లింలు దూరంగా ఉన్నారు. ఇది కాంగ్రెసు పెద్దలకు నచ్చలేదు. కొందరు ముస్లింలు 1886లో జరిగిన రెండవ కాంగ్రెసు సభకు హాజరవ్వటం ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. 1888లో మద్రాసులో జరిగిన కాంగ్రెసు సభకు బద్రుద్దీన్‌ ‌త్యాబ్జీ అధ్యక్షత వహించటాన్ని కాంగ్రెసు పెద్దలు హర్షించారు. ముస్లిం యువకుడు, న్యాయవాది అయిన త్యాబ్జీని వారు మనస్ఫూర్తిగా స్వాగతించారు. అయితే ఆయన తన అసలు రంగును సర్‌ ‌సయ్యద్‌ అహమ్మద్‌ఖాన్‌కు ఫిబ్రవరి 18, 1888న వ్రాసిన లేఖలో బయట పెట్టాడు, ‘భారతదేశాన్ని ‘ఒకేజాతి’గా భావించే కాంగ్రెస్‌ ‌పట్ల మీకున్న అభ్యంతరాన్ని నేను అర్థం చేసుకోగలను. నాకు తెలిసి భారతదేశాన్ని ఒకే జాతిగా భావించేవాళ్లు నాకు ఇంతవరకు ఎదురు కాలేదు. నా ప్రారంభోపన్యాసాన్ని మీరు చదివితే చాలా స్పష్టంగా భారతదేశంలో అనేక సమాజాలు లేక జాతులు ఉన్నట్లు పేర్కొనటాన్ని గమనించగలరు. ఉదాహరణకు లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌ అం‌శాన్నే తీసుకొందాం. కౌన్సిల్‌ ‌సభ్యుల ఎన్నిక పక్రియ ముస్లింలకు నచ్చకపోతే, ముస్లిం ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నిక పక్రియను మార్చే ప్రయత్నం చేయవచ్చు. బయట ఉండటం కంటే లోపల ఉండి పనిచేయటమే నా విధానం (To Act From Within Than From Without).

హ్యూమ్‌ – ‌త్యాబ్జీల వారసత్వం

ముస్లింలు కాంగ్రెస్‌ ‌సభలకు హాజరు కాకపోవడం కాంగ్రెస్‌ ‌నాయకులకు అసంతృప్తి కలిగించింది. ఏదో రకంగా ముస్లింలను ఆకర్షించాలని వారు తొలినాళ్ల నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆనాటి కాంగ్రెసు నాయకులైన హ్యూమ్‌ ‌వంటి ఆంగ్లపాలకుల తొత్తులు, బయట ఉండటం కంటే లోపల ఉండి, స్వవర్గ ప్రయోజనాల కోసం పనిచేయాలనుకున్న త్యాబ్జీ వంటి స్వార్థపరులు ముస్లింలను ఆకర్షించటానికి కొన్ని సూత్రీకరణలు చేశారు. ఖిలాఫత్‌ ఉద్యమ కాలం నుండి ఈనాటి వరకు అవే సూత్రీకరణలు కాంగ్రెసును నడిపిస్తున్నాయి. ఆనాటి వైస్రాయి లార్డ్ ‌డఫ్రిన్‌ అటు కాంగ్రెసు పక్ష వ్యతిరేక వర్గానికి, కాంగ్రెసు పక్షానికి ఏకకాలంలో ఆదేశాలిచ్చి, ఇరుపక్షాలను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ముస్లింలను ఆకర్షించటానికి చేసిన కొన్ని సూత్రీకరణలు:

  1. ఏ ఉద్యమానికైనా ‘జాతీయ’ ఉద్యమంగా గుర్తింపు రావాలి అంటే ఆ ఉద్యమంలో ముస్లింల భాగస్వామ్యం తప్పనిసరి.

1888లో హ్యుమ్‌కు రాసిన లేఖలో త్యాబ్జీ, ‘ముస్లింలలో అత్యధికులు కాంగ్రెసుకు వ్యతిరేకం. అది మంచిదా, కాదా అనేది వేరే విషయం. కాని దానివల్ల కాంగ్రెసు ఒక జాతీయపక్షంగా, అందరికీ ప్రాతినిధ్యం వహించే సంస్థగా ఎదగలేదు. కనుక అది చేపట్టే ఉద్యమం జాతీయ ఉద్యమం అవదు. అందువల్ల సమాజానికి మేలు చేయగల శక్తి దానికి ఉండదు. కాబట్టి ముస్లింలను అధికసంఖ్యలో కాంగ్రెసులో చేర్చుకోవాలి’ అని పేర్కొన్నాడు.

  1. ముస్లిం మద్దతు కోసం వారికి పదవులు ఇచ్చి బుజ్జగించాలి.

జనవరి 22, 1888న హ్యూమ్‌ ‌త్యాబ్జీకి ఒక లేఖ రాసి బుజ్జగింపు రాజకీయాలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ‘మనం విజయం సాధించాలంటే కాంగ్రెసుకు ఒక ముస్లిం నాయకుడు అధ్యక్షుడిగా ఉండాలి. ఆ అధ్యక్షుడు మీరే కావాలి. మీరు అధ్యక్షుడుగా ఉంటే సయ్యద్‌ అహమ్మద్‌ ‌వంటివారు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టవచ్చు. ఉత్తరాది ముస్లింలపై ఆ విమర్శల ప్రభావం ఉండదు’ అని రాశాడు.

  1. ముస్లింలకు నచ్చని విషయాలను చర్చకు పెట్టకూడదు.

‘పయనీర్‌’ ‌పత్రిక సంపాదకుడికీ ఒక లేఖ రాస్తూ, త్యాబ్జీ తాను ఏవిధంగా కాంగ్రెసు రాజ్యాంగంలో ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టాడో ఇలా చెప్పాడు, ‘ముస్లిం ప్రతినిధులు ఏకగ్రీవంగా గాని లేక అత్యధికులు గాని ఏ అంశానికి సంబంధించి అయినా తీర్మానం చేయటానికి వ్యతిరేకిస్తే, అట్టి అంశంపై చర్చపెట్టకూడదు. అట్టి ప్రతిపాదిత తీర్మానాలను ఉపసంహరిచుకోవాలి.’

  1. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం రాజ్యాల పట్ల ముస్లింలకు ఉండే అభిమానాన్ని, విధేయతను ప్రశ్నించకూడదు. మతానికి వారిచ్చే ప్రథమ ప్రాధాన్యతను, కనపరిచే ఇస్లాం అనుకూల వైఖరిని (Pan Islamism) సాధారణమైనదిగా గుర్తించాలి. ‘కాంగ్రెసు ఒక జాతీయ సంస్థ. హిందువులు తమ ముస్లిం సోదరుల ప్రయోజనాలను పరిరక్షించాలి. కేవలం ముస్లింలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ తోటి మతస్థుల బాగోగులు గురించి పట్టించు కుంటే సరిపోదు. బయట ప్రపంచంలో తమతోటి మతస్థులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సాధక బాధకాలు చూసి బాధపడటానికి భారతదేశంలోని ముస్లింలకు సహేతుకమైన కారణం ఉందని కాంగ్రెసు పార్టీ తన తదుపరి సమావేశంలో ప్రకటించాలి.’

ఆంగ్లేయులతో ముస్లింల కుమ్మక్కు

హిందూ జాతీయవాదాన్ని అణచివేయటానికి ఆంగ్లేయులు ముస్లింలతో జట్టు కట్టారన్న విషయం బహిరంగ రహస్యమే. వారి సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రత్యేక నియోజకవర్గాలకు, రాజకీయ ప్రాతినిధ్యాన్ని వారు డిమాండ్‌ ‌చేయసాగారు. బ్రిటిష్‌వారు అందుకు అనుగుణంగానే పావులు కదిపారు. ముస్లింల మద్దతును ఎలాగైనా కూడగట్టాలన్న ఆరాటంతో హిందూ కాంగ్రెసు వాదులు వారి గొంతెమ్మ కోరికలను సాకారం చెయ్యటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండటంతో బ్రిటిష్‌ ‌వారి రాజకీయ క్రీడలో భాగంగా ముస్లింలు డిమాండ్‌ ‌చేసిన దానికంటే ఎక్కువగానే ప్రతిసారీ పొందారు.

ముస్లింలీగ్‌ను 1906లో ప్రారంభించారు. 1907లో కరాచీ సమావేశంలో ముస్లింలీగ్‌ అధ్యక్షుడు చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ జేమ్స్ ‌రామ్‌సే మెక్‌డోనాల్డ్, (‌లేబర్‌ ‌పార్టీ ప్రారంభకులలో ఒకరు, మూడుసార్లు బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి) ఇలా రాసారు, ‘ముస్లిం ఉద్యమం కేవలం ఆ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకే పరిమితమైన ఉద్యమం. భారత ప్రభుత్వంలో అధికార వాటా తమ హక్కు అన్నట్లు వీరు భావిస్తుంటారు. వారి జనాభా నిష్పత్తికి సమానమైన వాటా కంటే ఎక్కువ వారు డిమాండ్‌ ‌చేస్తుంటారు. మనతో ప్రత్యేకమైన సంబంధాన్ని వారు కోరుకుంటున్నారు. మొన్నటి వరకు ఆ దేశానికి పరిపాలకులుగా వ్యవహరించిన వారిగా, అంతర్జాతీయ ఇస్లామిక్‌ ‌సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన వారిగా, వారి విశాల ఇస్లామిక్‌ ‌రాజ్యభావనకు అనుగుణంగా వారి జనాభా నిష్పత్తితో సంబంధం లేకుండా హిందువులతో పాటు సమానంగా ప్రాతినిధ్యం ఉండాలని అనుకొంటు న్నారు. కొందరు ఆంగ్లో ఇండియన్‌ అధికారుల నుండి ముస్లిం నాయకులు స్ఫూర్తిని పొందుతున్నారు. ఆ అధికారులు సిమ్లాలోని, లండన్‌లోని ఆంగ్ల నాయకత్వాన్ని ప్రభావితం చేసి ముస్లింలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించగలిగారు. ముస్లింలకు జనాభాలో వారి నిష్పత్తి కంటే ఎక్కువే ప్రాతినిధ్యం లభించింది. వారికి దక్కిన ఓటు హిందువులకు ఇచ్చిన ఓటు హక్కు కంటే చాలా సరళమైనది’ (The Awakening of India, J.Ramsay Mcdonald,1910, pp.280-284).

ముస్లింలకు విశేష ప్రాధాన్యం

1857 నుండి 1919 వరకు ముస్లింలు ఆడిన రాజకీయ క్రీడకు వలస పాలకుల రహస్య ప్రోద్బలం ఉంది. హ్రస్వదృష్టి గల కొందరు కాంగ్రెసు నాయకుల అమాయక సహకారం ఉంది. విభజించి పాలించటం విధానమైతే, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, జనాభా నిష్పత్తితో కంటే ఎక్కువ మోతాదులో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించటం ఆంగ్లేయులు అనుసరించిన వ్యూహం.  (Sunderland, ibid, pp.270-271). ముస్లింలు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లను వలస పాలకుల ముందు పెట్టేవారు. వారి గొంతెమ్మ కోరికలకు అంతులేదు. డా।। అంబేడ్కర్‌ ‌పాకిస్తాన్‌పై రాసిన గ్రంథంలో వాటిని విఫులంగా చర్చించారు.

‘1892 ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ‌చట్టంలో మొదటి సారిగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అన్న అంశాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. 1888లోనే వైస్రాయి లార్డ్ ‌డఫ్రిన్‌ ‌భారతదేశంలో లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌లో ప్రాతినిధ్య పక్రియ ఇంగ్లండ్‌లో అనుసరిస్తున్న పద్ధతికి భిన్నంగా ఉంటుందని, భారతదేశంలో వర్గాల వారీ ప్రాతినిధ్యమివ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు’ (Pakistan or The Partition of India, p. 240).

‘ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అన్న ప్రతిపాదన బ్రిటిష్‌ ‌వారి నుండే వచ్చింది. వారికోసం ఇచ్చిన ప్రత్యేక నియోజకవర్గాల వలన వారికి దక్కిన ప్రత్యేక రాజకీయ హక్కుల విలువను వారు గ్రహించారు. 1909లో లేజిస్లేట్‌వ్‌ ‌కౌన్సిల్‌ ‌సంస్కరణలు చేప్టనున్నారని తెలిసిన వెంటనే ఒక ముస్లిం ప్రతినిధి వర్గం వైస్రాయి లార్డ్ ‌మింటోను కలసి వారి డిమాండ్ల జాబితాను అందించారు. వాటిని వైస్రాయి వెనువెంటనే ఆమోదించారు కూడా. వారి ప్రతినిధులను ప్రత్యేక నియోజక వర్గాల ద్వారా ఎన్నుకొనే హక్కును ఇచ్చారు. సాధారణ నియోజక వర్గాలలో సైతం ఓటు హక్కు కల్పిస్తూ, దామాషా పద్ధతిలో ముస్లింకు ప్రాతినిధ్యం కల్పించారు’ (Pakistan or The Partition of India, p. 240-243).

‘1916 అక్టోబరులో 19 మంది ఇంపీరియల్‌ ‌లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు వైస్రాయి చెమ్స్‌ఫర్డ్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక నియోజక వర్గాలను పంజాబ్‌కు, మధ్య రాష్ట్రాలకు పొడిగించా లని, ప్రాదేశిక, కేంద్ర లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్స్‌లో ముస్లింలకు ఇచ్చే దామాషా వాటాను నిర్ణయించాలని, ముస్లింలకు, ఇస్లాంకు వ్యతిరేక చట్టాలు చేయకుండా చట్టబద్ధమైన భద్రతను కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు’ (Pakistan or The Partition of India, p. 243).

‘కాంగ్రెస్‌కు – ముస్లింలీగ్‌కు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వలన ముస్లింలకు జనాభాలో వారి నిష్పత్తి కంటే చాలా ఎక్కువగా శాసనసభలలో ప్రాతినిధ్యం లభించింది. మద్రాసులో 231 శాతం, బాంబేలో 163 శాతం, బిహార్‌, ఒరిస్సాలలో 268 శాతం, సెంట్రల్‌ ‌ప్రావిన్స్‌లో 340 శాతం, యునైటెడ్‌ ‌ప్రావిన్స్‌లలో 214 శాతం ప్రాతినిధ్యం ముస్లింలకు లభించింది’ (Pakistan or The Partition of India, p. 259).

అంబేడ్కర్‌ ఇలా వ్యాఖ్యానించారు, ‘హిందువుల బలహీనతను ముస్లింలు బాగా వాడుకొంటున్నారు. హిందువులు దేనికైనా అభ్యంతరం చెబితే, ముస్లింలు దాన్నే కావాలని అంటున్నారు. అందుకు పట్టుబట్ట కుండా ఉండాలంటే ముస్లింలకు వారు కోరుకున్న విధంగా మరికొన్ని ప్రత్యేక రాయితీలు ఇవ్వటానికి హిందువులు ఒప్పుకోనక తీరని రీతిలో వారు ప్రవర్తించారు’ (Pakistan or The Partition of India, p. 259).

సిద్ధాంతం అయిన విధానం

1885 నుండి 1919 వరకు కాంగ్రెస్‌లో హిందూ నాయకులు ముస్లింలను మచ్చిక చేసుకోవ టానికి, వారిని బుజ్జగించి, వారికి అడిగినదల్లా ఇవ్వటానికి అలవాటుపడ్డారు. ముస్లింలు అటు ఆంగ్ల ప్రభువుల నుండి, ఇటు కాంగ్రెస్‌ ‌వాదుల నుండి కూడా లబ్ధిపొందారు. వారి వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా వారు పనిచేశారు. దేశం గోడు వారికి పట్టలేదు. ముస్లిం ప్రయోజనాలను పరిరక్షించుకోవటం మీదే వారి దృష్టి ఎప్పుడూ ఉండేది. 1919కి ముందు కాంగ్రెస్‌ ‌వారు స్వాతంత్య్రం కోసం కంటే హిందూ-ముస్లింల మధ్య ఐక్యత తీసుకొని రావటానికే వారు ఎక్కువగా శ్రమించారు. దానితో ముస్లిం నాయకత్వం స్వాతంత్య్ర పోరాటాన్ని సైతం దారి మళ్లించి ఇస్లామిక్‌ ‌ప్రపంచ ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయాన్ని కాంగ్రెసు భుజస్కంధాలపై పెట్టగలిగింది. గాంధీ ఖిలాఫత్‌ ఉద్యమ లక్ష్యాల సాధనకై స్వరాజ్యం కోసం చేసే ఉద్యమాన్ని కొన్ని సంవత్సరాలపాటు వాయిదా వేయటానికైనా సిద్ధమని ప్రకటించేంతవరకు వెళ్లారు.

వచ్చేవారం: తొలిదశ ఖిలాఫత్‌ ఉద్యమం

ఆంగ్లమూలం : శ్రీరంగ గాడ్బొలే

అను : డా।। బి. సారంగపాణ

About Author

By editor

Twitter
Instagram