జాతి గౌరవ ప్రతీకకు వందేళ్లు

‘‘స్వాతంత్య్ర జాతికిది చక్కని వెలుగు

జాతి పేరు జగాన స్థాపించగలుగు’’

                                                                (గురజాడ రాఘవశర్మ)

స్వేచ్ఛకీ, జాతి గౌరవానికీ, చరిత్రకూ ప్రతీక మన జాతీయ పతాకం. మువ్వన్నెల జెండా ఉనికిలోనికి వచ్చి ఈ మార్చి 31 నాటికి వందేళ్లు గడిచాయి. ఇంకొక వందేళ్లయినా జాతీయ జెండా ఈ జాతికి స్ఫూర్తి కేంద్రమే. శాంతి సౌభాత్రాలు పరిఢవిల్లడానికీ, ఒక జాతి ఐక్యంగా, బలీయశక్తిగా  అవతరించడానికీ ఒకే ప్రజ, ఒకే జాతి అన్న భావనతో పాటు ఉండవలసిన మరొక లక్షణం, ఒకే పతాకం. భారత జాతీయ పతాకం కింద రెండున్నర దశాబ్దాల స్వాతంత్య్ర పోరాటం సాగింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత ప్రస్థానం సాగినది కూడా ఆ పతాకం నీడలోనే. ఇంత మహత్తర నేపథ్యం ఉన్న మన ఘన జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు మన తెలుగువాడు పింగళి వెంకయ్య.


ప్రతి జాతికి ఒక ప్రత్యేక సంస్కృతి, దానికి అనుగుణంగా ప్రత్యేక జెండా ఉంటాయి. ఆ జెండా రెపరెపల్లో ఆ జాతి పుట్టుపుర్వోత్తరాలు వ్యక్తమవు తాయి. జాతి సమగ్ర స్వరూపానికీ, జాతీయ సమైక్యతకూ జెండా ఒక చిహ్నం.

జాతి, వర్ణ, కుల, మతాతీత ధ్యేయానికి ప్రతీక పతాక. అజ్ఞానాంధకారంలో దారి కానక అలమటించేవారి చేతి కరదీపిక. వీర యోధగణానికి నిటారైన వెన్నెముక. స్వేచ్ఛాకాశంలో కాంతులు విరజిమ్మే సుధా చంద్రిక పతాక. స్వాతంత్య్ర పోరాటానికి ముందు భారతదేశంలో సాంస్కృతిక ఏకత్వానికి దక్కిన ప్రాధాన్యం రాజకీయ ఏకత్వానికి దక్కలేదన్నది ఒక చేదు వాస్తవం. సమీప గతాన్ని చూసినా ఇది అర్ధమవుతుంది. దేశం మీద బ్రిటిష్‌ ‌జెండా ఎగిరింది. ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క పతాకం ఉండేది. భారతీయులకు జాతీయవాదం పట్ల, స్వదేశీ పట్ల ఒక కొత్త దృక్కోణాన్ని అందించిన బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమమే మనదైన ఒక పతాకం గురించి కూడా ఆలోచింప చేసింది. దాని ఫలితమే ‘వందేమాతరం’ జెండా. మేడం భికాజీ కామా ఈ జెండాను (భారత స్వాతంత్య్ర సమర పతాకం) జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ ‌సదస్సులో ఆగస్ట్ 22, 1907‌న ప్రదర్శించారు. ఇందులోనూ మూడు రంగులే ఉన్నాయి. అవి- ఆకుపచ్చ, పసుపు, ఎరుపు. పైన ఉన్న ఆకుపచ్చ రంగులో ఎనిమిది తెల్లకలువలను చిత్రించారు. సూర్యచంద్రుల  బొమ్మలు కూడా చిత్రించారు. వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌, ‌విప్లవ నాయకుడు శ్యాంజీ కృష్ణవర్మ ఈ జెండా రూపకల్పనలో ఉన్నారు. అప్పుడున్న ఎనిమిది ప్రావిన్సులకు అవి ప్రతీకలు. దేవనాగరి లిపిలో మధ్య (పసుపు వర్ణం మీద) వందేమాతరం అని రాయించారు. దీని కంటే కాస్త ముందు అంటే 1904లో స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత కూడా ఒక జెండాను రూపొందించారు. ఆగస్ట్ 7, 1906‌న కలకత్తాలోని పార్సీ బగాన్‌ ‌కూడలిలో శచీంద్ర ప్రసాద్‌ ‌బోస్‌ అనే యోధుడు ఒక జెండా ఎగురవేశాడు. దానికి కలకత్తా పతాకం అని పేరు.

 ఆ తరువాత పదేళ్లకు పింగళి వెంకయ్య జెండా రూపకల్పనకు నడుం కట్టారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్‌ ‌సమావేశాలకు హాజరై నాయకులందరితో జాతీయ పతాక రూపకల్పన గురించి ఆయన చర్చించేవారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదులు ఇచ్చిన విరాళాలతో 1916లో  జాతీయ పతాకాల నమూనాలతో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ పేరుతో ఒక పుస్తకమే విడుదల చేశారు. ఆ గ్రంథానికి అప్పటి వైస్రాయ్‌ ‌కార్యనిర్వహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్‌ ‌బి.యన్‌.‌శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాయడం గర్వకారణం. ఒకటి రెండు కాదు, ముప్పయ్‌ ‌రకాల పతాకాల నమూనాలను సిద్ధం చేశారు. సరిగ్గా అదే సమయంలో హోంరూల్‌ ‌లీగ్‌ ఉద్యమం మొదలయింది. అందుకోసం బాలగంగాధర తిలక్‌, అనిబిసెంట్‌ ‌కూడా ఒక పతాకం తయారు చేయించారు. కోయంబత్తూరు కోర్టు న్యాయమూర్తి ఒకరు దీనిని వెంటనే నిషేధించారు. చిత్రంగా దీని మీద ఒక మూల బ్రిటిష్‌ ‌పతాకానికి కూడా హోంరూల్‌ ‌నేతలు చోటిచ్చారు. 1920 నాటి భారతీయులకు ఒక పతాకం ఉండవలసిన అవసరం వచ్చింది. అందుకు కారణం నానాజాతి సమితితో జరిపే చర్చలు.

బెజవాడలో  అంకురార్పణ

మార్చి 31, 1921న విజయవాడలో జాతీయ జెండా నిర్మాణానికి సంబంధించి కీలకమైన అడుగు పడింది. విక్టోరియా మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే వెంకయ్యకు జెండా బాధ్యత అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులలో రాట్నం ఉండేవిధంగా రూపొందించమని సలహా కూడా ఇచ్చారు. మూడు గంటల వ్యవధిలోనే తన గురువు ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో వెంకయ్య జెండాను రూపొందించి గాంధీకి అప్పగించారని ఇటీవల ఒక పత్రిక ప్రచురించింది. ఏప్రిల్‌లో గాంధీ యంగ్‌ ఇం‌డియాలో జెండా అవసరం గురించి చెప్పారు. జెండా మధ్య అశోక చక్రం ఉండవలసిన అవసరం గురించి పంజాబ్‌కు చెందిన లాలా హన్స్‌రాజ్‌ ‌సూచించారు. కానీ గాంధీజీ రాట్నం జెండా మధ్యలో ఉండాలని భావించారు.

జెండా ఉద్యమం 

జాతీయ జెండా సత్యాగ్రహోద్యమాలు స్వాతంత్య్ర సాధనా సోపానాలయ్యాయి. మే 1. 1923న నాగపూర్‌లో జెండా సత్యాగ్రహోద్యమం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది స్త్రీ పురుషులు స్వచ్ఛందంగా సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతం నుండి తొలిసారిగా సుభద్రాదేవి అనే మహిళ పాల్గొన్నారు. కోటీశ్వరుడు జమ్నాలాల్‌ ‌బజాజ్‌ ఆ ‌సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అరెస్ట్ ‌చేసి రూ.30,000/- జరిమానా విధించింది. ఆయన కారు వేలం పాట పెడితే కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు కథియవాడ్‌లో అతి తక్కువ ధరకు అమ్మి జరిమానాకు జమ చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు సర్ధార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ఆ ఉద్యమాన్ని అఖిల భారత ఉద్యమంగా మలిచి విజయవంతం చేశారు. ఉద్యమం విజయవంతం కావడంతో జెండాకొక పవిత్రత, సార్వజనీనత, గౌరవ ప్రాముఖ్యాలు ఏర్పడ్డాయి. అవే రంగులతో ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌కూడా ఒక పతాకాన్ని రూపొందించింది. అయితే మధ్యలో పులి గుర్తును ఉపయోగించింది. ఈ జెండాను మొదట మణిపూర్‌లో ఆవిష్కరించారు. రథోత్సవాల్లో, వాటంటీర్ల కవాతుల్లో, సభల్లో అన్నింటా జెండాలేని సమావేశం కాని, జెండా చేత పట్టని స్వాతంత్య్ర యోధుడుగాని లేడంటే అతిశయోక్తి కాదు. ఈ జెండా ప్రతిష్టకై ప్రాణాలొడ్డి, లాఠీ బాధలు భరించి జరిమానాలతో నష్టపోయిన వారెందరో ఉన్నారు.

రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం

  భారతదేశానికి ఇంగ్లండ్‌ ‌స్వాతంత్య్రం ప్రకటించిన తరువాత జూలై 14, 1947న జాతీయ జెండాను భారత జాతీయ కాంగ్రెస్‌ ఆమోదించింది. అప్పుడే రాట్నం స్థానంలో అంతకు ముందు నుంచి ప్రతిపాదనలో ఉన్న అశోక చక్రం వచ్చింది. ధర్మానికి ప్రతీకగా అశోక చక్రం స్వీకరించినట్టు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌చెప్పారు. ఈ పతాకాన్నే నెహ్రూ జూలై 22, 1947న రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టి జాతీయ పతాకంగా ఆమోదింప చేశారు. అశోక చక్రం నీలిమందు రంగులో, 24 రేఖలతో ఉంటుంది. అంతిమంగా నెహ్రూ, అబుల్‌ ‌కలాం అజాద్‌, ‌భోగరాజు పట్టాభిసీతారామయ్య, తారాసింగ్‌, ‌దత్తాత్రేయ బాలకృష్ణలతో కూడిన సంఘం సూచనల మేరకు మూడు రంగులతో, రాట్నం ఉండేలా వెంకయ్య రూపొందించారు.  పట్టు, ఖాదీలతో చేసిన జెండాలను ప్రవేశపెట్టగా రెండింటిని కూడా రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

తెలుగు నాట త్రివర్ణ పతాకం, కవుల వర్ణన

 ఏప్రిల్‌ 6, 1930‌న బందర్‌లో కుండ భాగంలో (కోనేటి మధ్యగల స్తంభంపై) జెండా ప్రతిష్టించేందుకు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు స్వామీ తత్త్వానంద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గీత రచయిత గురజాడ రాఘవశర్మలను నియమించారు. వారు లాఠీ దెబ్బలతో విఫలయత్నులయ్యారు. తరువాత పహిల్వాన్‌ ‌తోట నరసయ్య ప్రయత్నించారు. శరీరమంతా లాఠీ దెబ్బలతో రక్తసిక్తమైనా, జెండా ప్రతిష్ట పట్టుదల సడల లేదు. మరునాడు బందవ మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌శీలం జగన్నాథరావు నాయుడు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి కుండుపై తోట నరసయ్య, అయినంపూడిలో శ్రీనివాసులు అనే స్వాతంత్య్ర సమరయోధుడు జెండాలను ప్రతిష్టించారు. ఆ సందర్భంగా గురజాడ రాఘవశర్మ ‘జెండా యెత్తర! జాతికి ముక్తిరా!’ గీతం జెండా వీరుల్లో ఉత్తేజాన్ని నింపింది. సుంకర సత్యనారాయణ, ‘ఎగురవే వినువీధి / ఎగురవే జెండా / శాంతిదూతగా నేడు జాతీయ జెండా / యుగ యుగంబుల జగతి నెగురవే జెండా / సౌఖ్య ప్రదాతగా స్వాతంత్య్ర జెండా / గగనాన ధ్రువతార కరణి నిల్చెదవు ఎగురవే జెండా’ అనే గీతంలో జాతీయ జెండాను శాంతిదూతగా, సౌఖ్య ప్రదాతగా వర్ణించడం జెండా పట్ల పవిత్రతనం, గౌరవాన్ని ప్రజల్లో రేకెత్తించింది.

బసవరాజు అప్పారావు, ‘పతాకోత్సవము సేయండి!’ అనే గీతం స్వాతంత్య్రాభిమానుల్లో ఉత్తేజాన్ని నింపింది. వానమాయలై వరదాచార్యులు రచించిన ‘‘అదిగోమన జయధ్వజం / అదిగదిగో భద్రగజము / నవయుగ సోదర ప్రజలు పొండి ఎత్తండి’ – అనే గీతంతో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో యువకులు పరవళ్లు తొక్కారు. జాతీయ జెండాను జాతీయ సమైక్యతకు మారురూపంగా, నూరు కోట్ల కరములొకటిగా రూపొందిన వృక్షంగా, పలు మతాల స్వేచ్ఛా భావపటాన్ని ఎగురవేసే పతాకను’ ‘శ్రీ భారత జనయిత్రీ శీర్షమకుట మణిస్రజంగా’ గొప్పగా కీర్తించాడు.

స్వాతంత్య్ర ప్రకటన అనంతరం 1947 ఆగస్టు 15వ తేదీన గౌతమీ కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి జాతీయ జెండా ఔనత్యాన్ని ప్రశంసిస్తూ ‘‘పవిత్ర భారత సవిత్రి కోహో / స్వతంత్రోత్సవం సాగింది / లాల్‌ఖిల్లాపై అశోకచక్రపు / త్రివర్ణ కేతనం ఎగిరింది / కులమతాలకు అతీతంగా / ప్రజల ద్వేష రోషాలన• విస్మరించి / స్వతంత్ర భారత జయ పతాకక•• మొక్కండి’’ – అంటూ జాతీయ  ‘పతాక’ పవిత్రతను, స్వాతంత్య్ర సాధనకు హేతువన్న భావనతో స్వతంత్ర భారత జయపతాకకు మొక్కమనడం పతాకం పట్ల గౌరవాన్ని సూచిస్తుంది.


నా మృతదేహం మీద జెండా కప్పండి, చాలు!

పింగళి వెంకయ్యకు భారతదేశ చరిత్రలోనే ప్రముఖ స్థానం ఉంటుంది. వెంకయ్య (ఆగస్ట్ 2, 1876- ‌జూలై 4, 1963) బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, వ్యవసాయ, భూగర్భ శాస్త్రవేత్త. మచిలీపట్నం దగ్గరి భట్లపెను మర్రు ఆయన స్వగ్రామం. మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో చదివారు. శ్రీలంక వెళ్లి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్‌ ఎకనమిక్స్ ఐచ్ఛికాంశంగా కేంబ్రిడ్జ్ ‌సీనియర్‌ ‌పరీక్షలో ఉత్తీర్ణు డయ్యారు. 19 ఏళ్ల వయసులో బోయర్‌ ‌యుద్ధంలో (ఆఫ్రికా) పాల్గొన్నారు. అప్పుడే గాంధీజీతో పరిచయం ఏర్పడింది.  జ్ఞానతృష్ణతో లాహోరులో ఆంగ్లో వేదిగో కళాశాలలో చేరి ఉర్దూ, జపనీస్‌ ‌భాషలను నేర్చుకున్నారు. ప్రొఫెసర్‌ ‌గోటే ఆధ్వర్యంలో జపనీస్‌ ‌చరిత్ర అధ్యయనం చేశారు.

1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో ప్రధానమైన ఉద్యమాలన్నింటిలో ఆయన పాల్గొన్నారు. ‘వందేమాతరం, హోమ్‌రూల్‌ ఉద్యమం, ఆంధ్రోద్యమం వంటి ఉద్యమాల్లో చరుగ్గా పాల్గొన్నారు.

వ్యవసాయ శాస్త్రంలో పత్తి పంటపై ప్రత్యేక పరిశోధనలు చేశారు. మునగాల జమీందార్‌ ‌రాజా బహదూర్‌ ‌నాయని రంగారావు కోరిక మేరకు నడిగూడెంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. అందులో క-బోడియా అనే మేలు రకపు పత్తి మీద విశేష కృషి చేశారు. ఆయన పరిశోధనా కృషిని అప్పటి బ్రిటిష్‌ ‌కూడా ప్రభుత్వం గుర్తించింది. నేటి త్రివర్ణ పతాకాన్ని నడిగూడెంలోనే రూపొందించి స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి 1921 మార్చి 31, ఏప్రిల్‌ 1‌వ తేదీల్లో బెజవాడ కాంగ్రెస్‌ ‌మహాసభల్లో సమర్పించాడు.

వెంకయ్య బందర్‌లో జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా వ్యవసాయ శాస్త్రం, చరిత్రతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవాడు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన సన్‌యత్‌సేన్‌ ‌జీవిత చరిత్ర రచించాడు. క్రమంగా రాజకీయాల నుండి దూరమై భూగర్భశాస్త్రం పట్ల ఆసక్తితో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంపై పరిశోధనలు చేసి ‘డిప్లమా’ పొందారు! తర్వాత నెల్లూరు వెళ్లి 1924 నుండి 1944 వరకు మైకా (అభ్రకం) ఖనిజాలు, వజ్రాల గురించి విశేష పరిశోధనలు చేసి ప్రపంచానికి తెలియని ‘వజ్రపు తల్లిరాయి’ అనే గ్రంథం రాసి 1955లో ప్రచురిం చారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత ప్రభుత్వం వెంకయ్యను ‘ఖనిజ పరిశోధక శాఖ’ సలహాదారుడిగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేశాడు. అప్పటికి ఆయన వయస్సు 82 సంవత్సరాలు. వజ్రాల గురించి తెలుసు కాబట్టి వజ్రాల వెంకయ్య అని పేరొచ్చింది. జపనీస్‌ ‌వచ్చు కాబట్టి జపాన్‌ ‌వెంకయ్య,  పత్తి పరిశోధకుడు కాబట్టి ‘పత్తివెంకయ్య’ అని కూడా పిలిచేవారు.

వెంకయ్య వార్ధక్యంలో ఎన్నో బాధలనుభ వించారు.  తిండికి కూడా నానా అగచాట్లు పడినట్లు త్రివేణి పత్రిక సంపాదకుడు డా।।భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. అది గమనించిన మిత్రులు డా।। కె.యల్‌.‌రావు, డా।। టి.వి.యస్‌. ‌చలపతిరావు, కాట్రడ్డ శ్రీనివాసరావు వంటి పెద్దలు కొంత ధనాన్ని సేకరించి ఇచ్చారు. తన కడసారి కోరిక తన భౌతికకాయంపై త్రివర్ణ పతాకం కప్పమని, స్మశానానికి చేరగానే ఆ జెండాను తీసి అక్కడ రావిచెట్టుకు కట్టమని కోరారు వెంకయ్య. మిత్రులు ఆ కోరికను నెరవేర్చారు. జాతీయ పతాకం ఎగిరినంతకాలం గుర్తించుకోదగ్గ మహనీయుడు పింగళి వెంకయ్య. ఇతర దేశాల్లో జాతీయ పతాకాల నిర్మాతలను ప్రభుత్వాలు గొప్పగా గుర్తించి గౌరవిస్తాయి. మన జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్యను గుర్తించి గౌరవించకపోవటం శోచనీయం.

చరిత్రలో జాతీయ పతాక నిర్మాతగా పింగళి వెంకయ్య పేరును సూచించకపోవటం విచారకరం. ఎన్‌.‌టి.ఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉండగా ట్యాంక్‌బండ్‌పై పింగళి వెంకయ్య విగ్రహాన్ని ప్రతిష్టించి జనం స్మరించుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి జాతీయ జెండా శతజయంతి సందర్భంగా మానవతా దృక్పధంతో మాచర్లలో ఉన్న పింగళి వెంకయ్య కుమార్తె శ్రీమతి సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లి రూ.75 లక్షలు ఇచ్చి సత్కరించడం ముదావహం. జాతీయ పతాక రూపశిల్పికి ‘భారతరత్న’ పురస్కారం తెచ్చేందుకు కూడా ముఖ్యమంత్రి కృషి చేయాలి. అప్పుడే మన  నివాళికి నిండుదనం.

About Author

By editor

Twitter
Instagram